రచన- దర్శకత్వం : పాండి రాజ్
తారాగణం: విశాల్, కేథరిన్ ట్రెసా, మధుసూదన రావు,
మైమ్ గోపి, శ్రీజిత్ రవి
సంగీతం : హిప్ హాప్ తమిళ , ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యం
బ్యానర్ : పసంగా ప్రొడక్షన్స్- విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, నిర్మాతలు : విశాల్, పాండి
రాజ్
విడుదల : 18 మార్చి, 2016
***
ముందుగా ఈ సినిమా
డిమాండ్ చేస్తున్న ఓనమాలు నేర్చుకోవాల్సుంటుంది : గత రెండు నెలలుగా ఈ సినిమా టైటిల్ తెగ ఇబ్బంది
పెట్టేస్తూ, కొత్త తెలుగుని పరిచయం చేస్తున్నట్టు
కన్పిస్తోంది. టైటిల్ వచ్చేసి ‘కథకళి’ అట-
‘శిక్షణ శిబిరం’ అనీ, ‘అర్ధంతరం’ అనీ, ‘ప్రశ్నపత్రం’ అనీ ఇలా ఇంకెన్నో అడ్డగోలు తెలుగు పదాలు రాసిపారేస్తున్న
ఆధునిక ప్రింట్- ఎలక్ట్రానిక్ – సోషల్ మీడియా దుష్ట సమాసాగ్రేసరులు,
భావితరాలు అనుసరించాల్సిన ‘టెల్గూ’ ఇదేననీ
తెలుగు భాష రూపురేఖల్ని భయంకరంగా ఖూనీ చేసి పారేస్తున్న మోడర్నిజంలో, ఈ సినిమా తనూ ఓ చెయ్యేసింది ‘కథకళి’ అంటూ నాట్యం చేస్తూ!
కథకళి! డబ్బింగ్
సినిమా కూడా వచ్చేసి ఇలా తెలుగుని మార్చెయ్యాలా?
సరైన పదం
‘కథాకళి’ రా బాబూ అని మనందరికీ తెలిసిన చాలా చాలా పాత విషయమే. మలయాళీ పదం. కథంటే
కథే, కళి అంటే ఆట! కథ చెప్పే ఆట. అదీ నృత్య రూపంలో. నృత్య రూపంలో నాటకాలుగా రామాయణ
మహా భారతాల్ని ప్రదర్శించడం. కళాకారులెవరూ
నోరు విప్పి ఒక్క మాటా పలకరు, భావ ప్రకటనలతోనే కథనంతా చెప్పుకొస్తారు. అంటే ‘మైమ్’
అన్నమాట. ఈ కేరళకి చెందిన జానపద- శాస్త్రీయ నృత్యకళా రూపం పేరుని సినిమాకి పెట్టేస్తూ, ఒక ఎండ్ సస్పెన్స్ తో కూడిన మర్డర్ కథ తీశాడు
దర్శకుడు పాండియన్ ‘పందెం కోడి’ విశాల్ తో. కథాకళి ప్రదర్శనలో నటుల రూపాల్ని ఎలా
మరుగుపర్చుకుంటూ మాస్కులు ధరిస్తారో- అలా
సినిమాలో జరిగే హత్యకి మాస్కు వెనుక వున్న హంతకుడెవరో కనిపెట్టడం ఈ కథాసారాంశం.
విశాల్
అంటేనే యాక్షన్ కి మారుపేరు. యాక్షన్ వుంటేనే
విశాల్ పూర్తవుతాడు – విశాల్ వుంటేనే యాక్షన్ పూర్తవుతుంది. అలాంటిది యాక్షన్ ని
తీసేసి విశాల్ ని మాత్రమే చూపిస్తే ఎలావుంటుంది- ఆర్టు సినిమాల్లో పల్లెటూరి బాధితుడి కథలా వుంటుందా, లేక అమెరికా
నుంచొచ్చిన అమాయక చక్రవర్తి కథలా వుంటుందా? అమెరికా నుంచి వచ్చాడంటే ఎంతోకొంత ప్రపంచాన్ని
చూసే వుండాలి కాబట్టి అమాయక చక్రవర్తి
అవడానికి వీల్లేదు. మరి ఆర్టు సినిమాల్లో
పల్లెటూరి బాధితుడి కథే అనుకోవచ్చా? ఒకప్పటి ఆర్టు సినిమాల కథా కమామిషులు ఇప్పుడెవరికీ
(దర్శకుడు సహా) తెలిసి వుండదు గనుక, ఇది మరో కమర్షియల్ సినిమా
ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలాగే అన్పిస్తోంది చూస్తూంటే.
కథ
వైజాగ్ –కాకినాడల మధ్య
మత్స్యకారుల కొట్లాటలతో ప్రారంభం. కాకినాద్ సముద్ర జలాల్లోకి వైజాగ్ మత్స్యకారులు
జొరబడి చేపలు పట్టేస్తున్నారన్న గొడవల్లో కాకినాడ మత్ష్య కారులకి అండగా వుంటాడొక కరుడుగట్టిన ముఠా నాయకుడు సాంబశివ (మధుసూదన రావు) అనే అతను. ఇతడి
బావమరుదులిద్దరూ అడ్డొచ్చిన వాళ్ళని చంపిపారేస్తూంటారు. ఇదంతా టైటిల్స్ పడేటప్పుడు
ఉపోద్ఘాతం. పక్క వూళ్ళో కమల్ (విశాల్) కుటుంబం వుంటుంది. నాల్గేళ్ళ తర్వాత కమల్
అమెరికా నుంచి వస్తాడు పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ గతంలోనే మల్లీశ్వరి (కేథరిన్ ట్రెసా) అనే బీఫార్మా స్టూడెంట్ ని ప్రేమించాడు. ఈ పెళ్లి ఏర్పాట్లు
జరుగుతూండగా సాంబశివని కొందరు వెంటాడి దారుణంగా నరికి చంపేస్తారు. ఈ హత్య కమల్
చేశాడని పుకార్లు బల్దేరతాయి. అతడి స్నేహితులు, అన్న కూడా అనుమానిస్తారు. సాంబశివ
దగ్గర సత్యం అనే ఒక స్నేహితుడు పనిచేస్తూంటాడు. విశాల్ ఇతడికి ఫోన్ చేసి, నిన్ను
కూడా అలా చంపేస్తారు జాగ్రత్త అంటాడు. ఈ మాట పట్టుకుని విశాలే తన బాస్ ని చంపాడని
అపార్ధం చేసుకుని కాకినాడ ఎస్సై కి సమాచారం అందించేస్తాడు సత్యం. దీంతో ఆ ఎస్సై (శ్రీజిత్
రవి) కమల్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు. ఈలోగా కమల్ తో బాటు అతడి కుటుంబాన్ని
చంపడానికి సాంబశివ బామ్మర్దులు బయల్దేరిపోతారు. ఆ కుటుంబం పారిపోతుంది, కమల్
కాకినాడ పోలీస్ స్టేషన్ కి బయల్దేరతాడు. అక్కడ ఈ హత్యలో కమల్ నే ఇరికించబోతాడు ఆ
ఎస్సై. ఈ హత్యకి ఇంకొంతమంది అనుమానితులు కూడా వుంటారు. వీళ్ళల్లో అసలు హంతకుడెవరనేది
ఇక్కడ్నించీ మిగతా కథ.
ఎలా వుంది కథ
తన మిత్రుడి జీవితంలో జరిగిన
నిజ కథ అన్నాడు దర్శకుడు. ఆ మిత్రుడి మిత్రుడొకడు ఒక ఒకడి దగ్గర పని చేసేవాడు.
ఒకరోజు ఆ ఒకడిని ఎవరో హత్య చేస్తే, ఆ మిత్రుడికి
ఫోన్ చేసి జాగ్రత్త చెప్పాడు ఈ మిత్రుడు. దీంతో
ఆ మిత్రుడు ఫోన్ చేసిన ఈ మిత్రుణ్ణి అపార్ధం చేసుకుని తన బాస్ ని ఇతనే చంపి వుంటాడని పోలీసులకి చెప్పడంతో ఈ మిత్రుడు ఇరుక్కున్నాడు. ఒక్క పోన్
కాల్ చేసి తన మిత్రుడు ఇరుక్కున్నాడని, దీన్నే కథగా మార్చి తెర కెక్కించాననీ
అన్నాడు దర్శకుడు.
చెయ్యని
హత్యలో ఇరుక్కుని బయట పడే కథలు పక్కాగా అద్భుత రసంతో కూడిన యాక్షన్ ఓరియెంటెడ్
కథలే. అంటే మర్డర్ మిస్టరీలుగా వుండవన్న
మాట. మర్డర్ మిస్టరీల్లో ఎవరూ ఇరుక్కోవడం అంటూ వుండదు. కేవలం రకరకాలైన అనుమానితులుంటారు.
ఈ అనుమానితుల్లో హంతకుడెవరో కనిపెట్టే ఏకైక ఎజెండాతో మాత్రమే కథనం సాగుతుంది.
చివరి వరకూ హంతకుణ్ణి దాచి పెట్టి ప్రేక్షకులతో గేమ్ ఆడుకుని ఆ సస్పెన్స్ ని విప్పుతారు. ఇది ఎండ్ సస్పన్స్
కథనం కింది కొచ్చి, సినిమాలకి పనికి రాదని ఏనాడో తేలిపోయింది- చివరిదాకా దోషి ఎవరో
తెలుసుకోవడానికే పనిలేనట్టు ప్రేక్షకులు
కూర్చోలేరు గనుక. ఆ ఏకపక్ష కథనాన్ని ఎంతసేపూ భరించలేరు గనుక.
‘కథకళి’ లో
హీరో హత్యలో ఇరుక్కోవడమనే యాక్షన్ ఓరియెంటెడ్ పాయింటుని, వివిధ అనుమానితుల్ని తెర
మీదికి తెచ్చే మర్డర్ మిస్టరీ ఎలిమెంటుతో చేయకూడని
సంకరం చేశారు. దీంతో పెద్ద నష్టమే
జరిగింది : ఆ నష్టమేమిటంటే, హీరో పాత్ర
చిత్రణ దెబ్బతినిపోవడం, దీని ప్రభావంతో చప్పగా సాగే ఏ జానరూ కాని కథ అవడం.
ఎవరెలా చేశారు
బకారాలేం చేయగలరో విశాల్ బాబూ
అదే చేశాడు. ఈ కథలో నిజంగా తను అమెరికా నుంచి వచ్చిన పాత్రేనా, లేక పల్లెటూరు
నుంచి దిగిన బకరానా? హీరోలు మానసిక బలమున్న పాత్రల్ని పోషించాలిగానీ, మానసిక వికాసం లేని బకారాలన్పించుకోవడం
కాదు కదా? అనాలోచితంగా హీరోలు పోషించేస్తున్న పాసివ్ క్యారక్టర్స్ కి ఇక ‘బకరా’ అని పేరెట్టెయ్యాలన్న దురాలోచన చూసి చూసి ఇందుకే
వచ్చేస్తోంది...ఇక నుంచి సినిమాల్లో పాసివ్ క్యారక్టర్స్ ని బకారాలనే పిలిస్తే సరి- అలాగైనా
పదేపదే ఇలాటి పాసివ్ హీరోల పాత్రల్ని
సినిమాల్లో రుద్దే అజ్ఞానాన్ని వదిలించుకుంటారేమో ఒకవేళ.
ఆర్ట్
సినిమాల్లో వుండే బాధితుడి పాత్రలాగా ఎంతసేపూ విశాల్ అయోమయపడిపోతూ, ఆందోళనపడిపోతూ,
ఏంచెయ్యాలో పాలుపోక అటూ ఇటూ వురుకుతూ పోలీసువాడు అడమన్నట్టూ ఆడ్డంతోనే
సరిపోయింది ‘కథకళి’. తనొక ఫారిన్ రిటర్న్డ్
నాలెడ్జబుల్ పర్సన్ అన్న సంగతే మర్చిపోయాడు. చదువు సంధ్యల్లేని విలేజి వ్యక్తి కూడా తనని అన్యాయంగా ఇరికిస్తే ఒక
దశకొచ్చేటప్పటికి పరిస్థితిని తన చేతుల్లోకి తెచ్చుకుని తిరగబడతాడు- లేకపోతే అది
కమర్షియల్ కథవదు. ఆర్ట్ సినిమాల్ని ఎంజాయ్ చేయడానికి అలవాటుపడలేదు ప్రేక్షకులు. విశాల్
నటించింది కమర్షియల్ సినిమాలోనా, ఆర్ట్ సినిమాలోనా అన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందంటే,
అది కేవలం ఎంతకీ యాక్షన్లోకి రాని అతడి విఫలమైన పాత్రచిత్రణ వల్లే. ఇదొక బకరా
పాత్ర ముగింపుకి ముందు వరకూ. యాక్షన్ వుంటేనే విశాల్ పూర్తవుతాడు – విశాల్ వుంటేనే
యాక్షన్ పూర్తవుతుందనే నమ్మకాన్ని వమ్ము చేసే ఒట్టి డల్ పాత్ర తనది. పైన ఇందాక
చెప్పుకున్నట్టు రెండు విజాతి జానర్ల సంకరంతో ఎటూకాని పాత్ర. ఈ పాత్రకి తగ్గట్టే కమర్షియల్
సినిమాకి దూరంగా నటన, శోకరస ప్రకటన వగైరా.
హీరోయిన్
కేథరిన్ బీఫార్మా చదివి మెడికల్ షాపులో గుమాస్తా పనిచేయడం కేవలం హీరోతో రోమాన్స్
కి అనువుగా ఉంటుందని దర్శకుడు భావించడం వల్లే కావొచ్చు. తను ప్రేమలో పడకపోతే హీరో
ఆ షాపుకి రావాలి, కండోమ్స్ ప్యాకెట్ కొనుక్కుని పోవాలి, అప్పుడు తను కంగారుపడి అతనెవరితోనో ఆ పాడు పనికి పాల్పడేలోపు
పట్టేసుకుని ఐలవ్యూ చెప్పేసే పాత్రగా దిగజార్చడం కోసమే గుమాస్తా
ఉద్యోగమన్నట్టుంది. అతడికా అలవాటు ఇదే మొదటిసారని ఎలా నమ్మిందో మరి. నవ్వినప్పుడు
ప్రొఫైల్లో నయనతారలా వుంటుంది తప్ప, హీరోయిన్ రేంజికి ఎదగాలంటే మాత్రం ఇంకా చాలా మెచ్యూరిటీ అవసరమే.
ఇక
రాముడన్నాక రావణుడు లేకపోతే రాముడే
కాలేడు. కథానాయకుడన్నాక ప్రతినాయకుడు లేకపోతే కథానాయకుడే కాలేడు. ఓకే... రాముడితో / కథానాయకుడితో
పాటు రావణుడు / ప్రతినాయకుడూ వున్నాడనుకుందాం. ఐతే ఇంకా రామాయణ భక్తులు ఎదురు చూసే
రావణుడు రాముడితో సంపర్కం లోకి రాకుండానే,
లేదా కమర్షియల్ సినిమా ప్రేక్షకులు ఎదురు చూసే ప్రతినాయకుడు కథానాయకుడితో టచ్ లోకి రాకుండానే,
ఊరవతల అనామక చావు చచ్చారనుకుందాం-అప్పుడేమిటి? What happens then? కథ కంచికేనా?
ఇదే జరిగిందిక్కడ!
టైటిల్స్
కంటే ముందు ప్రారంభించి, టైటిల్స్ లో కూడా చూపించుకొచ్చిన విలన్- అతగాడి బామ్మర్దుల భారీ బిల్డప్ అంతాకూడా ఆ తర్వాత ఏమైపోయిందో ఐపుండదు. వాళ్ళ ఆగడాలు హీరో
ఇంటిదాకా రాకుండానే ఊరవతల ఉన్నట్టుండి కుక్క చావు చస్తాడు విలన్ అనేవాడు ఇంకెవరి
చేతిలోనో!
So what? వాడి గురించి ఆడియెన్స్ ఎందుకు పట్టించుకోవాలి? వాడు ఛస్తే సానుభూతి ఎలా
పుడుతుంది? వాడి చేతిలో హీరో సంబంధీకులెవరైనా ఛస్తే సానుభూతి ఏర్పడుతుందేమో?
ఇలా
మధుసూదనరావు పోషించిన ఘనతవహించిన విలన్ పాత్ర గల్లంతై పోయింది ఇంకా ఫస్టాఫ్ పూర్తి
కాకుండానే. రాముడు అరణ్యవాసానికి బయల్దేరక ముందే రావణుడు హరీ మంటే ఎలావుంటుందో
అలాగ.
ఇంకా
చాలా పక్క పాత్రలున్నాయి- ఈ పాత్రధారుల వేషభాషలెలా వుంటాయంటే, హీరో కుటుంబ సభ్యులూ
స్నేహితులూ సహా - చింపిరి జుట్లూ గడ్డాలూ పెంచుకుని, లుంగీలు కట్టుకుని, అనాగారికులుగా
కన్పిస్తూ చాలా చిరాకైన విజువల్స్ కి దోహదం చేస్తారు. కెమెరా మాన్ ఎంత
ప్రయత్నించినా ఈ సినిమాకి విజువల్ అప్పీల్ అనేది సాధ్యం కాలేదు. బస్తీలో అమెరికా హీరో
కొంప కూడా చీకటి కూపంలా వుంటుంది. పోనీ ఈ పాత్రలూ, నేపధ్య వాతావరణమూ మత్స్య కారుల
జీవన శైలియే అని చెప్పినా ఓ అందం. ఆ భారీ
బిల్డప్ తో మత్స్య కారుల గొడవ టైటిల్స్ పూర్తయ్యేలోపే ముగిసిపోయింది. ఇప్పుడున్నవి మత్ష్య కారుల పాత్రలూ కాదు, ఆ నేపధ్య వాతావరణమూ
కాదు. సినిమా ఎత్తుగడకీ తర్వాత నడుస్తున్న దానికీ సంబంధమే లేదు. ఇదీ ‘కథకళి’. ఇక ఆ
సంగీత బాణీలేమిటో తమిళులకే తలకెక్కాలి.
చివరికేమిటి?
మిత్రుడికి జరిగిన నిజ కథ అన్నాక దీన్ని నిజ కథలాగే తీశారు. నిజ జీవితంలో ఆ మిత్రుడు బాధితుడే
కావొచ్చు. కానీ సినిమా అన్నాక నిజ
జీవితంలా వుండదుగా, వుంటే ఆర్ట్ సినిమా అవుతుంది. కమర్షియల్ సినిమా నిర్వచనమే larger–than–life heroes
broadly : extraordinary అయినప్పుడు,
ఈ బాక్సాఫీసు సూత్రాన్ని హాలీవుడ్
పట్టుకున్నంతగా మరెవరూ పట్టుకోలేకపోతున్నారు. మనదగ్గర బాక్సాఫీసుకి
పనికిరాని బకరా సినిమాలతోనే ఇంకా నకరాలు
చేస్తున్నారు.
హీరో పాత్ర సృష్టి దగ్గరే చూస్తే, ఎన్నారై అన్నారే
గానీ ఆ ఎన్నారై లక్షణాలు డ్రెసింగ్ సహా ఎందులోనూ కనపడవు. అంటే నిజజీవితంలో తన
మిత్రుడు కామన్ మాన్ అయ్యుండొచ్చు- ఆ ధోరణిలోనే చూపిస్తూ, సృష్టించిన ఎన్నారై బ్యాక్ గ్రౌండ్ ని పూర్తిగా మర్చిపోయినట్టున్నాడు.
మొదటి
45 నిమిషాలూ ఈ హీరో ప్రేమ కథ ఫ్లాష్ బ్యాకులుగా వస్తుంది. నాల్గేళ్ళ క్రితం అతను
ఎన్నారై కాదు సరేగానీ, హీరోయిన్ తో ఆ ప్రేమ కథకూడా చైల్డిష్ గా వుంటుంది. పాత
రొటీన్ లో, పరస్పరం చూసుకోకుండా సెల్ ఫోన్ ప్రేమగా ప్రారంభించి, చూసుకున్నాక
వికటించి, కండోమ్స్ ఎపిసోడ్ తో తిరిగి అతుకుపడే ఈ పాతకాలపు ప్రేమ టైం వేస్టే
నిజానికి. అప్పుడు వస్తుంది మలుపు- ముఠా నాయకుడి మర్డర్ తో. ఇప్పుడు హీరో ఎన్నారై
స్టేటస్ తో వున్నాడు.
ఇందులో
ఇరుక్కున్న ఎన్నారై హీరో, ఎవరో ఎస్సై పిలిస్తే వెంటనే బస్సులో కాకినాడ బయల్దేరి
వెళ్ళే సీన్లు మొదలవుతాయి. అది వర్షం
కురుస్తున్న రాత్రి. ఆ వర్షంలో బయల్దేరి వెళ్తూనే ఉంటాడు...వెళ్తూనే ఉంటాడు...మధ్య
మధ్యలో ఎస్సై నుంచీ, కుటుంబ సభ్యుల నుంచీ, హీరోయిన్ నుంచీ చీటికి మాటికీ ఒకటే ఫోన్లు- ఇంటర్వెల్ పడినా
ఇంకా ప్రయాణిస్తూనే ఉంటాడు. ఇంటర్వెల్ తర్వాతా ప్రయాణిస్తూనే ఉంటాడు...మళ్ళీ అవే
ఫోన్లు...ఇంకెప్పుడు చేరుకుంటావనీ....ఇప్పుడు ముడి ఫిలింతో తీయడం లేదు కాబట్టి ఎంత
నిడివి తీసినా పోయేదేం లేదనీ... అసలు దర్శకుడి ఉద్దేశంలో ఖర్మకాలి కాకినాడ ఏ
ఆఫ్రికా ఖండంలో వుందోగానీ, ఈ బస్సు కూడా వదిలేసి
హీరోని పడవెక్కించేసేట్టున్నాడు!
ఇలా ఇంటర్వెల్ కి ముందు, తర్వాతా ముప్ఫై
నిమిషాలకి పైగా ఈ డొక్కు బస్సు
ప్రయాణంతోనే సరిపోతుంది! ఒకసారి శివాజీ గణేశన్ - తెడ్డు వేసుకుని పడవ నడుపుతూనే ఉంటాడు...నడుపుతూనే
ఉంటాడు...ఇంకా నడుపుకు పోతూనే ఉంటాడు...ఆ పడవ నడపడం పూర్తయ్యేసరికి సినిమా కూడా అయిపోతుంది, అదే
ఆర్ట్ సినిమా! – అని సెటైర్ వేయడం నిజ్జంగా నిజమని ‘కథకళి’ బస్సు ప్రయాణమే సాక్ష్యం. ‘కథకళి’ ఆర్ట్ సినిమా
అనడానికి ఇంతకంటే ఏంకావాలి.
హమ్మయ్యా అని కాకినాడ చేరాక ఎస్సై కుట్ర. అసలు హీరో అనే
వాడికి- అందునా ఎన్నారైకి- తను చెయ్యని నేరానికి, పైగా రేపో మాపో పెళ్లి వున్న
వాడికి, అంత బేల తనమేమిటో అర్ధంగాదు. తన గురించి స్నేహితుడు ఎస్సైకి అలా చెప్తే ఆ
స్నేహితుణ్ణి పట్టుకుని నాల్గు పీకకుండా, కాశీకి ప్రయాణం పెట్టుకున్నట్టు రాత్రంతా
కాకినాడ జర్నీ ఏమిటి? ఆ జర్నీ కూడా ఇక్కడ బస్సెక్కితే అక్కడ దిగకుండా, అరగంట
స్క్రీన్ టైము తినేసే ఫోన్ కాల్స్ తో హనీమూన్ ఏమిటి? అనవసర ఏడ్పులేమిటి? ఫ్యామిలీ
కష్టాలు చూపిస్తూ బాధలేమిటి? ఫ్రెండ్ షిప్ లో ద్రోహాల గోలేమిటి? పోలీసుల
రాజకీయాలేమిటి? ఎన్నని పాయింట్లు స్పృశించాడు దర్శకుడు- ఈ సంకర జానర్ కథకైనా అడ్డంకి అయిన ప్రతీ ఎమోషన్ నీ పెట్టేసుకుంటూ- ఉండాల్సిన అసలు ఎమోషన్ నే మర్చిపోయాడు...తను ఇరుక్కున్న సమస్యతో
హీరోకుండాల్సిన ఎమోషన్! దీనికి విరుద్ధంగా ఆ బేలతనపు ఎమోషన్ విలోమంగా ఏడ్పులతోనే
సరిపోయింది. చివరి పది నిమిషాల వరకూ ఈ హీరో అనేవాడు యాక్టివేట్ అయ్యే సమస్యే లేదు ఎవరేం చెప్పినా.
చనిపోయిన
ముఠానాయకుడి పట్లా మనకి ఎమోషన్ లేదు, హీరో పట్లా ఎమోషన్ పుట్టడం లేదు- మరి ఎట్లా?
ఇదంతా
చూస్తూంటే, 1974 నాటి ఒక హిందీ సినిమా గుర్తుకు రావడం మొదలైంది. అది అమితాబ్ బచ్చన్ – పర్వీన్ బాబీ- ప్రాణ్ లు కలిసి
నటించిన సూపర్ హిట్ మ్యూజికల్ క్రైం థ్రిల్లర్ ‘మజ్బూర్’ (నిస్సహాయుడు). రవి టాండన్ దర్శకత్వంలో సలీం-
జావేద్ లు రచన చేసిన ఈ థ్రిల్లర్ మూస
సీన్లతో ఈ జానర్ లో ఇమడని సెంటిమెంట్లూ ఏడ్పులతో కాకుండా, క్యారక్టర్ పట్ల సీదాసాదా
పాయింట్ డ్రైవెన్ ఎమోషన్ తో ఎంత క్లాస్ గా వుంటుందో, యూ ట్యూబ్ లో విరివిగా దొరికే ఈ మూవీని ఎవరైనా చూస్తే
తెలుస్తుంది.
ఒక
ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే అమితాబ్ ఓ వర్షపురాత్రి కస్టమర్ రెహ్మాన్ని కారులో లిఫ్ట్ అడిగి ఇంటికి
వెళ్ళాల్సి వస్తుంది. మర్నాడు పోలీసుల నుంచి కాల్ వస్తుంది- రెహ్మాన్ కిడ్నాప్ అయ్యాడనీ,
అతడి కార్లో అమితాబ్ ప్రయాణించాడనీ. అమితాబ్
వెళ్లి తన స్టేట్ మెంట్ ఇచ్చి వస్తాడు. కొంత కాలం తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది- రెహ్మాన్
డెడ్ బాడీ దొరికిందనీ, ఇప్పుడు అమితాబ్
అనుమానితుడనీ. ఆందోళనకి గురయిన అమితాబ్ కి తలపోటు వచ్చేస్తుంది. పరీక్ష
చేయించుకుంటే బ్రెయిన్ ట్యూమర్ అని తెలుస్తుంది. ఆర్నెల్లకంటే బతకడు. ఓ తల్లీ,
వీల్ చైర్ కి పరిమితమైన చెల్లీ, ఓ తమ్ముడూ వుంటారు అమితాబ్ కి. మరో పక్క ప్రేమించిన పర్వీన్ బాబీ వుంటుంది. ఒక
ప్లానేస్తాడు అమితాబ్. ఆర్నెలల్లో ఎలాగూ
తను చనిపోతాడు గనుక, చనిపోయాక తన కుటుంబం వీధిన పడకుండా వుండాలంటే, రహస్య హంతకుడు ఆఫర్ చేస్తున్న ఐదులక్షలు
తీసుకుని, హత్యానేరం తన మీదేసుకుందుకు సిద్ధమవుతాడు. ఆ ప్రకారం పోలీసులకి
సాక్ష్యాధారాలు వదిలి అరెస్ట్ అవుతాడు.
కానీ
జైల్లో వుండగా మళ్ళీ బ్రెయిన్ ఎటాక్ రావడంతో ఆపరేషన్ చేయిస్తారు పోలీసులు. ఇప్పుడు
తనకి ప్రాణాపాయం తప్పుతుంది - కానీ ఉరి శిక్ష పడుతుంది హత్యానేరానికి! దీంతో దీనమ్మ జీవితమనుకుని పారిపోయి, అసలు హంతకుడి వేటలో పడతాడు తను నిర్దోషి అని
నిరూపించుకోవడానికి!
ఇక్కడ
గమనించాల్సిందేమిటంటే, హత్యకి గురైన వాడు ఒక బిజినెస్ మాన్, కథలో విలన్ కాదు. ఈ
హత్య ఎవరు చేశారు..ఎవరు చేశారూ అని అనుమానితుల్ని తెగ చూపించేస్తూ ఆడుకునే (దర్శకుడు తన శాడిజం తీర్చుకునే)
ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ చేయలేదు దీన్ని. చేస్తూ మళ్ళీ దీనికి- హత్యలో
ఇరుక్కున్న హీరో బయటపడే యాక్షన్ ఓరియెంటెడ్ కిచిడీ చేయలేదు దీన్ని. కేవలం కావాలని
హత్యలో ఇరుక్కుని ఆ తర్వాత బయటపడే హీరో ప్రయత్నాల యాక్షన్ ఓరియెంటెడ్ క్రైం
థ్రిల్లర్ కథగానే మల్చారు. ఏకసూత్రతతో జానర్ మర్యాదని పాటించడం కన్పిస్తుంది.
హంతకుడెవరూ
- అన్న మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ ప్రధానమైన కథ కాదు కాబట్టే- హంతకుడెవరూ అన్న సిల్లీ ప్రశ్నతో ఈ కథ బాధించదు. కేసులోంచి హీరో
ఎలా బయట పడతాడన్న హీరో సైడు పాయింటే ప్రథానమిక్కడ. సినిమా కథంటే హీరో కథే కాబట్టి.
హత్యకి గురయిన వాడు విలన్ కూడా కాదు, విలన్ తెర వెనుక వున్నాడు. హత్యకి గురయ్యింది
ఒక సహాయ పాత్ర. కాబట్టి ఈ పాత్రతో మనకి సానుభూతి కూడా ఉండనవసరం లేదు- సానుభూతీ,
ఎమోషన్ అన్నీ నిస్సహాయ స్థితిలో నిర్ణయాలు తీసుకున్న హీరో కే దోచిపెట్టారు ఈ కథలో.
ఈ సినిమా కథ హీరోదే కాబట్టి.
సినిమా
ఆర్టు గురించి శాస్త్రీయంగా ఎన్ని సూత్రాలు
చెప్పినా ఒప్పుకోని వాళ్ళుండొచ్చు.
అలాంటప్పుడు కళ్ళముందు అలాటి కథతో కూడిన ఓ విజయవంతమైన సినిమాని చూపెట్టి వివరిస్తే, సూత్రాల శాస్త్రీయత బాగా అర్ధమవుతుంది. క్రైం
థ్రిల్లర్ - మర్డర్ మిస్టరీ అనే విజాతి
జానర్లని సంకరం చేస్తే ఏమౌతుందో ‘కథకళి’ చెప్తుంది. క్రైం థ్రిల్లర్ జానర్ ని
కల్తీ చేయకుండా వుంటే ఎలావుంటుందో ‘మజ్బూర్’ తెలియ జెప్తుంది.
ఇది
సలీం –జావేద్ ల సొంతకథ కూడా కాదు. ‘జిగ్ జాగ్’ అనే హాలీవుడ్ హిట్ నుంచి సంగ్రహించి
రెగ్యులర్ మసాలా సినిమా దినుసులేయకుండా, జానర్ మర్యాదని కాపాడుతూ, ఒరిజినల్లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కే ప్రాణం పోశారు.
హాలీవుడ్
సినిమాల్ని చూడ్డం కాదు, ఏది ఎందుకుందో చదవడం నేర్చుకోవాలి.