రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

5, మార్చి 2019, మంగళవారం

795 : సందేహాలు - సమాధానాలు



Q :  సీన్ స్ట్రక్చర్ (యాక్షన్ – రియాక్షన్) గురించి వివరిస్తారా?
Hare e Sh, AD Hare
A :  సీన్ స్ట్రక్చర్ గురించి వివరించాలంటే చాలా వుంటుంది. బ్లాగులోనే ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాల్లో సవివరంగా వుంది.  సీన్లు అన్నిటినీ ఒకే గాటన కట్టి వివరించలేం. బిగినింగ్ లో వుండే సీన్ల సీనిక్ బిజినెస్ ఒక ఉద్దేశంతో వుంటే, మిడిల్ లో వచ్చే సీన్ల సీనిక్ బిజినెస్ మరో ఉద్దేశంతో  వుంటుంది. అలాగే ఎండ్ లో సీనిక్  బిజినెస్ ఇంకో ఉద్దేశంతో  వుంటుంది. అన్నిటి స్ట్రక్చర్ ఒకటే. స్ట్రక్చర్ లోపల జరిగే వాటి బిజినెస్సులు అంకాల వారీగా వేర్వేరు. స్క్రీన్ ప్లే మొత్తానికి త్రీ యాక్ట్స్ (బిగినింగ్ - మిడిల్ - ఎండ్ అంకాలు) ఎలా వుంటాయో ప్రతీ సీనుకీ అలా అంకాలు వుంటాయి. ప్రతీ సీనూ అందులోని విషయంతో బిగినింగ్ తో మొదలై, మిడిల్ తో నడిచి, ఎండ్ తో ముగుస్తుంది. ఏ సీను అయినా ఎక్కడ్నించి వస్తుంది? సీను విడిగా ఎక్కడ్నించీ పుట్టుకు రాదు. సీనుకి విడిగా అస్తిత్వం లేదు. ఏ సీనైనా ఒక సీక్వెన్స్ లో భాగంగా పుట్టి బతకాల్సిందే. ప్రతి సినిమా కథలో ఎనిమిది  సీక్వెన్సు లుంటాయి. కొన్ని సీన్లు కలిపితే  ఒక సీక్వెన్స్, ఎనిమిది  సీక్వెన్సులు కలిపితే ఒక స్క్రీన్ ప్లే. ముందుగా సీక్వెన్స్ అంటే ఏమిటో అర్ధం జేసుకుంటే, దాని లోపల సీన్ల కర్తవ్యమేమిటో బోధపడుతుంది.

         
ఏ సినిమా కథకైనా – అదెంత అట్టర్ ఫ్లాప్  సిగ్రేడ్ సినిమా అయినా, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేల్లో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లోనే సీక్వెన్సులు లేని బలహీన కథ అల్లారు. ఈ సినిమా మొత్తం మీద రెండే రెండు సీక్వెన్సు లుంటాయి. ఫస్టాఫ్ అంతా ఒకే సీక్వెన్స్, సెకెండాఫ్ అంతా కలిపి ఒకే సీక్వెన్స్! స్ట్రక్చర్ ని నిర్లక్ష్యం చేస్తే ఇంతే జరుగుతుంది. ఏ  సినిమా కథనైనా నిలబెట్టేవి ఎనిమిది సీక్వెన్సులు. బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు చొప్పున వుంటాయి (పటం చూడండి). 

 కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీలా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి. మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన వాస్తవ్లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా ఆ సిను తాలూకు స్ట్రక్చర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ లు స్పష్టంగా వుంటాయి.

          స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు
, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ. ఇదీ స్టాండర్డ్ స్క్రీన్ ప్లేల్లో జరిగే తంతు. 

          ఈ సీన్లు, సీక్వెన్సుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఏ సీనైనా ఈ రెండు ఉద్దేశాల్లో ఒక ఉద్దేశంతో వుంటుంది : పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో. ఇది ఆ సీనులో త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో జరుగుతుంది. ఒకసారి యూట్యూబ్ లో ‘జస్టిస్ చౌదరి’ క్లిక్ చేసి, 51.25 నుంచి 53.39 వరకూ రెండు నిమిషాల సీను చూడండి. ఈ సీనులో జస్టిస్ చౌదరిగా ఎన్టీఆర్, పాపారావుగా సత్యనారాయణ వుంటారు. 

          చౌదరి : ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? (1)
          పాపారావు : మా అమ్మ ముగ్గురు బిడ్డల్ని కన్నది. పెద్దవాడు ఇప్పుడు మీముందున్న నేను. రెండో వాడు రెండేళ్ళ  క్రితం మీరు లాయర్ గా వున్నప్పుడు మీ చలవ వల్ల ఉరికంబం ఎక్కాడు. మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను. (2)
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ! (3)
          పాపారావు : నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...(4)
          చౌదరి :  గెటవుట్! ఐ సే గెటవుట్!! (5) (pp – 1, end of beginning)
middle
          మళ్ళీ చౌదరి :  నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్!! (6)
          పాపారావు :  మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...(7 )
          చౌదరి : ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి! (8)
          పాపారావు : చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు! (9) (pp- 2, end of middle)
end
          చౌదరి : మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్!! (10 )
          పాపారావు : ఆల్ రైట్. (11 )
***
      ఈ పై సీనుని విశ్లేషిస్తే, ఇందులో మొదటి 5 సంభాషణలు బిగినింగ్, తర్వాతి 4 సంభాషణలు మిడిల్, మిగిలిన 2 సంభాషణలు ఎండ్ లుగా వున్నాయి.  బిగినింగ్ బిజినెస్ అంటే పాత్రల పరిచయం, నేపధ్య వాతావరణం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటూ (ప్లాట్ పాయింట్ వన్) అని కదా? 

          బిగినింగ్ లో ఈ  5 సంభాషణలతో ఇవెలా జరిగాయో చూద్దాం. ఈ సీనుకొచ్చేసరికి జస్టిస్ చౌదరి పాత్ర మనకూ పాపారావుకీ తెలిసిందే. పాపారావు తనని చౌదరికి పరిచయం చేసుకున్నాడు రెండో సంభాషణతో. పాత్రల పరిచయాలు ముగిశాయి. నేపధ్య వాతవరణం తెలుస్తూనే వుంది- న్యాయాన్ని కొనడానికొచ్చిన వాతావరణం. ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన చూస్తే - పాపారావు పరిచయ డైలాగులోనే – ‘మూడవ వాడు నా ముద్దుల తమ్ముణ్ణి  మీ అబ్బాయి ఇన్స్ పెక్టర్ రాజా ఖూనీ కేసులో అరెస్టు చేశాడు. అంతే కాదు, రేపోమాపో ఆ కేసు విచారణకు రాబోతోంది. ఆ శుభ సందర్భంలోనే మీతో మాట్లాడడానికి వచ్చాను’ అనడంతో ప్రారంభమైంది.

          ఈ ప్రారంభం ఇలా కొనసాగింది -  3 వ డైలాగుతో చౌదరి : ‘మిస్టర్ పాపారావ్, నువ్వెందుకొచ్చావో చెప్పు. కమాన్ టెల్మీ!’ అని గద్దించడంతో,  4 వ డైలాగుతో పాపారావు -  ‘నాకు మిగిలింది ఆ మూడో తమ్ముడు. చేసింది నేరమే అయినా, మీరు నిర్దోషియని తీర్పు చెప్పి...’  అనడంతో పరిస్థితి తీవ్రమైంది. కేసు విషయంలో పాపారావు ప్రలోభ పెట్టడానికి వచ్చాడని స్పష్టమైంది. ఇలా చౌదరికీ, పాపారావుకీ మధ్య సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన 2 వ డైలాగుతో మొదలై, 4 వ డైలాగుతో ముగిసింది. 

          దీనికి మండిపోయి చౌదరి – ‘గెటవుట్, ఐ సే గెటవుట్’  అని 5వ డైలాగు పేల్చడంతో సమస్య ఏర్పాటై పోయి, బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న గోల్ ఏర్పడింది ప్రధాన పాత్రయిన చౌదరికి.

          ఇప్పుడు మిడిల్ చూద్దాం. మిడిల్ అంటే తలెత్తిన సమస్యతో రెండు పాత్రల యాక్షన్ రియాక్షన్ల సీన్లే కాబట్టి, ఇక్కడ సమస్యేమిటో చెప్పి గోల్ ఏర్పాటు చేసిన నేపధ్యంలో మిడిల్ ఇలా నడిచింది – 6 వ సీనుతో చౌదరి సమస్యని డీల్ చేసే గోల్ తో అన్నాడు - ‘నా సంగతి తెలుసుకోకుండా నా ఇంటికి వచ్చావ్. జస్టిస్ అనే పదానికి విలువ తెలియకుండానే ఇంతవరకూ మాట్లాడావ్. ఈసారికి మన్నిస్తున్నాను. నౌ గెటవుట్’  అని. ఇది యాక్షన్ తీసుకోవడం.  

          దీనికి  7 వ డైలాగులో  పాపారావు - ‘మిస్టర్ చౌదరీ, తొందరపడకండి. నేనడిగింది మీ చేతిలో వున్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాటంటే...’ అనడం రియాక్షన్ చూపడం.  

          దీనికి 8 వ డైలాగులో  చౌదరి – ‘ఆపరా! న్యాయం అనేది ఎవరి చేతిలో కీలుబొమ్మ కాదు ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి. న్యాయమనేది ఏ ఒక్కరి స్వార్జితం కాదు ఇష్టమొచినట్టు అమ్ము కోవడానికి. న్యాయమనేది మార్కెట్టులో అమ్మజూపే సరుకు కాదు ఖరీదిచ్చి కొనుక్కోవడానికి. న్యాయమనేది నీ అమ్మ కన్న బిడ్డ కాదు నువ్వు చెప్పినట్టు వినడానికి’ అనడం మరో యాక్షన్ తీసుకోవడం. 

          దీనికి 9 వ డైలాగుతో పాపారావు  - ‘చూడు మిస్టర్ చౌదరీ, త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అనడం మరో రియాక్షన్ చూపడం. 

         
మిడిల్లో యాక్షన్ రియాక్షన్లు పోనుపోను సీరియస్ అయి మిడిల్ బిజినెస్ ని కొలిక్కి తెస్తాయి కదా? అలా ఇక్కడ పాపారావు మాటలతో కొలిక్కి వచ్చింది. రావడమే కాకుండా ‘చూడు మిస్టర్ చౌదరీ’ అంటూ అతను ఏకవచన సంబోధనకి మారడం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాడని తెలుపుతోంది. తగ్గివున్న ప్రత్యర్ధి కోరలు చూపిస్తున్నాడు. మిడిల్ చివరి సీను ప్రత్యర్ధి చేతిలో వుండాలని రూలు కదా? 

          ప్రధాన పాత్ర చౌదరి వైపు నుంచి చూస్తే, అతను పతనా వస్థకి చేరాడు పాపారావు రియాక్షన్ తో. ‘చూడు మిస్టర్ చౌదరీ’ అని జస్టిస్ అయిన తనని అనడం ముమ్మాటికీ తలవొంపే. పైగా ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’ అని తన షరతులు విధిస్తున్నాడు. ‘ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది. నాకనుకూలంగా తీర్పు ఇచ్చి తీర్తారు’  అని పరోక్షంగా అల్టిమేటం ఇస్తున్నాడు. 

          ఇంతకంటే దీనావస్థ లేదు చౌదరికి. మిడిల్ ముగింపు సీనుతో ప్లాట్ పాయింట్ టూ ఏర్పడినప్పుడు, అది ప్రధాన పాత్రని పతనావస్థకి చేర్చే సీనుగా వుండాలని రూలు కదా?  ప్లాట్ పాయింట్ వన్, ప్లాట్ పాయింట్ టూలు ఎదురెదురు అద్దాలుగానే వుంటాయిగా? ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ఏర్పడితే, ప్లాట్ పాయింట్ టూ దగ్గర ఆ గోల్ గల్లంతై కన్పిస్తుంది  కదా? ఇదే కదా పాయింట్ వన్ కీ, ప్లాట్ పాయింట్ టూకీ మధ్య వుండే మిడిల్లో జరిగే యాక్షన్ రియాక్షన్ల బిజినెస్? 

          ఈ మిడిల్ బిజినెస్ లో జస్టిస్ చౌదరి గోల్ ప్లాంట్ టూ దగ్గర గల్లంతైంది. ప్రత్యర్ధి పాపారావుది పై చేయి అయింది. 

          ఇక ఎండ్ - ఎండ్ అంటే ప్లాట్ పాయింటూలో కుంగి పోయిన స్థితి నుంచి ప్రధాన పాత్ర పైకి లేవడం కదా? లేచి దెబ్బ కొట్టడం కదా పట్టు వదలని గోల్ కోసం?  ఎండ్ విభాగంలో ఇక యాక్షన్ రియాక్షన్ల కథనం వుండదు. పైచేయి ప్రధాన పాత్రదే, పారిపోవడం ప్రత్యర్ధి పనే. 

          ఈ విధంగా ఇప్పుడు 10 వ డైలాగుతో చౌదరి -  ‘మిస్టర్ పాపారావ్, నొసట రాత రాసే ఆ భగవంతుడు ఏ భక్తుడి ప్రార్ధనకో లొంగిపోయి తను రాసిన రాత మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ...ఈ జస్టిస్ చౌదరి తను న్యాయం అనుకున్న తీర్పును ఎవరి కోసంగానీ మార్చి రాయడు. ఆ భగవంతుడే దిగి వచ్చినా సరే. అండర్ స్టాండ్? నౌ గెటవుట్’
          పాపారావు నోర్మూసుకుని ‘ఆల్ రైట్’ అని గెటవుటై పోవడం.
***
      ఇదీ సీను స్ట్రక్చర్. మరి సీను ధర్మం పాత్ర గురించి కొత్త విషయాన్ని తెలియజెప్పడమో, లేదా కథని ముందుకి నడిపించే సమాచారమివ్వడమో  అయివుండాలని చెప్పుకున్నాం కదా? మరి పై సీనులో ఏది జరిగింది?  మిడిల్ 9 వ డైలాగులో పాపారావు - ‘త్వరలోనే ఒక మనిషి వచ్చి నిన్ను అడగడం జరుగుతుంది’  అనడం ద్వారా కథని ముందుకి నడిపించే సమాచారమిచ్చారు. చౌదరిని ఎవరో కలుస్తారన్న మాట? ఎవరు? ఆ వచ్చే వ్యక్తి అడిగితే చౌదరి నిర్ణయం మార్చుకుంటాడన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు కూడా పాపారావు. ఇలా రాబోయే సీన్లలో ఏం జరగబోతోందన్న సస్పన్స్ ని సృష్టిస్తూ, కథని ముందుకు నడిపించే సమాచార మిచ్చారు. 

          సీనుకి స్ట్రక్చర్ వల్ల డ్రామా పండుతుంది. స్ట్రక్చర్ లేకపోతే డ్రామా పండదు, మండదు, మొండికేస్తుంది. సీనుకి స్ట్రక్చర్ వల్ల పాత్ర చిత్రణలు సవ్యంగా వుంటాయి. సీనుకి స్ట్రక్చర్ వల్ల సీక్వెన్సు స్ట్రక్చర్ లో వుంటుంది. సీక్వెన్సులకి స్ట్రక్చర్ వల్ల యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుంటాయి. యాక్ట్స్ కి స్ట్రక్చర్ వల్ల  మొత్తం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తో బలంగా వుంటుంది.

          ఇంకో సూక్షం కూడా అర్ధం చేసుకోవాలి. అసలు స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ ఎక్కడ పుడుతుంది? మొట్ట మొదట కథకి అనుకునే అయిడియాలో పుడుతుంది. ఆ కథ తాలూకు రెండు మూడు వాక్యాల ఐడియాలో బిగినింగ్ మిడిల్ ఎండ్ స్ట్రక్చర్ లేకపోతే, ఇక దేనికీ స్ట్రక్చర్ వుండదు. ఆ కథకి సంబంధించిన అయిడియాలో ఎలా బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలుగా కథ కుదురుకుందో, అదే కూర్పు సినాప్సిస్, వన్ లైన్ ఆర్డర్, సీక్వెన్స్ , ట్రీట్ మెంట్, చివరికి డైలాగ్ వెర్షన్ - ఈ  ఐదు అంచెల ప్రక్రియల్లో ప్రస్ఫుట మవ్వాలి. డైలాగ్ వెర్షన్ అంటే సీన్లు క్రియేట్ చేయడమే. ఈ సీన్లు ఐడియా స్ట్రక్చర్ కి లోబడి అదే స్ట్రక్చర్ లో వున్నప్పుడే తెరమీద స్క్రీన్ ప్లేకి చైతన్యం వస్తుంది.

సికిందర్