రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 8, 2020

967 : రివ్యూ


దర్శకత్వం: హనీ ట్రెహాన్
తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ
, రాధికా ఆప్టే, తిగ్మాంశూ ధూలియా, ఖాలిద్ త్యాబ్జీ, పద్మావతీ రావ్ తదితరులు
రచన: స్మితా సింగ్
, సంగీతం: స్నేహా ఖన్వాల్కర్, ఛాయాగ్రహణం: పంకజ్ కుమార్
బ్యానర్:  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత: రోనీ స్క్రూ వాలా
, అభిషేక్ చౌబే 
విడుదల: నెట్ ఫ్లిక్స్
***                                                                                                
        టీటీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ రెండో సినిమా రాత్ అకేలీ హై నియో నోయర్ జానర్ లో ఒక మర్డర్ మిస్టరీ. కొత్త దర్శకుడు, క్యాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహాన్ దీని మేకర్. వరసగా ఇది క్యాస్టింగ్ డైరెక్టర్లు దర్శకత్వం వహించిన మూడో సినిమా. దిల్ బేచారా తో ముఖేష్ చబ్రా, శకుంతలా దేవి తో అనూ మీనన్ అనే ఇద్దరు క్యాస్టింగ్ డైరెక్టర్లు కూడా డైరెక్టర్ లయ్యారు. ఈ ఇద్దరికీ భిన్నంగా హనీ ట్రెహాన్ మిస్టరీ తీశాడు. ఫ్రేము ఫ్రేముకీ చాలా కష్ట పడ్డాడు.అయితే ఈ క్రియేటివ్ కష్టం మేకింగ్కి వుంటే సరిపోతుందా, కంటెంట్ కి అవసరం లేదా? ఈ ప్రశ్ననోసారి పరిశీలిద్దాం...

కథ
      ఐదేళ్ల క్రితం ఓ రాత్రి కాన్పూర్ హైవే మీద కారుకి యాక్సిడెంట్ జరిపి జంట హత్యలు చేస్తారు దుండగులు. కారులో భూస్వామి రఘు బీర్ సింగ్ భార్య, డ్రైవర్ వుంటారు. వాళ్ళ మృత దేహాలు దొరక్కుండా చేస్తారు. 

        ఐదేళ్ల తర్వాత
, కాన్పూర్ లో అరవై ఏళ్ల భూస్వామి రఘుబీర్ సింగ్, ఎవరో తెలియని ఉంపుడుగత్తె రాధ (రాధికా ఆప్టే) ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న రాత్రే హత్యకి గురవుతాడు. సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) దర్యాప్తు చేపడతాడు. రాధతో బాటు మహల్లో చాలా పరివారముంటుంది. రఘుబీర్ సింగ్ మొదటి భార్య తమ్ముడు విశాల్, కొడుకు కరణ్, కూతురు కరుణ, అల్లుడు రవి, చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్, మేనకోడలు వసుధ, పనిమనిషి చున్నీ...  వీళ్ళందరూ కలిసి ఆస్తి కోసం రాధ చంపిందని ఆరోపిస్తారు. సబిన్ స్పెక్టర్ జటిల్ యాదవ్ అందర్నీ అనుమానిస్తాడు. 

        కేసులో అందర్నీ ప్రశ్నిస్తూ ముందుకు పోతున్న అతణ్ణి లోకల్ నాయకుడు మున్నారాజా
(ఆదిత్యా శ్రీవాస్తవ) అడ్డుకుంటాడు. మున్నా రాజా ఎసెస్పీ లాల్జీ శుక్లా (తిగ్మాంశూ ధూలియా) కి సన్నిహితుడు. లాల్జీ శుక్లా జటిల్ యాదవ్ దర్యాప్తుకి బ్రేకులేస్తూంటాడు. జటిల్ యాదవ్ కి నిజాన్ని బయటికి లాగి దోషిని పట్టుకోవాలన్న పట్టుదల పెరిగిపోతుంది.

        ఇంతకీ ఎవరు దోషి
? ఎందుకు చంపారు? అంత మంచి చరిత్రలేని రాధ పెళ్ళయిన రాత్రి ఏం చేసింది? మతి స్థిమితం లేని హతుడి కొడుకు ఆస్తిని ఆజమాయిషీ చేయలేడని హక్కులు పొందాలని చూస్తున్న హతుడి బావమరిదే చంపాడా? కరెంటు పోయిందని లాంతరేసుకుని హతుడి గదిలోకి వెళ్ళిన పని మనిషి చున్నీ అక్కడ ఎవర్ని చూసింది? హతుడి మేనకోడలు వసుధ ఆ రాత్రి కాసేపట్లోనే వేసుకున్న చున్నీ ఎందుకు మార్చుకుంది? హతుడి చెల్లెలు ప్రమీల, మేనల్లుడు విక్రమ్ లోకల్ లీడర్ మున్నారాజాని వాటా ఎందుకు అడిగారు? ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో చున్నీని ఎవరు, ఎందుకు చంపారు? చున్నీని చంపిన హంతకుణ్ణి ఎవరు చంపారు? ప్రమీల ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు రాధా గతమేమిటి? ఐదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల వెనకెవరున్నారు? అసలు హతుడు రఘుబీర్ సింగ్ అసలు స్వరూపమేమిటి? ఈ జటిల కేసుని సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఎలా పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ. 

నటనలు - సాంకేతికాలు
     సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి మార్క్ వేస్తాడు. పాత్ర గురించి దర్శకుడు వివరించినట్టు, అతను సామాన్యుడిలా వుండాలి. హీరోలా అన్పించకూడదు. చేసే పనులలో హీరోయిజం వుండాలి. అలా సినిమా ఎస్సై లా కాకుండా, రియల్ ఎస్సైలా వుంటాడు. అతడికి 40 ఏళ్ళు. పెళ్లి కాలేదు. అతడి తల్లి (ఇళా అరుణ్) అతడి ఫోటో ఎవరికి చూపించినా రంగు తక్కువ, వయసు ఎక్కువని సంబంధాలు రావు. రంగు పెరగడం కోసం ఒక క్రీము వాడుతూంటాడు. ఇలా అమ్మాయిలకి నచ్చని వాడు, మొత్తమంతా ఆడవాళ్లతో వున్న మహల్లో పడతాడు కేసు గురించి. పెళ్లి రోజే విడో అయిన రాధ పట్ల రోమాంటిక్ గా వుంటూ, ఆమెని కాపాడే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. పాత్ర ఫన్నీగా వుండదు. సీరియస్ గానే వుంటుంది. పాత్రని చివరంటా నిలబెట్టే ప్రయత్నమైతే చేస్తాడు. కానీ కాసేపటి తర్వాత కథే సహకరించదు. ఒకళ్ల తర్వాత ఒకళ్లని ప్రశ్నించే పర్వంతోనే గంటకి పైగా గడిచిపోతుంది. గంటన్నరకి గానీ యాక్షన్ దృశ్యాలు మొదలై పాత్రకి వూపు రాదు. మళ్ళీ చివర్లో అరగంట పాటు వుండే ముగింపు దృశ్యాలు బోరే. ముగింపు థ్రిల్లింగ్ గా లేకపోవడం కారణం.

        రాధికా ఆప్టే పేద బాధిత పాత్ర. మగవాళ్ళతో ఆమె గతం జీవితాన్ని మార్చేస్తుంది. పెళ్ళయిన రాత్రే భర్త చావుకి కేంద్ర బిందువయ్యే పాత్ర. దర్యాప్తుకి ఏమాత్రం సహకరించని పాత్ర. ఈమె కూడా ఒక మార్కు వేస్తుంది. ఇక అనుమానితులుగా మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులకి ఎక్కువ స్పేస్ లేదు. 

        సాంకేతికంగా కాన్పూర్ నేపథ్యంలో తీసిన సినిమా. లొకేషన్స్ బావున్నాయి. అయితే నైట్ సీన్లు ఎక్కువ వుండడం
, పగలు ఇండోర్ సీన్లు కూడా లో- కీ లైటింగ్ తో వుండడం నియో నోయర్ జానర్ అన్పించాలని తీసినట్టుంది. ఓపెనింగ్ లో నైట్ హైవే యాక్సిడెంట్ సీను నోయర్ జానర్ మర్యాదకి బలమైన నిదర్శనం. అయితే నోయర్ జానర్ మర్యాదలకి లైటింగే కాకుండా ఇంకో  ఎనిమిది ఎలిమెంట్స్ వుంటాయి. వీటి జోలికి వెళ్లక పోవడం ఒక లోపం. మూవీలో మిస్టీరియస్ వాతావరణ సృష్టికి నేపథ్య సంగీతం మాత్రం బాగా తోడ్పడింది. పూర్తిగా నోయర్ జానర్ లో లేకపోయినా, కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్ మేకింగ్ నైపుణ్యం మాత్రం సాంకేతికంగా మంచి నాణ్యతతో వుంది. మూవీలో వున్న మిస్టరీ స్వభావానికి తగ్గ డార్క్ మూడ్ విజువల్స్ తో ఒక శైలిని పాటించాడు.  

కథాకథనాలు

        నేను మిస్టరీలు తీయను, సస్పెన్సులే తీస్తానన్నాడు సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్. ఎందుకంటే మిస్టరీల్లో కూర్చోబెట్టే సస్పెన్స్ వుండదు. చివర్లోనే కథేమిటో, అసలేం జరిగిందో సస్పెన్స్ అంతా ఓపెనవుతుంది. అంతవరకూ ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవడమే. ఇలా కాక సస్పెన్స్ కథలో ఇప్పుడేం జరుగుతుందో, ఇంకేం జరుగుతుందో నన్న అనుక్షణ యాక్షన్ లో వుంటుంది సస్పెన్స్. మిస్టరీలు జడప్రాయమైన ఎండ్ సస్పెన్స్ లైతే, సస్పెన్సులు చైతన్యవంతమైన  సీన్ టు సీన్ ఉత్కంఠ రేపే సస్పెన్సులు. కాబట్టి హిచ్ కాక్ మిస్టరీలు ఎందుకు తీయనన్నాడో అసలంటూ అర్ధమైతే, ఎండ్ సస్పెన్స్ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకోరు. కానీ మన ఇండియన్ సినిమాల్లో అదేం అలవాటో గానీ, మర్డర్ కథ అనగానే వీరావేశంతో ఎండ్ సస్పెన్స్ మిస్టరీలు తీసెయ్యడమే. సస్పెన్స్ అంటే చిట్ట చివరి వరకూ రహస్యం దాచడమే అనుకుంటున్నారు. చాలా సిల్లీ. ఈ పెద్ద బాలశిక్ష స్టేజి అవగాహన నుంచి పైకెదగాలి.

        కొత్త దర్శకుడు హనీ ట్రెహాన్, కొత్త రచయిత్రి స్మితా సింగ్ ఈ నోయర్ ని ప్రయత్నించారు. హాలీవుడ్ నియో నోయర్ చైనా టౌన్ స్ఫూర్తి అన్నాడు ట్రెహాన్. హిచ్ కాక్ తీసిన నార్త్ బై నార్త్ వెస్ట్ కూడా ప్రభావితం చేసిందన్నాడు. హిచ్ కాక్ అభిమానినన్నాడు. కానీ తను తీస్తున్న నోయర్ ని హిచ్ కాక్ లా సస్పెన్స్ కథలో తీయపోవడం అందరి లాగే సస్పెన్స్ కీ మిస్టరీకీ తేడా తెలియకపోవడం వల్లేనని మనం అర్ధం జేసుకోవచ్చు. కొందరు ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాన్ని సృష్టించాడన్నారు. ఆగథా క్రిస్టీ కథా ప్రపంచాలు మిస్టరీ నవలలు. మిస్టరీ నవలలు చదివిస్తాయి. మిస్టరీ సినిమాలు బోరు కొడతాయి. ఆగథా క్రిస్టీ మిస్టరీల ముగింపులు మైండ్ బ్లోయింగులు. ట్రెహాన్ మిస్టరీ ముగింపు బోరు. ముగించడానికే అరగంట తీసుకున్నాడు. దాచి పెట్టిన రహస్యాన్ని అరగంట పాటు వివరించాల్సి వచ్చింది. ఇదేమన్నా క్లాస్ రూమ్ పాఠమా? 

        కొందరు గత సంవత్సరం విడుదలైన
నైవ్స్ అవుట్ తో పోల్చారు. నైవ్స్ అవుట్ నోయర్ జానర్ కాదు. నోయర్ జానర్ లో రియాన్ జాన్సన్ అంతకి ముందు బ్రిక్ తీశాడు. పెద్ద స్టార్లతో వస్తూ వుండిన నోయర్ జానర్ తో ప్రయోగం చేసి యువ నటులతో కాలేజీ నేపథ్యంలో టీనేజి నోయర్ గా తీసి సంచలనం సృష్టించాడు. అలాగే నైవ్స్ అవుట్ లో ఆగథా క్రిస్టీ వాతావరణాన్నే క్రియేట్ చేస్తూ ఒక ప్రయోగం చేశాడు. అగథా క్రిస్టీ నవలల్లో వుండే  ఎండ్ సస్పెన్స్ మిస్టరీగా  తీయలేదు. ఎవరు చంపారో మధ్యలోనే చూపించేసి, సీన్ టు సీన్ సస్పెన్స్ గా కథ నడిపాడు. అతను శాస్త్రాన్ని చదివి అర్ధం జేసుకుని సినిమాలు తీస్తాడు. ఏది ప్రింట్ మీడియా కథనమో, ఏది విజువల్ మీడియా కథనమో తెలుసుకోకుండా సినిమాలు తీసి ఫ్లాపవుతున్న వాళ్ళు మనదగ్గరే వున్నారు.

        ఎవరు చంపారు? అన్న విజువల్ మీడియాకి పనికిరాని పాయింటు పట్టుకుని రెండున్నర గంటలు లాగాడు. గంట లోగానే కథ కదలక విసుగు పుట్టిస్తుంది. అరడజను మందిని ఒకరి తర్వాత ఒకర్ని ప్రశ్నించడాలే కదలని సీన్స్ ని క్రియేట్ చేస్తాయి. అనుమానితులందరూ మార్పు లేకుండా అనుమానితులుగానే వుండిపోతారు. కథలో చలనం కోసం అనుమానితులని ఫిల్టర్ చేసి కొందర్ని లిస్టులోంచి తప్పించే చర్యలకి పూనుకోడు సబిన్స్ పెక్టర్. ఎలా వున్న పాత్రల్ని అలా ఈడ్చుకుంటూ పోతూనే వుంటుంది కథ. పోయిపోయి చివరికి హత్యారహస్యం విప్పుతూ అరగంట వివరణ. ఈ వివరణని బుర్ర కెక్కించుకునే ఓపికా ఆసక్తీ వుండవు. చివర్లో వివరణ లెవరిక్కావాలి, విజువల్ యాక్షన్ తో మొదట్నించీ కథ తెలుస్తూండాలి గాని.

        ఎవరు చంపారన్నది ముఖ్యం కాదు, ఎందుకు చంపారన్నది ముఖ్యమన్నాడు దర్శకుడు. కానీ కథ నడిపింది అన్ని మిస్టరీల్లాగే ఎవరు చంపారన్న బోరు కొట్టే పాయింటుతోనే. ఎవరు ఎందుకు చంపారో చివర్లో రివీల్ చేశాడు. దాన్ని బట్టి ఈ కథలో స్త్రీలందరూ ఏదో రకంగా హతుడి బాధితులే. అంటే పితృస్వామ్యం పాయింటు అన్నమాట. కహానీ 2 లో, హైవే లో చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు లాగా. ఈ రెండు సినిమాలూ సస్పెన్స్ థ్రిల్లర్స్. ముగింపులో రివీలయ్యే చైల్డ్ ఎబ్యూజ్ పాయింటు షాకింగ్ గా, డిస్టర్బింగ్ గా వుంటుంది. అదీ ముగింపు అంటే. 

        ట్రెహాన్ మిస్టరీలో అతను చెప్పినట్టు ఎందుకు చంపారన్నది ముఖ్యమైనప్పుడు
, ఎవరు చంపారన్న ప్రశ్నతో కాకుండా, ఎందుకు చంపారన్న ప్రశ్న తలెత్తేలా స్త్రీ పాత్రల్ని డ్రైవ్ చేసి వుంటే సరిపోయేది. అరవై ఏళ్ల వాణ్ణి పెళ్ళయిన రాత్రి ఎందుకు చంపారు? నిజంగానే ఈ ప్రశ్న కుతూహలం రేకెత్తించేదే. కానీ సబిన్స్ పెక్టర్ జటిల్ యాదవ్ ఈ ప్రశ్న వదిలేసి, పసలేని ఎవరు చంపారన్న ప్రశ్న మీదే దృష్టి పెట్టి కథ నడుపుకున్నాడు. 

        మీరందరూ అనుమానితులే అంటాడు
, కానీ మిమ్మల్ని చూస్తే జాయింటుగా సమ్ థింగ్ ఇంకేదో ఫీలవుతున్నాను, అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను... అని వుంటే,  ఆ ఫీలింగ్ తో కథ నడిపివుంటే, అప్పుడు అరవై ఏళ్ల పెళ్లి కొడుకుని శోభనం కాకుండానే ఎందుకు ఢామ్మని రైఫిల్ తో కాల్చి ఖతం చేసి పారేశారన్న కథకి ఆపరేటింగ్ క్వశ్చన్, లేదా డ్రమెటిక్ క్వశ్చన్ ప్రేక్షకుల్ని ఎలర్ట్ చేసేది.
                       
సికిందర్




Wednesday, August 5, 2020

966 : పాలపిట్ట ఆర్టికల్ -విస్మృత సినిమాలు




        దుల సంఖ్యలో సినిమాలు తీసినా అపజయా లెరుగని దర్శకులు అరుదుగా వుంటారు. కోవెల మూడి బాపయ్య అలాటి అగ్ర దర్శకుల్లో ఒకరు. తీసిన 80 సినిమాల్లో నాలుగే అపజయాలతో అగ్రశ్రేణి కమర్షియల్ దర్శకుడుగా కొనసాగారు ఇటు తెలుగులో, అటు హిందీలోనూ. తెలుగులో 39, హిందీలో 31 తీయడం రికార్డు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, షారుఖ్ ఖాన్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, శారద, హేమమాలిని ... ఇలా హేమాహేమీలే ఆయన తారాతోరణం. సోగ్గాడు, ఎదురులేని మనిషి, యుగ పురుషుడు, ముందడుగు, మండే గుండెలు, నాదేశం, మవాలి, దిల్దార్, బందిష్, మక్సద్... ఇలా సూపర్ హిట్స్ తోనే ఆయన వైభవం. ఇలా 1970 - 95 మధ్య పాతికేళ్ళూ 80 సినిమాలతో విజయ యాత్ర చేశారు. 1988 -95 మధ్య నైతే ఏడేళ్ళూ వరసగా 14 హిందీ సినిమాలే తీశారు. 

       
యితే 1970 లో ప్రారంభ చిత్రం నవల ఆధారంగా తీయడం విశేషం. 1954 లో జోసెఫ్ హేస్ అనే రచయిత రాసిన ‘డెస్పరేట్ అవర్స్’ అన్న నవల మొదట 1955 లో నాటకంగా ప్రదర్శించారు. 1955 లో హాలీవుడ్ సినిమాగా తీశారు. 1970 లో కృష్ణం రాజు తో బాపయ్య ‘ద్రోహి’ గా తీశారు. దీన్నేశివాజీ గణేశన్ తో కృష్ణన్ అనే దర్శకుడు తమిళంలో రీమేక్ చేశాడు. ఈ రెండూ ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత ‘డెస్పరేట్ అవర్స్’ ఆధారంగా హిందీలో రాజ్ కుమార్, సునీల్ దత్, మాలాసిన్హా లతో ‘36 ఘంటే’ గా 1974 లో నిర్మించారు. ముగ్గురు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుని ఒక ఇంట్లో జొరబడే కథ ఇది.


    కె. బాపయ్య నవలల ఆధారంగా దర్శకత్వం వహించిన సినిమాలు రెండే. 1970 లో కృష్ణం రాజు తో ‘ద్రోహి’ తర్వాత, మళ్ళీ కృష్ణం రాజుతోనే 1981 లో యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా ‘అగ్నిపూలు’ తీశారు. రెండూ పరాజయం పాలయ్యాయి. కృష్ణం రాజు ద్విపాత్రాభినయం, జయప్రద, జయసుధ, జయంతి, శ్రీధర్, గుమ్మడి, సత్యనారాయణలతో సురేష్ ప్రొడక్షన్స్  పతాకంపై ప్రసిద్ధ నిర్మాత డి. రామానాయుడు దీన్ని నిర్మించారు. 

        ‘అగ్నిపూలు’ 1981 మార్చి 12 న విడుదలయ్యింది. ‘అగ్నిపూలు’ కి ముందు ఫిబ్రవరి 14 న ఎన్టీఆర్, శ్రీదేవిలతో బాపయ్యే దర్శకత్వం వహించిన ‘అగ్గి రవ్వ’ విడుదలైంది. అలాగే ‘అగ్నిపూలు’ విడుదలైన తొమ్మిది రోజుల్లో వెంటనే మార్చి 21 న ఏఎన్నార్, కృష్ణ నటించిన బాపయ్య సినిమానే ‘గురు శిష్యులు’ విడుదలయ్యింది. ఇలా 35 రోజుల్లో బాపయ్య సినిమాలు మూడు విడుదలవడం విశేషమైతే, మధ్యలో విడుదలైన ‘అగ్నిపూలు’ పరాజయం చెందడం అర్ధంగాని విషయం. నిజానికి పరాజయం చెందేంత చెడ్డ విషయమేమీ లేదిందులో. పైపెచ్చు కథాకథనాలు, నటనలు, చిత్రీకరణ నాణ్యతతో వున్నాయి. కుటుంబ కథా చిత్రాలంటే గత రెండు దశాబ్దాలుగా వస్తున్న మాఫియా - ఫ్యాక్షన్ కుటుంబాల హింసాత్మక సినిమాల్లాగా కాకుండా, అచ్చమైన కుటుంబ సంబంధాల మానసిక సంఘర్షణగా మనకి కన్పిస్తుంది. రెండున్నర గంటలు యూట్యూబ్ లో ఏకబిగిన చూసేలా చేస్తుంది. 

         
అయితే ఆ నాటి ప్రేక్షకులు ఇందులోని వినోదం పాలు తక్కువ, విషయ గాంభీర్యం ఎక్కువవడం ఇష్టపడ లేదేమో. ప్రథమార్ధంలో గంట సేపటికి గానీ ఒక కామెడీ సీను అల్లు రామలింగయ్యతో రాదు. అలాగే కృష్ణం రాజు - జయప్రదలతో సినిమా మొత్తంమీద వున్న ఒక్క యుగళ గీతమూ గంట తర్వాత గానీ రాదు. నవలని మార్చకుండా యధాతథంగా తీశామన్నారు. కమర్షియల్ విజయాలు సాధించే బాపయ్య, నవలకి న్యాయం చేయబోయి సినిమాని నాటి ప్రేక్షకుల కోసం తగిన వ్యాపార విలువలతో తీయలేక పోయారేమో.

అగ్నిపూలెంతో ఇష్టం

    విహార యాత్ర కెళ్ళిన ‘పక్షుల వేసవి విడిది కేంద్రం’ లో కింద రాలిపడి పూలుంటాయి. ఏడాది కొకసారి వచ్చే వలస పక్షుల్లాగే, అమెరికా నుంచి వచ్చిన స్కర్ట్ ధరించిన ఆధునికురాలు జయసుధ, అవేం పూలని అడుగుతుంది. ఇంగ్లీషులో ఫ్లవర్స్  ఆఫ్ ది ఫారెస్ట్ అనీ, తెలుగులో మోదుగ పూలనీ, లేకపోతే అగ్నిపూలనీ అంటారని వివరిస్తాడు సత్యనారాయణ. పగదీర్చుకోవడానికి అమెరికా నుంచి వచ్చి వుంటున్న జయసుధ, మొదటి సారిగా ఆనందంగా చూసి, ‘బ్యూటిఫుల్’ అంటుంది. తర్వాత ఆ పూలు పట్టుకుని వుంటే, ఆ పూలంటే అంతిష్టమా అనడుగుతాడు సత్యనారాయణ. అవునంటుంది జయసుధ, ‘నా గుండెల్లో రేగుతున్న మంటల్లా వున్నాయి... నా కళ్ళు చూస్తే అగ్ని పూలు కన్పించడం లేదా డాక్టర్?’ అంటుంది. 

        ఇలా టైటిల్ జస్టిఫై అవుతుంది. ఈ సీను ప్రథమార్ధం మధ్యలో వస్తుంది. ఇంతకీ జయసుధ ప్రతీకారం దేనికి, ఎవరి మీద? తుపాకీతో కాల్చి పారేసేంత గుండె మంటతో వున్న తనని ఈ పరిస్థితి లోకి నెట్టేసిందెవరు?

        అతను విరూపాక్షి రాజా (కృష్ణం రాజు). ఆమె రాజేశ్వరి (జయంతి). ఇద్దరూ దేనికైనా తెగించే స్వార్ధ పరులు. ఆమె జమీందారు గోవింద వల్లభ రాజా (గుమ్మడి) కూతురు. అతను అల్లుడు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా దర్పం పోని వల్లభ రాజా లంకకి లంకంత రాజ భవనం (మైసూరు మహారాజా ప్యాలెస్), వందల ఎకరాల ఎస్టేటూ  గల సంపన్నుడు. వంశ కట్టుబాట్లకి ప్రాణమిస్తాడు. భార్య అన్నపూర్ణ (నిర్మలమ్మ) కి కట్టుబాట్లు కాదు, మనుషుల మధ్య సత్సంబంధాలు ముఖ్యం. గుర్రమెక్కి తుపాకీ పట్టుకుని, పులుల్ని వేటాడే అల్లుడు విరూపాక్ష రాజా, ఎస్టేట్ కూలీలకి కొరడా దెబ్బలు కూడా పంచుతూంటాడు. పెంపుడు కుక్క సుల్తాన్ కి సరిగా ఆహారం పెట్టకపోతే చావ బాదుతూంటాడు. ఇలా కూతురూ అల్లుడూ స్వార్ధంతో ఆస్తిపాస్తులెలా కాజెయ్యాలా అని కాచుకుని వుంటారు. 

        వీళ్ళ పంట పండి అమెరికాలో వుంటున్న వల్లభ రాజా కొడుకు శివ ప్రసాద్ (శ్రీధర్)  అక్కడ మేరీ అనే అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం పట్టుకుని కూతురూ అల్లుడూ పథక రచన చేస్తారు. ఆ ఉత్తరం చూసి రెచ్చిపోయిన వల్లభ రాజా, కట్టుబాటు తప్పిన కొడుకు మొహం ఇక చూడనంటాడు. విరూపాక్ష రాజా ఇంకా రెచ్చ గొడతాడు. ఇక తన చావుక్కూడా వాణ్ణి పిలవొద్దంటాడు వల్లభ రాజా. తల కొరివి అల్లుడే  పెట్టాలంటాడు. అలా జమీందారీ వారసత్వం అల్లుడికే అప్పగించేస్తాడు

.    దీంతో కూడా వూరుకోడు విరూపాక్ష రాజా. మామ గతించాక జమీందారీ చేతిలో పెట్టుకుని భార్య రాజేశ్వరి సహకారంతో శివప్రసాద్ కీ, అతడి భార్య మేరీకీ పూర్తిగా అన్యాయం తలపెడతాడు. ఈ విషయం పెద్దయ్యాక శివప్రసాద్ కూతురు జానకి అలియాస్ జేనీ (జయసుధ) తల్లి రాసిన డైరీలో తెలుసుకుంటుంది. ఇటు విరూపాక్ష రాజా కూడా గతించడంతో జమీందారీ వ్యవహారాలు కొడుకు కృష్ణ చైతన్య (కృష్ణం రాజు) చేతికొస్తాయి. ఇతడికో తమ్ముడు రాహుల్ (శరత్ బాబు), చెల్లెలు భవానీ (సుమలత) వుంటారు. కృష్ణ చైతన్య మెత్తటి స్వభావం కలవాడు. ఓ నాట్య ప్రదర్శనలో నాట్యం చేస్తున్న రుక్మిణి (జయప్రద) ని చూసి పెళ్లి చేసుకుంటాడు. రుక్మిణి ప్రమాదంలో కాళ్ళు దెబ్బతిని చక్రాల కుర్చీకి పరిమితమై పోతుంది. వీళ్ళ కిద్దరు పిల్లలు.

        ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నపూర్ణ కోరికపై అమెరికానుంచి మనవరాలు జేనీ, మనవడు బాబీ (సుధాకర్) వస్తారు. జేనీ ఎవరితోనూ కలవక ఎడమొహం పెడ మొహంగా వుంటుంది. ఎలాగైనా బావ కృష్ణ చైతన్యని చంపి పగదీర్చుకోవాలనుకుంటుంది. బాబీ కృష్ణ చైతన్య చెల్లెలు భవానీతో ప్రేమలో పడతాడు. భవానీకి మిర్యాల పురం సంబంధం చేసుకోవాలని పట్టుదలతో వుంటుంది ఆమె తల్లి రాజేశ్వరి. మరో వైపు కాళ్లులేని కోడలు రుక్మిణిని రెండో పెళ్ళికి కొడుకు కృష్ణ చైతన్యని ఒప్పించమని ఆదేశిస్తుంది. ఇక తల్లిని యధాతథంగా ఇబ్బంది పెడుతూంటుంది.

        ఇలా ఆనాడు రాజేశ్వరి భర్తతో కలిసి పన్నిన పన్నాగం వల్ల ఇప్పటికీ తండ్రి ఆస్తికి  ఆమె అక్రమ వారసురాలై, ముగ్గురు ఆడవాళ్ళు నానా కష్టాలూ  పడుతూంటారు. తల్లి అన్నపూర్ణ, కోడలు రుక్మిణి, మేనకోడలు జేనీ...  పూర్వం జేనీ తల్లి మేరీ కూడా బాధితురాలే. ఆమెతో కలుపుకుని నల్గురు ఆడవాళ్లు నరకం అనుభవిస్తారు. ఈ మొత్తం సంక్షోభానికి కారణమైన రాజేశ్వరి ఆట ఎలా కట్టింది? రుక్మిణి రెండో పెళ్ళికి భర్త కృష్ణ చైతన్యని ఒప్పించిందా? జేనీ తల్లిదండ్రులేమయ్యారు? జెనీకి బావ కృష్ణచైతన్య మీద పగకి కారణ మేమిటి? అతణ్ణి చంపిందా? ఆనాడు మేరీని పెళ్లి చేసుకున్నట్టు శివప్రసాద్ రాసిన ఉత్తరంతో ప్రారంభమైన కుటుంబ సంక్షోభం, ఈనాడు మేరీ రాసిన డైరీ వల్ల పరిష్కారమైందా? ... ఇవీ మిగతా కథలో తేలే ఆసక్తికర అంశాలు.

నల్గురు అతివల గాథ
    ఇది కుటుంబ కథా చిత్రమే కాకుండా నాలుగు స్త్రీ పాత్రలతో కూడిన మహిళా చిత్రమని  కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే అభ్యుదయం కోసం మహిళల తిరుగుబాటులా కాకుండా, కుటుంబ సంబంధాల్లో మానసిక సంఘర్షణల కుమ్ములాట. దీనికి విరూపాక్ష రాజా పాత్రలో మొదటి కృష్ణం రాజు చిచ్చు పెట్టి పోతే, అతడి కొడుకు పాత్ర కృష్ణ చైతన్యగా రెండో కృష్ణం రాజు కథలో నిమిత్త మాత్రుడుగా, పాసివ్ గా వుండి పోతాడు. కథంతా స్త్రీ పాత్రల చుట్టే వుంటుంది. ఈ స్త్రీ పాత్రల కథ, సన్నివేశాల కూర్పు అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా వుంటాయి. కథా బలం కోసం వినోదాత్మక విలువల్నే త్యాగం చేశారు.   అయితే ఇది కమర్షియల్ సినిమా లెక్కల్లో వుండాల్సిన ఒక ప్రధాన పాత్ర, దాని సమస్య, సమస్యతో దాని సంఘర్షణా అనే చట్రంలో ఒక కథగా గాకుండా - ఓ ప్రధాన పాత్రంటూ లేని నాల్గు స్త్రీ పాత్రల ఉమ్మడి వృత్తాంతం గావడంతో, కథా లక్షణాలు కోల్పోయి గాథగా మారింది. కథల్లో పాత్ర కథని నడిపిస్తుంది, గాథల్లో గాథే పాత్రల్ని నడిపిస్తుంది. గాథలు నవలలకి బావుంటాయి, కమర్షియల్ సినిమాలకి కావాల్సింది కథలే, గాథలు కాదు. అందువల్ల ఈ కారణం చేత ప్రేక్షకులకి నచ్చలేదేమో. గాథల్ని ‘పెదరాయుడు’ లా తీసి నిలబెట్టడం అరుదుగా జరుగుతూంటుంది.


        ఇది గాథైనప్పటికీ పాత్ర చిత్రణలు ఆకర్షిస్తాయి. జయంతి, నిర్మలమ్మ, జయప్రద, జయసుధ, అమెరికా పాత్ర నటించిన హిందీ నటి. ఈ ఐదుగురు కాకుండా పని మనిషి నీలి పాత్రలో సుభాషిణి కూడా. అయితే సుభాషిణి పాత్ర సమస్య అనవసరమైనదిగా కనిపిస్తుంది. ఇదెలాగో తర్వాత చూద్దాం. 

        మొదట రాజేశ్వరి : ఈ ప్రతి నాయకి పాత్రలో జయంతి ఒక ప్రధానాకర్షణ. ఇలాటి ‘దుష్ట’ పాత్ర ఆమెకిదే మొదటిసారి. జమీందారిణీ దర్పం, అహం, పొగరు, దుర్నీతి ఆమె నటనతో విలనీకే వన్నె తెస్తాయి. తండ్రి ఆస్తి తమ్ముడికి అంగుళం దక్కకుండా తనే కాజేసి కూర్చుంటుంది. తల్లిని నోరెత్త నివ్వదు. తల్లి కోరిక మేరకు కూతురు భవానీ పెళ్లి తమ్ముడి కొడుకు బాబీతో జరగనివ్వదు. ఆ పెళ్లి ఇక్కడే చేసి చూపిస్తానని తల్లి అన్నపూర్ణ అంటే, ‘ఏమిటీ ఇక్కడ చేస్తావా? ఇది ధర్మ సత్రం కాదు, అడ్డమైన వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి!’ అని ఎదురు దాడికి దిగుతుంది. 

        ‘ఎవడే అడ్డమైన వాళ్ళూ? వాళ్ళకి చెందాల్సిన ఇల్లూ వాకిలీ మీరు కాజేసి?’ అని తల్లి అంటే, ‘అమ్మా, మాటలు జాగ్రత్తగా రానీయ్!’ అని హెచ్చరిస్తుంది. 


     ‘నోర్ముయ్యవే. గుడ్డొచ్చి పిల్లని  వెక్కిరించిందనీ నన్ను మాటలు జాగ్రత్తగా రానీ అం టావటే నువ్వు?  పుట్టినప్పుడు జానెడు లేవు. అనవే నీ ఇష్టమొచ్చినట్టు అను. ఇదంతా మీ నాన్న చేసిన నిర్వాకం. నా ఇంట్లోనే నన్ను పనిమనిషిని చేసి వున్నదంతా నీకు కట్ట బెట్టి పోయాడా మారాజు’ అని తల్లి వాపోతే, ‘ఆఁ కట్టబెట్టాడు! నా నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టి వెళ్ళాడమ్మా మీ ఆయన. ఆడా మగా అంతా నేనే సర్దుకోలేక చస్తున్నాను. ఇన్నేళ్ళుగా పెట్టి పోషిస్తున్న దాన్ని, కన్న కూతుర్ని నా కంటే ఇవ్వాళ వచ్చిన కొడుకు పిల్లలు ఎక్కువై పోయారు నీకు!’ అని రెచ్చిపోతుంది. 

        ‘ఇదిగో వాళ్ళ పేరెత్తితే వూరుకోను!’ అని తల్లి మందలిస్తే, ‘వూరుకోక పోతే వూరేగు!’ అంటుంది ఈసడింపుగా. మంచి మర్యాదలు, దయ, జాలి ఏవీ వుండవు. ఆస్తిని ఆజమాయిషీ చేస్తున్న కొడుకు కృష్ణ చైతన్యతోనే ప్రేమ. ఫ్యూడల్ కుటుంబాల్లో పురుషులు స్త్రీలని అణిచేసే సంగతులుంటాయి. ఇక్కడ స్త్రీయే స్త్రీలని అణిచి పారేస్తోంది. 

        అన్నపూర్ణ : మాట వినని భర్త, పులిగోరు మెళ్ళో వేసుకునే మేకవన్నె పులి అల్లుడు, ఆస్తి నొక్కేసిన విశ్వాసం లేని కూతురు...వీళ్ళతో ఏళ్లకేళ్ళు నలిగిపోయి విముక్తి కోసం ఎదురు చూసే పాత్ర. విడిపోయిన కుటుంబాన్ని కొడుకు పిల్లల్నైనా ప్రయోగించి తిరిగి ఏకం చేయాలన్న తాపత్రయం తనది. తన శైలిలో నీటుగా పాత్ర పోషణ చేస్తుంది నిర్మలమ్మ. అప్పట్లో ఆమె గ్లామర్ కూడా బావుంది.   

        రుక్మిణి : ఇది జయప్రద వేదనాభరిత పాత్ర. చక్రాల కుర్చీకి అంకితమై భర్త సుఖం కోసం కుమిలిపోయే పాత్ర. పైగా అత్త రాజేశ్వరి అల్టిమేటంతో ఇంకింత కుంగుబాటు. భర్తని రెండో పెళ్లి చేసుకోమని ఒప్పించలేక, అతడి బేషరతు ప్రేమకి పాత్రురాలూ  కాలేక నలిగి పోతూంటుంది. తనకి విముక్తి ఎలా లభిస్తుంది? ఇదొక విషాదకర ముగింపు. ఈ పాత్రలో జయప్రద అత్యంత రూపవతిగా కన్పిస్తుంది. డాన్సర్ పాత్రలో ఆమె చేసే సర్ప నృత్యం సినిమాకే హలైట్ అనొచ్చు. నేల మీద సర్పమంత వేగంగా సరసర ప్రాకే శరీర విన్యాసాలతో ఆశ్చర్య పరుస్తుంది. 

        మేరీ : హిందీ నటి పోషించిన మరో బాధిత పాత్ర. భర్త శివప్రసాద్ తో వస్తే రాజ భవనంలో కాకుండా అవుట్ హౌజ్ లో పెట్టి అవమానించిన మామ మీద ఆమె కేం కోపముండదు. మామ చావుకి దగ్గరికి కూడా రానివ్వకుండా, కొరివి పెట్టనివ్వకుండా, భర్తని వెలివేసిన తీరని బాధ ఓ వైపుండగా, ఆ భర్తకి విరూపాక్ష రాజా భర్తకి తలపెట్టిన కీడు దహించి వేస్తుంది. అదంతా డైరీలో రాసిపెట్టి తనూ అన్యాయమైపోతుంది. విరూపాక్ష రాజా పెంపుడు కుక్క సుల్తాన్ అంత పనీ చేస్తుందని వూహించదు.

     జేనీ : జయసుధ పాత్ర. ఈ పాత్రని చెక్కిన తీరు గుర్తుండి పోతుంది. తండ్రి పులిగోరు మెళ్ళో వేసుకున్న కృష్ణ చైతన్యని చంపాలన్న ఏకైక లక్ష్యంతో రహస్య ఎజెండా అమలు చేస్తూంటుంది. డాక్టర్ విశ్వం (సత్యనారాయణ) తో మాత్రమే తన బాధ చెప్పుకుంటూ వుంటుంది. మా ఇంటికి మేం పరాయి వాళ్ళల్లా వచ్చామని అక్కసు వెళ్ళ గ్రక్కుతుంది. తల్లి రాసిన డైరీ చదువుతూ, ఆనాడు అసలేం జరిగిందో తెలుసుకుంటూ వుంటుంది. ఈ ఆ స్తిపాస్తులకి నిజమైన వారసులు తను, తన అన్న బాబీ. ఇది కాదు తనకి ముఖ్యం, ఆ మేనమామ విరూపాక్ష రాజా చేసిన అన్యాయానికి గుర్తుగా మిగిలిన బావ కృష్ణ చైతన్యని తుపాకీ తో కాల్చి చంపడం ముఖ్యం. అదే మేనత్త రాజేశ్వరికీ శిక్ష. అప్పుడే తనకి ఈ మానసిక క్షోభ నుంచి విముక్తి. ముగింపు దృశ్యాల్లో జయసుధ టెర్రిఫిక్ గా వుంటుంది. అప్పటికామె ఇంకా లేత వయసులో స్లిమ్ గా వుంది. బీజ్ కలర్ జీన్స్, బ్రౌన్ కలర్ టీస్ లో యూత్ అప్పీల్ తో టెర్రిఫిక్ గా కన్పిస్తుంది. 

        నీలి : పని మనిషిగా సుభాషిణి పాత్ర. జేనీ అన్న బాబీ ఈమెని గర్భవతిని చేస్తాడు. ఈ నిజం చెబితే బాబీ చిక్కుల్లో పడతాడు. కారకుడెవరో చెప్పితీరాలని కుటుంబమంతా నిలదీస్తారు. చెప్పలేక కుమిలిపోతుంది. చివరికి మూగ వాడైన పనివాడిని చూపిస్తుంది. ఆ మూగ వాడితో పెళ్ళయి పోతుంది.

చివర్లోనే రెండో కృష్ణం రాజు
      ఇలా స్త్రీ పాత్రల సమాహారంగా వుంటుంది. జయప్రద, జయసుధ పాత్రలకి ఫ్లాష్ బ్యాకులుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అనగానే మొత్తం ఒకేసారి బారెడు చూపించే ఆచారం ఇప్పటికీ ఒకటుంది. దీంతో ఫ్లాష్ బ్యాక్ మొదలవుతోందంటే అసహనం మొదలై పోతుంది. ఇక్కడ మొత్తం ఒకేసారి ప్రారంభించకుండా, ముందుగా చిన్న చిన్న దృశ్యాలు అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్స్ గా వేస్తూ ఆసక్తి రేపుతారు. మనకి ఆసక్తి పుట్టాక, మిగిలిన దృశ్యాలన్నీ ఒకే ఫ్లాష్ బ్యాకుగా వేసేసి ముగిస్తారు. ప్రేక్షకుల్ని భాగస్వాముల్ని చేసే టెక్నిక్ తో మాత్రమే సృజనాత్మకత రాణిస్తుంది. ఒక హాలీవుడ్ రచయిత చెప్పినట్టు, సినిమా రచన అనేది సినిమాతో రచయిత రోమాన్స్ కాదు. అదొక ట్రయాంగిల్ ఎఫైర్. ఈ ముక్కోణ వ్యవహారంలో సినిమా, రచయిత, ప్రేక్షకులూ వుంటారు. సినిమాతో బాటు ప్రేక్షకుల ప్రతిస్పందనలని దృష్టిలో పెట్టుకోని రచయిత విఫలమవుతాడు.  

        కృష్ణం రాజు ద్విపాత్రాభినయం కూడా ఆకర్షణీయమైనదే. అయితే మొదటి పాత్రకున్నంత బలం రెండో పాత్రకి లేదు. స్త్రీ పాత్రల కథ కావడం వల్ల. స్త్రీ పాత్రల సమస్యల్ని చక్కబెట్టే బాధ్యత కూడా వుండదు. ప్రేక్షకులు ఏదో చేస్తాడని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. చివర్లో నిజాలు తెలుసుకుని తల్లిపాత్రని నిలదీసే సన్నివేశంలో మాత్రం హైలైట్ అవుతాడు. తల్లి ముందు డైరీ పడేసి, ‘ఏడుస్తావేంటమ్మా, ఆనందించు. నీ ఘన కార్యపు ప్రతిఫలం ఎంత ముచ్చటగా వుందో చూసి సంతోషించమ్మా. నువ్వూ నాన్నగారూ చేసిన పాపాల చిట్టా చూడు. ఇన్నాళ్ళూ నాకు తెలియకుండా దాచిన మీ నేరాల్నీ ఘోరాల్నీ ఎత్తి చూపి నాకు కర్తవ్యాన్ని భోదించిన గీతమ్మా అదీ. మంచి మనుషుల్ని బాధించీ పీడించే రాక్షసుల చరిత్రతో నిండిన రామాయణమమ్మా... జోహార్లమ్మా నీకూ...’  ఇలా విచలితుడవుతూ భావోద్వేగాల్ని పండిస్తాడు.

        కృష్ణం రాజు తమ్ముడి పాత్రలో శరత్ బాబుకి ప్రాధాన్యం లేదు. జయసుధ అన్న బాబీగా సుధాకర్ పాత్ర మాత్రం అభ్యంతర కరంగా వుంటుంది. శివ ప్రసాద్ కొడుకుగా అతణ్ణి కాముకుడిగా చిత్రించారు. నిజానికి జయసుధ పాత్రతో బాటు తను సానుభూతి పొందాల్సిన బాధిత పాత్ర.  అలాటిది కాముక చర్యలతో మొదట మరదలు భవానీ మీద కన్నేసి, సాధ్యం కాకపోవడంతో, ‘ఇది విస్కీ ఇది బ్రాందీ’ అని తాగి పాడి పని మనిషిని గర్భవతిని చేస్తాడు. భవానీని పెళ్లి చేసుకుంటాడు. జయసుధ పాత్ర, తండ్రి శివప్రసాద్ పాత్రతో బాటు తనూ, నీతితో వుంటేనే తమకి జరిగిన అన్యాయం చెప్పుకోవడాని కుంటుంది. ఇంతా చేసి బాబీ ప్రవర్తనతో ఏర్పడిన సమస్య కథ కుపయోగ పడిందీ లేదు. దాన్ని పనివడి మీదే తోసేసి ముగించారు.  

        సినిమాలో వినోదానికి కథతో సంబంధం లేకుండా, అల్లు రామలింగయ్య సీతాపతి కామెడీ ట్రాక్ వుంది. తనని అన్నయ్యా అనీ, పిల్లల్ని తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అని పిలిచే పిచ్చి భార్యతో కామెడీ. 

        జంధ్యాల మాటలు బావున్నాయి. ఆయన చాలా ఆణిముత్యాలే అందించారు : జమీందార్ల ఇంటి గోడలే కాదు, గుండె గోడలు కూడా అతి మందంగా వుంటాయి...మీ మమత నన్ను చావనివ్వదు, నా మనసు నన్ను బతక నివ్వదు... గొప్పింట్లో పుట్టడం గొప్ప కాదు, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం... మనిషికి రీజన్ పెరిగి సీజన్ పోయింది...పిల్లల్ని కనడం గురించి మీ అమ్మకే నువ్వు చెప్తావటే?...

        పాటలు ఆత్రేయ రాశారు. వీటిలో జయప్రద మీద ‘ప్రియుడా పరాకా’ బాగా హిట్టయింది. ‘వయసు కోతి వంటిది’ అనే కృష్ణం రాజు- జయప్రదల మీద యుగళ గీతం లో అశ్లీలం ఎక్కువైంది – ‘తొలిరేయి నీ చేయి తెలియకనే ఎక్కడో తగిలెను...నీకు గిలిగింత అక్కడనే అప్పుడే తెలిసెను...’ అంటూ. కేవీ మహదేవన్ స్వరాలు కూర్చారు.ఎ. వెంకట్ ఛాయాగ్రహణం, కేఏ మార్తాండ్ కూర్పు అందించారు. నిర్మాణ విలువలు డి. రామానాయుడు స్థాయిలో వున్నాయి.

        టీవీ సీరియల్స్ వచ్చి కుటుంబ సినిమాల్ని మింగేశాయి. దాంతో కుటుంబ సినిమాలు మాఫియా యాక్షన్, లేదా ఫ్యాక్షన్ కలిసిన కథలుగా మారిపోయాయి. నేటికీ ఒక ‘అగ్నిపూలు’ లాగా కుటుంబ సంబంధాల మీద కుటుంబ సినిమాలు రాకపోవడం ఒక విచారకర సన్నివేశం.

 
సికిందర్

(పాలపిట్ట - జులై 2020 సంచిక)

965 :


‘డానీ’ (తమిళం) రివ్యూ
రచన, దర్శకత్వం: సిఎల్ సంతాన మూర్తి
వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి, సాయాజీ షిండే, అనితా సంపత్, వినోద్ కిషన్ తదితరులు సంగీతం: సాయి భాస్కర్, ఛాయాగ్రహణం: ఆనంద్ కుమార్        
బ్యానర్: పిజి మీడియా వర్క్స్
నిర్మాతలు : పిజి ముత్తయ్య, ఎం దీపా
విడుదల: జీ 5

***
        టీటీలో వరుసగా జ్యోతికతో ‘పొన్మంగళ్ వందాళ్’, కీర్తీ సురేష్ తో ‘పెంగ్విన్’, ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ తో ‘డానీ’ అనే మూడు తమిళ సస్పెన్స్ థ్రిల్లర్స్ విడుదలయ్యాయి. ముగ్గురు హీరోయిన్లూ హీరోయిన్ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రయత్నించి ఫ్లాపయ్యారు. ఇంకా అటు కన్నడ నుంచి కొత్త హీరోయిన్ రాగిణీ ప్రజ్వల్ కూడా  ‘లా’ తో ఫ్లాపయ్యింది. జానరేంటో తెలీని కొత్త దర్శకులు హీరోయిన్ల జీవితాలతో ఆటలాడుతున్నారు. వరలక్ష్మి చాలనట్టు డాగ్ ని కూడా ప్రయోగించి ‘డానీ’ అని దానికి టైటిల్ రోల్ ఇచ్చేశాడు దర్శకుడు. టైటిల్ రోల్ తీసుకున్న డానీ డాగ్, పారితోషికం ఎగ్గొట్టారనో ఏమో, మొరగడమే తప్ప కరిచే పని పెట్టుకోలేదు. ఎప్పుడొస్తుందో, ఎందుకొస్తుందో, వచ్చి మొరుగుతుంది, పరుగు దీస్తుంది, మళ్ళీ వచ్చి మొరుగుతుంది, మళ్ళీ పరుగు దీస్తుంది. దాని బాధ దర్శకుడికి అర్ధంగానట్టుంది. విశ్వాసం లేని మీకు గెస్ట్ రోల్ చాల్లే అని అది మొరిగి వెళ్లి పోతోంది.      
  
        సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత వేళాకోళంగా వుందంటే, డాగ్ కి లాగే వరలక్ష్మీ శరత్ కుమార్ తనూ నవ్వులపాలయ్యేంత. బడ్జెట్ లేని ఇంత నాసిరకం సినిమా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి. తను పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర. తన చుట్టూ పాత్ర లేసిన నటీనటులు సాయాజీ షిండే, యోగిబాబు తప్ప, ఒక్కరూ సరైన రూపు రేఖలతో లేరు. సినిమా కాకుండా రైస్ మిల్లులో లేబర్ ని చూస్తున్నట్టుంటుంది. యూత్ అప్పీల్ అనే మాటే లేదు. ఇక ఈ సినిమాకి స్క్రిప్టు కాగితాల్లో రాసుకున్న కథ అనే పదార్ధం ఎంత అందంగా వుందంటే, ఆ కాగితాలు ఇడియప్పం ఉప్మా చుట్టడానికి కూడా పనికిరావు. 

కథ అనే పదార్ధం:


     తంజావూరులో డ్రగ్స్ పట్టుకోవడానికి చెకింగ్ జరుగుతూంటుంది. సమాచారమందిన బస్సులో డ్రగ్స్ దొరకవు. పోలీసులు కంగారు పడుతూంటారు. ఇంతలో పారితోషికం కోసం చెంగు చెంగున దూకుతూ డానీ డాగ్ వచ్చేస్తుంది. వచ్చేసి బ్యాగుని పట్టేసుకుంటుంది. అన్ని బ్యాగులూ వెతికి ఆ ఒక్క బ్యాగు మాత్రమే డానీ డాగ్ పట్టుకోవడానికి అట్టి పెట్టారన్న  మాట పోలీసులు. ఆ బ్యాగులో పారితోషికం లేకపోవడం చూసి తీవ్రంగా మండిపడుతుంది డానీ.

        వూరి పొలిమేరలో ఒక కాలుతున్న శవం దొరుకుతుంది. శవం మీద గొలుసుతో భర్తని పట్టుకుంటారు పోలీసులు. ఒక బస్తీలో పాత మిద్దె ఇల్లున్న కంధవాయి (వరలక్ష్మి) తల్లితో, చెల్లెలు మధీ (అనితా సంపత్) తో వుంటుంది. చెల్లెలు మధీ అంధ బాలల పాఠశాలలో యంగ్ పంతులమ్మ. కంధవాయి మురికిగా వున్న తమ ఇంటి దొడ్లో పిల్లలకి లో- బడ్జెట్ మేరకు కరాటే నేర్పుతుంది. పొలం వెళ్లి ట్రాక్టర్ తో దున్నుతుంది. పోలీస్ స్టేషన్ కెళ్ళి కొత్త ఇన్స్ పెక్టర్ గా జాయినైపోయి, చుట్టు పక్కల ముప్ఫై పోలీస్ స్టేషన్లలో వున్న ఎఫ్ ఐ ఆర్ లని తెమ్మంటుంది. ఒక సర్కిల్లో ముప్పై పోలీస్ స్టేషన్ లుండడం తమిళనాడు స్పెషాలిటీనేమో. కొత్త ఇన్స్ పెక్టర్ వస్తే ఆ ముప్పై మంది ఎస్సైలకి వచ్చి కలవాలన్పించక పోవడం విధి వశాత్తూ మెగా బడ్జెట్ లోపించడం వల్లేమో. 


        వూళ్ళో కాలిన శవం కేసు పట్టుకుంటుంది కంధవాయి. భర్త హంతకుడు కాదని వదిలేస్తుంది. మరెవరు? ఇంతలో డాగ్ హేండ్లర్ కూడా మర్డరై పోతాడు. మరింతలో చెల్లెలు మధీ కూడా సఫా అయిపోతుంది. కమెడియన్లే మిగుల్తారు కామెడీలు చేసుకోవడానికి. వూళ్లోనే ఒక డాక్టర్ (సాయాజీ షిండే) వుంటాడు. ఇతను డ్రగ్స్ పిచ్చిగల కొడుకుని గారం చేస్తూంటాడు. ఈ కొడుకే హత్యలు చేస్తున్నాడా? ‘పెంగ్విన్’ లో తనలాంటి వాడే ఒకడు అమ్మాయిలని మర్డర్ చేశాడని, రోల్ మోడల్ గా తీసుకుని తనూ చేశాడా? ఉత్కంఠ రేపే హిచ్ కాక్ సస్పెన్స్ ఇది.


నటనలు – సాంకేతికాలు :
      స్క్రిప్టు కూడా చూసి టైటిల్ రోల్ ని గెస్టు రోలుగా కుదించేసుకుంది డానీ ది పోలీస్ డాగ్. తోచినప్పుడు రావడం, తోచనప్పుడు వెళ్ళిపోవడం. వరలక్ష్మి కూడా జీవకారుణ్యంతో దాన్ని తంజావూరు గెస్టుగా ఉదారంగా వుండనిచ్చింది. తను కూడా కంధవాయిగా అంధకారంలో వుంది. ఇది యాక్షన్ సినిమానా లేక దానికి మించి కమెడియన్ల గోలనా అర్ధంగాని పరిస్థితి. ఉన్న సదుపాయాలతో సరిపెట్టుకుని ఇన్వెస్టిగేషన్ చేద్దామంటే కామెడీలు పెట్టేస్తాడు దర్శకుడు. డానీ కాకుండా, తనూ కాకుండా కమెడియన్ల భుజాల మీద వేశాడు సినిమాని. సరైన విలన్ని కూడా పెట్టలేకపోయాడు. పోలీస్ ఇన్స్ పెక్టర్ పాత్ర డానీ పక్కన నిలబడ్డానికేనా. బాధితులు ఈ సినిమాలో హతులైన పాత్రలు కాదు, తనూ డానీ. కొత్త దర్శకులు బాగా తీస్తున్నారని అవకాశమిస్తే ఇరవయ్యేళ్ళు వెనక్కి తోశాడు తనని. అప్పట్లో కూడా సినిమాలు ఇలా తీయలేదు. తమిళ దర్శకులు క్రియేటివిటీకి పెట్టింది పేరని మన్మోహన్ సింగ్ కీర్తిస్తే చాలా కచరా చేస్తున్నారు కొత్త దర్శకులు.            

     యోగిబాబు కామెడీ, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, సహాయ నటీనటులు, కెమెరా సంగీతం, ప్రతీదీ దర్శకుడికి సినిమా సెన్స్ లోపించిందనడానికి నిదర్శనాలు. 

కథాకథనాలు :

      మేకర్ లేబర్ కేటగిరీ అయితేనే ఇలాటి లేబర్ కథే రాసి తీస్తాడు. తీస్తున్నది గొప్ప సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటూ తీసింది లేబర్ కామెడీ. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మర్యాదలే పట్టని కన్నడ ‘లా’ లో ఎంటర్ టైన్మెంట్ వుండాలన్నట్టు ఫీలై కోర్టులో, ఆ కోర్టులో జడ్జితో చీప్ కామెడీలు పెట్టినట్టు, ఇక్కడ కూడా కొత్త దర్శకుడికి కామెడీ లేకపోతే  సినిమా ఆడదన్న అభద్రత ఎక్కువయ్యింది. ఉన్న సస్పెన్స్ కథయినా కథలా వుందాంటే, పరస్పరం సంబంధం లేని, కథకి అవసరం లేని సీన్లు. అంధ బాలలకి చెల్లెలి పాత్ర పాఠాలు చెప్తూ, పక్షుల్లా అరవమంటుంది. ఒక బాలిక అరిచిందో లేదో, కట్ చేసి ఇంకో సౌండ్ విన్పించి -ఇది ఏ వాహనం శబ్దమో చెప్పమంటుంది. ఒక సీనులో సీను ఎలా ముక్కలుగా వుందో, కథ కూడా ఇలా ముక్కలు ముక్కలుగా వుంటుంది. అవసరం లేని విషయాలతో ముక్కలైన కథతో సస్పెన్స్ ఏముంటుంది. పాత్ర చిత్రణలు కూడా ముక్కలు ముక్కలై వుంటాయి. కరాటే తెలిసిన వరలక్ష్మి పాత్ర చివర్లో విలన్ని పట్టుకున్నప్పుడు కరాటేతో కొట్టకుండా, హెల్ప్ కోసం డానీ డాగ్ ని కేకేస్తుంది. డాగ్ జన్మెత్తి నందుకు ‘జాలి గుండె లేని దర్శకుడి కన్నా కుక్క మేలురా’ అని తిట్టుకుంటూ వస్తుంది డానీ డాగ్.

సికిందర్


Monday, August 3, 2020

964 : రివ్యూ


దర్శకత్వం : అనూ మీనన్
తారాగణం: విద్యాబాలన్, సాన్యా మల్హోత్రా, అమిత్ సాద్, జిష్షూ సేన్ గుప్తా తదితరులు
సంగీతం: సచిన్ -జిగర్, ఛాయాగ్రహణం: కీకో నకహరా
బ్యానర్ : సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా, విక్రం మల్హోత్రా
విడుదల : అమెజాన్

***
ణిత మేధావి, మానవ కంప్యూటర్, లెజెండ్ శకుంతలా దేవి బయోపిక్ గా నిర్మించిన ‘శకుంతలా దేవి’ పూర్తిగా విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. వచ్చిందంటే బాలన్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ నే మోసుకొస్తుంది. శకుంతలా దేవియే స్వయంగా గణితంతో జగమెరిగిన ఎంటర్ టైనర్ అయినప్పుడు, బోరుకొట్టే గణితానికి హుషారు తెప్పించే  గ్లామర్ తీసుకొచ్చినప్పుడు, సర్కస్ లో రింగ్ మాస్టర్ లా వేదికల మీద గణితంతో వినోదం పంచినప్పుడు, బాలన్ కి పండగే అయిపోతుంది ఫన్ చేయడానికి. బరువైన జీవిత గాథలతో యమ బోరుగా, సీరియస్ గా వుండే బయోపిక్స్ జానర్ కి, శకుంతలా దేవి పుణ్యమాని కమర్షియల్ సినిమా రెక్కలొచ్చాయి. ఆమె జీవితం ఒక కమర్షియల్ సినిమా. విద్యాబాలన్ డైలాగు చెప్పినట్టు - చెట్టుకీ మనిషికీ తేడా వుంది. చెట్టుకి వేళ్ళుంటాయి, మనిషికి కాళ్ళుంటాయి. వేళ్ళు నేలలో పాతుకుని అక్కడే వుండి పోతాయి, కాళ్ళు ప్రపంచమంతా చుట్టేస్తాయి. శకుంతలా దేవి బయోపిక్ వేళ్ళు లాంటిది కాదు, కాళ్ళు వంటిది. పరుగులు తీసే పాదాలతో గ్లోబల్ లేడీగా ఆమె బయోపిక్ ఒక వరల్డ్ టూరు. టోటల్ ప్రపంచం బ్రహ్మరధం పట్టిన సెలెబ్రేషన్.

        సెలెబ్రేషన్ని ఈ తరం ప్రేక్షకుల ముందుకు డైనమిక్ గా తీసుకువచ్చింది కొత్త దర్శకురాలు అనూ మీనన్, రచయిత్రులు నయనికా మహ్తానీ, ఇషితా మోయిత్రాలతో కూడిన ఫిమేల్ టీం. ఇలాటి ఫిమేల్ టీములు బాలీవుడ్ లో చూసి టాలీవుడ్ లో ఏర్పడ్డం ఎప్పటికి జరుగుతుందో తెలీదు. ఈ బయోపిక్ ఫిమేల్ టీము ఇగోలు తెచ్చుకుని మేల్ ఆలోచనలతో ఫేక్ మేకింగ్ చేయకుండా, ఆద్యంతం కోమలమైన స్త్రీ సుగుణాలు ప్రతిఫలించేలా శకుంతలా దేవికి నీరాజనాలు పట్టారు. 

కథ
    ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శకుంతలా దేవి (విద్యాబాలన్) మీద ఆమె కుమార్తె అనుపమ (సాన్యా మల్హోత్రా) పదేళ్ళ పాటు జైలుకి పంపే క్రిమినల్ కేసు వేయడంతో ప్రారంభ మవుతుంది బయోపిక్. అనుపమ జ్ఞాపకాల్లో ఫ్లాష్ బ్యాకుల్లో వస్తూంటుంది శకుంతలా దేవి గత జీవితం...1930 లలో కర్ణాటకలో ఐదేళ్ళ శంకుంతల స్కూలు కెళ్లకుండానే లెక్కల్లో అసాధారణ ప్రతిభ కనబరుస్తుంది. ఎలాటి గణిత సమస్యనైనా సెకన్లలో సాల్వ్ చేసేస్తూంటుంది. ఆ వయసులోనే ఆమె గణితావధాని. ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యని, ఇంకో ఎనిమిదేసి అంకెలున్న సంఖ్యతో హెచ్చ వేసి, ఎంత వస్తుందో చెప్పమని బోర్డు మీద రాస్తే, రెండు క్షణాలు ఓ లుక్కేసి చట్టుక్కున చెప్పేసి ఆశ్చర్యంలో ముంచేస్తూంటుంది. క్యూబ్ మూలాలైతే  కంప్యూటర్ కంటే వేగంగా లెక్కించి ఠకీల్మని చెప్పేస్తూంటుంది. లెక్కలు ఆమె ఎడం చేతి వాటం అయిపోతాయి. 


        ఇదంతా గమనించి సంపాదన లేని పేద బ్రాహ్మణుడైన ఆమె తండ్రి (ప్రకాష్ బెలవాడీ) ఆమెని స్కూళ్ళకి తిప్పి ప్రదర్శన లిప్పిస్తూ డబ్బులు సంపాదిస్తూంటాడు. స్కూల్లో చేరి చదువుకోవాలన్న ఆమె కోరిక మాత్రం నెరవేర్చడు. తండ్రి ముందు తల్లి (ఇస్పితా చక్రవర్తి) నోరు విప్పలేని నిస్సహాయురాలు. తల్లిదండ్రు లిద్దరూ ఇలా వుండేసరికి విసిగిపోయిన శకుంతల, ‘సంపాదిస్తున్నది నేనైనప్పుడు నాన్న కాదు నేను తండ్రిని’ అని తిరుగుబాటు ప్రకటిస్తుంది ఐదేళ్లప్పుడే. తను సంపాదిస్తున్నా ఆ డబ్బుతో వైద్యం చేయించక పోవడంతో వికలాంగు రాలైన అక్క చనిపోతుంది. దీంతో తల్లిదండ్రుల పైన ఇంకా అసహ్యం పెంచుకుంటుంది. ఇక జీవితంలో క్షమించనని తల్లికి చెప్పేస్తుంది. నీలా నేను తయారుకానని తల్లిని ద్వేషిస్తుంది. భూమి గుండ్రంగా వుందమ్మా, నీ కూతురితో నీకూ నాలాటి పరిస్థితే వస్తుందని తల్లి అంటుంది.

        శకుంతల యుక్త వయస్కురాలయ్యే టప్పటికి ఆమె పేరు దేశంలో మార్మోగిపోతుంది. ఇక నగరాల్లో ప్రదర్శనలివ్వడం మొదలెడుతుంది. తన కంప్యూటర్ కంటే వేగవంతమైన మెదడుతో గణిత మేధావులు సైతం అవాక్కయ్యేలా చేస్తూంటుంది. 1955 కల్లా లండన్ నుంచి ఆహ్వానం వస్తుంది. అక్కడ ఆమె గణితావధానం అంతర్జాతీయ మవుతుంది. ఇక ఆమెని  మానవ కంప్యూటర్ గా కీర్తించడం మొదలెడతారు. ప్రపంచ మంతా ప్రదర్శన లిస్తుంది. దేశవిదేశాల్లో అపార ధనరాసులు, ఆస్తులు గడిస్తుంది. స్కూలుకే వెళ్ళని తను ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె మెదడు శాస్త్రవేత్తలకి కూడా అంతు చిక్కని రహస్యమై పోతుంది.  

     ఒక కలకత్తాకి చెందిన ఐఎఎస్ అధికారి పరితోష్ బెనర్జీ (జిష్షూ సేన్ గుప్తా) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ కూతురు పుట్టగానే భర్త కప్పజెప్పి ప్రపంచ యాత్రకి వెళ్ళిపోతుంది. గణితం లేకుండా తను వుండలేదు. తనని విడిచి అంకెలు వుండలేవు. పైగా బానిస లాంటి తన తల్లికి తానేమిటో నిరూపించాలన్న కసి, తల్లిలా తను ఐపోకూడదన్న పట్టుదలా ఇంకోవైపు. తల్లి ప్రేమ కరువైన కూతుర్ని గుర్తించి లండన్ కి తెచ్చుకుంటుంది. కానీ స్కూల్లో వేయకుండా తనవెంటే దేశాలు తిప్పుతుంది. అక్కడ్నించీ తల్లీ కూతుళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు సంక్షుభితమవడం మొదలెడతాయి. ఇరవయ్యేళ్ళూ సుఖ శాంతులుండవు. తన తల్లితో తనేం చేసిందో అదే తన కూతురూ తనకూ చేయడం భూమి గుండ్రంగా వుందన్న తల్లి వాక్కుని గుర్తుచేస్తుంది. 

        చివరికి తల్లిని జైలుకి పంపే క్రిమినల్ కేసు వేసే పరిస్థితి కూతురి కెందు కొచ్చింది? కూతురి సర్వం లాక్కుని రోడ్డున పడేసే పని తల్లి ఎందుకు చేసింది? ఎందుకీ శత్రుత్వాలు?  కూతురు కూడా తల్లి అయిందిప్పుడు. భావికాలంలో ఈ కూతురికి పుట్టిన కూతురూ తల్లితో ఇలాగే చేస్తుందా? ఈ చక్రభ్రమణం ఆగేదెలా? ఇదెలా పరిష్కరమయింది? అసలు సమస్య ఎక్కడుంది? ఇదీ మిగతా కథ.

నటనలు- సాంకేతికాలు
      ముందే చెప్పినట్టు ఇది విద్యాబాలన్ వన్ వుమన్ వండర్ఫుల్ షో. గ్రేట్ షో. ‘బ్రిటన్ కి రాణి ఎవరైనా, ప్రపంచానికి రాణి ఈ హిందుస్తానీ’ అని పాటేసుకుని ప్రపంచాన్ని చుట్టేస్తూ శకుంతలా దేవికంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది. తనలా హాస్యం నటించే నటీమణులు లేరు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించేస్తూ, గర్వం లేకుండా ఎవరితోనైనా కలిసిపోతూ, యూనివర్సల్ సిటిజన్ లా మెరిసిపోతూ ఫెంటాస్టిక్ గా నటించడం ఒకెత్తు. ఈ షుగర్ కోటింగ్ పొర తీసి లోపల చూస్తే - కూతురితో, భర్తతో ఏర్పడ్డ పరిణామాల తాలూకు విషాదచ్ఛాయల వికృతి దొలిచేస్తూంటే పడే వేదన. ఈ రెండిటిని కమ్మేస్తూ వృత్తిగతంగా అనితరసాధ్యమైన సింప్లిసిటీని ప్రదర్శించడం, తానొక ప్రఖ్యాతురాలన్న అహం లేని తనంతో ప్రవర్తించడం, మేథమేటిక్స్ తో మెజీషియన్ లా ప్రదర్శనలివ్వడంలో వయసు మీద పడ్డా అదే స్పోర్టివ్ నెస్ తో వుండడం- ఈ మూడంచెల అత్యంత సంకీర్ణ నిజ జీవిత పాత్రలో విద్యాబాలన్ నిలువెత్తు శకుంతలా దేవియే అన్పించుకోవడం ఆమెకే సాధ్యమవుతుంది. 


        ఓటమెరుగని ఇంత రోమాంచితమైన గణితావధాన ప్రస్తానంలో రెండే రెండు సార్లు ఆమె తొట్రుపాటు పడే సీన్లు ఇంకే సస్పెన్స్ - ఎమోషనల్ సినిమాలోనూ మనల్ని గాభరా పెట్టలేదు బహుశా. ఆమె ప్రస్థానంలో ఢక్కా మొక్కీ లుంటాయని అస్సలూహించకుండా షోని ఎంజాయ్ చేస్తున్న మన మీద రెండు సీన్లు బాంబుల్లా ప్రయోగిస్తుంది దర్శకురాలు.        


      ఒకటి: అంకెలు తప్పు చెప్పి, కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని ఆమె దబాయించడం. ఓటమి ఒప్పుకోకుండా దబాయిస్తూంటే మనకి కోపం కూడా వస్తుంది. ఓటమి పాలైనందుకు ఈమె పనై పోయిందని ప్రదర్శనలో వున్న ప్రేక్షకుల్లాగే మనకూ చులకన భావమేర్పడుతుంది. చాలా డిస్టర్బింగ్ ఘట్టం (వాస్తవంగా ఇది బిబిసి షో). ఆమెని కూడా డిస్టర్బ్ చేసే ఈ సంఘటన తర్వాత కంప్యూటర్ అడిగిన ప్రశ్నలోనే తప్పుందని తేలడంతో సుఖాంతమవుతుంది. 

        ఇంతకి మించిన సీను రెండోది: ఇలాటిదే ఇంకో షోలో నిజంగా విఫలమవుతుంది. నిండు సభలో గణితం లెక్కిస్తున్న క్షణాల్లో, హఠాత్తుగా కూతురితో పడిన ఘర్షణ గుర్తుకొచ్చి మెదడు అదుపు తప్పిపోతుంది. షాక్ అవుతాం. ఇలా ఈ సమయంలో కూతురు గుర్తొస్తుందని అస్సలనుకోం. చూసి చూసి తురుపు ముక్కల్లా ఈ రెండు సీన్లని గురి చూసి  ప్రయోగించింది దర్శకురాలు. ఈ రెండు సీన్లు బాలన్ ప్రతిభని నిరూపిస్తాయి.      
   
       నటనకి ఇంకో బలం ఆమె సంభాషణలు. ఇలాటి స్ఫూర్తి మంతమైన క్లుప్త సంభాషణలు గత కొన్నేళ్ళ కాలంలో ఏ నటులూ నోచుకోలేదు - ‘మనసు చెప్పింది విని, హృదయం విప్పి మాట్లాడే ఆడదంటే ఎంత భయమో’, ‘ప్రపంచంలో రెండే ప్రశ్నలుంటాయి: నాకు డబ్బొస్తుందా? నాకు ప్రేమ లభిస్తుందా?’, నువ్వు అందరు అమ్మల్లాగా నార్మల్ గా ఎందుకుండవని కూతురు నిలదీసినప్పుడు- ‘అమేజింగ్ గా నేనుండే అవకాశం నాకున్నప్పుడు నార్మల్ గా ఎందుకుండాలి?’, ‘నీ కళ్ళల్లో మెరుపు కంటే ఎక్కువ కాదు ఎంత డబ్బైనా’, ‘నువ్వు నా మ్యాథ్స్ నుంచి నన్నుదూరం చేశావ్’, ‘మ్యాథ్స్ తెలిసిన రెండు జడలమ్మాయిని చూస్తే మొహం ఇలా పెడతారు’, ‘నేనెప్పుడూ ఓడిపోను, రిమెంబర్ దట్’...ఇలా వందకి పైగా ఇన్నోవేటివ్ డైలాగులు సన్నివేశాల్లో కలిసిపోయి ప్రవహిస్తూంటాయి. 

        విద్యాబాలన్ తర్వాత కూతురి పాత్రలో సాన్యా మల్హోత్రా. పుట్టింది మొదలు తల్లితో సంఘర్షణ తోనే గడిచిపోయే పాత్ర. జుట్టు పీక్కున్నా అర్ధంగాని తల్లిని చూసి, ‘నువ్వొక అర్ధం గాని ప్రహేళిక’ అనేసినప్పుడు ప్రదర్శించే వేదన పవర్ఫుల్. ఇంకోచోట తన బ్రతుకు దుర్భరం చేస్తూంటే తట్టుకోలేక, ‘అమ్మా, నీకు అలసట రాదా?’ అన్నప్పటి నిస్సహాయత  సాన్యాలోని నటిని పట్టిస్తుంది. ‘చిన్నప్పుడు ఇతరుల ఇళ్ళల్లోకి తొంగి చూసేదాన్ని...నాకు నాదంటూ ఒకిల్లు ఏర్పాటు చేసుకోవాలనుంది’ అన్నప్పటి పసితనం ఆమె లోని నటికి ఇంకో పార్శ్వం. 

    మూడో కీలక పాత్ర భర్తగా జిష్షూ సేన్ గుప్తా ఈ బయోపిక్ కి ఇంకో బలం. ఐఏఎస్ ఆఫీసర్ గా హూందా అయిన నటన. భార్య నుంచి కూతుర్ని రక్షించడం కోసం పడే పాట్లే అతడి పాత్ర. తను చెట్టు లాంటి వాడు. వేళ్ళు నేలలోనే పాతుకుని వుంటాయి. చెట్టు నీడలోనే  కూతురు పెరగాలి, బంజారాలా తిరిగే భార్య వెంట కాదు. కూతుర్ని దేశాలు తిప్పేస్తూంటే, ‘అది నీ కూతురు, సూట్ కేసు కాదు’ అంటాడు. ఊళ్ళు తిరిగే బంజారా అయిన ఆమెతో విధి లేక రాజీ పడతాడు - ‘నువ్వు నీలాగా వుంటేనే మనం మనలాగా వుంటాం కదూ?’ అని విరక్తిగా అనేసి. పెళ్లి పేరు మార్చి సారీ అని పెట్టాలంటాడు. మదర్ వయ్యాక నీ బ్రెయిన్ పోయిందంటాడు. కన్నంత మాత్రానా తల్లివి కాలేవంటాడు. పిల్లలకి తల్లిదండ్రుల మీద హక్కులుంటాయి గానీ తల్లి దండ్రులకి పిల్లల మీద హక్కులుండవంటాడు. అతడెన్ని చెప్పినా ఉల్లాసరకమైన ఆమె దృష్టిలో అతను మాత్రం ‘ఐఏఎస్ -  సర్కారీ సూపర్ హీరో’ నే.      
  
        లండన్ దృశ్యాల్లో బ్రిటిష్ నటీనటులతో బంపర్ లుక్ వచ్చింది. 1950 లనాటి లండన్ నేపథ్య దృశ్యాలు, ఆ తర్వాత 1990 లనాటి దృశ్యాలూ ఆయా కాలాలకి తగ్గట్టు  నిర్దుష్టంగా వున్నాయి. అలాగే బెంగళూరు దృశ్యాలు కూడా. కీకో నకహరా ఛాయాగ్రహణం అతి పెద్ద ఆకర్షణ. కోమలమైన కలర్స్ తో, లైటింగ్స్ తో ఫిమేల్ కాన్సెప్ట్ మూడ్ కి అద్దం పట్టేలా వుంది. ఉయ్యాల్లో సాన్యా కూతురున్నప్పటి దృశ్యపు చిత్రీకరణ ఆర్ట్ డైరెక్షన్ తో కూడా కలుపుకుని ఒక అద్భుతం. బడ్జెట్ ధారబోస్తే స్వర్గాల్నే చూపించొచ్చు. 

        సెట్ ప్రాపర్టీస్ విషయంగా చాలా రీసెర్చి చేసినట్టు కనబడుతూనే వుంటుంది. పాతకాలపు భవనాలు, కంప్యూటర్లు, మోబైళ్ళు, బళ్ళూ, కాస్ట్యూమ్సూ వగైరా. సచిన్ - జిగర్ సంగీతం సన్నగా కురిసే వర్షాకాలపు తుంపర లాంటిది. తల్లీ కూతుళ్ళ మీద సరదా సాంగ్ - ‘తుజే ఖైద్ కర్లూ మై’ ప్లెజంట్ కంపోజిషన్. దర్శకురాలు అనూ మీనన్ ప్రొఫెషనల్ దర్శకత్వం ఈ బయోపిక్ తో ఒక లెసన్ లా వుండొచ్చు.

కథాకథనాలు
    తెలుగులో ‘మనం’ తర్వాత ఇంకో ఇన్నోవేట్ చేసిన ట్రెండీ ఫ్యామిలీ డ్రామా ఇది. ‘మనం’ లాగే ఇంకో సంక్లిష్ట మోడరన్ స్క్రీన్ ప్లే. ఫిమేల్ టీం విజయం. రైటింగ్ ని బట్టే మేకింగ్ వస్తుంది. ఫ్యామిలీ డ్రామాని ఈతరం ప్రేక్షకుల కోసం రాసినప్పుడు తీసిందీ అంతే ట్రెండీగా  వస్తుంది. ముఖ్యంగా శకుంతలా దేవి జీవితాన్ని ఈతరం కెరీర్ మైండెడ్ ప్రేక్షకుల ముందుంచాల్సిన అవసరముంది. పాత తరం ప్రేక్షకులు కాదు. ఈ తరం ప్రేక్షకులకి ఆమె గణితావధానం వరకూ ఓకే, బాగానే కనెక్ట్ అవుతారు. స్ఫూర్తి పొందుతారు. ఫ్యామిలీ డ్రామా ఎందుకు? ఎందుకంటే, కెరీర్స్ వెల్లువలో కొట్టుకుపోయే యువతరం ఆమె జీవితంలోంచి నేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారని. కుటుంబ జీవితంలో సక్సెస్ సాధించనిది బయట సాధించే ఇంకే సక్సెస్ కూడా సక్సెస్ అన్పించుకోదని పర్సనాలిటీ నిపుణులంటారు.


        శకుంతలా దేవి జీవితాన్ని పూర్తిగా చూపించలేదనే ఫిర్యాదు వుంది. నిజమే, ఆమె రచయత్రి కూడా. సంఘ సేవిక కూడా. రచయిత్రిగా గణితం మీదే గాకుండా జ్యోతిషం మీద, వంటల మీద, హోమో సెక్సువాలిటీ మీదా పుస్తకాలు రాసింది. ఆఖరికి ‘పర్ఫెక్ట్ మర్డర్’ అన్న మిస్టరీ నవల కూడా రాసింది! బయోపిక్ అనగానే జీవితమంతా చూపించాలని లేదు. జీవితంలో ఒక కోణాన్ని తీసుకుని చూపించవచ్చు. ‘గాంధీ మై ఫాదర్’ లో గాంధీకి పెద్ద కుమారుడితో గల దుష్ప్రవర్తనని చూపించారు. గాంధీ చేసిన స్వాతంత్ర్య పోరాటం చూపించ లేదంటే ఎలా? 

        శకుంతలా దేవి కుటుంబ జీవితం ఎవరికీ తెలీదు. దర్శకురాలు ఆమె కుమార్తెని  కలిశాకే తెలిసింది. ఆ కుమార్తె అనుపమా బెనర్జీ జ్ఞాపకాల్లోంచి కనుగొన్నదే ఈ బయోపిక్. అందుకని ఈ బయోపిక్ ని కుటుంబ జీవితమనే కోణానికే పరిమితం చేశారు. ఈ కథనాన్ని మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకుల్లో చూపించారు. కూతురి పాత్ర నటించిన సాన్యా దృక్కోణంలోనే సీన్లు వస్తూంటాయి. పోను పోనూ కొన్ని చోట్ల ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది కాదన్న కన్ఫ్యూజన్ కూడా ఏర్పడుతుంది. దీన్ని నివారించి వుండాల్సింది. 

        అయితే పెద్ద లోపం ఏమమిటంటే, తల్లి కథ ఆమె చిన్నప్పట్నుంచీ చెప్పుకొచ్చే కూతురికి - తల్లి ఎలా కష్టపడి పైకొచ్చిందో ఇంత తెలిసినప్పుడు, ఆమెతో తగువు పడ్డంలో అర్ధం కన్పించదు. చిట్టచివరికి తనే ఒక మాట అని తల్లి కళ్ళు తెరిపిస్తుంది - నువ్వు అమ్మనే చూశావ్, అమ్మలో ఆడదాన్ని చూడలేదని. తనుకూడా తన తల్లిలో ఆడదాన్నే చూసి వుంటే ఇంత జరిగేది కాదుగా?         


        ప్రాబ్లం పిల్లల్లోనే వుంది. సంతానంతో తల్లిదండ్రుల దుష్ప్రవర్తనని, నిర్లక్ష్యాన్నీ జడ్జి చేయలేమంటాడు స్పిరిచ్యువల్ గురు స్వామి సుఖబోధానంద. వాళ్ళేం చేసినా వాళ్ళని స్వీకరించాల్సిందే నంటాడు జన్మ నిచ్చినందుకు.

        కూతురు జడ్జి చేసి బొక్క బోర్లా పడింది. కొన్నాళ్ళు తనని స్కూల్లో వేయకుండా తన వెంట దేశాలు తిప్పిందని ద్వేషం పెంచుకుంది. తల్లి చేస్తున్నది మూర్ఖత్వమని మనమూ జడ్జి చేసేస్తాం. చిట్టచివరికి కూతురు వేసిన కేసు గురించి కలిశాక, తల్లి ఇచ్చిన ఆల్బం చూసుకున్న కూతురి పరిస్థితేంటి? ఆ చిన్నప్పుడు వివిధ దేశాధ్యక్ష్యులతో, ప్రధానులతో దిగిన ఫోటోలు ఎన్ని జన్మలెత్తితే తను చూసుకోగలదు? ప్రపంచానికి చూపెట్టుకోగలదు? కాబట్టి డోంట్ జడ్జ్ యువర్ పేరెంట్స్ అన్నది నీతి. అలాగే ఇంట్లో సక్సెస్ లేకుండా ఇల్లెక్కి కూసేదీ సక్సెస్ కాదని ఇంకో నీతి. డబుల్ బ్యారెల్ మోరల్ అన్నమాట.

సికిందర్

(ఈ బయోపిక్ గురించి నాలుగైదు ఫోన్లు వచ్చాయి. కరోనా కాలంలో ఈ నాల్గు నెలలుగా కనపడకుండా ఫోన్లలో మాట్లాడుకోవడం, కనపడకుండా దాక్కుని ఇలా రాసుకోవడం, 1918 తర్వాత మనకే లభించిన సువర్ణావకాశం. చైనా వాడిచ్చిన ఫోటో ఆల్బం. ఈ బయోపిక్ లో కాన్ఫ్లిక్ట్ సరిగా లేదని ఫిర్యాదు. కూతురు కేసేయడంతో ప్రారంభించిన కాన్ఫ్లిక్ట్ మళ్ళీ చివర్లోనే చూపించి నిమిషంలో తేల్చేశారని  విశ్లేషణ చేశారు. కథల్ని ఇలా అర్ధం జేసుకుంటే ఎలా? కేసేయడం కాన్ఫ్లిక్ట్ అని ఎవరన్నారు? కేసుకి దారి తీసిన తల్లీ కూతుళ్ళ మధ్య ఏం జరిగిందన్నదే కాన్ఫ్లిక్ట్. కేసేయడం కాన్ఫ్లిక్ట్ కాదు. అది ప్లాట్ పాయింట్ టూ దగ్గర వచ్చే థర్డ్ యాక్ట్ మలుపు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ ని లీనియర్ గా చూస్తే అర్ధమవుతుంది. ప్రారంభంలో చూపించిన కేసేయడమే కాన్ఫ్లిక్ట్ అయితే, ఇంటర్వల్ కల్లా ఫ్లాష్ బ్యాక్స్ ముగించి, కేసేసిన కాన్ఫ్లిక్ట్ తో సెకండాఫ్ వుండేది. ఈ బయోపిక్ లో సీన్లతో వున్న డైనమిక్స్, ప్రతీ సీన్లో కట్టి పడేసే డైలాగ్స్, పాత్ర చిత్రణలు మొదలైన వాటిలోంచి నేర్చుకోవడానికి బోలెడుంది. కానీ స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే సమయం చిక్కడం లేదు, అదీ సమస్య)