రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 5, 2019

795 : సందేహాలు - సమాధానాలు



Q :  సీన్ స్ట్రక్చర్ (యాక్షన్ – రియాక్షన్) గురించి వివరిస్తారా?
Hare e Sh, AD Hare
A :  సీన్ స్ట్రక్చర్ గురించి వివరించాలంటే చాలా వుంటుంది. బ్లాగులోనే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో సవివరంగా వుంది.  సీన్లు అన్నిటినీ ఒకే గాటన కట్టి వివరించలేం. బిగినింగ్ లో వుండే సీన్ల సీనిక్ బిజినెస్ ఒక ఉద్దేశంతో వుంటే, మిడిల్ లో వచ్చే సీన్ల సీనిక్ బిజినెస్ మరో ఉద్దేశంతో  వుంటుంది. అలాగే ఎండ్ లో సీనిక్  బిజినెస్ ఇంకో ఉద్దేశంతో  వుంటుంది. అన్నిటి స్ట్రక్చర్ ఒకటే. స్ట్రక్చర్ లోపల జరిగే వాటి బిజినెస్సులు అంకాల వారీగా వేర్వేరు. స్క్రీన్ ప్లే మొత్తానికి త్రీ యాక్ట్స్ (బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అంకాలు) ఎలా వుంటాయో ప్రతీ సీనుకీ అలా అంకాలు వుంటాయి. ప్రతీ సీనూ అందులోని విషయంతో బిగినింగ్ తో మొదలై, మిడిల్ తో నడిచి, ఎండ్ తో ముగుస్తుంది. ఏ సీను అయినా ఎక్కడ్నించి వస్తుంది? సీను విడిగా ఎక్కడ్నించీ పుట్టుకు రాదు. సీనుకి విడిగా అస్తిత్వం లేదు. ఏ సీనైనా ఒక సీక్వెన్స్ లో భాగంగా పుట్టి బతకాల్సిందే. ప్రతి సినిమా కథలో ఎనిమిది  సీక్వెన్సు లుంటాయి. కొన్ని సీన్లు కలిపితే  ఒక సీక్వెన్స్, ఎనిమిది  సీక్వెన్సులు కలిపితే ఒక స్క్రీన్ ప్లే. ముందుగా సీక్వెన్స్ అంటే ఏమిటో అర్ధం జేసుకుంటే, దాని లోపల సీన్ల కర్తవ్యమేమిటో బోధపడుతుంది.

         
ఏ సినిమా కథకైనా – అదెంత అట్టర్ ఫ్లాప్  సిగ్రేడ్ సినిమా అయినా, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేల్లో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లోనే సీక్వెన్సులు లేని బలహీన కథ అల్లారు. ఈ సినిమా మొత్తం మీద రెండే రెండు సీక్వెన్సు లుంటాయి. ఫస్టాఫ్ అంతా ఒకే సీక్వెన్స్, సెకెండాఫ్ అంతా కలిపి ఒకే సీక్వెన్స్! స్ట్రక్చర్ ని నిర్లక్ష్యం చేస్తే ఇంతే జరుగుతుంది. ఏ  సినిమా కథనైనా నిలబెట్టేవి ఎనిమిది సీక్వెన్సులు. బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు చొప్పున వుంటాయి (పటం చూడండి). 

 కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీలా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి. మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన వాస్తవ్లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా ఆ సిను తాలూకు స్ట్రక్చర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ లు స్పష్టంగా వుంటాయి.

          స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు
, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ. ఇదీ స్టాండర్డ్ స్క్రీన్ ప్లేల్లో జరిగే తంతు. 

          ఈ సీన్లు, సీక్వెన్సుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఏ సీనైనా ఈ రెండు ఉద్దేశాల్లో ఒక ఉద్దేశంతో వుంటుంది : పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో. ఇది ఆ సీనులో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో జరుగుతుంది. ఒకసారి యూట్యూబ్ లో ‘జస్టిస్ చౌదరి’ క్లిక్ చేసి, 51.25 నుంచి 53.39 వరకూ రెండు నిమిషాల సీను చూడండి. ఈ సీనులో జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్, పాపారావుగా సత్యనారాయణ వుంటారు. 

          చౌదరి : ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? (1)
          పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) (pp – 1, end of beginning)
middle
          మళ్ళీ చౌదరి :  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (pp- 2, end of middle)
end
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )
***
      ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్, తర్వాతి 4 సంభాషణలు మిడిల్, మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయం, నేపధ్య వాతావరణం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా? 

          బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

          ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : ‘మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ!’ అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -  ‘నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...’  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీ, పాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై, 4 వ డైలాగుతో ముగిసింది. 

          దీనికి మండిపోయి చౌదరి – ‘గెటవుట్, ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయి, బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

          ఇప్పుడు మిడిల్ చూద్దాం. మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్ల సీన్లే కాబట్టి, ఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది – 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - ‘నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

          దీనికి  7 వ డైలాగులో  పాపారావు - ‘మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...’ అనడం రియాక్షన్ చూపడం.  

          దీనికి 8 వ డైలాగులో  చౌదరి – ‘ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి’ అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

          దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - ‘చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం. 

         
మిడిల్లో యాక్షన్ రియాక్షన్లు పోనుపోను సీరియస్ అయి మిడిల్ బిజినెస్ ని కొలిక్కి తెస్తాయి కదా? అలా ఇక్కడ పాపారావు మాటలతో కొలిక్కి వచ్చింది. రావడమే కాకుండా ‘చూడు మిస్టర్ చౌదరీ’ అంటూ అతను ఏకవచన సంబోధనకి మారడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని తెలుపుతోంది. తగ్గివున్న ప్రత్యర్ధి కోరలు చూపిస్తున్నాడు. మిడిల్ చివరి సీను ప్రత్యర్ధి చేతిలో వుండాలని రూలు కదా? 

          ప్రధాన పాత్ర చౌదరి వైపు నుంచి చూస్తే, అతను పతనా వస్థకి చేరాడు పాపారావు రియాక్షన్ తో. ‘చూడు మిస్టర్ చౌదరీ’ అని జస్టిస్ అయిన తనని అనడం ముమ్మాటికీ తలవొంపే. పైగా ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’ అని తన షరతులు విధిస్తున్నాడు. ‘ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అని పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నాడు. 

          ఇంతకంటే దీనావస్థ లేదు చౌదరికి. మిడిల్ ముగింపు సీనుతో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడినప్పుడు, అది ప్రధాన పాత్రని పతనావస్థకి చేర్చే సీనుగా వుండాలని రూలు కదా?  ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు ఎదురెదురు అద్దాలుగానే వుంటాయిగా? ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఏర్పడితే, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ గోల్ గల్లంతై కన్పిస్తుంది  కదా? ఇదే కదా పాయింట్ వన్ కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే మిడిల్లో జరిగే యాక్షన్ రియాక్షన్ల బిజినెస్? 

          ఈ మిడిల్ బిజినెస్ లో జస్టిస్ చౌదరి గోల్ ప్లాంట్ టూ దగ్గర గల్లంతైంది. ప్రత్యర్ధి పాపారావుది పై చేయి అయింది. 

          ఇక ఎండ్ - ఎండ్ అంటే ప్లాట్ పాయింటూలో కుంగి పోయిన స్థితి నుంచి ప్రధాన పాత్ర పైకి లేవడం కదా? లేచి దెబ్బ కొట్టడం కదా పట్టు వదలని గోల్ కోసం?  ఎండ్ విభాగంలో ఇక యాక్షన్ రియాక్షన్ల కథనం వుండదు. పైచేయి ప్రధాన పాత్రదే, పారిపోవడం ప్రత్యర్ధి పనే. 

          ఈ విధంగా ఇప్పుడు 10 వ డైలాగుతో చౌదరి -  ‘మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్’
          పాపారావు నోర్మూసుకుని ‘ఆల్ రైట్’ అని గెటవుటై పోవడం.
***
      ఇదీ సీను స్ట్రక్చర్. మరి సీను ధర్మం పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో  అయివుండాలని చెప్పుకున్నాం కదా? మరి పై సీనులో ఏది జరిగింది?  మిడిల్ 9 వ డైలాగులో పాపారావు - ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’  అనడం ద్వారా కథని ముందుకి నడిపించే సమాచారమిచ్చారు. చౌదరిని ఎవరో కలుస్తారన్న మాట? ఎవరు? ఆ వచ్చే వ్యక్తి అడిగితే చౌదరి నిర్ణయం మార్చుకుంటాడన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు కూడా పాపారావు. ఇలా రాబోయే సీన్లలో ఏం జరగబోతోందన్న సస్పన్స్ ని సృష్టిస్తూ, కథని ముందుకు నడిపించే సమాచార మిచ్చారు. 

          సీనుకి స్ట్రక్చర్ వల్ల డ్రామా పండుతుంది. స్ట్రక్చర్ లేకపోతే డ్రామా పండదు, మండదు, మొండికేస్తుంది. సీనుకి స్ట్రక్చర్ వల్ల పాత్ర చిత్రణలు సవ్యంగా వుంటాయి. సీనుకి స్ట్రక్చర్ వల్ల సీక్వెన్సు స్ట్రక్చర్ లో వుంటుంది. సీక్వెన్సులకి స్ట్రక్చర్ వల్ల యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటాయి. యాక్ట్స్ కి స్ట్రక్చర్ వల్ల  మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో బలంగా వుంటుంది.

          ఇంకో సూక్షం కూడా అర్ధం చేసుకోవాలి. అసలు స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ ఎక్కడ పుడుతుంది? మొట్ట మొదట కథకి అనుకునే అయిడియాలో పుడుతుంది. ఆ కథ తాలూకు రెండు మూడు వాక్యాల ఐడియాలో బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లేకపోతే, ఇక దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఆ కథకి సంబంధించిన అయిడియాలో ఎలా బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలుగా కథ కుదురుకుందో, అదే కూర్పు సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, సీక్వెన్స్ , ట్రీట్ మెంట్, చివరికి డైలాగ్ వెర్షన్ - ఈ  ఐదు అంచెల ప్రక్రియల్లో ప్రస్ఫుట మవ్వాలి. డైలాగ్ వెర్షన్ అంటే సీన్లు క్రియేట్ చేయడమే. ఈ సీన్లు ఐడియా స్ట్రక్చర్ కి లోబడి అదే స్ట్రక్చర్ లో వున్నప్పుడే తెరమీద స్క్రీన్ ప్లేకి చైతన్యం వస్తుంది.

సికిందర్

Monday, March 4, 2019

794 : రివ్యూ



కథ, దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అర్షద్ వార్సీ, రీతేష్ దేశ్ ముఖ్, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా, జానీ లివర్, అలీ తదితరులు
రచన : వేద్ ప్రకాష్, పరితోష్ పెయింటర్, బంటీ రాథోడ్, గౌరవ్ – రోషిన్, ఛాయాగ్రహణం : కికో నకహారా
***
          1990 లో ‘దిల్’ తో దర్శకుడైన ఇంద్రకుమార్ ఇంకా సినిమాలు తీస్తూ కొత్త తరం ప్రేక్షకుల్ని ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో 2007 లో ‘ఢమాల్’,  2013 లో ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీలు తీసి సక్సెస్ అయ్యాడు. ఈ రెండు సక్సెస్ లు పట్టుకుని వాటి సీక్వెల్స్ తీస్తూ పోయాడు. యాక్షన్ కామెడీ ‘ఢమాల్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఢమాల్’ తీసి తిరిగి ఇప్పుడు మరో సీక్వెల్ గా ‘టోటల్ ఢమాల్’ తీశాడు. ఈ మూడు ఢమాల్స్ హిట్టవడం ఒక సంచలనం. ప్రస్తుత ఢమాల్ మూడు రోజుల్లోనే వందకోట్లు రాబట్టి, వారం తిరిగే సరికల్లా ఇంకో వంద కోట్లతో పెద్ద హిట్ కొట్టింది. ఇంత అర్ధం పర్ధం లేని పాత తరహా మైండ్ లెస్ కామెడీకి ఇంత సక్సెస్ ఏమిటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇంద్ర కుమార్ తీరిగ్గా కూర్చుని ఇంటర్వ్యూ లిస్తున్నాడు. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మైండ్ లెస్ కామెడీలో ఏముంది?  ఇది తెలుసుకోవడానికి ఈ పిచ్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్దాం... 

కథ 
     గుడ్డూ (అజయ్ దేవగణ్), జానీ (సంజయ్ మిశ్రా) ఇద్దరూ తోడు దొంగలు. పోలీస్ కమీషనర్ మల్లిక్ (బొమన్ ఇరానీ) రద్దయిన నోట్ల దందా చేస్తూంటే యాభై కోట్లు కొత్త నోట్లు కొట్టేసి పారిపోతారు. డ్రైవర్ పింటూ (మనోజ్ పహ్వా) వీళ్ళని దెబ్బ కొట్టి ఆ డబ్బుతో తను పారిపోతాడు. 

          అవినాష్ (అనిల్ కపూర్), బిందూ (మాధురీ దీక్షిత్) లు విడాకుల కేసులో కోర్టులో వుంటారు. కీచులాడుకుని విడాకులు పొందుతారు. విడాకులు మంజూరు చేసి కొడుకు ఎవరి దగ్గర వుండాలో  అతన్నడిగి తేల్చుకోవాలని తీర్పు ఇస్తాడు జడ్జి. కీచులాడుకుంటూనే కొడుకు దగ్గరికి బయల్దేరతారు ఇద్దరూ. 

          లల్లన్ (రీతేష్ దేశ్ ముఖ్), ఝింగుర్ (పితోబాష్ త్రిపాఠీ) లు ఫైర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు. పైన బిల్డింగ్ తగులబడుతూంటే కింద వల పట్టుకుని ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళు ముందు దూకాలని కండిషన్ పెడతారు. లక్ష ఇచ్చిన వాడు దూకగానే ఆఫీసర్లు వచ్చి పట్టుకోబోతారు. ఇద్దరూ పరారవుతారు. 

          ఆదిత్య (అర్షద్ వార్సీ), మానవ్ (జావేద్ జాఫ్రీ) అన్నదమ్ములు. ఒక పురాతన వస్తుశాలలో ఉద్యోగాలున్నాయంటే వస్తారు. ఓనర్ పన్లోకి తీసుకుని, గ్యాలరీ క్లీన్ చేయమంటే మొత్తం పగులగొట్టి క్లీన్ చేశామంటారు. ఓనర్ పట్టుకోవడానికి వెంటబడితే అతడి ఆటోమేటిక్ కారెక్కి పారిపోతారు. 

          డబ్బు కొట్టేసిన పింటూ విమానమెక్కి,  విమానం నడుపుతున్నవాడు ఎవరో మెంటల్ కావడంతో విమానం కూలి కిందపడతాడు. కొడుకు దగ్గరికి ప్రయాణిస్తున్న అవినాష్ - బిందూలు ఇది చూసి ఆగుతారు. తమ పరిస్థితుల వల్ల పరారవుతున్న లల్లన్ – ఝింగుర్, ఆదిత్య – మానవ్ లు కూడా ఇక్కడికే వచ్చి ఆగుతారు. కొన ప్రాణాలతో వాళ్లకి డబ్బు రహస్యం చెప్పేస్తాడు పింటూ. ఇంతలో గుడ్డూ, జానీలు కూడా వచ్చి వినేస్తారు. పోలీస్ కమిషనర్ మల్లిక్ కూడా వచ్చి వినేస్తాడు. పింటూ చచ్చిపోతాడు. జనక్ పూర్ జూలో దాచి పెట్టిన ఆ యాభై  కోట్లు అందరూ కలిసి పంచుకోవడం దగ్గర వాటాలు కుదరక  పోటీ పెట్టుకుంటారు. పోటీలో ఎవరు ముందు జూకెళ్తే వాళ్ళదే డబ్బు. 

          ఈ పోటీలు ఎలా పడ్డారు? ఏమేం కష్టాలు అనుభవించారు? జూకి ఎవరు ముందు చేరుకున్నారు? లేక అందరూ ఒకేసారి వెళ్లి పడ్డారా? జూలో ఎదురైన ఇంకో పరిస్థితేమిటి? చిన్నప్ప స్వామి (మహేష్ మంజ్రేకర్) తన గ్యాంగుతో జంతువుల మీద ఏం కుట్ర చేశాడు? ఈ మిగతా కథ తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ 
       మైండ్ లెస్ కామెడీ జానర్. హిందీలో స్టార్ ఎట్రాక్షన్ వుంటే మైండ్ లెస్ కామెడీలు హిట్టవుతున్నాయి. ‘గోల్ మాల్’ సిరీస్ కూడా ఇలాగే హిట్టయ్యాయి. 2007 లో ‘ఢమాల్’ తీసినప్పుడది 1963 నాటి ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కి కాపీ. తెలుగులో ‘కిష్కింధ కాండ’ గా తీశారు. ‘ఢమాల్’ కథని పొడిగిస్తూ 2011 లో ‘డబుల్ ఢమాల్’ తీశారు. ఇప్పుడు తీసిన ‘టోటల్ ఢమాల్’ ని ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కే ఇంకో వెర్షన్ గా సీక్వెల్ చేశారు. కాబట్టి రిపీటయిన కథే కథనం మార్చిన సీన్లతో కన్పిస్తుంది. ఐతే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా కూడా పనిచేస్తోంది చివర్లో జూలో జంతువులతో కామెడీలతో కలుపుకుని. 

 ఎవరెలా చేశారు 
     అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్, రీతేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్లు సిగ్గుపడకుండా అర్ధం పర్ధంలేని  పిచ్చి కామెడీలన్నీ చేశారు. సిట్యుయేషన్స్ మైండ్ లెస్ గానే వుంటాయి, ఆ సిట్యుయేషన్స్ లో పేలే డైలాగులే నవ్విస్తూంటాయి... ‘వాళ్లకి తెలీదేమో నన్ను మించిన కుక్క లేదని’, ‘డబ్బు లాగే దాకా వదలను’, ‘డబ్బు లాగేక ఎందుకు వదులుతావ్ డబ్బు?’, ‘ఇది నీ రోప్ (తాడు) అనుకో - ఇదే నీ లాస్ట్ హోప్’, ‘స్ట్రగుల్ చేయడానికి రాలేదు - సెటిల్ అవడానికి వచ్చాం’, ‘నీకు అవినాశ్ అని పేరెవరు పెట్టారు -నువ్వు సత్తెనాశ్ వి’, ‘మేకల్ని బలిస్తారు - పులుల్ని కాదు’, ‘ఇది నీకు టార్చర్ - నాకు వామప్ అనుకో’,  ‘హైదరాబాదీలంటే బిర్యానీతోనే ఐడెంటిఫై కారు -  ఖుర్బానీలతో  (ప్రాణత్యాగాలతో) కూడా ఐడెంటిఫై అవుతారు’, ‘మూన్నాళ్ళ జీవితం ఇవ్వాళ్ళ మూడో నాడు’, ‘పరిస్థితి ఎమర్జెన్సీ గా వుంది - వాతావరణం భయానకంగా వుంది - ఈ ఛాన్సు లక్కు మార్చుకోవడానికుంది’, ‘ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు- మన చేత తన్నులు తిన్నవాళ్ళు -  వాళ్ళ చేతిలో తన్నులు తిన్న వాళ్ళం’, ‘ప్రపంచంలో గుండె బలం లేనోళ్ళు  మన దేశంలో తండ్రులే’, ‘మిడిల్ క్లాస్ వాణ్ని ప్రావిడెంట్ ఫండ్  డబ్బులడగడం వాడి కిడ్నీ అడగడం లాంటిదే’, ‘సాధారణ వడ్డీ -  చక్రవడ్డీ ఎలా లెక్కిస్తారు?....ఇలా అంతుండదు.  

          అరవ మాయగాడుగా అలీ, విమానాలు అద్దెకిచ్చే వాడుగా జానీ లివర్ కన్పించి గోల కామెడీ చేస్తారు. సోనాక్షీ సిన్హా ఒక ఐటెం సాంగ్ లో కన్పిస్తుంది. జూ ఓనర్ గా ఈషా గుప్తా వుంటుంది. ఈమె సెక్యురిటీ గార్డుగా క్రిస్టల్ ది మంకీ అనే చింపాంజీ వుంటుంది.  

          ప్రొడక్షన్ విలువలు, మేకింగ్ రిచ్ గా వున్నాయి. ఉత్తరా ఖండ్ కొండ ప్రాంతాల ఔట్ డోర్ లొకేషన్స్ అద్భుతంగా వున్నాయి. రెండు గంటల సేపూ ఔట్ డోర్ అడ్వెంచర్ గానే సాగుతుంది సినిమా. పాటలు పెద్ద గొప్పగా లేవుగానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం, వీఎఫ్ఎక్స్ ఉన్నతంగా వున్నాయి. కామెడీగా వుండే యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో వేగం థ్రిల్ చేస్తుంది. 

చివరికేమిటి 
      ఇప్పుడు కూడా పాత ఇంద్రకుమార్ కొత్త దర్శకులకి తీసిపోని విధంగా మేకింగ్ చేయడం ఒక గొప్ప విషయం. ఎక్కడా చీప్ లుక్, లూజ్ మేకింగ్ రానివ్వలేదు. కామెడీలో పంచ్ ని ఏ షాట్స్ పెట్టి తీయాలో అలా తీసి కెమెరాతో కూడా నవ్వించాడు. ఔట్ డోర్ లొకేషన్స్ లో హీమాన్ క్యారెక్టర్లతో వెస్టర్న్ ఫీల్ తీసుకొచ్చాడు. కామెడీకి లాజిక్ అవసరం లేదు. కానీ ఆ కామెడీ పుట్టడానికి కారణమైన బేస్ లాజికల్ గా వుండి తీరాలి. పోలీస్ కమీషనర్  దగ్గర యాభై కోట్లు కొట్టేయడం లాజికల్ బేసే. దీన్నాధారంగా చేసుకుని ఎంత పిచ్చి కామెడీ అయినా చేసుకోవచ్చు. అందుకని విమానాలు అద్దె కిచ్చే సీను, హెలీ కాప్టర్ కి గాలి చక్రం లేకపోతే  ఫ్యాను తగిలించి ఎగరేసే సీను లాంటివెన్నో చెల్లిపోయాయి. ఊబిలో కూరుకు పోతున్న వాణ్ణి  తాడు అనుకుని పాముని విసితే, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబ్రాకే (వాడి బరువుకి పాము మధ్యకి తెగిపోదా అనే ప్రశ్న అనవసరం) సీను, జూ నైట్ సీన్ క్లయిమాక్స్ లో ఏనుగు, దాని పిల్ల, చింపాంజీ, దాని పిల్ల, సింహం, దాని పిల్లలతో ప్రమాదంలో పడి - మదర్ సెంటి మెంట్లు రెచ్చగొట్టి బయటపడే కామెడీ సీన్లూ....ఇలా ప్రతీ చోటా పిచ్చి పిచ్చి కామెడీలు చేయిస్తూ పోయాడు స్టార్లతో.  సిట్యుయేషన్స్ సిల్లీనే, వాటికి పేల్చుకునే డైలాగులే పిచ్చ కామెడీ. 

          ఇంకోటేమిటంటే, అందరు నటుల్నీ కలిపి ఎక్కడా గుంపు కామెడీ చేయలేదు. డబ్బు కోసం అందరూ పోటీ పడి ఒకే గుంపుగా వెళ్లి వుంటే, ఆ గుంపు సీన్లు కాసేపటికి బోరు కొట్టి విషయం అయిపోయేది. ముందుగా ఎలా ఇద్దరిద్దరు కలిసి పారిపోయి వచ్చారో, డబ్బు రహస్యం తెలిశాక అలాగే  ఇద్దరిద్దరు చొప్పున విడివిడిగా ప్రయాణాలు సాగిస్తారు. అప్పుడు అనిల్ కపూర్ - మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్ - సంజయ్ మిశ్రా, రీతేష్ దేశ్ ముఖ్ - పితోబాష్ త్రిపాఠీ, అర్షద్ వార్సీ - జావేద్ జాఫ్రీ, బోమన్ ఇరానీ - విజయ్ పాట్కర్ ఐదు జంటలూ విడివిడి ప్రయాణాలు చేస్తూ, ఐదు ఎపిసోడ్లుగా ఏ జంటకా జంట విడివిడి కామెడీలు చేసుకుంటూ పోతారు. జూతో సహా ఇలా విడివిడి కష్టాల కామెడీలు చూపించడం వల్ల మొనాటనీకీ, బోరుకీ వీల్లేకుండా బయటపడిందీ రెండు గంటల మైండ్ లెస్ కామెడీ. కథని  ఈ విధంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంతో వ్యాపారాత్మకంగా చెల్లుబాటైందీ మల్టీ స్టారర్ ఎంటర్ టైనర్.

సికిందర్
Watched at Inox Gvk One, B. hills
At 7.30 pm, Feb 25, 2019


Monday, February 25, 2019

793 : రివ్యూ



రచన - దర్శకత్వం : ఆదిత్యా ధార్
తారాగణం
: విక్కీ కౌశల్, యామీ గౌతం, మోహిత్ రైనా, పరేష్ రావల్ తదితరులు
సంగీతం : శాశ్వత్ సచ్ దేవ్, ఛాయాగ్రహణం : మితేష్ మీర్చందానీ
కూర్పు : శివకుమార్, పణిక్కర్, కళ : నీనద్ జెరో, యాక్షన్ : స్టీఫాన్ రిచర్
బ్యానర్ :  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత :  రోనీ స్క్రూ వాలా
***
          ర్జికల్ స్ట్రయిక్ మీద తొలి సినిమా ‘యూరీ - ది సర్జికల్ స్ట్రయిక్’ కి మైలేజీ పెరిగింది. పుల్వామా దాడితో తిరిగి వసూళ్లు పుంజుకుని హౌస్ ఫూల్స్ తో నడుస్తోంది. తెలుగు డబ్బింగ్ కూడా చేసి వుంటే ఇంకా బావుండేది. అయితే ఈ మూవీ జరిగింది జరిగినట్టు చూపించడం వరకే చేసిందా, సర్జికల్ స్ట్రయిక్ జరిపినప్పటికీ మార్పు లేని పరిస్థితిని ఎత్తి చూపిందా, పరిస్థితిలో మార్పు లేకపోతే  ఇంకేం చేయాలో సూచించిందా అన్న ప్రశ్నలు పక్కన బెట్టి – ఒక సినిమాగా ఇది ఎంతవరకూ కాన్సెప్ట్ కి న్యాయం చేయగల్గిందో చూద్దాం. చెప్పినంత జోష్ నిజంగా వుందా, లేక హోష్ లేని జోష్ తో మైమరిపించారా ఒకసారి పరిశీలిద్దాం...

కథ 
     మణిపూర్ లో నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - కె (ఎన్ ఎస్ సి ఎన్ - కె) తీవ్రవాదులు భారత సైన్యం కాన్వాయ్ మీద దాడి జరిపి సైనికుల్ని చంపేస్తారు. దీంతో పారా ఎస్ ఎఫ్ మేజర్ విహాన్ (విక్కీ కౌశల్) తన దళంతో పక్క దేశం మయన్మార్ లోకి జొరబడి, ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల్ని నాయకుడితో సహా చంపేసి వస్తాడు. ఇక రిటైర్మెంటు తీసుకుని ఢిల్లీలో అల్జైమర్స్ తో బాధపడుతున్న తల్లి (స్వరూప్ సంపత్) దగ్గర వుండాలని కోరుకుంటాడు. ప్రధాని (రజిత్ కపూర్) ఇలా కాదని, దేశానికి నీ సేవలు అవసరమని, ఢిల్లీలోనే రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు. ఆక్కడ ఆఫీసు పని చూసుకుంటూ తల్లితో వుంటాడు. నర్సుగా జాస్మిన్ అల్మీడా (యామీ గౌతమ్) వస్తుంది. విహాన్ కి  సోదరి, మేనకోడలు, సైన్యంలోనే వున్న బావ వుంటారు. 

          ఇలా వుండగా, కాశ్మీర్లోని యూరీ లో, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ మీద టెర్రరిస్టులు దాడి జరిపి నిద్రలో వున్న19 మంది సైనికుల్ని చంపేస్తారు. ఈ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతో పాక్ కి బుద్ధిచెప్పాలని రక్షణ శాఖ నిర్ణయించుకుంటుంది. ప్రధాని (రజిత్ కపూర్),  హోంమంత్రి (నవతేజ్
హుండాల్), రక్షణ మంత్రి  రవీంద్ర అగ్నిహోత్రి (యోగేష్ సోమన్),, ఆర్మీ చీఫ్ జనరల్ అర్జున్ సింగ్ రజావత్ (శిశిర్ శర్మ), జాతీయ భద్రతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ (పరేష్ రావల్) లు సమావేశమై పాక్ మీద సర్జిల్ స్ట్రయిక్ జరపాలని నిర్ణయం తీసుకుంటారు. దీని బాధ్యత మేజర్ విహాన్ కి అప్పగిస్తారు. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన సైనికులు ఎక్కువ మంది బీహార్, డోగ్రా రెజిమెంట్లకి చెందిన వారు. ఈ రెజిమెంట్ల నుంచే దళాన్ని ఎంపిక చేసుకున్న మేజర్ విహాన్, సరిహద్దుదాటి పాక్ టెర్రరిస్టుల స్థావరాలని ఎలా తుదముట్టించి వచ్చాడన్నది  మిగతా కథ.

ఎలా వుంది కథ
     సెప్టెంబర్ 29, 2016 న భారత ప్రభుత్వం యూరీకి ప్రతీకారంగా పాక్ మీద చర్య తీసుకునే వరకూ, సర్జికల్  స్ట్రయిక్ అన్న పదం ఎవరికీ తెలీదు. అలాటివి జరుగుతాయని కూడా తెలీదు. 2008 -11 మధ్య మూడు సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు ఆర్మీ కోరికమీద అప్పటి ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ       సారి ప్రభుత్వం బయట పెట్టి ప్రచారం చేసుకోవడంతో, సర్జికల్ స్ట్రయిక్ అనే ఆర్మీ వ్యూహ మొకటుందని అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ సినిమా తీయడానికి అవకాశమేర్పడింది. ఇంతవరకూ బాలీవుడ్ కూడా వూహించి వుండదు, యుద్ధ కథల్లో ఇలాటి కథ కూడా ఒకటుంటుందని. 

          దీన్ని ఫార్ములాకి దూరంగా రియలిస్టిక్ గా తీశారు. అయితే వాస్తవంగా జరిగిందానికి కల్పనని జోడించారు. సినిమాటిక్ గా ఈ కల్పనని జోడిస్తున్నప్పుడు అసంపూర్ణ కథనం చేశారు. దీంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక, “how’s the josh?” అని మేజర్ అడిగినప్పుడు “high sir!” అని దళం బదులిస్తే, మనకి అంత జోష్ ఏమీ అన్పించదు. జోష్ నిచ్చే  ముఖ్యమైన పాత్ర ఒకటి మిస్ కావడం వల్ల. ఐతే ఈ కథలో జోష్ ని నింపడానికి దేశభక్తి నినాదాల జోలికి పోలేదు.

ఎవరెలా చేశారు 
      ‘మన్మర్జియా’ క్రేజీ బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ మేజర్ విహాన్ పాత్రలో పకడ్బందీగా నటించాడు. కుటుంబ జీవితం, వృత్తి జీవితం - ఈ రెండు పార్శ్వాలకి భావస్పోరక నటనలతో వేరియేషన్స్ చూపాడు. పూర్తి కాన్ఫిడెన్స్ తో కొత్త దర్శకుడు దృశ్యాల్ని చిత్రీకరించే తీరు, వాటికి తోడ్పడ్డ విజువల్, సౌండ్, యాక్షన్  ఎఫెక్ట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం  వగైరా హంగులన్నీ విక్కీ కౌశల్ పాత్ర ప్రెజెంటేషన్ని ఉన్నతంగా చేశాయి. పాత్ర ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్ని ఆలోచనాత్మక మూడ్ లోకి నెట్టేసిందంటే ఆ పాత్రచిత్రణ విజయం సాధించినట్టే. కాకపోతే ఈ పాత్రకి ప్రతినాయక పాత్ర లేదు, సినిమాటిక్ గా ఇదే పెద్ద లోపం.        

          ఇతర పాత్రల్లో యామీ గౌతమ్, పరేష్ రావల్ ల పాత్రలకి ఎక్కువ ఫుటేజీ ఇచ్చారు. యామీ గౌతమ్ నర్సు రూపంలో వున్న ఇంటలిజెన్స్ ఏజెంట్ పల్లవీ శర్మగా, ఆ తర్వాత సర్జికల్ ఆపరేషన్ కో ఆర్డినేటర్ గా కన్పిస్తుంది.  జాతీయ భద్రాతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ గా పరేష్ రావల్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి నమూనా పాత్ర. సెల్ ఫోన్లు విరగ్గొట్టే తిక్క వుంటుంది. 

          ప్రధాని మోడీ గెటప్ లో,
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గెటప్ లో, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గెటప్ లో నటులు ఫర్వాలేదు గానీ, అటు వైపు పాక్ యంత్రాంగాన్ని కామెడీగా చూపించారు. ఐఎస్సై చీఫ్ నైతే మరీ జోకర్ లా చూపించారు. విలన్స్ ని తక్కువ చేసి చూపిస్తే సినిమాలో హీరోయిజానికి జోష్ ఏముంటుంది. వాళ్ళెంత కర్కశులో చూపిస్తేనే ప్రేక్షకులకైనా కచ్చి రేగుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళని ఎంతైనా ఆడుకుని తృప్తి పడొచ్చు, సినిమాలో పచ్చిగా చూపించకపోతే కచ్చి లేదు. 

          45 కోట్ల బడ్జెట్ కి మేకింగ్ పరంగా అద్భుతమనే చెప్పొచ్చు. కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్, ఎడిటింగ్, డైలాగ్ ఎడిటింగ్ వగైరా సాంకేతికాలు ఉన్నతస్థాయిలో వున్నాయి. లొకేషన్స్, భవనాలు, వాహనాలు, ఆయుధాలు కథకి తగ్గ సహజత్వంతో వున్నాయి. యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతంగా వున్నాయి. లొకేషన్స్ ని సెర్బియాలో చీట్ చేశారు. టెక్నికల్ గా వండర్ గా వున్న ఈ వార్ మూవీ, కళా పరంగా అంత బలంగా లేదు.  

చివరికేమిటి 
     ఫస్టాఫ్ ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల దాడి, మయన్మార్ లో మేజర్ విహాన్ ప్రతి దాడులతో ప్రారంభమవుతుంది. ఇది 2015 లో జరిగిన నిజ సంఘటనే. సర్జికల్ స్ట్రయికే. కానీ అప్పట్లో దీన్ని వెలుగులోకి తేలేదు ప్రభుత్వం. అయితే  2016 లో పాక్ మీద సర్జికల్ దాడికి ప్రభుత్వానికి ఇదే స్ఫూర్తి నిచ్చింది వాస్తవానికి. కానీ సినిమాలో ఇంకేవేవో ఆప్షన్స్ మాట్లాడుకుంటారు ప్రభుత్వ పెద్దలు. చివరికి సర్జికల్ దాడినే నిర్ణయిస్తారు. అనవసర డ్రామా. ఈ నిర్ణయించినప్పుడు, పాక్ కి తెలియకుండా రహస్యంగా జరపాలనుకుంటారు. దాడి తర్వాత పాక్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వుంటుందనీ, చెప్పుకుంటే తాము టెర్రరిస్టుల్ని పోషిస్తున్నట్టు చెప్పుకోవడమే అవుతుందనీ సంతృప్తి పడతారు. కానీ అటు పాక్ లో క్షేత్ర స్థాయి పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలనుకోరు. 

           వాస్తవంలోనైతే  ప్రభుత్వం ఈ దాడికి అనుమతించే ముందు యూరీ ఘటన నేపధ్యంలో సరిహద్దులో పాక్ ఎంత అప్రమత్తంగా వుంటుంది, టెర్రరిస్టు క్యాంపులు లేకుండా ఎంత జాగ్రత్తపడుతుందీ వగైరా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. అప్పుడే జాగ్రత్తగా ప్లాను చేసి మెరుపు దాడి జరిపింది. సినిమాలో ఆషామాషీగా వుంది. శాటిలైట్ ఛాయాచిత్రాలతో లాంచింగ్ ప్యాడ్స్ (టెర్రరిస్టుల క్యాంపులు) ఉనికినీ, నాల్గు డ్రోన్స్ తో అక్కడి దృశ్యాలనీ సేకరించి ప్లానింగ్ చేసేస్తారు. బలాబలాల సమీకరణ లేదు. అవతలి బలమెంతో ప్రేక్షకులకి చూపించాలనుకోరు. ఏకపక్ష ఆపరేషన్ తో ఏం మజా వస్తుంది. 

          అవతలి పక్షం ఒక సీను చూపిస్తారు  - ఐఎస్సై, మిలిటరీ,  ప్రధాని - ఇండియాని తేలికగా తీసుకుంటారు. వాళ్ళేం చేస్తారు, నాల్రోజులు క్రికెట్ ని, ఫిలిం స్టార్స్ ని బ్యాన్ చేసి ఆ తర్వాత మర్చిపోతారని నవ్వుకుంటారు. నిజమా? అవతల మైండ్ సెట్స్ ఏమిటో రీసెర్చి చేశారా? లేక ఇలా మన మైండ్ సెట్ ని బయట పెట్టుకున్నారా? సెన్సార్ లో వుండాల్సిన సీను కాదిది. చాలా యుద్ధ, టెర్రర్ సినిమాల్లో ఇదే పరిస్థితి - సొంత బలహీనతలనే బయటపెట్టుకోవడం. 

          సర్జికల్ దాడి గురించి వార్తల్లో వచ్చింది వచ్చినట్టు చూపిస్తే సినిమా ఎలా అవుతుంది. అవతలి పక్షాన్ని కామెడీ చేసి ఏకపక్ష - వన్ వే కథనం చేస్తే డాక్యుమెంటరీయే అవుతుంది. యూరీ ఘటనకి తన మీద సర్జికల్ దాడి జరిపించుకున్న పాక్ నిజంగా ఏమీ చేస్తూ కూర్చోలేదా? అవతల వాళ్ళేం చేస్తూ కూడా విఫలమయ్యారో రీసెర్చి చేసి వుంటే, ఈ కథ ఓ కథగా బలాన్ని సంతరించుకునేది. 

          బిన్ లాడెన్ ని చంపిన కథతో తీసిన ‘జీరో డార్క్ థర్టీ’ - మీడియా కూడా చేయని రీసెర్చి చేసి ఆ రాత్రి బిన్ లాడెన్ వైపు కూడా ఏం జరుగుతోందో చూపించారు. పైగా మీడియాకి  తెలీని సీఐఎ గూఢచారిణి కూడా కీలక పాత్ర పోషించిందని రీసెర్చి లో తెలుసుకుని, ఆ పాత్రని కూడా  సృష్టించారు. కథగా రక్తి కట్టించడానికి ఏం తగ్గిందో తెల్సుకుని దాన్ని పొందు పర్చాల్సిందే. ఈ సినిమాలో అవతలి పక్షపు ఈ విలనీయే  మొత్తం తగ్గిపోయింది.

    పాకిస్తాన్ వాళ్ళేదో కనుక్కుని అడ్డుకున్నట్టు ఒక సీను చూపిస్తారు. నిజానికి ఇటు వైపు ఇండియన్ దళం హెలికాప్టర్స్ లో వెళ్లి దాడి చేయడానికి సిద్ధమవుతూ వుంటారు. దాని కనుగుణంగా హెలీకాప్టర్స్ కి పాక్ రంగులు వేసేస్తారు. ఈ ఛాయా చిత్రాలు పాక్ మిలిటరీకి అంది అప్రమత్తమై పోతారు. దీంతో ఇండియన్ ప్లాను కుప్పకూల్తుంది. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ టూ కి ఒక విషమ ఘట్టం అవసరమే. కానీ ఇది కాన్సెప్ట్ నే దెబ్బతీసింది. 

          వాస్తవంలో ఇండియా కాప్టర్ స్ట్రయిక్ ని ప్లాన్ చేయలేదు. వాస్తవాధీన రేఖ దగ్గర దళాల్ని ఏర్ డ్రాప్ చేసి  కాలి నడకన పంపించడాన్నే ప్లాన్ చేసి, తుచ తప్పకుండా అమలు చేశారు. హెలీకాప్టర్స్ తో క్రాస్ చేస్తే దొరికిపోయి యుద్ధానికే దారి తీస్తుంది. గుట్టు రట్టు కానివ్వలేదు. కాలినడకన జొరబడి నైట్ విజన్ రెయిడ్ నే ప్లాన్ చేసి షాకిచ్చారు. వాళ్లకి తెలిసేలోగా చంపి వచ్చేశారు. వాళ్ళు తెల్లారి తెలుసుకుని లబోదిబో మన్నారు. సర్జికల్ స్ట్రయిక్ అంటే, దొడ్డి దారిన ఇంట్లోకి వెళ్లి, నిద్రపోతున్న వాణ్ని లేపి, లెంపకాయ కొట్టి పారిపోయి రావడమే. ఇంట్లో వున్న వాడికి ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో అర్ధంగాక పోవడమే. 

          సినిమాలో అల్లరి చేసుకుంటూ వెళ్తారు. టెర్రరిస్టుల క్యాంపుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా గట్టిగా బూట్ల చప్పుడుతో పరిగెడుతూ, చప్పుడయ్యేలా గేట్లూ తలుపులూ తీసుకుంటూ, సామాన్లు పడేసుకుంటూ వెళ్తారు.  టెర్రరిస్టులు నిద్ర లేవరా? ఈ కాన్సెప్ట్ ఉద్దేశమే సైలెంట్ ఆపరేషన్ కదా? బయల్దేరుతున్నప్పుడు మేజర్ విహానే అంటాడు -  మనం stealthy గా (దొంగ చాటుగా) silent గా వెళ్ళాలని. ఇది ముందుగా  కాప్టర్ దాడి ప్లాన్ చేసినప్పుడు అంటాడు. కాప్టర్ తో stealthy గా, silent గా ఎలా వెళ్తారు. ఆ ప్లాన్ ఫెయిలయ్యింది. ఇప్పుడైనా కాలి నడకన అలా వెళ్ళాలిగా?

          చాలా పాత జేమ్స్ కోబర్న్ నటించిన ‘స్కై రైడర్స్’  (1976) వుంది. ఏథెన్స్ లో ఒక టెర్రర్ గ్రూపు కొండ మీద గృహంలో బందీలుగా పట్టుకున్న ఒకావిణ్ణి, ఆవిడ పిల్లల్నీ విడిపించడానికి జేమ్స్ కోబర్న్ తన దళంతో చేసే సైలెంట్ ఆపరేషన్ ఇది. ఆ గృహంలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నప్పుడు, ఆకాశంలో ఎగురుతున్న డేగల్ని చూసి ఐడియా వస్తుంది. ఇక అలా డేగల్లా ఎగిరే హేంగ్ గ్లయిడర్స్  తయారు చేసుకుని, సైలెంట్ గా ఎగురుతూ వెళ్లి ఆ కొండ మీద గృహం మీద వాలతారు. అక్కడ్నించీ ఏమాత్రం చడీ చప్పుడు చెయ్యని అత్యంత సునిశిత సైలెంట్ ఆపరేషనే. ఎక్కడ ఏ శబ్దమవుతుందోనని గుండెలుగ్గ బట్టుకుని చూడాల్సిన ఆందోళనకర డ్రామా...

          రాజశేఖర్ మలయాళ రీమేక్ ‘మగాడు’ (1990) లో కిడ్నాప్ డ్రామా కూడా ఇలాంటిదే. నీటుగా సాగే టెక్నికల్ ఆపరేషన్. సూపర్ హిట్టయింది. 

          ‘యూరీ’ లో నీ ఇంట్లో జొరబడి నిన్ను చంపి వస్తామంటూ అల్లరి చేసుకుంటూ వెళ్తే ఎలా. పైగా చంపాకా, అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్ని బ్లాస్ట్ చేస్తారు. దానివల్ల ఏం లాభం. అప్పటికే తమ ముఖాలు రికార్డయి పోయి వుంటాయిగా. అది సాక్ష్య మిచ్చేసినట్టేగా. ఆ వీడియోలు పట్టుకుని పాక్ నానా గొడవ చేస్తే? సర్జికల్ ఆపరేషన్ కాన్సెప్ట్ కీ, చూపిస్తున్నదానికీ పొంతనే  లేదు. 

          హెలికాప్టర్స్ కి రంగులేసి వెళ్ళాలనుకునే ప్లానే తప్పయితే, పాక్ కి తెలిసిపోయినట్టు ప్లాట్ పాయింట్ టూ ట్విస్ట్ ఇవ్వడం ఇంకా తప్పు. పాక్ కి తెలిసిపోయాక ఇంకా సర్జికల్ స్ట్రయిక్ ఏమిటి. అలాగే ముందుకెళ్తే ఇక ఎస్కలేషనే. యుద్ధమే. కానీ అలాగే వెళ్తారు. ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ ఆపెయ్యమంటే, మేజర్ విహాన్ కాలినడకనే సరిహద్దు దాటి పూర్తి చేసి వస్తామంటాడు. ఇలా హీరోయిజాన్ని పెంచామనుకున్నారు. వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసింది కాలినడకన రహస్యంగా దాటాలనే. ప్రభుత్వం ఎప్పుడూ కరెక్టే. సినిమాలే ఇలా వుంటున్నాయి. ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించినట్టు మళ్ళీ అక్కడికే వచ్చింది కథ. అయితే ఇప్పుడు పాక్ కి తెలిసిపోయిన నేపధ్యంలో తెగించి కాలి నడకన వెళ్తున్నారు. పాక్ అప్రమత్తమైనట్టు చూపించి ఎలా వెళ్తారు. రంగులేసిన హెలీకాప్టర్స్ ఫోటోలు చూసి పాకీయులు అప్రమత్తమైన ఆ ఒక్క సీను చూపించి  వదిలేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోయారో ఏమో, ఇటు కాలినడకన దూరిపోయారు! 

      మూడు స్థావరాల మీద ఏక పక్ష యాక్షన్ తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. చివరికి దొరుకుతాడు యూరీ దాడిని ప్లాన్ చేసిన ఇద్రిస్ ఖాన్ ( అబ్రార్ జహూర్). ఇతన్నీ చంపి కక్ష తీర్చుకుంటాడు. ఇక్కడే అసలు పాయింటు వుంది. ఈ పాయింటు ఇంత సేపూ మరుగున పడి కథలో జోష్ ని చంపేసింది. యూరీ దాడికి టెర్రరిస్టు నాయకుండు ఇద్రిస్ ఖాన్ కారకుడైనప్పుడు,  యూరీ దాడికి ముందే అతణ్ణి విలన్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులకి కచ్చి పుట్టించాలి. ఇరవై మంది సైనికుల్ని చంపిన వాణ్ని అప్పుడే చూపించి ప్రేక్షకులతో హాహాకారాలు రేపకుండా, దాచివుంచి, ఎండ్ సస్పెన్స్ కథనం చేసి, చివరికి పట్టుకుని వీడే ఇద్రిస్ అంటే, అప్పటికి భావావేశాలేముంటాయి ప్రేక్షకులకి. 

          రెండోది యూరీ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతోనే విహాన్ ఈ ఆపరేషన్ చేపట్టాడన్న అర్ధంలో చూపించారు. బావ చనిపోకపోతే చేపట్టే వాడు కాదా? వ్యక్తిగత నష్టం జరిగితేనే సైనికుడు దేశం కోసం పోరాడతాడా? మాఫియా కథలూ సైన్యం కథలూ ఒకటేనా? ఇంతకీ ఇద్రిస్ ని చంపింది  బావ చావుకి ప్రతీకారంగానా,  అమరులైన తోటి సైనికుల ఆత్మ శాంతికా? వ్యక్తిగతమా, దేశ హితమా?

          ఇలా తనకు తానే చిక్కుముళ్ళేసుకున్నాడు దర్శకుడు. ఇక క్లయిమాక్స్ లో పాక్ పోలీసులకి తెలిసిపోయి వెంటపడతారు. పాక్ సైన్యం కూడా హెలీకాప్టర్ తో ఛేజ్. దీన్ని అడ్డుకోవడానికి నియంత్రణ రేఖ దాటి వచ్చేసి ఫైరింగ్ జరుపుతుంది ఇండియన్ కాప్టర్! అంతా గందరగోళపు గజిబిజి కథనం. మరి ఇండియన్ కాప్టర్ పాక్ కాప్టర్ ని కూల్చెయ్యను కూడా కూల్చెయ్యదు. వెనక్కి వచ్చేస్తుంది. అంత ఫైరింగ్ లోనూ చిన్న దెబ్బ తగలకుండా వచ్చేస్తారు విహాన్ దళం. ఇంత రచ్చ అయినా కిమ్మనకుండా వుంటుంది పాక్. సర్జికల్ స్ట్రయిక్ అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ తో మెరుపు దాడి చేసి రావడమా, రచ్చ చేసుకోవడమా? యుద్ధ వ్యూహనికే వ్యతిరేకమైన యాక్షన్ సీన్లతో నమ్మిస్తే సరిపోతుందా? మూడొందల కోట్లు వసూలు చేసిందంటే, సైన్యం గురించి ఏం చూపించి వసూలు చేశారో తెలుసుకోవడానికే ఈ రివ్యూ. 

          బిన్ లాడెన్ ని చంపుతున్నప్పుడు, కమాండో రాబర్ట్ ఓ నీల్ హెల్మెట్ కెమెరా ద్వారా ప్రసారమవుతున్న విజువల్స్ ని, వైట్ హౌస్ సిట్యుయేషన్ రూంలో కూర్చుని, ప్రెసిడెంట్ ఒబామా ప్రభృతులు ప్రత్యక్షంగా చూశారు. సర్జికల్ ఆపరేషన్ ని కూడా కమాండోల హెల్మెట్ కెమెరాల ద్వారా, డ్రోన్ ద్వారా, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ లు ప్రత్యక్షంగా చూశారు. 

          సినిమాలో హోం మంత్రి, రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారూ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, ఉద్రిక్తంగా చేతులు నలుపుకుంటూ గడుపుతూంటారు. 

          ఇలా 
హోష్ లేని జోష్ సోషల్ మీడియా జనరేషన్ కి జబర్దస్త్  జోషేమో !!

సికిందర్
Watched at PVR, Errum manzil
6.30 pm, Feb 24, 2019
  telugurajyam.com