రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 19, 2018

657 : స్క్రీన్ ప్లే సంగతులు


     ఇంతవరకూ రోమాంటిక్ డ్రామా ‘ది క్లాసిక్’ లో,  ‘ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్’ అనే సృజనాత్మక కథనాన్ని చూశాం.  ప్రధాన కథలో డైరీ ఆధారంగా హీరోయిన్ తెలుసుకుంటున్న ఆమె తల్లి ప్రేమకథ ఫ్లాష్ బ్యాకుగా ఓపెనైతే, ఈ ఫ్లాష్ బ్యాకు ఆ తల్లిని ప్రేమిస్తున్న జూన్ హా దృక్కోణంలో అతడి ఫ్లాష్ బ్యాకుగా ప్రారంభమవడాన్ని గమనించాం. ఈ ‘ఫ్లాష్ బ్యాకులో ఫాష్ బ్యాకు’ కథనాన్ని ‘ఇన్సెప్షన్ ఫ్లాష్ బ్యాక్’ అంటున్నారు. ఐతే విడివిడిగా చూస్తే, ఈ రెండు ఫ్లాష్ బ్యాకులూ ‘ఇల్లస్ట్రేషన్ ఫ్లాష్ బ్యాక్’ వర్గానికి చెందినవే. అంటే బొమ్మల కథగా సింపుల్ గా, లీనియర్ గా చెప్పేవే. జూన్ హా కి చెందిన ఈ ‘లోపలి ఫ్లాష్ బ్యాకు’ త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో వుండడాన్ని గమనించవచ్చు. ఇది 16  నిమిషాల నిడివి వుంది. ఈ నిడివిలో బిగినింగ్ – మిడిల్ – ఎండ్ వున్నాయి. బిగినింగ్ విభాగం వచ్చేసి, 1) పాత్రల పరిచయం – 2) కథా నేపధ్య వాతావరణ ఏర్పాటు, 3) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన – 4) సమస్యా స్థాపనా కాబట్టి, ఇప్పుడు చూస్తే ఇవన్నీ మొదటి రెండు సీన్లలోనే  సర్దుకున్నాయి. 

          1) పాత్రల పరిచయం : మొదటి సీన్లో పల్లెటూళ్ళో జూన్ హా నేస్తాలతో అల్లరి చేస్తున్నప్పుడు ఎడ్ల బండిమీద హీరోయిన్ వెళ్ళడం, ఆమె ఫలానా తాతగారి మనవరాలని నేస్తాలు జూన్ హాకి చెప్పడం, అలాగే జూన్ హా పట్టణం నుంచి సెలవుల్లో వచ్చినట్టు చెప్పడమూతో, అవసరం మేరకు ఈ మూడు పాత్రల పరిచయాలూ అయ్యాయి. ఇక్కడ జూన్ హాతో వున్న నేస్తాలెవరో కనీసం పేర్లు కూడా చెప్పలేదు. ఇతర పాత్రల్ని పరిచయం చేస్తే, ఇక్కడ  హీరో హీరోయిన్ల మీది ప్రేక్షకుల ఫోకస్ చెదిరిపోతుందన్న ఉద్దేశమై వుండొచ్చు. ఈ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే, ప్రేక్షకుల ఏకాగ్రత పెరుగుతుంది సీన్లమీద. 

          2) కథా నేపధ్య వాతావరణ  ఏర్పాటు : జూన్ హా, జూహీ పాత్రల పరిచయాలతో వెంటనే ఈ మొదటి సీను మొత్తం ఈ ఫ్లాష్ బ్యాకుకి సంబంధించి జానర్ ఏమిటో ప్రకటించేసింది : ఇది ప్రేమకథ అవుతుందని. ఈ సీనులో ప్రేమ కథకి తగ్గ వాతావరణ ఏర్పాటూ జరిగిపోయింది. మొదటి సీన్లోనే హీరో హీరోయిన్లు పరస్పరం చూసుకోవడంలోనే ఈ ఫీల్ మనకి అనుభవమవుతోంది.  దీన్ని చెడగొట్టే ఇంకే ప్రస్తావనలూ చిత్రణలూ చేయలేదు. ఇదే నేపధ్య వాతావరణం సీను తర్వాత సీనుగా  ఫ్లాష్ బ్యాక్ అంతటా  ( బిగినింగ్ – మిడిల్- ఎండ్ అంతా) ఏకధాటిగా ప్రతిఫలిస్తూంటుంది. దీన్ని భంగపర్చే వాతావరణమెక్కడా కన్పించదు. ఇందులో భాగంగా మొదటి సీనులో కనీసం హీరో నేస్తాలని పరిచయం కూడా చేయలేదు. కథని ప్రభావితం చేయని పాత్రల పరిచయాలవసరం లేదని దీన్ని బట్టి అర్ధం జేసుకోవాలి.
 
          3) సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన : ‘సమస్య’ ఏమిటి? జూహీ భూత్ బంగ్లా చూడాలన్న చిరకాల కోరిక తీర్చుకోవాలనుకోవడం. అందుకని రెండో సీనులో ఆమె వచ్చి, ‘
నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అంది. తనని అక్కడికి తీసికెళ్ళ మంది. పడవ నడపడం వచ్చా అంది. ఇలా సమస్యకి దారి తీసింది. ఇది ఫ్లాష్ బ్యాక్ కాబట్టి, క్లుప్తత దృష్ట్యా, ఇదొక్కటి తప్ప మరిన్ని పరిస్థితుల కల్పన అవసరపడలేదు. 

         
4) సమస్యా స్థాపన :  వెంటనే తర్వాతి సీన్లో ఇద్దరూ పడవెక్కి భూత్ బంగ్లాకి బయల్దేరడం. ఇదే ఫ్లాష్ బ్యాక్ కి ప్లాట్ పాయింట్ వన్. ఇలా బిగినింగ్ విభాగం మూడు సీన్లలో అన్ని బిజినెస్ పరికరాలనీ  కలుపుకుని పూర్తయ్యింది.

          క మిడిల్ కొస్తే, మిడిల్ అంటే సమస్య తో సంఘర్షణ కాబట్టి,  భూత్ బంగ్లాలో దెయ్యాన్ని చూడాలన్న కోరికతో – సమస్యతో – దాని తలూకు అనుభవాల దొంతరగా  -  యాక్షన్ రియక్షన్ల మిడిల్ కుండే బిజినెస్ ఇక్కడ కనిపిస్తోంది. అనుకున్న దెయ్యం లేకపోగా, ఇద్దరూ సన్నిహితులయ్యే సంఘటనలు భూత్ బంగళా వెలుపల సైతం పొలాల్లో,  ప్రకృతిలో చీకటి పడేవరకూ కొనసాగాయి. ఈ మిడిల్ ని మానసిక పరిభాషలో చెప్పుకుంటే, ఇది వాళ్ళ సబ్ కాన్షస్ వరల్డ్ నిజానికి. సమస్యాత్మకంగా వుండే ఈ సబ్ కాన్షస్ వరల్డ్ లో మునకలేసీ లేసీ,  చివరికి సత్యాన్ని కనుగొన్నట్టు అతడి మెడలో ఆమె గొలుసు కట్టడంతో పూర్తయ్యింది....ఇలా ప్లాట్ పాయింట్ టూ కూడా ఏర్పడింది. 

         
ఎండ్ కొస్తే, ప్లాట్ పాయింట్ టూ తర్వాత ముగింపే కాబట్టి, ఎండ్ విభాగం మొదలయ్యింది.  ఆమె గొలుసు కట్టాక పడవెక్కి తిరుగు ప్రయాణమవుతూంటే, ఒడ్డున కాగడాలు. అక్కడ తాత. ఒడ్డుకి చేరగానే హీరోయిన్ని విడదీసి, హీరోకి తాత కొట్టే లెంపకాయ. ఆ తర్వాత సీన్లు వొంట్లో బాగాలేని హీరోయిన్ని ఆస్పత్రికి తరలించడం. ది ఎండ్.

          ఈ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథని ప్రేక్షకులు ఫీలవుతారు గానీ, హీరోహీరోయిన్లు ఫీలయినట్టు వుండరు. ఇదే గమ్మత్తు!

సికిందర్
         
(ఓ ఇద్దరు ముగ్గురు దర్శకులు ఇక్కడ వివరిస్తున్న ‘ది క్లాసిక్’ లోని కళాసీ పని అర్ధమై ఇన్స్ పైరవు తున్నారు. ఐతే ఇలా తీయాలంటే ముందుగా 10 శాతం పేపర్ వర్క్, 90 దర్శకత్వం మైండ్ సెట్లోంచి బయటికి వచ్చి, 90 శాతం పేపర్ వర్క్, 10 దర్శకత్వం ప్రపంచంలోకి రావాలి తప్ప, కాకుండా ఎన్ని ఆశలుపెట్టుకున్నా ప్రయోజనముండదని వేరే చెప్పనవసరం లేదు) .




Friday, June 15, 2018

656 : స్క్రీన్ ప్లే సంగతులు -7


    (జరిగిన కథ : భూత్ బంగ్లా లోంచి వచ్చిన జూహీ, జూన్ హాలు వర్షంలో తడుస్తూ పొలాల మధ్య వున్న మంచె మీద తల దాచుకుంటారు. వర్షం తగ్గాక తిరిగి జూహీని మోసుకుంటూ బయల్దేరతాడు జూన్ హా చీకట్లు ముసురుకుంటోండగా...)
        సీన్ :   చీకట్లు ముసురుకుంటున్న వైడ్ యాంగిల్లో తిరిగి ఆమెని మోస్తూ వుంటాడు. ఆకాశం నిండా తారలు వెలుస్తాయి. బరువుగా వున్నానా – అంటుంది. లేదంటాడు. బాగా తింటాను, అందుకని బరువుగానే వుంటానంటుంది. ఫర్వాలేదంటాడు. నిన్నెంత దూరమైనా మోస్తానంటాడు. అబద్ధం చెప్తున్నావంటుంది. లేదంటాడు. అవునంటుంది. లేదంటాడు.

పాయింట్ :  
      ఈ సీన్లో, గత సీన్లో ఆమెని మోస్తున్నప్పుడు ఎక్కడా క్లోజప్స్ తీయలేదు లైంగికంగా రెచ్చగొడుతూ. ఆమె మోస్తున్నప్పుడు అతను ఏ భావోద్రేకాలకీ లోను కాడు. అవన్నీ ప్రేక్షకుల మనసులో ఇంకో ఆలోచన కలగనివ్వని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ లాంగ్ షాట్సే. ఈ సీనులో ఇంకొక్క పాయింటుతో కొనసాగించాడు జూన్ హా పాత్రచిత్రణని. వెనుక సీన్లో జూహీని ఇంటికి భద్రంగా చేరవేస్తానని పరోక్షంగా హామీ ఇస్తున్నట్టు మాట్లాడేక, ఇప్పుడెంత దూరమైనా మోస్తానంటున్నాడు సింబాలిక్ గా. ఆమె నమ్మనంటోంది. ఈ మాటలతో కథకి సస్పెన్స్ కూడా ఏర్పడుతోంది. ఈ ప్రేమకథలో కష్టాలెదురైతే అతడామెతో కొనసాగుతాడా  లేదా అని. ఆమె కాలు బెణికి పడిపోవడం అనే సంఘటనని ఈ పాత్ర చిత్రణకి వాడుకున్నాడు దర్శకుడు. అదే సమయంలో కథని సస్పెన్సు తో ఫోర్ షాడోయింగ్ చేస్తున్నాడు. బరువు మోస్తాడా లేదా అని డైలాగులు వూరికే లేవు. ఇవి పాత్ర మనస్తత్వంతో బాటు, ఈ ప్రేమ కథలో ఏదో తెలియని సస్పెన్సు ని పోషిస్తున్నాయి – కష్టాల్ని తట్టుకుని ఆమెతోనే వుంటాడా  అని. 

సీన్ : చీకట్లో చిన్న కొలనులా  వుంటుంది. చెక్క వంతెన దాటతాడు ఆమెని మోస్తూనే చీకట్లో. చుట్టూ మిణుగురు పురుగులు ఇందాకటి ఆకాశంలో తారల్లా మెరుస్తూంటాయి. చకితురాలై చూస్తూంటుంది. ఆమెని కూర్చోబెట్టి మిణుగురు పురుగుల్ని పట్టడానికి దిగుతాడు. కాస్త కష్టపడి ఒకదాన్ని పట్టుకుంటాడు. తెచ్చి ఆమె గుప్పెట్లో పోస్తాడు. గుప్పెట్లో పొదువుకుని మురిసిపోతుంది దాన్నే చూస్తూ. 

పాయింట్ :    వెనక సీను ముగింపులో ఆకాశంలో తారల్ని చూపీంచింతర్వాత, ఈ సీనులో మిణుగురు పురుగులు చూపిస్తున్నాడు. మ్యాచింగ్ సీన్ ట్రాన్సిషన్స్. శ్రమకోర్చి భావుకతని ప్రదర్శిస్తున్నాడు. ఇది ఉత్త భావుకతేనా, ఇంకేదైనా కాన్సెప్ట్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేస్తున్నాడా? వాటర్ కాన్సెప్ట్ ని బ్యాక్ గ్రౌండ్ లో వాడుకుంటున్నాడని వెనక సీన్లలో చెప్పుకున్నాం. ఇప్పుడు పంచభూతాల్లో రెండో ఎలిమెంట్ అయిన వెలుగు (నిప్పు) ని వాడుకుంటున్నాడు. తారలూ, మిణుగురు పురుగులు ఇందుకే.  తారలకి డ్రీమ్ డిక్షనరీ మీనింగు సాఫల్యత. ఒక విజయం సాధించడం. వెనుక సీనువరకూ చూసుకుంటే వీళ్ళిద్దరూ ప్రేమ సఫలమయ్యే దిశగానే పయనిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సీనులో ఏం చూపించాలి? ప్రేమ సఫలమయ్యాక సంయోగమేగా? అదేగా ప్రేమకి గమ్యం? అదే ఇక్కడ మిణుగురు పురుగుల రూపంలో చూపిస్తున్నాడు. మిణుగురు పురుగుల డ్రీమ్ డిక్షనరీ మీనింగు సంయోగమే. జంటని ఆహ్వానించే సంయోగ సంకేతంగానే మిణుగురు పురుగులు వెలుగుల్ని విరజిమ్ముతాయి. అదే జరుగుతోందిక్కడ పాత్రలకి కూడా. ఒక మిణుగురు పురుగుని పట్టి ఆమెకివ్వడం ద్వారా సింబాలిక్ గా వున్న ఇద్దరి ప్రేమా సంగమ తీరానికి చేరినట్టయింది.

సీన్ :  
     ఒడ్డున కాగడాలతో ఓపెనవుతుంది. చీకట్లో పడవలో అవతలి ఒడ్డుకి సాగిపోతూంటారిద్దరూ. ఒడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులుంటారు. ఆమె మిణుగురు పురుగు కాస్త పట్టుకోమని అతడి కిస్తుంది. తన మెళ్ళో గొలుసు తీస్తుంది. అప్పుడామె – నాకు మిణుగురు పురుగిచ్చావ్, నన్ను మోసుకుంటూ వచ్చావ్, బదులుగా నీకు నేను ఇంతకంటే ఇవ్వలేనని అంటుంది. ఆ గొలుసు అతడి మెడలో వేస్తుంది. పడవ వొడ్డుకి చేరుతుంది. అక్కడున్న మనుషులు ఆమెని అందుకుంటారు. ఒకడు ఆమెని వీపు కెత్తుకుని పోతూంటాడు. ఆమె తాత గారు జూన్ హా ముందుకొచ్చి నిలబడతాడు. చాచి లెంపకాయ కొడతాడు.

పాయింట్ :  వీళ్ళు వచ్చిన పడవ ఎప్పుడో కొట్టుకు పోయుంటుంది – తాతగారి మనిషి ఇటు పడవేసుకొచ్చి ఎక్కించుకున్నాడని ఈ సీనులో అర్ధమౌతోంది. సీను ఓపెనింగ్ కాగాడాల వెలుగుతో వుంటుంది. ఇటు చూస్తే వీళ్లిద్దరూ కూర్చుని కనిపిస్తారు. కాగడాల వెలుగులో నిదానంగా సాగిపోతున్నట్టు. కానీ పడవ ఫ్రేములో వుండదు. అటు ఒడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులు ఓపెనయ్యాక, అప్పుడు ఇటు పడవ ఫ్రేములో కనిపిస్తుంది. ఇంకెవడో తెడ్డు వేస్తున్న వాడు కూడా ఓపెనవుతాడు. అప్పుడు ఇది అవతల్నుంచి వచ్చిన వేరే పడవని మనకి అర్ధమవుతుంది.



          చాలావరకూ ఏం చేస్తూంటారంటే,  సీను ప్రత్యంగుళం ఏమిటా అని ప్రేక్షకుల పరిశీలనకి పెట్టకుండా మొత్తమంతా ఒకేసారి విప్పి చూపించేస్తారు. సీను ఓపెన్ చేయడం చేయడం ఒకేసారి మొత్తమంతా చూపించేశాక, ఇక ప్రేక్షకులు ఫాలో అయ్యేదేముంటుంది. ఓ రెండు కోట్ల సినిమాకి ఒక సీను విలువ మూడు లక్షలు చేస్తుందనుకుంటే, ఆ మూడు లక్షలకి సరిపడా కంటెంట్ తో సీను నిలబడకపోతే, ప్రేక్షకుల్లోకి చొచ్చుకు పోకపోతే, ఆ మూడు లక్షలూ దండగే. మొత్తం కథా ప్రపంచంలో భాగమైన సీను లోతుపాతులు తెలుసుకోక చుట్టేయడమే. 

          ఈ సీను డైరెక్టుగా మొత్తం ఒకేసారి చూపించేస్తూ ఇలా తీస్తే ఎలా వుందేది – అవతలి వొడ్డున కాగడాలు కన్పించాయి. ఇటు వేరే వ్యక్తి తెడ్డు వేస్తున్న పడవలో హీరోహీరోయిన్లు పోతున్నారు. అటు వొడ్డున హీరోయిన్ తాత గుర్రుగా చూస్తున్నాడు. ఆమె అతడికి గొలుసు కట్టింది. తాత మండిపడ్డాడు లేదా రగిలిపోయాడు. పడవ వొడ్డుకి చేరింది. తాత  అనుచరులు హీరోయిన్ ని దురుసుగా లాగి ఎత్తుకున్నాటు. తాతవచ్చి హీరో ని కొట్టాడు...ఇలా వుంటే ఎలా వుండేది?

          ప్రేక్షకులు అంచెలంచెలుగా ఫాలో అవడానికేం లేదు. అన్నీ ఒకేసారి కనిపించేస్తున్నాయి. కొసరి కొసరి వడ్డన లేదు. అన్నీ కలిపి ముద్ద పడేసినట్టుంటుంది. లేదా పిండా కూడు పెట్టినట్టుంది. కాకులు కూడా ఇంట్రెస్టు చూపించవు. సీను రుచికరంగా లేదు. ప్రేక్షకులు దృశ్యాత్మక అనుభవం కోసం కూడా సినిమాల కొస్తారు. కెమెరా అంటే దిష్టిబొమ్మ కాదు. మేకర్  తానొక్కడే రాసిన కథొక్కటే చెప్పలేడు. కెమెరా కూడా ఇన్వాల్వ్ అయి విజువల్ గా చెప్తుంది. దానికా అవకాశమివ్వకపోతే  పగదీర్చుకుని పరమ పిండాకూడు చేస్తుంది సీనుని. 

          ఇక్కడ ఇంత చిన్న సీనులో ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయడానికేం చేశాడంటే, ముందు దూరంగా కాగడాలతో ఓపెన్ చేశాడు. కాగడాలెందుకు? వెనక రెండు సీన్లలో తారలతో, మిణుగురు పురుగులతో ఓపెన్ చేశాడు కాబట్టి. పంచభూతాల్లో నీటికి తోడు  నిప్పుని కూడా వాడుకుంటున్నట్టుగా  - ఆ తారల్నీ, మిణుగురు పురుగుల్నీ చూపిస్తున్నట్టే  - ఇక్కడ కాగ డాలనే నిప్పుతో ఓపెన్ చేశాడు. ఇలా ప్రతీ సీనులో ముందుగా ఈ థీమాటిక్ కంటిన్యుటీని ఎస్టాబ్లిష్ చేసి, అప్పుడు విషయం లోకొస్తున్నాడు. 

          తారలూ మిణుగురు పురుగులూ లా కాకుండా, ఈ కాగడాలు డైరెక్టుగా నిప్పే. నిప్పుని చూపించేస్తున్నాడు. అంటే వీళ్ళ సాంగత్యం ఇక నిప్పులో పడిందన్నమాట. పగలు పడవెక్కి బయల్దేరినప్పుడు నది నీటితో ప్రారంభమై, ఆపైన వర్షపు నీటితో వాటర్ ఎలిమెంట్ కొనసాగింది. అక్కడ్నించీ అంచెలంచెలుగా తారలతో, మినుగురు పురుగులతో సాగి, ఇప్పుడు ఏకంగా కాగడాలతో  డైరెక్టు నిప్పనే ఇంకో ఎలిమెంట్ కి చేరింది పరిస్థితి. 

          కానీ వీళ్ళని కలిపిన నీటికి నిప్పుతో ప్రమాదముంటుందా? వుండదు. నిప్పునే నీరు ఆర్పేస్తుంది. కనుక  వీళ్ళకిప్పుడు ఎదురైన ఆపదని అధిగమించి మళ్ళీ కలుసుకుంటారన్న మాట. 

          కాగడాలు చూపించగానే పరిస్థితి  ఉద్రిక్తంగా తయారైందని తెలిసిపోతుంది. వెంటనే సీను ఆసక్తి కల్గిస్తుంది. ఇటు చూస్తే,  వీళ్ళిద్దరూ కూర్చుని తేలిపోతున్నట్టూ వుంటారు. ఎక్కడ దేనిమీద తెలిపోతున్నారో వూహకందక ఇన్వాల్వ్ అయి పరిశీలనాత్మకంగా, పట్టి పట్టి చూస్తూంటాం. చూస్తే  తేలిపోతున్నట్టే వుండరు. ఇంకా కొలను దగ్గర చెక్క వంతెన మీదే కూర్చున్నట్టుంటారు. 

        ఇప్పుడు  వొడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులు ఓపెనవుతారు. వెంటనే ఇటు ఓపెన్ చేస్తూ షాట్ వేస్తే, అప్పుడు వీళ్ళిద్దరూ పడవలో వున్నార్రా బాబూ అని అర్ధమవుతుంది. తదేక ధ్యానంతో ఇన్వాల్వ్ అయి చూసే సగటు ప్రేక్షకుడు, వార్నీ అనుకుని నోటి మీద వేలేసుకుంటాడేమో. వీళ్ళిలా పడవలో పోతున్నారంటే,  పగలు కొట్టుకు పోయిన పడవ మళ్ళీ దొరికిందేమో అనుకుంటాం. చీకట్లో ఎలా దొరికిందబ్బా అని కూడా అనుకుంటాం - జూన్ హా పడవ నడుపుతున్నట్టు లేడే? ఎటు వెళ్తోంది పడవ వదిలేసి ఇలా కూర్చుంటే ఇంత రాత్రి?

          అప్పుడు ఆ వెనకాల తెడ్డు వేస్తున్న మనిషి ఒపెనవుతాడు. వార్నీ అని మళ్ళీ అనుకుని, కిందపడి గిలగిల కొట్టుకోవచ్చు నేల టికెట్ చూపరి. కెమెరా ఇలా టీజ్ చేస్తోంది. కెమెరా టీజ్ చేయకపోతే, సినిమా ఒక్కదానికే వరించిన అంత సువిశాలమైన వెండితెరకి ఆ ఛాయాగ్రహణం వేస్టు.

          నిజానికి స్క్రీన్ ప్లేలో వన్ లైన్ ఆర్డర్ తర్వాత రాసే ట్రీట్ మెంట్ పైవిధంగా సకల విశేషాలూ కలుపుకుని వివరణాత్మకంగా వుండాలి. ఇలా ఎవరు రాస్తున్నారు? ఎవరు రాయనిస్తున్నారు? ఎలాగో రాసినా ఎవరు తీస్తున్నారు? విజువల్ కథనాన్నిమిళితం చేయకుండా, డైలాగుల క్రియేటర్ గా, ఉత్తుత్తి కెమెరా యాంగిల్స్ ల రీక్రియేటర్ గా అన్పించుకోవడమేనా దర్శకత్వమంటే?

          ఒక హాలీవుడ్ వెబ్సైట్లో ఇలా చెప్పారు – స్క్రిప్టు రాతపని త్రికోణమని. అంటే కథకుడు – కథ – ప్రేక్షకుడు బంధంగా వుంటుందని. దీన్ని చతుర్భుజంగా  మార్చాలేమో....కథకుడు – కథ – కెమెరా - ప్రేక్షకుడూ అని! 

     అలా పడవలో సాగిపోతున్నప్పుడు -  నువ్వింత చేశావు, నీకింతకంటే ఇవ్వలేనని తన గొలుసు తీసి అతడి మెడలో వేస్తుందామె. భూత్ బంగ్లాకి బయల్దేరినప్పట్నుంచీ,  ఇప్పటివరకూ వీళ్ళతో గొలుసుకట్టు కథనం ఇలా గొలుసు కట్టడంతో సుఖాంత మైంది. ఏఎ సుఖాంతానికి ట్విస్టు వొడ్డు చేరాకా...

       వొడ్డుకి చేరాక  అక్కడ ఎదురుచూస్తున్న హీరోయిన్ తాత అనుచరుల ఉద్రేకాలుండవు, మాటలుండవు. ఎందుకుండవు? ఉద్రిక్తతని కాగడాల మంటలే చెప్తున్నాయి. ఇంకా మనుషులు రగిలిపోయి రంకేలేయడం వుండదు. వుంటే కాగడాలనే సింబాలిజానికి అర్ధమే వుండదు. సింబాలిజమున్నాక  మళ్ళీ రియాక్షన్స్ దేనికి? సింబాలిజమే రియాక్షన్. 

          కాలు బెణికిన జూహీని మనిషి ఎత్తుకుని పోతూంటాడు. ఇతర మనుషులు అనుసరిస్తారు. అప్పుడు తాత ఫ్రేములోకొస్తాడు. జూన్ హాని తీక్షణంగా చూసి చూసి, చాచి  లెంపకాయ కొడతాడు. తాతని ఇంతవరకూ ఓపెన్ చేయలేదు. చేస్తే ఒక ఎజెండాతో చేసుకొస్తున్న విజువల్ కథనం దెబ్బతింటుంది. అందుకని మొత్తం ఈ ఎపిసోడ్ అంతటికీ జడ్జిమెంటుగా చిట్టచివర్నే తాతని చూపించి,  కొట్టేలా చేశాడు.

సీన్ :  కొన్ని వాహనాలు సాగిపోతూంటాయి...జూహీకి వొంట్లో బాగోక సియోల్ నగరానికి తీసి కెళ్ళినట్టు జూన్ హా వాయిసోవర్ వస్తూంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.


సికిందర్

           




655 : విజ్ఞప్తి

   మరోసారి విజ్ఞప్తి 
               మీ సినిమా కథలు, స్క్రీన్ ప్లేలు మీరు స్వయంగా తయారు చేసుకోవడానికి అవసరమైన విషయ పరిజ్ఞానమంతా బ్లాగులో పొందుపర్చాం, ఇంకా పొందుపరుస్తూ వుంటాం. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ పేర కూడా పూర్తి మెటీరియల్ బ్లాగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇటీవల అవకాశం కల్పించాం. వీటిని అవగాహన చేసుకుంటే మీ స్క్రిప్టులు మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు. ఇది మీకు అందిస్తున్న ఉచిత సదుపాయం. ఇలాకాక మా సాయం తీసుకుని మీ స్క్రిప్టులకి రూపకల్పన చేసుకోవాలనుకుంటే మాత్రం ఉచిత సదుపాయం కల్పించడం అసాధ్యమవుతోందని తెలుపడానికి విచారిస్తున్నాం. దీనికి సమయం కేటాయించే పరిస్థితులు కూడా ఇక లేవు. మహా అంటే మీ కథ విని దాని బాగోగులు చెప్పగలం. సరిదిద్దాలంటే సుదీర్ఘ ప్రక్రియని డిమాండ్ చేస్తుంది. ఇది ఉచితంగా సాధ్యం కాదు. ఒకవేళ పరిశీలనకి మీ ట్రీట్ మెంట్ ని గానీ, డైలాగ్ వెర్షన్ ని గానీ పంపదలిస్తే, ఇది కూడా ఉచితంగా సాధ్యంకాదు. ఇవి చదవాలంటే సమయమూ శ్రమా అవసరపడతాయి. 

          ఇక్కడొక ముఖ్య విషయం గమనించాలి. మీరు అప్పటికే మీ కథని నిర్మాతలకో, హీరో లకో విన్పించి, ఓకే చేయించుకుని వుంటే ఇక మమ్మల్ని సంప్రదించనవసరం లేదు. అందులో మార్పు చేర్పులు చేయాల్సి వస్తే, ఆ సవరణలతో మళ్ళీ మీరు కొత్త కథ చెప్పి ఒప్పించుకోలేకపోవచ్చు. ముందొకలా చెప్పి, ఇప్పుడొకలా చెప్తున్నారని మీకిచ్చిన అవకాశాన్ని రద్దు చేయవచ్చు. కనుక మీరెలా ఓకే చేయించుకున్నారో అలాగే  ముందుకు సాగిపోండి. నిజంగా మీ కథ పట్ల అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేసుకున్న తర్వాతే అవతల విన్పించాలని మీకన్పిస్తే, అప్పుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. 

          ఇకపోతే, ముందుగా మీరే స్కూలో నిర్ణయించుకోండి. మీరు స్ట్రక్చర్ లేని క్రియేటివ్ స్కూలైతే ఇక దేనికీ మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు ఒట్టి క్రియేటివ్ స్కూలునే నమ్మేవారైతే, మీకు స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ స్కూలు అస్సలు నచ్చదు. అర్ధం కాదు కూడా. ‘శివ’ ని కూడా శాస్త్రీయంగా అర్ధం చేసుకోలేరు. కనుక మీ సొంత క్రియేటివిటీతో క్రియేటివ్ స్కూలులో రొటీన్ గా సాగిపోండి. మీరు ఈ బ్లాగుని సందర్శించి, ఇందులోని విషయాలు తెలుసుకోవాలనుకోవడం కూడా వృధా అని గమనించండి. 

          మీరు స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ స్కూలు కోరుకుంటేనే మమ్మల్ని సంప్రదించండి. వీటిలో కూడా కాలం చెల్లిన పాత మూస కథలతో కలవకండి. వీటిలో కూడా డైలాగ్ వెర్షన్ వరకూ మొత్తం రాసుకుని కలవకండి. డైలాగ్ వెర్షన్ కూడా రాసుకుని మీరు ఫైనల్ అయ్యారంటే, స్ట్రక్చర్ లో ఏది మార్చాలన్నామీకు మనసొప్పదు. మీరు రాసుకున్న డైలాగ్ వెర్షన్ ని మీరు బాగా ప్రేమిస్తారు కూడా. మీ కథేమిటో మీరే చెప్పలేనంత గందరగోళంగా డైలాగ్ వెర్షన్ వున్నా కూడా దాన్ని మార్చుకోలేనంత గాఢంగా మీరు దాన్నే ప్రేమిస్తారు. అసలు కథే ఎక్కడా ఓకే కాకుండా అప్పుడే డైలాగ్ వెర్షన్ రాసుకోవడం మీకెన్నో విధాలా అడ్డంకుల్ని సృష్టిస్తుందని గుర్తించండి. 

          ఈ పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పరస్పరం సంహకరించుకుంటే  సత్ఫలితాలు వస్తాయని నమ్ముదాం.

సికిందర్
         

Friday, June 8, 2018

654 : స్క్రీన్ ప్లే సంగతులు


( జరిగిన కథ : జీహై – జూన్ హా ఇద్దరూ వూరి బయట భూత్ బంగ్లా కెళ్తారు. అక్కడ జీహై, జూన్ హాకి మానసికంగా దగ్గరవుతుంది. భూత్ బంగ్లా లో దెయ్యాన్ని కాక పిచ్చోణ్ణి చూసి నవ్వుకుని బయల్దేరతారు...)
        సీన్ : తిరిగి నదీ వారగా వచ్చేసరికి పడవ కొట్టుకు పోతూ వుంటుంది. ఏం చెయ్యాలో అర్ధం గాదు. ఇంతలో ఒక్కసారిగా వర్షం ప్రారంభమవుతుంది. జూహీ వెనక్కి తిరిగి చెట్ల వైపు వురుకుతుంది. జూన్ హా కూడా వురుకుతాడు. ఆమెని దాటుకుని పోతాడు. పోయే సరికి వెనుక ఆమె కాలు బెణికి కిందపడిపోయి అరుస్తుంది. వెనక్కి వచ్చి లేపుతాడు.నడవలేకపోతుంది. వీపు మీద ఎక్కమంటాడు వంగి. ఆమె తటపటాయించి అతడి వీపెక్కుతుంది, మోసుకుంటూ వర్షపు జల్లులో పొలాల వెంబడి పరిగెడతాడు.

పాయింట్ :   వెనక భూత్ బంగ్లా సీనులో ఒక షాట్ ని గమనించాం. మనం బుర్రగొక్కుంటూ చూసేలా వున్న ఆ షాట్ ఏమిటో కూడా చెప్పుకున్నాం. దెయ్యం వుందనుకున్న గది వైపుకి జూన్ హా,  షాట్ లోకి వంగి నడుస్తూ రైట్ ఎంట్రీ ఇస్తే, అతడి మీద వాలుతున్నట్టు జూహీ కూడా రైట్ నుంచి ఏటవాలుగా ఎంట్రీ ఇస్తుంది.  దర్శకుడు ఈ షాట్ ని ఇలాటి బాడీ లాంగ్వేజీతో  ఎందుకు తీశాడా అని మనం బుర్ర గోక్కున్నాం. దీని సింబాలిక్ అర్ధం ఇప్పుడు ఈ సీన్లో చూస్తున్నాం. ఇక్కడ ఆమె కాలు బెణికి అతడి వీపెక్కాల్సి వచ్చింది. అంటే జరగబోయేది ముందుగానే కాలం వాళ్ళ అలాటి బాడీ లాంగ్వేజీలో చెప్పేసిందన్న మాట. కొన్ని మనకి తెలీకుండా చేసేస్తూంటాం. అది కాలం చేస్తున్న హెచ్చరిక అనుకోం. కాలంలో ముందేం జరుగుతుందో మనం వూహించలేం. వూహించి వుంటే జీహై  అలా  ఏటవాలుగా అతడి వెనకాల వెళ్తున్నప్పుడే - నేనేమిటి ఇలా వెళ్తున్నాను, ఇతడి వీపెక్కే పరిస్థితి వస్తుందా అని అప్పుడే ఆలోచించి వుంటే, తర్వాత పరిగెడుతున్నప్పుడు కాలు బెణక్కుండా జాగ్రత్త పడేదేమో. ఇలాటి గమ్మత్తులు చేస్తూ కాలం వీళ్ళని ఎలా కలుపుతోందో చూస్తున్నాం. వెనక సీన్లో జూహీ  మానసిక ఎటాచ్ మెంట్, దాని ప్రభావానికి ఫిజికల్ గా ఆమె కింద పడిపోతే అతనూ కింద పడిపోవడం, ఇప్పుడీ సీనులో ఇలా ఫిజికల్ గా ఇద్దరూ ఎటాచ్ అయిపోవడం.

     ఈ సీనులో ఒక లోపమున్నట్టు అన్పించవచ్చు. వర్షం ప్రారంభం కాగానే జూహీ వెనక్కి తిరిగి పరుగెత్తుతుంది. అలాగే ఆమెని దాటుకుని పోయి జూన్ హా కూడా  పరుగెత్తుతాడు. ఆమె కాలు బెణికి పడిపోతే అప్పుడు వెనక్కి వచ్చి ఆమెని చేరుకుంటాడు. అప్పటి  వరకూ ఇద్దరూ ఎవరి మానాన వాళ్ళు వురుకుతున్నట్టే. ఒకర్నొకరు పట్టించుకోకుండా. 

          ఈ సినిమాని తెలుగులో కాపీ కొడితే మనమిలా చేస్తాం : వర్షం మొదలయ్యింది. ఇద్దరూ ఒక అనుభూతికి లోనయ్యారు. యంగ్ హీరోయిన్ చేతులు చాపి స్లో మోషన్ లో చిటపట చినుకులతో ఆడుకుంటోంది. తడిసిన ఆమె అందాలన్నీ సెక్సీ గా ఎక్స్ పోజ్ అవుతున్నాయి. యంగ్ హీరో పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తున్నాడు...వొళ్ళూ వొళ్ళూ రాపిడి. రగిలిన వేడి. ఎగిసిన ప్రేమ అలజడి!

          లేదా – వర్షం మొదలవగానే ఇద్దరూ చేతులు పట్టుకుని పరిగెట్టడం మొదలెట్టారు. ఆమె కాలు బెణికి పడిపోయింది. అతను లేపి వీపునేసుకున్నాడు...

          వాళ్ళు ఇన్నోసెంట్స్ అనీ, వాళ్ళల్లో ఇంకా అడాలసెన్సే తొంగి చూస్తోందనీ, పసిపిల్లల మనస్తత్వమనీ... ఇలా పాత్రలు ఎస్టాబ్లిష్ అయ్యాయనీ, గతంలోనే మనం చెప్పుకున్నాం. అయినా ఈ మానసిక స్థితిని, పాత్ర చిత్రణల్నీ  కిల్ చేసి - రోమాంటిక్ జయ కేతనాన్ని రెపరెప లాడించెయ్యాలనీ ఉబలాట పడతాం మనం సగటు తెలుగు సినిమాల అద్దె బుద్ధి కొద్దీ. 

          కొరియన్ దర్శకుడు సంకల్పించిన ఈ సీను ఎందుకు కరెక్ట్ అంటే, హీరోహీరోయిన్లు స్పష్టంగా ప్రేమని ఫీలవడం లేదు. పిల్లల్లాగే తిరుగుతున్నారు. పిల్లలు ఏదైనా జరిగితే ఎవరి మానాన వాళ్ళు జంప్ అయిపోతారు. చిన్నపిల్లలు మొదట తమ సేఫ్టీ చూసుకుంటారు. తోటి పిల్లకాయ గోతిలో పడితే తర్వాత వచ్చి చూస్తారు. అందుకని భూత్ బంగ్లా సీనులో గదిలో ‘దెయ్యాన్ని’ చూసి హీరో కేకలేసుకుంటూ హీరోయిన్ని పట్టించుకోకుండా ఎలా పారిపోయాడో, తర్వాత ఆమె కేకలు విని నాలిక్కర్చుకుని ఎలా వెనక్కొచ్చాడో, అదే మనస్తత్వంతో వున్న హీరోయిన్ ఇప్పుడు వర్షం మొదలవగానే తన మానాన తాను  పరుగెత్తడం మొదలెట్టింది. హీరో కూడా ఆమెని దాటుకుని తన మానాన తాను  పరుగెత్తాడు. ఆమె పడిపోగానే వెనక్కొచ్చాడు. వాళ్ళు ప్రేమని ఫీలయితే అలా ఎవరి మానాన వాళ్ళు పరుగెత్తే వాళ్ళు కాదు. కాలం మాత్రమే వాళ్ళ మధ్య ప్రేమని ఫీలవుతోంది- వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తోంది. అందుకని వాళ్ళకేం జరుగుతోందో ఇంకా వాళ్లకేం తెలీదు.

          ఈ సీన్ కట్ చేశాక దర్శకుడేం చేయాలి? ఇప్పుడామెని వీపెక్కించుకుని వర్షంలో పొలాల వెంబడి పరిగెడుతూ వున్నాడు.  దీన్తర్వాత సీనేం వేయాలి? ఇప్పుడెలాగూ వానలో శరీరాలు అతుక్కున్నాయి కాబట్టి వాన పాటేసుకోవాలా?  మనం ఇలాగే చేసి కుతి తీర్చుకుంటాం. మనం రాసేవన్నీ ఇదివరకు సినిమాల్లో వచ్చేసిన టెంప్లెట్ సీన్లే కనుక, చూసిన తెలుగు సినిమాల్లో సీన్లన్నీ గుర్తుచేసుకుంటూ, వాటిని  పేర్చుకుంటూ పోవడమే మనం కథ రాయడమంటే.  ఇలాంటప్పుడు చూసిన సినిమాల్లో రకరకాల వాన పాటలూ మనకి  మెదుల్తాయి తప్పక. కాబట్టి ఆ టెంప్లెట్ లో వాన పాటొకటి వేసేస్తే మనకి  పని భారం కూడా తగ్గుతుంది. కవిగారూ, సంగీత దర్శకుడూ ఆ అయిదు నిమిషాల  స్క్రీన్ స్పేస్ ని ఎలా భర్తీ చేయాలో  వాళ్ళ పాట్లేవో  వాళ్ళు పడతారు. మనం పని తప్పించుకుని వెళ్లిపోవచ్చు. పాట కాగానే హీరోయిన్ తాతగారి మనుషులతో హీరోకి ఫైట్  వేసేస్తే ఆ పావు గంట నిడివితో ఫైట్ మాస్టర్ తంటాలు పడతాడు. మనం మొత్తం కలిపి ఈ ఇరవై నిముషాలు సీన్లు రాయకుండా ఎస్కేప్ అవ్వొచ్చు!  తక్కువ పని చేసి ఎక్కువ నష్టం కలిగించే మన మోటోని వీటో చేసే వాళ్ళెవరూ వుండరు. మన జీవితం ఆరు స్క్రీన్ ప్లేలూ ఇరవై కూలి దినాలుగా గడిచిపోతుంది...కమ్మగా నిద్రపోవచ్చు. 

          ఇలాటి విద్రోహపు ఆలోచనలు కొరియన్ దర్శకుడికి రాలేదు. తర్వాతి సీనేం చేయాలో మొదలెట్టిన సైకలాజికల్ ట్రాకుని అనుసరిస్తూనే  పోతున్నాడు. పాత్రల సైకాలజీయే కథనం చేస్తుంది, సీన్లు వస్తాయి.  ఇలాటి సైకలాజికల్ ట్రాక్ ని నియో నోయర్ మూవీ ‘బ్లడ్ సింపుల్’ లో కథానాయకుడు విస్సర్ పాత్రలో మనం గతంలో చూశాం. ఫారినోళ్ళు ఒఠ్ఠి పిచ్చోళ్ళు. క్యారక్టరైజేషనూ, పనికిమాలిన సైకలాజికల్ ట్రావెలూ అంటూ బొత్తిగా మనకి నీచాతినీచమన్పించే పనులేవో చేస్తారు. మనక్కావాల్సింది ఒక ఫ్లాపు తీయడానికి ఫ్లాపంటి పన్నెండు సూత్రాలు. ఫ్లాపే మన జీవన మాధుర్యం. అదెంతో తియ్యనైన పదార్ధం.

          పడుచు హీరోహీరోయిన్లు పడవెక్కిన కాణ్ణించీ ఇప్పుడు వర్షంలో ఇలా వీపెక్కడం వరకూ ఇదంతా కథనం డిమాండ్ చేస్తున్న వాళ్ళ మానసిక -  శారీరక సాన్నిహిత్యాల సెటప్ అన్నమాట. స్ట్రక్చర్ అంటే ఇదే. సైకాలజిస్టు చూసినా ఈ ట్రాకుని తప్పుబట్ట లేడు. ఇలా సెటప్ చేసిన తర్వాత ఇద్దర్నీ ఒక చోట సెటిల్ చేసి మాట్లాడుకోనివ్వాలి. జీవితంలో ఎవరి సైకలాజికల్ ట్రాకైనా ఇంతే. చర్యలన్నీ మానసికమైనవే. మనసులోనే పుడతాయి. ఇలా సెటప్, ఆ తర్వాత సెటిల్, దీంట్లో మాటలతో మరింత దగ్గరవడం. వీళ్ళెలా సెటిలయ్యారో కింది సీన్లో చూద్దాం.

 సీన్ :    కెమెరా టిల్ట్ డౌన్ చేస్తూంటే ఇద్దరూ మంచె ఎక్కి  కూర్చుని వుంటారు పొలాల మధ్య. వర్షం పడుతూ వుంటుంది. ఆమె ముడుచుక్కూర్చుని వణుకుతూ వుంటుంది. అతను తడిసిన షర్టు విప్పి, పిండి ఆమెకిస్తాడు. ఆమె తల, చేతులు  తుడుచుకుని షర్టు అందిస్తుంది. ఆ నీళ్ళు పిండి ఇంకోసారి ఇస్తాడు. చెంపలు తుడుచుకుతుంది. పొలంలో కాసిన పుచ్చకాయ తెంపు కొస్తాడు. చేత్తో దాన్ని ముక్కలు చేసి ఆమెకో ముక్క ఇచ్చి తానొకటి తీసుకుంటాడు. అతను చేత్తో ఒక్క దెబ్బకి పుచ్చకాయని పది ముక్కలు చేసినప్పుడు,  చిన్న పిల్లలా ఆనందపడి నవ్వుతుంది. ఇద్దరూ తియ్యగా తింటూంటారు. వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామంటాడు. పడవెలాగో వస్తుందంటాడు. దీంతో సీను పూర్తవుతుంది. వర్షం వెలిసి లాంగ్ షాట్ లో ఇంద్ర ధనుస్సు వెలుస్తుంది. 

          పాయింట్ :  ఈ సీనులో భూత్ బంగ్లాలో కనపడ్డ పిచ్చోడితో గల సింబాలిక్ మీనింగు దర్శన మిస్తుంది. పిచ్చోడు చంకలో చుట్టి పెట్టుకున్న కోటు లోంచి గడ్డి పరకలు వేలాడుతూ వుండడం  గమనించాం. గడ్డి ఇక్కడ ఈ మంచె మీద పరచి వుంది. పిచ్చోడు తలకి కోటు చుట్టుకుని వుండడాన్నీ గమనించాం. ఇక్కడ హీరో షర్టు విప్పి ఇస్తే హీరోయిన్ తడిసిన తల తుడుచుకుంది. ఈ కాకతాళీయాల్ని  కాలమహాత్మ్యంగా చమత్కరించాడు దర్శకుడు. వెనుక సీన్లో కాలం చెప్తున్న పిచ్చోడి సింబాలిక్ అర్ధం – మీరు వానలో తడిసినా మంచె మీద తల దాచుకోబోతారనీ,  అతడి షర్టుతో ఆమె తల తుడుచుకోబోతోందనీ...

          నిజానికి ఇలాటి  ఫోర్ షాడోయింగ్ సింబాలిజాలు ‘బ్లడ్ సింపుల్’ నిండా వున్నాయి. వాటిని విశ్లేషించుకున్నాం కూడా. ఫిలిం నోయర్, నోయో నోయర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు నిజానికి విధి రాత, తలరాత, చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నట్టు కర్మ ఫలాలు అనుభవించడాల  చుట్టూ కథలై సాగుతాయి. ఎక్కడైతే ట్రాజడీ, డ్రామా వుంటాయో అక్కడ సింబాలిజాలు చక్కగా వర్కౌటవుతాయి. ఎందుకంటే,  ఈ జానర్లు సమయం తీసుకుని  నిదానంగా సాగే సీన్లతో కూడి వుంటాయి గనుక. ట్రాజడీలూ డ్రామాలూ  అంటేనే ఆలోచనాత్మక కథలు. నటీనటులతో సీన్లు ఆలోచింపజేసేవిగా వుంటాయి కాబట్టి, చుట్టూ వాతావరణ పరిస్థితుల్లో సింబాలిజలు నాటడానికి ఎక్కువ ఆస్కారముంటుంది. ఈ సింబాలిజలు ప్రేక్షకుల సబ్ కాన్షస్ (అంతరంగం) తో కనెక్ట్ అయి తదేకంగా సినిమా చూసేట్టు చేస్తాయి. కొన్ని యాక్షన్ సినిమాల్లో సబ్ కాన్షస్ కనెక్షన్స్ కోసం బ్లర్ చేసిన కలర్ లైట్స్ చూపిస్తారు. 

          దర్శకుడు వీళ్ళిద్దర్నీ మంచె మీద ‘సెటిల్’ చేసి కాసేపు కాలక్షేపం చేయించాడు. ఐతే ఎక్కువ మాట్లాడించలేదు. ఆమె అతడి షర్టుతో తల తుడుచుకోవడం, ఇద్దరూ పుచ్చకాయ తినడం లాంటి అనుభవాలున్నాక ఇక మాటలు అవసరం లేదు. ఇలా వున్న సీనులో ఒకే ఒక్క మాట – అదీ జూన్ హా చేత పలికించాడు - వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ. జూన్ హా ఈ మాటనడం ఆమె పట్ల ఫీలవుతున్న బాధ్యతకి నిదర్శనం. ఆమెని  క్షేమంగా ఇల్లు చేరుస్తానని అభయమిస్తున్నట్టు ఆ మాటలున్నాయి. ప్రేమికుడి చేత సమయస్ఫూర్తితో ఇంతకంటే  ఏం పలికించాలి.  జూహీ క్షేమం కోరుకునే కుర్రాడు జూన్ హా అని ఎష్టాబ్లిష్ అయింది ఈ మాటలతో. 

           సీనుకో ‘కీ’  డైలాగు వుంటుంది మంచి సినిమాల్లో. ఆ  ‘కీ’  డైలాగు కథ గురించో క్యారెక్టర్ గురించో ఒక కొత్త సంగతి చెప్తుంది. ఆ ప్రకారంగా ఆ కథా లేదా పాత్రా సాగుతాయి. ఒక సీను ఉద్దేశం కథని ముందుకు నడిపించే అంశాన్ని లేవనెత్తడమో, లేదా క్యారెక్టర్ గురించి కొత్త విషయం చెప్పడమోగా వుంటుందని తెలిసిందే. 

          ఈ సీనులో దర్శకుడు ఆ ఒక్క డైలాగుతో ఆ రెండు కార్యాలూ  నిర్వహించాడు. ఆ  డైలాగు ఆమెకి అభయమిస్తున్నట్టుగా వుంటూనే, తిరిగి నది దగ్గరికి వెళ్ళబోతున్నారనీ తర్వాతి  సీనుకి లీడ్ ఇస్తోంది. 

          ఈ సీను డైలాగ్ ఎజెండా ఏమిటి, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డైలాగులు రాశారు - అన్నవి పరిశీలించదగ్గ అంశాలు. సెటప్ నుంచి సెటిల్ సెగ్మెంట్ కి కథనం మారేక, ఈ సెటిల్మెంట్లో సరస సంభాషణ మొదలెట్టలేదు తెలుగు సినిమాల్లోలాగా. వాళ్ళిలా సెటిలవడంలోని మజా వాళ్ళ చర్యల్లో విజువల్ గా బయట పడిపోతోంది. అతను తుడుచుకోవడానికి షర్టు ఆఫర్ చేయడం, తినడానికి పుచ్చకాయ ఇవ్వడం వగైరా. ఇంకా ఇంకా దీని తాలూకు డైలాగులు అవసరం లేదు. వెర్బల్ కథనం అవసరం లేదు. వాళ్ళ  చర్యల సారం (సబ్ టెక్స్ట్) వాళ్ళ మధ్య పరిస్థితి ఏమిటో చెప్పేస్తోంది విజువల్ గా.  ఇప్పటికి వాళ్ళు ఇలా  కలిసిరావడం, కలిసి తిరగడం, కలిసి కూర్చోవడం అన్నీ కూడా మొదలవబోయే  వాళ్ళ ప్రేమలో భాగమేనని మనకి బాగా తెలిసిపోయింది. తెలిసిపోయిన  ఈ విషయం పాతబడిపోయింది. గత ఇరవై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ పది సెకెన్లే. పది సెకన్లకి మించి ఒకే  విషయమ్మీద దృష్టి  పెట్టి చూస్తూ కూర్చోలేరు. ఎప్పటికప్పుడు విషయం  మారిపోతూ వుండాలి. 

      కాబట్టి ప్రేమలో పడతారనే విషయం పాతబడి పోయాక ఇంకా దీన్నే వాళ్ళ మధ్య డైలాగులతో బాదుతూ కూర్చోనవసరం లేదు. ఒక సీన్లో దృష్టిలో పెట్టుకోవాల్సిన సూక్ష్మ అంశాలు చాలా వుండి చస్తాయి. వీటిని వివరించినా డిస్కషన్స్ లో అందరికీ అర్ధంకావు. అర్ధం గాకపోతే నమ్మరు. నమ్మకపోతే నమ్మిందే చేస్తారు. అందుకని అరగుండు సినిమాలు గుండు గుత్తగా వచ్చేస్తున్నాయి...ప్రేక్షకుడి వంద రూపాయల టికెట్టుకి సరిపడా పూర్తి స్థాయి కళా మెళకువలతో సినిమాలు అందించడం ఇహ వల్ల కాదు.

          ఈ సీనులో ప్రేమ గురించి మనకి తెలిసిపోయాక, ఇంకో కొత్త విషయం కావాలి. ప్రేక్షకుడ నుకుంటాడు- సరేనయ్యా, ఇంతసేపూ ప్రేమలో రకరకాల స్థితి గతులు చూపించావ్- వాళ్లిక ప్రేమలో పడతారని డిసైడ్ అయిపోయాం – దీన్తర్వాత ఏం జరుగుద్దీ చెప్పవయ్యా బాబూ, క్యారెక్టర్స్ ని ముందుకు తీసికెళ్ళి కాస్త చూపించవయ్యా బాబూ  - అని డిమాండ్ చేసి కూర్చుంటాడు.

          ఇదే సీను చివర డైలాగుతో తీర్చేశాడు దర్శకుడు.  వర్షం తగ్గాక నది దగ్గరికి పోదామనీ, పడవెలాగో వస్తుందనీ హీరో చేత చెప్పించి. ఈ డైలాగు ప్రాముఖ్యమేమిటో పైన వివరించుకున్నాం. కాబట్టి హీరో పాత్రని ముందుకు తీసికెళ్ళి అతనేమిటో చెప్పించడం పూర్తి చేశాడు దర్శకుడు. ఈ హీరో ఇక హీరోయిన్ క్షేమం కోరుకునే కుర్రాడన్న మాట. 

          క్యారెక్టర్ కి సంబంధించి ఈ ‘కీ’  డైలాగుని మాత్రమే రిజిస్టర్ చేయడం సీన్ ఎక్స్ టెండెడ్ ఎజెండా అయినప్పుడు, సీను ప్రారంభాన్ని వేరే డైలాగులతో కలుషితం చేయకూడదు. వాటిలాగే ఈ ‘కీ’ డైలాగు కూడా గాలిలో కలిసిపోయే ప్రమాదముంది. 

          ఇక లాంగ్ షాట్ లో మంచెమీద వీళ్ళు కూర్చుని వుండగా, వర్షం వెలసి  ఇంద్రధనుస్సు  కన్పించడం థీమాటికల్ గానూ వుంది, తర్వాతి సీనుకి అర్ధవంతమైన ట్రాన్సిషన్ గానూ వుంది. ఇంద్రధనుస్సు డిజాల్వ్ అయి మసక చీకట్లు ముసురుకుంటూ  తారలు వెలుస్తాయి.
(ఇంకా వుంది)

సికిందర్

Friday, June 1, 2018

652 : స్పెషల్ ఆర్టికల్



        సినిమా అంటే కేవలం ఎంటర్ టైనరని అర్ధం మారిపోయాక, దర్శకులవ్వాలనుకునే ఔత్సాహికులు, తామే రచయితలుగా అవతారమెత్తుతూ వున్నాక, ఎందుకని స్క్రిప్టులు రాయలేక, రాసి తీయలేకా  చతికిలబడుతున్నట్టు? అసలు ఎంటర్ టైన్మెంట్  గురించి ఏం తెలిసి రాస్తున్నట్టు? తాము రచయితలే నని నమ్మితే, ఆ రచయితలుగా తాము ససేమిరా కాలానుగుణంగా మారాలనుకోకపోతే, ఏం ఎంటర్ టైన్ చేయగలరు? కాలానికి తగ్గట్టు రాయడమే రాకపోతే, ఎంటర్ టైనర్లు ఏంతీస్తారు? అసలు కాలాన్ని గుర్తించడమే తెలీకపోతే, కాలీన స్పృహే లేకపోతే, ఘనీభవించిన కాలంలో ఎక్కడో మూర్తీభవించి వుండిపోతే రచయితలెలా అవుతారు?  పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, దివాకర్ బాబు, పోసాని, ఎల్బీ శ్రీరాం, చింతపల్లి రమణల్లాంటి వాళ్ళముందు నిలబడి తామూ  రచయితలమని చెప్పుకోగలరా? అలా ఫీలైపోయి రాసి తీసి ‘కథ - స్క్రీన్ ప్లే - మాటలు –దర్శకత్వం’ వగైరా వగైరా తామేనని ఏం వేసుకుంటారు? గొప్పగొప్ప రాఘవేంద్రరావులు, బి గోపాల్ లు, ఎస్వీ కృష్ణా రెడ్డిలకే  లేని ఈ ఫ్యాషన్లు  ఏం ప్రదర్శించుకుంటారు? ఎప్పుడో ఒక తేజ,  ఒక పూరీ జగన్నాథ్ లు గ్లామరైజ్ చేసిన ఈ సాంప్రదాయాన్ని తామూ పూసుకోవడమంటే,  పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవడం లాంటిది కాక ఏమిటి? తేజలో, పూరీలో ఒరిజినల్ గా రచయితనే వాడొకడు తిష్ట వేసివున్నాడు కాబట్టి ఇంత కాలం కొనసాగుతున్నారు.  ఇది చూసి వాతలు పెట్టుకుంటున్న వాళ్ళు ఆ వొక్క సినిమాతో కడతేరి పోతున్నారుగా? మరెందుకీ ఫ్యాషన్? 

         
పూసుకుంటే సినిమా రచన వచ్చేస్తుందా, పరిశీలిస్తే వస్తుందా? పరిశీలనే అక్కర్లేని తనంతో ఎంత పూసుకున్నా రాలేది బూడిదే. తామసలు రచయితలే  కాక, వున్న వృత్తి రచయితల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాక,  సాధిస్తున్నదేమిటయ్యా అంటే – దేశంలో కెల్లా అత్యంత నంబర్ వన్ అట్టర్ ఫ్లాప్స్ అడ్డా టాలీవుడ్ అని చాటి చెప్పడమే. ఈ బ్యాచి ఇంతకన్నా ఏమీ చేయడం లేదు. 2017 లోనైతే రికార్డు స్థాయిలో  120 మంది ఇలాటి ‘కథ - స్క్రీన్ ప్లే - మాటలు –దర్శకత్వం’ బాపతు ఏక వ్యక్తి సైనికులు వచ్చేసి – చేపట్టిన ఆ 120 సినిమాలనీ మట్టి కరిపించి, మళ్ళీ కనిపించకుండా మాయమై పోయారు. వీళ్ళు దర్శకులనే మాట తర్వాత, ముందు రచయితలు కాలేకే కదా ఇలా ఫ్లాపులిచ్చి పారిపోవడం? 

          ఏం రాయాలో, ఎలా రాయాలో తెలుసుకోకపోవడం కూడా తర్వాత సంగతి. ఇవి ఎవరెంత చెప్పినా బుర్ర కెక్కే విషయం కాదు. సినిమా జ్ఞానమంటూ ఒకటుందని తెలియకపోవడం వల్ల ఆ జ్ఞానం చెపితే దాన్ని అస్సలు నమ్మరు. తమని మోసం చేయడానికి చెప్తున్నారనుకుంటారు. తమకి తెలిసిందే జ్ఞానమనుకుంటారు. సినిమా జ్ఞానమంతా ఇంగ్లీషులో వుండడం  వల్లా, ఎక్కడెక్కడి డిగ్రీలు చేసినా ఇంగ్లీషు  పరిజ్ఞానమే జీరో అవడం వల్లా, వాట్సాపులూ ఫేస్ బుక్కులూ తప్ప ఇంకో వెబ్సైట్ చూడని వాళ్ళు  కావడం వల్లా – తెలుగులో తాము  చూస్తున్న సినిమాలతోనే బ్రహ్మ  జ్ఞానం వచ్చేసిందనుకుంటున్నారు. బ్రహ్మ జ్ఞానులకి ఇంకెవరు చెప్పగలరు. కాబట్టి స్క్రిప్టు రచనా పటిమ గురించి  పక్కన పెడదాం. దీనికంటే ముందు ముఖ్యమైనది ఒకటుంది. దాని గురించి చెప్పుకుందాం.


దీని గురించి ఇక్కడే ఇదే పేజీలో కొనసాగిద్దాం...


     అసలు రాయాలంటే ముందు వామప్ (warm up) అవాలిగా? జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని వామప్ చేసుకోరా బై అంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కౌన్సెలింగ్ చేసుకోవడమన్నమాట. చచ్చినట్టూ జిమ్ము కెళ్ళిన ఆ ఔత్సాహిక దర్శక - రచయిత గారు  అక్కడ తన వాటమైన శరీరాన్ని తప్పని సరిగా వంగదీసి వామప్ చేసుకుంటాడు. కానీ రూములో రాయడానికి కూర్చున్నప్పుడు  మాత్రం అలాటి వామప్పులూ పప్పులూ స్టెప్పులూ ఏవీ వుండవు. స్క్రిప్టు  రాయడం మొదలెట్టాడంటే వరసబెట్టి  సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోరా నాయనా అంటే,  కళ్ళెర్ర జేసి నెల్లూరు కాంతారావులా చూస్తాడు.  


          రాస్తున్న విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండదు, ఏ క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండదు. అవి వుంటాయనీ, ఈ మాయదారి కాలంలో రాయాలంటే ముందు వాటిని తెలుసుకోవాలనీ కూడా తెలియదు. ఏవో వూహలు అల్లేసుకుంటూ తనలోకంలో తాను డైరీలా రాసేస్తాడు.  క్షేత్ర స్థాయిలో అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో పరిస్థితులేమిటో తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక  సినిమా స్క్రిప్టు రాయడం మొదలెట్టేస్తాడు – వామప్ చేయని సోమరితనమంతా ఆ స్క్రిప్టు లోంచి కాలువలై అసహ్యంగా పారుతూ వుంటుంది...

          బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి కొంటాం. కానీ  ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా, ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం కోరుకుంటు
న్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన  యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు  కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ కల్చర్లో, ఏ జానర్లో  స్క్రిప్టులు రాయాలి...

        అసలు తెలుగు సినిమాల విజయాల రేటెంత, ఏ  సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయి, ఎందరు కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లాపై వెళ్లిపోతూంటే నాకూ అదే పరిస్థితి వస్తుందా, అలా నాకు భయం వేయడం లేదా, ఎందుకు వేయడంలేదు, నా సొమ్ము కాదనా, ఫ్లాపవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులేమిటి, వాటిని నేనెలా నివారించుకోవాలి, వాళ్ళల్లో రచయితే వాళ్లకి శత్రువై పోతున్నాడా, అలాటి రచయితే  నాలో కూడా వున్నాడా,  ఐడియా నుంచీ డైలాగ్ వెర్షన్ దాకా నాకు తెలిసిందెంత, నా చుట్టూ వుండి సలహాలిచ్చే నా ఏజి గ్రూపు వాళ్ళ విషయ పరిజ్ఞానమెంత,  నూటికి నూరు శాతం ఫ్లాప్స్ ఖాయంగా ఏడాది కేడాది కళ్ళెదుట కన్పిస్తున్నప్పుడు నేను హిట్టివ్వగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నాను, అసలు నేను చేస్తున్న సబ్జెక్టు ప్రాతిపదికేమిటి, ప్రపంచంలో సినిమాలెన్ని రకాలు, కమర్షియల్ సినిమాలు, వరల్డ్ (ఆర్ట్) సినిమాలు అనే రెండు రకాలున్నాయని నాకు తెల్సా, వీటిలో మొదటి రకమే తెలుగులో పనికొస్తాయని నేనెప్పుడైనా ఆలోచించానా, స్క్రిప్టు కావల సినిమా ప్రపంచానికి సంబంధించి నా జనరల్ నాలెడ్జి ఎంత, నా స్క్రిప్టుకి శాస్త్రీయంగా స్ట్రక్చర్ లోవుంటూ అలరించే కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నానా, లేక స్ట్రక్చర్ లేకుండా అశాస్త్రీయంగా వుంటూ తెలుగు ప్రేక్షకులకి సహన పరీక్షపెట్టే వరల్డ్ (ఆర్ట్)  మూవీస్ లాంటి ప్రయోజనంలేని సబ్జెక్టు చేస్తున్నానా,  నిర్మాత డబ్బుతో నా కళా తృష్ణ తీర్చుకోవడానికి వరల్డ్ (ఆర్ట్) మూవీ బాపతు స్క్రిప్టు రాసి నేనూ బరితెగించి నా వూళ్ళో ముఖం చూపించుకోలేని సినిమా అజ్ఞాని అనిపించుకోబోతున్నానా  ఒకవేళ...

          సినిమాలెక్కువగా ఎందుకని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది, విషయం లేకపోతే  ఓన్ రిలీజ్ తప్పదా, ఓన్  రిలీజ్ అంటే ఆశలు వదులుకోవడమేనా, నిర్మాత ఓన్ రిలీజ్ కి సిద్ధపడక మూల పడేస్తే నా గతేంటి, ఇంకో సినిమా అవకాశం వస్తుందా, అసలీ కష్టాలెందు కొస్తున్నాయి, స్క్రిప్టు రాయడానికి ముందు తగు విధంగా వామప్ చేసుకోక పోవడం వల్లేనా...

          భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ -  ఉపప్రాంతీయ సినిమా రంగాలున్నాయో -  అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలేమిటో నాకేమైనా తెలుసా, తెలుసుకోవడానికి ప్రయత్నించానా, ఎవరితోనైనా చర్చించానా, తుళు (టులు వుడ్) - బడుగ- కొంకణి - మీరట్ (మాలీవుడ్) - నాగపురి (ఝాలీవుడ్ ) – సంథాలీ (ఝాలీవుడ్) - డోగ్రీ- లడఖీ (పహారీవుడ్) - అస్సామీ (జాలీవుడ్) – ఒరిస్సా (ఓలీవుడ్) - చత్తీస్ ఘర్ (చోలీవుడ్)- గుజరాత్ (ఘోలీవుడ్) - భోజ్ పురి... ఇలా 30 దాకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమలున్నాయని నాకెప్పుడైనా తెలుసా, ప్రాంతీయ- ఉపప్రాంతీయ సినిమాలంటేనే ఒకప్పుడు సామాజిక సమస్యలతో కూడిన వాస్తవిక (ఆర్ట్) కథా చిత్రాలే అయినప్పటికీ  అవన్నీ గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణతో కొత్త తరం ప్రేక్షకులందుకున్న సరికొత్త అభిరుచులతో, జీవనశైలులతో పక్కా కమర్షియల్- మాస్- రోమాన్స్- కామెడీ – యాక్షన్ సినిమాలుగా మారిపోయి- సొమ్ములు చేసుకుంటున్న పరిణామ క్రమాన్ని నేనెప్పుడైనా గ్రహించానా, ఈ లోతట్టు ప్రాంతీయ - ఉప ప్రాంతీయ సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే, నేనింకా తెలుగు ప్రేక్షకులు నేను తీసే నాన్ కమర్షియల్ వరల్డార్టు సినిమాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నాను, తక్కువ మార్కెట్  గల ప్రాంతీయ – ఉపప్రాంతీయ రంగాల్లో తక్కువ బడ్జెట్లతో కమర్షియల్ సినిమాలు తీసి మూడు నాల్గు రెట్లు లాభాలెలా గడిస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించానా, ఝార్ఖండ్ లో సినిమాలు తీస్తే రెండు కోట్లు సబ్సిడీ ఇస్తున్నారనీ –బాలీవుడ్ మేకర్లు ఝార్ఖండ్ బాట పడుతున్నారనీ నాకేమైనా తెల్సా, మొత్తం సినిమా వ్యవస్థని పరిశీలించకపోతే, అవగాహనా లేకపోతే  నేను మూవీ మేకర్ నెలా అవుతాను, స్క్రిప్టు రాయడానికి నేనేం పనికొస్తాను...

      నేను రాయబోయే సబ్జెక్ట్ ఏమిటి, దాని గురించి ఏం రీసెర్చి చేశాను, ప్రేమ సినిమా తీయాలన్నా సబ్జెక్టుని బట్టి రీసెర్చి తప్పని సరని నాకేమైనా తెల్సా,  దేని మీద ఆధారపడి సబ్జెక్టుకి ఐడియా అనుకుంటున్నాను, చూసిన తెలుగు సినిమాల నుంచి మృతప్రాయమైన మూస ఫార్ములా ఐడియాలు తీస్తున్నానా, లేక చుట్టూ ప్రపంచంలోకి చూసి మరింత డైనమిక్ గా  నాన్ ఫార్ములాయిక్ ప్రాక్టికల్ ఐడియాలు తీస్తున్నానా, ఒకప్పటి సినిమాల్లోలాగే ఇప్పుడు కుటుంబాలున్నాయా, ప్రేమలున్నాయా, పరిస్థితులున్నాయా...

          నేను రాసే సీన్లు -  డైలాగులు వచ్చిన సినిమాల్లో వచ్చినంత మంది వాడేసిన ఎంగిలి – టెంప్లెట్ సీన్లేనా -  డైలాగులేనా – లేక సొంతంగా నేనేమైనా సృష్టించి నాదంటూ వొక ముద్ర వేస్తున్నానా, నేను చూడడానికి – సినిమాగా తీయడానికి - విజువల్ గా స్క్రిప్టు రాస్తున్నానా, లేక చదువుకోవడానికి - చదువుకుని దిండు కింద పెట్టుకోవడానికి  మాత్రమే వ్యాసంలాగా స్క్రిప్టు రాస్తున్నానా,  నా సబ్జెక్టు ఏ జానర్ కిందికొస్తుంది, ఆ జానర్ మర్యాదలు నాకేమైనా తెల్సా, లేక గుండుగుత్తగా కలిపి కొట్టేస్తున్నానా, నేనేనుకున్న ఐడియా రఫ్ గా  మనసులోనే వుందా,  లేక స్పష్టంగా ముందు దాన్ని కాగితం మీద వర్కౌట్ చేశానా, నా ఐడియాలో కథే వుందా, లేక కమర్షియల్ సినిమాలకి పనికిరాని  గాథ వుందా, నా కమర్షియల్ ఐడియాని మూడు వాక్యాల్లో స్క్రీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో నిర్మించుకున్నానా, నిర్మించుకున్నాక స్క్రీన్ ప్లే పాయింటాఫ్  వ్యూలో సినాప్సిస్ రాసుకున్నానా, రాసుకున్నాక దాని ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నానా, లేక ఇవన్నీ డుమ్మాకొట్టి పని దొంగలా మొక్కుబడి స్క్రిప్టు రాసి - రెండు కోట్లు బడ్జెట్ ఆశిస్తూ నిర్మాతల చుట్టూ తిరిగి విఫలయత్నాలు చేస్తున్నానా...

       అసలు నాకు సినాప్సిస్ రాయడం వచ్చా, ఎప్పుడైనా నేనొక సినిమా చూసి ఒక పేజీలో క్లుప్తంగా  దాని కథ రాయగలిగానా, రెండు నిమిషాల్లో ఎవరికైనా ఆ సినిమా కథ  చెప్పగల్గానా, అసలు నేను అసిస్టెంట్ అవకముందు – అయ్యాకానూ -  ఏనాడైనా వివిధ జానర్లలో నా ఊహా శక్తినీ, నా కల్పనా శక్తినీ, నా సృజనాత్మక శక్తినీ  పరీక్షించుకుంటూ, సింగిల్ పేజీ మినీ కథలు రాసుకున్నానా...నేను ఇంటలిజెంట్ రైటర్నా, లేక లేజీ - అవుట్ డేటెడ్ రైటర్నా...

          ఇవీ వామప్ కి బారులు తీరే ప్రశ్నాస్త్రాలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేకపోతే స్క్రిప్టు రాయాలనే ఆలోచనే శుద్ధ వేస్టు. ఈ వామప్ చేసుకున్నాకే స్క్రిప్టు రాయడం మొదలెట్టడానికి రెండో మెట్టు- స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకోవడం. వామప్ చేసుకోకపోతే  స్క్రీన్ ప్లే సంగతులు కూడా అనవసరం. అవి తెలుసుకుని ప్రయోజనం లేదు.

సికిందర్

Friday, May 25, 2018

651 : స్క్రీన్ ప్లే సంగతులు!


 సినిమాల్లో సెకెండ్ యాక్టే ఫస్టాఫ్ లో ప్రారంభం కానప్పుడు సెకెండ్ యాక్ట్ స్లంప్ ఎలా ఏర్పడుతుంది? నీళ్ళే (కథే) లేనప్పుడు సుడిగుండం ఎలా ఏర్పడుతుంది? స్క్రీన్ ప్లేలో 50 శాతం వుండాల్సిన సెకెండ్ యాక్ట్,  ఇలా 25 శాతానికే కుంచించుకు పోతున్నప్పుడు. ఇంత తక్కువ నిడివిలో కూడా నడవలేక ఎలా చతికిల బడుతుంది కథ? స్క్రీన్ ప్లేలో కథని పావు వంతుకి  కుదించి కూడా దాన్ని నడపలేకపోతున్నారంటే – బిగ్ కమర్షియల్స్ ని సైతం బోల్తా కొట్టిస్తున్నారంటే, ఎక్కడ జరుగుతోంది లోపం?  స్క్రీన్ ప్లే ప్రారంభంలో పావు వంతు వుండాల్సిన ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ని సగం వరకూ సాగదీసి,  ఇంటర్వెల్ వేయడమంటే దేనికి ఇంటర్వెల్ వేస్తున్నట్టు – ఫస్ట్ యాక్ట్ కా? ఇంకా కథే ప్రారంభించకుండా ఇంటర్వెల్లా? ఇంటర్వెల్ కథనుంచి కాసేపు విశ్రాంతికి కోసమా, లేక కథే ప్రారంభం కాకుండా ఉపోద్ఘాతం (ఫస్ట్ యాక్ట్ ) నుంచి ఉపశమనానికా? చాలా విచిత్రంగా వుంటాయి బిగ్ కమర్షియల్స్ లెక్కలు. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఎలా వున్నా స్టార్  మోసేస్తాడు కదా... 

        స్టార్ ప్లేని మర్చిపోతున్నారు. స్టార్ ప్లే చేయడానికి కూడా స్క్రీన్ ప్లేలో సగం వుండాల్సిన కథని అందించడం లేదు. అత్తెసరు పావు వంతు కథని మీద పడేసి నిలబెట్ట మంటున్నారు. ఈ పావువంతు కథని కూడా స్లంప్ లో పడేసి మరీ లాగమంటున్నారు స్టార్ ని...ఈ సమ్మర్ కి స్టార్ సినిమాలన్నీ సెకెండ్ యాక్ట్ స్లంపుకి చూడ ముచ్చటేసే నమూనాలుగా కొలువు దీరిపోయాయి. 

        సెకెండ్ యాక్ట్ అంటేనే సినిమా కథ. స్క్రీన్ ప్లేకి వెన్నెముక. స్క్రీన్ ప్లే అనే మహా సౌధానికి రెండు మూల స్థంభాల (పిపి -1, పిపి -2) మధ్య పైకప్పు. ఈ పైకప్పుని పీకి పందిరేస్తే మిగిలేది మొండి గోడలే కదా? 


      సెకెండ్ యాక్ట్ ని ఫస్టాఫ్ లో ప్రారంభిస్తే, సెకెండాఫ్ లో వరకూ కావాల్సినంత నిడివి వుంటుంది. నిడివి ఎంత పెరిగితే కథ అంత వుంటుంది. కానీ సెకెండ్ యాక్ట్ ని ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ లో చూపించడం ప్రారంభిస్తే,  దాని నిడివి సగానికి – అంటే - స్క్రీన్ ప్లేలో పావు వంతుకి తగ్గిపోతుంది. ఫుల్ టికెట్ వసూలు చేసి, పావు టికెట్ కథ చూపిస్తే ఎట్లా? దాన్ని కూడా స్లంప్ బారిని పడేసి?

        ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ వన్ (పిపి -1)దగ్గర స్టార్ ఏం ప్రామీస్ చేస్తున్నాడో దాన్ని సెకెండ్ యాక్ట్ లో సక్రమంగా డెలివరీ చేయకపోతే, సెకెండ్ యాక్ట్ స్లంప్
(కథా మాంద్యం?) ఏర్పడు తుంది. (పిపి -1)దగ్గర స్టార్ కి గోల్ ఏర్పడుతూ కథ ప్రారంభమవుతుంది. ఈ కథ ప్రారంభమైన సెకెండ్ యాక్ట్ లో స్టార్ ఆ గోల్ ని డెలివరీ చేయాలి. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన అధికార పార్టీ ఆ వాగ్దానాల్ని సక్రమంగా డెలివరీ చేయకపోతే వూడి పోయినట్టే, సక్రమంగా తన గోల్ ని డెలివరీ చేయని స్టార్ కూడా కథ చివర డిస్మిస్ అయిపోతాడు. స్టార్ ఎత్తుకున్న ప్రేమ కథైనా, ఫ్యామిలీ కథైనా, ఫాంటసీ కథైనా, కామెడీ కథైనా, యాక్షన్ కథైనా – ఏ కథైనా – సెకెండ్ యాక్ట్ లో ఒకటే కార్యకలాపం పెట్టుకుంటాడు. అది ఆ కథకి తగ్గ జానర్ లక్షణాలతో, దాని తాలూకు గోల్  కోసం, అలాటి ఓడిడుడుకులని ఎదుర్కోవడం!


        ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం రెండు భాగాలుగా వుంటుంది. ఇక్కడే సెకెండ్ యాక్ట్ రెండుగా విభజన జరుగుతుంది. ఒక భాగం ఇంటర్వెల్ ముందు వరకూ వుంటుంది. రెండో భాగం ఇంటర్వెల్ తర్వాత వుంటుంది. ముందుగా ఇంటర్వెల్ ముందు ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే క్రమంలో దెబ్బలు తింటూ వుండే తంతే ఎక్కువ వుంటుంది. అంటే రియాక్టివ్ గా పాత్ర చిత్రణ వుంటుంది. వెంటనే ప్రత్యర్ధిని మట్టి కరిపించే యాక్టివ్ చర్యలకి దిగడు. అసలు తనకేం జరుగుతోందో అర్ధం చేసుకోవడానికే సమయం పడుతుంది. అర్ధం చేసుకుంటూ ప్రత్యర్ధి దాడుల్ని రియాక్టివ్ గా ఎదుర్కొంటూ, ఇంటర్వెల్ కొచ్చేసరికి అన్నీ అర్ధమైపోతాయి. అప్పుడు స్టార్ ప్రత్యర్ధి మీద పైచేయి సాధిస్తాడు. ఇదీ మొదటి భాగం సెకెండ్ యాక్ట్ స్టార్ బిజినెస్. అంటే రియాక్టివ్ స్టార్ ప్లే!

        దీన్తర్వాత సెకెండాఫ్ లో స్టార్ యాక్టివ్ గా ప్రవర్తించడం మొదలెడతాడు. ప్రత్యర్ధితో పూర్తిస్టాయిలో అమీతుమీకి దిగుతాడు. ఈ ఓడిడుకులు పార్ట్ టూ లో స్టార్ యాక్టివ్ గా మారిపోతాడు. ప్రత్యర్ధిని మట్టి కరిపిస్తూ కరిపిస్తూ వెళ్లి ప్రత్యర్ధి  పన్నే ఒక పెద్ద పద్మవ్యూహంలో పడిపోతాడు స్టార్. ఇది పిపి – 2 ఘట్టం.  స్క్రీన్ ప్లే కి రెండో మూల స్థంభం. అంటే సెకెండ్ యాక్ట్ కి ముగింపు!


       మొత్తం సెకెండ్ యాక్ట్  అంతా గోల్ కోసం స్టార్ కీ ప్రత్యర్ధికీ మధ్య జరిగే యాక్షన్ - రియక్షన్ల మయమే. కానీ,  అర్ధం జేసుకోవాల్సింది సెకెండ్ యాక్ట్ మొదటి భాగంలో స్టార్ కి ఈ యాక్షన్ -  రియక్షన్ల తంతు రియాక్టివ్ గా వుంటే, రెండవ భాగంలో యాక్టివ్ గా వుంటుంది. మానసిక ఎదుగుదలలో, తదనుగుణ ప్రవర్తనతో స్టార్ ఈ తేడాలు కనబర్చక పోతే, మొత్తం సెకెండ్ యాక్టే డొల్లగా మారిపోయి ఢామ్మని స్లంప్ లోపడుతుంది!!

        గోల్ ని ఏ ఎత్తుగడలతో, ఏవ్యూహాలతో తెలివిగా డెలివరీ చేస్తున్నాడనేదే సెకెండ్ యాక్ట్ కి ముఖ్యం. పిపి – 2  దగ్గర స్టార్ పద్మవ్యూహంలో పడడంతో కథ ముగిసి, ఇక ఉపసంహారమే మిగిలుంటుంది. అంటే మళ్ళీ పుంజుకుని గోల్ ని డెలివరీ చేసేందుకు థర్డ్ యాక్ట్ బిజినెస్ ఏకధాటిగా మొదలెడతాడమన్నమాట. 


        ఇంత కథ – బిజినెస్ వుండే సెకెండ్ యాక్టు వచ్చేసి, స్క్రీన్ ప్లేలో సగభాగం కాకుండా, ఇంకెప్పుడో సెకెండాఫ్ లో ప్రారంభమై, పావు వంతుకి మూలకి సర్దుకుంటే, ఇక స్టార్ పాల్పడాల్సిన రియక్టివ్ – యాక్టివ్ బిజినెస్సులకి ఏపాటి సమయం చిక్కుతుంది? అప్పుడేమని పిస్తుంది - నసేరా బాబూ నస! మన స్టార్ ఏమీ చేయలేదు - నస పెట్టాడ్రా బాబూ నస – అని కదూ?

సికిందర్