రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, అక్టోబర్ 2020, ఆదివారం

987 : సందేహాలు - సమాధానాలు


Q : నిశ్శబ్దం ఓపెనింగ్ లో హార్రర్ సీను అవసరమంటారా? ఎందుకంటే హార్రర్ సినిమా చూడబోతున్నాం అన్న అర్ధంలో ఇది వుంది. చూస్తే ఇది హార్రర్ సినిమా కాదు. దీనికి ఆల్టర్నేట్ సీను ఏం వుంటే కథకి జస్టీఫై అవుతుంది?

కె, దర్శకుడు
A : సినిమా చూడగానే ఈ సందేహం ఇంకొందరికి కూడా వచ్చింది. నిజానికి ఈ పాయింటు స్క్రీన్ ప్లే సంగతుల్లో మిస్సయింది. సుదీర్ఘమైన స్ట్రక్చర్ వ్యాసం మీద దృష్టి పెట్టి ఈ థీమాటికల్ ఎక్స్ ప్రెషన్ని స్క్రీన్ ప్లే సంగతుల్లో మిస్సయ్యాం. ఇప్పుడు మళ్ళీ సినిమాలో సీను చూస్తే ఈ హార్రర్ సీను అవసరం లేదన్పిస్తోంది. దీనికి కారణాలు రెండు : థీమ్ తో సంబంధం లేకపోవడం, వెంటనే అనూష్కా, మాధవన్ లతో ఇదే హార్రర్ సీను రిపీటవడం. ఓపెనింగ్ లో అమెరికన్ జంటని విల్లాలో ఆత్మ చంపినట్టు సుదీర్ఘంగా 4 నిమిషాల పాటు హార్రర్ సీను వేసి, ఆ తర్వాత కాలక్రమంలో విల్లా పరిస్థితి చెప్పి, ఆ వెంటనే అదే విల్లాలో అనూష్కా, మాధవన్ లని ప్రవేశపెట్టి చంపించినప్పుడు థ్రిల్ లేకుండా పేలవంగా తయారయ్యింది రిపిటీషన్ వల్ల. 

    మొదటి సీనులో జరిగిందే రెండో సీనులో జరిగితే, మొదటి సీను అవసరం వుండదు. సింపుల్ లాజిక్. అప్పుడు ఓపెనింగ్ సీనే అనూష్కా మాధవన్ లతో హార్రర్ గా వుంటే దాని ఉద్దేశం నెరవేరుతుంది, థ్రిల్- సస్పెన్స్ పుట్టుకొస్తాయి.  

     సినిమాలో చూపించిన ఓపెనింగ్ హార్రర్ సీను ఎప్పుడవసరమంటే, ఈ ఓపెనింగ్ సీనులో ఆత్మతో హార్రర్ చూపించాక, వెంటనే అదే విల్లాలో అనూష్కా, మాధవన్ లు వచ్చి బస చేసి గడుపుతున్న సందర్భంలోనైతే, ఇలాటి కథకైతే  అవసరం. ఇలావుంటే ఇప్పుడేం జరబోతోందన్న సస్పెన్స్ ఏర్పడుతుంది.

    ఇక థీమాటికల్ గా చూసినప్పుడు ఈ ఓపెనింగ్ హార్రర్ సీను పనికి రాదు. మీరన్నట్టు హార్రర్ సినిమా చూడబోతున్నట్టు అర్ధం వస్తుంది. నిశ్శబ్దం కథ థీమ్ ఏమిటి? నంగనాచితనం. మాధవన్ని ఆ విల్లాలోకి తీసికెళ్లి  తనే హత్య చేసివున్న అనూష్కా పాత్ర, ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తూ వుంది. అప్పుడు థీమాటిక్ ఓపెనింగ్ ఇమేజి ఇలా వుండొచ్చు : ఆ విల్లాలోకి అనూష్కా మాధవన్ని తీసికెళ్ళాక, అచ్చం అనూష్కా లాగే వున్న అనూష్కా ఆత్మ మాధవన్నిచంపేస్తుంది. ఇది ఆదిలోనే మంచి సస్పెన్సునీ ఇచ్చి, కథ ఎత్తుగడలో మంచి ముడినీ వేస్తుంది. అనూష్కా ఆత్మ చంపిందంటే అనూష్కా బతికి లేదా అన్న డ్రమెటిక్ క్వశ్చన్ కథతో మొదట్నించీ లాక్కెళ్తూ వుంటుంది ప్రేక్షకుల్ని. దీన్ని కథ ముగింపులో జస్టిఫై చేయొచ్చు. అనూష్కా దొరికిపోయాక, రివీల్ చేస్తే, చంపింది ఆమె ఆత్మ కాదనీ, కసితో తననలా వూహించుకునే మానసిక స్థితిలో కెళ్లిపోయిందనీ...

Q : చాలా మంది తమ స్క్రిప్ట్ ను హాలీవుడ్ ఫార్మాట్ లో సెల్  టెక్స్ లేదా ఫైనల్ డ్రాఫ్ట్ లాంటి సాఫ్ట్వేర్ లో రాస్తుంటారు. అయితే అలా రాసుకున్నా కూడా వాళ్ళు తెలుగు భాషలో రాయకుండా టి.ఇంగ్లీష్ లో రాస్తూ అదే గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వర్డ్ లో రాసినా కూడా ఇలా టి.ఇంగ్లీష్ లోనే రాస్తున్నారు. విషయం గురించి నేను ఒక పెద్ద రచయిత దగ్గర అడిగినప్పుడు అది నిజమే అని, కానీ తాము తెలుగు భాషను కాపాడుతూ ఇప్పటికీ పూర్తి తెలుగులో రాస్తున్నాం అని చెప్పారు.  చాలా మంది కొత్త వాళ్ళు, అలాగే సినిమాలు తీసిన డైరెక్టర్స్, రచయితలు ఇలాగే చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకు అసలు తెలుగు భాషను తప్పులు లేకుండా రాయలేరు. దీని మీద మీ అభిప్రాయం తెలుపండి.
డివి, అసోసియేట్
A : తెలుగు భాష భవిష్యత్తు గురించి ఆందోళన అక్కర్లేదు గానీ, తెలుగు టైపింగ్ నేర్చుకోకపోవడం వల్లే టి. ఇంగ్లీషు వాడేస్తూంటారు. గూగుల్ ఫాంట్స్ వచ్చాక తెలుగు టైపింగ్ చాలా సులభమైపోయింది. ఈ బ్లాగులో ఆర్టికల్స్ కి గూగుల్ తెలుగు ఫాంట్స్ వాడేవాళ్లం. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాషా ఇండియా తెలుగు ఫాంట్స్ తో, వర్డ్ లో చేసేస్తున్నాం. స్క్రిప్టు పనులు చేసినా, ఇంకేం చేసినా ఇంతే. ఇదే మన ఫటాఫట్ రైటింగ్ టూల్. కంటెంట్నో, రిఫరెన్సుల్నో, ఇంకేమైనా డేటానో సేవ్ చేసుకోవడానికి మాత్రం వివిధ యాప్స్ వాడతాం. అంతే, రైటింగ్ కి ఆడంబరాలు అవసరం లేదు. ఎందుకంటే హాలీవుడ్ రైటింగ్ టూల్స్ మనల్ని ఉద్దేశించినవి కావు. సెల్ టెక్స్, ఫైనల్ డ్రాఫ్ట్, మూవీ మ్యాజిక్, రైటర్ డ్యూయెట్ వంటి చాలా టూల్స్ వున్నాయి. ఈ టూల్స్ వాడి స్క్రిప్టు రాయాలంటే ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ ఫార్మాట్ పాటించాలి. ఆ హాలీవుడ్ ఫార్మాట్ ఏఏ నిర్దిష్ట ప్రమాణాలతో వుంటుందో కింద చూడండి.

12-point Courier font

1.5 inch left margin

1 inch right margin (between .5 inches and 1.25 inches), ragged

1 inch top and bottom margins

Approximately 55 lines per page, regardless of paper size (top and bottom margins adjusted accordingly). This does not include the page number, or spaces after it.

Dialogue speaker names (in all caps) 3.7 inches from left side of page (2.2 from margin)

Actor parentheticals (aka wrylies) 3.1 inches from left side of page (1.6 from margin)

Dialogue 2.5 inches from left side of page (1.5 from margin)

Pages should be numbered in the top right corner, flush to the right margin, a half-inch from the top of the page. Numbers should be followed by a period. The first page is not numbered. The title page is neither numbered nor does it count as page one, so the first page to have a number is the second page of the screenplay (third sheet of paper, including the title page), which is numbered 2.

    ఇది పూర్తి ఫార్మాట్ కాదు, ఇంకా వుంది తద్దినం. ఈ స్టాండర్డ్ ఇండస్ట్రీ ఫార్మాట్లో లేని స్క్రిప్టుల్ని తిప్పి కొడతారు హాలీవుడ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్ లు. కాబట్టి టూల్స్ వాడడం తమాషా కాదు. మనం సెల్ టెక్స్ లో ఏదో టైపు చేసి పారేసి గొప్ప టెకీగా ఫోజు కొట్టొచ్చు. కానీ ఇదంతా ఇండియాలో ఏ సినిమా ఇండస్ట్రీ పట్టించుకోదు. పెన్నుతో కూడా ఎలా రాసిచ్చినా ఓకే. అడ్డంగా రాసినా, నిలువుగా రాసినా, వంకరగా రాసినా, రాసీ రాయక రాసినా, హీనంగా చూడరు. అసలు స్క్రిప్టే చూడరు, వింటారు.

        హాలీవుడ్ టూల్స్ వాడి కొత్త అలవాటు నేర్చుకున్నారు. హాలీవుడ్ పద్ధతిలో పై లైనులో యాక్షన్, దాని కింది లైనులో డైలాగు, అదీ టి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నారు. ఇలా చేస్తూ పేజీలో యాక్షన్నీ, డైలాగుల్నీ ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన కొత్త పని పెడుతున్నారు. ఈ సీను పేపర్లు నటులకీ కష్టమే. పేజీకి లెఫ్ట్ యాక్షన్, రైట్ డైలాగు విడివిడిగా తెలుగులో కొట్టొచ్చినట్టు కనపడవు. తెలుగులో లెఫ్ట్ యాక్షన్, రైట్ డైలాగు అనే నాటకాల్లోంచి వచ్చిన మన సాంప్రదాయ సినిమా స్క్రిప్టు అంత సుఖం లేదు. ఇది అందరికీ సులభంగా వుంటుంది, నటులకీ సౌఖ్యంగా వుంటుంది.  

      ఇక భాష గురించి. తెలుగు టైపింగ్ రాక, డైలాగులకి టి. ఇంగ్లీషు టైపు చేసే స్తున్నారు. ఇదీ చదవడం తలనొప్పే. బాలీవుడ్ లో కూడా ఇలాగే చేస్తున్నారు. సెల్ టెక్స్ లో హెచ్. ఇంగ్లీషులో ఒక హిందీ సినిమా స్క్రిప్టు అందింది. ఏంట్రా బాబూ అంటే, ఇంతే అన్నాడు. మాతృ భాషకి దాని లిపిలో రాస్తే వచ్చే అందం, అనుభూతి టి. ఇంగ్లీషునో, హెచ్. ఇంగ్లీషునో టైపు చేసేస్తే ఎలా వస్తాయి. స్క్రిప్టు చదివి అనుభూతించక పోతే ఇంకెందుకు.         

    ఆడంబరాలకి పోయి వాడాల్సింది హాలీవుడ్ రైటింగ్ టూల్స్ ని కాదు, నేర్చుకోవాల్సింది సురక్షితమైన సార్వజనీన హాలీవుడ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని. స్ట్రక్చర్ తెలియకుండా ఆడంబరంగా టూల్స్ వాడితే పేరు గొప్ప సామెతలా వుంటుంది.      

    అసలు పెన్నుతో తెలుగులో రాసుకుంటే ఏ గొడవా వుండదు. ఎందరో చేసే పని ఇదే. కొందరు తెలుగు ఫాంట్స్ తోనే ట్రీట్మెంట్ వరకూ టైపు చేసుకుంటున్నారు వర్డ్ లో. పూర్తిగా లేరని కాదు తెలుగులో చేసుకునే వాళ్ళు. ఒకాయన విచిత్రంగా ఈమెయిల్లోనే చీమల్లాంటి తెలుగు ఫాంట్స్ తో స్క్రిప్టంతా టైపు చేసుకున్నాడు. ఈ మధ్య లాప్ టాప్ ప్లస్ డీటీపీ లేని అసిస్టెంట్స్ ని అనుమతించడం లేదు గనుక, వాళ్ళకి రాసిస్తే చక్కగా తెలుగులో లెఫ్ట్ - రైట్ స్క్రిప్టుని డీటీపీ చేసిస్తున్నారు.

Q :  మామూలుగా ఆంథాలజీ సినిమాల్లో ఎప్పటికీ అవే లవ్ స్టోరీ లనే తీస్తారా? కొత్తగా ప్రయత్నం చేయరా?  అసలు ఇలాంటి సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? వివరంగా చెప్పండి.
డివి, అసోసియేట్
A : అమెజాన్లో విడుదలైన తమిళ ఆంథాలజీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రశ్న అడిగినట్టుంది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రేమ కథలతోనే కాదు, మరే కథలతోనూ తెలుగులో ఆంథాలజీలు చూడరు. తెలుగు ప్రేక్షకులకి పూర్తి నిడివి ఒకే కథతో కూడిన సర్వాంగసుందరమైన సినిమా కావాలి. చదవాలన్నా ఇంతే. ఒకే కథగా వుండే ఇంతింత లావు నవల కావాలి. చిన్న చిన్న కథల సంకలనాలు పనికి రావు. విజయవాడ పబ్లిషర్స్ నడిగితే చెప్తారు. ఎందుకిలా అని మనం ప్రశ్నించుకుంటే, తెలుగు వాడు భోజన ప్రియుడు. ఫుల్ భోజనం కావాలి. వాడికి ఉడిపి భోజనం కూడా సయించదు. మాంచి ఉప్పూ కారం మసాలాలు దట్టించిన కూరలు, వేపుళ్లతో అన్నం పెట్టాలి. ఆంథాలజీల్లో ఈ అన్నమే వుండదు. భోంచేసినట్టు ఎలా వుంటుంది. చిన్న చిన్న ఆంథాలజీల్లో కూరలే వుంటాయి. సరే, జీవితమంతా వరి అన్నమే తింటాడు కదా, ఒకసారి ఆంథాలజీల్లో మా కూరల రుచులు చూడరాదా అంటే, ఎవడైనా హోటల్ వాడు ఇలా అంటాడా? పూర్తి నిడివి కమర్షియల్ సినిమాల్లో ఒకే కథగా అన్నం కనబడుతుంది. మిగిలిన హంగులు నంజుకునే కూరలు. కాబట్టి తెలుగులో అన్నంలేని నంజులునే కూరలు వడ్డించిన ఆంథాలజీలు ఫ్లాపయ్యాయి, ఇక ముందు కూడా ఫ్లాపవుతాయి. అసలు షార్ట్ ఫిలిమ్సే వుండగా ఆంథాలజీ లేమిటి? తమిళంలో గొప్ప దర్శకుల తాజా ఆంథాలజీని రివ్యూ చేద్దాం.

సికిందర్

17, అక్టోబర్ 2020, శనివారం

986 : రివ్యూ


దర్శకత్వం : జకారియా మహ్మద్  
తారాగణం : ఇంద్రజిత్ సుకుమారన్, గ్రేస్ ఆంటోనీ, జోజు జార్జి, షరాఫుద్దీన్, పార్వతీ తిరువోట్టు, సౌబిన్ సాహిర్ తదితరులు
రచన : జకారియా మహ్మద్, మోహ్సిన్ పరారీ; సంగీతం : బిజిబల్, షహబాజ్, యజ్కన్ -నేహా; ఛాయాగ్రహణం : అజయ్ మీనన్
బ్యానర్స్ : పపయా ఫిలిమ్స్, ఓపిఎమ్ సినిమాస్, అవర్ హుడ్ మూవీస్
నిర్మాతలు : ఆషిక్ ఆబు, జెస్నా అషీమ్, హర్షద్ అలీ
విడుదల : అమెజాన్ ప్రైమ్ 
***

    లయాళ సినిమా ప్రాతినిథ్య సినిమా అవుతోంది. కమర్షియల్ సినిమా అంటే వినోదమే కాదు, సమాచారమనే (ఇన్ఫోటైన్మెంట్) అర్ధంలో కూడా వరస మార్చుకుంటోంది. ఇవ్వాళ గ్లోబల్ ప్రేక్షకుల్లోకి సినిమా దూసుకెళ్తున్నప్పుడు ఇది చాలా అవసరం కూడా. చాలా చాలా పూర్వం తెలుగు సినిమాలకి సంబంధించి ఇదే పేర్కొన్నాం. తెలుగు జీవితమంటే ఏమిటో చూపించ గల్గినప్పుడే తెలుగు సినిమాలు గుణాత్మకంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతాయని. ఇంత తెలుగు జనాభా వుంది, వివిధ పార్శ్వాల్లో ఇన్నితెలుగు జీవితాలున్నాయి -కానీ ప్రపంచానికి ఇవేవీ వున్నట్టే తెలీదు. మలయాళీ సినిమాలు హిందూ సమూహాలే కాదు, క్రైస్తవ, ముస్లిం సమూహాలు కేరళలో తాము కూడా వున్నట్టు ప్రపంచ దృష్టికి తమ ఉనికిని చాటుతున్నారు. ప్రాతినిథ్య సినిమాలుగా అంతర్జాతీయ ఆసక్తిని పెంపొందిస్తున్నారు. వినోదంతో బాటు తమ గురించి సమాచారమిచ్చి అపోహల్నితొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల సూఫీయుమ్ సుజాతాయుమ్ తో ఒక ప్రయత్నం చేశారు. అందులో మతం ఎక్కువైపోయి సామాజికం తగ్గింది. ఇప్పుడు హలాల్ లవ్ స్టోరీ సామాజికం మీద దృష్టి పెట్టింది.

    సాధారణంగా ముస్లిం సినిమాలు హిందీలోనే వస్తాయి. హలాల్ లవ్ స్టోరీ మలయాళంలో ఇంకో ముస్లిం సినిమా. కేరళలోని మలబార్ ప్రాంతపు సాంప్రదాయ ముస్లిం సమాజం వచ్చేసి సామాజికంగా చొరవ చూపాలకునే కథ. అల్లా చుట్టూ తిరిగే సాంప్రదాయ ముస్లిం, సామాజికంగా బతకడానికి మెయిన్ స్ట్రీమ్ లోకొచ్చిన ఉదారవాద ముస్లిం మధ్య విలువల సున్నిత, సంయమనంతో కూడిన, ఎడ్యుకేటెడ్ సంఘర్షణ. ఇది కథలో కథ కూడా. అంటే సినిమాలో సినిమా. 
కథ    

     కథాకాలం 2001 న్యూయార్క్ మీద అల్ ఖాయిదా దాడి అనంతర కాలం. కేరళ మలబార్ ప్రాంతంలో జమైతుల్ ఇఖ్వానల్ వతన్ అనే మత సంస్థ. దీని కల్చరల్ విభాగానికి కొన్ని సామాజిక కార్యకలాపాలుంటాయి. వీధి నాటకాలేయడం, బృందగానాలు చేయడం మొదలైనవి. కోకాకోలాని బహిష్కరిస్తూ బృందగానం, 2001 న్యూ యార్క్ దాడిని పురస్కరించుకుని జార్జి బుష్ ఇరాక్ ని ధ్వంసం చేసినందుకు ఆయన దిష్టి బొమ్మని తగులబెడుతూ వీధి నాటకం వగైరా.

ఈ సంస్థలో సభ్యుడైన షరీఫ్ (ఇంద్రజిత్ సుకుమారన్) వీధి నాటకాల్లో నటుడుగా వుంటాడు. భార్య సుహ్రా (గ్రేస్ ఆంటోనీ) ఇంటి దగ్గర సాంప్రదాయ పద్ధతిలో వుంటుంది. ఇద్దరు పిల్లలుంటారు. అయితే సంస్థ స్థానిక శాఖ నిర్వాహకుడు రహీమ్ (నాజర్ కె) కి ఇలా కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం లేదన్న అసంతృప్తి వుంటుంది. ఆ అసంతృప్తి లోంచి సినిమా తీయాలన్న ఆలోచన పుడుతుంది. తమ సంస్థ విశ్వాసాలకి లోబడిన సినిమా. మత నియమాలకి భంగం కలక్కుండా. దీనికి తగ్గట్టుగా ఒక సమ్మతమైన (హలాల్) ప్రేమ కథని టెలి సినిమాగా తీయాలనుకుంటాడు. దీన్ని బక్రీద్ కి ప్రసారం చేయడానికి ఓ ఛానెల్ ఒప్పుకుంటుంది. సినిమా టైటిల్ మూన మథుమ్ ఉమ్మా’. తల్లిని దైవంగా పూజించాలన్నమహ్మద్ ప్రవక్త సందేశంతో.   

    ఒక స్కూల్లో తౌఫీఖ్ (షరాఫుద్దీన్) అనే టీచర్ వుంటాడు. ఇతను రచయిత, ఆర్గనైజర్, మలయాళంలో పీజీ చేసిన స్కాలర్. ఇతను వచ్చి ఒక హలాల్ ప్రేమ కథ పవిత్రంగా రాసి పెడతాడు. ఫండింగ్ కి ఇల్లిల్లూ తిరుగుతారు. దర్శకుడుగా మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకుణ్ణి పెట్టుకోవాలనుకుంటారు. సిరాజ్ (జోజు జార్జి) అనే అసోసియేట్ ని అనుకుంటారు. అతను స్మోకర్, డ్రింకర్, నమాజ్ కూడా చెయ్యడు. తప్పదని తౌఫీఖ్ రహీమ్ ని తీసుకుని బార్ కెళ్ళి సిరాజ్ ని కలుస్తాడు. మందు కొడుతూ వింటారు సిరాజ్, అతడి అసిస్టెంట్ అభి. ఇలా పవిత్ర ప్రేమలు తీయలేనని, కమర్షియల్ గా మారుస్తాననీ చెప్పేస్తాడు సిరాజ్. ఎలాగో ఒప్పించి బడ్జెట్ చెప్పమంటారు. స్క్రిప్టు బరువు చూసి బడ్జెట్ చెప్పలేమనీ, చదవాలనీ అంటాడు సిరాజ్. అసిస్టెంట్ అభి బరువు చూసేసి పదిహేను రోజుల్లో తీసి పారెయ్యొచ్చంటాడు.

    ఇక హీరో హీరోయిన్లుగా సంస్థ నియమాల ప్రకారం పెళ్ళయిన జంటని పెట్టాలంటారు పవిత్రతని కాపాడేందుకు. ఇతర తారాగణం కూడా నిష్టగా వుండే సంస్థ సభ్యులే వుంటారంటారు. తల పట్టుకుంటాడు సిరాజ్. ప్రొఫెషనల్ నటుల్నిపెట్టాలంటాడు. సాగదు. మళ్ళీ రాజీపడతాడు. నటించగల పెళ్ళయిన ముస్లిం జంట కోసం వెతికివెతికి చివరికి ఆస్థాన నటుడైన పవిత్రుడైన షరీఫ్ దగ్గరికే వస్తారు. అతను పవిత్రమైన భార్య సుహ్రాని  హీరోయిన్ గా అడిగి, అపవిత్ర చీవాట్లు తిని నోర్మూసుకుంటాడు.

    మొత్తానికి షరీఫ్, సుహ్రా హీరో హీరోయిన్లుగా షూటింగు ప్రారంభమయ్యాక, వాళ్ళ చేత నటింపజేయలేక మందు కొట్టేస్తూంటాడు దర్శకుడు సిరాజ్. ఈ సమస్య వుండగా ఇంకో సమస్య వస్తుంది. వాళ్ళు ప్రేమ సీన్లు నటిస్తే వాళ్ళ నిజ జీవితంలో మరుగున వున్న రిలేషన్ షిప్ గొడవలే పొడుచుకు వచ్చేస్తూంటాయి. మరోవైపు దర్శకుడు సిరాజ్ కి విడాకులైన భార్యతో పీకల మీది కొస్తుంది. శుభమా అని పవిత్ర ప్రేమ సినిమా తీస్తూంటే తమ వైవాహిక జీవితాల ట్రాజడీ సినిమాగా మారిపోవడమేమిటో అర్ధం గాదు. ఇక ఈ పవిత్ర ప్రేమ సీన్లని ఎలా మార్చి తీస్తే, వైవాహిక సమస్యలు తీరి సినిమా కూడా  పూర్తయిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ 

     వాదాలతో ఘర్షణలు ఎప్పుడూ వుంటాయి. సాంప్రదాయ వాదానికి వ్యతిరేకంగా అభ్యుదయ వాదం సాంప్రదాయవాదం లోంచే పుడుతుంది. సాంప్రదాయవాదం లేకపోతే దేన్ని చూసి అభ్యుదయవాదం పుడుతుంది? కాబట్టి వాదాలకి మాతృక సాంప్రదాయం. అది లేనిదే అభ్యుదయ ఆలోచనలే లేవు. అయితే సాంప్రదాయాన్ని అభ్యుదయం నిర్మూలించాలని, లేదా అభ్యుదయాన్ని సాంప్రదాయం నిర్మూలించాలనుకుని కత్తులు దూసుకుంటేనే వస్తుంది సమస్య. దీన్నెలా మేనేజ్ చేయాలో శంకరాభరణం లో శంకర శాస్త్రి చెప్పాడు. సేమ్ విన్ స్టన్ చర్చిల్ చెప్పిందే. ఆధునికత్వం గొర్రెలమంద లాంటిది. దాన్ని సాంప్రదాయమనే ములుగర్రతో పొడుస్తూ వుండకపోతే దారితప్పి చెల్లాచెదురైపోతుందని. కనుక సాంప్రదాయమనేది ములుగర్రే తప్ప, ఆనర్ కిల్లింగ్ చేసుకునే పిడిబాకు కాదు.

శంకరశాస్త్రి తన శాస్త్రీయ సంగీతానికి వెటకారంగా పాశ్చాత్య సంగీతం చూసి ద్వేషించలేదు. చించి పోగులు పెట్టి నిర్మూలించాలనుకోలేదు. దారిలో పెట్టాలనుకున్నాడు. సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటే మంచి పాశ్చాత్య గాయకులు కూడా అవచ్చని. సాంప్రదాయం ఆధునికత్వాన్ని నిర్మూలించదు. అలా చేస్తే అది సాంప్రదాయమే కాదు. మాతృస్థానం వుండదు. అది దారి చూపుతూ నిర్మాణానికి తోడ్పడుతుంది. సాంప్రదాయ అంశలేని ఏ ఆధునిక జీవితం, కళ, వ్యవహారం లేదు.

    హలాల్ లవ్ స్టోరీ ఈ సందేశమే ఇస్తుంది. మాటల్లో చెప్పని అంతర్లీన సందేశం. సీరియస్ విషయానికి షుగర్ కోటింగుతో ఎంటర్ టైన్మెంటుగా. సున్నిత హాస్యం దీని యూఎస్పీ. సినిమాల్లో సున్నిత హాస్యం కరువైపోయిన రోజుల్లో కరువుదీరా హ్యూమర్ తో. 

     సాంప్రదాయానికి మత సంస్థని, అభ్యుదయానికి సినిమా నిర్మాణాన్నీ ముఖాముఖీ చేసి, అభ్యుదయ అభ్యంతరాలకి సాంప్రదాయ ఊరడింపులతో, సాంప్రదాయ అభ్యంతరాలకి అభ్యుదయ చిట్కాలతో కార్యం పూర్తి చేసుకునే ప్రణాళిక. ఇందులో దర్శకుడు ఎటువైపు వున్నాడంటే, ఏ వాదమూ తీసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో వున్నాడు. 

    2012 లో మమతా మూర్తి మణిపురీ భాషలో ఫ్రైడ్ ఫిష్, చికెన్ సూప్ అండ్ ఏ ప్రీమియర్ షో అనే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన సినిమా తీసింది. మణిపూర్ సినిమాలు తీవ్రవాదుల నియంత్రణలో వున్నాయి. మణిపూర్ విలువలకి అద్దం పట్టకుండా పెడ ధోరణులతో సినిమాలు తీశారో తుపాకీ పేల్తుంది. కాబట్టి మణిపూర్ దర్శకులు వొళ్ళుదగ్గర పెట్టుకుని చెప్పిన పని చేస్తూ జాతీయ అంతర్జాతీయ పురస్కారాల పంటగా మారుస్తున్నారు వాళ్ళ సినిమాల్ని. ఏ సినిమాలైనా జాతీయ, అంతర్జాతీయ వేదికలు పొందాలంటే తమవైన స్థానిక విలువల్ని చిత్రించాలి. ఇలా సినిమా తీసే కుటుంబం కథే మమతా మూర్తి తెరకెక్కించింది. ఇందులో పాత్రల వ్యక్తిగత కథలుండవు. ఇది తీవ్రవాదం - సినిమా అనే కాన్సెప్ట్ అయితే, హలాల్ లవ్ స్టోరీ సాంప్రదాయం - సినిమా అనే కథ. 

నటనలు – సాంకేతికాలు

     ఇవన్నీసున్నిత సహజ నటనలు. కేరళ మొత్తమ్మీద ఎడ్యుకేటెడ్ రాష్ట్రం. అందుకే అక్కడి సినిమాలు లౌడ్ గా వుండవు. ఇందులో ప్రధాన పాత్రలు షరీఫ్, సుహ్రాలుగా ఇంద్రజిత్ సుకుమారన్, గ్రేస్ ఆంటోనీలున్నా, ఎక్కువ ముద్రవేసేది దర్శకుడు సిరాజ్ గా జోజు జార్జియే. మత సంస్థ సినిమా నియమాలతో తంటాలు పడేది తనే. వీళ్ళు చెప్పినట్టు సినిమా తీస్తే దర్శకుడుగా ఈ తొలి అవకాశం తెల్లారినట్టే. ఒకవైపు ఈ ఔటర్ ఎమోషన్, ఇంకో వైపు విడాకులైన భార్యతో ఇన్నర్ ఎమోషన్ రెండూ పాత్రని, నటనని హైలైట్ చేశాయి.      

     సుకుమారన్, గ్రేస్ లలో గ్రేస్ ది ఎక్కువ మానసిక సంఘర్షణ. భర్తతో నటిస్తూంటే ఎప్పుడో పెళ్లినాటి పాత చేదు జ్ఞాపకాలు నటనకి ప్రతిబంధకాలుగా మారిపోతాయి. భర్తతో నిజజీవిత సంబంధం కూడా వికలమవుతుంది ఈ సినిమా పుణ్యమాని. గ్రేస్ ఆంటోనీ ఈ పాత్రని పరిపక్వ నటనతో పోషించింది.

    షరీఫ్ గా సుకుమారన్ పెళ్లినాటి పాత చేదు జ్ఞాపకాలకి కర్తగా తన తప్పు తెలుసుకునే పాత్ర. ట్రైనింగ్ కోచ్ తీసుకునే ఆడిషన్ లో హీరోయిన్ గా భార్య ఎంపికై, వృత్తి నటుడైన తను హీరోగా తను ఎంపికకాని అవమానం, జెలసీ అద్భుతంగా పోషించాడు. 

    ట్రైనింగ్ ఇప్పించే కోచ్ హసీనాగా అరుంధతీరాయ్ లా కన్పించే పార్వతీ తిరువోట్టు ఒక ఫన్నీ క్యారక్టర్. ఇంకో ఫన్నీ క్యారక్టర్ షూటింగులో సింక్ సౌండ్ రికార్డిస్టు గా సౌబిన్ సాహిర్. ఇక రచయితగా షరాఫుద్దీన్ మత సంస్థకీ దర్శకుడికీ మధ్య క్రియేటివ్ ఒడంబడికలు కుదిరిస్తూ, అప్పుడప్పుడూ సీన్లు మార్చేసే దర్శకుడితో షాకులు తింటూ వుంటాడు. ఎంత పవిత్రంగా నిష్టగా స్క్రిప్టు రాసినా, సినిమా అనే పదార్ధానికి ఇప్పుడు రైటరనే వాడు లేనే లేడంటాడు దర్శకుడు. మత సంస్థ రహీమ్ గా నటించిన నాజర్ కె ఇంకో సమర్ధ నటుడు. 

     ఇంకా చిన్నచిన్న పాత్రలేసిన నటీనటులూ సినిమా ప్రొఫెషనల్ నటులే. కానీ కొత్తవాళ్లు నటిస్తున్నారా అన్నట్టు సహజత్వానికి తోడ్పడ్డారు.  ఈ సినిమాకి దీనిదైన స్టోరీ వరల్డ్ వుంది. ఏ సినిమాలోనైనా ఒకేలా నటించే నటులు అలాగే నటిస్తామంటే కుదరదు. నటులు ఇలాటి స్టోరీ వరల్డ్ లో సింక్ అవాలంటే సెట్లో సీను తెలుసుకుని అప్పటికప్పుడు నటించి వెళ్లిపోతే కాదు, ముందుగానే క్షుణ్ణంగా స్క్రిప్టంతా చదవాలి.

    టెక్నికల్ గా కెమెరాకి  Ziess లెన్సులు వాడారు. దీని సత్ఫలితాలు సీన్లలో కన్పిస్తున్నాయి. స్టోరీ వరల్డ్ కి సున్నిత తరంగాల వుండీ లేనట్టుండే సంగీతం ఇంకో చెప్పుకోదగ్గ విశేషం. అలాగే ఎడిటింగ్ అసలుందా అన్నట్టు అదృశ్యంగా తనపని తాను చేసుకుపోతుంది. అసలు దర్శకుడు వున్నాడా అన్నట్టు కూడా వుంటుంది ఈ యూనిక్ స్టోరీ వరల్డ్.

కథా కథనాలు

     స్పోర్ట్స్ జానర్ టెంప్లెట్లో కథని కూర్చారు. అన్నీ సమకూర్చుకుని షూటింగు మొదలెట్టే సరికి నటనల్లో విఫలమై, షూటింగు ప్రశ్నార్ధకం కావడం, తేరుకుని బేసిక్స్ నుంచీ నటనలు నేర్చుకుని సమాయత్తమైతే, పర్సనల్ ఇష్యూలు నటనల్లోంచే ఉత్పన్నమై షూటింగు అసాధ్యమైపోవడం, పర్సనల్ ఇష్యూస్ ని సీన్లు మార్చి పరిష్కరించుకుని, ఎట్టకేలకు షూటింగు సక్సెస్ చేయడం వంటి కథాక్రమం.

      ఈ సినిమా కథ వొక సైకో థెరఫీ. ఆ మాటకొస్తే వెండితెరమీద కదలాడే సినిమాలు సైకో థెరఫీలే. మన లోటుపాట్లని చక్కదిద్దే మానసిక చికిత్సలు. బ్యాక్ టు ది ఫ్యూచర్ లో బాల పాత్ర కాల యంత్రంలో కాలంలో వెనక్కి వెళ్ళి, అక్కడ తల్లిదండ్రుల మానసిక సమస్యని చక్కదిద్ది తిరిగి వచ్చే సైకో థెరఫీ లాంటిదే - హలాల్ లవ్ స్టోరీ లో సినిమా షూటింగు అనే ప్రయాణంలో సినిమా కథలోంచి పాత్రలు తమ కథకి (సమస్యకి) సైకో థెరఫీ చేసుకోవడం. 

    మతసంస్థ పెట్టే నిబంధలతో ఏర్పడే పరిస్థితులు హాస్యాన్ని సృష్టిస్తూంటాయి. అంత పవిత్రమైన సినిమా తీయాలనుకున్న నిష్టాగరిష్టుడైన రహీమ్ బార్ కెళ్ళి దర్శకుణ్ణి కలవాల్సి రావడమొక కామెడీ. పొరపాటున నేనిక్కడ చచ్చిపోతే పరిస్థితేంటి?’ అంటాడు. అదే దర్శకుణ్ణి విడాకులైన భార్య పోలీస్ స్టేషన్లో పెట్టిస్తే, రహీమ్ విడిపించడాని కెళ్ళినపుడు మళ్ళీ, పొరపాటున నేనిక్కడ చచ్చిపోతే పరిస్థితేంటో?’ అంటాడు.

      షూటింగులో సింక్ సౌండ్ రికార్డిస్టుకి అన్నీ అవాంతరాలే. ఎక్కడో జాడించి బట్టలుకుతున్న చప్పుడు, ఇంకెక్కడో కోడి కూస్తున్న సౌండ్, మరెక్కడో పిల్ల ఏడుస్తున్న శబ్దం, ఎవరో కిచెన్లో బర్రు మని మిక్సీ వేసిన, ఇంకెక్కడో బుర్రు మని ఆటో వస్తున్న రొ దలు. వాటినాపడానికి అసిస్టెంట్ల పరుగులు.

    లవ్ స్టోరీ సుఖాంతం చేసే సీన్లో దర్శకుడు అకస్మాత్తుగా హగ్ చేసుకునే సీను పెట్టేస్తాడు. లేకపోతే పరిపూర్ణత రాదంటాడు. మతసంస్థ, రైటర్ గగ్గోలు పెట్టేస్తారు. వీల్లేదంటే వీల్లేదంటారు. సెక్స్ చేసుకునేప్పుడు చేసుకునే హగ్ సినిమాలో చూపించడం పాపం అంటారు. సెక్స్ చేసుకునేప్పుడే కాదు, ఇంకా చాలా హగ్ చేసుకునే సందర్భాలుంటాయంటాడు దర్శకుడు. మీరు సెక్స్ చేసుకునేప్పుడే హగ్ చేసుకుంటారా, లేకపోతే లేదా అని షరీఫ్, సుహ్రారాలని అడుగుతాడు. వాళ్ళు లోపలికెళ్లి చర్చించుకుని, ముందు హగ్ చేసుకుని, ఆ తర్వాతే  సెక్స్ చేసుకునే వాళ్ళమని తేల్చుకుంటారు.

     ఇలా తెమలదని క్రియేటివ్ కెమెరామ్ మాన్ జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు హగ్ చేసుకుంటారు, కానీ చేసుకున్నట్టు వుండదని ఏదేదో తిప్పి తిప్పి టెక్నికల్ చిట్కా చెప్తాడు. అదేదో ఏడవమంటాడు దర్శకుడు. ఫాగ్ వేసి, రివాల్వింగ్ షాటుతో అద్భుత చిత్రణ చేస్తాడు క్రియేటివ్ కెమెరామాన్. కొబ్బరికాయకి నిప్పంటించి హారతులు ఇచ్చుకుని ప్రారంభించిన షూటింగు మొత్తానికిలా విజయవంతమవుతుంది.  

      దర్శకుడు జకారియా, రచయిత పరారీ ల ఫ్రెష్ రైటింగ్, స్క్రిప్టు మీద పట్టు, సామాజిక స్పృహ, మలబార్ జీవితాలు, ప్రపంచ పరిణామాల ఎరుక ఇవన్నీ ఈ విభిన్న సినిమాని వొక విజయవంతమైన ఇన్ఫోటైన్మెంట్ గా మార్చాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే మతావలంబికులైనా కాకపోయినా ముస్లిముల వ్యవహారాలు, ప్రవర్తన ఎంత మృదువుగా వుండాలన్న దానికిదో శాంపిల్. అయితే తాజాగా తనిష్క్ ఉదంతంతో సైతం ప్రజాతంత్రంలో మాకు నువ్వు లేవు - అంటున్న మత రాజకీయాల వాతావరణంలో ఈ సెన్సిటివ్ ముస్లిం సినిమా ఏం సాధిస్తుందో చెప్పలేం.

సికిందర్