రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 3, 2016

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ -11

జేమ్స్ బానెట్ ప్రకారం గొప్ప కథని సృష్టించాలంటే, ఆదిమధ్యంతాలు
(బిగినింగ్- మిడిల్-  ఎండ్) అన్నిటా దృష్టిలో పెట్టుకోవాల్సిన సృజనాత్మక ప్రక్రియ చాలా వుంటుంది.
metaphors  ( రూపకాలంకరాలు),
archetypes  (ఆది మూలాలు),  hidden truth (నిగూఢ సత్యం), golden paradigm  (ఉత్కృష్ట భూమిక) వంటి ఇంకెన్నో సంక్లిష్ట సంకీర్ణ  స్క్రిప్టింగ్ టూల్స్ జోలికి మనం వెళ్ళనవసరం లేదు. భవిష్యత్తులో కూడా  తెలుగులో గొప్ప కళాఖండాలు నిర్మించే ఉద్దేశంతో ఎవరూ
ఉండకపోవచ్చు. ప్రస్తుత స్ట్రగుల్ అంతా బాక్సాఫీసు దగ్గర ఎంతో కొంత వర్కౌట్ అయ్యే డబ్బులొచ్చే అర్ధవంతమైన  కమర్షియల్స్  కోసమే కాబట్టి, జేమ్స్ బానెట్ నుంచి కొంతే – ఓ ఇరవై శాతమే తీసుకుని అన్వయించుకుంటే సరిపోతుంది...

        సినిమాలకి రాసుకున్న కథల  మీద ఇతరుల చేతులు ఎన్ని పడ్డా పూర్తిగా చెడకుండా ఒక లాక్ లాంటిది వేసుకోవాలన్న ఫార్ములా అన్వేషణలో దొరికిందే జేమ్స్ బానెట్ వెలుగులోకి తెచ్చిన ప్రక్రియ. అంటే గొప్ప కథకి బానెట్ చెబుతున్న నిర్వచనాల్లోంచి కొంతే  తీసుకుని, తెలుగుసినిమాల పరిధులూ ప్రమాణాలతో  సరితూగే  ‘గొప్పకథ’ నే  టార్గెట్ చేసి పునాది వేసుకుంటే, దాని మీద ఎందరి చేతులు ఎలా పడ్డా,  ఆ ‘గొప్పకథ’ పునాదులు ఎంత వదులైనప్పటికీ,  నాణ్యత కనీసం ఓ మంచి కథ అన్పించుకునే స్థాయి దగ్గర   ఆగవచ్చన్న ఆశాభావంతోనే ఈ ఫార్ములా. 


          ఇలా కాకుండా, ఇప్పుడు జరుగుతున్నట్టుగా, సిడ్ ఫీల్డ్ భూమిక (paradigm ) తోనే  కేవలం ఓ మంచి కథకే పునాది వేసుకుంటే, ఆ మంచి కథ అనుకున్నది శిఖరాగ్ర సమావేశాల్లో ఇంకా దిగజారి నీచకథగా తయారయ్యే  ప్రమాదముంది. కనుక ముందే గొప్ప  కథకి పునాది వేస్తే ‘ఫిల్టరై’ మంచి కథగా మిగలొచ్చు, ఇలా కాక ముందే మంచి కథకి మాత్రమే పునాది వేసుకుంటే  ‘ఫిల్టరై’ మహా చెడ్డ కథ చేతికి రావచ్చు. అంటే జేమ్స్ బానెట్  మోడల్ తో కథ చేసుకుంటే,  సిడ్ ఫీల్డ్ మోడల్ దక్కవచ్చన్న మాట. ఇది మంచిదేగా- సిడ్ ఫీల్డ్  మోడల్లో చేసుకున్నవి కూడా మంట గలిసిపోతున్నప్పుడు. 

          కాబట్టి  కథంటే కథ మొత్తానికీ కాకుండా మిడిల్ ని మాత్రమే లాక్ చేసే  ఫార్ములాని బానెట్ నుంచి తీసుకుంటే, గత వ్యాసం లో పేర్కొన్నట్టు, కథంటే పఠితకి / ప్రేక్షకుడికి / శ్రోతకి  చేసే సైకో థెరఫీయే గనుక, ఆ సైకాలజీ లోంచే, ఆ మానసిక అవసరాలకోసమే,  కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్స్  ని  మధించి పుట్టేదే  కథ గనుక, ఈ సైకలాజికల్ కనెక్షన్ ని ఏర్పాటు చేయడమే లాకింగ్ సిస్టం ఫార్ములా అన్నమాట! 

          అంటే అప్పుడు స్క్రీన్ ప్లే రచనని పూర్తిగా కొత్త కోణంలో చూడాల్సి వుంటుందన్న మాట. ఇక్కడ్నించీ  ఈ రాస్తున్న లైన్లు జాగ్రత్తగా చదవుకోవాలి. ముందేర్పర్చుకున్న నమ్మకాలూ అభిప్రాయాలూ వుంటే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కన్పించే ప్రతీ లైనూ ఒకటికి పదిసార్లు చదవడమేగాక, ఈ లైన్లు చెప్పే కొత్త విషయాలు  నేర్చుకోవాలి. నేర్చుకున్నది అమల్లో పెట్టుకోవాలి. నిరూపితమైన శాస్త్రం ఎప్పుడూ మోసం చెయ్యదు.

          సమస్త కథలూ మన మానసిక ప్రపంచాలకి ప్రతిరూపాలే. కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల సయ్యాట (ఇంటర్ ప్లే) లే. సౌలభ్యం కోసం పదజాలాన్ని వాడుక భాషలోకి మార్చుకుంటే - కాన్ష మైండ్ అంటే మన వెలుపలి మనసు, సబ్ కాన్షస్ మైండ్ అంటే లోపలి మనసు. వెలుపలి మనసునే ‘మనసు’ అనీ, లోపలి మనసుని ‘అంతరాత్మ’ అనీ అనుకుంటే, మనం మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మంచివో కావో అంతరాత్మ చెబుతుంది. ఈ రెండిటి మధ్య మన ఇగో (అహం) నిర్ణేతగా వుంటుంది.         అదెప్పుడూ అంతరాత్మ విజ్ఞతతో చెప్పే మంచి మాట, శాశ్వత పరిష్కారం  లాంటివి వినదు. మనసు చెప్పే ఆకర్షణీయమైన మాటలే, తాత్కాలిక పరిష్కారాలే  ముచ్చటపడి వింటుంది. ఇదెప్పుడూ చుట్టూ అందంగా కన్పించే బాహ్యప్రపంచాన్నే అనుభవిస్తుంది. లోపల గంభీరంగా కన్పించే ప్రపంచమైన  అంతరాత్మలోకి ప్రయాణించడానికి ఇష్టపడదు. 

          పైపెచ్చు ఆ అంతరాత్మని నొక్కేసే ఎజెండాతోనే ఇగో నిత్యం ప్రవర్తిస్తుంది. ఇగో ఎప్పుడూ ‘మనసు’ తోనే జతకలిసి వుంటుంది. మనసుతోనే చెట్టపట్టాలేసుకుని బాహ్యప్రపంచంలోనే  షికార్లు కొడుతుంది. ఇగో అంటే మనమే. భౌతికంగా మన గుర్తింపు. భౌతికంగా మనం చేసుకునే అలంకరణ, మేకప్ ల ద్వారా నేను ఫలానా అని తెచ్చుకునే గుర్తింపు. అలాటి ‘మనం’  అంతరాత్మలోకి తొంగి చూడ్డానికి ఇష్ట పడం. ఎందుకంటే అక్కడ ఎన్నో నగ్నసత్యాలు, శాశ్వత విలువలూ వంటి మనిషి పుట్టినప్పటినుంచీ జీన్స్ లో నిబిడీకృతం చేసుకుని తిరుగుతున్న చేదు వాస్తవాలతో బాటు,  దేవుడి నియమావళి భయపెడుతూవుంటుంది.

          మనకు (ఇగోకి)  వున్న ఈ లక్షణాలు  పక్కాగా సినిమాల్లో హీరో కుండే లక్షణాలే. అంతరాత్మ తో మనం పడే సంఘర్షణ  సినిమాల్లో  మిడిల్ తో హీరో చేసే సంఘర్షణే. ఇది జాగ్రత్తగా గమనించాలి.  స్క్రీన్ ప్లేలో మిడిల్ అంటే మన అంతరాత్మకి ప్రతి (తెర) రూపమే. అంతరాత్మ సర్వాంతర్యామి. ఈ విశ్వమంతా వ్యాపించి వుంది. అందరిలోనూ వుండేది ఒకే అంతరాత్మ. ఒకే నగ్న సత్యాలు, ఒకే శాశ్వత విలువలు, ఒకే దేవుడి నియమావళి. 

          కానీ  మనం అంతరాత్మలో  ప్రయాణించి ఈ కఠిన విషయాలు తెలుసుకోవడానికి, చేదుగా వుండే  పచ్చి నిజాల్ని రుచి చూడడానికీ  వెనుకాడుతాం. సినిమాలు మన మెడబట్టి ఈ పనే చేయిస్తాయి. మనల్ని- అంటే మనలాంటి  హీరోని, మిడిల్ లోకి నెట్టి సంఘర్షణలో పడేస్తాయి. ఏ అంతరాత్మకి భయపడి దూరంగా వుంటున్నామో, ఆ అంతరాత్మ ( మిడిల్ ) లోకి నెట్టి-  అక్కడి నగ్నసత్యాల పట్ల, ఆ శాశ్వత విలువల పట్ల, ఆ దేవుడి నియమావళి పట్లా మన భయాలని పోగొట్టి ఒడ్డున పడెయ్యడమే కదిలే బొమ్మల రూపంలో సినిమాలు చేసే- చెయ్యాల్సిన పని. 

          బరి లోకి దిగి అమీతుమీ తేల్చుకుంటే తప్ప మన భయాలు పోవు. అంతరాత్మలో పొడసూపే భయ కారకాలతో  పోరాడి,  వాటి పట్ల భయాలు తొలగించుకుని,  విజేతలుగా అవతరించడమే జరిగేది. విజేతలుగా అవతరించడమే స్క్రీన్ ప్లేలో ఎండ్ విభాగం. అంటే అసంపూర్ణ వ్యక్తులుగా, పలాయన వాదం పఠిస్తూ, ప్రియమైన మనసుతో కలిసి షికార్లు కొట్టే మనం(ఇగో),  అంతరాత్మతో భయాలని పోగొట్టుకుని, పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడమే పరోక్షంగా  సినిమా చూపించే సినిమా!

          సింపుల్ గా చెప్పాలంటే మనలోని ఇగోని  మెచ్యూర్డ్ ఇగోగా మార్చే ప్రక్రియే సినిమా. ఏ కథైనా, ఏ పురాణమైనా, ఏ జానపదమైనా, ఇంకేదయినా చేసేది ఒక్కటే-  మనసూ అంతరాత్మల సయ్యాటలతో మనిషిని  మోక్ష మార్గాన నడిపించడం. రాముడి అరణ్య వాసంలో అరణ్యం అంతరాత్మే, అర్జునుడి కురుక్షేత్రంలో కురుక్షేత్రం అంతరాత్మే, ‘తెలివైన ఇంద్రజాలికుడు’ అనే జానపద కథలో ఇంద్ర జాలికుడు అంతరాత్మే.

          బానెట్  కొన్ని  సినిమాలని ఉదహరిస్తారు- ఈటీ, కాంటాక్ట్, అర్మగెడ్డాన్ సినిమాల్లో అంతరిక్షం అంతరాత్మ అయితే,  భూమి వెలుపలి మనసు. ఏలియెన్ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ అంతరాత్మ అయితే, జురాసిక్ పార్క్ లో కాంపౌండు, మిగతా పార్కూ అంతరాత్మ. టైటానిక్ లో టైటానిక్ నౌక వెలుపలి మనసు అయితే, అది మునిగిపోయిన తర్వాత సముద్ర గర్భం అంతరాత్మ, జాస్ లో లంక అనేది వెలుపలి మనసు అయితే,  దాని చుట్టూ సముద్రం అంతరాత్మ, సముద్రం లోంచి దాడి చేసే సొరచేప నగ్న సత్యాలకి ప్రతీక, ఈ సొరచేపతో తలపడే హీరో మన ఇగోనే! ఈ చిత్రణలు ప్రేక్షకులతో  సైకలాజికల్ గా కనెక్షన్ ని ఏర్పాటు చేసుకుంటాయి.


      తెలుగులోకి వస్తే,  ‘ఏలియెన్’ లో అంతరిక్ష నౌకలోని కంట్రోల్ రూమ్ ఎలాగో, ‘ఒక్కడు’ లో భూమికని దాచిన గది అలా అంతరాత్మకి ప్రతీక అయితే, భూమిక పాత్ర పరిష్కరించాల్సిన  ఆ అంతరాత్మ సంధిస్తున్న పజిల్. మిగతా ఇల్లూ, చార్మినార్ అంతస్తూ అంతా వెలుపలి మనసు. మహేష్ బాబు మన ఇగో. ‘శివ’ లో నాగార్జున పాత్ర మన ఇగో. అతడి కాలేజీ వాతావరణ మంతా వెలుపలి మనసు, అతను తలపడే చీకటి మాఫియా ప్రపంచం అంతరాత్మ, రఘువరన్ విలన్ పాత్ర అంతరాత్మలోంచి పొడసూపుతున్న ఒక చేదు వాస్తవం. 


  ‘ఊపిరి’లో కార్తీ పాత్ర మన ఇగో కాన్షస్, అతను  నాగార్జున బంగళాలోకి ప్రవేశించినప్పుడు నాగార్జున బంగాళా అంతరాత్మ, నాగార్జున పాత్ర ఆ అంతరాత్మ సంధిస్తున్న పరిష్కరించాల్సిన సమస్య.

          ‘క్షణం’ లో అడవి శేష్ పాత్ర మన ఇగో, మిస్సయిన పాప అంతరాత్మ; ‘సూర్య వర్సెస్ సూర్య’ లో నిఖిల్ పాత్ర మన ఇగో, అతను భయపడే సూర్య కాంతి- పగటి వెలుతురు అంతరాత్మ; ‘స్వామీరారా’ లో పాత్రలన్నీ మన ఇగోకి వివిధ రూపాలు, స్వామి విగ్రహం అంతరాత్మ; ‘కంచె’ లో వరుణ్ తేజ్ మన ఇగో, అతను పాల్గొనే రెండో ప్రపంచ యుద్ధం అంతరాత్మ, కాపాడాల్సిన పాప ప్రాణాలు అంతరాత్మ నొక్కి చెబుతున్న శాశ్వత విలువలకి ప్రతీక;


       ‘కుమారి-21ఎఫ్’ లో హీరోయిన్ పాత్ర అంతరాత్మ, హీరో పాత్ర మన ఇగో. ‘శ్రీమంతుడు’ లో మహేష్ బాబు దత్తత తీసుకునే గ్రామం అంతరాత్మ, అతడి పాత్ర మన ఇగో, నగరంలో అతను తిరుగాడే  వాతావరణం వెలుపలి మనసు. ‘అల్లూరి సీతారామరాజు’ లో  అడవి అంతా  అంతరాత్మ ప్రతిరూపం, అందులో బ్రిటిష్ ప్రభుత్వం ఆ అంతరాత్మ సంధించే  ప్రశ్న, అల్లూరి పాత్రలో హీరో కృష్ణ  ఆ ప్రశ్నతో తలపడే మన ఇగో.
  

     బానెట్ తన పుస్తకంలో – నిజజీవితంలో అంతరాత్మ సంధించిన ప్రశ్నతోనే పోలాండ్ లో ఒక  లెక్ వాలెసా అవతరించాడనీ, చెకస్లోవేకియాలో ఒక వాక్లావ్హావెల్ అవతరించాడనీ, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ ఉద్భవించాడనీ  రాశారు.


         నిజజీవితంలోనే దక్షిణాఫ్రికాలో మామూలు గాంధీని  జాత్యాహంకారంతో తెల్లవాడు రైల్లోంచి తోసేసి నప్పుడు,  ఆయన అంతరంగం సంధించిన ప్రశ్నే స్వాతంత్ర్య పోరాటానికి పురిగొల్పి ,ఆయన్ని మహాత్ముణ్ణి చేసింది. అంతరంగం / అంతరాత్మ అనేది  లేకపోతే ప్రపంచంలో  ఏ గొప్ప పనీ సాధ్యం కాదు. మన చుట్టూ కూడా ఏ మంచి పనీ చేయలేం. చరిత్రలో హిట్లర్ లాంటి వాళ్ళు, ఈదీ అమీన్ లాంటి వాళ్ళు అంతరాత్మని చంపేసుకుని, తుంటరి మనసు చెప్పినట్టల్లా ఇగోతో ఆటాడారు, మారణహోమాలు సృష్టించారు.

        ‘కోయీ మిల్ గయా’ లో గ్రహాంతర జీవి అంతరాత్మ, మానసికంగా బలహీనుడైన హృతిక్ రోషన్ మన ఇగో, ‘పీకే’ లో అమీర్ ఖాన్ మన కాన్షస్ ఇగో అయితే, అంతరిక్షం  లోంచి అతను ప్రవేశించిన భూవాతావరణం అంతరాత్మ, ‘భజరంగీ భాయిజాన్’ లో పాప పాత్ర సర్వాంతర్యామి అయిన అంతరాత్మ.  

          హార్రర్ సినిమాల్లో దెయ్యాల కొంపలు  అంతరాత్మలు. పాత్రలు మన ఇగోలు. రొమాంటిక్ కామెడీల్లో ఎంతకీ ప్రేమలో పడని హీరోయిన్ అంతరాత్మ, హీరో ఆ అంతరాత్మలోకి దూకి లక్ష్యం (ప్రేమ) కోసం మునకలేసే మన ఇగో. ట్రాజడీల్లో ఎదురయ్యే సమస్య అంతరాత్మ, పరిష్కరించుకోలేక పతనమయ్యే పాత్ర మన ఇగో. 


         థ్రిల్లర్స్ లో విలన్ అతడి చుట్టూ  వాతావరణం అంతరాత్మ సెటప్, ఆ సెటప్  లోకి దూకే హీరో మన ఇగో. మర్డర్ మిస్టరీల్లో  మిస్టరీ అంతా మన అంతరంగం, మిస్టరీని చేధించే హీరో మన ఇగో. ఆర్ట్ సినిమాల్లో  ‘దొర’ అనే వాడు  భయపెట్టే అంతరాత్మ, జీతగాడు ఆత్మస్థైర్యం కోల్పోయిన మన ఇగో. కమ్యూనిస్టు అయిన ఆర్. నారాయణ మూర్తి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన సినిమాల్లో ఉద్యమాలు, పోరాటాలు అన్నీ వెలుపలి మనసు- లోపలి మనసుల సయ్యాటలే. లేకపోతే ఆ సినిమాలే ఆడవు.


        మొత్తంగా చూస్తే  కథలన్నీ మన అంతరంగంలోకి లేదా అంతరాత్మలోకి మన ఇగో చేసే ప్రయాణాలే. కథంటే అంతరంగంలోకి ఇగో చేసే ప్రయాణం...దీన్ని రామకోటిలా రాసుకోవాలి.  అంతరంగం స్క్రీన్ ప్లేలో మిడిల్ అయితే, ఇగో మనమే, అంటే మనం అభిమానించే హీరో!

          ఇగో ని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే దిశగా ప్రయాణింప జేసేదే మంచికథ!
          ‘క్షణం’ లో చూడండి... అతనెప్పుడో  నాల్గేళ్ళ క్రితం ఇగో ప్రేరేపిస్తే హీరోయిన్ తో శారీరకంగా కలిసి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఇక పట్టించుకోలేదు. తీరా తిరిగి వచ్చి తప్పిపోయిన ఆ హీరోయిన్ పాపకోసం వెతికే ‘ప్రయాణం’లో, చివరికి ఆ పాపే తనదని తెలుసుకున్నాడు- మెచ్యూర్డ్ ఇగోగా ఎదిగాడు. ఆ పాపని (అంతరాత్మని) తన కూతురిగా స్వీకరించి మోక్షం పొందాడు. మోక్షం ఇంకెక్కడో దొరకదు, మన అంతరాత్మని మనం శిరస్సు వంచి స్వీకరించగల్గితే  అదే మోక్షం. ఇంకే మోక్షమూ ఎక్కడా లేదు. 

           మనలోని ఇగోని చంపి పారేసుకోవడం చచ్చినా సాధ్యం కాదు. అందుకని పాడు పన్లు చేయించే ఇగోని సంస్కరించి మంచి ఇగోగా, మన దోస్తుగా మార్చుకోవడమే మనం చేయాల్సింది. అప్పుడే మనకి మోక్షం. మంచి సినిమా కథలు ఈ పనే చేస్తాయి- ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చడం. ఆవారా హీరోని (ఇగోని) ఎలాగో కిందా మీదా పడి తెలిసిన నాటు వైద్యం (సైకో థెరఫీ) చేసి, మారిన  మనిషిగా (మెచ్యూర్డ్ ఇగోగా) తేల్చి ముగిస్తూనే వుంటారు అప్పుడప్పుడు మన సినిమాల్లో. 


          ఒకప్పుడు వదిలేద్దాం, ఇప్పుడు ‘మా సినిమాల్లో మంచి మెసేజ్ వుందం’ టారు, ఆ మెసేజ్ ఇచ్చే విధానం చాలా తికమక పెట్టేస్తుంది. అసలు మెసేజ్ లెక్చర్ ద్వారా ఎందుకివ్వాలి. కథలోకి ఇగోని ప్రయాణింపజేసి, మెచ్యూర్డ్ ఇగోగా మార్చే కథలకి,  ఏ మె సేజూ ఓరల్ గా ఇచ్చే అవసరం రాదు- ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కూడా సైకలాజికల్ గా కనెక్ట్ అయి,  డీఫాల్డుగా వుండే అత్యుత్తమ మెసేజిని ఇవ్వకనే ఇచ్చేస్తోంది.


          ఇగోని  మెచ్యూర్డ్ ఇగోగా మార్చే కథల్లో డీఫాల్డుగానే దైవవాణి వుంటుంది. దైవవాణికి మించిన మెసేజి ఏముంటుంది? యాక్షన్, ఫ్యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, థ్రిల్లర్, విప్లవ, దేశభక్తి, దైవభక్తీ...ఇంకే కథలకైనా ఒకే దైవవాణి( మెసేజ్) వుంటుంది - న్యాయం, ధర్మం, నైతిక విలువలు పాటించుకోమని.


          స్క్రీన్ ప్లే అంటే  ‘just  character  and  structure , conflict  and  turning  points’  మాత్రమే కాదనీ, అలాటి స్క్రీన్ ప్లేలు ‘don’t  make  a psychological connection,  they  lack  hidden  wisdom  and  truth, and  they  are not really  that entertaining…’  అని బానెట్ రాశారు. దురదృష్టవశాత్తూ హాలీవుడ్ లో కొత్త వాళ్ళు వచ్చేసి ఇలాగే రాసేస్తున్నారనీ, you  have  an  entire  industry  manufacturing something  it  doesn’t  understand.  If  they  did  it  in Detroit,  manufactured cars  without  a  clue  to their  real  purpose,  it  would  be  a  joke. The  motor would  be  in  the  back  seat  and  the wheels  would  be  in the  trunk. You’d have chaos!’   అన్నారు. 

        ‘without   clue  to their  real  purpose’  తో కథ తయారు చేస్తే ఎలా వుంటుందంటే, ఉదాహరణకి ‘ఊపిరి’ లో కార్తీ పాత్రకి పెట్టిన కుటుంబ కష్టాల చాంతాడంత కథ. కార్తీ నాగార్జున దగ్గరికి అంతరాత్మలోకి జర్నీ చేసే ఇగోగా ప్రవేశించాక, మళ్ళీ అవతల కుటుంబ కష్టాలతో కూడిన ఇంకో అంతరాత్మలోకి జర్నీ  ఏమిటి? మనిషికి రెండు అంతరాత్మ లుంటాయా? దీనికి  ఏ మాత్రం సైకలాజికల్ కనెక్ట్ వుంటుంది? 

          అలాగే ‘సూర్య వర్సెస్ సూర్య’ లో సూర్యరశ్మి పడని  జబ్బుతో వుండే  హీరో / ఇగో  కథ- ఆ సూర్య రశ్మి అనే అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత,  దాంతో అమీ తుమీ తేల్చుకోకుండా, హీరోయిన్ తో ప్రేమాయణమే తన ప్రయాణంగా మార్చుకుంటే, సైకలాజికల్  కనెక్ట్ అంతా ఏమైపోవాలి? అంటే  Manufacturing   stories   without   clue  to their  real  purpose  అన్నమాట! ఏం చేస్తున్నామో, అసలేం చెయ్యాలో తెలీక ఏదో చేసెయ్యడం! 

          ఒకసారి పునశ్చరణ చేసుకుందాం :           

            1. కథ ప్రయోజనం ఇగోని మెచ్యూర్డ్ ఇగో దిశగా ప్రయాణింప జేయడం.          
    2. స్క్రీన్ ప్లే అంటే కాన్షస్ (వెలుపలి మనసు) – సబ్ కాన్షస్ (అంతరాత్మ) ల ఇంటర్ ప్లే (సయ్యాట).          
3. హీరో అంటే మనం, మన ఇగో.          
     4. వెలుపలి మనసు అంటే స్క్రీన్ ప్లే లో బిగినింగ్ విభాగం.         
    5. వెలుపలి మనసుతోనే మన ఇగో/ మనం ఎంజాయ్ చేస్తూంటాం.          
      6. వెలుపలి మనసు లాంటి బిగినింగ్ విభాగంలో హీరో కూడా ఎంజాయ్ చేస్తూంటాడు.
          7. ఆనందంగా వున్న మనకి సమస్యలొస్తాయి. అంతరాత్మతో సంఘర్షణలో పడతాం.
          8. బిగినింగ్ విభాగంతో హీరోకి / మన ఇగోకి కూడా హనీమూన్ ముగిసి సమస్యలో ఇరుక్కుంటారు.
          9. నిజజీవితంలో మనం అంతరాత్మతో సంఘర్షణ కి దిగితాం. 
          10. కథలో హీరో / ఇగో అంతరాత్మలాంటి మిడిల్ లోకి ప్రవేశించి  సంఘర్షణ ప్రారంభిస్తాయి.

          (వచ్చేవారం సైకలాజికల్ లాకింగ్ ఫార్ములా తెలుసుకుందాం)

-సికిందర్







         

          

          













            
            





          

Saturday, April 2, 2016

రివ్యూ !

రచన- దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
 తారాగణం : మంచు మనోజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్, సురభి, మంజుభార్గవి, పూనమ్ కౌర్, అభిమన్యు సింగ్, నర్సింగ్ యాదవ్, చలపతి రావు తదితరులు
సంగీతం
: రవిశంకర్, ఛాయాగ్రహణం : అంజి
బ్యానర్ : సికె ఎంటర్ టైన్మెంట్స్ – శుభ శ్వేతా ఫిలిమ్స్
నిర్మాతలు : స్వెట్లానా, వరుణ్, తేజా, సివి రావు
సమర్పణ : సి. కళ్యాణ్
విడుదల : ఏప్రెల్ 1, 2016
***
రాం గోపాల్ వర్మతో ఒక భరోసా వుంటుంది. ఆయన అంబాసిడర్ కారు నడుపుకుంటూ ఎప్పుడూ రాడు. కొత్త కొత్త మోడల్ కార్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. ఇవాళ్టి దర్శకులు కొందరు ఇంకా ‘సావిత్రి’ లాంటి పాత అంబాసిడర్ కారునే చోద్యంగా తోలుకుంటూ వస్తూంటే, వర్మ తిప్పితిప్పి తీసేవి రెండు మూడు జానర్లే అయినా, వాటి ఉన్న బడ్జెట్ లోనే నిర్మాతకి ఎక్కువ క్వాలిటీనీ కొత్తదనాన్నీ  ఇవ్వాలని ప్రయత్నిస్తూ, ‘హై ఎండ్ కార్లని’ వాడేస్తూంటాడు. పాతికేళ్ళుగా సినిమాలు తీస్తున్నా పాతబడి పోకుండా,  పాత స్కూల్ అన్పించుకోకుండా, ఎవరు నేర్చుకున్నా నేర్చుకోక పోయినా,  ఎవరు చూసినా చూడకపోయినా, స్క్రిప్టులో కొత్త టెక్నిక్స్ నీ, మేకింగ్ లో కొత్త టెక్నిక్స్ నీ ప్రవేశపెడుతూ జోరుగా డ్రైవ్ చేసుకుంటూ తన మానాన తను వెళ్లిపోతూంటాడు- ‘ఛోటీసీ యే దునియా పహెచానే రాస్తే హై..తుమ్ కహీఁ తో మిలోగే,  తో పూఛేంగే హాల్ ..’ అనిపాడుకుంటూ.

         
నిన్న ‘కిల్లింగ్ వీరప్పన్’ అనే డాషింగ్ డాక్యూ డ్రామా తీస్తే, ఇవ్వాళ ‘ఎటాక్’ అనే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ తీశాడు. జీవిత చరిత్రని మరోకోణంలో చిత్రానువాదం ఎలా చేయాలనే దానికి ‘కిల్లింగ్ వీరప్పన్’  ని గైడ్ లా అందిస్తే,  ఒపెన్స్ సస్పెన్స్ తో ఎండ్ సస్పెన్స్ అనే  ఊబిలో పడకుండా ఎలా బయటపడొచ్చో ‘ఎటాక్’ ని రూల్ బుక్ లా అందించాడు. తెలుసుకోవాలన్న ఆసక్తి వుందా?  అయితే కథలోకి వెళ్దాం...

కథ 

     హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకప్పుడు రౌడీయిజంతో బతికిన గురురాజ్  (ప్రకాష్  రాజ్), రౌడీయిజానికీ కుటుంబ యోగ క్షేమాలకీ లంకె కుదరని, రౌడీయిజాన్ని వదిలేసి ‘చార్మినార్ గ్రూప్స్’ అనే కంపెనీని  పెట్టుకుని కుటుంబంతో సంతోషంగా గడుపుతూంటాడు. అయినంత మాత్రాన పాత జీవితం వెన్నాడక పోదని అప్రమత్తంగా ఉంటాడు. భయపడినట్టు జరగనే జరుగుతుంది- ఒకరోజు గుడి కెళ్ళి వస్తున్న తనని మాటు వేసిన శత్రువులు చంపేస్తారు.

          గురురాజ్ కి ముగ్గురు కొడుకులు, భార్య. పెద్ద కొడుకు కాళి (జగపతి బాబు) తండ్రి హత్యకి బాధ్యుడు పాత శత్రువు నర్సింహులేనని వాదిస్తాడు. చాలా కాలంగా నలుగుతున్న భూవివాదమే ఈ హత్యకి కారణమనీ, ఆ నర్సింహులుని వదిలిపెట్టే ప్రసక్తే లేదనీ అంటాడు.  

          రెండో కొడుకు గోపి ( వడ్డే నవీన్) ఇంకా  ఈ చంపుకోవడాలు వద్దంటాడు, ఆ భూమిని వదిలేద్దామంటాడు. చిన్న కొడుకు రాధ ( మనోజ్) పెద్దన్న కాళీనే సపోర్టు చేస్తాడు. రాధని ప్రేమిస్తున్న వల్లి ( సురభి) కంపెనీ బిజినెస్  చూసుకోకుండా మళ్ళీ  గొడవల్లోకి తలదూర్చావంటే వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది.

          కాళి మాత్రం పగబట్టిన త్రాచులా నర్సింహులు కోసం గాలిస్తూనే వుంటే, ఓ పోలీస్ ఇన్స్ పెక్టర్ ఉప్పందిస్తాడు, నర్సింహులు ఫలానా టైములో ఫలానా చోట వుంటాడని. ఈ సమాచారంతో తన గ్రూపుతో అక్కడికెళ్ళిన  కాళీని మాటువేసి చంపేస్తారు గ్రూపుతో సహా ప్రత్యర్ధులు. దీంతో ఇక వూరుకోననీ, తండ్రినీ, అన్ననీ చంపిన వాళ్ళందర్నీ, చంపడానికి తోడ్పడ్డ వాళ్ళందరితో సహా,  అంతమొందిస్తానని  ప్రకటించి ఎటాక్ కి బయల్దేరతాడు రాధ. 

          తెరపైకి రాని  మూల శత్రువు నర్సింహులెవరో వాణ్ణి కనుక్కోవడం రాధ టాప్ ప్రయారిటీగా వుంటుంది. ఎందుకంటే,  తనకి తెలిసి ఎప్పుడో పదిహేనేళ్ళ  క్రితం తన చిన్నప్పుడు, తన తండ్రీ- నర్సింహులు ప్రత్యర్ధులని వినడమే గానీ నర్సింహులుని చూసింది లేదు.
          ఈ నేపధ్యంలో రాధ వేట మొదలెడతాడు..


ఎలావుంది కథ
        పాతదే. కానీ మెసేజ్ రెబెల్ ధోరణిలో వుంది. రామాయణ భారతాల్ని చూపిస్తూ శత్రువుల్ని మంచితనంతో క్షమించరాదనీ, వధించడమే ధర్మమనీ చెబుతున్నాడు వర్మ. నేరం చేసిన వాణ్ణి శిక్షించడం దేవుడితో మనిషి కూర్చుని  రాయించుకున్న ధర్మ సూత్రమని హీరో పాత్రద్వారా అన్పిస్తాడు (ఈ డైలాగు మాత్రం టెర్రిఫిక్ గా, ఎమోషనల్ గా వుంది). చట్టాల్ని సీనులోకి తీసుకు రాకుండా, ఎవరి చట్టం వాళ్ళే రాసుకుని శత్రువుని చంపెయ్యాలనీ  చెబుతున్నాడు. దీన్నెవరూ సీరియెస్ గా తీసుకోరు, అది వేరే విషయం...కానీ ఈ వాదంతో తన సేఫ్టీ కోసం రామాయణ మహా భారతాలని ఉటంకించినట్టు కన్పిస్తాడు. మతగ్రంధాలకి తప్పుడు భాష్యాలతో టెర్రరిస్టులు చేస్తున్నది ఇదేగా? కాకపోతే వర్మ వక్ర భాష్యాలు చెప్పడం లేదు. 

          ఏదోవొక వివాదాస్పద అంశాన్ని జోడిస్తే గానీ రొటీన్ కథలు నిలబడవని కావొచ్చు. అయితే, దీన్నయినా  మన మానసిక చీకటి కోణాల్లో ఎక్కడో సమర్ధించుకుని రహస్యంగా  సంతృప్తి పడాలన్నా,  కాస్త సన్నివేశ బలం అవసరం. ఆ సన్నివేశ బలం ఏమిటో, అదెందుకు  లేదో తర్వాత చూద్దాం. అయితే గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ డిమాండ్ చేసే జానర్ మర్యాదలన్నిటినీ తుచ తప్పకుండా వర్మ పాటించి- ఈ కథని చివరంటా కళ్ళప్పగించి చూడగలిగేట్టు కథనం చేశాడు- అదీ గొప్పతనం. 


ఎవరెలా చేశారు

       ఇందులో హేమాహేమీలు నటించడం బాక్సాఫీసు అప్పీల్ కి ప్లస్ అయింది. ఓపెనింగ్స్ బాగానే వున్నాయి. ఆ హేమాహేమీలతో ఇది ఉత్త తాటాకుల చప్పుళ్ళే  అని అన్పించకుండా వాళ్ళ పాత్రల్నీ, నటనల్నీ సమర్ధవంతంగా తెరకెక్కించాడు వర్మ. మారిన మనిషిగా ప్రకాష్ రాజ్ హుందాతనంతో కూడిన నటన, హావభావాలూ   మైక్రోస్కోపిక్ విజన్ తో శోధిస్తున్నట్టు విస్పష్టమైన  క్లోజప్స్ తో  కట్టి పడేస్తాయి. 

          అలాగే జగపతిబాబులోని  ప్రతీకారేచ్ఛతో కూడిన ముఖభావాలూ మనల్ని వెన్నాడతాయి. మంచుమనోజ్ నుంచి కూడా కమర్షియల్ కి దూరంగా రియలిస్టిక్ అప్రోచ్ తో ప్రదర్శించిన నటనని ఎంజాయ్ చేయగలం. మంజుభార్గవి కూడా ఒక కీ లక సన్నివేశంలో ఇచ్చిన టైట్ క్లోజప్ ఒక క్లాసిక్ ఆర్ట్. ఆ షాట్ ని అలాగే కత్తిరించి ఫ్రేము కట్టించి గోడకి పెట్టుకుంటే, మొనాలిసాతో పోటీ పడుతుంది. 

          గొడవలు వద్దని ఎప్పుడూ మనోజ్ ని సాధిస్తూ వుండే పాత్రలో సురభికి, ఎప్పుడూ అవే సీన్లు అరడజను సార్లు మార్చి మార్చి వస్తూంటాయి. ఇక విలన్ అభిమన్యు సింగ్ కి వాంప్ పాత్రలో పూనమ్ కౌర్, వర్మే తీసిన ‘కంపెనీ’ లో మనీషా కోయిరాలకి చెల్లెలు అన్పించే చేష్టలతో వుంటుంది. అభిమన్యు సింగ్ ఈ సినిమాలో తొలిసారిగా ప్లే బాయ్ లుక్ తో కన్పిస్తాడు. ఇంకా చిన్న చిన్న రౌడీలున్నారు. ఆయా సన్నివేశాల్లో వాళ్ళ విచిత్రమైన క్లోజప్స్ కూడా  సన్నివేశాలకి బలం చేకూరుస్తాయి. ఇక తెరపైకి తిరిగి వచ్చిన ఒకప్పటి హీరో వడ్డే నవీన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 

        కెమెరా వర్క్  ఈ థ్రిల్లర్ ని చాలా నిలబెట్టింది. జానర్ మర్యాదకి తగిన ఛాయగ్రహణం ప్రాణం ఈ సినిమాకి. ఈ కెమెరా వెనుక కన్ను అంజిది. అద్భుతమైన దృశ్య ఫలితాల్ని ఇచ్చాడితను.   ఒక రివెంజి డ్రామాని కూడా కంటికింపైన రంగులతో తీయవచ్చా అన్నది ఎప్పుడూ ప్రశ్న కాలేదు. కాకపోతే వర్మ ఎప్పుడూ ఇలా తీయలేదు. ఆయనదెప్పుడూ గ్రే- బ్రౌన్- ఎల్లో టింట్సే.

          ఈసారి మాత్రం  కలర్ గ్రేడింగ్ ని   రెడ్- పింక్ టింట్స్ లకి మార్చేశారు. ఇదెంతో విజువల్ ట్రీట్ ని సంతరించి పెట్టింది. ఏ కలర్ తోనూ, ఏ లైటింగ్ తోనూ ఎక్కడా డార్క్ మూడ్ అనేదే క్రియేట్ చేయకుండా, టేబుల్ మీద నోరూరించే తియ్యటి కేక్ ని అమర్చి పెట్టినట్టుగా దృశ్యాల్ని మనోరంజితం చేశారు.

          ఓల్డ్ సిటీ, పురనాపుల్, నయాపుల్, మూసీ నదుల ఏరియల్ షాట్స్ అయితే మైండ్ బ్లోయింగే. ఇలాటి ఓల్డ్ సిటీ  షాట్స్ ఇంతవరకూ ఏ తెలుగు సినిమాలోనూ రాలేదు.ఓల్డ్ సిటీ భవనాలూ గల్లీలూ కూడా, పింక్ టింట్ తో అద్భుతంగా  వెలిగిపోతూంటాయి. నడిబజార్లో ప్రకాష్ రాజ్ ఓపెన్ ఇల్లు నేటివిటీకి నిలువెత్తు సాక్ష్యంలా వుంటుంది.

          యాక్షన్ సీన్ల చిత్రీకరణ కూడా కాస్త భిన్నంగానే వున్నా, క్లయిమాక్స్ లో విలన్ తో మనోజ్  పోరాడుతున్నప్పుడు ఎంతసేపూ ఇద్దరూ పెనుగులాడుకోవడమే సరిపోయింది- పంచులిచ్చుకోకుండా. అరటి పండుకోసం చిన్న పిల్లలిలాగే పెనుగులాడుకుంటారు. అలాగే గన్ షాట్స్  ఎఫెక్ట్స్ మూస పద్ధతిలో వున్నాయి. ఒక రివాల్వర్ ఒకసారి పేలిందంటే దాని  శబ్దంతో గుండెలదరాలి- వయోలెంట్ యాక్షన్లో వెపన్స్ కూడా వయోలెంట్ గానే  వుండాలికదా. 

       ఇక జగపతి బాబుని నిలువెల్లా కాల్చేసింతర్వాత, అతను  సీన్లోంచి అవుట్ అవడం, దర్శకుడు  కట్ చెప్తే  నటన విరమించుకుని వెళ్లి పోయినట్టుంది- ఇలాటిదే ఇంకో యాక్షన్ సీన్లో మనోజ్ తోనూ  జరిగింది. ఈ రెండూ అన్వర్ అలీ ఎడిటింగ్ లో వుండాల్సినవి కావు.
          

         ఇక సినిమా ప్రారంభంలో ప్రకాష్ రాజ్ హత్య, ఇంటర్వెల్ దగ్గరలో జగపతి బాబు హత్య, అలాగే సెకండాఫ్ లో మనోజ్ ని చంపడానికి ఎటాక్ - ఈ మూడూ స్ట్రక్చర్ ని విజువలైజ్ చేసే  మంచి ప్లేస్ మెంట్సే. 

          అయితే ఈ  మూడూ మూసలో ఉండకుండా చూడాల్సింది. ప్రకాష్ రాజ్ ని చంపేటప్పుడు పావురాల గుంపుతో యాక్షన్ ఒక మూస,  జగపతి బాబుని చంపేటప్పుడు వర్షంలో గొడుగులతో యాక్షన్ ఇంకో మూస,  దోభీ ఘాట్ లో మనోజ్ మీద ఎటాక్ చేయడం  మరింకో మూస. ఈ పావురాలూ గొడుగులూ దోభీ ఘట్లూ ఏనాటి మూసో!  వీటిని మారుస్తూ కొత్త ‘మూసని’ కనిపెట్టాల్సింది వర్మ. 

          పోతే, ప్రకాష్ రాజ్ ని క్లోజప్ లో కూడా అంత మంది అన్ని సార్లు కాల్చినపుడు, ఆయన తెల్ల చొక్కా మీద ఒకే ఒక్క గాయం మాత్రమే అయినట్టు  రక్తం కారడం ఏమీ బాగాలేదు.

          తీయడంలో ఇలాటి టెక్నికల్ లోపాలు కొన్ని దొర్లినా, కథ చెప్పడంలో దర్శకుడుగా ఎక్కడా ఫోకస్ కోల్పోలేదు వర్మ. అలాగే చిత్రీకరణలో, సన్నివేశాలకి  డెప్త్ తీసుకురావడానికి మింగిల్ చేసిన పక్క పాత్రల ‘బిజినెస్’ షాట్స్ తో, వర్మ సంస్కారవంతమైన దర్శకత్వం వహించాడు.

        ఇక సంగీతం విషయానికొస్తే, బ్యాక్ గ్రౌండ్ లో రెండూ థీమ్ సాంగ్సే. ఈమధ్య ఇలాటి సినిమాలు వర్మ తీస్తూ పెడుతున్న విచిత్రమైన గొంతుకల, హింసని ప్రేరేపించే  అరుపుల పాటలు ఇందులో కూడా వున్నాయి. 

చివరికేమిటి     
     కొ
న్ని స్క్రీన్ ప్లే సంగతులు చెప్పుకుని ముగిద్దాం. వర్మ సెట్ చేసుకున్న ఈ స్క్రీన్ ప్లేని త్రీ యాక్ట్స్ కింద విభజిస్తే, జగపతిబాబుకి నర్సింహులు ఆచూకీ చెప్తానని ఇన్స్పెక్టర్ అనడం, కథలో ప్రధాన సమస్యకి  దారితీసే పరిస్థితుల  కల్పనలో భాగంగా వచ్చే ఒక బీట్. ఇది సుమారు నలభై  నిమిషాలకి వస్తుంది. 

          ఇక్కడ్నించీ జగపతి బాబు  నర్సింహులు కోసం వెళ్ళడం, తనే హత్యకి గురి కావడం, హాస్పిటల్లో చనిపోవడం ఇంకో అయిదు నిమిషాల్లో జరిగిపోతుంది. బిగినింగ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది.  అంటే ముప్పావు గంటలో ఇంటర్వెల్ వచ్చేస్తుందన్న మాట.

          ఇలా ఇంటర్వెల్ సీనే బిగినింగ్ ముగింపు సీను కావడం బహుశ ఇదే మొదటి సారి చూడ్డం. ఇంటర్వెల్ తర్వాత  కథకి హీరో అయిన మనోజ్ కి ఇక శత్రువు లందర్నీ చంపెయ్యాలన్న గోల్ ఏర్పడుతుంది – అంటే ప్లాట్ పాయింట్- 1 అన్న మాట.  

          అంటే కథ మిడిల్లో పడిందన్న మాట.  మిడిల్ అంటే గోల్ కోసం హీరో చేసే స్ట్రగులే కాబట్టి- హంతకుడైన నర్సింహులు ని కనుక్కోవడానికి వివిధ ప్రయత్నాలు చేసి, చివరికి వాణ్ణి పట్టుకుంటే అసలు రహస్యం తెలిసి,  ఆ తెలుసుకున్న రహస్యంతో అసలు విలన్ని పట్టుకుంటాడు.

          రెండో అన్నతో బాటు హీరోయిన్ కూడా ఎదురు తిరగడంతో,  ఆ విలన్ తో రాజీ ప్రయత్నానికి సిద్ధమవుతాడు హీరో. ఇక్కడ మిడిల్ ముగిసి ప్లాట్ పాయింట్ - 2 ఏర్పాటయింది.

          మిడిల్ ముగియడమంటే గోల్ కోసం హీరో చేస్తున్న స్ట్రగల్ కి చివరి ఎత్తుగడ పన్నడమే కాబట్టి- అలా ఈ ప్లాట్ పాయింట్-  2 దగ్గర నుంచీ రాజీ మంత్రంతో విలన్ ని ఆశ్రయిస్తాడు మనోజ్. అంటే ఎండ్ లో పడింది కథ. ఆ రాజీమంత్రమే అస్త్రంగా క్లైమాక్స్ వైపు పయనం! 

          హీరో ఎవరు? గురురాజ్ చిన్న కొడుకు (బిగినింగ్
), ఇతను ఇరుక్కున్న సమస్యేమిటి? తన తండ్రిని, అన్నని చంపిన శత్రువు లందర్నీ చంపడం (మిడిల్),  ఈ సమస్య లోంచి ఎలా బయట పడ్డాడు? రాజీ మంత్రంతో ( ఎండ్). 

          పోతే, ఈ స్క్రీన్ ప్లే బలమేమిటి? థ్రిల్లర్ సినిమాకి నష్టం చేసే ఎండ్ సస్పెన్స్ కథనాన్ని ఎవాయిడ్ చేస్తూ ఓపెన్ సస్పెన్స్ ని మెయిం టెయిన్ చేయడం. 

          అదెలా? ‘కథాకళి’..  ‘కథాకళి’ లాంటి ఇంకెన్నో  సినిమాలూ చూస్తే తెలుస్తుంది. ఏముంది వాటిలో? ‘కథాకళి’ నే తీసుకుందాం. విలన్ ని ఎవరో చంపితే ఆ నేరం హీరో మీద పడుతుంది.  హీరో తో సహా ప్రేక్షకులకి కూడా హంతకుడెవరో తెలీదు. కొందరు  అనుమానితులుగా  కన్పిస్తూంటారు. 

          వీళ్లల్లో  హంతకుడెవరా అని మనం గెస్ చేస్తూ వుంటాం. చివరికి – కథ నడిపీ నడిపీ ఎండ్ లో ఆ సస్పెన్స్ విప్పి ఇదిగో ఈ ఫలానా వాడే  హంతకుడని చూపించేశారు. సినిమాలకి ఈ విధానం పనికి రాదని చాలా సార్లు చేతులు  కాల్చుకున్న తర్వాత హాలీవుడ్ తెలుసుకుంది. 

          ప్రేక్షకుల ఓపికని ఇది  చాలా పరీక్షిస్తుంది. హీరోకి విలన్ (హత్య చేసిన వాడు) కన్పించక  ఏక్  నిరంజన్ లా, లింగు లిటుకుమని, తాడూ బొంగరం లేనివాడిలా కథంతా వేస్టుగా పాసివ్ గా తిరుగుతూ, టైం ( బుర్ర కూడా) తినేస్తూంటాడు. వీణ్ణి పట్టి  అమెజాన్ అడవుల్లో పడెయ్యాలన్పిస్తుంది. గోల్ వుంటుంది, విలన్ లేక కాన్ ఫ్లిక్టే వుండదు. 

           ఇలా కాకుండా,  హత్య చేసింది ఫలానా హంతకుడని హీరోకి, ప్రేక్షకులకీ తెలిసిపోయే ట్టు కథనముంటే, అప్పుడు ఆ హంతకుణ్ణి పట్టుకునే యాక్షన్ లోంచి  యాక్టివ్ పాత్ర, థ్రిల్లింగ్ కథనం సాధ్యమవుతాయి. దీన్ని సీన్ - టు – సీన్ సస్పెన్స్ అంటారు. ఎందుకంటే తెలిసిన కిల్లర్ ఎలా పట్టుబడతాడా అని సీను సీనుకీ సస్పెన్స్ ని పెంచుతూ కథనం – కాన్ ఫ్లిక్ట్- పరస్పర ఎత్తుగడలూ వుంటాయి గనుక.

          ఇంకో పధ్ధతి  మర్డర్ చేస్తున్నప్పుడు కిల్లర్ ని  ప్రేక్షకులకి మాత్రమే చూపించేసి, హీరోకి చూపించకపోవడం. అయితే ప్రేక్షకులకి తెలిసి హీరోకి తెలియని కథనంతో బలహీన మవుతుంది. 

          ఉత్తమ కథనానికి గుర్తు- ప్రేక్షకులు హీరోని ఫాలో అవుతూ అతను కనుగొంటున్న ర హస్యాల్ని అదే  సమయంలో  అతడితో బాటే తెలుసుకుంటూ- హీరో తో బాటే థ్రిల్లవడం. టై అప్ జర్నీ చేయడం.

          ‘ఎటాక్’ లో జరిగిందేమిటంటే, ఎండ్ సస్పెన్స్ కాదు, సీన్ టు సీన్ సస్పెన్స్ కూడా కాదు- పైన చెప్పుకున్న టై అప్ జర్నీ. అంటే ఓపెన్ సస్పెన్స్. 

          సస్పెన్స్ అన్నది ఒక అంశం అనుకుంటే, ఆ అంశానికి రెండు పార్శ్వా లుంటాయి : ఎవరు? ఎందుకు? అనేవి. 

          వీటిలో ఒకటే ఓపెన్ చేసి రెండోది  మూసి పెట్టినప్పుడు,  ఆ మూసిపెట్టిన పార్శ్వమే కథని నడిపిస్తూ వుంటుంది. ఫలానా వాడు హత్య చేశాడని చూపించి, ఎందుకు చేశాడో మూసిపెట్టి నడపడం, లేదా ఎందుకు చేశాడో చూపించి, వాడెవడో మూసిపెట్టడం...అన్నమాట!
          ‘ఎటాక్’  లో రెండోది జరిగింది. 

        మొట్టమొదట ప్రకాష్ రాజ్ ని  ఒకడి నాయకత్వంలో వచ్చి కొందరు చంపుతారు. ఈ నాయకుణ్ణి చూస్తే  కథకి విలన్ లాగే వుంటాడు (ఇలాటి ఆర్టిస్టుల్ని పెట్టి మిస్ లీడ్ చేయడం సస్పెన్స్ థ్రిల్లర్స్ లో మామూలే). ప్రకాష్ రాజ్ ని ఎందుకు చంపారో కథనంలో చెప్పేశారు, ఎవరు చంపి వుంటారో కూడా నర్సింహులు అనే పేరుని  వెల్లడి చేస్తూ చెప్పేశారు. కానీ ఆ నర్సింహులు ఎవరో మనకి చూపించలేదు. కానీ మనం చూసిన ఆ విలన్ లాంటి వాడే అయ్యుంటాడని మనకి దొలుస్తూ వుంటుంది. వాడేనా కాదా, వాడెక్కడున్నాడు,  ఎలా దొరికిపోతాడు,  అన్న రకరకాల సస్పెన్సులు ఏర్పడి ఊపిరి బిగబట్టి చూడడమే మనపని.

            ఇలాటి థ్రిల్లర్ కథనం ఎలా ఉంటుందంటే,  ఫస్టాఫ్ సెకండాఫ్ కనిపించని కవలల్లాగా వుంటాయి. ఫస్టాఫ్ లో హీరోకి గోల్ ఏర్పడడానికి ఒకటి కాదు రెండు మూడు సంఘటనలు  జరుగుతాయి- లేకపోతే గోల్ ఏర్పడేందుకు తగ్గ ఎమోషన్ వుండదు. ఫస్టాఫ్ లో తండ్రి చావు చూశాక, అన్న చావుకూడా చూశాక ఇక విజృంభించాడు మనోజ్.

           సెకండాఫ్ లో ఏం జరుగుతుందంటే, ఫస్టాఫ్ లో హీరో పాత్ర  రెండు సంఘటనలతో వేడెక్కి రెండు మెట్లు ఎక్కినట్టే, సెకండాఫ్ లో వేడి తగ్గి  రెండు మెట్లు దిగుతాడు.

           ఫస్టాఫ్ లో వేడెక్కించిన ఆ రెండు మెట్లూ తండ్రి చావు, అన్న చావులైతే-
           సెకండాఫ్ లో వేడి తగ్గి దిగివచ్చిన ఆ రెండు మెట్లూ- ఒకటి, మనం భావిస్తున్నవాడు నర్సింహులే కాదని తేలడం;  రెండు, నర్సింహులునే పట్టుకుంటే వాడికి హత్యలతో సంబంధమే  లేదని తేలడం!

          ఈ పోలికలతో ఫస్టాఫ్  సెకండాఫ్ రెండూ కవలలు. ఇలా ఉన్నప్పుడే రెండూ ఒకదానితో ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ కుప్పకూలకుండా వుంటాయి.

          నర్సింహులు కూడా కాకపోతే ఇంకెవరన్నది ట్విస్ట్. సెకండాఫ్ లో రెండు మెట్లు జారి కింది కొచ్చిన  హీరో ఈ ట్విస్టుతో మళ్ళీ మొదటి కొచ్చాడన్న మాట. యాదృచ్చికంగా ఈ ట్విస్టే  ప్లాట్ పాయింట్ -2 అవుతుంది.

          ఓపెన్ సస్పెన్స్ ఎప్పుడూ కథని పొరలు పొరలుగా విప్పి చూపుతూంటుంది...
         
ఇక హీరో ప్రవచించే కంటికి కన్ను, పంటికి పన్ను న్యాయం కాన్సెప్ట్ రహస్యంగానైనా ఆనందిద్దామంటే మనకి అడ్డు పడుతోందేమిటంటే- మన కంతగా ‘కచ్చి’  పుట్టడం లేదు. ప్రకాష్ రాజ్ ని, జగపతినీ చంపడం మనం కళ్ళారా చూసినప్పటికీ, మనోజ్ రివెంజ్ కాన్సెప్ట్ కి మనం కనెక్ట్ కాలేక పోతున్నాం.  మన కళ్ళ ముందు ఆ చావులు చాలక, చావులకి కారణమయ్యాడని అంటున్న వాడితో గతం తాలూకు ఫ్లాష్ బ్యాకు లేక! ప్రకాష్ రాజ్ మంచి వాడిగా ఎలా బతికాడో వాటి తాలూకు మాంటేజెస్ మాత్రమే అప్పుడప్పుడూ చూపడం వల్ల! 

          నర్సింహులుతో ప్రకాష్ రాజ్ కి ఫ్లాష్ బ్యాక్ వేస్తే నర్సింహులెవరో  ప్రేక్షకులకి ముందే తెలిసిపోతుందనుకోవడం వల్ల!!

          దీనికేమిటి మందు? 
          మందుంటే మర్డర్లు చేయమని ప్రకృతి చెప్పినట్టే. కాబట్టి మందు లేదు!


          -సికిందర్  
http://www.cinemabazaar.in