ముంబాయిలో మకాం వేసి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న, పాడుతున్న పాకిస్తాన్ కళాకారులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే మెడబట్టి గెంటేస్తామనీ గత శుక్రవారం అల్టిమేటం ఇచ్చిన మహారాష్ట్ర
నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్), మొన్న సోమవారం పాకిస్తాన్ కళాకారులు దేశం విడిచి
వెళ్లిపోయారని ప్రకటించింది. ఇంకెవరైనా ముంబాయిలో తలదాచుకుంటే వేటాడతామని కూడా
హెచ్చరించింది. మహారాష్ట్రలో బిజెపితో అధికారాన్ని పంచుకుంటున్న శివసేన తానులో
ముక్కే అయిన, వేరు కుంపటి పెట్టుకున్న రాజ్ థాకరే నాయకత్వం లోని పార్టీ ఎన్ఎంఎస్. దీని
సినీ కార్మికుల విభాగం చిత్రపట్ కర్మచారి సేన అధ్యక్షుడు అమే ఖోప్కర్ ఈ బహిష్కరణల
పర్వానికి తెర తీశారు. కారణం ఉరీ ఘటన. 19 మంది భారత సైనికుల్ని హతమార్చిన పాక్ ఉగ్రవాదుల
ఘాతుకం. అయితే ఇప్పుడు పాక్ కళాకారులు దేశం విడిచి వెళ్లి పోయారని ఎంఎన్ఎస్ నేతలు
ఇచ్చుకుంటున్న ప్రకటనలే తప్ప, ప్రభుత్వ
ధృవీకరణ లేవీ లేవు.
అసలు ఎన్ఎంఎస్ పార్టీ హెచ్చరిక జారీ చేసిన వెంటనే ముంబాయి పోలీసులు ఆ పార్టీకి నోటీసు లిచ్చారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇలాటి హెచ్చరికలు చేస్తే సహజంగానే చట్టం వూరుకోదు. పైగా భారత ప్రభుత్వం జారీ చేసిన వీసాలున్న విదేశీయులెవరూ భయపడనవసరం లేదనీ, కోరితే వాళ్ళకి రక్షణ కల్పిస్తామని కూడా ముంబాయి పోలీసులు ప్రకటించారు. కానీ పాక్ కళాకారులెవరూ పోలీసుల్ని ఆశ్రయించినట్టు లేదు- ఎన్ఎంఎస్ చెబుతున్న దాని ప్రకారం దేశం విడిచి వెళ్ళిపోయారు.
పాకిస్తాన్ నుంచి వచ్చి బాలీవుడ్ లో కొనసాగుతున్న పాక్ నటుల్లో, గాయకుల్లో ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, అలీ జాఫర్, అలీ అజ్మత్, ఆతిఫ్ అస్లం, షఫ్ఖత్ అమానత్ అలీ ఖాన్, రాహత్ ఫతే అలీ ఖాన్, సల్మాన్ అహ్మద్ మొదలైన వారు ప్రస్తుతం వున్నారు.
ఎన్ఎంఎస్ కాదుగానీ, ఆమధ్య ఏకంగా శివసేన పార్టీయే ప్రసిద్ధ పాకిస్తానీ ఘజల్ గాయకుడు గులాం అలీని ముంబాయిలో ప్రోగ్రాం పెట్టనీయకుండా అడ్డుకుంది. పాకిస్తాన్ నటులు, క్రికెటర్లు ఎవరైనా సరే మహారాష్ట్ర గడ్డ మీద అడుగు పెట్టనీయబోమని హెచ్చరించింది. ఈ రెండు పార్టీలూ మరాఠాల ఆత్మగౌరవ ఎజెండాతోనే అతివాదంతో అల్లరి చేస్తూంటాయి. ముంబాయిలో మహారాష్ట్రీయులకి ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని తమిళుల మీద, బీహారీల మీద, ఇతర ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ మీదా దాడులు చేసిన ఈ పార్టీలు టెర్రరిజం అనేసరికి పాక్ కళాకారుల మీద పడతాయి. 2008 లో తమ సొంత ముంబాయిలోనే జరిగిన అంతటి టెర్రర్ మారణహోమంలో కూడా ఈ పార్టీలు నోరెత్త లేదు, పత్తా లేవు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా మహా రాష్ట్ర సెంటి మెంట్లని రెచ్చగొడుతూ ఈ పార్టీలు అడపదపా వివాదాలు సృష్టిస్తూంటాయి.
ప్రస్తుత
వివాదంలో కేంద్రబిందువుగా వున్న ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ అనే పాక్ హీరో
హీరోయిన్లలో (వీళ్ళు పాక్ టీవీ సీరియల్స్ నుంచి ఏకంగా బాలీవుడ్ స్టార్స్ గా
ప్రమోటయిపోయారు) ఫవాద్ ఖాన్ ఆదివారమే రహస్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయాడని వార్త లొచ్చాయి.
మళ్ళీ ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా లేవట. ఫవాద్ ఖాన్ నటించిన ‘యే దిల్ హై ముష్కిల్’
(ఈ మనసు కష్టమైనది) దీపావళికి
విడుదలవుతోంది. ఇందులో తను అతిథి పాత్ర మాత్రమే పోషించాడు. హీరో హీరోయిన్లుగా
రణబీర్ కపూర్- ఐశ్వర్యా రాయ్ లు నటించారు. గతంలో ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘ఖూబ్
సూరత్’, ‘కపూర్ అండ్ సన్స్’ లతో మనదేశంలో పాపులారిటీ సంపాదించుకుని 2.5 కోట్ల
రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్టార్ గా ఎదిగాడు. బుల్లితెర హీరోగా జీ – జిందగీ ఛానెల్ ప్రసారం చేసిన అనేక
పాకిస్తానీ సీరియల్స్ ద్వారా మన దేశంలో ఇంటింటికీ తెలిశాడు. టీవీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు
ఎపిసోడ్ కి రెండు లక్షలు తీసుకునే వాడు.
ఇక
షారుఖ్ ఖాన్ నటిస్తున్న
‘రయీస్’ (సంపన్నుడు)లో మాహిరా
ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె కిదే తొలి బాలీవుడ్ అవకాశం. ఇది జనవరి 26న విడుదల
కాబోతోంది. పాకిస్తానీ సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు ఈమె ఎపిసోడ్ కి మూడు లక్షలు తీసుకునేది. ‘రయీస్’ కి ఎంతిస్తున్నారో వెల్లడి
కావడం లేదు. ఈ రెండు భారీ సినిమాల విడుదలలని అడ్డుకుంటామని కూడా హెచ్చరించింది ఎంఎన్ఎస్
పార్టీ. కానీ ఈ బెదిరింపుల్ని మాహిరా ఖాన్ సీరియస్ గా
తీసుకున్నట్టు లేదు. పాకిస్తాన్ నుంచి ఒక తుంటరి, ‘నువ్వింకా ఇండియా చేతి లాఠీ దెబ్బలు తిననట్టుంది’ అని ట్వీట్ చేస్తే, దీనికి మాహిరా- ‘మీ అమ్మ చేతిలో నీ వీపు పగిలి
వుంటే ఇలాటి వెధవ వాగుడు వాగవురా’ అని ఇలాటి విపత్కర పరిస్థితిలో కూడా కామెడీ
చేసింది. ఈమె ఇంకా స్వదేశం వెళ్ళిపోకుండా ముంబాయిలోనే దాక్కుందేమోనన్న
అనుమానాలున్నాయి. ఈమె ట్వీట్ కి ఎంఎన్ఎస్ రెస్పాన్స్ కూడా లేదు. వాళ్ళకీ వాళ్ళమ్మ
గుర్తొచ్చిందేమో.
ఫవాద్
నిర్మాత కరణ్ జోహార్ని ప్రశ్నిస్తూ- ‘సినిమాలో బుక్ చేసుకోవడానికి మీకు ఫవాద్ ఖాన్
ఒక్కడే కన్పించాడా? షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ లలాంటి గొప్ప నటులు కనిపించనే లేదా?’ అని
ఆగ్రహం వ్యక్తం చేశాడు సంగీత్ సోమ్! సమస్య షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ల అవకాశాల
గురించా, లేకపోతే ప్రాణాలు కోల్పోయిన సైనికుల గురించా? ఏ అంశాన్ని పట్టుకుని
నిలదీయాల్సి వుంటుంది? ఇలా ఒక స్పష్టత లేని, ఐక్యత లేని నేతల నోటి దూలతోనే అసలు
సమస్య.
ఉరీని పురస్కరించుకుని మన నాయకులూ, మేధావులు ఏకత్రాటి పై లేరు. ఇదే పాకిస్తాన్లో అయితే ఐఎస్సైలు, సైనికులు, టెర్రరిస్టులు, నాయకులు, మేధావులూ - ఇంత గుంపూ గీత గీసుకుని ఒకే గొంతుకతో ఇండియా మీద విరుచుకు పడతారు! ప్రతీరాత్రి మన ఛానెల్స్ లో ఉరీ మీద మన నేతల, మేధావుల ఐక్యత లేని కీచులాటల్ని పాకిస్తాన్ లో కూర్చుని అక్కడి ఐఎస్సై- సైనిక క్యాంపులు, టెర్రర్ శిబిరాలూ వినోదిస్తూనే వుంటాయి. వాళ్ళక్కావాల్సింది ఇదే - ఈ అనైక్యతే!
బాలీవుడ్ వర్సెస్ లాలీవుడ్
ఎంఎన్ఎస్ రాద్ధాంతం మీద బాలీవుడ్ కూడా డివైడ్ టాక్ తో వుంది. కళలకి
రాజకీయాల్ని దూరంగా వుంచాలని కొందరంటే, పాక్ కళాకారుల్ని తరిమి కొట్టాలని
మరికొందరు ఆగ్రహించారు. కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్ళే మన నెత్తి మీదికి పాక్ కళాకారులని తెచ్చి
పెడుతున్నారని, వీళ్ళే అసలు ద్రోహులనీ గాయకుడు అభిజిత్ తీవ్రంగా విరుచుకుపడితే,
మరో గాయకుడు కైలాస్ ఖేర్, పాక్ కళాకారులు
ద్వేషాన్ని వెదజల్లనంత వరకూ వాళ్ళని
బహిష్కరించాల్సిన అవసరం లేదని సమర్ధించారు. ఎంఎన్ ఎస్ ఇంకో అడుగు ముందుకేసి
తప్పుడు ఆరోపణ చేసింది. మన సినిమాల్ని పాకిస్తాన్ లో ఆడనియ్యరు గానీ, పాకిస్తాన్
వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారని ఆరోపిస్తే, నిర్మాత వాసూ భగ్నానీ దీన్ని
ఖండించారు. ‘భజరంగీ భాయిజాన్’ లాంటి మన
సినిమాలు పాకిస్తాన్లో విరగబడి ఆడుతున్నాయనీ, కాబట్టి బాలీవుడ్ కి పాక్ కళాకారులు వస్తే అభ్యంతరం ఎందుకనీ -
సమస్యంతా టెర్రరిజంతోనే అనీ సమాధాన మిచ్చారు.
అసలొక విధంగా చెప్పాలంటే, బాలీవుడ్ సినిమాలు లాలీవుడ్ ( పాకిస్తాన్ సినిమా పరిశ్రమ) ని కుదేలు చేశాయి. అయితే విచిత్రంగా బాలీవుడ్ సినిమాల మీద- అంటే బాలీవుడ్ సినిమాలు ప్రదర్శించే అక్కడి థియేటర్ల మీద టెర్రరిస్టులు దాడులు చేయడం లేదు. సైనిక, ప్రభుత్వ, ఇతర రాజకీయ, మేధావి వర్గాలు కూడా వీటి జోలికి పోవడం లేదు. ఎఫ్ ఎం రేడియోల్లో హిందీ పాటలు మార్మోగుతున్నా- మా సంస్కృతీ చట్టు బండలూ అని గొడవ చేయడం లేదు. వాళ్ళ సంస్కృతి ఇండియా మీద తుపాకులతో దాడులు చేయడమే కాబోలు (వాళ్ళ విదేశాంగ విధానం టెర్రరిజమే). అంతేగానీ ఇండియన్ సినిమాల్నీ పాటలనీ పట్టించుకుని, మన ఎంఎన్ఎస్ లాగా వాటిని నిషేధించేంత తీరికా, సాంస్కృతికాభిమానమూ వాళ్ళ బుర్రలకి లేదు. కేవలం అక్కడి నిర్మాతలే, పంపిణీదారులే బాలీవుడ్ సినిమాల ధాటికి లాలీవుడ్ నాశనమవు తోందని అరణ్య రోదన చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం లాలీవుడ్ చక్కగా అభివృద్ధి చెందుతోందని ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్లో ‘భజరంగీ భాయిజాన్’ తో పాటూ విడుదలై హిట్టయిన ‘బిన్ రోయే’ (దుఃఖపడకుండా) అనే మాహిరా ఖాన్ నటించిన రోమాంటిక్ డ్రామా ‘భజరంగీ భాయిజాన్’ తో పాటే ఇండియాలో 60 థియేటర్లలో విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. అంతే, మహారాష్ట్రలో ఎంఎన్ఎస్ పార్టీకి మంచి మేత దొరికినట్టయింది. దాన్ని నంజుకు తిని విడుదల కాకుండా ఆపేసింది. తర్వాత పశ్చిమ బెంగాల్లో విడుదల చేసి సొమ్ములు చేసుకున్నారు పంపిణీ దార్లు. ఇలా ఎన్ని పాక్ సినిమాలు ఇండియాలో విడుదల అవుతున్నాయి? పాకిస్తాన్లో బాలీవుడ్ సినిమాలు ఆడించుకుని ఎందరెందరు బాలీవుడ్ నిర్మాతలు లాభపడుతున్నారు? ఆ పాపపు పాక్ సొమ్ము తినొద్దని ఎందుకని ఎంఎన్ఎస్ అడ్డు పడ్డం లేదు? బాలీవుడ్ లో పాక్ కళాకారులు స్థానిక కళాకారుల పొట్టలే కొడుతూండ వచ్చు గాక, మన సినిమాలు వెళ్లి వాళ్ళ లాలీవుడ్ నే నాశనం చేస్తున్నాయిగా? అక్కడి కళాకారులూ కార్మికుల పొట్ట లేమైపోవాలి. ఎవరి పొట్ట ఏ రేంజిలో ఎవరు కొడుతున్నారు? ఇంత జరుగుతున్నా అక్కడి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడమే లేదుగా?
400 సినిమాలకి పైగా నటించిన అక్కడి నటుడు- దర్శకుడు గులాం మొహియుద్దీన్ భారీ బడ్జెట్లతో తీసే వందలాది బాలీవుడ్ సినిమాలతో తమ సినిమా పరిశ్రమ నాశన మయ్యిందని అవేదన వ్యక్తం చేశారు. అసలే అతి చిన్నమార్కెట్ గల తాము బాలీవుడ్ అంతటి భారీ బడ్జెట్లతో తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకో లేమనీ, ప్రేక్షకులు టెక్నికల్ గానూ ఉన్నతమైన బాలీవుడ్ సినిమాల వెంటే పడుతున్నారనీ విచారం వ్యక్తం చేశారు. పైగా ఒకప్పుడు పాకిస్తాన్ లో 650 థియేటర్లుంటే ఇప్పుడు 140 కి పడిపోయాయనీ, 1980 లలో వంద సినిమాలు తీసే వాళ్ళు కాస్తా ఇప్పుడు 20 కూడా తీయడం లేదనీ వాపోయారు.
ఆరేళ్ళ క్రితం పాకిస్తాన్ సాంస్కృతిక - టూరిజం శాఖ చైర్ పర్సన్ నిలోఫర్
భక్తియార్ గోవాలో ఒక చలన చిత్రోత్సవానికి హాజరైనప్పుడు- బాలీవుడ్ తో సంబంధాల్ని
పెంచుకుంటే లాలీవుడ్ చక్కబడుతుందనీ, ఇండియన్ సినిమాలు అత్యంత అభివృద్ధి చెందాయనీ, ఇండియన్
ఫిలిం మేకర్లు తమతో కలిసి పనిచేస్తే బావుంటుందనీ, తమ నటులకీ దర్శకులకీ బాలీవుడ్ లో
తగిన శిక్షణ నిప్పిస్తే ఇంకా బావుంటుందనీ అన్నప్పుడు- పాకిస్తాన్ సినిమా ఓనర్స్
సంఘం కార్యదర్శి ఖైసర్ ఖాన్ ఇంతెత్తున లేచారు. ఇలాటి ఒప్పందాలు చేసుకుంటే
పాకిస్తాన్ నుంచి టాలెంట్ అంతా బాలీవుడ్ కి తరలిపోతుందనీ, అక్కడి పారితోషికాలకి
వాళ్ళు అలవాటు పడితే తిరిగి ఇటువైపు చూడరనీ, ఇప్పటికే ఇక్కడ స్టూడియోలన్నీ
మూతబడ్డాయనీ విమర్శించారు.
ఇదీ
పాకిస్తాన్ పరిస్థితి. అక్కడెవరూ కోరుకుని పాక్ కళాకారుల్ని బాలీవుడ్ మీదికి తోసెయ్యడం
లేదు. పాక్ కళాకారులకి కూడా సిఫార్సులు చేయించుకుని బాలీవుడ్ ఛాన్సులు కొట్టేసే
అవకాశమే లేదు. బాలీవుడ్ నిర్మాతలే టాలెంట్ హంట్ చేసి వాళ్ళని పట్టుకొస్తున్నారు. 2003 లో ప్రసిద్ధ దర్శకుడు, నిర్మాత మహేష్ భట్ ఈ
లాలీవుడ్ కళాకారుల వలసకి తెరలేపారు. ఆ
సంవత్సరం ఆయన ఒక ఫిలిం ఫెస్టివల్లో
పాల్గొనడానికి కరాచీ వెళ్ళినప్పుడు- ఆతిఫ్ అస్లం అనే గాయకుణ్ణీ, మీరా అనే నాయకినీ
పట్టుకొచ్చేశారు. దాంతో మొదలయ్యింది ఇతర నిర్మాతలూ ఈ దారి పట్టడం. 2005 – 16 మధ్య
కళ్ళు తిరిగే సంఖ్యలో పాక్ కళాకారులు వచ్చి పడ్డారు. తాజాగా ‘హేపీ భాగ్ జాయేగీ’ లో
నటించిన మోమల్ షేక్ సహా మావరా లోకెన్, లైలాఖాన్, సారా లారెన్, హుమైమా మాలిక్,
సోనియా జహాన్, మీషా షఫీ, మోమ్మల్ దోబారా, హుమాయున్ సయీద్, సనా నవాజ్, ఇమ్రాన్
అబ్బాస్, ఆదీల్ చౌదరి, మీకల్ జుల్ఫీకర్, షెహరోజ్ సబ్జ్వారీ, అలీ ఖాన్, రషీద్ నాజ్,
జావేద్ షేక్, సల్మాన్ షాహిద్, వీణా మాలిక్ ...అలీజాఫర్, ఫవాద్ ఖాన్, మాహిరా
ఖాన్...ఇంకో ఆరుగురు గాయకులూ!
ఇలా ఇంతమంది వచ్చి పడుతున్నందుకు మొదటినుంచీ శివ సేన, ఎంఎన్ఎస్ పార్టీలు చేస్తున్న ఆందోళన సబబైనదే. కానీ ఈ సమస్యని ఇప్పుడు ముందుకు లాగడం సందర్భం కాదు. అలాగే మరాఠా ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్న ఈ పార్టీలు కేవలం మరాఠీలకే బాలీవుడ్ అవకాశాలివ్వాలనీ కోరడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళ కిస్తే ఈ పార్టీలకి అభ్యంతరం ఏమీ వుండదు. ఈ కోవలో చూస్తే, బాలీవుడ్ నిర్మాతల పాక్ పైత్యాన్ని ఖండించాల్సిందే.
గత పదేళ్లుగా ఈ ట్రెండ్ అప్రతిహతంగా సాగుతూన్నా
నిజానికి ఇంకా పూర్వమే పాక్ కళాకారులకి
అవకాశాలిచ్చిన సందర్భాలున్నాయి. అది 80 లలో. అప్పట్లో బీఆర్ చోప్రా తీసిన సూపర్
హిట్ ‘నిఖా’లో పాక్ నటి- గాయని సల్మా ఆఘా నటించి, సూపర్ హిట్ పాటలు పాడుకుంది. బాలీవుడ్
కౌబాయ్ ఫిరోజ్ ఖాన్ తీసిన ‘ఖుర్బానీ’ అనే హిట్ లో ‘ఆప్ జైసా కోయీ మేరే జిందగీ మేఁ
ఆయే’ సోలో పాట దేశంలో ఎలా మార్మోగిందో తెలిసిందే. దాన్నిపాడి ప్రపంచవ్యాప్తంగా
పాపులరయ్యింది పాక్ పాప్ సింగర్ నాజియా హుస్సేనే.
సుభాష్ ఘాయ్ తీసిన మరో సూపర్ హిట్ ‘హీరో’ లో ‘లంబీ జుదాయీ’ (తీరని వియోగం) అనే బాగా
హిట్టయిన పాట పాడింది పాక్ జానపద గాయని రేష్మా. రణధీర్ కపూర్ తీసిన ‘హెన్నా’
(గోరింటాకు) లో పాక్ నటి జేబా భక్తియార్ హీరోయిన్ గా నటించింది. ఇలా
అతికొద్ది సినిమాలే 80 లలో పాక్ కళాకారులతో వచ్చాయి. 90 లో అనితా ఆయూబ్, సోమీ అలీ,
తలత్ హుస్సేన్, మొహిసిన్ అలీ, నదీం అనే హీరో హీరోయిన్లు వచ్చారు. 2005 నుంచే మహేష్
భట్ చలవతో చిలుకల్లా వచ్చి వాలడం మొదలెట్టారు. ఇది స్థానిక కళాకారులకి కచ్చితంగా
దెబ్బే.
కళకీ సరిహద్దులు
మన స్టార్లూ పాక్ సినిమా రంగాన్ని పావనం చేయకపోలేదు. నందితా
దాస్, కిరణ్ ఖేర్, నేహా ధూపియా, నసీరుద్దీన్ షా, ఓంపురి లాంటి ఆల్రెడీ బాలీవుడ్ లో
స్థిరపడ్డ వాళ్ళే కొందరు వెళ్లి నటించారు. సోనూ నిగమ్, అంకిత్ తివారీ, సుఖ్విందర్
సింగ్, శ్రేయా ఘోషల్, హర్స్ దీప్ కౌర్,
రేఖా భరద్వాజ్ లాంటి గాయనీ గాయకులూ పాక్ సినిమాల్లో పాడారు.
అలాగే ఓ రెండు సినిమాలు ఇండో- పాక్ భాగస్వామ్యంలో తీశారు. కరీనా కపూర్, సోనం కపూర్, అమృతా అరోరా, అర్జున్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా లాంటి మన స్టార్లు పాకిస్తాన్ వ్యాపార ప్రకటనల్లో కన్పిస్తున్నారు.
అతివాదులు ఆరోపిస్తున్నట్టు పాకిస్తాన్ నుంచి బాలీవుడ్ కి వన్ వే ట్రాఫిక్కే లేదు- బాలీవుడ్ నుంచి కూడా లాలీవుడ్ కి ట్రాఫిక్ వుంది. ఈ టూవే ట్రాఫిక్ లో బాగా లాభ పడుతోంది మాత్రం బాలీవుడ్డే. బాలీవుడ్ సినిమాలు, పాటలు లాలీవుడ్ ని నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. అక్కడి కళాకారులకి పనిలేకుండా చేసి వందల కోట్లు బాలీవుడ్ కి చేరుతున్నాయి. దీని ముందు పాక్ కళాకారులు బాలీవుడ్ లో దోచుకుంటున్నారని చేస్తున్న ఆరోపణలు నిలబడేవి కావు. పాక్ టీవీ నటుల్ని బాలీవుడ్ సినిమాల్లో నటింప జేసుకుని తిరిగి ఆ సినిమాల్ని పాక్ కే పంపిస్తే, తమ నటుల్ని చూసేందుకు కూడా సహజంగానే అక్కడి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. పాక్ కళాకారులకి బాలీవుడ్ లో అవకాశాలిస్తే, పాక్ లో కూడా వ్యాపారం చేసుకోవచ్చనే వ్యూహం కావచ్చు ఇది. పేరుకి టూవే ట్రాఫిక్కే గానీ, పెద్దన్నలా బాలీవుడ్ చేతిలో వున్నది పూర్తిగా వన్ వే ట్రాఫిక్కే. దీన్ని ఇండియాలో అందరూ గుర్తించి ఒకటే పరిష్కారం చెప్పాల్సి వుంటుంది : బాలీవుడ్ సినిమాలు పాక్ లో ఆడుతున్నట్టు, పాక్ సినిమాల్ని కూడా ఇండియాలో ఆడనివ్వాలి. చూసేవాళ్ళు చూస్తారు లేని వాళ్ళు లేదు. పాక్ కళాకారుల్ని బాలీవుడ్ సినిమాల్లో, బాలీవుడ్ కళాకారుల్ని పాక్ సినిమాల్లో అనుమతించ కూడదు. ఎవరి సినిమాలు వాళ్ళ కళాకారులతో వాళ్ళు తీసుకుంటూ ఇరుదేశాల్లో పోటీ పడినప్పుడే ఎలాటి ఫిర్యాదులకీ అవకాశం వుండదు. ఈ పోటీలో ఎవరి సామర్ధ్యమేమిటో వాళ్ళు తేల్చుకుంటారు.
ఐతే
ఇదంతా ఎప్పుడు? పాక్ తో మితృత్వం వున్నప్పుడు. తెల్లారి లేచింది ఏ సందులోంచి
ఇండియాలోకి జొరబడాలా, ఎక్కడ బాంబులు పేల్చలా అని ఆలోచించే దేశం పాక్ తో మిత్రుత్వం
ఎలా వుంటుంది? ఉరీ ఉదంత నేపధ్యంలో పాక్ కళాకారుల్ని వెనకేసుకొస్తున్న బాలీవుడ్ తో పాటు
రాజకీయ, మేధావి వర్గాలు- 1) కళకి సరిహద్దుల్లేవనీ, 2) కళకి రాజకీయాలతో సంబంధం కూడా
లేదనీ, 3) రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కొనసాగాలనీ, 4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరు అనీ వాదిస్తున్నారు.
వాళ్లకి హతులైన జవాన్ల రూపాలే మెదలడం
లేదు.
1) కచ్చితంగా కళ సరిహద్దుల్ని చూడదు. కానీ ఆ సరిహద్దుల్ని పదేపదే అకృత్యాలతో ధ్వంసం చేస్తూంటే తప్పకుండా కళ సరిహద్దుల్ని నిర్ణయించుకుంటుంది. కళాకారులు ఒక దేశానికి ప్రతినిధులై వుంటారు. ఎలాటి దేశానికి ప్రతినిధు లయ్యారనేది లెక్కలోకొస్తుంది. రేపు సిరియా ఐసిస్ గుడారంలోంచి ఓ తుగ్లక్ వస్తే- కళకి సరిహద్దుల్లేవని వాణ్ణి హీరోగా చేసేయరు కదా? పాకిస్తాన్లో నాలుగు అధికార కేంద్రాలున్నాయి. ఐఎస్సై, సైన్యం, టెర్రర్, ప్రభుత్వ అధికార కేంద్రాలు. చివరిది పేరుకే అధికార కేంద్రం, పెత్తనమంతా మిగతా మూడు కేంద్రాలదే. ఈ మూడిటి దుర్గంధమే టెర్ర్రరిజం. దీంతో వాళ్ళ దేశంలోనే కాక ఇరుగు పొరుగు దేశాల్లోనూ అకృత్యాలు చేస్తున్నారు. ఇలాటి దేశానికి చెందిన కళాకారులు ఎలాటి ప్రతినిధులై వుంటారు? తస్లీమా నస్రీన్ లా ఎదిరించి పారిపోయి వచ్చివుంటే కాపాడుకోవచ్చు- కానీ తమ కెరీరే తప్ప నోరే విప్పని పాక్ కళాకారులకి ఏ ప్రోటోకాల్ తో భాయ్ భాయ్ అంటూ సంఘీభావం ప్రకటిస్తారు? సరిహద్దు మర్యాదే పాటించని తమ వాళ్ళ అకృత్యాలకి కచ్చితంగా కళ కూడా సరిహద్దు గీత గీసేస్తుంది.
2) దేశాల మధ్య శత్రుత్వం తలెత్తినప్పుడు కళకి రాజకీయాలతో సంబంధం వుంటుంది. లేకపోతే దేశభక్తి అనే మాటకే అర్ధం లేదు. కళకి రాజకీయం లేకపోతే దేశభక్తి కూడా వుండదు. అలాటి కళని కోరుకోవాలా? దేశంకంటే కళ గొప్పది కాదు. ఒకటొకటే పాక్ కి అన్ని దారులూ మూసేస్తోంది కేంద్ర బ్రభుత్వం. బాలీవుడ్ కూడా దారులు మూసేయాలని ఆదేశిస్తే ఇది రాజకీయమని ధిక్కరిస్తుందా? మామూలు పరిస్థితుల్లో అడ్డొచ్చే రాజకీయాలే ఉద్రిక్త పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలతో కూడిన రాజకీయాలవుతాయి.
3)
రెండు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు అవసరమే. కానీ ఎప్పుడు? అవతలి
దేశానికో సంస్కృతి వున్నప్పుడు. అవతలి దేశపు సినిమా పరిశ్రమ ప్రపంచాని కేమిచ్చింది?
ఒక మొఘలే ఆజం, మదర్ ఇండియా లనిచ్చిందా? ఒక దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్
లనిచ్చిందా? ఒక సత్యజిత్ రే, సుభాష్ ఘాయ్ లనిచ్చిందా? ఒక లతా రఫీ ఆశా కిషోర్
లనిచ్చిందా? ఒక లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఏఆర్ రెహ్మాన్ లనిచ్చిందా? ఏమిచ్చింది?
మనది ఇచ్చి వాళ్ళది తెచ్చుకోవడానికి ఏమి దాచి పెట్టింది? పోనీ మనతో చేయీ చేయీ
కలిపినా ఏనాటికైనా కనీసం ఒక ‘హేపీ భాగ్
జాయేగీ’ అయినా ఇవ్వగలదా? సాంస్కృతిక మార్పిడికి అక్కడ ఒకే ఒక్కటి వుంది- అది
టెర్రరిజం.
4) పాక్ పాలకులు వేరు, ప్రజలు వేరూ కాదు. ఆ ప్రజలతోనే మనకి సమస్య వస్తోంది. టెర్రరిజానికి అందుతున్న కుర్రాళ్ళు ఎక్కడ్నించీ వస్తున్నారు? కసబ్ ఎక్కడ్నించి వచ్చాడు? పఠాన్ కోట్, ఉరీ ముష్కరులు ఎక్కడ్నుంచి వచ్చారు? ఆ ప్రజలు కని వదిలేస్తేనే కదా? పాక్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, మనం వెళ్తే చాలా ప్రేమతో చూస్తారు అనే మాటలు అర్ధం లేనివి. ఆ ప్రజలు బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. టెర్రరిజానికి ప్రధాన కారకులు వాళ్ళే. పిల్లల్ని సరీగ్గా పెంచితే టెర్రరిజం వైపు ఎందుకుపోతారు?
ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్ తదితర పాక్ సెలెబ్రిటీలు ఇక్కడ ఉరీ
కి వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పరంటే, సైనికుల
కుటుంబాలకి ఎందుకు సంతాపం ప్రకటించరంటే, వాళ్ళ దేశంలో అలా వుంది మరి. 2008 నుంచీ
నేటి వరకూ చూసుకుంటే, 13మంది పాక్ కళాకారుల్ని అక్కడి మతోన్మాదులు, ఉగ్రవాదులు
పొట్టన బెట్టుకున్నారు.
తాజాగా గత జూన్ లో ప్రసిద్ధ ఖవాలీ గాయకుడు అమ్జాద్ సాబ్రీని ప్రోగ్రాం ఇస్తూండగానే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఇక మోడల్ సంగమ్ రాణాని వురి తీసి చంపారు. టీవీ ఆర్టిస్టు మష్రత్ షాహీన్ ని షూట్ చేసి చంపారు. ఆర్టిస్టు సనా, డ్రమ్మర్ ఇబ్రహీంలని దారి కాచి చంపేశారు. గాయకురాలు గుల్నార్ ని కూడా కాల్చి చంపారు. మరో గాయకురాలు సీమా నాజ్ ని కూడా అలాగే చంపారు. ఇంకో సింగర్ ఘజలా జావేద్ ని ఆమె తండ్రితో పాటు షూట్ చేసి చంపారు. టీవీ నటి యాస్మీన్ గుల్, డాన్సర్ అఫ్సానా లని కూడా కాల్చి చంపారు. కమాల్ మెహసూద్ అనే సింగర్ కూడా తుపాకీ కాల్పులకి బలయ్యాడు. ఆయుమన్ ఉదాస్ అనే గాయకురాలు కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయింది. మరొక ప్రముఖ డాన్సర్ షాహీన్ తనని గొంతు కోసి చంపవద్దనీ, కాల్చి చంపమనీ ప్రార్ధించినా గొంతు కోసి చంపారు. ఆమె సంపాదించిన డబ్బునీ, నటించిన సీడీల్నీ ఆమె శవం మీద చెల్లా చెదురుగా పడేసి పోయారు. ఇంకో సంగీతకారుల బృందం మీద దాడి చేస్తే, వాళ్ళలో అన్వర్ గుల్ అనే హర్మోనిస్టు మరణించాడు. ఆఖరికి మోడల్, నటి ఫౌజియా అజీమ్ అలియాస్ ఖందీల్ బలూచ్ ని కూడా గత జులైలోనే హతమార్చారు.
ఇలా కళాకారుల్ని హతమారుస్తున్నప్పుడు, చేతగాక ప్రభుత్వం చూస్తున్నప్పుడూ ఎవరు ఈ ఉగ్ర మూకలకి వ్యతిరేకంగా మాట్లాడతారు? అసలిలా కళాకారుల్ని ఎందుకు చంపుతున్నారని చూస్తే, ప్రేమే సందేశంగా ప్రవర్తించే సూఫీ ఇస్లాం సంస్కృతిని ఈ కళలు ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి. వహాబీ ఇస్లాం దీన్ని గానీ, పాశ్చాత్యీకరణని గానీ ఒప్పుకోదు. ఇది కరుడుగట్టిన మతాన్ని రుద్దాలని చూస్తుంది. ప్రపంచంలో ముస్లింలందర్నీ వహాబీ సంస్కృతి కిందికి తేవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో బాగంగానే ఐసిస్ పుట్టుక. టెర్రర్రరిస్టులందరూ ఎప్పుడూ ఈ వాహాబిస్టులే. అరబ్ మూల కేంద్రంగా వీళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ పాక్ పెత్తందార్లు టెర్రరిస్టుల్ని పోషిస్తున్నారు. పాక్ ని వహాబీ దేశంగా మార్చెయ్యాలని పన్నాగాలు పన్నుతున్నారు. అందుకే సూఫీయిజానికి ప్రతీకలైన కళాకారుల మీద దాడులు. ఇండియాలో సూఫీ ఇస్లాం వుంది. కాశ్మీర్ లో కూడా మహెబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని పడగొట్టి వాహాబీస్టుల్ని అధికారంలోకి తేవాలన్న కుట్రలో భాగంగానే అక్కడ రెచ్చ గొడుతున్న అల్లర్లని బయటపడింది.
ఇప్పుడు ఫవాద్ గానీ, మాహిరా గానీ ఉరీ ఘతుకాన్ని ఖండిస్తే వాళ్ళకీ మూడుతుంది. ఇలాగని సానుభూతితో వాళ్ళని చూసీ చూడనట్టు కొనసాగనిద్దామని మనమనుకుంటే- వీళ్ళ ఘనకార్యాలు అడ్డు పడుతున్నాయి. వీళ్ళమీద జాలిపడి వదిలెయ్యడానికి వెళ్లేం తమ పనేదో తాము చేసుకునే అమాయక కళాకారులు కాదు. అన్నీ తెలిసిన ఇంటలెక్చువల్స్. పారిస్ లో ఉగ్ర దాడి జరిగినప్పుడు దాన్ని ఖండిస్తూ రెచ్చిపోయి ట్వీట్ చేశాడు ఫవాద్. అలీ జాఫర్ కూడా తన నిరసనని ట్వీట్ చేశాడు. మాహిరా కూడా, ‘నా గుండె రోదిస్తోంది, ఎలాటి ప్రపంచంలో మనం వున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. అలాటి ప్రపంచం పాకిస్తాన్ లోనే వుందని తెలీనట్టు! వీళ్ళెవరూ తమ దేశపు కళాకారులని హతమారుస్తోంటే ట్వీట్ చేయలేదు. మన దేశంలో పఠాన్ కోట్, పాంపోర్, ఉరీ ఘటనలప్పుడైతే మరీ మౌనం. మొన ఐక్యరాజ్య సమితిలో నవాజ్ షరీఫే ఉరీ ఘటనని ప్రస్తావించ లేకపోయాడు. చీటికీ మాటికీ పాకిస్తాన్లో ఆర్మీతో మంతనాలాడుతూ వాళ్ళు చెప్పిన ప్రసంగ పాఠమే చదివేశాడు - ఉరీ ఘటన అసలు జరగనట్టే! ప్రధానికే ఈ పరిస్థితి వుంటే నటులకెలాంటి పరిస్థితి వుంటుంది?
కనుక ఒకవైపు ఇలాటి పాక్ కళాకారులకి అవకాశాలిస్తూ, మన తరపున వాళ్ళు మాట్లాడ్డం లేదని కోపాలు ప్రదర్శించడమే శుద్ధ అవివేకం. అలాగని మెడబట్టి గెంటెయ్యడం, ఎక్కడున్నా వేటాడడం లాంటి అనాగరిక చర్యలకి పాల్పడితే మొట్ట మొదట సంతోషించేది పాక్ టెర్రర్- ఆర్మీ వర్గాలే. వాళ్ళు చేస్తున్న పని కూడా ఇదే- కాకపోతే హతమారుస్తున్నారు. వాళ్ళ పనులు మనం చేసిపెడితే అంతకంటే వాళ్లకి కావాల్సిందేముంది? శత్రు దేశపు వాళ్ళయినా సాటి కళాకారుల్ని మర్యాదగా చెప్పి సాగనంపాలి. వాళ్ళు లేకపోతే బాలీవుడ్ కేం నష్టం లేదు. నిజానికి వాళ్ళుంటేనే సినిమాలు చూడాలంటే నేటివిటీకి అడ్డు.
ఇప్పుడు ఈ నెలలోనే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న యశ్ రాజ్ ఫిలిమ్స్ తో బాటు శ్రీదేవి- ఇకపైన ఏం చేస్తారో చూడాలి. అలీ జాఫర్ తమ్ముడు దన్యాల్ జాఫర్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమా ప్రకటించింది యష్ రాజ్ సంస్థ. శ్రీదేవి తనే నిర్మాతగా నటిగా, పాకిస్తానీ సీరియల్స్ నటి సజల్ అలీని పెట్టుకుని ‘మామ్’ అనే సినిమా తీస్తున్నారు. ఒకవైపు కేంద్రప్రభుత్వం పాకిస్తాన్ కి ఎలా బుద్ధి చెప్పాలా అని ప్రతిరోజూ తర్జ నభర్జనలు పడుతోంటే, మరోవైపు బాలీవుడ్ పాకిస్తాన్ కళాకారులకి ఎలా అవకాశాలు కల్పించాలా అని మల్లగుల్లాలు పడుతోంది, శభాష్!
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in