రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 15, 2015

సాంకేతికం- కెమెరా


సినిమా కోసం టెక్నాలజీయా, లేక టెక్నాలజీ
కోసం సినిమానా? ఇదీ ఇప్పుడేసుకోవాల్సిన ప్రశ్న!

టెక్నాలజీ కోసమే సినిమాలు తీస్తూపోతే చూసుకోవడానికి ఫ్లాపులే మిగలొచ్చు.
మాట్ డామన్ నటించిన  హాలీవుడ్ మెగా మూవీ ‘బోర్న్ సుప్రమసీ’ లో విజువల్ అప్రోచ్ ఎలాంటిదంటే ఆ యాక్షన్ హంగామాలో ఒక్క గ్రాఫిక్స్ ముక్క కన్పిస్తే ఒట్టు. పోరాటాల్లో వైర్ వర్క్, డూప్ నెట్స్ వంటి మెకానిజాలు  కూడా మచ్చుకి కానరావు.
సగటున 1.9 సెకన్ల నిడివి వుండే ఆ సూక్ష్మాతి సూక్ష్మ షాట్స్ తో రాకెట్ వేగంతో దూసుకెళ్ళే దృశ్యాలే ఈ సినిమాకి ప్రాణం. ఉద్దేశపూర్వకంగా డాక్యుమెంటరీ ఫీల్ కోసం ఒకే ఒక్క హేండ్ హెల్డ్ కెమెరాతో దీని చిత్రీకరణ అనన్య సామాన్యం.

       కలరిస్టుకి కాలూ చెయ్యీ ఆడని ఆ మైక్రో షాట్స్ కి చేసిన డీఐ డల్ గానూ, కంటికి చలవ చేసేదిగానూ ఉంటే, ఇక డీటీఎస్ కత్తి మీద సాము. ఎందుకంటే, కాంతి వేగం కంటే శబ్ద వేగం తక్కువ కాబట్టి. దీన్ని కూడా పట్టుబట్టి సాధించారంటే, సినిమాకోసం టెక్నాలజీ కాక మరేమనుకోవాలి?

          ఇదే ప్రముఖ ఛాయాగ్రాహకుడు టి.  సురేంద్ర రెడ్డి ని బాగా ఆకర్షించింది. హాలీవుడ్ షాట్స్ చూపించి అలా తీయమని తనని ఒత్తిడి చేసే దర్శకులు లేకపోలేదు. ఈ కాపీ కౌపీనానికి దూరంగా ‘బోర్న్ సుప్రమసీ’ చూస్తూంటే ఆయనకో ఆలోచన మెరిసింది. దాన్ని అమల్లో పెట్టేశారు. అది ‘నీ ఇల్లదే‘ అనే కన్నడ సినిమా. అందులో కొత్తగా ఆయన చేసిన ప్రయోగం మల్టిపుల్ ఫార్మాట్ లో చిత్రీకరణ. సాధారణ ఎనలాగ్ కెమెరాతో బాటు, ఒక 4కే ( అంటే నాలుగు వేల రిజల్యూషన్ గలది), మరొక 2 కే డిజిటల్ కెమెరాలు రెండూ, ఇంకో సాధారణ వీడియో కెమెరా ఒకటీ - కలిపి ఉపయోగించి ఈ సినిమా షూట్ చేశారు. 

       గతంలో ‘ఆ నల్గురు’లో మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులకి ఒకే ఫార్మాట్ లో (ఎనలాగ్)  గ్రేడింగ్స్ మార్చి తేడా కనబర్చారు సురేంద్ర రెడ్డి.  ఈ కన్నడ సినిమాలో సన్నివేశాల డిమాండ్ ని బట్టి మల్టిపుల్ ఫార్మాట్ కి వెళ్ళారు. పై హాలీవుడ్ సినిమాలో అది స్టడీకామే అయినా, సీన్లు డిమాండ్ చేస్తున్న సెన్సాఫ్ అర్జెన్సీ దృష్ట్యా దాన్నెలా వాడుకున్నారో, అలా పరస్పర నాల్గు విభిన్న ఫార్మాట్స్ తో ఈ కన్నడ సినిమా చేశారాయన.

          ‘ఇప్పుడొస్తున్నవి చికెన్ ఫ్రై సినిమాలు’ అని ఆయన అధిక్షేపణ. ‘మనం అన్నం తింటున్నప్పుడు కాస్త పప్పు, కూర, సాంబారు, పచ్చడి, అప్పడం, పెరుగూ.. ఇలా ఎప్పుడేది కావాలో పెట్టుకుంటూ తింటాం. ఎప్పుడో గానీ చికెన్ ఫ్రై తినం. చికెన్ ఫ్రయ్యే రోజూ తింటే ఎలా వుంటుంది? అలాగే ఉంటున్నాయి ఇప్పుడొస్తున్న సినిమాలు. బిల్డప్పుల కోసం సినిమాని టెక్నాలజీతో నింపేస్తున్నారు. కథని కథలా చూపించడం లేదు’ అని బాధపడ్డారు.

           పైన చెప్పుకున్న హాలీవుడ్ సినిమాలో హీరో న్యూ ఢిల్లీ వచ్చి రోడ్డు పక్క మినరల్ వాటర్ కొంటాడు. అది హిమాలయన్ నేచురల్ మినరల్ వాటర్ అనే స్టార్ హోటళ్ళలో సంపన్నులు తాగే ఖరీదైన నీరు. దాన్ని రోడ్డు పక్క ఎక్కడా అమ్మరు. అలాగే ఇంకోచోట, హీరో ఒకణ్ణి హరీ మన్పిస్తూంటే, ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఓ మూలన షూటింగ్ ఎక్విప్ మెంట్ అలాగే పెట్టేసి కన్పిస్తుంది. మన సినిమాల్లో టెక్నాజీ భయపెడితే, హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి ‘అదనపు హంగులు’ నవ్విస్తాయన్న మాట!  ఈ హైపర్ యాక్టివ్ టెక్నాలజీ యుగంలో మరి సురేంద్ర రెడ్డి ముద్రని ఎలా గుర్తు పట్టాలి? పది రకాల బొమ్మల్లో ఆయన బొమ్మ ఎలా ప్రత్యేకం? అంటే...’ఫేస్ మౌల్దింగ్ నా స్పెషాలిటీ’ అని ప్రకటించారు. పాత్రని విశ్లేషించుకుని, అది మనసులో ముద్రించుకునేలా క్లోజప్స్ వేయడమే తన ప్రత్యేకత అన్నారు. ‘ఆ నలుగురు’ లో రాజేంద్ర ప్రసాద్ కి ఇలాంటి క్లోజప్సే ఉంటాయన్నారు.

         మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో కొనసాగుతూ నలభై సినిమాలు పూర్తి చేసిన తను, ప్రస్తుతం  సునీల్ శెట్టితో ‘రూట్స్’ అనే హిందీ సినిమాకి ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు. మణిశంకర్ తీసిన ‘డిసెంబర్ 16’, ‘రుద్రాక్ష’, ‘టాంగో చార్లీ’  అనే హిందీ సినిమాలకి కూడా ఛా యాగ్రహణం అందించిన అదృష్టాన్ని సంపాదించుకున్నారు. మణిశంకర్ లా సినిమాని ఎగ్జిక్యూట్ చేసే దర్శకులు తెలుగులో లేరని అభిప్రాయపడ్డారు. దీనిక్కారణం, తెలుగులో దర్శకులే రచయితలుగా మారడంతో రచయితల తోడ్పాటు కోల్పోవడమే నని అన్నారు. ఫలితంగా రచయితలుగా మారిన దర్శకులూ, దర్శకులుగా మారిన  రచయితలూ సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా రన్నారు.

          పోతే, తను ఆసియాలోనే మొదటి సారిగా,  ప్రపంచంలో మూడోదిగా, తెలుగులో ‘టాస్’ అనే సినిమాని వైపర్ కెమెరాతో డిజిటల్ లో తీశానన్నారు.

          ఇక డీఐ విషయానికొస్తే, మనమింకా ఇందులో పరిపూర్ణత సాధించలేదన్నారు. ‘కెమెరాతో ఓ దృశ్యాన్ని తీస్తే, దగ్గరగా వున్న కొండ ముదురు రంగులో, దాని వెనకున్న కొండ కొంత రంగు తగ్గీ, అలాగే ఆ వెనక వుండే కొండ పూర్తిగా రంగు తగ్గిపోయీ కన్పిస్తాయి. అప్పుడే వాటి మధ్య దూరాలున్నట్టు డెప్త్ కన్పిస్తుంది. ఇదే దృశ్యాన్ని డీఐ చేసినప్పుడు  దూరాలు అదృశ్య మైపోతున్నాయి. డీఐ చేశాక దృశ్యం మరింత అద్భుతంగా కన్పించే మాట నిజమే, కానీ అందులో డెప్త్ మాత్రం వుండడం లేదు. ఈ సమస్యని రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ లో కొంతవరకూ అధిగమించగలిగా’ రన్నారు సురేంద్ర రెడ్డి.

     17వ ఏటనే నెల్లూరు నుంచి మద్రాసు వెళ్లి అంచెలంచెలుగా కెమెరామాన్ గా ఎదిగిన తను, రీమేక్స్ కి ఎక్కువగా పని చేయలేదన్నారు. ఒక సినిమాని రిమేక్ కి తీసుకున్నప్పుడు నిర్మాతా రచయితా తప్ప, దర్శకుడూ కెమెరామాన్ దాన్ని చూడకుండా వుంటే, సొంత క్రియేటివిటీ ని చూపించుకునే అవకాశం ఉంటుందన్నారు తంబిరెడ్డి సురేంద్ర రెడ్డి.


సికిందర్
( ఆంధ్రజ్యోతి- నవంబర్ 2010, 'సినిమా టెక్' శీర్షిక’)