రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 1, 2018

652 : స్పెషల్ ఆర్టికల్



        సినిమా అంటే కేవలం ఎంటర్ టైనరని అర్ధం మారిపోయాక, దర్శకులవ్వాలనుకునే ఔత్సాహికులు, తామే రచయితలుగా అవతారమెత్తుతూ వున్నాక, ఎందుకని స్క్రిప్టులు రాయలేక, రాసి తీయలేకా  చతికిలబడుతున్నట్టు? అసలు ఎంటర్ టైన్మెంట్  గురించి ఏం తెలిసి రాస్తున్నట్టు? తాము రచయితలే నని నమ్మితే, ఆ రచయితలుగా తాము ససేమిరా కాలానుగుణంగా మారాలనుకోకపోతే, ఏం ఎంటర్ టైన్ చేయగలరు? కాలానికి తగ్గట్టు రాయడమే రాకపోతే, ఎంటర్ టైనర్లు ఏంతీస్తారు? అసలు కాలాన్ని గుర్తించడమే తెలీకపోతే, కాలీన స్పృహే లేకపోతే, ఘనీభవించిన కాలంలో ఎక్కడో మూర్తీభవించి వుండిపోతే రచయితలెలా అవుతారు?  పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, దివాకర్ బాబు, పోసాని, ఎల్బీ శ్రీరాం, చింతపల్లి రమణల్లాంటి వాళ్ళముందు నిలబడి తామూ  రచయితలమని చెప్పుకోగలరా? అలా ఫీలైపోయి రాసి తీసి ‘కథ - స్క్రీన్ ప్లే - మాటలు –దర్శకత్వం’ వగైరా వగైరా తామేనని ఏం వేసుకుంటారు? గొప్పగొప్ప రాఘవేంద్రరావులు, బి గోపాల్ లు, ఎస్వీ కృష్ణా రెడ్డిలకే  లేని ఈ ఫ్యాషన్లు  ఏం ప్రదర్శించుకుంటారు? ఎప్పుడో ఒక తేజ,  ఒక పూరీ జగన్నాథ్ లు గ్లామరైజ్ చేసిన ఈ సాంప్రదాయాన్ని తామూ పూసుకోవడమంటే,  పులిని చూసి నక్కవాతలు పెట్టుకోవడం లాంటిది కాక ఏమిటి? తేజలో, పూరీలో ఒరిజినల్ గా రచయితనే వాడొకడు తిష్ట వేసివున్నాడు కాబట్టి ఇంత కాలం కొనసాగుతున్నారు.  ఇది చూసి వాతలు పెట్టుకుంటున్న వాళ్ళు ఆ వొక్క సినిమాతో కడతేరి పోతున్నారుగా? మరెందుకీ ఫ్యాషన్? 

         
పూసుకుంటే సినిమా రచన వచ్చేస్తుందా, పరిశీలిస్తే వస్తుందా? పరిశీలనే అక్కర్లేని తనంతో ఎంత పూసుకున్నా రాలేది బూడిదే. తామసలు రచయితలే  కాక, వున్న వృత్తి రచయితల ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నాక,  సాధిస్తున్నదేమిటయ్యా అంటే – దేశంలో కెల్లా అత్యంత నంబర్ వన్ అట్టర్ ఫ్లాప్స్ అడ్డా టాలీవుడ్ అని చాటి చెప్పడమే. ఈ బ్యాచి ఇంతకన్నా ఏమీ చేయడం లేదు. 2017 లోనైతే రికార్డు స్థాయిలో  120 మంది ఇలాటి ‘కథ - స్క్రీన్ ప్లే - మాటలు –దర్శకత్వం’ బాపతు ఏక వ్యక్తి సైనికులు వచ్చేసి – చేపట్టిన ఆ 120 సినిమాలనీ మట్టి కరిపించి, మళ్ళీ కనిపించకుండా మాయమై పోయారు. వీళ్ళు దర్శకులనే మాట తర్వాత, ముందు రచయితలు కాలేకే కదా ఇలా ఫ్లాపులిచ్చి పారిపోవడం? 

          ఏం రాయాలో, ఎలా రాయాలో తెలుసుకోకపోవడం కూడా తర్వాత సంగతి. ఇవి ఎవరెంత చెప్పినా బుర్ర కెక్కే విషయం కాదు. సినిమా జ్ఞానమంటూ ఒకటుందని తెలియకపోవడం వల్ల ఆ జ్ఞానం చెపితే దాన్ని అస్సలు నమ్మరు. తమని మోసం చేయడానికి చెప్తున్నారనుకుంటారు. తమకి తెలిసిందే జ్ఞానమనుకుంటారు. సినిమా జ్ఞానమంతా ఇంగ్లీషులో వుండడం  వల్లా, ఎక్కడెక్కడి డిగ్రీలు చేసినా ఇంగ్లీషు  పరిజ్ఞానమే జీరో అవడం వల్లా, వాట్సాపులూ ఫేస్ బుక్కులూ తప్ప ఇంకో వెబ్సైట్ చూడని వాళ్ళు  కావడం వల్లా – తెలుగులో తాము  చూస్తున్న సినిమాలతోనే బ్రహ్మ  జ్ఞానం వచ్చేసిందనుకుంటున్నారు. బ్రహ్మ జ్ఞానులకి ఇంకెవరు చెప్పగలరు. కాబట్టి స్క్రిప్టు రచనా పటిమ గురించి  పక్కన పెడదాం. దీనికంటే ముందు ముఖ్యమైనది ఒకటుంది. దాని గురించి చెప్పుకుందాం.


దీని గురించి ఇక్కడే ఇదే పేజీలో కొనసాగిద్దాం...


     అసలు రాయాలంటే ముందు వామప్ (warm up) అవాలిగా? జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని వామప్ చేసుకోరా బై అంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కౌన్సెలింగ్ చేసుకోవడమన్నమాట. చచ్చినట్టూ జిమ్ము కెళ్ళిన ఆ ఔత్సాహిక దర్శక - రచయిత గారు  అక్కడ తన వాటమైన శరీరాన్ని తప్పని సరిగా వంగదీసి వామప్ చేసుకుంటాడు. కానీ రూములో రాయడానికి కూర్చున్నప్పుడు  మాత్రం అలాటి వామప్పులూ పప్పులూ స్టెప్పులూ ఏవీ వుండవు. స్క్రిప్టు  రాయడం మొదలెట్టాడంటే వరసబెట్టి  సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోరా నాయనా అంటే,  కళ్ళెర్ర జేసి నెల్లూరు కాంతారావులా చూస్తాడు.  


          రాస్తున్న విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండదు, ఏ క్షేత్ర స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండదు. అవి వుంటాయనీ, ఈ మాయదారి కాలంలో రాయాలంటే ముందు వాటిని తెలుసుకోవాలనీ కూడా తెలియదు. ఏవో వూహలు అల్లేసుకుంటూ తనలోకంలో తాను డైరీలా రాసేస్తాడు.  క్షేత్ర స్థాయిలో అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో పరిస్థితులేమిటో తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక  సినిమా స్క్రిప్టు రాయడం మొదలెట్టేస్తాడు – వామప్ చేయని సోమరితనమంతా ఆ స్క్రిప్టు లోంచి కాలువలై అసహ్యంగా పారుతూ వుంటుంది...

          బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి కొంటాం. కానీ  ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా, ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం కోరుకుంటు
న్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన  యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు  కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ కల్చర్లో, ఏ జానర్లో  స్క్రిప్టులు రాయాలి...

        అసలు తెలుగు సినిమాల విజయాల రేటెంత, ఏ  సినిమాలు ఎందుకు ఫ్లాపవుతున్నాయి, ఎందరు కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళందరూ ప్లాపై వెళ్లిపోతూంటే నాకూ అదే పరిస్థితి వస్తుందా, అలా నాకు భయం వేయడం లేదా, ఎందుకు వేయడంలేదు, నా సొమ్ము కాదనా, ఫ్లాపవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులేమిటి, వాటిని నేనెలా నివారించుకోవాలి, వాళ్ళల్లో రచయితే వాళ్లకి శత్రువై పోతున్నాడా, అలాటి రచయితే  నాలో కూడా వున్నాడా,  ఐడియా నుంచీ డైలాగ్ వెర్షన్ దాకా నాకు తెలిసిందెంత, నా చుట్టూ వుండి సలహాలిచ్చే నా ఏజి గ్రూపు వాళ్ళ విషయ పరిజ్ఞానమెంత,  నూటికి నూరు శాతం ఫ్లాప్స్ ఖాయంగా ఏడాది కేడాది కళ్ళెదుట కన్పిస్తున్నప్పుడు నేను హిట్టివ్వగలనని ఏ ప్రాతిపదికన నమ్ముతున్నాను, అసలు నేను చేస్తున్న సబ్జెక్టు ప్రాతిపదికేమిటి, ప్రపంచంలో సినిమాలెన్ని రకాలు, కమర్షియల్ సినిమాలు, వరల్డ్ (ఆర్ట్) సినిమాలు అనే రెండు రకాలున్నాయని నాకు తెల్సా, వీటిలో మొదటి రకమే తెలుగులో పనికొస్తాయని నేనెప్పుడైనా ఆలోచించానా, స్క్రిప్టు కావల సినిమా ప్రపంచానికి సంబంధించి నా జనరల్ నాలెడ్జి ఎంత, నా స్క్రిప్టుకి శాస్త్రీయంగా స్ట్రక్చర్ లోవుంటూ అలరించే కమర్షియల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నానా, లేక స్ట్రక్చర్ లేకుండా అశాస్త్రీయంగా వుంటూ తెలుగు ప్రేక్షకులకి సహన పరీక్షపెట్టే వరల్డ్ (ఆర్ట్)  మూవీస్ లాంటి ప్రయోజనంలేని సబ్జెక్టు చేస్తున్నానా,  నిర్మాత డబ్బుతో నా కళా తృష్ణ తీర్చుకోవడానికి వరల్డ్ (ఆర్ట్) మూవీ బాపతు స్క్రిప్టు రాసి నేనూ బరితెగించి నా వూళ్ళో ముఖం చూపించుకోలేని సినిమా అజ్ఞాని అనిపించుకోబోతున్నానా  ఒకవేళ...

          సినిమాలెక్కువగా ఎందుకని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది, విషయం లేకపోతే  ఓన్ రిలీజ్ తప్పదా, ఓన్  రిలీజ్ అంటే ఆశలు వదులుకోవడమేనా, నిర్మాత ఓన్ రిలీజ్ కి సిద్ధపడక మూల పడేస్తే నా గతేంటి, ఇంకో సినిమా అవకాశం వస్తుందా, అసలీ కష్టాలెందు కొస్తున్నాయి, స్క్రిప్టు రాయడానికి ముందు తగు విధంగా వామప్ చేసుకోక పోవడం వల్లేనా...

          భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ -  ఉపప్రాంతీయ సినిమా రంగాలున్నాయో -  అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలేమిటో నాకేమైనా తెలుసా, తెలుసుకోవడానికి ప్రయత్నించానా, ఎవరితోనైనా చర్చించానా, తుళు (టులు వుడ్) - బడుగ- కొంకణి - మీరట్ (మాలీవుడ్) - నాగపురి (ఝాలీవుడ్ ) – సంథాలీ (ఝాలీవుడ్) - డోగ్రీ- లడఖీ (పహారీవుడ్) - అస్సామీ (జాలీవుడ్) – ఒరిస్సా (ఓలీవుడ్) - చత్తీస్ ఘర్ (చోలీవుడ్)- గుజరాత్ (ఘోలీవుడ్) - భోజ్ పురి... ఇలా 30 దాకా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సినిమా పరిశ్రమలున్నాయని నాకెప్పుడైనా తెలుసా, ప్రాంతీయ- ఉపప్రాంతీయ సినిమాలంటేనే ఒకప్పుడు సామాజిక సమస్యలతో కూడిన వాస్తవిక (ఆర్ట్) కథా చిత్రాలే అయినప్పటికీ  అవన్నీ గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణతో కొత్త తరం ప్రేక్షకులందుకున్న సరికొత్త అభిరుచులతో, జీవనశైలులతో పక్కా కమర్షియల్- మాస్- రోమాన్స్- కామెడీ – యాక్షన్ సినిమాలుగా మారిపోయి- సొమ్ములు చేసుకుంటున్న పరిణామ క్రమాన్ని నేనెప్పుడైనా గ్రహించానా, ఈ లోతట్టు ప్రాంతీయ - ఉప ప్రాంతీయ సినిమాలు చూసే ప్రేక్షకుల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే, నేనింకా తెలుగు ప్రేక్షకులు నేను తీసే నాన్ కమర్షియల్ వరల్డార్టు సినిమాలు చూస్తారని ఎందుకు అనుకుంటున్నాను, తక్కువ మార్కెట్  గల ప్రాంతీయ – ఉపప్రాంతీయ రంగాల్లో తక్కువ బడ్జెట్లతో కమర్షియల్ సినిమాలు తీసి మూడు నాల్గు రెట్లు లాభాలెలా గడిస్తున్నారో ఎప్పుడైనా పరిశీలించానా, ఝార్ఖండ్ లో సినిమాలు తీస్తే రెండు కోట్లు సబ్సిడీ ఇస్తున్నారనీ –బాలీవుడ్ మేకర్లు ఝార్ఖండ్ బాట పడుతున్నారనీ నాకేమైనా తెల్సా, మొత్తం సినిమా వ్యవస్థని పరిశీలించకపోతే, అవగాహనా లేకపోతే  నేను మూవీ మేకర్ నెలా అవుతాను, స్క్రిప్టు రాయడానికి నేనేం పనికొస్తాను...

      నేను రాయబోయే సబ్జెక్ట్ ఏమిటి, దాని గురించి ఏం రీసెర్చి చేశాను, ప్రేమ సినిమా తీయాలన్నా సబ్జెక్టుని బట్టి రీసెర్చి తప్పని సరని నాకేమైనా తెల్సా,  దేని మీద ఆధారపడి సబ్జెక్టుకి ఐడియా అనుకుంటున్నాను, చూసిన తెలుగు సినిమాల నుంచి మృతప్రాయమైన మూస ఫార్ములా ఐడియాలు తీస్తున్నానా, లేక చుట్టూ ప్రపంచంలోకి చూసి మరింత డైనమిక్ గా  నాన్ ఫార్ములాయిక్ ప్రాక్టికల్ ఐడియాలు తీస్తున్నానా, ఒకప్పటి సినిమాల్లోలాగే ఇప్పుడు కుటుంబాలున్నాయా, ప్రేమలున్నాయా, పరిస్థితులున్నాయా...

          నేను రాసే సీన్లు -  డైలాగులు వచ్చిన సినిమాల్లో వచ్చినంత మంది వాడేసిన ఎంగిలి – టెంప్లెట్ సీన్లేనా -  డైలాగులేనా – లేక సొంతంగా నేనేమైనా సృష్టించి నాదంటూ వొక ముద్ర వేస్తున్నానా, నేను చూడడానికి – సినిమాగా తీయడానికి - విజువల్ గా స్క్రిప్టు రాస్తున్నానా, లేక చదువుకోవడానికి - చదువుకుని దిండు కింద పెట్టుకోవడానికి  మాత్రమే వ్యాసంలాగా స్క్రిప్టు రాస్తున్నానా,  నా సబ్జెక్టు ఏ జానర్ కిందికొస్తుంది, ఆ జానర్ మర్యాదలు నాకేమైనా తెల్సా, లేక గుండుగుత్తగా కలిపి కొట్టేస్తున్నానా, నేనేనుకున్న ఐడియా రఫ్ గా  మనసులోనే వుందా,  లేక స్పష్టంగా ముందు దాన్ని కాగితం మీద వర్కౌట్ చేశానా, నా ఐడియాలో కథే వుందా, లేక కమర్షియల్ సినిమాలకి పనికిరాని  గాథ వుందా, నా కమర్షియల్ ఐడియాని మూడు వాక్యాల్లో స్క్రీన్ ప్లే పాయింటాఫ్ వ్యూలో నిర్మించుకున్నానా, నిర్మించుకున్నాక స్క్రీన్ ప్లే పాయింటాఫ్  వ్యూలో సినాప్సిస్ రాసుకున్నానా, రాసుకున్నాక దాని ఆధారంగా వన్ లైన్ ఆర్డర్ వేస్తున్నానా, లేక ఇవన్నీ డుమ్మాకొట్టి పని దొంగలా మొక్కుబడి స్క్రిప్టు రాసి - రెండు కోట్లు బడ్జెట్ ఆశిస్తూ నిర్మాతల చుట్టూ తిరిగి విఫలయత్నాలు చేస్తున్నానా...

       అసలు నాకు సినాప్సిస్ రాయడం వచ్చా, ఎప్పుడైనా నేనొక సినిమా చూసి ఒక పేజీలో క్లుప్తంగా  దాని కథ రాయగలిగానా, రెండు నిమిషాల్లో ఎవరికైనా ఆ సినిమా కథ  చెప్పగల్గానా, అసలు నేను అసిస్టెంట్ అవకముందు – అయ్యాకానూ -  ఏనాడైనా వివిధ జానర్లలో నా ఊహా శక్తినీ, నా కల్పనా శక్తినీ, నా సృజనాత్మక శక్తినీ  పరీక్షించుకుంటూ, సింగిల్ పేజీ మినీ కథలు రాసుకున్నానా...నేను ఇంటలిజెంట్ రైటర్నా, లేక లేజీ - అవుట్ డేటెడ్ రైటర్నా...

          ఇవీ వామప్ కి బారులు తీరే ప్రశ్నాస్త్రాలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోలేకపోతే స్క్రిప్టు రాయాలనే ఆలోచనే శుద్ధ వేస్టు. ఈ వామప్ చేసుకున్నాకే స్క్రిప్టు రాయడం మొదలెట్టడానికి రెండో మెట్టు- స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకోవడం. వామప్ చేసుకోకపోతే  స్క్రీన్ ప్లే సంగతులు కూడా అనవసరం. అవి తెలుసుకుని ప్రయోజనం లేదు.

సికిందర్

Friday, May 25, 2018

651 : స్క్రీన్ ప్లే సంగతులు!


 సినిమాల్లో సెకెండ్ యాక్టే ఫస్టాఫ్ లో ప్రారంభం కానప్పుడు సెకెండ్ యాక్ట్ స్లంప్ ఎలా ఏర్పడుతుంది? నీళ్ళే (కథే) లేనప్పుడు సుడిగుండం ఎలా ఏర్పడుతుంది? స్క్రీన్ ప్లేలో 50 శాతం వుండాల్సిన సెకెండ్ యాక్ట్,  ఇలా 25 శాతానికే కుంచించుకు పోతున్నప్పుడు. ఇంత తక్కువ నిడివిలో కూడా నడవలేక ఎలా చతికిల బడుతుంది కథ? స్క్రీన్ ప్లేలో కథని పావు వంతుకి  కుదించి కూడా దాన్ని నడపలేకపోతున్నారంటే – బిగ్ కమర్షియల్స్ ని సైతం బోల్తా కొట్టిస్తున్నారంటే, ఎక్కడ జరుగుతోంది లోపం?  స్క్రీన్ ప్లే ప్రారంభంలో పావు వంతు వుండాల్సిన ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ని సగం వరకూ సాగదీసి,  ఇంటర్వెల్ వేయడమంటే దేనికి ఇంటర్వెల్ వేస్తున్నట్టు – ఫస్ట్ యాక్ట్ కా? ఇంకా కథే ప్రారంభించకుండా ఇంటర్వెల్లా? ఇంటర్వెల్ కథనుంచి కాసేపు విశ్రాంతికి కోసమా, లేక కథే ప్రారంభం కాకుండా ఉపోద్ఘాతం (ఫస్ట్ యాక్ట్ ) నుంచి ఉపశమనానికా? చాలా విచిత్రంగా వుంటాయి బిగ్ కమర్షియల్స్ లెక్కలు. ఎందుకంటే స్క్రీన్ ప్లే ఎలా వున్నా స్టార్  మోసేస్తాడు కదా... 

        స్టార్ ప్లేని మర్చిపోతున్నారు. స్టార్ ప్లే చేయడానికి కూడా స్క్రీన్ ప్లేలో సగం వుండాల్సిన కథని అందించడం లేదు. అత్తెసరు పావు వంతు కథని మీద పడేసి నిలబెట్ట మంటున్నారు. ఈ పావువంతు కథని కూడా స్లంప్ లో పడేసి మరీ లాగమంటున్నారు స్టార్ ని...ఈ సమ్మర్ కి స్టార్ సినిమాలన్నీ సెకెండ్ యాక్ట్ స్లంపుకి చూడ ముచ్చటేసే నమూనాలుగా కొలువు దీరిపోయాయి. 

        సెకెండ్ యాక్ట్ అంటేనే సినిమా కథ. స్క్రీన్ ప్లేకి వెన్నెముక. స్క్రీన్ ప్లే అనే మహా సౌధానికి రెండు మూల స్థంభాల (పిపి -1, పిపి -2) మధ్య పైకప్పు. ఈ పైకప్పుని పీకి పందిరేస్తే మిగిలేది మొండి గోడలే కదా? 


      సెకెండ్ యాక్ట్ ని ఫస్టాఫ్ లో ప్రారంభిస్తే, సెకెండాఫ్ లో వరకూ కావాల్సినంత నిడివి వుంటుంది. నిడివి ఎంత పెరిగితే కథ అంత వుంటుంది. కానీ సెకెండ్ యాక్ట్ ని ఇంటర్వెల్ తర్వాత సెకెండాఫ్ లో చూపించడం ప్రారంభిస్తే,  దాని నిడివి సగానికి – అంటే - స్క్రీన్ ప్లేలో పావు వంతుకి తగ్గిపోతుంది. ఫుల్ టికెట్ వసూలు చేసి, పావు టికెట్ కథ చూపిస్తే ఎట్లా? దాన్ని కూడా స్లంప్ బారిని పడేసి?

        ఫస్ట్ యాక్ట్ ని ముగిస్తూ ప్లాట్ పాయింట్ వన్ (పిపి -1)దగ్గర స్టార్ ఏం ప్రామీస్ చేస్తున్నాడో దాన్ని సెకెండ్ యాక్ట్ లో సక్రమంగా డెలివరీ చేయకపోతే, సెకెండ్ యాక్ట్ స్లంప్
(కథా మాంద్యం?) ఏర్పడు తుంది. (పిపి -1)దగ్గర స్టార్ కి గోల్ ఏర్పడుతూ కథ ప్రారంభమవుతుంది. ఈ కథ ప్రారంభమైన సెకెండ్ యాక్ట్ లో స్టార్ ఆ గోల్ ని డెలివరీ చేయాలి. ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన అధికార పార్టీ ఆ వాగ్దానాల్ని సక్రమంగా డెలివరీ చేయకపోతే వూడి పోయినట్టే, సక్రమంగా తన గోల్ ని డెలివరీ చేయని స్టార్ కూడా కథ చివర డిస్మిస్ అయిపోతాడు. స్టార్ ఎత్తుకున్న ప్రేమ కథైనా, ఫ్యామిలీ కథైనా, ఫాంటసీ కథైనా, కామెడీ కథైనా, యాక్షన్ కథైనా – ఏ కథైనా – సెకెండ్ యాక్ట్ లో ఒకటే కార్యకలాపం పెట్టుకుంటాడు. అది ఆ కథకి తగ్గ జానర్ లక్షణాలతో, దాని తాలూకు గోల్  కోసం, అలాటి ఓడిడుడుకులని ఎదుర్కోవడం!


        ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం రెండు భాగాలుగా వుంటుంది. ఇక్కడే సెకెండ్ యాక్ట్ రెండుగా విభజన జరుగుతుంది. ఒక భాగం ఇంటర్వెల్ ముందు వరకూ వుంటుంది. రెండో భాగం ఇంటర్వెల్ తర్వాత వుంటుంది. ముందుగా ఇంటర్వెల్ ముందు ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే క్రమంలో దెబ్బలు తింటూ వుండే తంతే ఎక్కువ వుంటుంది. అంటే రియాక్టివ్ గా పాత్ర చిత్రణ వుంటుంది. వెంటనే ప్రత్యర్ధిని మట్టి కరిపించే యాక్టివ్ చర్యలకి దిగడు. అసలు తనకేం జరుగుతోందో అర్ధం చేసుకోవడానికే సమయం పడుతుంది. అర్ధం చేసుకుంటూ ప్రత్యర్ధి దాడుల్ని రియాక్టివ్ గా ఎదుర్కొంటూ, ఇంటర్వెల్ కొచ్చేసరికి అన్నీ అర్ధమైపోతాయి. అప్పుడు స్టార్ ప్రత్యర్ధి మీద పైచేయి సాధిస్తాడు. ఇదీ మొదటి భాగం సెకెండ్ యాక్ట్ స్టార్ బిజినెస్. అంటే రియాక్టివ్ స్టార్ ప్లే!

        దీన్తర్వాత సెకెండాఫ్ లో స్టార్ యాక్టివ్ గా ప్రవర్తించడం మొదలెడతాడు. ప్రత్యర్ధితో పూర్తిస్టాయిలో అమీతుమీకి దిగుతాడు. ఈ ఓడిడుకులు పార్ట్ టూ లో స్టార్ యాక్టివ్ గా మారిపోతాడు. ప్రత్యర్ధిని మట్టి కరిపిస్తూ కరిపిస్తూ వెళ్లి ప్రత్యర్ధి  పన్నే ఒక పెద్ద పద్మవ్యూహంలో పడిపోతాడు స్టార్. ఇది పిపి – 2 ఘట్టం.  స్క్రీన్ ప్లే కి రెండో మూల స్థంభం. అంటే సెకెండ్ యాక్ట్ కి ముగింపు!


       మొత్తం సెకెండ్ యాక్ట్  అంతా గోల్ కోసం స్టార్ కీ ప్రత్యర్ధికీ మధ్య జరిగే యాక్షన్ - రియక్షన్ల మయమే. కానీ,  అర్ధం జేసుకోవాల్సింది సెకెండ్ యాక్ట్ మొదటి భాగంలో స్టార్ కి ఈ యాక్షన్ -  రియక్షన్ల తంతు రియాక్టివ్ గా వుంటే, రెండవ భాగంలో యాక్టివ్ గా వుంటుంది. మానసిక ఎదుగుదలలో, తదనుగుణ ప్రవర్తనతో స్టార్ ఈ తేడాలు కనబర్చక పోతే, మొత్తం సెకెండ్ యాక్టే డొల్లగా మారిపోయి ఢామ్మని స్లంప్ లోపడుతుంది!!

        గోల్ ని ఏ ఎత్తుగడలతో, ఏవ్యూహాలతో తెలివిగా డెలివరీ చేస్తున్నాడనేదే సెకెండ్ యాక్ట్ కి ముఖ్యం. పిపి – 2  దగ్గర స్టార్ పద్మవ్యూహంలో పడడంతో కథ ముగిసి, ఇక ఉపసంహారమే మిగిలుంటుంది. అంటే మళ్ళీ పుంజుకుని గోల్ ని డెలివరీ చేసేందుకు థర్డ్ యాక్ట్ బిజినెస్ ఏకధాటిగా మొదలెడతాడమన్నమాట. 


        ఇంత కథ – బిజినెస్ వుండే సెకెండ్ యాక్టు వచ్చేసి, స్క్రీన్ ప్లేలో సగభాగం కాకుండా, ఇంకెప్పుడో సెకెండాఫ్ లో ప్రారంభమై, పావు వంతుకి మూలకి సర్దుకుంటే, ఇక స్టార్ పాల్పడాల్సిన రియక్టివ్ – యాక్టివ్ బిజినెస్సులకి ఏపాటి సమయం చిక్కుతుంది? అప్పుడేమని పిస్తుంది - నసేరా బాబూ నస! మన స్టార్ ఏమీ చేయలేదు - నస పెట్టాడ్రా బాబూ నస – అని కదూ?

సికిందర్

Thursday, May 24, 2018

650 : స్పెషల్ ఆర్టికల్



        సినిమా కథంటే ఏమిటని ఎవరికైనా సందేహం వస్తే, ఇలా అనేక సమాధానాలు చెప్పుకోవచ్చు- సినిమా కథంటే అప్పుడున్న మార్కెట్టని అస్సలు అన్పించనిదని. సినిమా కథంటే ప్రొఫెషనల్ గా రాయాలని అస్సలు అన్పించనిదని. దాంతో చేసే వ్యాపారం పక్కా ప్రొఫెషనల్ అని అస్సలు అన్పించనిదని. మార్కెట్ యాస్పెక్ట్ తో ఆలోచించి రాయాలని ఏ కోశానా అన్పించనిదని. 90 శాతం సినిమాలు ఫ్లాపవుతున్నా, ఎందుకు ఫ్లాపవుతున్నాయో తెలుసుకుని రాయాలని ముమ్మాటికీ అన్పించనిదని. అసలు 90 శాతం సినిమాలు ఫ్లాపవుతున్నాయన్న సంగతే తెలీకుండా రాసెయ్యాలన్పించేదని. మార్కెట్ లో ఏం జరుగుతోందో తెలియనే తెలియక, తెలుసుకోవాలనే అన్పించక రాసెయ్యా లన్పించేదని . జానర్ల తేడాలే తెలీక, తెలుసుకోవాలనే అన్పించక రాసెయ్యాలన్పించేదని. సినిమాలు ఎవరు చూస్తున్నారో తెలీక, తెలుసుకోవాలనే అన్పించక, రాసెయ్యలన్పించేదని. ఏదీ తెలీక, తెలుసుకోవాలనే అన్పించక, రాసెయ్యలన్పించేదని. సినిమా కథంటే, ఏదీ తెలుసుకోవాల్సిన అవసరమేలేని ఒక పనికిమాలిన వ్యాపకమని. రాశామా, తీశామా, ఇంటికి వెళ్ళామా అన్పించేదని. సినిమా కథంటే సీమ పంది కూడా ఆలోచించి పారేసే తొక్కలో నాసి వ్యవహారమనీ...

       
కాబట్టి ఈ మొత్తంగా చూస్తే తేలే సారాంశం - గురజాడ రాసినట్టు – ‘థ్రోయింగ్ పెరల్సు బిఫోర్ ది స్వైన్’ లాంటి వ్యవహారమన్న మాట స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకోవడమంటే. అయినా ఓపిగ్గా చెప్పుకుంటూనే వున్నాం చాన్నాళ్ళుగా. ఎలా అన్పిస్తే అలా రాసెయ్యడం ప్రకృతి, ఎలా రాయాలో తెలుసుకుని రాస్తే సంస్కృతి. ప్రకృతి పశువుక్కూడా వుంటుంది, సంస్కృతి మనిషికే వుంటుంది. సంస్కృతితో  తయారు చేయని మరచెంబు కూడా మార్కెట్లో అమ్ముడుపోదు. చేతి వృత్తులవారికున్న సంస్కృతిని (ప్రొఫెషనలిజాన్ని) చూసైనా మారాలన్పించకపోతే, ఎవరి పొట్ట ప్రాబ్లమ్సూ ఎప్పటికీ తీరవు.

        సినిమా కథంటే మిడిల్ లేదా సెకెండ్ యాక్ట్ కూడా. అక్కడే వుంటుంది సినిమా కథంతా. సినిమా అంతా సినిమా కథ వుండదు. సినిమా అంతా సినిమా కథ కాదు. సినిమా బిగినింగ్ సినిమా కథ కాదు, సినిమా ఎండ్ సినిమా కథ కాదు. మధ్యలో వుండే మిడిల్ మాత్రమే సినిమా కథ. ఈ కనీసావగాహన లేకపోతే సినిమా కథ రాసే అర్హత లేదు.  అందుకని కొన్ని సినిమాల్లో మిడిల్ ముక్కుతూ మూల్గుతూ నత్త నడక సాగిస్తుంది. చివరికెలాగో హమ్మయ్యా అని ముగింపుకి చేరుకుంటుంది. ఆ ముగింపు మాత్రమే బ్రహ్మాండంగా వుంటుంది. ముగింపు బ్రహ్మాండంగా వుంది కాబట్టి మిగతా  సినిమా అంతా బ్రహ్మండంగానే వుందనే భ్రమకి లోనుజేస్తారు ప్రేక్షకుల్ని. ప్రేక్షకులు కూడా ముగింపుకి ఫిదా అయిపోయి, మిడిల్లో పడ్డ నరకయాతనంతా మర్చిపోతారు సినిమా భేష్ అనేస్తూ. రివ్యూ రైటర్ కూడా సెకండాఫ్ లో (దర్శకుడు) కాస్త తడబడ్డాడు అని పడికట్టు పదాలు అదే పనిగా వాడతాడు. తడబడ్డ మంటే ఏమిటో, ఎందుకు తడబడాలో, ఆ తడబడ్డంలో కూడా కాస్త తడబడ్డాడని కొలతలేమితో, అసలు మొత్తంగా బొక్కబోర్లా పడి ప్రేక్షకులకి ప్రత్యక్ష నరకం చూపిస్తూంటే! 


        ఇంతకీ తడబడుతున్నానని దర్శకుడికి తెలీదా? ఛత్, నేనెందుకు తడబడ్డానూ, రివ్యూ రైటర్ చూశాడా నేను తడబడుతూ నడుస్తూంటే? నేను మంచి స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్ళాను - అని సినిమా జర్నలిజం పదాలతోనే  ఎదురు దాడికి దిగవచ్చు.  కాస్త తడబడ్డాడని ఎంతో క్షమాగుణం చేసుకుని రివ్యూ రైటర్ రాసినా, లేదు స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్లానని దర్శకుడు దబాయించినా, మనకొచ్చే సందేహం ఒక్కటే – అసలు కథలోకే వెళ్ళకుండానే  ఎలా తడబడ్డాడని, ఎలా స్టామినాతో స్ట్రెయిట్ గా వెళ్ళాడని !!


        మొత్తం విషయమంతా సినిమాలో  దర్శకుడు బయట బయటే తప్పించుకు తిరుగుతున్నట్టు కన్పిస్తూంటే,  ఎలా తడబడతాడు? ఎలా స్ట్రెయిట్ గా స్టామినాతో వెళ్తాడు? విషయం మహా గంభీరంగా వుండి, దాన్ని మోయలేక తడబడ్డాడన్నా అర్ధముంటుంది. అసలు విషయమే లేకపోతే మోసేదేముంటుంది, మోయలేక తడబడే దేముంటుంది? స్టామినాతో పనేముంటుంది, దాంతో  స్ట్రెయిట్ గా వెళ్ళే అవస్థేముంటుంది? 


        కాబట్టి సినిమా కథంటే ఏదేమిటో, ఎందుకు చేస్తున్నారో, ఏదెందుకు అనాలో తెలీని ఇంకా బాగా గజిబిజి చేసుకున్న వ్యవహారమని ఇంకో  నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు. అసలు ఒకటీ అరా సినిమాలకి పని చేసిన వాళ్ళతో వచ్చే సమస్య కూడా ఒకటుంది.  ఒకటీ అరా సినిమాలకి పనిచేసి అప్పుడే దర్శకత్వ ప్రయత్నాలు మొదలెట్టడంతో వస్తోంది ఈ పరిస్థితి. ఎందుకు ఒకటీ అరా సినిమాలకి పని చేసి దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే, పని చేస్తున్న చోట జీతాల్లేక. ఇంకెక్కడైనా ఇదే పరిస్థితి వుంటుందనే, జాగ్రత్తపడి దర్శకులై పోవాలనుకుంటున్నారు. కొంత కాలం క్రితం గాంధీగారు ఒక కార్టూను వేశారు – దర్శకుడితో ఒకతను అంటాడు - రైటర్స్ ని బాగా చూసుకోకుంటే వాళ్ళే దర్శకులైపోయి మనకి పోటీ కొచ్చేస్తారని!


        దీన్ని అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) లు నిజం చేస్తున్నారు జీతాల్లేక అలమటించి. జీతాలిస్తూంటే సినిమా తర్వాత సినిమాగా కొన్ని సినిమాలు చేస్తూ, మొత్తం పనినేర్చుకుంటారు ఏడిలు. ఒకటీ అరా సినిమాలకి కూడా జీతాలివ్వకపోతే బయటపడి విధిలేక డైరెక్టర్లై పోవాలనుకుంటున్నారు. వీళ్ళల్లో బడ్జెట్ వేసుకోవడం కూడా ఎంత మందికి వస్తుందో సందేహమే. ఇక బిజినెస్ విషయాలు అసలే తెలీవు. సినిమా కథ మొదటికే తెలీదు. అయినా ఛాన్సులు కొట్టేస్తున్నారు! 


        ఇలా కొత్త కొత్త వర్గాలు వచ్చి చేరుతున్నాయి టాలీవుడ్ కథల్ని కాల్చిపారెయ్యడానికి. ఈ వర్గాల్లో ఇతర శాఖల వాళ్ళూ  చేరుతున్నారు, మేము సైతం దర్శకత్వానికి సై అంటూ. ఎడిటర్ కావచ్చు, కాస్ట్యూమర్ కావచ్చు, ప్రొడక్షన్ మేనేజర్ కూడా...వాళ్ళ శాఖల్లోకి వెళ్ళి పనిచేయాలంటే కార్డు లేకపోతే రానిచ్చే ప్రసక్తే లేదు, కానీ మా శాఖలోకి కార్డు అవసరం లేకుండా మాకే ఎలా పోటీ కొచ్చేస్తున్నారో చూడండీ - అని నిర్మాతల కోసం పాట్లుపడుతున్న ఓ ఇద్దరు దర్శకుల ఆందోళన!


        ఇంకా కథ ఎక్కడ బతుకుతుంది. ఎవరు బతికిస్తారు కథని. అసలు బతికించాలని ఎందుకనిపించాలి. ఎవరి ఆట వాళ్ళాడుకోవాలి. ఒక కెమెరామాన్ హాస్యంగా అన్నాడు – కథ, స్క్రిప్టు, క్రియేటివిటీ, దర్శకత్వం  అంతా షూటింగు ముందు వరకే – షూటింగు మొదలయ్యాక దర్శకుడు దర్శకుడు కాదు, మేనేజరే! అక్కడ ఖర్చు ఎలా తగ్గించాలి, దేనికి ఎవర్ని మాటాడుకోవాలి... లాంటి ఆలోచనలే బుర్రనిండా – దర్శకత్వం లేదు, తొక్కాలేదు అని!  


        కథకి ఇన్ని కందకాలు తవ్వుకుంటే కథ గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదంగానే వుంటుంది. అయినా విధిలేక ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి సెకెండ్ యాక్ట్ స్లంప్  ఏమిటో చూద్దాం...


రేపు!

సికిందర్

Saturday, May 19, 2018

649 : స్క్రీన్ ప్లే సంగతులు!


          (వెనుక సీనులో జరిగింది : పల్లెటూళ్ళో పేడ పురుగులు పడుతున్న జూన్ హా దగ్గరకి హీరోయిన్ వచ్చి, తనని నది అవతలున్న భూత్ బంగ్లాకి తీసికెళ్ళ మనీ, రేపు పన్నెండింటికి వస్తాననీ చెప్పి వెళ్ళిపోతుంది)
     సీన్ :      పడవలో కూర్చుని ఎదురు చూస్తూంటాడు జూన్ హా. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. దూరంగానే ఆగిపోతుంది. చెయ్యూపుతాడు. తనూ చెయ్యూపుతూ వచ్చి పడవెక్కి కూర్చుంటుంది. భూత్ బంగ్లా గురించి తాతగారు చాలా చెప్తారనీ, కానీ అక్కడికి వెళ్ళనీయరనీ అంటుంది. అతను తెడ్డు వేస్తూంటాడు. తను బయట తిరిగే విషయంలో తాతగారు స్ట్రిక్టుగా వుంటారని అంటుంది. వూళ్ళో ఎవరితోనైనా వెళ్దామంటే  వాళ్ళు తాతగారికి చెప్పేస్తారనీ అంటుంది. ఎందుకో అనుమానం వచ్చి చూస్తుంది. చూస్తే, అతను తెడ్డు వేస్తున్నా పడవ వున్నచోటే వుంటుంది. అతను ఇబ్బందిగా చూసి, నిజం చెప్పాలంటే తనకి పడవ నడపడం రాదంటాడు. ఎలాగో తిప్పలు పడి నడుపుతూంటే, తన పేరు జూహీ అని చెప్తుంది. తన పేరు జూన్ హా అంటాడు. తామిద్దరూ సువాంగ్ నుంచే వచ్చారని తెలుసుకుని, ఇది గమ్మత్తుగా వుందంటుంది. గమ్మత్తు కాదూ, ఫేట్ అంటాడు. అర్ధంగాక, ‘అంటే?’ అని ఆమె అంటే, ఏమీ లేదంటాడు. 

పాయింట్ :  
      మన దగ్గర సున్నిత ప్రేమ కథలని అంటారు. దానికి సంగీత దర్శకుడు ధడాధడా  వాయిస్తాడు. ఆ సున్నితత్వమేంటో అనుభవించే వీలే వుండదు. దృష్టిని చెదరగొట్టే  సాధనం సౌండ్. అన్నిరకాల సౌండ్స్, డైలాగుల మోత సహా. కానీ ఈ కొరియన్ సీనులో ఇలా లేదు. జూన్ హా పడవలో కూర్చుని ఎదురు చూస్తూంటే, నిశ్శబ్దంగా వుంటుంది వాతావరణం. నదీ, దాని పరిసరాలూ, ప్రకృతీ అన్నీ ప్రశాంతంగా వుంటాయి. మన దృష్టి ఈ పరిసరాల్ని పరికిస్తూ ఒక అనుభవంలోకి తీసికెళ్ళి పోతుంది. ఇలాకాక, ఇలాంటప్పుడు ఎప్పుడైతే సౌండ్ వేస్తారో, అప్పుడు దృశ్య  విశేషాల్ని అనుభవించనీయకుండా మన దృష్టి నటుల మీదికెళ్ళి పోతుంది. సౌండ్ లేనప్పుడే ఏకాగ్రతతో పూర్తిగా దృశ్యంలోకి లీనమవగల్గుతాం. కథలోకి ఎవరైనా తీసికెళ్ళ గలరు, ‘కథా లోకం’ లోకి తీసికెళ్ళ గల్గినప్పుడే దర్శకుడు నిజమైన దర్శకుడవుతాడు. కథంటే నటుల మీద వుండేది కాబట్టి వాళ్ళ వరకూ డైలాగులతో, రియాక్షన్స్ తో చూపించి వదిలేస్తే అది సినిమాలా కాకుండా స్టేజి నాటకంలా వుంటుంది. సినిమా అన్నాక,  ఆ నటీనటులున్న కథాలోకపు ఆవిష్కరణ కూడా జరగాలి. కథాలోకం లేక సినిమా కథే లేదు. కథా లోకమంటే కథకి సోల్ ని ఏర్పాటు చేసేది. 


          మన దగ్గర టీనేజి ప్రేమ కథల్లో కూడా ముప్ఫై ఏళ్ల హీరో, పాతికేళ్ళ హీరోయిన్ నటిస్తారు. వీళ్ళతో టీనేజి బిహేవియర్ చూపిస్తే ఎబ్బెట్టుగా వుంటుంది. కాబట్టి దాటవేసి ఎటూ కాని బిహేవియర్లు చూపిస్తారు. ఈ కొరియన్ మూవీలో టీనేజీకి సరిపడా వయస్సు లోనే హీరో హీరోయిన్లు కన్పిస్తారు. కనుక తొలి పరిచయపు బిహేవియర్లని సహజంగా చూపడం వీలైంది. 

          వెనుక హీరోహీరోయిన్లు తొలిసారి ఎదురుపడే సీన్లో హీరో చెయ్యూపితే, హీరోయిన్ కూడా చెయ్యూపుతుంది. అక్కడ అమాయకపు ముసిముసి నవ్వులే తప్ప మాటలుండవు. ఇప్పుడు కూడా ఇంతే. అతను పడవలో కూర్చుని వుంటే, ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి ఆగిపోతూ, ఇప్పుడూ ముసిముసి నవ్వులతోనే  చెయ్యూపుతుంది. అతనూ అలాగే చెయ్యూపుతాడు. వీళ్ళు  నిష్కలంక మనస్కులని యిట్టే అర్ధమై పోతుంది, సున్నిత మనస్కులు సరే. 

          ఇలాటి దృశ్యాలు బహుశా  యువ ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్నది చూస్తున్నట్టుగా ఈ క్షణమే అనుభవిస్తారు. కానీ వయసు మళ్ళిన ప్రేక్షకులు రెండు సార్లూ అనుభవిస్తారు - ఒకటి తమ టీనేజిలో అనుభవించివుంటారు, ఇప్పుడు తిరిగి తెర మీద దర్శిస్తారు. సినిమాల్లో యూత్ అప్పీల్ అంటే, వయసు మళ్ళిన వాళ్ళల్లో కూడా టీనేజీని నిద్రలేపడమేనేమో. 

          తెలుగు థాట్ కొస్తే, ‘హాయ్!’  అంటూ హీరోయిన్ చిల్లరగా పరుగెత్తుకొస్తుంది, ‘వావ్!’ అని హీరో ఓవరాక్షన్ కామెడీ చేస్తాడు – రాస్తున్న జానర్  రోమాంటిక్ డ్రామా అయినా సరే. ఇప్పటి యువ డైలాగ్ రైటర్ కి ఇంతకంటే దృశ్యం రాయడం రాదు. జానర్ తేడాలు తెలిస్తేగా తెడాగల రాతలు రాయడానికి. 

          ఈ సీన్లో కొన్ని విశేషాలున్నాయి. ఆమె తన తాతగారు చాలా స్ట్రిక్టు అంటుంది. అంటే ఇప్పుడాయన కన్నుగప్పి వచ్చిందన్నమాట. తాతగారి గురించి ఆమె చేత దర్శకుడు కొంచెం ఎక్కువే మాట్లాడించాడంటే, ఇప్పుడెక్కడో తాత గారు ఎంట్రీ ఇస్తాడన్న మాట. ఇలా ఈ మామూలు సీన్లో,  కథని  ముందుకు నడిపించే ఒక ఫోర్ షాడోయింగ్ ని క్రియేట్ చేశాడు సస్పెన్సు తో. 

     రెండోది, వీళ్ళిద్దరూ గత సీన్లలో రెండు సార్లు కలుసుకున్నా పరస్పరం పేర్లు వెల్లడించుకోలేదు. హీరో ఫ్రెండ్స్ కూడా ఆమె ఫలానా తాతగారి మనవరాలని చెప్పారే గానీ ఆమె పేరు చెప్పలేదు. పేర్లు ఎక్కడ వెల్లడించుకుంటే సన్నివేశం రక్తి కడుతుందో, రోమాంటిక్ గా వుంటుందో,  అక్కడే వెల్లడించాడు దర్శకుడు. ఇది గమనించాలి. స్ట్రక్చర్, క్రియేటివిటీ ఇవే సరిపోవు. అంతకి మించిన క్రాఫ్ట్ కూడా అవసరం. క్రాఫ్ట్ అంటే ఇలా సమయస్ఫూర్తితో చెక్కడ మన్నమాట. హీరో పేరు జూన్ హా అని మనకి ముందే తెల్సు. కానీ ఈ సీను దాకా హీరోయిన్ పేరే మనకి తెలీదు. ఇంతవరకూ హీరోయిన్ అనే రాసుకుంటూ వచ్చాం. 

          గమనించాల్సిన మరొక విషయమిటంటే, వెనుక రెండు సీన్లలో కూడా హీరోతో వున్న  ఫ్రెండ్స్ ఇద్దరి  పేర్లూ చెప్పలేదు దర్శకుడు. ఒరే శీనూ, ఆఁ ఏంట్రా రాజూగా...  అని అత్యుత్సాహంతో రాసుకుపోవచ్చు  - అదేదో ఎంటర్ టైన్మెంట్ అనుకుని డైలాగ్ రైటర్ మురిసిపోయి. ప్రయోజనం? ఆ రెండు సీన్లు తప్పితే మళ్ళీ ఎక్కడా కన్పించని ఫ్రెండ్స్ పేర్లు తెలుసుకుంటే ఏమిటి ప్రేక్షకుల కొచ్చే లాభం, అనవసర సమాచారంతో మెదడు  బరువెక్కించుకోవడం తప్ప? థియేటర్లో సౌండ్ పొల్యూషన్ తప్ప? నిగ్రహంతో ఇలాటివి కట్ చేసుకుంటే, ఇట్ విల్ బి కాల్డ్ సెల్ఫ్ ఎడిటింగ్. 

          ఇప్పుడు పడవలో వాళ్ళ మధ్య సెటిల్డ్ వాతావరణ మేర్పడ్డాక సంభాషణ ఇంకొంచెం ముందుకు పోతుంది సహజంగానే. తాత గారి గురించి ఆమె పర్సనల్ విషయాలు చెప్పుకుంటోంది. ఇక్కడే, ఆఁ మర్చిపోయానంటూ తన పేరు కూడా చెప్పుకుంది. అతనూ చెప్పుకున్నాడు. ఇద్దరూ ఒకే సవాంగ్ పట్టణం నుంచి వచ్చారని తెలిసి, ఇది గమ్మత్తుగా వుందని ఆమె అంటే,  ఇది ఫేట్ అని అతనన్నాడు. ఈ చివరి మాటలతో  పాత్రలు ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆమె పైపైన ఆలోచిస్తుందనీ, అతను లోతుగా ఆలోచిస్తాడనీ. 

          ఈ సీన్లో, నది రూపంలో వాటర్ థీమ్ నేపధ్యం కొనసాగి, హీరోయిన్ పేరు, హీరోహీరోయిన్ల వ్యక్తిత్వాలూ  కొత్తగా మనకి తెలిశాయి. సీన్ స్ట్రక్చర్ అంటే, పాత్రల గురించి కొత్త విషయాలు చెప్పేది, లేదా కథని ముందుకు నడిపించేదని తెలిసిందే  కాబట్టి.

సీన్ :   
      ఇద్దరూ చెట్ల మధ్యకి నడుస్తూంటారు. భూత్ బంగ్లాలోకి వెళ్తారు. చీకటిగా వున్న ఒక గదిలోకి తొంగి చూస్తారు. బయటికి వచ్చి ఇంకో గదిని చూస్తారు. అప్పుడు జూహీ అంటుంది, ‘నువ్వెప్పుడైనా దెయ్యాల్ని చూశావా?’ అని.  రోజూ చూస్తానంటాడు. ఆమె అర్ధంగాక అడిగితే,  అద్దంలో చూస్తానంటాడు. నిజానికి  తనే వొక దెయ్యాన్నని నవ్వుతాడు. ఆ నవ్వు చూడలేక ఆపమంటుంది. డిసప్పాయింటైనట్టు చూస్తూ వుంటుంది అతడికేసే. 

          అక్కడ్నించి వరండాలోకొచ్చి  ఇద్దరూ కింద పడిపోతారు. ఆమె ఇటు ముందు, అతను అటు వెనుకాల. అతను వచ్చేసి ఆమెని లేపుతాడు.  వెనక వారగా ఎవరో వెళ్లినట్టన్పించి గిరుక్కున తిరిగి చూస్తారు. ఎవరూ వుండరు. మెల్లిగా ఆ గది దగ్గరికి వెళ్తారు. ఆమె దూరంగా వుంటుంది. అతను తలుపు తోసి లోపలికి  చూసి, భయంకరంగా కేకలు పెడుతూ పరిగెడతాడు. అర్ధంగాక ఆమె కూడా  మెల్లిగా ఆ గది దగ్గరికి వెళ్తుంది. గదిలోంచి పిచ్చోడు వచ్చేస్తాడు. ఆర్తనాదాలు చేస్తూ పరుగు లంకించుకుంటుంది. ఇది విని వెనక్కి పరిగెత్తు కొస్తాడు జూన్ హా. 

          ఇద్దరూ ఆగిపోయి ఒకర్నొకరు  చూసుకుని గట్టిగా కేకలు పెట్టుకుంటారు. భూత్ బంగ్లాలో వున్నది పిచ్చోడు కావడంతో గట్టిగా నవ్వుకుని, మళ్ళీ కేకలు పెట్టుకుంటారు. మళ్ళీ  నవ్వుకుని మళ్ళీ కేకలు పెట్టుకుంటారు. వీళ్ళని తోసుకుంటూ మధ్యలోంచి  మందు బాటిల్ పట్టుకున్న పిచ్చోడెళ్ళిపోతాడు. మళ్ళీ కేకలు పెట్టుకుని మళ్ళీ నవ్వుకుంటారు. మళ్ళీ కేకలు పెట్టుకుంటారు...అవతల పచ్చటి ప్రకృతి మీద ఈ కేకలు ఎండ్ అవుతాయి. 

పాయింట్ :
      ఈ సీను పడవ దిగి వెళ్తున్న అర్ధంలో వాళ్ళిద్దరి అడుగులమీద ఫోకస్ చేసి హాఫ్ వేలో ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ ఇలాగే రాసి ఇలాగే తీశారా, లేక ఇంకా వేరే తీసి ఎడిటింగ్ లో ఇక్కడ్నుంచి తీసుకున్నారా మనకి తెలీదు. కానీ ఇది చాలా అర్ధవంతమైన ఓపెనింగ్, కథా గమనం మీద ఫోకస్ చేస్తూ.  

          ఇద్దరి అడుగులు దగ్గర దగ్గరగా పడుతూంటాయి. దర్శకుడు అడుగుల మీద అలా ఫోకస్ చేశాడంటే రోమాంటిక్ బంధాన్ని వేస్తున్నట్టే. ఇది వాళ్ళకి తెలియకపోయినప్పటికీ దర్శకుడే అందుకు  బీజాలేస్తున్నాడు.  ఇప్పటి వరకూ నడిచిన వీళ్ళిద్దరి సీన్లలో,  ఎక్కడా  లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే టచ్ లేదు. ఇప్పటికామెకి  పెళ్లి సంబంధం కూడా కుదరలేదు టీసూతో. పెళ్లి సంబంధానికి  పూర్వపు అనుభవాలివి. 

          విధి లేదా కాలంతో కూడిన రోమాంటిక్ డ్రామాల్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు వుండవా? కలపడం విధి లేదా కాలమే చూసుకుంటాయా?  కాస్త సమయం తీసుకుని ఆలోచించాల్సిన విషయమిది. విధి, లేక కాలం కథ నడుపుతోందంటే పాత్రలు చేయడానికేమీ వుండదు. అంతా విధి లేదా కాలం చూసుకుంటాయి. అందుకే ఇక్కడ తొలి చూపు ప్రేమలు కన్పించడం లేదు. ఎక్కడా ఇద్దరూ అలాటి భావంతో చూసుకోవడం లేదు. విధి నడపని కథల్లోనైతే  హీరో హీరోయిన్లు తాముగా ప్రేమలో పడ్డం వుంటుందేమో. ఇక్కడ జుహీ ఇందాక పడవలో గమ్మత్తు అన్నా, జూన్ హా ఫేట్ అన్నా,  కాలానికి సంబంధించినవే. కాబట్టి కాలానికి లోబడి నడుచుకుంటున్నారు. 

          అసలు భూత్ బంగ్లా సీనుని ఈ కథలో ఎందుకు కల్పించాడు? కాలం కథని నడపడం కోసం. కాలం దానికది తెచ్చిపెట్టే మెటఫర్స్ (రూపకాలంకారాలు) ని చూపెట్టడం కోసం. అలా భూత్ బంగ్లాయే ఒక మెటఫర్. దేనికి మెటఫర్? వీళ్ళు చేయబోయే ప్రేమ ప్రయాణంలో ఎదురయ్యే పరీక్షలకి మెటఫర్. ఈ భూత్ బంగ్లా అలా వొక ప్రయోగశాల. ఈ ప్రయోగ శాలలో ఒక పిచ్చోడున్నాడు, రెండు పావురాలున్నాయి, మరో రెండు వీళ్ళు తెలుసుకోక జరిగిపోయిన ఒక సంఘటనా, ఇంకో బాడీ లాంగ్వేజ్ వున్నాయి. 

          దేని తర్వాత దేన్ని,  ఈ క్రమాన్ని వరసగా ఎస్టాబ్లిష్ చేశాడో చూద్దాం – ముందుగా చీకటి గదిలోకి ఎంటరైనప్పుడు ఆమె ముందుంటుంది. అతను వెనుక వుంటాడు. భూత్ బంగ్లా చూడాలన్న కుతూహలం ఆమెదే  కాబట్టి ఆమె ముందుండడం ఈ ఓపెనింగ్ కి న్యాయం. అతను చూపిస్తానని ఎస్కార్ట్ లాగా వచ్చాడు కాబట్టి ఆమె వెనకుండడం న్యాయం.  

          ఇలా ఆమె కుతూహలాన్ని బేస్ గా చేసుకుని సీను ఓపెన్ చేసి, తర్వాత ఇద్దర్నీ పక్కపక్కనే చూపించుకుంటూ పోతాడు దర్శకుడు. చిత్రీకరణలో చాలా నిశిత పరిశీలన కలవాడుగా కన్పిస్తున్నాడు దర్శకుడు. తెలుగులో విడుదలయ్యే ప్రేమ సినిమాలు ఒక్క పూట కూడా ఎవరూ చూడ్డం  లేదంటే, ఏముంటుందని చూడ్డానికి - ప్రేక్షకుల అంతరంగాల్ని కట్టి పడేసి కథానుగుణ చిత్రీకరణా  విధానాలు ఏ ప్రేమ సినిమాల్లో వుంటున్నాయని. మానవ ప్రవర్తన తెలియకుండా హీరోయిన్ ని బిక్కుబిక్కు మంటూ వెనుక వుంచి, హీరోగార్ని హీరోయిజంతో ముందుకు నడిపిస్తే ఈ సీను కనెక్ట్ అవుతుందా? కుతూహలమున్న హీరోయిన్ బిక్కుబిక్కు మంటూ వెనుక వుంటుందా? మొన్నొక కొత్త దర్శకుడు కరెక్ట్ మాట చెప్పాడు – సీనుని వెనుక సీన్లో పాత్రల లక్ష్యాల ఆధారంగా నడిపిస్తే కరెక్టుగా వస్తాయని. 

          తర్వాత, ఆ గది దాటుకుని బయటి కొచ్చాక, ‘నువ్వెప్పుడైనా దెయ్యాల్ని చూశావా?’ అంటుంది. కుతూహలంతో వచ్చింది. దెయ్యం కనపడ్డం లేదు. అందువల్ల దీని కొనసాగింపుగా, నోట్లోంచి ఈ మాటే వచ్చింది. అతను రోజూ అద్దంలో చూస్తానంటాడు. నిజానికి  తానే వొక దెయ్యాన్నని నవ్వుతాడు. ఇది తన మీద తానేసుకున్న జోకు తప్ప మరేమీ కాదు నిజానికి. కాలం పలికించిన జోకు. ఈ జోకే నిజమవుతుంది చివరికి. ఈ జోకువేసి ఆమెని భయపెడుతూ చేతులు తిప్పుతాడు. ఆమె బాధగా చూసి ఆపమని సున్నితంగా అంటుంది. 

          అతనిలా  తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడ్డం తనకిష్టం లేదన్న భావం ఆమె మొహంలో స్పష్టంగా పలుకుతుంది. అతడి  జోకుతో ఆమె లోపలున్న ఫీలింగ్స్ బయట పడినట్టయ్యింది. దీంతో ఆమె అతడికి కనెక్ట్ అవుతోందని మనకి తెలుస్తోంది. 

          ఫీలింగ్స్ తో ఈ కనెక్షన్ ఏర్పడ్డాక, ఇప్పుడు ఈ కనెక్షన్ ని తీసికెళ్లి ఏం చెయ్యాలి? ఫీలింగ్స్ లో వుండి పోయిన కనెక్షన్ ని ఫిజికల్ గా కనెక్టు చేసి విజువల్ గా రక్తి కట్టించాలి. ఎన్ని ఫీలింగ్స్ వున్నా ఏమీ లాభం వుండదు, ఎవరూ వాటిని నమ్మరు, అవి కార్యరూపం దాల్చకపోతే. కథంటే విజువల్ గా వుండే సంఘటనలే. ఎంత కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకున్నా సంఘటనలు జరక్కపోతే ఆ మాటల కర్ధముండదు. 

          వరండాలో కొచ్చి అటొకరు, ఇటొకరు చూసుకుంటూ వెళ్తున్నప్పుడు, అటు కింద మెట్టు మీద కాలుపడి  ధడాల్న పడిపోతుంది జూహీ.  ఈ శబ్దానికి అటు జూన్ హా కూడా తూలి ధడాల్న పడిపోతాడు. పూర్తయ్యింది ఫిజికల్ కనెక్షన్. ఇటు ఈమె పడిపోతే, ఈమెకున్న ఫీలింగ్స్ అటు అతడికి తాకి అతనూ పడిపోయాడన్న మాట. ఈ మెలోడ్రామా అవధులు దాటిన మెలో డ్రామాయే. కానీ  దర్శకుడు ముందే హెచ్చరించాడు -  మేం కంట నీరు పెట్టుకునే సెంటిమెంటల్ కథలు చేసుకుంటామని. 

          ఫిజికల్ కనెక్షన్ ఏర్పాటయి పోయింది. వెంటనే వచ్చి లేపుతాడు. కానీ ఇద్దరూ అలా పడిపోయినప్పుడు, రెండు పావురాలు  ఎగిరిపోతాయి. ఇదొక మెటఫర్. దేనికి మెటఫర్?  వాళ్ళిద్దరి ప్రేమకి.  అవి ప్రేమ పావురాలు. అవెందుకు ఎగిరిపోయాయి? వీళ్ళిద్దరే జరుగుతున్న కథ. మిగతావన్నీ జరగబోయే కథలన్న మాట. కాలం లో ఇలాగే  జరుగుతూంటాయి. మన చుట్టూ అనేకం జరుగుతూంటాయి. వాటిలో కొన్ని మనకి తెలియకుండానే వర్తిస్తూంటాయి.  

          వీళ్ళు  అలా కింద పడిపోయి ఫిజికల్ కనెక్షన్ ఏర్పడ్డమూ, అదే క్షణంలో పావురా లెగిరి పోవడమంటే, ప్రేమలో వీళ్ళు పడ్డా, ఆ ప్రేమ చెదిరి పోయేదే అని కవి హృదయమన్న మాట. రెండు పావురాలు ఎడం వైపు ఎగిరిపోయాక, అదే లాంగ్ షాట్ లో,  ఒక పావురమే దూరంగా ఫ్రేములోకి వచ్చి, కుడి వైపు మాయమవుతుంది. బహుశా ఆ పావురం జూన్ హై సింబాలిజం. ఎందుకంటే, ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ కథ జూహీది. ఆమె జీవితంలోంచే ఎగిరిపోవాలి ఏదైనా, ఆమె ఎగిరిపోదు కథా నియమాల ప్రకారం. 

          ఇలా కాలమే ఒకవైపు వీళ్ళని కలుపుతూ, ఇంకో వైపు విడదీసే బీజాలు నాటేస్తోందప్పుడే. మీరు విడిపోతారని హెచ్చరిస్తోంది. కాలమింతే, ఎవ్వరికీ అర్ధంగాదు. అలా ఇద్దర్నీ లేపాక, ఇప్పుడేం చేయాలి?  దేంతో కనెక్ట్ చేయాలి? మొత్తం సీను హార్రర్ యాంగిల్ లో ఓపెనై, రోమాంటిక్స్ కెళ్ళి, దాని జాతకం కూడా చెప్పేశాక, ఇప్పుడేమిటి?

          హార్రర్ మీది కెళ్ళాలి. అదింకా బ్యాలెన్సుంది కాబట్టి. ఇలా కాక ముందుగానే  హార్రర్ అంతా చూపించి ముగించేసి, అందులోంచి రోమాంటిక్ ఫీలింగ్స్ తీసి ముగిస్తే ఎలా వుంటుంది? డైనమిక్స్ లేక ఫ్లాట్ గా వుంటుంది. ఒక బంచ్ లో హార్రర్, ఇంకో బంచ్ లో రోమాంటిక్స్ చూపిస్తే,  రెండు ముక్కలుగా వుంటుంది సీను. డైనమిక్స్ వుండవు. ఇలాకాక కొంచెం హార్రర్, కొంచెం రోమాంటిక్స్, మళ్ళీ కొంచెం హార్రర్...ఇలా చూపిస్తూ పోతే, ఆ డైనమిక్స్ మెట్ల వరసతో  భిన్న అనుభూతుల రసపోషణకి లోనవుతారు  ప్రేక్షకులు. సీను రెండు విడి విడి ముక్కలైపోయి వెలితిగా వుండదు. 

          రోమాంటిక్స్ ని  కొలిక్కి తెచ్చాక, అలా ఆమెని లేపి పట్టుకున్నప్పుడే వెనక వారగా, ఎవరో  పోతున్నట్టు అన్పించి వెనక్కి తిరిగి చూస్తారు. అంటే సీన్ల ట్రాన్సి షన్స్ ఎలా వుంటున్నాయంటే, నడుస్తున్న సీను చివర్నించే తర్వాతి సీను విశేషం ఫ్లో అవుతోంది. అంతేగానీ, ఈ సీను కట్ చేసి, ఆ సీను విడిగా ఎత్తుకునే బ్యాడ్ షాట్ కంపోజిషన్ కాదు. 

          ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఏమిటంటే, ఎవరా అని ఆ గదిని సమీపిస్తారిద్దరూ. ఈ సమీపించడంలో భయం వుండదు. భయపడితే ఈ బంగ్లాకే రారు. కుతూహలంతో దెయ్యాన్ని చూడాలనే వచ్చారు. కాబట్టి భయపడరు. చూశాక భయపడొచ్చు. ఇది సరైన డైనమిక్స్. భయంతోనే వచ్చి, చూశాకానూ భయపడితే -  రెండూ భయాలే కాబట్టి ద్వంద్వాల పోషణ జరగదు, డైనమిక్స్ ఏర్పడవు. కుతూహలం, దాని పర్యవసానంగా  భయం – అనే  భిన్న భావోద్వేగాలు - వీటితోనే ఇలా ద్వంద్వాలూ  డైనమిక్సూ. 

          ఇప్పుడు వీళ్ళు  కుతూహలంతో ఆ గదిని సమీపిస్తున్నప్పుడు తీసిన షాట్ ని గమనించాలి. రైట్ నుంచి ఫ్రేములోకి వంగి నడుస్తూ ఎంటరవుతాడు జూన్ హా. అతడి వెనకాలే అదే ఏటవాలుగా  అతడి వీపు మీద వాలిపోతున్నట్టూ ఎంటరవుతుంది జూహీ.

          ఎందుకిలా తీశాడు?  ఈ మొత్తం సీన్లో ఐదు మెటఫర్ లున్నాయని చెప్పుకున్నాం ముందే. భూత్ బంగ్లాతో బాటు, ఒక పిచ్చోడు, రెండు పావురాలు, మరో  వీళ్ళు తెలుసుకోక జరిగిపోయిన ఒక సంఘటనా, ఇంకో బాడీ లాంగ్వేజ్. 

          భూత్ బంగ్లా, పావురాలూ అనే మెటఫర్స్ ని దేనికి వాడుకున్నాడో చూశాం. అలాగే వీళ్ళు తెలుసుకోక జరిగిపోయిన ఒక సంఘటనగా కిందపడిపోవడాన్నీ- దాన్నుంచీ  ఫిజికల్ కనెక్షన్ నీ చూశాం. ఇక పిచ్చోడు మిగిలాడు,  బాడీ లాంగ్వేజీ మిగిలింది. ఈ బాడీ లాంగ్వేజీ అనే మెటఫర్ నే ఇప్పుడు చూస్తున్నాం. 

          అతను  వంగి నడవడం, అతడి వీపు మీద వాలిపోతున్నట్టూ ఆమె వెళ్ళడం – అనే ఈ బాడీ లాంగ్వేజ్ తర్వాతి సీన్లో నిజమవుతుంది. కొన్ని తెలియకుండా మన చేతిలో జరిగిపోతాయి. తర్వాతెప్పుడో అవే ఇంకేదో రూపంలో మన అనుభవంలోకి వస్తాయి. ఈ బాడీ లాంగ్వేజ్ ఇలాటి అర్ధమేమిటో కూడా వచ్చే సీన్లో చూద్దాం. 

          ఇలా కుతూహలంతో ఆ పాడుబడ్డ గది తలుపు నెట్టి లోపలికి చూసి, గావుకేక లేస్తూ పరిగెడతాడు జూన్ హా. ఇది చూసి ఆమెకూడా భయపడి పరుగెత్తదు. ఆమె కుతూహలం కొద్దీ వచ్చిందనే మర్చిపోకూడదు. ఏంటా అని అలా  పారిపోతున్నజూన్ హా వైపే అర్ధంగానట్టు చూసి, కుతూహలంగా తనుకూడా ఆ గది దగ్గరికే వెళ్తుంది. వెంటనే డోర్  గట్టిగా  మూసుకోవడంతో  ఠక్కున ఆగిపోతుంది. డోర్ తీసుకుని పిచ్చోడు రావడంతో ఆర్తనాదాలు చేస్తూ పారిపోతుంది. 

          ఈ ఆర్తనాదాలకి  తను ఆమెని వదిలేసి వచ్చాడని గుర్తొచ్చి, వెనక్కి పరిగెడతాడతను. ఇద్దరూ కలుసుకుని భయంలో కేకలు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు, కేకలు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు...ఈ నవ్వుకోవడాలు భయం పోగొట్టుకోవడానికి కావొచ్చు, లేదా ఇంతా చేసి పిచ్చోణ్ణి చూసినందుకూ కావొచ్చు. 

          వీళ్ళిలా చేస్తూంటే, వెనుకనుంచి పిచ్చోడొస్తాడు. వీళ్ళని తోసుకుంటూ మధ్యలోంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పిచ్చోడి గెటప్ పూర్తిగా చూస్తే, తలకి కోటు చుట్టుకుని వుంటాడు. కుడి చేతిలో మందు బాటిల్ వుంటుంది. ఎడమ చంకలో చుట్టి పెట్టుకున్న కోటో ప్యాంటో  వుంటుంది. అందులోంచి గడ్డి పరకలు వేలాడుతూంటాయి...

          ఇతను దేనికి మెటఫర్ అంటే, రాబోయే సీనులో మీరిలాటి ఫలానా  పరిస్థితిలో వుంటారని కాలం విన్పిస్తున్న వాణికి మెటఫర్. ఏమిటా పరిస్థితి? వచ్చే సీన్లో చూద్దాం...

          ఈ మొత్తం సీను ఆగిఆగి నడుస్తూంటుంది. ఆగడం ఆయా సిట్యుయేషన్స్ ని మనం అనుభవించేందుకే. ఆగడం, అంటే స్లో అవడం, ఆ మూడ్ లోకి మనం వెళ్లేందుకే. ఇది చూసి మూవీ స్లోగా వుందని అనుకుంటే కాదు. స్పీడు మెదడుని ఆకర్షిస్తుంది, స్లో మనస్సుని ఆకట్టుకుంటుంది. చాలావరకూ మెదడుని ఆకర్షించే స్పీడు చిత్రీకరణలు రావడంతో, స్లో బోరు కొట్టవచ్చు. కానీ మెదడుతోనూ మనసుతోనూ సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఆయా సన్నివేశాలు డిమాండ్ చేసే దాన్ని బట్టి స్లో స్పీడూ రెండూ సమపాళ్ళల్లో వుండాల్సిందే - ప్రత్యేకించి రోమాంటిక్ డ్రామాల్లో. విషమున్నప్పుడు ఆ స్లో బలాన్నిస్తుంది. విషయం లేకపోతేనే స్లో సీన్లు నీరసంగా వుండి బోరుకొడతాయి.

          మెటఫర్స్ వాడకం ప్రేక్షకుల సబ్ కాన్షస్ మైండ్ కి గాలం వేయడానికి. తద్వారా  వాటి నాటకీయతనీ, కళాత్మకతనీ అనుభవించడానికి. మన కాన్షస్ మైండ్ కివి ఎక్కకపోయినా, సబ్ కాన్షస్ మైండ్ కి అన్నీ ఎక్కుతూంటాయి...దానికి ఏదేమిటో అన్నీ తెలుస్తూనే వుంటాయి....

సికిందర్

Wednesday, May 16, 2018

648 : స్క్రీన్ ప్లే సంగతులు!

      సీన్ :   టీసూ ఇచ్చిన ఫోటోలో అమ్మాయి కేసే జూన్ హా చూస్తున్నప్పుడు, అతడి జ్ఞాపకాలతో ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. పల్లెటూళ్ళో వాగులో ఇద్దరు ఫ్రెండ్స్ తో వలేసి షికారు చేస్తూంటాడు జూన్ హా. అల్లరల్లరి చేస్తూంటారు. ఇంతలో ఇటు గట్టు మీద ఎడ్ల బండి వస్తూంటుంది. ఆ బండి మీద ఒకమ్మాయి కూర్చుని ఇటే చూస్తూంటుంది. అల్లరాపి ఇటు కేసి చూస్తారు ఫ్రెండ్స్. ‘ఇటు చూడు బే, ఇటు చూడు!’ అని జూన్ హా కి చూపిస్తారు. 

          
బండి మీద పోతున్న అమ్మాయినే చూస్తాడు జూన్ హా. ఆమె సువాంగ్ నుంచి వచ్చిందనీ, ఇక్కడామె తాత వున్నాడనీ అంటారు ఫ్రెండ్స్. ‘నువ్వు కూడా సువాంగ్ నుంచే వచ్చావ్ కదూ?’ అంటారు. తలూపుతాడు. వాళ్ళ నాన్న పొలీటీషియన్ అని అంటారు ఫ్రెండ్స్. జూన్ హా ఆమెనే  చూస్తూ చెయ్యూపుతాడు. బదులుగా ఆమే చెయ్యూపుతుంది. ఫ్రెండ్స్ పరమానందభరితులైపోయి, చెయ్యూపిందిర్రోయ్, మనం కూడా వూపుదామని అల్లరల్లరిగా చెయ్యూపుతారు. బండి అలా సాగిపోతూంటే, కేరింతలతో గంతులేస్తారు.

పాయింట్ :   
      ఈ సీను మన చెదలంటిన తెలుగాలోచనకి ఎలావుంటుందో చెప్పుకుంటే అన్యాయంగా  వుంటుంది. పోకిరీ, వెకిలి వేషాలెయ్యాలిగా అమ్మాయిని చూడగానే కామెడీ పేరుతో? కానీ ఇక్కడ పల్లెటూరోళ్ళ అమాయకత్వాలే, ఆనందాలే కన్పిస్తాయి. ఈ సీనుని కేవలం హీరోయిన్ ని ప్రత్యక్షంగా పరిచయం చేయడానికే  వేశాడు దర్శకుడు. ఇందులో భాగంగా ఆమె సువాంగ్ నుంచి ఇక్కడ తాతగారి  దగ్గరికి వచ్చిందని చెప్పించాడు. అంటే తాతగారు ఎప్పుడో సీన్లోకి వస్తాడన్న మాట. 

          ఈ హీరోయిన్ ప్రధాన కథలో హీరోయిన్ పాత్ర పోషిస్తున్న నటియే. ప్రధాన కథలో కూతురుగానూ, ఈ ఫ్లాష్ బ్యాకులో  టీనేజిలో వున్నప్పటి తన తల్లిగానూ  తానే నటిస్తోంది. కాకపోతే రెండు జడల అమ్మాయిగా కన్పిస్తోంది. 

         ఈ సీన్లో ఒక థీమ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు ప్రేమ కథకి. జల దృశ్యాల్ని చూపిస్తున్నాడు.  ఇక్కడ వాగులో అల్లరి, తర్వాతి సీన్లో నదిలో ఆమెతో ప్రయాణం, ఆ తర్వాత వర్షంలో ప్రణయంగా ఈ వాటర్ థీమ్ సాగుతుంది. ఈ వాటర్ థీమే ప్రధాన కథలో కూతురికి అనుభవమై ఆమె ప్రేమ సుఖాంతమవుతుంది. ఇవి కథనాల్ని ఉత్తేజపర్చే డైనమిక్స్.

సీన్ : 
     అడవిలో రెండు పశువులుం
టాయి. పశువుల పేడని కెలుకుతూంటాడు జూన్ హా. అటు పశువుల దగ్గర ఫ్రెండ్స్ ఒకడు నిలబడి, ఒకడు కూర్చునీ వుంటారు పేడ ఎప్పుడేస్తాయా అని కాచుకుని. ఇంతలో ఇటు జూన్ హా అరుస్తాడు పేడ పురుగుని పట్టుకుని చూపిస్తూ. ఫ్రెండ్స్ కి ఆ పేడ పురుగుని చూపిస్తూంటే, వెనుక గట్టు మీద ఫ్రెండ్ తో నిలబడి ఇటే చూస్తున్న హీరోయిన్ రివీలవుతుంది. 

          ఆమెని చూసి ఇటు తిరుగుతారు. అది పేడ పురుగని హీరోయిన్ కి చెప్తుంది ఫ్రెండ్. ‘పేడ పురుగా... నేనెప్పుడూ చూడలేదే...’  అంటుంది హీరోయిన్. ‘నీక్కావాలా?’ అంటాడు జూన్ హా. తీసుకోవడానికి ఆమె గట్టు దిగుతుతూంటే, అతను ఎక్కుతూంటాడు. ఇద్దరూ దగ్గ రవుతారు. ఆమెకి పురుగుని ఇవ్వబోతాడు. పేడని చూసి తీసుకోదు. చిరునవ్వుతో చూసి ఒకటి అడుగుతుంది – ‘నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అని.
           

       తికమకగా చూసి ‘ఎందుకూ?’ అంటాడు. ‘నన్నక్కడికి తీసికెళ్తావా?’ అంటుంది. అతనేమీ అనలేకపోతూంటే, ‘నీకు పడవ నడపడం వచ్చా?’ అంటుంది. వచ్చంటాడు. అయితే రేపు పన్నెండింటికి కలుద్దామనేసి వెళ్లి పోతూంటుంది. ఇంకా అయోమయంలోనే వుంటాడు జూన్ హా.  తేరుకుని  చిన్నగా నవ్వుకుంటాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ‘ఏమన్నావ్ రా ఆమెతో?’ అంటారు. ‘ఆమే ఏదో అంది’ అంటాడు. ‘మీ సిటీ బాయ్సే డిఫరెంట్రా!’అని అతడి మొహానికి పేడ పూసేస్తారు. వాళ్ళ మొహలకీ పేడ పూసేస్తూ, తనకి పడవ నేర్పమంటాడు జూన్ హా. 

పాయింట్ :  
      స్ట్రక్చర్ పరంగా ఫ్లాష్ బ్యాక్ గత రెండు సీన్లతో హీరోయిన్, ఇద్దరు హీరోల పాత్రల పరిచయాలూ ఐపోయాయి. ఇది ముక్కోణ ప్రేమ కథ అని తెలియడానికి కథకి అలాటి బ్యాక్ డ్రాప్ కూడా ఏర్పాటై పోయింది. ఇక ఈ బిగినింగ్ విభాగాన్ని ప్లాట్ పాయింట్ వన్ కి డ్రైవ్ చేయడం మిగిలింది. డ్రైవ్ చేయాలంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడబోయే సమస్య కి దారి తీసే పరిస్థితుల కల్పన  చేసుకు రావాలి. ఈ సీన్లో ఇదే జరుగుతోంది. 

          ఈ సీనుని హీరోయిన్ డ్రైవ్ చేసింది. డ్రైవ్ చేయడానికే వచ్చింది. తెలుగాలోచన ప్రకారం ఏదో ఆమె అక్కడికి రావాలి కాబట్టి రొటీన్ గా, రోతగా రాలేదు. కొరియన్ ఆలోచన ప్రకారం ఆమె నిన్ననే నిర్ణయించుకుంది జూన్ హా ని వెతుక్కుంటూ రావాలని. నిన్న – అంటే వెనుక సీన్లో – బండి మీద వస్తూ హీరోని చూశాక,  ఆమెకి ఆలోచన మెరిసి వుండాలి. అంటే నది అవతల భూత్ బంగ్లా చూసి రావాలన్న కోర్కె ఆమెకి ఆల్రెడీ వుండి వుంటుంది. తీసికెళ్ళే మొనగాడి కోసం చూస్తూండాలి. నిన్న జూన్ హా కన్పించగానే ఇతన్నే అడగాలని వెతుక్కుంటూ వచ్చి ఈ సీన్లోకి ఎంటరై వుంటుంది... ఈ నేపధ్యమంతా, ‘నీకు నది అవతల భూత్ బంగ్లా తెల్సా?’ అని నేరుగా ఆమె అడిగెయ్యడంలోనే మనకి అర్ధమై పోతోంది. 

          సీన్స్ లో ఎంటరైన పాత్రలు వాటి గోల్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాయి. దీంతో ఆ గోల్స్ ప్రకారం సీన్లు చకచకా ఆసక్తికరంగా ముందు కెళ్తున్నాయి. జూన్ హా చేత టీసూ ఉత్తరం రాయించాలని  గోల్ పెట్టుకుని రావడం కూడా ఇలాంటిదే -  హీరోయినూ భూత్  బంగ్లా గోల్ పెట్టుకుని వచ్చినట్టు. దీనివల్ల సీన్స్ ఒక పాయింటుతో షార్ప్ గా, క్రిస్ప్ గా వుంటున్నాయి. 

          ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రధాన పాత్ర హీరోయినే. కథ ఈమెదే. ఎలాగంటే, ఇప్పటికి మనకి అర్ధమైన ప్రకారం ఈమెకి సెకెండ్ హీరోతో పెళ్లి నిశ్చయమైన నేపధ్యంలో, హీరోతో కలిసి సీన్ డ్రైవ్ చేస్తోంది. అంటే సమస్యలో పడబోతోంది. సమస్యలో పడేదే ప్రధాన పాత్ర. ఆ సమస్య జూన్ హాతో ప్రేమే కావచ్చు. 

          కథలోకి వెళ్ళడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సీన్లు ఎత్తుకోవడమంటేనే నేరుగా కథ కేసి  దూసుకెళ్ళడమనే ఈ లైనార్డర్ ని ఒకటికి నాల్గు సార్లు పరిశీలించుకోవాలి. ఈ సీను ముగింపులో తీసిన షాట్లు టెక్నికల్ గా పాత్రల కదలికలతో ఒక బ్యూటిఫుల్ కోరియోగ్రఫీ. హీరోయిన్ రేపు పన్నెండింటికి కలుద్దామని వెళ్ళిపోవడం టాపిక్కి ముగింపు. హీరోయిన్ ఈ  షాట్ లోంచి ఔటవుతున్నప్పుడు,  బ్యాక్ గ్రౌండ్ లో ఎవరో వెళ్తున్నట్టు బ్లర్ అయి డిస్టర్బింగ్ గా అన్పిస్తుంది మనకి. అది  రైట్ నుంచి లెఫ్ట్ కి క్రాస్ చేస్తున్న హీరోయిన్ ఫ్రెండ్ గా రివీల్ అవుతుంది. హీరో దగ్గర్నుంచి హీరోయిన్ కదిలినప్పుడు, ఆమె కూడా అటు కదిలిందన్నమాట. అలా ఈ షాట్ లోనే ఇద్దర్నీ కలుపుతూ వెళ్ళిపోతున్నట్టు ఫ్లో చేశాడన్న మాట. కదలికల్ని ఏముక్కకా ముక్కగా షాట్లు తీసి ఎడిటింగ్ లో కలపకుండా. అది అతుకుల బొంతవుతుందే తప్ప సీన్ల, షాట్ల అల్లిక అవదు. ఎడిటింగ్ కూడా షూటింగ్ స్క్రిప్టు లోనే జరిగిపోతుందన్న మాట ఇలా. 

       తర్వాత, షాట్ల క్రమంతో సన్నివేశం ఇలా కొరియోగ్రఫీని తలపిస్తుంది...ఫ్రెండ్ తో చేయీ చేయీ పట్టుకుని సన్నిహితంగా హీరోయిన్ వెళ్ళిపోతున్న షాట్. 

          ఇటు చూస్తే, నిలబడి వున్న జూన్ హా  వెనుక వారగా ఫ్రెండ్స్ ఇద్దరూ వచ్చి సన్నిహితంగా నిలబడ్డం. మ్యాచింగ్ షాట్. 

          అటు చూస్తే, క్లోజ్ గా వెళ్తున్న హీరోయిన్నీ ఫ్రెండ్ నీ విడదీస్తూ ఎడ్ల బండి వాడు బండిని వాళ్ళ మధ్యకి నడపడం. 

          ఇటు చూస్తే, ఈ  ముగ్గురూ పేడ పూసుకుని అల్లరి చేసుకుంటూ విడిపోవడం. మ్యాచింగ్ షాట్.

          అటు చూస్తే, బండి మీదికి హీరోయిన్, ఆమె ఫ్రెండ్ ఎగిరి కూర్చుని ముగ్గురూ ఒకటవడం. ప్రారంభంలో ఫ్రెండ్ తో చేయీ చేయీ పట్టుకుని సన్నిహితంగా హీరోయిన్ వెళ్ళిపోతున్న షాట్ తో, వాళ్ళు విడిపోయి మళ్ళీ ఒకటైన మ్యాచింగ్ షాట్. 

          ఇటు చూస్తే, హీరో అతడి ఫ్రెండ్స్  ముగ్గురూ.
          అటు చూస్తే, హీరోయిన్, ఆమె ఫ్రెండ్, బండి వాడూ ముగ్గురూ.
          మ్యాచింగ్ షాట్స్.
          వాళ్ళు ముగ్గురూ బండి మీద వెళ్లిపోతూంటే,
          ఈ ముగ్గురూ అల్లరల్లరిగా అడవిలోకి పరుగెత్తడం.
          మ్యాచింగ్ షాట్స్.
          ఒక లయగా విజువల్ కథనమంటే ఇది కదా?

సికిందర్
          (నోట్ : నిన్న ఒక ఫోన్ కాల్ లో ఒకరికి ఒక సందేహం : ఇలా స్క్రిప్టు రాసుకుని హీరోలకి విన్పిస్తే వాళ్ళకే మర్ధవుతుందనీ. దీనికి సమాధానం : అసలు ముందు ఇలా రాసుకోవడానికి ప్రయత్నించగలరా?)