రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, August 16, 2015

అన్నదమ్ముల ఆక్రందన!



దర్శకత్వం : కరణ్ మల్హోత్రా
తారాగణం : అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాక్విలిన్ ఫెర్నాండెజ్, జాకీ ష్రాఫ్, షెఫాలీ షా, కిరణ్ కుమార్, ఆశుతోష్ రాణా, రాజ్ జుష్టీ తదితరులు
సంగీతం : అతుల్- అజయ్,  ఛాయాగ్రహణం :  హేమంత్ చతుర్వేది
కథ :  గెవిన్ ఓ కానర్, క్లిఫ్ డార్ఫ్ మన్,  అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : ఏక్తా పాఠక్ మల్హోత్రా, 
మాటలు : సిద్ధార్థ్ - గరిమ
బ్యానర్ : ధర్మా ప్రొడక్షన్స్, లయన్స్ గేట్ ఫిలిమ్స్, ఎండెమాల్ ఇండియా
నిర్మాతలు :  కరణ్ జోహార్, హిరూ యాష్ జోహార్, ఎండెమాల్ ఇండియా
విడుదల : 14  ఆగస్ట్, 2015
*
          హాలీవుడ్ సంస్థలు బాలీవుడ్ లోకి ప్రవేశించి వ్యాపారాలు మొదలెట్టుకోవడంతో అంతవరకూ హాలీవుడ్ సినిమాల్ని యదేచ్ఛగా కాపీ కొట్టుకునే హస్తకళకి బాలీవుడ్ లో తీవ్రసంక్షోభం ఎదురైంది. ఏమంటే కాపీ కొట్టిన బాలీవుడ్  నిర్మాణ సంస్థలకి భారీ మొత్తాలకి తాఖీదు లందుతున్నాయి. దీంతో న్యాయమైన హక్కులు కొనుక్కుని అధికారికంగా రీమేక్ చేసుకోవాలన్న జ్ఞాన సంపద సముపార్జించుకుంది బాలీవుడ్. ఈ విజ్ఞతతో ఈ వారం విడుదలైన  ‘బ్రదర్స్’ ని హాలీవుడ్ ‘వారియర్’ కి అధికారిక రీమేక్ అంటూ సగర్వంగా ప్రచారం చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రచారంతో ఇన్నాళ్ళూ హిందీలో చేస్తున్నది అనధికారిక ఫ్రీమేకులే అని రట్టు చేసుకున్నట్లయ్యింది.

         ధికారిక రీమేక్ అయినంత మాత్రాన ఏంతో  గొప్పగా ఉంటుందని అనుకోనవసరం లేదు. అధికారంగా రీమేక్ చేసినా, అనధికారికంగా ఫ్రీ మేక్ చేసినా రెండూ ఒకే క్వాలిటీతో వుండడం బాలీవుడ్ ప్రత్యేకత. ఈ క్వాలిటీకి సహజంగానే హాహాకారాలు చేస్తారు ప్రేక్షకులు.
          ‘వారియర్’ కి అంతర్జాతీయంగా అన్నీ ప్రశంసలే వస్తే, ‘బ్రదర్స్’ కి విమర్శలు రావడం ఎందుకంటే, ఈ అధికారిక రీమేక్ కాస్తా అలవాటైపోయిన  ‘ద్విమేక్’ గా మారిపోవడం వల్ల. దీని దర్శకుడు కరణ్ మల్హోత్రా కిది రెండో సినిమా. తొలిసినిమా ‘అగ్నిపథ్’ ఎంత పాత పంథాలో తీశాడో, అదే పాత పంథా ‘బ్రదర్స్’ లోనూ తొంగి చూడడంతో వచ్చింది సమస్య. దేశీయ ప్రేక్షకుల్ని రంజింప జేయడానికి సగం పాత ఫార్ములాకి కేటాయించి, మిగతా సగం ‘వారియర్’ అయిడియాకి వదిలేశాడు దర్శకుడు. ఇందుకే ఇది ద్విమేక్ అయింది.
          అయితే.. అయితే.. ‘వారియర్’  ఐడియా సెంటిమెంట్ల పరంగా, భావోద్వేగాల పరంగా ఒక స్థాయిలో ఉండిపోతే, వాటిని ఆకాశమార్గం పట్టించి ప్రేక్షకుల్ని కన్నీళ్ళలో ముంచడంలో విజయం సాధించాడు దర్శకుడు. ఇప్పటికే ఈ పని ‘భజరంగీ భాయ్ జాన్’ విజయవంతంగా చేస్తే, ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు ‘బ్రదర్స్’ దర్శకుడు. 
          మెలోడ్రామాని ఆకాశాన్నంటించడంలో ఇండియన్లు సిద్ధ హస్తులు కదా- ఈ విషయంలో దిగదుడుపే హాలీవుడ్!

అన్నదమ్ముల ప్రస్థానం!
      డేవిడ్ ( అక్షయ్ కుమార్), మాంటీ ( సిద్ధార్థ్ మల్హోత్రా) లు అన్నదమ్ములు. వీళ్ళ తండ్రి ఫెర్నాండెజ్ ( జాకీ ష్రాఫ్) మద్యం బానిస, ముంబాయిలో స్ట్రీట్ ఫైట్లు  చేసి సంపాదిస్తాడు. మాంటీ  ఇతను ఉంచుకున్నామె కొడుకు. ఆమె చనిపోయింది. దీంతో మాంటీని తెచ్చి ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఇతడి భార్య మరియా ( షెఫాలీ షా) మాంటీ తో అడ్జెస్ట్ అవడానికి ప్రయత్నిస్తూంటుంది. వాడికి బర్త్ డే లు కూడా జరుపుతుంది. పెద్దకొడుకు డేవిడ్ తండ్రి చేస్తున్న తప్పులకి  ద్వేషించినా, మాంటీ ని ప్రేమిస్తూనే ఉంటాడు. మరో పక్క తల్లికి సపోర్టుగా ఉంటాడు. తాగిన మత్తులో నైనా తండ్రి ఉంచుకున్నామె పేరెత్తితే తల్లి సహించదు. ఇలా ఒకసారి గొడవ జరిగి ప్రమాదవశాత్తూ తల్లి చనిపోతుంది. తండ్రి జైలు కెళ్తాడు. అప్పుడు డేవిడ్ కి మాంటీ మీద ప్రేమ నశిస్తుంది. తన తల్లి మరణానికి మూలకారకుడు వీడే నని ద్వేషంతో దూరమైపోతాడు. చిన్నతనంలో తనని ఇలా వదిలేసినందుకు మాంటీ కూడా ద్వేషం పెంచుకుంటాడు. ఇద్దరూ విడిపోతారు.

          ఓ ఇరయై ఏళ్ళకి విడుదలై వస్తాడు ఫెర్నాండెజ్. ఎదిగిన మాంటీ ఇంటిదగ్గరే ఉంటాడు. ఇప్పుడు మద్యం జోలికి వెళ్ళని ఫెర్నాండెజ్ తను చంపుకున్న భార్య ని తల్చుకుని హిస్టీరికల్ గా మారిపోతాడు. మాంటీ అతడికి నచ్చ జెప్తూంటాడు.

          ఎక్కడో డేవిడ్ టీచర్  ఉద్యోగం చేస్తూంటాడు. భార్యా ( జాక్విలిన్ ఫెర్నాండెజ్ ), ఓ కూతురూ వుంటారు. కూతురు తీవ్ర వ్యాధితో వుంటుంది. వైద్యానికి చాలా డబ్బు కావాలి. ఆ డబ్బుల కోసం రాత్రి పూట స్ట్రీట్ ఫైట్లు చేస్తూంటాడు డేవిడ్. ఇది స్కూలు యాజమాన్యానికి నచ్చక ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఇక ఫుల్ టైం ఫైటర్ గా మారిపోవడానికి ముస్తఫా ( ఆశుతోష్ రాణా) అనే రింగ్ లీడర్ ని ఆశ్రయిస్తాడు.

          అటు ఫెర్నాండెజ్ కూడా మాంటీ తో ఇదే పనిచేస్తూంటాడు. మాంటీ ని ఫైటర్ గా తీర్చి దిద్దుతాడు. అన్నదమ్ములు వేర్వేరు ఫైట్లలో పాల్గొని గెలుస్తూంటారు. 

          ఇలా వుండగా ముంబాయిలో అంతర్జాతీయ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎం ఎం ఏ) పోటీలని
నిర్వహించబోతున్నట్టు పీటర్ బ్రిగాంజా ( కిరణ్ కుమార్) అనే ఏజెంట్ ప్రకటిస్తాడు. ఇండియన్ ఫైటర్స్ వర్సెస్ ఇంటర్నేషనల్ ఫైటర్స్ గా ఈ టోర్నమెంట్ వుంటుంది. దీంతో అన్నదమ్ములు ఆ పోటీలకి కఠోర శిక్షణ పొందుతారు. ఒకరికి తెలీకుండా ఒకరు ఈ పోటీలకి హాజరవుతారు. మాంటీ ని ప్రోత్సహిస్తున్న తండ్రి ఫెర్నాండెజ్ స్టేడియంలో డేవిడ్ ని చూసి ఇబ్బందిలో పడతాడు. అన్నదమ్ములు విడివిడిగా అంతర్జాతీయ ఫైటర్స్ ని ఓడించుకు వస్తూ ఫైనల్స్ లో తామిద్దరే మిగులుతారు. దీంతో ఫెర్నాండెజ్ మరీ దిక్కుతోచని స్థితిలో పడతాడు-ఇప్పుడు ఏ  కొడుకుని ప్రోత్సహించాలి? కొడుకులిద్దరూ గెలుపుకోసం కొట్టు కుంటూంటే ఎలా చూడాలి ? ఎవరూ తగ్గే ప్రసక్తే లేదు. ప్రాణ శత్రువుల్లా తయారయ్యారు. ఈ ఈవెంట్ లో వున్న ఇంకో ప్రమాదమేమిటంటే, ఒక ఫైటర్  చేతిలో మరొక ఫైటర్ చనిపోతే అరెస్ట్ వుండదు. ఇప్పటికే నంబర్ వన్ ఫైటర్ నంటూ విర్రవీగిన లూకా అనే అంతర్జాతీయ ఫైటర్, మాంటీ ఇచ్చుకున్న ఒకే ఒక్క పంచ్ కి ప్రాణాలు కోల్పోయాడు..


          ఇదీ విషయం. డేవిడ్ కి మాంటీ అన్నా, తండ్రి అన్నా ఇంకా చావని కసి. పైగా కూతురి వైద్యానికి అదృష్టంగా కలిసివచ్చిన తొమ్మిది కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కోసం దేనికైనా తెగించేందుకు సిద్ధంగా వున్నాడు. మాంటీ కూడా ఏం తీసిపోలేదు. డేవిడ్ మీద ఇన్నేళ్ళకీ పగ చల్లారలేదు. పైగా మెరుపు దాడితో క్షణాల్లో ప్రత్యర్ధిని ఎలా మట్టి కరిపిస్తాడో ఈవెంట్ లో ఎస్టాబ్లిష్ అయింది. వయసులోకూడా తను యంగ్. వయసు రీత్యా శారీరకంగానూ, కూతురి సమస్యతో  మానసికంగానూ కుంగిన డేవిడ్ తనకే మాత్రం పోటీ కాదు!

          ఒక మధుర జ్ఞాపకాల బాల్యాన్ని కలిసి పంచుకున్న అన్నదమ్ములిద్దరూ ఇలా ఈ స్థితికి చేరుకున్నారు..

ఎవరెలా చేశారు
            ఒరిజినల్లో జోల్ ఎడ్గెర్టన్ పోషించిన పాత్రని అక్షయ్ కుమార్, టామ్ హార్డీ పోషించిన పాత్రని సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. ఒరిజినల్లోని తండ్రి పాత్ర నటించిన నిక్ నోల్ట్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయి వార్తల కెక్కాడు. ఈ పాత్రని హిందీ లో జాకీ ష్రాఫ్ పోషించినప్పుడు పాత్రచిత్రణే అతడికి అన్యాయం చేసింది.  
          ఒరిజినల్లో  నిక్ నోల్ట్  నటించిన పాత్ర చిత్రణ నీటుగా వుంటుంది. అతను గతంలో మద్యం బానిస అని మాటల్లో బయట పడుతుందే తప్ప ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమీ వుండదు. ప్రస్తుత కథలో పెద్ద కొడుకుతో సంబంధాలు కలుపుకోవడానికి ప్రయత్నిస్తూంటాడు. జాకీష్రాఫ్  పాత్రని గతంలో మద్యం బానిసగా చూపడంతో బాటు, ప్రస్తుత కథలో గతించిన భార్య గురించిన అరుపులతో హిస్టీరికల్ గా మార్చడం తో అంతా అభాసు అయ్యింది. ఫస్టాఫ్ అంతా ఇదే వరస. సెకండాఫ్ లో పెద్ద కొడుకు ప్రత్యర్ధిని పడగొట్టినప్పుడు అప్రయత్నంగా ప్రశంసించి మొహం దాచుకున్నప్పుడు -ఆ ఒక్క సీనులో జాకీ ష్రాఫ్ కదిలిస్తాడు. కారణం, ఇంతసేపటికి ఈ సీనులో ఆ పాత్ర అపరాధభావం బయటపడింది. దీన్ని మర్చిపోలేని ఎక్స్ ప్రెషన్ తో ప్రదర్శించాడు జాకీ ష్రాఫ్.


          ఎప్పుడో తన చేతిలో మరణించిన భార్య గురించిన  గోడు కంటే (భార్య చావుకి  శిక్ష కూడా అనుభవించాక అది ముగిసిన అధ్యాయమే)  తన కారణంగా కొడుకు లిద్దరూ విరోధులయ్యారన్న అపరాధభావం తో సతమతమయ్యే పాత్రగా దీన్ని తీర్చిదిద్ది వుంటే - అప్పుడా పాత్రలో జాకీ బెస్టుగా వుండే వాడు. కథ అన్నదమ్ముల మధ్య విరోధం గురించి అయినప్పుడు దానికి కారకుడైన వాడు ఇంకేదో సమస్యతో బాధపడ్డం పాత్రౌచిత్యం అన్పించుకోదు. ఇప్పుడు తన కళ్ళ ముందున్న సమస్య గురించి బాధపడినప్పుడు మాత్రమే పాత్ర కథతో కనెక్ట్ అయినట్టు లెక్క. ఒరిజినల్లో ఇలాగే చిత్రించారు.

          అక్షయ్ కుమార్ పాత్రని కూడా ఒరిజినల్ కి విరుద్ధంగా మొదటినుంచీ విషాదంగానే  మార్చారు. ఒరిజినల్లో ఈ పాత్ర ఎంత కూతురి ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ అదేపనిగా బాధపడుతూ వుండదు. సమస్యపట్ల ప్రాక్టికల్ గా, యాక్టివ్ గా వుంటుంది. అక్షయ్ కుమార్ ఇమేజి దృష్ట్యా అయినా ప్రేక్షకులాశించే దూకుడు తనం ఈ పాత్ర కుండాల్సింది. నెరిసిన గడ్డంతో వయసు మీద పడ్డవాడిలా అదే భారమైన గెటప్ తో సినిమా సాంతం చూపించారు. తండ్రి జైలు నుంచి విడుదలై వచ్చేటప్పటికి అతను నడివయసులో వుండే అవకాశం లేదు. తండ్రి జైలు కెళ్ళే టప్పటికి తనకి పట్టుమని పదిహేనేళ్ళు కూడా లేవు.

          నడివయసులో వున్న వ్యక్తి  చేయకూడని స్ట్రగుల్ ( ఫైటర్ గా) చేస్తున్నాడని చూపించడంలో సానుభూతి ఉంటుందని భావించారేమో తెలీదు- వయసు మీద పడ్డ వాడిలా అతను ను ఫైట్ చేస్తూంటే మాత్రం చూడ్డానికేం బాగా లేడు. అసలు ఒక సామాన్య టీచర్ అత్యవసరమైన డబ్బుకోసం ఫైటర్ గా మారడంలోనే బోలెడు సానుభూతి వుంది. ఈ క్యారక్టర్ ఆర్కే  అర్ధవంతంగా వుంటుంది.

          ఎక్కడ అక్షయ్ బావున్నాడంటే- ఆ ఫైట్ కాస్తా తమ్ముడితో చేయాల్సి వచ్చినప్పుడు- క్లయిమాక్స్ లో మాత్రమే. అక్కడ సెంటిమెంట్ల వల్ల, భావోద్వేగాల వల్ల అతడికా లుక్ వున్నా సరిపోయింది. ఎంత వైరమున్నా ఫైట్ పేరుతో సొంత తమ్ముణ్ణే చావచితకదన్నడం ఏ అన్నకీ రాకూడని పరిస్థితి. ఈ మోరల్ డైలమా ని అత్యుత్తమంగా ప్రదర్శించాడు అక్షయ్ తమ్ముడితో ఫైట్ చేయలేకపోతూ. ఒక పక్క కూతురి వైద్యం - మరో పక్క తమ్ముడి ప్రాణం. ఒరే ఇక  చాలించరా- అని డస్సిపోయి కూడా తిరగబడుతున్న తమ్ముణ్ణి ప్రాధేయపడాల్సిన పరిస్థితి.

          తమ్ముడి పాత్రలో సిద్ధార్థ్  మల్హోత్రా ఈ సినిమాకి ఎస్సెట్. ఈ పాత్రచిత్రణ లో కూడా ఒక లోపం వుంది. ఐతే అతను ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు. సినిమా సాంతం ఒకే చూపు చూస్తాడు. అమాయకంగా వుండే ఆ చూపులోనే ఈ ప్రపంచం సంగతి నాకు తెలుసులే అన్న ధిక్కారం వుంటుంది. స్కూల్లో చదివేటప్పుడు తోటి పిల్లలు అతణ్ణి బాస్టర్డ్ అన్నారు. ఆ మూలల్లోంచి అతను అలా ఉంటాడు. బాస్టర్డ్ కాదని తెలియాలనేమో తండ్రిని అంటి పెట్టుకుని ఉంటాడు. రింగ్ లో అంతర్జాతీయ ఘనాపాటీని రావడం రావడం ఒక్క పంచ్ తో నేలకరిపించేసరికి  స్టేడియం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయినా నిర్లిప్తంగా చూస్తూంటాడు. చాలా క్రేజీ లుక్ అది.

          ఈ ఘట్టంలో లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట చరణం ఇలా వుంటుంది..
హర్ డర్ కా హటా దే కొహ్రా 
తాఖత్ తూ బాన్ మొహ్రా 
హర్ లక్ష్యా కో భేడ్ కే దిఖ్లా దే 
అర్జున్ కి కహానీ దొహ్రా..

(భయమనే పొగ మంచుని తొలగించుకుని శక్తి శాలియైన సైనికుడివి కా,
ఏర్పరచుకున్న లక్ష్యాలన్నీ సాధించి అర్జునుడి కథ పునరావృతం చెయ్!)

***
      ఒరిజినల్లో ఈ తమ్ముడి పాత్రకి ఒక ఫ్లాష్ బ్యాక్ వుంటుంది- ఇరాక్ యుద్ధంలో పాల్గొని వచ్చినట్టు. ఇప్పుడు ఈ ఫైట్ గెలిస్తే,  ఆ ప్రైజ్ మనీ ఐదు మిలియన్ డాలర్లని ఇరాక్ యుద్దంలో చనిపోయిన అమెరికన్ సైనికుల కుటుంబాలకి అందజేస్తానని ఉదారంగా ప్రకటిస్తాడు. హిందీ రీమేక్ లో ఈ బ్యాకప్ లేదు. ఉన్నదల్లా చిన్ననాటి బాధాకరమైన ఫ్లాష్ బ్యాకే. ఈ ఫ్లాష్ బ్యాక్ వల్ల పాత్రకి డెప్త్ ఐతే వచ్చింది గానీ, ఫైట్ లో పాల్గొనేందుకు అతడికి ఉన్నతాదర్శం ఏదీ లేదు. అన్న మీద కోపంతో తనూ ఫైట్ కి వెళ్తున్నాడనుకోవడానికి అన్న కూడా పాల్గొంటున్నాడని అప్పటికింకా అతడికే తెలీదు. అంటే కేవలం ఆ ప్రైజ్ మనీ తొమ్మిది కోట్ల రూపాయమీద కన్నేసి ఫైట్ కి సిద్ధమ య్యాడా? ఆ డబ్బుతో తను రిచ్ అయిపోవాలనా? ఈ దృష్ట్యా స్వార్ధపూరితమైన పాత్రని పై పాట ద్వారా అర్జునుడంటూ గొప్పగా ఎలివేట్ చేయడంలో అర్ధమే లేదు.

          అన్న పాత్ర భార్యగా జాక్విలిన్ ఫెర్నాండెజ్ ది పెద్దగా స్కోపు లేని పాత్ర. మొదట కూతురి అనారోగ్యంతో ఆందోళన చెందుతూ, తర్వాత ఈవెంట్ లో భర్త ఒక్కొక్కడ్ని ఓడిస్తూంటే ఆనందంతో ఎగిరి గంతులేసే పాత్రగా ఉండిపోయింది. అలాగే అన్నదమ్ముల తల్లిపాత్రలో షేఫాలీ షా- ఒక పక్క భర్త దాష్టీకంతో, మరో పక్క అతడి అక్రమ సంతానం సంక్షేమ బాధ్యతతో నలిగిపోయే పాత్రగా కన్పిస్తుంది.    

          ఇక ఇతరపాత్రల్లో కిరణ్ కుమార్, ఆశుతోష్ రాణా, రాజ్ జుట్షీ లు చాలా పాత సహాయ నటులే. పాత టేస్టున్న యువ దర్శకుడికి ఈ తెరమరుగైన పాత నటులే గుర్తుకురావడంలో ఆశ్చర్యం లేదు.


          సంగీతం, ఛాయాగ్రహణం, యాక్షన్ కోరియోగ్రఫీ ఉన్నతంగా వున్న ఈ యాక్షన్ డ్రామా కి మెగా స్టేడియం లో భారీ ఎత్తున జరిపిన ఈవెంట్ చిత్రీకరణ దాదాపు  సెకండాఫ్ అంతా ఆక్రమిస్తుంది. ‘లగాన్’ లో గంట పాటు ఎలాగైతే పాత్రల మధ్య క్రికెట్ చూపిస్తారో- అలా గంటకి పైగా రెండ్రోజుల ఎంఎంఏ ఈవెంట్ ని చూపించాడు దర్శకుడు. 

          ఫస్టాఫ్ లో ప్రేక్షకుల్ని చాలా కఠినంగా శిక్షించిన దర్శకుడు, సెకండాఫ్ లో దానికి పరిహారం చెల్లించాడు. బలమైన క్లయిమాక్స్ తో ఇక ప్రేక్షకులు మారు మాటాడకుండా చేశాడు.

స్క్రీన్ ప్లే సంగతులు
       ‘రెండు పాత్రల మధ్య పద్నాల్గేళ్ళ  ఎడబాటు వుందని చెప్తున్నప్పుడు, ఆ ఎడబాటు గురించి చాలా కథ చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్కోసారి ఆ గతం గురించి ఒక పాత్ర ఆ రెండో పాత్రతో మాట్లాడుతున్నప్పుడు- రెండో పాత్రకీ ఆ గతం తెలుసు గాబట్టి - ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఆ పాత్రల మధ్య డైలాగుల్లో వెల్లడైతే సరిపోతుంది...’  ఇదీ ‘వారియర్’  దర్శకుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గతంలో అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ వేయకుండా మాటల ద్వారానే  ఎందుకు చెప్పించాల్సి వచ్చిందన్న దానికి ఇచ్చిన వివరణ.

          హిందీలో ఈ గతాన్నంతా ఫ్లాష్ బ్యాక్ లో చూపించు కొచ్చారు. అదీ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో- మధ్య మధ్యలో రియల్ టైం లో ఇప్పుడు అన్నదమ్ములూ తండ్రీ ఏం  చేస్తున్నారో చూపిస్తూ. 
దేశీయ ప్రేక్షకుల కోసం ఈ ఫ్లాష్ బ్యాక్ అవసరమే. దీన్ని ఏకబిగిన పది  నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. ఇలాకాకుండా ఖండఖండాలుగా ఫ్లాష్ బ్యాక్స్ వేస్తూ, మధ్యమధ్యలో జైలు నుంచి వచ్చిన తండ్రి గొడవ చూపిస్తూ, అన్న దమ్ముల విడివిడి స్ట్రీట్ ఫైట్లు వేస్తూ..ఇలా అనేక విషయాల్ని మోసుకుంటూ వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చేసింది గంటా పది నిమిషాలకి.


          ఇక్కడా సమస్య ఏర్పాటు కాలేదు- కథేమిటో సూచన ఇవ్వలేదు. అన్నదమ్ములని ఎదురు రెదురు రప్పించి మాత్రమే ఇంటర్వెల్ వేశారు. దీనివల్ల ఇంకా బిగినింగ్ విభాగం పూర్తి కాని ఫీలింగ్. ‘బాహుబలి’ మొదటి భాగం ముగిసినా ఇంకా కథా పరిచయ బిగినింగ్ విభాగం ఎలా ముగియలేదో- అలా ఇక్కడ ఇంటర్వెల్ కొచ్చినా కథా పరిచయ బిగినింగ్ విభాగం ఇంకా మిగిలిపోయే వుంది.

          సింపుల్ గా చెప్పాలంటే ఇది సార్వజనీన త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే కాదు. త్రీ యాక్ట్ స్క్రీన్ ప్లే లో ఇంటర్వెల్ లోపే బిగినింగ్ ముగిసి మిడిల్ కొస్తుంది కథ. చాలా హిందీ- తెలుగు సినిమాలు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ కాక, ఫస్టాఫ్- సెకండాఫ్ అనే లోకల్ స్ట్రక్చర్లో ఎలా ఉంటున్నాయో,  అలా ‘బ్రదర్స్’ సైతం ‘ఫస్టాఫ్- సెకండాఫ్’ స్ట్రక్చర్లో వుంది.

          అంటే ఫస్టాఫ్ అంతా  బిగినింగ్ విభాగమే సుదీర్ఘంగా సాగి, అప్పుడు ఇంటర్వెల్లో పాయింటు కొస్తుంది కథ. ఇంటర్వెల్ తర్వాత ఆ సెకండాఫ్ ఆట స్థలంలోనే ఆ పాయింటుతో స్ట్రగుల్ చేసే  మిడిల్ విభాగమూ, ఆ పాయింటుకి పరిష్కారం చెప్పే ఎండ్ విభాగమూ కలిసి పంచుకుంటాయన్న మాట.

          దీని వల్ల సినిమా మొత్తంలో యాభై  శాతం ఉండాల్సిన మిడిల్ విభాగం ఆట స్థలం పాతిక శాతానికి కుంచించుకు పోతుంది. రెండు గంటల సినిమా వుందంటే ఇంటర్వెల్ కి ముందు అరగంట సేపు, ఇంటర్వెల్ తర్వాత ఇంకో అరగంట సేపూ మొత్తం గంట సేపూ మిడిల్ ఆటస్థలం ఉన్నప్పుడే సినిమాకి (కథకి) బలం వస్తుంది. ఇలాకాక మొత్తం ఇంటర్వెల్ వరకూ గంట సేపూ బిగినింగ్ విభాగమే ఆక్రమిస్తే అది కథకి ఆటస్థలం కాదు- ఉపోద్ఘాత భూతమే. ఉపోద్ఘాతం అంత  వుండడం అవసరమా?

          కానీ- ఈ రిమేక్ ని జాగ్రత్తగా చూస్తే, ఫస్టాఫ్ లోపే బిగినింగ్ ముగిసింది!  ఇది తెలుసుకోలేదు. తెలుసుకున్నా ఏమీ చేయలేక- ఎంఎంఏ కాన్సెప్ట్ లాగే,  మిక్స్ డ్ మిడిల్ ఎనీమియా గా తయారు చేశారు.

          అన్న పాత్ర స్కూల్లో ఉద్యోగం కోల్పోయినప్పుడే ఫస్టాఫ్ లో చక్కగా బిగినింగ్ విభాగం ముగిసింది.  ఇక డబ్బుకోసం ఫుల్ టైం ఫైటర్ గా మారడానికి చేసే స్ట్రగుల్ తో మిడిల్  ప్రారంభమయ్యింది కూడా ఇంటర్వెల్ లోపే. కానీ ఫ్లాష్ బ్యాక్ ఖండికలు ఇంకా మిగిలి వుండడం తో, తండ్రి గొడవ, అన్నదమ్ముల విడివిడి ఫైట్లూ ఇంకా మిగిలి ఉండడంతో- ఈ బిగినింగ్ విభాగాన్ని మళ్ళీ ఇంటర్వెల్ దాకా కంటిన్యూ చేశారు. అంటే బిగినింగ్ లో మిడిల్ ఇరుక్కుపోయింది! ఇలాటి స్క్రీన్ ప్లే ఎక్కడా వుండదు బహుశా.

          ఒరిజినల్లో టీచర్ ఉద్యోగం కోల్పోవడంతో 35 వ నిమిషానికి బిగినింగ్ ముగిసి మిడిల్లో పడుతుంది కథ. ఈ వొరిజినల్ స్క్రీన్ ప్లేలో చూసినా- 28 వ పేజీకల్లా ఈ మలుపు వస్తుంది. ఇక్కడ్నించీ మిడిల్ 92వ పేజీ వరకూ 64 పేజీలూ కొనసాగుతుంది. 93వ పేజీ నుంచి 103వ పేజీ వరకూ 10 పేజీలూ ఎండ్ విభాగం వుంటుంది.

          సినిమాలో చూసినా- 35 వ నిమిషంలో మిడిల్లో పడ్డ కథ, గంటా 25 నిమిషాలు మిడిల్లో కొనసాగి, చివరి ఇరవై నిమిషాలు ఎండ్ తో నడుస్తుంది. సినిమా మొత్తం నిడివి రెండు గంటల ఇరవై నిమిషాలు. బిగినింగ్ 35 నిమిషాలు, మిడిల్ 85 నిమిషాలు, ఎండ్ 20 నిమిషాలు. ఇదీ ఒరిజినల్లో వున్న  త్రీ యాక్ట్ స్ట్రక్చర్.

          ఆ మిడిల్లో అన్న చేస్తున్న స్ట్రగుల్లోనే ఒకసారి తండ్రితో, ఇంకో సారి తమ్ముడితో ముఖాముఖీ అయినప్పుడు వాళ్ళ పాత గొడవలేమిటో వాళ్ళ మాటల్లోనే  బయటపడతాయి. అంతే  తప్ప దీనికి ఫ్లాష్ బ్యాక్స్ వేయలేదు.

          ఒరిజినల్లో అన్న ఉద్యోగం కోల్పోవడం బిగినింగ్, స్ట్రగుల్ మిడిల్, తమ్ముడితో ఫైటింగ్ కి దిగడం ఎండ్.  

          రీమేక్ లో ఏజెంట్ ఎంఎంఏ ఎనౌన్స్ చేయడం బిగినింగ్, ఈవెంట్ లో అన్న ఒక్కొక్కడ్నీ
ఓడించడం మిడిల్, తమ్ముడితో తలపడ్డం ఎండ్.


          ఇదీ తేడా. రీమేక్ లో ఏజెంట్ ఎంఎంఏని  ఎప్పుడు ఎనౌన్స్ చేశాడు? ఇంటర్వెల్ తర్వాత వెంటనే. కాబట్టి బిగినింగ్ అక్కడికొచ్చి ముగిసింది. సినిమా ఫస్టాఫ్ వాష్ అవుట్ అనీ, ఫస్టాఫ్ లేకపోయినా కొంప లంటుకోవనీ సర్వత్రా టాక్ వస్తోందంటే రాకుండా ఎలా వుంటుంది? కారణాలు ఇవీ. ఫస్టాఫ్ అంతా ఉపోద్ఘాతంతో నస పెట్డడమే తప్ప కథ వేషం కట్ట లేదు.
***

          నష్టాన్ని సెకండాఫ్ ప్రారంభంలోనే పూడ్చడం చాలా మెరుగు. ఎంఎంఏ ఎనౌన్స్ మెంట్ అయిన వెంటనే ఇక నస పెట్టకుండా టోటల్ నాన్ స్టాప్ యాక్షన్ గా సాగించడం, మధ్యమధ్యలో జబ్బుతో వున్న కూతురితో సీన్లు వేయడం చేసుకుంటూ పోయారు. ఫైటర్ గా ఎంఎంఏ బరిలోకి దిగిన అన్న, అలాగే తమ్ముడు కూడా వాళ్ళ ఫైటింగ్ టెక్నిక్స్ ని ఎలా ప్రదర్శిస్తారో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయారు. అన్న కంటే తమ్ముడి టెక్నిక్ కొట్టొచ్చినట్టూ వుంటుంది. ఊహించని మెరుపు దాడితో క్షణాల్లో ప్రత్యర్ధిని పడగొట్టే తన టెక్నిక్ ని చివరికి అన్న మీద కూడా ప్రయోగిస్తాడు. అన్నకి ప్రత్యర్ధిని లాక్ చేసి ఎముకలు విరిచేసే టెక్నిక్ వుంటుంది.

          ఈ అన్నదమ్ముల కథ ఒరిజినల్ లో వున్నట్టు ఈ రిమేక్ లో వుండదు. ఒరిజినల్ లో తప్పు స్పష్టంగా అన్నదే అన్నట్టు వుంటుంది. ఇద్దరూ ఒకే తల్లి పిల్లలు. తండ్రి తాగుబోతు. తల్లికి క్యాన్సర్. తండ్రి పట్టించుకోక పోతే, ఇక తల్లిని వేరే వూరికి చికిత్సకి తీసికెళ్ళాల్సి వస్తే, వెంట అన్న వెళ్ళడు. ఒకమ్మాయితో ప్రేమాయణం సాగిస్తూ ఆ పెళ్ళీ, సంసారం అనే లోకం లో పడిపోతాడు. తల్లిని తీసికెళ్ళిన తమ్ముడు తల్లి మృతిని చూస్తాడు. ఈ విషయం కూడా అన్నకి చెప్పకుండా కసి పెంచుకుని సంబంధాలు కట్ చేసుకుంటాడు. తండ్రి ఇక తాగుడు మానెయ్యడానికి పునరావాస కేంద్రం లో చేరతాడు. తల్లి క్యాన్సర్ తో చనిపోవడం, ఆమెని నిర్లక్ష్యం చేసిన అన్న కూతురు అప్పుడే హృద్రోగం బారిన పడ్డం ఇదంతా కర్మ సిద్ధాంతం లాగే వుంటుంది. ఈ సినిమా పునరావాస కేంద్రం లో తండ్రి బాగు పడి తిరిగి వస్తూండడంతో ప్రారంభమవుతుంది. హిందీ రిమేక్ లో తండ్రి జైలు నుంచి విడుదలై రావడంతో ప్రారంభం వుంటుంది.

          ఒరిజినల్లో జరిగిన కథ పాత్రల మధ్య మాటల ద్వారా వ్యక్తమైతే, రిమేక్ లో ఫ్లాష్ బ్యాక్ వేసి చూపిస్తారు. దీని వల్ల ఒక మేలు  జరిగింది. అన్నదమ్ముల ఈ చిన్నప్పటి బాంధవ్య దృశ్యాలు తర్వాత పవర్ఫుల్ మాంటేజెస్ గా ఉపయోగపడ్డాయి. ఫ్లాష్ బ్యాక్ దృశ్య రూపంలో లేక పోతే ఈ మాంటేజెస్ లేవు. ఈ మాంటేజెస్ లేకపోతే క్లయిమాక్స్ కి- మొత్తం కథకే  జీవం లేదు!
***
మిడిల్ విభాగమంతా అంతర్జాతీయ ఫైటర్లతో అన్నదమ్ముల విడివిడి రౌండ్లతో సంఘర్షణా త్మకంగా వుంటుంది. చివరికి బరిలో అన్నదమ్ములే మిగలడం ఈ విభాగం ముగింపు. 

          ఒరిజినల్, రిమేక్ రెండిటి క్లయిమాక్స్ (ఎండ్ విభాగం) ఇదే. అసలు విషయమంతా ఇక్కడే వుంది. ఇంతసేపూ నడిచిన  కథంతా ఇక్కడే సారాన్ని పిండి గూఢార్ధాలు పలుకుతుంది. గూఢార్ధాలు రిమేక్ లో వర్కౌట్ అయినంతగా ఒరిజినల్లో కాలేదు. ఇక్కడే దర్శకుడు కరణ్ మల్హోత్రా స్కోర్ చేశాడు. ఒరిజినల్ని దాటిపోయి- చెప్పకుండానే బలమైన నీతిని  ఈ క్లయిమాక్స్ ద్వారా చెప్పి ముగించాడు.
            ఒరిజల్లో విడిపోయిన అన్నదమ్ముల మధ్య ఫైట్ లో మాటలుండవు. కేవలం యాక్షనే వుంటుంది. ఈ యాక్షన్ లో తమ్ముడి భుజం విరిచెయ్యడం పరాకాష్ఠ. అప్పటికి కొంత బెట్టు చేసినా తమ్ముడు ఓటమిని అంగీకరించాక పట్టుకుని ఏడ్చేస్తాడు అన్న. భుజం విరిగిపోయిన తమ్ముణ్ణి ఆర్తిగా పొదివిపట్టుకుని అలాగే స్టేడియం నుంచి నడిపించుకుంటూ వెళ్తూంటే, ఇది చూస్తున్న తండ్రి ఆనందంతో ముగుస్తుంది సినిమా. అయితే హోరాహోరీ పోరాడు తున్నప్పుడు కనీసం మాట్లాడుకోక పోవడంతో- అన్నాళ్ళ కసిని కూడా వెళ్ళ గక్కుకోక పోవడంతో, ఆ యాక్షన్ అంతా ఫ్లాట్ గానే వుంటుంది.

           రీమేక్ లో కూడా భుజం విరిచేసిన తమ్ముణ్ణి ఇలాగే ఆర్తిగా పొదివి పట్టుకుని స్టేడియం నుంచి నడిపించుకు పోతాడు అన్న. తండ్రి ఆనందిస్తాడు. అయితే హోరాహోరీ కొట్టుకుంటు న్నప్పుడు ఎమోషన్ తో రెండే రెండు డైలాగులు పేల్తాయి. చివరి రౌండ్ లో తమ్ముడి భుజం విరిచేశాక - ఒరే ఇక చాలించరా!- అని అన్న వేడుకోవడం, అయినా అలాగే అన్నని పడదోసి లాక్ చేసి-  ఆమె నాక్కూడా అమ్మే కదరా! - అని తమ్ముడు అనడం కథని ఎక్కడికో తీసికెళ్ళి పోయింది!!

            సినిమా మొత్తం మీద వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఈ రెండు ముక్కలే. ఇది వెర్బల్ గా. ఇక విజువల్ గా చూస్తే- ఫ్లాష్ బ్యాక్ లోంచి రెండు విజువల్స్ ఇక్కడ ప్రయోగించి ఆశ్చర్య పరుస్తాడు చేస్తాడు దర్శకుడు. తమ్ముణ్ణి కొట్ట బోతూంటే అన్నకి చిన్నప్పటి తమ్ముడు కన్పిస్తాడు- ముద్దు ముద్దుగా నవ్వుతూ.  అలాగే తమ్ముడు అన్నని కొడుతూంటే చిన్నప్పుడు అన్న తనని వీపెక్కించుకుని ఆడించిన దృశ్యం మెదుల్తుంది!

          ఈ సృజనాత్మకత క్లయిమాక్స్ ని అతి శక్తిమంతంగా మార్చేసింది. కళ్ళు చెమర్చే ఈ దృశ్యాలు ఈ సిట్యుయేషన్ లో చెప్పకనే ఒక విషయం స్పష్టం చేస్తాయి- తోబుట్టులెవరైనా, వాళ్ళ బాల్యంలో ఎలా కలిసి గడిపారో ఆ స్మృతుల్ని ఏ అవాంతరాలొచ్చినా జీవితకాలం మోసుకు తిరక్కపోతే, ఇదిగో ఇలాటి కౄర తీరాలకే చేరుకుంటారు. తోబుట్టువులతో బాల్య స్మృతుల్ని చెరిపేసుకోవడం మహాపరాధం. ఎలా బయల్దేరినవాళ్ళం అలాగే కొనసాగాలి. సౌభాతృత్వానికి ఇంతకంటే బలమైన చిత్రణ లేదు.


—సికిందర్





Saturday, August 15, 2015

సాంకేతికం- కెమెరా


సినిమా కోసం టెక్నాలజీయా, లేక టెక్నాలజీ
కోసం సినిమానా? ఇదీ ఇప్పుడేసుకోవాల్సిన ప్రశ్న!

టెక్నాలజీ కోసమే సినిమాలు తీస్తూపోతే చూసుకోవడానికి ఫ్లాపులే మిగలొచ్చు.
మాట్ డామన్ నటించిన  హాలీవుడ్ మెగా మూవీ ‘బోర్న్ సుప్రమసీ’ లో విజువల్ అప్రోచ్ ఎలాంటిదంటే ఆ యాక్షన్ హంగామాలో ఒక్క గ్రాఫిక్స్ ముక్క కన్పిస్తే ఒట్టు. పోరాటాల్లో వైర్ వర్క్, డూప్ నెట్స్ వంటి మెకానిజాలు  కూడా మచ్చుకి కానరావు.
సగటున 1.9 సెకన్ల నిడివి వుండే ఆ సూక్ష్మాతి సూక్ష్మ షాట్స్ తో రాకెట్ వేగంతో దూసుకెళ్ళే దృశ్యాలే ఈ సినిమాకి ప్రాణం. ఉద్దేశపూర్వకంగా డాక్యుమెంటరీ ఫీల్ కోసం ఒకే ఒక్క హేండ్ హెల్డ్ కెమెరాతో దీని చిత్రీకరణ అనన్య సామాన్యం.

       కలరిస్టుకి కాలూ చెయ్యీ ఆడని ఆ మైక్రో షాట్స్ కి చేసిన డీఐ డల్ గానూ, కంటికి చలవ చేసేదిగానూ ఉంటే, ఇక డీటీఎస్ కత్తి మీద సాము. ఎందుకంటే, కాంతి వేగం కంటే శబ్ద వేగం తక్కువ కాబట్టి. దీన్ని కూడా పట్టుబట్టి సాధించారంటే, సినిమాకోసం టెక్నాలజీ కాక మరేమనుకోవాలి?

          ఇదే ప్రముఖ ఛాయాగ్రాహకుడు టి.  సురేంద్ర రెడ్డి ని బాగా ఆకర్షించింది. హాలీవుడ్ షాట్స్ చూపించి అలా తీయమని తనని ఒత్తిడి చేసే దర్శకులు లేకపోలేదు. ఈ కాపీ కౌపీనానికి దూరంగా ‘బోర్న్ సుప్రమసీ’ చూస్తూంటే ఆయనకో ఆలోచన మెరిసింది. దాన్ని అమల్లో పెట్టేశారు. అది ‘నీ ఇల్లదే‘ అనే కన్నడ సినిమా. అందులో కొత్తగా ఆయన చేసిన ప్రయోగం మల్టిపుల్ ఫార్మాట్ లో చిత్రీకరణ. సాధారణ ఎనలాగ్ కెమెరాతో బాటు, ఒక 4కే ( అంటే నాలుగు వేల రిజల్యూషన్ గలది), మరొక 2 కే డిజిటల్ కెమెరాలు రెండూ, ఇంకో సాధారణ వీడియో కెమెరా ఒకటీ - కలిపి ఉపయోగించి ఈ సినిమా షూట్ చేశారు. 

       గతంలో ‘ఆ నల్గురు’లో మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఒకే ఫార్మాట్ లో (ఎనలాగ్)  గ్రేడింగ్స్ మార్చి తేడా కనబర్చారు సురేంద్ర రెడ్డి.  ఈ కన్నడ సినిమాలో సన్నివేశాల డిమాండ్ ని బట్టి మల్టిపుల్ ఫార్మాట్ కి వెళ్ళారు. పై హాలీవుడ్ సినిమాలో అది స్టడీకామే అయినా, సీన్లు డిమాండ్ చేస్తున్న సెన్సాఫ్ అర్జెన్సీ దృష్ట్యా దాన్నెలా వాడుకున్నారో, అలా పరస్పర నాల్గు విభిన్న ఫార్మాట్స్ తో ఈ కన్నడ సినిమా చేశారాయన.

          ‘ఇప్పుడొస్తున్నవి చికెన్ ఫ్రై సినిమాలు’ అని ఆయన అధిక్షేపణ. ‘మనం అన్నం తింటున్నప్పుడు కాస్త పప్పు, కూర, సాంబారు, పచ్చడి, అప్పడం, పెరుగూ.. ఇలా ఎప్పుడేది కావాలో పెట్టుకుంటూ తింటాం. ఎప్పుడో గానీ చికెన్ ఫ్రై తినం. చికెన్ ఫ్రయ్యే రోజూ తింటే ఎలా వుంటుంది? అలాగే ఉంటున్నాయి ఇప్పుడొస్తున్న సినిమాలు. బిల్డప్పుల కోసం సినిమాని టెక్నాలజీతో నింపేస్తున్నారు. కథని కథలా చూపించడం లేదు’ అని బాధపడ్డారు.

           పైన చెప్పుకున్న హాలీవుడ్ సినిమాలో హీరో న్యూ ఢిల్లీ వచ్చి రోడ్డు పక్క మినరల్ వాటర్ కొంటాడు. అది హిమాలయన్ నేచురల్ మినరల్ వాటర్ అనే స్టార్ హోటళ్ళలో సంపన్నులు తాగే ఖరీదైన నీరు. దాన్ని రోడ్డు పక్క ఎక్కడా అమ్మరు. అలాగే ఇంకోచోట, హీరో ఒకణ్ణి హరీ మన్పిస్తూంటే, ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఓ మూలన షూటింగ్ ఎక్విప్ మెంట్ అలాగే పెట్టేసి కన్పిస్తుంది. మన సినిమాల్లో టెక్నాజీ భయపెడితే, హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి ‘అదనపు హంగులు’ నవ్విస్తాయన్న మాట!  ఈ హైపర్ యాక్టివ్ టెక్నాలజీ యుగంలో మరి సురేంద్ర రెడ్డి ముద్రని ఎలా గుర్తు పట్టాలి? పది రకాల బొమ్మల్లో ఆయన బొమ్మ ఎలా ప్రత్యేకం? అంటే...’ఫేస్ మౌల్దింగ్ నా స్పెషాలిటీ’ అని ప్రకటించారు. పాత్రని విశ్లేషించుకుని, అది మనసులో ముద్రించుకునేలా క్లోజప్స్ వేయడమే తన ప్రత్యేకత అన్నారు. ‘ఆ నలుగురు’ లో రాజేంద్ర ప్రసాద్ కి ఇలాంటి క్లోజప్సే ఉంటాయన్నారు.

         మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో కొనసాగుతూ నలభై సినిమాలు పూర్తి చేసిన తను, ప్రస్తుతం  సునీల్ శెట్టితో ‘రూట్స్’ అనే హిందీ సినిమాకి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మణిశంకర్ తీసిన ‘డిసెంబర్ 16’, ‘రుద్రాక్ష’, ‘టాంగో చార్లీ’  అనే హిందీ సినిమాలకి కూడా ఛా యాగ్రహణం అందించిన అదృష్టాన్ని సంపాదించుకున్నారు. మణిశంకర్ లా సినిమాని ఎగ్జిక్యూట్ చేసే దర్శకులు తెలుగులో లేరని అభిప్రాయపడ్డారు. దీనిక్కారణం, తెలుగులో దర్శకులే రచయితలుగా మారడంతో రచయితల తోడ్పాటు కోల్పోవడమే నని అన్నారు. ఫలితంగా రచయితలుగా మారిన దర్శకులూ, దర్శకులుగా మారిన  రచయితలూ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా రన్నారు.

          పోతే, తను ఆసియాలోనే మొదటి సారిగా,  ప్రపంచంలో మూడోదిగా, తెలుగులో ‘టాస్’ అనే సినిమాని వైపర్ కెమెరాతో డిజిటల్ లో తీశానన్నారు.

          ఇక డీఐ విషయానికొస్తే, మనమింకా ఇందులో పరిపూర్ణత సాధించలేదన్నారు. ‘కెమెరాతో ఓ దృశ్యాన్ని తీస్తే, దగ్గరగా వున్న కొండ ముదురు రంగులో, దాని వెనకున్న కొండ కొంత రంగు తగ్గీ, అలాగే ఆ వెనక వుండే కొండ పూర్తిగా రంగు తగ్గిపోయీ కన్పిస్తాయి. అప్పుడే వాటి మధ్య దూరాలున్నట్టు డెప్త్ కన్పిస్తుంది. ఇదే దృశ్యాన్ని డీఐ చేసినప్పుడు  దూరాలు అదృశ్య మైపోతున్నాయి. డీఐ చేశాక దృశ్యం మరింత అద్భుతంగా కన్పించే మాట నిజమే, కానీ అందులో డెప్త్ మాత్రం వుండడం లేదు. ఈ సమస్యని రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ లో కొంతవరకూ అధిగమించగలిగా’ రన్నారు సురేంద్ర రెడ్డి.

     17వ ఏటనే నెల్లూరు నుంచి మద్రాసు వెళ్లి అంచెలంచెలుగా కెమెరామాన్ గా ఎదిగిన తను, రీమేక్స్ కి ఎక్కువగా పని చేయలేదన్నారు. ఒక సినిమాని రిమేక్ కి తీసుకున్నప్పుడు నిర్మాతా రచయితా తప్ప, దర్శకుడూ కెమెరామాన్ దాన్ని చూడకుండా వుంటే, సొంత క్రియేటివిటీ ని చూపించుకునే అవకాశం ఉంటుందన్నారు తంబిరెడ్డి సురేంద్ర రెడ్డి.


సికిందర్
( ఆంధ్రజ్యోతి- నవంబర్ 2010, 'సినిమా టెక్' శీర్షిక’)

Thursday, August 13, 2015

రైటర్స్ కార్నర్



క్లిఫ్ డార్ఫ్ మాన్ - హాలీవుడ్ హిట్  ‘వారియర్’  స్క్రీన్ ప్లే రచయిత...ఈ మూవీ హిందీలో ‘బ్రదర్స్’ గా అధికారిక రీమేక్ గా ఆగస్టు 14 న విడుదలవుతోంది. ఈ రిమేక్ తో క్లిఫ్ కి రచనాపరంగా ఏ సంబంధం లేకపోయినా, ‘వారియర్’ రచయితగా ఆయన క్రిస్ నిటెల్ కిచ్చిన ఇంటర్వ్యూని ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాం..
‘వారియర్’ తో మీ అనుభవం చెప్పండి?
          ‘వారియర్’ 2011 లో విడుదలయ్యింది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచాన్ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి చూపించాం. ఈ స్క్రిప్టు పని పూర్తయి షూటింగ్ కూడా పూర్తయ్యాకా విడుదల తేదీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ లోగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మె కారణంగా నా మరో స్క్రిప్ట్ అమ్ముడుపోక ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డాను. నా సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. కారూ ఇల్లూ కూడా పోయి పూర్తిగా దివాళా తీశాను. ఇంకో ఆరు నెలలకి గానీ ‘వారియర్’  విడుదల కాలేదు. అది విడుదలయ్యాక తిరిగి నా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడింది.
మీరు రాసిన మొట్టమొదటి కథ?
          నవల. అప్పుడు నాకు పదకొండేళ్ళు. పెన్నుతో కాగితాల మీద రాసుకుని ఆ 50 పేజీలనీ ఫైల్ చేసి పెట్టుకున్నాను. అది తర్వాత చెదలు పట్టిపోయింది.
మీ కళాతృష్ణకి ఎలాటి సినిమాలు, లేదా కథలు మీకు స్ఫూర్తి నిచ్చేవి?
          మొదట్నించీ గ్రీకు పురాణాలంటే ఇష్టం. ఇప్పటికీ వాటికి ప్రభావితుణ్ణి అవుతూనే వుంటాను. ఆ తర్వాత క్లాసిక్ లిటరేచర్ వైపు, క్లాసిక్ సినిమాలవైపూ ఆసక్తి పెరిగింది. నా జీవితంలో నేనేం కావాలో నిర్ణయించుకోవడానికి ఒకే ఒక్క సినిమా చూశాక తెలిసి వచ్చింది. ఆ సినిమా ‘బ్లడ్ సింపుల్’. ఈ సినిమా చూశాక ఇలా రాస్తే సినిమా ఫీల్డులో అగ్ర స్థానానికి చేరుకోవడం సాధ్యమేనని అన్పించింది. ‘ఫౌంటెన్ హెడ్’ నవల చదివినప్పుడు కూడా నాకిలాటి ఫీలింగే కలిగింది.
ఒక అనామక రచయిత తన స్క్రిప్టు  వెలుగు చూడాలంటే ఏం చేయాలంటారు?
       ఇలా చెప్తే సిల్లీగా ఉండొచ్చు- కానీ ఏదైనా బ్రహ్మాండమైన స్క్రిప్టు  రాస్తే అది తప్పకుండా వెలుగు చూస్తుంది. ఎలా వెలుగు చూస్తుందో వివరించలేను గానీ, వెలుగు మాత్రం చూస్తుంది. ఐతే ముందుగా తను ఏ బ్రాండో తెలుసుకోవాలి. ఆ బ్రాండ్ తో తను రాసిన దానికి దగ్గరగా వుండే అలాటి రచయితల్నిగానీ, దర్శకుల్ని గానీ, నిర్మాతల్ని గానీ ఫాలో అవుతూ వుండాలి.  వీళ్ళకి దగ్గరయ్యే  మార్గాలని అన్వేషించాలి. నేటి డిజిటల్ యుగంలో ఇదేం కష్టం కాదు. నేను స్ట్రగుల్ చేస్తున్న కాలంలో ప్రీమియర్ షోలలో చొరబడి సినీ ప్రముఖుల్ని పలకరించే అవకాశం తీసుకునే వాణ్ణి. రైటర్ గా ఇతరులకంటే తనెలా ప్రత్యేకమైన వాడో, ఏ నిర్మాతయినా తన స్క్రిప్టుని ఎందుకు ఓకే చేయాలో చెప్పగలిగి వుండాలి. వాణిజ్య రంగంలో యూ ఎస్ పీ(యూనిక్ సెల్లింగ్ పాయింట్) అని వస్తువులకి వాటిదైన ప్రత్యేకత ఒకటి వుంటుంది. అలాటి యూ ఎస్ పీ తన కేమిటో రైటర్ తెలుసుకోవాలి. అది తనదైన ఒక వాయిస్ అవుతుంది - లేదా శైలి అయి వుంటుంది. సొంత వాయిస్. మరొకరికి అనుకరణ కానిది.
ఏ జీవితానుభవాలు మీ పాత్రలపై ప్రభావం చూపుతాయి?
         
ప్రతీ అనుభవం కూడా. ప్రతీ వ్యక్తితో అనుభవం కూడా. ఒక్కక్షణం అలా కలిసి వెళ్ళిపోయినా సరే, అది కూడా పనికొచ్చే అనుభవమే. నా కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బయట ఇతరులతో అన్నీ పనికొచ్చే అనుభవాలే. నేను రాస్తున్నప్పుడు ఏదీ నాకు వ్యర్ధ పదార్ధం కాదు. బహిరంగ ప్రదేశాల్లో కూర్చుని ఇతరులు అనుకునే మాటల్ని వింటాను. అవి ఆసక్తి కరంగా వుంటే రికార్డు చేసుకుంటాను. లేదా నోట్ చేసుకుంటాను. సహజంగా దొర్లే జనం భాష ఇంటలెక్చువల్ గా ఏమీ వుండదు గానీ, ఆ మాటలు లోతుగా ఎక్కడో తాకుతాయి. నేనేం విన్నా, చదివినా నేను రాస్తున్న పాత్రలకి ఎలా అన్వయించాలా అని ఆలోచిస్తాను.
మీ క్యారక్టర్ డెవలప్ మెంట్ ప్రాసెస్ ని వివరించండి?
         
నేనెప్పుడు రాయడానికి కూర్చున్నా దేవుడు నాకు మార్గం చూపించాలని ప్రార్ధిస్తాను. నా అనుభవాల భాండాగారంలో కెళ్ళి క్యారక్టర్స్ ని చూపించమని అడుగుతాను.
క్యారక్టర్  బయోగ్రఫీలు రాసుకుంటారా?
         
రాయను, క్రియేట్ చేసుకుంటాను.
మీరు క్రియేట్ చేసే క్యారక్టర్ లతో మీరు ఎమోషనల్ గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు?
          ప్రాసెస్ లో ఇది చాలా కఠినాతి కఠినమైన పని. టార్చర్ కూడా. నేను రాస్తున్నంత కాలమూ ఎన్ని క్యారక్టర్స్ వుంటే వాటన్నిటి  ప్రపంచాల్లో జీవిస్తూ ఉండాల్సిందే.

గొప్ప క్యారక్టర్ ని సృష్టించాలంటే దేన్ని  ప్రాతిపదికగా తీసుకోవాలంటారు?
          జీవితానుభవాన్ని. మనుషుల అసంకల్పిత చర్యల్ని. ఆహారపు టలవాట్లని. ఫిజికల్ బిజినెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనమెప్పుడూ చేసే పనుల ద్వారా మన మనసేమిటో బయట పెట్టేస్తూంటాం. ఈ డైకాటమీ- ఆలోచనకీ  చేతకూ మధ్యన వుండే సంబంధాన్ని పరిశీ లిస్తూంటాను- దాన్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తాను. నేను సృష్టించిన ఒక స్త్రీ పాత్ర ఆందోళనకి గురయినప్పుడు బొటన వేలుని గట్టిగా పట్టుకుని మెలి తిప్పడమనే డైకాటమీని రాశాను.

రాసే ముందు అవుట్ లైన్ వేసుకుంటారా?
          కొన్నిసార్లు వేస్తూంటాను. కానీ అది నా కిష్టముండదు. అయితే కొన్ని రకాల కథలకి అవుట్ లైన్ అవసరమే.

స్ట్రక్చర్ గురించి మీ అభిప్రాయం?
          అది టెక్నికల్. కొంతవరకూ తప్పనిసరిగా అవసరమే. ఐతే దాన్ని ఎగేసే మార్గాలు ఎప్పుడూ వుంటాయి. నా మైండ్ లో కథకి ఓ బిగినింగ్, మిడిల్, ఎండ్ లేమిటో ముద్రపడి పోయాక, ఆకథని నేనెలాగైనా చెప్పగలను. అది వర్కౌట్ అయితే అది చెప్పడానికి నేనేంచుకున్న స్ట్రక్చర్ ప్రధానమే కాదు. ఇందుకే నేను నవలల్ని నేనెక్కువ ఇష్టపడతాను. అవి స్ట్రక్చర్ లో ఇరుక్కుని వుండవు.

మీరు అభిమానించే సినిమాలు ఏ  స్ట్రక్చర్స్ లో ఉన్నాయంటారు? 


          దేనికవే ..అయితే ’గుడ్ ఫెల్లాస్’  స్ట్రక్చర్ ని నేనిష్ట పడతాను. థర్డ్ యాక్ట్ ప్రారంభం దగ్గర  లేదా, సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర్నుంచి ఆ సినిమా ప్రారంభమవుతుంది. అక్కడ్నించీ బయల్దిరిన చోటుకి తిరిగి వస్తుంది. అక్కడి నించీ ఎండ్ వరకూ కంటిన్యూ అవుతుంది. ఎన్నిరకాల స్ట్రక్చర్స్ వున్నా నేను బాగాలవ్ చేసేది  ‘పల్ప్ ఫిక్షన్’  స్ట్రక్చర్ని. అది చాలా బ్రిలియెంట్ స్ట్రక్చర్.

మీ క్యారక్టర్ లు ఎప్పుడైనా వాటి గురించి అవి మాట్లాడుకోవడం జరుగుతుందా?
          అవి తమలో తాము మాట్లాడుకుంటాయి- లేకపోతే వాటికి నేను అన్యాయం చేసినట్టే.
మీకు డైలాగులు ఈజీ గా వచ్చేస్తాయా- లేక బాగా కష్ట పెడతాయా?
          ఏ డైలాగూ అంత ఈజీగా రాదు. బాధాకరమైన ప్రాసెస్ అది.

పాత్రలు వివరణలు ఇచ్చుకోవడాన్ని మీరెలా నివారిస్తారు?
          నివారించలేం. పోలీసులాగా నిఘా పెట్టగలం. పాత్ర ఇచ్చిన ఓ వివరణకి నేను మళ్ళీ మళ్ళీ వెనక్కెళ్ళి చదువుకుంటూ ఆ వివరణ అవసరమా అని ఆలోచిస్తాను. అవసరమే అనుకుంటే, అది మాటల్లో కాకుండా విజువల్ గా - సింబాలిక్ గా చెప్పొచ్చా అని కూడా ఆలోచిస్తాను.

మీ డైలీ రైటింగ్ రొటీన్ గురించి చెప్పండి?
          వ్యాయామం చాలా చేస్తాను. వాటిలో బాక్సింగ్, యోగా వుంటాయి. జిమ్, రన్నింగ్ వుంటాయి.  అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ బాడీకీ  మైండ్ కీ  చాలా హెల్ప్ చేస్తుంది. రాసేటప్పుడు ఫోన్ ని స్విచాఫ్ చేసి వేరే రూమ్ లో పెట్టేస్తాను.

స్క్రీన్ రైటర్ల గురించి వుండే అపోహ లేమిటో చెప్పగలరా?
          ఈ వృత్తిని ఇతరులు ఫన్ అనుకుంటారేమో- నిజమే, చాలా ఫన్. రాసిన సినిమాని తెర కెక్కితే దాన్ని చూసుకోవడం ఫన్నే కదా? దాన్ని మించిన ఫన్ ఏముంటుంది. కానీ అదే చూస్తున్న సినిమాని ముందుగా కాగితాల మీదికి ఎక్కించడానికి వుంటుందే- అది నావరకూ ఒక నరకం.

మీ కెరీర్ లో బాగా హైలైటయిన అంశం ఏమిటి?
          ఏమీ లేదు. హైలైట్స్ గురించి ఆలోచించను..నాకో ఫిలాసఫీ వుంది. కోరుకున్న గమ్యానికి ఎప్పుడూ చేరుకుంటూ ఉండాలే గాని చేరుకోకూడదని. చేరుకున్నామంటే ఇక అక్కడ చేయడాని కేమీ వుండదు. అక్కడ్నించి బయల్దేరి  వెనక్కి రావడమే.      

మీ రీ - రైటింగ్ ప్రాసెస్ ని వివరిస్తారా?
          అదెప్పుడూ వుండే ప్రాసెస్సే. స్క్రిప్టు ఏ కొద్ది అమ్ముడుపోవాలన్నా అది చాలా  అవసరం. చాలా  సింపుల్ గా నేను దీన్ని డీల్ చేస్తాను. నేను రాస్తున్న సీన్లలో ఒకదాన్ని బాగా ఇష్టపడి పదేపదే రీరైట్ చేసి మెరుగు పరుస్తున్నా ననుకోండి- అప్పుడు ఓ వైపు నుంచి నా మైండ్ చెప్తూనే వుంటుంది- ఫస్ట్ కట్ చేయాల్సింది ఆ సీన్నే అని. సీన్లమీద మమకారాలే అలాటివి. ఆ మమకారాలు లాజిక్ ని చంపేస్తాయి. ఇలా నన్ను నేను ఎడిట్ చేసుకునే సౌమనస్యం నాకుంటే- అప్పుడు ఆ స్క్రిప్ట్ గురించి ఏ స్టూడియో నుంచో, ఏ ప్రొడ్యూసర్ నుంచో బెటర్ మెంట్ నోట్స్ నాకందితే, నేను బాధపడే ప్రసక్తే వుండదు.


***

.