రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, July 10, 2018

661 : స్క్రీన్ ప్లే సంగతులు - 2


        స్టాఫ్ ప్రధాన కథ -1 : ఆత్మ కథ రాయించుకున్న సంజు ఆ పుస్తకంలో మహాత్మా గాంధీతో తనని పోలుస్తూ రాసినందుకు రచయితని హేళన చేసి పంపించేస్తాడు. అంతలో సుప్రీం కోర్టులో తీర్పు వెలువడుతుంది. 2006 లో టాడా కోర్టు సంజుకి విధించిన ఐదేళ్ళ కారాగార శిక్ష ని సుప్రీంకోర్టు ఖరారు చేస్తూ, నెల రోజుల్లోగా లొంగిపోవాలని ఉత్తర్వు లిస్తుంది. దీంతో సంజు నీరుగారి పోతాడు. ఈ వార్త టీవీలో వస్తూంటే పిల్లలు చూస్తారు. దీంతో జైలుకెళ్ళే తన వల్ల పిల్లల జీవితాలు  పాడవకూడదని ఆత్మహత్య చేసుకోబోతాడు. భార్య మాన్యత అడ్డుకుని పిల్లలు ఎదుర్కొనే సమస్య ఇలా తీరదని, వేరే రచయిత చేత ఆత్మ కథ రాయించి నిజాలు వెల్లడించాల్సిందేనని అంటుంది. దీనికి లండన్ రచయిత్రి విన్నీ డయాజ్ ని పిలిపిస్తారు.ఆమె సంజు జీవితం చూసి రాయనని అనేస్తుంది. కానీ రాస్తున్నట్టు పేపర్లో వార్త వస్తుంది. అది బిల్డర్ మిస్త్రీ చూసి, విన్నీని కలుసుకుంటాడు. సంజు ఆత్మకథ రాయవద్దంటూ హెచ్చరిస్తాడు. ఇతనిలా ఎందుకంటున్నాడని విన్నీ సంజుని అడిగితే, ఒకప్పటి తన మిత్రుడు మిస్త్రీ తో తన కథ చెప్పడం మొదలెడతాడు సంజు.

          పాయింట్ : మొదటిసారి రాయించిన ఆత్మ కథతో స్క్రీన్ ప్లే ప్రారంభం బోలుగా అన్పిస్తుంది. ఆ పూట సుప్రీం కోర్టుతీర్పు వెలువడబోతోంది. అలాంటప్పుడు దేశమంతా దీని మీదే దృష్టిపెడుతుంది సహజంగా. ఛానెళ్ళు కూడా సుప్రీం కోర్టు దగ్గర మకాం వేసి వుంటాయి. కనుక ఒకవైపు తన జీవితాన్ని మార్చేసే అంతిమ తీర్పు వెలువడుతూంటే, సంజు ప్రాణాలుగ్గట్టుకుని టీవీకి అతుక్కుపోవాలి నిజానికి. ఇలా కాక,  రాయించిన ఆత్మకథే దో పట్టుకుని కామెడీతో కాలక్షేపం చేయడం కాదు. అలా గనుక ఆత్మకథ  రాయించాలనుకుంటే, తీర్పు వచ్చేదాకా ఆగి, తీర్పుని బట్టి రాయించుకోవాలి. సినిమాలో ఈ సీన్ ఎలా వుంటుందంటే, ఆ పూట అంత ప్రధాన తీర్పు, అదీ సుప్రీం కోర్టు నుంచి  రాబోతోందని పాత్రలు వేటికీ తెలియనట్టే వుంటుంది! 

     స్క్రీన్ ప్లే ఆదిలోనే ఇంత పెద్ద గోతి. ఇలా పేలవమైన ప్రారంభంతో కాకుండా,  సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతున్న సందర్భంగా హడావిడీ, ఆందోళనలతో ప్రారంభించి వుంటే టేకాఫ్ బలంగా, సస్పెన్స్ తో  వుండేది. ఆ తీర్పు పిల్లలు వినడం, సంజు ఖిన్నుడై ఆత్మ హత్య చేసుకోబోవడం, అప్పుడు భార్య ఆపి – ఆత్మకథ రాయించడాని ప్రేరేపించడం జరిగివుంటే అర్ధవంతంగా వుండేది.

       బయోపిక్స్ ని పాత్ర స్వగతంతో ప్రారంభించడం కాలం చెల్లిపోయిన బలహీన కథనం. ‘ఇది నా జీవితం...నేనిలా వున్నాను...నాకేం జరిగిందంటే...’ అనేలాంటి స్వగతంతో ‘సంజు’ ని ప్రారంభించడం ఇలాటి కథనమే. బయోపిక్స్ ప్రారంభం కూడా సంఘటనతోనే వుండాలి. ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పు ఒక  బలమైన సంఘటన. ఈ బలమైన సంఘటనతో ప్రారంభించి వుంటే, అందుకోవడం అందుకోవడమే కథనం మంచి డైనమిక్స్ తో – విజువల్ నేరేషన్ తో ఆసక్తికరంగా వుండేది. ఇప్పటికీ చాలా మంది అర్ధం జేసుకోనిదేమిటంటే, సినిమా మాధ్యమానికి సీనంటే, కథనమంటే, సంఘటనలే నని! సంఘటనల ద్వారా కథ చెప్పాలని! 

          ఇక్కడ ఇంకొకటి చెప్పుకోక తప్పదు. ఎప్పట్నించో సినిమాల్లో అలవాటైపోయిన ఒక ఫార్ములా చిత్రణ ఇంకా ఇక్కడ కూడా దర్శనమిస్తుంది : ఆత్మకథ రాసిన రచయిత త్రిపాఠీని కామెడీ పేరుతో నానా మాటలని,  అతడి బూటు తోనే అతణ్ణి తరిమితరిమి కొట్టబోవడం చీప్  టేస్టే. అదే ఆ రచయిత ఏ ఖాన్ సాబో అయితే, మర్యాదగా కూర్చోబెట్టుకుని, అలా కాదు ఇలాగని చర్చ చేస్తారు.  అప్పుడా ఖాన్ సాబు, తన పాండిత్యంతో అందరినోళ్ళూ మూయించేసి వహ్వా లందుకుంటాడు. పాన్ ఉమ్మేసి పోతాడు. ఇదికూడా హిందీ సినిమాల ఫార్ములానే. త్రిపాఠీల్ని తక్కువ చేయడం, ఖాన్ సాబుల్ని ఎక్కువ చేయడం. 

          సరే, ఇదలా వుంచితే, ఆత్మ కథ రాయడానికి విన్నీ అనే లండన్ రచయిత్రి వస్తుంది. ఆమె - నీ భార్యతో కాక ఇంకెంత మందితో పడుకున్నావని నేరుగా భార్య ముందే అడిగేస్తుంది. భార్య కళ్ళు తిప్పుతూ భర్త కేసి చూస్తుంది. సంజు లెక్కలేసుకుని 308 మంది అంటాడు. భార్య ఇంకో క్లోజప్ ఇస్తుంది- అయ్యో అలాగా అన్నట్టు. ఇక విన్నీ మెప్పుదలగా చిన్న స్మైల్ ఇస్తుంది. అతను దాచకుండా చెప్పేసినందుకు మెచ్చుకుని, ఇక ఇతను నిజాలే చెప్తాడనీ, తను ఆత్మకథ రాయవచ్చనీ నిర్ధారణ చేసుకుందన్న మాట. అంతేగానీ, లైంగికంగా అంత మంది అమ్మాయిల్ని వల్లో వేసుకున్న అతడి క్యారెక్టర్ పట్ల భార్యకి గానీ, ఆ రచయిత్రికి గానీ ఏ అభ్యంతరమూ లేదన్న మాట. ఈ సీన్లో భార్య పాత్ర నిజజీవిత పాత్ర. ఆమెకున్న పరిస్థితులేవో  మనకి తెలీదు. కానీ రచయిత్రి పాత్ర కల్పిత పాత్ర. కల్పిత పాత్రని కూడా బలహీనంగా  చూపించడమెందుకు? 

          ఇలా ఫస్టాఫ్ లో ప్రధాన కథ మొదటి భాగాన్ని పరిచయం చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ ని ప్రేరేపించే  సంజు ఫ్రెండ్ మిస్త్రీ ద్వారా,  ఫ్లాష్ బ్యాక్ కి తెరతీశారు.

          ఈ ప్రధాన కథ మొదటి భాగంలో సీన్లలో కథ అల్లిక గురించి తెలుసుకోవాలి. తెలుగు సినిమాల్లో ఇప్పుడు సీన్లలో కథ అల్లిక వుండడం లేదు. సీన్లలో కథ కనపడదు. విడి విడి పది సీన్లు కలిపి అతుకులేస్తే – అప్పుడుగానీ – ఎప్పుడో గానీ -  అవన్నీ కలిపి చూసుకుంటే గానీ కనపడదు కథ! 

          ఒకప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలు చూసి, ‘భలేగా కుట్టాడ్రా’ అని చెప్పుకునే వాళ్ళట. కుట్టడమేంట్రా అని ఆలోచించి, వాళ్ళు ఎడిటింగ్ గురించి అలా మాట్లాడుకుంటున్నారని సినిమా వాళ్ళు అనుకునే వాళ్లట. ఇవ్వాళ ఎడిటింగ్ కాదు, దేనిగురించీ మాట్లాడుకునే పరిజ్ఞానం లేదు - స్టార్స్  చేసే కామెడీల గురించి తప్ప.

          ఇప్పుడా కుట్టుపని కాస్తా సీన్లు రాసేప్పుడు
చేస్తున్నారు. విషయం  ఒక సీనులో ఎస్టాబ్లిష్ చేసే ఆలోచనకి దూరంగా, పది సీన్లు రాసుకుంటే గానీ కథకుడికి అంతుపట్టని కథలు తయారవుతున్నాయి. 

        పైన చెప్పుకున్న ‘సంజు’ లో ప్రారంభ దృశ్యాన్నే తీసుకుంటే,  తెలుగులో ఇలా ముక్కలు ముక్కలు చేసి కలిపి కుడతారేమో :  ‘సంజు’ స్వగతం - కట్. బాత్రూం  సంజు ఆత్మకథ పుస్తకం చదవడం -  కట్, రచయితతో కామెడీ – కట్.  సుప్రీం కోర్టు తీర్పు – కట్. పిల్లల పరిస్థితి – కట్. ఇలా దేనికది విడివిడి  సీన్లుగా తప్ప వూహించలేరు. వీటిన్నిటినీ  కలిపి కుట్లేసేస్తే అది రచనై పోతుంది. సినిమా కుంటి నడక నడుస్తోందన్న జ్ఞానం అసలే వుండదు.  

           ‘సంజు’ సీన్లలో కథని అల్లడం ఎలా వుంటుందంటే, ఒకే సీన్లో కథకి అవసరమున్న రెండు లేదా మూడు అంశాలు చెప్పేసి, ఎక్కడి కక్కడ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవడం. (ఇదే పద్ధతి కొరియన్ ‘ది క్లాసిక్’ లో  కూడా వుంటుంది)

          స్వగతం కాడ్నించీ పిల్లలు టీవీలో చూసే దాకా ‘సంజు’ లో ఒకే సమయంలో జరిగే ఒకటే సీను అదంతా! పై ఐదు అంశాలూ ఒకే సీనులో అల్లేసి,  ఇక ఇంకో ఆత్మకథా గ్రంథ రచనకి శ్రీకారం చుట్టేశారు. ఒక్క సీనుతో కథ ఎంత ముందు కెళ్ళిపోయింది!  ఇలాటి సీన్లే మరి కొన్ని వున్నాయి.

***
      ఫ్లాష్ బ్యాక్ -1: సంజుని హీరోగా పరిచయం చేస్తూ ‘రాకీ’  తీస్తూంటాడు తండ్రి సునీల్ దత్. పాట తీస్తూంటే  పక్క నుంచి సంజుకి సిగరెట్ అందిస్తూంటాడు ఫ్రెండ్ మిస్త్రీ. సునీల్ దత్ వాసన పసిగట్టి మందలిస్తాడు – దురలవాట్లని కెమెరా క్షమించదంటాడు. ఇలా తండ్రి నల్గురి ముందు చిన్నబుచ్చినందుకు సంజు నొచ్చుకుంటే, ఆ బాధ తీర్చడానికి బార్ కి తీసుకుపోతాడు మిస్త్రీ. 

          అక్కడ మద్యం, మాదక ద్రవ్యం రుచి చూపిస్తాడు. దీంతో క్రమంగా డ్రగ్స్ బానిసైపోతాడు సంజు. ఒక పక్క తల్లి నర్గీస్ క్యాన్సర్ తో వుంటుంది. మరో పక్క ప్రేమించిన రూబీతో సమస్య వుంటుంది. తల్లిని తీసుకుని చికిత్స కోసం  అమెరికా వెళ్తారు. అక్కడుండే ఇంకో ఫ్రెండ్ కమలేష్ తో కలిసి తిరిగి,  వద్దన్నా డ్రగ్స్ సేవిస్తూంటాడు సంజు. తల్లికి నయమై తీసుకొచ్చేస్తారు. వచ్చాక చూస్తే, రూబీకి  వేరే సంబంధం నిశ్చయం చేస్తాడు ఆమె తండ్రి. తట్టుకోలేక కమలేష్ ని పిలిపించుకుంటాడు సంజు.  ఇంతలో రూబీ తండ్రి చనిపోతాడు. ఇక ఎలాగో రూబీ సంజుని చేసుకునేలా  ఒప్పిస్తాడు కమలేష్.  తీరా ఆమె కలవడానికొచ్చే సరికి డ్రగ్స్ కొడుతూంటాడు సంజు. ఆమె దూషించి వెళ్ళిపోతుంది. దీంతో సంజు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. 

          ఇక చేసేది లేక, సునీల్ దత్ కి అంతా చెప్పేసి, సంజుని కాపాడుడుకోమని ప్రాధేయప డతాడు కమలేష్. అప్పుడు  సంజు డ్రగ్స్ మరిగాడన్న సంగతి కొత్తగా తెలుస్తుంది సునీల్ దత్ కి.

          పాయింట్ :  ఇక్కడ కూడా పాట షూటింగు జరిగే మొదటి సీనులోనే, టైం వేస్ట్ చేయకుండా, డ్రగ్స్ తో వుండగల ఈ ఫస్టాఫ్ ఎపిసోడ్ పాయింటంతా చెప్పేశారు. ఈ ఒక్క సీనులో కథని ముందుకి పరుగెత్తించే మూడు విషయాలు చెప్పేశారు : హీరోగా సంజు పరిచయ సినిమా షూటింగు, అందులో సిగరెట్ అందించే ఫ్రెండ్ మిస్త్రీ వున్నాడనీ,  అది చూసి తండ్రి  సునీల్ దత్ సంజుని మందలించడంతో  ఇద్దరి మధ్యా పాయింటు ఎస్టాబ్లిష్ అయిందనీ. ఒక్క సీనులో చాలా కథ చెప్పేశారు. సీను అల్లిక అంటే ఇదీ. పైగా ఫ్లాష్ బ్యాక్ లో ఈ మొదటి సీనులోనే ఈ ఎపిసోడ్ కథకి ముడి కూడా వేసేశారు. ఏమిటది? తండ్రి సిగరెట్లు తాగ వద్దంటున్నాడు. సంజు ఇప్పుడేం చేస్తాడు? ఇది ఆసక్తి రేపే ప్రశ్న. కథపట్ల కుతూహలం రేకెత్తించే పాయింటు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కథని ముడేయడం అంటే ఏమిటో తెలియడం లేదు!  చైతన్యవంతంగా కథనం ఎలా నడపాలో తెలీదు. 

          దీన్తర్వాత,  డైనమిక్స్ ఎలా వున్నాయంటే, తండ్రి వద్దన్న పనే సంజు చేస్తున్నాడు. అంటే రెండు పరస్పర విరుద్ధ, సంఘర్షించుకునే పాత్రలు ఏర్పాటవుతున్నాయన్న మాట. కథనంలో ఇంతలోనే ఎంత  ట్విస్టు!  పైగా కథని ఇంకో లెవెల్ పైకి తీసి కెళ్తూ పెగ్గు కూడా కొట్టేశాడు సంజు. అప్పుడే ఇంకో లెవెల్ కి కూడా తీసి కెళ్తూ,  డ్రగ్స్ కి కూడా బోణీ కొట్టేస్తూ కథనంలో కంగారు పుట్టించాడు. అదంతా పది సీన్లు కాదు! ఒకేవొక్క  బార్ సీన్లో కథని ఇంత ముందుకు తీసికెళ్తూ అల్లేశారు.     
  
          వెనుకడ్డ జాతి ఏమంటుందంటే -  ఠాట్, ఒక్క సీన్లోనే సిగరెట్, మద్యం,  డ్రగ్స్ దాకా వెళ్లి పోతాడా? ఆడియెన్స్ నవ్వుతారు. సిగరెట్ తో ఆపుదాం. హీరోయిన్ తో లవ్ చూపుదాం. లవ్ తర్వాత మద్యం వేద్దాం. హీరోయిన్ తో పాట తర్వాత డ్రగ్స్ వేద్దాం... ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఆడియెన్స్ నవ్వరు – అని. ఇలా వెనకబడ్డ జాతి చేసే ఆధునిక సినిమా నిర్ణయాలకి,  అనాగరిక ప్రేక్షకుల్ని వెతికి వెతికి థియేటర్లకి తోలుకు రావాలి. 

          ఈ బార్ సీను తర్వాత ఏం చేయాలి? ఈ ఫ్లాష్ బ్యాక్ - 1 లో ప్రారంభమైన ఈ కథనాన్ని చూస్తూంటే,  ఇది త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో బిగినింగ్ విభాగపు బిజినెస్ అని సులభంగా అర్ధమయ్యే వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగంలో ఇప్పుడు అర్జెంటుగా జరగాల్సిన పాత్రల పరిచయాలు ఇంకేం మిగిలున్నాయి? తల్లి వుంది, ప్రేయసి వుంది. ఐతే ఇప్పుడు తల్లితో సీను వేయాలా బార్ సీను తర్వాత? మార్కెట్ యాస్పెక్ట్ కి ముందు యూత్ అప్పీల్ కావాలి. అంటే ప్రేయసితో సీనేయాలి.
       
        ఎంత మదర్ సెంటిమెంటైనా శివాలెత్తిపోకుండా తల్లి పాత్రని కాసేపు అపుకోవాలి. సినిమా పెన్ను మొదటి ధర్మం ప్రేమకవిత్వం రాయడమే. 

          బార్ నుంచి నేరుగా అర్ధరాత్రి రూబీ ఇంటికెళ్ళి పోతాడు. ఇక్కడ రూబీ, ఆమె తల్లీ ఎదురుగా వుంటే, వాళ్ళని చూస్తూ డబుల్ మీనింగుల కామెడీ చేస్తాడు. నిజానికి వాళ్ళ వెనకాలున్న మందు బాటిల్స్ నుద్దేశించి ఈ కామెడీ. చాలా పాతకాలపు బూతు, ముతక  కామెడీ  ఇది.  ఇదంతా ఒకే  రోజు జరుగుతున్న కథగా చూపించారు. ఉదయం పాట షూటింగుతో మొదలెట్టి, రాత్రి బార్ సీను, అర్ధరాత్రి రూబీతో సీను వరకూ. గొడవ వదిలిపోయింది. లేకపోతే  కొన్ని రోజుల వారీగా జరుగుతున్నట్టు ఈ సీన్లు చూపిస్తే, ఇవి బిగినింగ్ విభాగానికి చెందాల్సిన  సీన్లు అన్పించుకోవు. తీరుబడిగా విడివిడి రోజుల కథని చూపించుకునే బిజినెస్ అంతా మిడిల్ విభాగానిది. మిడిల్ బిజినెస్ కోసం కథలో ఏర్పాటయ్యే సమస్యని అందించే బిగినింగ్ బిజినెస్ లో, సంక్షిప్తంగానే వుంటుంది స్థలకాలాల ఐక్యతతో కూడిన కథనం. 

          ఇదే పద్ధతి ఈ బిగినింగ్ బిజినెస్ తర్వాతి  సీన్లలో కూడా వుంటుంది. తెల్లారి ఫ్రెష్ గా తల్లికి క్యాన్సర్ అని చెప్పి, ఆమెని యూఎస్ కి తీసికెళ్ళాలనడం కూడా అదే సీనులో చెప్పేసి,  యూఎస్ కి మార్చేశారు కథని. యూఎస్ లో ఇంకా ఉధృతం చేశారు సంజు డ్రగ్స్ అలవాటుని. ఇక్కడే రెండో మిత్రుడు కమలేష్ ని పరిచయం చేశారు. తల్లికి నయమై తీసుకురావడం, ఇక్కడ ప్రేయసి రూబీతో చెడడం వగైరా జరుగుతాయి. కమలేష్ వచ్చి,  రూబీకి చూసిన వేరే సంబంధం అతణ్ణి బకరా చేసే సీనుకూడా చాలా పాత మూసే. రూబీతో చెడే సరికి, ఈ బిగినింగ్ బిజినెస్ పతాక స్థాయికి చేరుకుంటుంది.

          ఇక  క్షీణించిన సంజు స్థితికి చలించి తండ్రి సునీల్ దత్ కి చెప్పేస్తాడు కమలేష్. డ్రగ్స్ బారి నుంచి కాపాడుకోమంటాడు. సంజు డ్రగ్స్ బానిసని ఇప్పుడే తెలుస్తుంది సునీల్ దత్ కి. దీంతో బిగినింగ్ విభాగం పూర్తవుతుంది.
***
      ఈ బిగినింగ్ విభాగంలో డ్రగ్స్ అని తెలుపుతూ  కథా నేపథ్యపు ఏర్పాటు, తగిన పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా ఏ విధంగా జరిగాయో పైన గమనించాం. సంజు గురించి కమలేష్  సునీల్ దత్ కి చెప్పేయడంతో సమస్య ఏర్పాటయింది. అంటే ప్లాట్ పాయింట్ వన్ అన్నమాట. ఎవరి మీద? సునీల్ దత్ మీద! బంతి సునీల్ దత్ కోర్టులో పడింది. సంజు కోర్టులో కాదు. ఆత్మ కథకి కథానాయకుడితనే కాబట్టి, సమస్య ఇతనే ఎదుర్కొంటాడనీ, ప్లాట్ పాయింట్ వన్ ఇతడి మీదే వుంటుందనీ ఎదురు చూడడం సహజం.

          కానీ ఇది విజేత ఆత్మ కథ కాదని ఇదివరకే చెప్పుకున్నాం. పరాజితుడి ఆత్మకథ. అంటే పాసివ్ పాత్ర. అంటే ట్రాజడీ. వీడికి స్వయంగా సమస్యల్ని అధిగమించాలని ఎందుకుంటుంది? కథానాయకుడుగా వీడు కథనెందుకు నడుపుతాడు?  కథే, లేదా ఇంకో పాత్రే వీడిని నడుపుతుంది. మీ ఖర్మంటూ కథ మీదా, ఇతర పాత్రల మీదా పడి బతికేస్తూంటాడు. 

          కాబట్టి, లక్కీగా సంజయ్ దత్ జీవితంలో సునీల్ దత్ అనే తండ్రి వుండి, ఆయన బాధ్యత తీసుకోవడంతో సంజయ్ దత్ డ్రగ్స్ కి సంబంధించి బాగుపడ్డాడు. ఇది జీవితం. సినిమాల కొచ్చేసరికి ఒక్కోసారి జీవితమెలా వుంటుందో అంతుబట్టక, వూహించి సృష్టించుకునే పాత్రలతో కొత్తదనం లేక, మూస ఫార్ములా చిత్రణలు విసుగెత్తిస్తాయి... కొడుకు వ్యసన పరుడు. తండ్రి అందుకు వ్యతిరేకి. ఇద్దరిమధ్య కొట్లాటలు. చివరి కెప్పుడో కొడుకు తానే తప్పు తెలుసుకుని, తండ్రి కాళ్ళ మీదపడి, ప్రయోజకుడన్పించుకోవడం. తండ్రి దీవించడం. ఇక్కడ తండ్రి పీకేదేం వుండదు. కొంపలంటుకుపోయాయని ఇల్లెక్కి ఒకటే కూయడం తప్ప. ఇలా పుడుతూంటాయి వూహించుకునే కథలు. 

          జీవితంలో ఇలా వుండకపోవచ్చు. సంజు – సునీల్ దత్ ల తండ్రీ కొడుకుల సంబంధమే తార్కాణం. చెడిపోయిన కొడుకు బాధ్యత తండ్రి తీసుకున్నాడు. ఇది వూహించని కథయ్యింది. అంతే అనూహ్యంగా ప్లాట్ పాయింట్ వన్ లో- అన్ని అంచనాలనీ తలకిందులు చేసేస్తూ - ఆ తండ్రే కథానాయకుడయ్యాడు. ఆయనకే సమస్యా, దాన్ని సాధించాలన్న  లక్ష్యమూ ఏర్పడ్డాయి. జీవితం కల్పనని ఇలా వెక్కిరిస్తుంది. పోవోయ్, ప్లాట్ పాయింట్ వన్ అంటే ఎప్పుడూ హీరోకేనా? ఇలాగే రాసుకుంటూ ఇంకెన్ని సార్లు తీసి విసిగిస్తావు? నీ బోడి కల్పనా నువ్వూ - అని నవ్వేస్తుంది. 

          అంటే బాగా దురలవాటు చేసుకున్నవరల్డ్మూవీసు, ఆచారంగా అతిగా అలవాటు చేసుకున్న  కొరియన్, హాలీవుడ్ మూవీసు చూస్తూనే,  చిరంజీవి- బాలకృష్ణ - నాగార్జున –వెంకటేష్ ల  పాత మూవీసు బాగా రీ పాలిషింగు చేస్తూ సినిమాలు తీస్తూనే, కాస్త అప్పుడప్పుడు జీవిత చరిత్రలు కూడా చదువుకుంటే, స్క్రీన్ ప్లేల్లో అనూహ్య కోణాలు ఇలా బయటపడే అవకాశాలుంటాయన్న మాట! 

        మొత్తంగా ‘సంజు’ ఒక గాథే అయితే, ఈ గాథలో ఏర్పడ్డ రెండు జీవిత ఘట్టాలు (డ్రగ్స్, గన్స్) కథలు కావడం ఇంకో ప్రయోగం. ఈ ప్రయోగం కావాలని చేయలేదు. జీవితమే తెచ్చి పడేసింది. కొత్తగా కమర్షియల్ సినిమాకి కుదిరిన జీవితం. 

          ఎక్కడ చూసినా గాథలో కథలుండవు. గాథే వుంటుంది. కానీ ఇక్కడ గాథ అనేది ప్రధాన కథ వరకే. ఇందులో ఇమిడి వున్న రెండు ఫ్లాష్ బ్యాకులూ కథలే. ఇందుకే ఇవి స్ట్రక్చర్ లో వున్నాయి. ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ గాథలుగానే తీయడానికి జీవితం ఒప్పుకోకపోవచ్చు.  జీవితంలో సునీల్ దత్ అనే లక్ష్యంతో కూడిన పాత్ర వుంది కాబట్టి - ఇవి కథలు కావడం అనివార్యం. అంటే బయోపిక్స్ కే ఇలా కుదురుతుందా అని కాదు. ఫిక్షన్ కి కూడా కుదరవచ్చని ఈ బయోపిక్ డిజైన్ చెప్తోంది. వూరికే గాథలు తీసి చేతులు కాల్చుకునే కన్నా, గాథలో కథల్ని సృష్టించే చాతుర్యముంటే కమర్షియల్ సినిమాలకి కొత్త ముఖం ఏర్పడుతుంది. అయితే ముందుగా కథకీ,  గాథకీ తేడా తెలియాలి.

          సాంప్రదాయంగా, రొటీన్ గా,  హీరో మీదే ప్లాట్ పాయింట్ వన్ వుంటుందిలే అన్పింపజేస్తూ తీసికెళ్ళి తీసికెళ్ళి, సీన్ రివర్సల్ చేస్తూ, ఇంకో పాత్ర మీద ప్లాట్ పాయింట్ వన్ పెట్టేసి,  కథని అప్పగించేస్తే ఆ కిక్కే వేరు. ఇదీ రూల్స్ బ్రేక్ చేయడమంటే. అంతేగానీ అసలు రూల్సే తెలీకపోతే రూల్స్ బ్రేక్ చేసేదేమీ వుండదు, కచరా చేయడం తప్ప.

 సికిందర్

Wednesday, July 4, 2018

660 - స్క్రీన్ ప్లే సంగతులు -1


     సినిమాలు కమర్షియల్ విజయాలు సాధించాలంటే వాటి కథలు స్ట్రక్చర్ లో వుండాల్సిందే. ఒక్కోసారి అదేపనిగా స్ట్రక్చర్ - స్ట్రక్చర్ - స్ట్రక్చర్ అనే ఒకే చట్రం విసుగు పుట్టిస్తుంది. స్ట్రక్చర్ లోంచి బయటికొచ్చి స్వేచ్ఛగా, ఏ బంధనాలూ లేని కథా రచన చేసుకోవాలన్పిస్తుంది. కానీ ప్రేక్షకులు అన్ కాన్షస్ గా తెలివైన వాళ్ళు - బాక్సాఫీసు దగ్గర మొహమాటం లేకుండా ఢమాల్ మన్పిస్తారే ...ఎలా? ప్రేక్షకులు పోనీలే పాపమనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దేశవ్యాప్తంగా థియేటర్లు వరల్డ్ మూవీస్ తో కూడా కిటకిటలాడేవి. టాలీవుడ్ లో వరల్డ్ మూవీస్ వ్యసనపరులు విరగదీసి వరల్డ్మూవీసు లాంటి మీసం లేని తెలుగు కళా ఖండాలు  తీసేసి ఎలాపడితే అలా  హిట్లు కొట్టేవాళ్ళు. రాయికేసి కొట్టినా గట్టి బ్యాంగ్ తో హిట్టయ్యేవి. కాబట్టి అంత సీనులేదు స్ట్రక్చర్ లేకపోతే. ఎక్కడెక్కడి మారుమూల ప్రాంతీయ సినిమాల ప్రేక్షకులూ, ఇప్పుడు నీ ఆర్టు సినిమాలు కాదు తండ్రీ, కాస్త పచ్చి కమర్షియల్ మూవీసు తీసి చూపిస్తావా చస్తావా అంటూంటే –ప్రాంతీయ సినిమాలు బాలీవుడ్ తోలుకప్పుకుని ప్రేక్షకుల చేతిలో  తోలుబొమ్మ లాటలైపోతూంటే – స్ట్రక్చర్ అనే తద్దినం తప్పదు గాక తప్పదు.

         
ఇందుకే ఒకరి నిజ జీవిత కథతో బయోపిక్ అయినా సరే, సినిమాగా ఆడాలంటే ఖచ్చితంగా స్ట్రక్చర్ లో పెట్టి తీరాలని ప్రతీ హాలీవుడ్ స్క్రీన్ ప్లే నిపుణుడూ హెచ్చరిస్తున్నాడు. ఇక్కడొక తేడా వుంది బయోపిక్స్ తో – విజయగాథలు, పరాజయ గాథలు అని. నిజానికి సాంకేతికంగా విజయానికి సంబంధించిన కథల్ని గాథలు అనకూడదు.  కథ అంటేనే స్ట్రక్చర్ లో వుండేది. విజయానికి సంబంధించిన కథలు స్ట్రక్చర్ లోనే వుంటాయి. స్ట్రక్చర్ లో  వుండనివి గాథలు. ఇవి పరాజయాలకి వర్తిస్తాయి. కాబట్టి అవి పరాజయ గాథలవుతాయి. విజయాలకి సంబంధించిన వాటిని సౌలభ్యంకోసం విజయగాథలనేస్తున్నాం గానీ, సాంకేతికంగా అవి కథలు. 

     కథల్లో యాక్టివ్ పాత్ర వుంటుంది. అదే దాని గోల్ కొద్దీ  ఆటోమేటిగ్గా స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసేస్తుంది. ఇలా యాక్టివ్ పాత్ర తప్ప ఇంకేదీ – పాసివ్ పాత్ర సహా - స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయదు గాక చేయదు.  స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయకపోతే అది కథవదు, గాథవుతుంది. పైసా, మొగుడు, బ్రహ్మోత్సవం వంటివి స్ట్రక్చర్ లో లేని గాథలే. కాబట్టి అవి అంత భీకర ఫ్లాపులయ్యాయి. ప్రాథమికంగా కథకీ గాథకీ తేడా తెలుసుకోక కోట్లకి కోట్లు పెట్టి సినిమాలు తీసేస్తే – సూపర్ స్టార్లున్నా ఇంతే సంగతులు.  

          విజయంతో కూడిన బయోపిక్ కి స్ట్రక్చర్ వుండాల్సిందే. విజయం లేని ట్రాజిక్  బయోపిక్ కి స్ట్రక్చర్ లేకున్నా ఫర్వాలేదు. ఐతే అసలు బయోపిక్ అని దేన్ని అంటారు? ఇటీవల ఒకతను డైలాగ్ వెర్షన్ కూడా రాసుకుని కథ విన్పించాడు. అది కథలా లేదు. పాత్ర ఏదో సమస్యతో కష్టాలు పడుతూనే వుంది. పడీ పడీ చచ్చిపోయింది. ఇదేంటంటే, బయోపిక్ అన్నాడు. ఎవరి బయోపిక్ అంటే, తను సృష్టించిన పాత్ర బయోపిక్ అన్నాడు. బయోపిక్ అంటే నిజవ్యక్తి కథ అని కూడా తెలీని తనంతో డైలాగ్ వెర్షన్ కూడా రాసేసుకుని బయోపిక్ అని ఫిక్సయిపోయాడు. 

          నువ్వు సృష్టించిన కల్పిత పాత్రతో కథని  బయోపిక్ అనరు, దేవుడు చేసిన మనిషితో వుండే నిజ జీవిత కథని బయోపిక్ అంటారంటే, అర్ధం జేసుకునే స్థితిలో లేడు. కాబట్టి దీన్ని యాక్టివ్ పాత్రగా చేసి, లక్ష్యం ఏర్పాటు చేసి, స్ట్రక్చర్ లో పెట్టి, కథగా మార్చమంటే- ‘మీరు స్ట్రక్చర్ లోంచి బయటికి రండి’ అన్నాడు. స్ట్రక్చర్లోంచి బయటికొస్తే, ఎలా రాయాలో నేర్పుతావా అంటే సమాధానం లేదు. 

          అతను రాసుకున్నది సినిమాకి పనికిరాని గాథ. ట్రాజడీ కూడా పైగా. పాత్రకి సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ లేదు. చావే పరిష్కారంగా పరాజయ గాథలా వుంది. ‘అల్లూరి సీతారామరాజు’ బయోపిక్ చివరికి ట్రాజడీయే అయినా, ఆయన లక్ష్యం కోసం చేసిన పోరాటంలో మరణించాడు. కాబట్టి పాసివ్ పాత్ర కాలేదు. వీరమరణంతో యాక్టివ్ పాత్రయాడు. 

          వివిధ బయోపిక్స్ ని చూసి, తామూ అలాంటిది తీయాలని ఉబలాటపడి,  తోచిన కల్పిత పాత్రొకటి సృష్టించుకుని,  బయోపిక్ గా  చెప్పుకుంటే నవ్వుతారు ప్రేక్షకులు. ట్రాజడీ గాథగా బయోపిక్  తీయాలన్నా అలాంటి నిజవ్యక్తి కథ ఎక్కడో వుండాల్సిందే. అప్పుడు ప్రేక్షకులు విజయమా, పరాజయమా పట్టించుకోరు. యాక్టివా, పాసివా చూడరు. ఆల్రెడీ ఆ వ్యక్తి  జీవితం తెలిసే  వుంటుంది కాబట్టి, బయోపిక్ ని ఆ దృష్టితోనే చూస్తారు.

          ఇలా వచ్చిందే సంజయ్ దత్ ట్రాజిక్ బయోపిక్. విజయంతో కూడిన బయోపిక్స్ ని  చూస్తే, మనం కూడా అలా చేయాలని అవి స్ఫూర్తి నిస్తాయి. అపజయంతో కూడిన బయోపిక్స్ ని చూస్తే, మనమూ అలా చేయకూడదని హెచ్చరిక చేస్తాయి. 

          ఈ రెండోది చేసేదే  ‘సంజు’ ట్రాజిక్ బయోపిక్. సంజయ్ దత్ అనే బాలీవుడ్ స్టార్ గురించి తెలిసిన అసమర్ధ జీవిత కథే కాబట్టి, దీని జానర్ లక్షణం కొద్దీ (ట్రాజడీ), స్ట్రక్చర్ లో లేకపోయినా కమర్షియల్ విలువకి లోటు రాలేదు. ‘డర్టీ పిక్చర్’ కూడా తెలిసిన సిల్క్ స్మిత విషాద గాథే కాబట్టి  కమర్షియల్ గా ప్రశ్నార్ధకం కాలేదు. ఎటొచ్చీ కల్పిత  పాత్రతో ట్రాజడీలు తీస్తేనే వస్తుంది సమస్య.

***
     బయోపిక్ ఎలాటిదైనా అందులో సమస్య వర్తమానంతో కనెక్ట్  అయితే మంచిదన్నారు పండితులు. ‘సంజు’ లో ఇప్పటి రోజులతో  కనెక్ట్ అవుతున్న డ్రగ్స్ సమస్య, అక్రమాయుధాల సమస్యా వున్నాయి.  కాబట్టి మార్కెట్ యాస్పెక్ట్ కుదిరింది. ఈ మార్కెట్ యాస్పెక్ట్ వల్ల ఇంకా యూనివర్సల్ అప్పీల్ కూడా కుదిరింది. పైగా యంగ్ సంజయ్ జీవితంతో  యూత్ అప్పీల్ కూడా కుదిరింది. 

          క్రియేటివ్ యాస్పెక్ట్ కొచ్చి దీనికి స్ట్రక్చర్ లేదు, కుదరదు, అవసరం లేదు. ఎందుకంటే ఫస్టాఫ్ ఒక జీవిత ఘట్టం (డ్రగ్స్) తో, సెకండాఫ్ ఇంకో జీవిత ఘట్టం (గన్స్) తో వుంది. స్ట్రక్చర్ లో వున్న స్క్రీన్ ప్లే ఒకే ఘట్టంతో,  దాని చుట్టూ సంఘర్షణతో, ఒకే పూర్తి నిడివి కథగా వుంటుంది. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ ఇంకో కథగా వుండదు. వుంటే సెకండాఫ్ సిండ్రోం అనే సుడిగుండంలో పడి గల్లంతై పోతుంది సినిమా జాతకం. ఇలాటివి చాలా చూశాం. 

          ‘సంజు’ బయోపిక్ దీనికి అతీతం. కారణాలు పైన చెప్పుకున్నవే. ఈ రెండు జీవిత ఘట్టాలకీ కవరింగ్ లెటర్ లాగా ఇంకో ఘట్టముంది : ఫైనల్ గా సంజయ్ జైలు శిక్ష అనుభవించే ఘట్టం. అంటే 80 లలో డ్రగ్స్ ఘట్టం, 90 లలో గన్స్ ఘట్టం, 2000 లలో జైలు శిక్ష ఘట్టమూ అన్న మాట. ఇలా త్రికాలాల కథగా అలంకరణ చేశారు. రెండు భూత కాలాలు, ఒక వర్తమాన కాలం. 

          ఇలా వొక ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాత, కథని దేంతో  మొదలెట్టాలి? వర్తమాన కాలంతోనే మొదలెట్టాలని ఇంగిత జ్ఞానం చెప్తుంది. వర్తమానం లోంచి మొదటి ఘట్టంలోకీ,  ఆ తర్వాత  మళ్ళీ వర్తమానం లోంచి రెండో ఘట్టంలోకీ ప్రయాణించాలి. వర్తమానం రియల్ టైం అనుకుంటే,  దీని ప్రేరణతో వచ్చే రెండు ఘట్టాలూ డ్రీం టైమ్ (ఫ్లాష్ బ్యాక్స్) అవుతాయి. అంటే ఈ కథని ఫ్లాష్ బ్యాకులతో చెప్పాలన్న మాట. ఫస్టాఫ్ డ్రగ్స్ ఫ్లాష్ బ్యాక్, సెకండాఫ్ గన్స్ ఫ్లాష్ బ్యాక్ విడివిడిగా.

          వీటికి ప్రధాన పాత్ర ఎవరు? సంజునే. ప్రధానపాత్రగా అతనేం చేస్తున్నాడు? ఏమీ చేయడం లేదు, సమస్యలు సృష్టించుకుని లబోదిబో మంటున్నాడు. ఫస్టాఫ్ డ్రగ్స్ సమస్యతో, సెకండాఫ్ గన్స్ సమస్యతో. నిజ జీవితంలోనే అతను పాసివ్ పాత్ర. కాబట్టి బయోపిక్ అనే ఈ సినిమాలోనూ సమస్యలతో పోరాటం చేయలేడు. అంటే అప్పుడు ఈ ఫస్టాఫ్,  సెకండాఫ్ లని డాక్యుమెంటరీ పద్ధతిలో చెప్పాలా? డ్రగ్స్ తో ఒక కథ ముగిసి, గన్స్ తో ఇంకో కథగా వుండే ఎపిసోడిక్ స్టార్ అండ్ స్టాప్  అనే డాక్యుమెంటరీ కథనం సరిపోతుందా? ఎందుకూ, ఈ రెండిటినీ కలిపి వుంచే  రియల్ టైం  కథ వుందిగా? అందులో ఒక గోల్ వుందిగా – ఈ రెండు ఘట్టాలనీ కలిపి తన జీవితంగా పుస్తకం అచ్చేసుకోవాలని? దాంతో టెర్రరిస్టు అనే ముద్ర చెరిపేసుకోవాలనీ? అది గోల్ అవదు. కేవలం ఈ రెండు ఘట్టాలూ వెల్లడించుకోవడానికి ప్రేరేపించే వొక కారణం మాత్రమే అది. 

     మరి ఈ రెండు ఘట్టాలనీ కలిపి వుంచే ఇంకో హుక్ లేదా, ఎలిమెంట్ ఏది? సంజు జీవితంలో ఇంకెవరెవరున్నారు? ఈ రెండు ఘట్టాలనీ నడిపించే వ్యక్తులు కాక ఇంకెవరి ప్రసక్తీ  ఇక్కడ అవసరం లేదు. మొదటి ఘట్టం నడవడానికి మొదటి ఫ్రెండ్, రెండో ఘట్టం నడవడానికి రెండో ఫ్రెండ్ వున్నారు. అయినా వేర్పాటు అలాగే వుంది. అయితే సంజుకి  తండ్రి సునీల్ దత్ వున్నాడు.  ఆయనేం చేశాడు నిజ జీవితంలో? రెండు ఘట్టాల్లోనూ  సంజుని కాపాడుకోవడానికి నానా కష్టాలూ పడ్డాడు. అయితే సంజు బయోపిక్ కి ఈయనే రియల్ హీరో. సాంకేతికంగా గాడ్  ఫాదర్  క్యారెక్టర్.  గోల్ ఈయనకే వుంది. ఈయన గోల్ తో బలమైన ఎమోషనల్ త్రెడ్ ఏర్పడింది. ఈ ఏకీకృత ఎమోషనల్ ట్రేడ్ తో ప్రథమార్ధ, ద్వితీయార్ధ ఘట్టాలు రెంటికీ  ఈయన బలమైన అనుసంధాన కర్తగా ఏర్పడ్డాడు.  

          మరి ఈ మొత్తం ఈ బయోపిక్ ని ఏ ప్రధాన రసం ఆధారంగా చెప్పాలి?  ఫాదర్ సెంటి మెంట్ ఆధారంగానే. యూనివర్సల్ అప్పీల్. తండ్రీ కొడుకుల లవ్ అండ్ హెట్ రిలేషన్ షిప్. యూనివర్సల్ అప్పీల్. మరి ఉపరసాలూ? వున్నారుగా ఇద్దరు ఫ్రెండ్స్- ఒకడితో ఫస్టాఫ్ లో  బ్యాడ్ ఫ్రెండ్ షిప్, ఇంకొకడితో సెకండాఫ్ లో గుడ్ ఫ్రెండ్ షిప్. యూనివర్సల్ అప్పీల్.

          ఇప్పుడు ఈ అవుట్ లైన్ ని బద్ధకించకుండా పేజీలకి పేజీలు  సినాప్సిస్ రాసేయ్! రాసేసి? అప్పుడు ఆర్డర్ వేద్దాం. ఎప్పుడు? రేపే! ఇంతలో అంత రాయాలా? రాయకపోతే మట్టిలో కలిసిపో! స్క్రీన్ ప్లేకి షార్ట్ కట్స్ లేవు !

సికిందర్ 


         


Friday, June 29, 2018

659 :రివ్యూ!




రణ్బీర్ కపూర్, దియామీర్జా, అనూష్కా శర్మ, సోనమ్ కపూర్, పరేష్ రావల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, జిమ్ శర్భ్, తదితరులు
రచన : అభిజాత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ
సంగీతం : ఏఆర్ రెహమాన్, రోహన్ రోహాన్ తదితరులు, ఛాయాగ్రహణం : రవివర్మ
బ్యానర్స్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్
నిర్మాతలు : విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ  
విడుదల : జూన్ 29, 2018
***

           
హిందీలో ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. స్టార్స్ కోసం ఫార్ములా పాత్రల సృష్టికి కాలం చెల్లిపోయినట్టుంది. మేఘనా గుల్జార్ అన్నట్టు, నిజ జీవితంలో హీరోలెందరో వున్నారు - వాళ్ళ నిజ కథలు చెబితే స్టార్స్ కి పాత్రల కొరత తీరిపోతుంది. జనరల్ మానెక్ షా జీవిత కథతో మేఘనా గుల్జార్ తీస్తున్న ఒక బయోపిక్, 1948 లో మొదటి ఒలింపిక్ మెడల్ గెల్చిన హాకీ టీము కథతో  ఇంకో బయోపిక్ గోల్డ్వంటి స్టార్ మూవీస్ విరివిగా తెరకెక్కుతున్నాయి. ఇదే కోవలో సంజయ్ దత్ జీవితం మీద జీవించి వున్నప్పుడే బయోపిక్ వచ్చింది. జీవించి వున్నప్పుడే బయోపిక్ అవసర మెందుకేర్పడిందంటే, తను మీడియా బాధితుడు కాబట్టి. తనకి తాను చేసుకున్న హాని కంటే,  మీడియా తనకి చేసిన అన్యాయమే ఎక్కువన్న ఆక్రందనతో ఈ బయోపిక్ ని ఉద్దేశించినట్టు కనబడుతోంది. చివర్లో మీడియామీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ, పాట కూడా పెట్టించాడు - ఛపీ జిస్ కీ ఖబర్, బనీ ఉస్ కీ ఖబర్ (ఎవడి మీద వార్త పడితే వాడికి సమాధే)!
          ‘పీకే’ సక్సెస్ తర్వాత రాజ్ కుమార్  హిరానీ తొలిసారి చేసిన ఈ బయోపిక్ ప్రయత్నం ఎలావుందో ఒకసారి ఈ కింద చూద్దాం...

కథ
       సుప్రసిద్ధ నటుడు, నిర్మాత, దర్శకుడు సునీల్ దత్ (పరేష్ రావల్), సుప్రసిద్ధ నటి నర్గీస్ (మనీషా కోయిరాలా) ల కుమారుడు సంజయ దత్ (రణబీర్ కపూర్) అలియాస్ సంజు. ఇతన్ని హీరోగా పరిచయం చేస్తూ ‘రాకీ’ అనే సినిమా ప్రారంభిస్తాడు సునీల్ దత్. దర్శకుడుగా తండ్రి కాఠిన్యానికి కుమిలి పోతూంటాడు సంజు. ఫ్రెండ్ జుబిన్ మిస్త్రీ (జిమ్ శర్భ్) సంజుని  వూరడిస్తూ డ్రగ్స్ అలవాటు చేస్తాడు. తల్లి క్యాన్సర్ తో మంచాన పడుతుంది. తల్లి దగ్గరున్నప్పుడు కూడా డ్రగ్స్ మత్తులోనే వుంటాడు. సినిమా విడుదలకి మూడ్రోజుల ముందు తల్లి చనిపోతుంది. అటు ప్రేమించిన రూబీ (సోనమ్ కపూర్) అతడి డ్రగ్స్ అలవాటు చూసి  దూరమైపోతుంది. పిచ్చి వాడైపోతాడు సంజు. దీంతో అమెరికాలో వున్న ఇంకో ఫ్రెండ్ కమలేశ్ (విక్కీ కౌశల్), ఇక సంజు తండ్రిని కలుసుకుని అతణ్ణి కాపాడుకోమని బతిమాలుకుంటాడు. అప్పుడు సునీల్ దత్, సంజుకి మాదకద్రవ్యాలని వదిలించినా. సంజు ఇంకో పెద్ద సమస్య తెచ్చుకుని జైలు పాలవుతాడు. ఇప్పుడు సునీల్ దత్, సంజుని రక్షించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేశాడు, చివరికి  సంజూ ఏమయ్యాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
       సాధారణంగా బయోపిక్స్  విజయగాథలతో వుంటాయి. సంజు బయోపిక్ పతనావస్థ గాథతో వుంది. ట్రాజడీ పాత్ర కాబట్టి ఇది కథా లక్షణాలతో గాక, గాథకి సరిపడే పాసివ్ పాత్ర కథనంతో వుంది. ప్రముఖ వ్యక్తికి చెందిన, తెలిసిన బయోపిక్కే కాబట్టి పాసివ్ పాత్రయినా ప్రేక్షకులు ఇబ్బంది పడరు. అదే ఇంకేదైనా కాల్పనికం అయితే ఎంత పెద్ద స్టార్ నటించినా  గాథగా అట్టర్ ఫ్లాపవుతున్న వైనాలు చూస్తున్నాం. ఈ బయోపిక్ ఉద్దేశం సంజు తనని మహోన్నతుడుగా చూపించుకోవడం కాదు. తనమీద మీడియా వేసిన టెర్రరిస్టు మచ్చని తొలగించుకునే క్రమంలో వాస్తవాలు వెల్లడించుకునే వాంగ్మూలం మాత్రమే. చివరికి కోర్టులో జడ్జి సైతం తీర్పు చెప్తూ - నువ్వు టెర్రరిస్టువి కావు - అని స్పష్టం చేస్తూ - అయితే అక్రమాయుధాల కేసు నిరూపణ అయింది గనుక ఆరేళ్ళు జైలు శిక్ష విధిస్తున్నానని ప్రకటించినా, టెర్రరిస్టు కాదనే అంశాన్ని  హెడ్డింగుల్లో ప్రధానం చేయకుండా - సంజయ్ కి ఆరేళ్ళు జైలుశిక్ష- అంటూ పాక్షిక, సెలెక్టివ్, నెగటివ్ హెడ్డింగులు పెట్టి అప్పుడు కూడా మీడియా అన్యాయం చేసిందన్న ఆక్రందనతో, సంజయ్ దత్ తన కథ రాజూ హిరానీకి రోజుల తరబడి చెప్పుకుని సినిమాగా తీయమన్నాడు. దీంతో కథా ప్రయోజనం కూడా నెరవేరింది  – యుక్త వయసులో తెలియక చేసేసే తప్పులు ఎలా మెడకి చుట్టుకుంటాయో నేటి యువతకి ఒక హెచ్చరికని పంపుతూ. 

ఎవరెలా చేశారు 
      బర్ఫీ, రాక్ స్టార్ లవంటి హిట్స్ లో నటించాక రణబీర్ కపూర్ అంటే ఏమిటో ఎప్పుడో రుజువైపోయింది. తాతగారు రాజ్ కపూర్ మృతితో బాటే ఆర్కే ఫిలిమ్స్ అంతరించిపోయిందని రణబీర్ అనడం నిజమే గానీ, వంశంలో నటులు అంతరించి పోలేదనడానికి తనే నిలువెత్తు సాక్ష్యం. తను నట రాక్షసుడు. ఇప్పుడు సంజయ్ దత్ అయి వచ్చాడు. సంజుబాబా తో పోలికలు కలవడం తనకి పెద్ద పెట్టుబడియే అయినా,  మిగతా సంజుబాబా హావభావాలూ శరీర భాషా సొంతం చేసుకోవడం అతి కష్టమైన పనే. దీన్ని సమున్నతంగా పోషించాడు. ఈసంకీర్ణ పాత్రకి హస్యముంది, ఆవేశముంది, ఆందోళన వుంది, ఏడుపూ వుంది. వీటన్నిటి అంతర్వాహినిగా బోల్డు కన్యూజన్ తో వుండే మనస్తత్వముంది. ఈ అయోమయపు మనస్తత్వానికి, జీవితంలో ఒక దశలో -  ఫస్టాఫ్ లో డ్రగ్స్ బానిస హద్దులున్నాయి. ఇంకో దశలో - సెకండాఫ్ లో గన్స్ తో స్వయం కృతాపరాధపు వ్యధ హద్దుగా వుంది. ఈ రెండు దశలకీ, మూల బిందువైన అయోమయపు మనస్తత్వాన్నీ స్థావరంగా  చేసుకుని, ఆయా అనుబంధ భావోద్వేగాల పాలన  చేశాడు. సినిమా విడుదల రోజు థియేటర్ మెట్ల మీద విచలితుడై తండ్రికి చెప్పుకునే సన్నివేశం జీవితపు మొదటి దశలో పతాక స్థాయి నటన. మొదట్నుంచీ సంజుబాబా జీవితంలో చేతులారా చేసుకున్న ట్రాజడీ తప్ప మరేమీ లేదు. ఈ విషాదాన్ని నమ్మించకుండా నమ్మిస్తూ, తను మాయమైపోయి – సాక్షాత్తూ  యంగ్ సంజయ్ దత్ నే చూస్తున్నామా అన్నంత మాయలోకి నెట్టేశాడు ప్రేక్షకుల్ని రణబీర్ కపూర్. 

      సునీల్ దత్ పాత్రకి, ఎత్తు విషయంలో కొంచెం ఇబ్బంది వున్నా పరేష్ రావల్ సాధ్యమైనంత న్యాయం చేశాడు. మొత్తం సంజయ్ దత్ కేసులో ఇరుక్కున్న కాలమంతా అతడి ఇంట్లో పరిస్థితి ఎలా వుండేదో బయటి ప్రపంచానికి తెలీదు. సంజుబాబా ఘనకార్యాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మనకి తెలుస్తున్నవే. కానీ సంజు పెట్టే కష్టాలకి తండ్రి సునీల్ దత్ మనోభావాలేమిటి, ఎలా బిహేవ్ చేసేవాడు ఎవరికీ తెలీదు ఈ సినిమా చూసే దాకా. సునీల్ దత్ ఐదు సార్లు వాయువ్య ముంబాయి స్థానానికి ఎంపీగా వుంటూ,  కేంద్ర మంత్రిగా 2005  లో కన్ను మూశాడు. కానీ సినిమాలో అతణ్ణి రాజకీయ నాయకుడు అన్నట్టుగా ఎక్కడా చూపించలేదు. పార్టీ గుర్తులు, రంగులు కూడా వాడలేదు. కేవలం ఇంటిదగ్గర వుండే సాధారణ తండ్రిగా మాత్రమే చూపించారు. దీనివల్ల కష్టకాలంలో కుటుంబంలో ఆయన ఎలా వుండేవాడో ఫోకస్ చేయడానికి కుదిరింది. దేనికీ ఆవేశ పడకుండా, కుమిలిపోకుండా, కోప్పడకుండా, పల్లెత్తు మాటనకుండా, రాజకీయంగా ఎవర్నీ నిందించకుండా, పాతికేళ్ళూ కొడుకుని దారిని పెట్టే ప్రయత్నాల్లో ఎంతో ఓర్పు వహించి, హూందాగా ప్రవర్తించే సునీల్ దత్ నే చూస్తాం. కొడుకు జైల్లో కింద పడుకుంటాడు కాబట్టి తను కూడా కింద పడుకోవాలి, కొడుక్కి జైల్లో ఫ్యానుండదు కాబట్టి తనూ ఫ్యానేసుకోకూడదు –అన్న సెంటిమెంట్లతో మహోన్నతుడుగా కన్పిస్తాడు. అయితే కొడుకుని ఎంత ప్రేమించినా స్నేహితుడు కాలేకపోవడం కన్పిస్తుంది. ఇదంతా పరేష్ రావల్ డిగ్నిఫైడ్ గా పోషించి సునిల్ దత్ ని ప్రపంచానికి ఎరుకపర్చాడు.

         సునీల్ దత్ భార్య నర్గీస్ సంక్షిప్త పాత్రలో మనీషా కోయిరాలా కన్పిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ తో మరణించిన సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, విడాకులు తీసుకున్న రెండో భార్య రియా పిళ్ళై, బావ బాలీవుడ్ స్టార్ కుమార్ గౌరవ్,  ఇద్దరు సోదరీ మణులు (పెద్ద సోదరి ప్రియా దత్, ఎంపీ) తదితరులు ఈ బయోపిక్ లో కనిపించరు. ఒకటి రెండు సీన్లలో నామమాత్రంగా  ప్రియా దత్ పాత్ర కనిపిస్తుంది. ఈ బయోపిక్ సంపూర్ణ సంజయ్ జీవిత కథా సరిత్సాగరం కాదు. అతను  ఎందుకు ప్రసిద్ధి చెందాడో ఆ రెండు విషయాల గురించే. వాటికి సంబంధించిన ప్రధాన పాత్రలతోనే. ఇలా సంజయ్ ప్రస్తుత భార్య మాన్యత (దిల్ నవాజ్ షేక్ అసలు పేరు), ఇద్దరు పిల్లలు ఈ బయోపిక్  లో కన్పిస్తారు. మాన్యతగా దియా మీర్జా నటించింది. పెద్దగా స్కోపున్న పాత్ర కాదు. 

          సంజయ్ ఫ్రెండ్స్ గా నటించిన జిమ్
శర్భ్, విక్కీ కౌశల్ ల పాత్రలు విరుద్ధ స్వభావాలతో వుంటాయి. ఫస్టాఫ్ డ్రగ్స్ కథలో సంజయ్ ని స్వార్ధానికి వాడుకుని చెడగొట్టే ద్రోహిగా జిమ్ శర్భ్ కన్పిస్తాడు. సెకండాఫ్ గన్స్ కథలో సంజయ్ బాగు కోరి కష్టపడే నిస్స్వార్ధ పరుడైన మిత్రుడిగా కన్పిస్తాడు. ఇతడికే ఎక్కువ మార్కులు పడతాయి. 

     ఈ మొత్తం బయోపిక్ ని సంజు జర్నలిస్టు చేత పుస్తకం రాయించాలనుకుంటాడు. ఈ జర్నలిస్టు విన్నీ డయాజ్ పాత్రలో అనూష్కా శర్మ కన్పిస్తుంది. సంజు ప్రేమించే రూబీ పాత్రలో సోనమ్ కపూర్, ఆమె తండ్రి పాత్రలో బొమన్ ఇరానీ కన్పిస్తారు. మాఫియా బండు దాదాగా సాయాజీ షిండే కన్పిస్తాడు. చివర రోలింగ్ టైటిల్స్ లో మీడియా మీద ‘బాబా బోల్తా హై బస్ హోగయా’ ( ఇక చాలంటున్నాడు బాబా ) పాటలో రణబీర్ కపూర్ తో సంజయ్ దత్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మీడియాని ఆడుకుంటాడు - విశ్వసనీయ సమాచారం ప్రకారం ....అనే రక్షక  కవచం మాటున  రాసే సొంత అభిప్రాయాల  మీద అక్కసంతా తీర్చుకుంటాడు సంజయ్. దాదాపు ఐదు నిమిషాల ఈ క్రేజీ పాటని పునీత్ శర్మ, అభిజాత్ జోషీ, రోహన్ గోఖలేలు రాశారు – ‘చూడ చక్కని జీవితం సర్కస్ ఐపోయింది...బాబా బోల్తా హై  బస్ హోగయా!’ –పాటకి విక్రమ్ మంట్రోస్ సంగీతమిచ్చాడు. 

          రెహమాన్ సంగీతంలో ప్రేమపాట ‘రూబీ రూబీ’, మత్తులో స్వైరకల్పనల పాట ‘ముజే చాంద్ పే లేచలో’ వున్నాయి. రవివర్మ ఛాయాగ్రహణం సాధ్యమైనంత క్లాసిక్ లుక్ తీసుకురావడానికి ప్రయత్నించింది. 

          పట్టిందల్లా బంగారమయ్యే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం ఈ సారీ క్వాలిటీ సినిమాని అందించింది. హాస్యంగా మొదలుపెట్టి భావోద్వేగాలతో ముగించే దృశ్యాలే ఎక్కువ. కామెడీకి చావు కూడా లోకువే అన్నట్టు రూబీ తండ్రి చనిపోయన సందర్భంగా హాస్పిటల్ దృశ్యాలున్నాయి. 

          రచనా పరంగా ఇదొక పాఠ్య గ్రంథమనొచ్చు. మూడు కాలాల గాథని  కుదుపుల్లే కుండా సాఫీగా సంక్రమణం చేసి ఏకత్వాన్ని సాధించడంలో రచయితలైన దర్శకుడు హిరానీ, అభిజాత్ జోషీలు సఫలమయ్యారు. 

          ఇంతా చేసి ఈ బయోపిక్ ని ప్రజలు అర్ధంజేసుకున్నారా అంటే, సోషల్ మీడియాలో సంజయ్ ని ఇంకా క్రిమినల్ గానే, టెర్రరిస్టుగానే దూషిస్తూ,  ఇలాటి వాడిమీద సినిమా తీయడమేంటని,  పనిలో పనిగా హిరానీని కూడా దుర్భాషలాడుతున్నారు. మీడియాకి జవాబు చెప్పాలనుకున్న సంజుబాబాకి - పుణ్యాని కొచ్చిన సోషల్ మీడియాలో వేలాడే నీతిమంతుల్ని కూడా పాటలో కలిపి చాకిరేవు పెట్టాలన్న ఆలోచన స్ఫురించలేదేమో!

సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)