రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, July 19, 2015

సర్ప్రైజ్ సల్మాన్!


దర్శకత్వం :  కబీర్ ఖాన్
తారాగణం : సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, హర్షాలీ మల్హోత్రా, నవాజుద్దీన్ సిద్దిఖీ,  శరత్ సక్సేనా, ఓంపురి తదితరులు
సంగీతం : ప్రీతమ్ , ఛాయాగ్రహణం : ఆసీమ్ మిశ్రా,   కథ : వి. విజయేంద్రప్రసాద్, 

స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్, వి. విజయేంద్రప్రసాద్,  పర్వేజ్ షేక్,  అసద్ హుస్సేన్, మాటలు : కబీర్ ఖాన్ - కౌసర్ మునీర్
బ్యానర్ :  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్- కబీర్ ఖాన్ ఫిలిమ్స్, నిర్మాతలు : సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్
విడుదల :  17  జులై, 2015
*
ల్మాన్ అభిమానులకు సర్ప్రైజ్ ఆఫర్! తమ అభిమాన సూపర్ స్టార్ నుంచి మరో రెగ్యులర్ మాస్ మసాలా కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఎదురుచూడని షాక్. వస్తాడు, సల్లూ భాయ్ వస్తాడు, ఈ సారికూడా షర్టు విప్పి సిక్స్ ప్యాక్ ప్రదర్శిస్తాడు, పంచ్ డైలాగులు కొట్టి విరగదీసే ఫైట్లు చేస్తాడు, గాల్లోకెగిరి విలన్స్ ని తంతాడు, హీరోయిన్ తో చిలిపి చేష్టలకి పాల్పడి, కిర్రెక్కించే పాటలు పాడతాడు, ఐటెం సాంగ్ తో గోల సృష్టిస్తాడు, కడుపుబ్బా కామెడీతో నవ్వించి, బంపర్ గా ఎంటర్ టైన్ చేస్తాడు... తన స్టయిల్- టెంపర్-స్టామినా- యాటిట్యూడ్ లతో మరోసారి నంబర్ వన్ అన్పించుకుంటాడు- అనుకుంటూ కాలరెగరేస్తూ వేంచేసే జీవితకాల ఫ్యాన్ గిరీకి కమిట్ అయిన వాళ్ళకి, ఊహించని కౌంటర్ పంచ్  ఈ ‘భజరంగీ భాయిజాన్’ !
టైటిల్ లోనే కావలసినంత మాస్ అప్పీల్ వుంది. దీంతో సినిమా ఎంత మాస్ మసాలాగా వుంటుందో ఊహించుకుంటూ వచ్చిన వాళ్లకి సాంతం ఒక సాఫ్ట్ సెంటిమెంటల్ డ్రామాతో ఉక్కిరిబిక్కిరి చేయడమేకాదు, మారు మాటాడకుండా పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయ్యేట్టూ చేసి, హృదయాల్ని కదిలించే విశేషాలతో ఒప్పించడం సల్మాన్ కే చెల్లింది!
          సల్మాన్ కన్పించకుండా పాత్రేకన్పించడం, అదికూడా  సెన్సిబుల్ గా, సెన్సిటివ్ గా ఇండియా-పాకిస్తాన్ ప్రజల మనోభావాలతో, భావోద్వేగాలతో దాగుడుమూతలాడే అమాయక చక్రవర్తి గా, అతిజాగ్రత్తగా బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసి అమీర్ ఖాన్ ని మరిపించాడు. ‘పీకే’ లో అమీర్ ఖాన్ పాత్ర అన్నిమతాల మీదా సెటైర్ అయితే, సల్మాన్ ది ఇరుదేశాల మీద సున్నిత వ్యంగ్యాస్త్రం.
          స్టార్ సినిమా అనగానే సకల నకరాల అవకరాలతోనే  అలరించాలన్న నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ, అవేమీ లేకుండా సింపుల్ గా హృదయాల్ని జయించే సమ్మోహనాస్త్రాలతో చివరంటా ప్రేక్షకుల చేత కేరింతలు కొట్టించవచ్చని ఈ పాత్రకి ఒప్పుకుని రుజువు చేశాడు.
          దర్శకుడు కబీర్ ఖాన్ (హైదరాబాద్ వాస్తవ్యుడు)  ఈ సినిమాతో చాలా ధైర్యమే చేశాడు. పాక్ సైనికుల్ని, పోలీసుల్నీ ఇట్టే రాజీపడిపోయే  ధోరణిలో చూపించి ఇండియన్ బాక్సాఫీసుకి   బాగానే బలం పెpచుకున్నాడు.  అయినా దీన్ని పాకిస్తాన్ లో ప్రదర్శించేందుకు అక్కడి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నలివ్వడం ఆశ్చర్య పర్చేదే. ( కబీర్ ‘ఏక్  థా టైగర్’ పాకిస్తాన్ లో విడుదల కాలేదు- ఐ ఎస్ ఐ ని చెడుగా చూపించారని) ఐతే ఇదే రోజు అక్కడ విడుదలవ్వాల్సిన ఈ సినిమా ఒక ఖవ్వాలీ కాపీ రైట్ కి సంబంధించిన కారణాలతో ఆగింది.
          సాధారణంగా రెండు దేశాల మధ్య సినిమా అనగానే  అక్కడి అమ్మాయి- ఇక్కడి అబ్బాయి, లేదా దీన్ని రివర్స్ చేసి చూపించే  ప్రేమ సినిమాలుగానే వుంటాయి. ( ‘పీకే’ లో కూడా ఇదే జరిగింది) దీనికి భిన్నంగా ఇక్కడ తప్పిపోయిన అక్కడి ఒక చిన్నమ్మాయి కథని తీసుకుని – దాని చుట్టే భావోద్వేగాల్ని కేంద్రీకృతం చేసి, ఇంత భారీస్థాయి  స్టార్ సినిమా తీయాలంటే కూడా ధైర్యమే  కావాలి.
          ఆ ధైర్యం ఎలా చేశారో చూద్దాం..

భోళా భజరంగీ!

  
      పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఆరంభం. కాశ్మీర్ లోయ అందాలన్నీ కళ్ళు చెదిరేట్టు చూపిస్తూ, జిల్లా సుల్తాన్ పూర్ అనే వూళ్ళో ఒకింట్లోకి ప్రవేశించాక, అక్కడ టీవీలో క్రికెట్ చూస్తున్న గుంపుఒకటి. షాహిద్ అఫ్రిదీ కొడుతున్న సిక్సర్ లకి ఎక్సైట్ అవుతున్న ఆ గుంపులో ఒక గర్భవతి,  తనకి మగ పిల్లాడు పుడితే షాహిద్ అని పేరు పెట్టుకుంటా నంటుంది.
        ఆడపిల్ల పుడుతుంది. ఆమె షాహేదా ( హర్షాలీ మల్హోత్రా) అవుతుంది. కానీ మూగది. ఆరేళ్ళప్పుడు ఈ మూగ పిల్లని వెంట బెట్టుకుని ఢిల్లీ – లాహోర్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ ఎక్కి వాఘా సరిహద్దు దాటి ఇండియా కొస్తుంది. అక్కడ ఒక దర్గాలో మొక్కుకుని తిరిగి వెళ్తున్నప్పుడు షాహెదా కన్పించకుండా పోతుంది.
          కాశ్మీర్ లోయలో పుట్టి పెరిగిన షాహెదాకి ప్రకృతి అందాలన్నా, వాటిలో తిరుగాడే జీవాలన్నా పిచ్చి. ప్రకృతిలో ఆడుకుంటూ తప్పిపోవడమూ అలవాటే. ఇప్పుడు కూడా రైలు దిగి మేక పిల్లతో ఆడుకుంటూంటే రైలెళ్లి పోతుంది.
          ఆమె తల్లి కనిపెట్టి రైలాపి వచ్చేసరికి బోర్డర్ గేట్లకి తాళాలు పడిపోతాయి. ఇక తీయరు. కట్ చేస్తే మూగమ్మాయి ఎక్కడో హర్యానా లోని కురుక్షేత్రలో తేలుతుంది. అక్కడ హనుమాన్ ఉత్సవంలో సెల్ఫీ లేలేరే ...అంటూ ఆటా పాటా తో తెగ ఎంజాయ్ చేస్తూంటాడు పవన్ కుమార్ చతుర్వేది అలియాస్ భజరంగీ ( సల్మాన్ ఖాన్). ఇతను కరుడుగట్టిన వీర హనుమాన్ భక్తుడు. ఎక్కడ హనుమాన్ విగ్రహం కనిపిస్తేనే కాదు, కోతులు కన్పించినా నిష్కళంకమైన భక్తితో దండాలు పెట్టేస్తాడు. (‘హమ్  భజరంగ్ బలీ కే భక్త్  హై, మర్జాయేంగే లేకిన్ ఝూట్ నహీ బోలేంగే’ – నేను భజరంగ్ బలీ భక్తుణ్ణి, చావనైనా చస్తానుగానీ అబద్ధం చెప్పను)  అనే మైండ్ సెట్ తో నిజాలు చెప్పేస్తూ భోళా మనిషిగా ఉంటాడు. ఇతడి వెంట పడుతుంది ఆ మూగమ్మాయి.
          ఈ మూగపిల్ల ఎవరో ఏమిటో తెలీక, వదిలించుకుందామన్నావదలక పోయేసరికి,  అలాగే వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్తూ,  ఆ బస్సులో ప్రయాణీకులకి తన ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటాడు. ప్రతాప్ ఘర్ లో ఆరెస్సెస్ సభ్యుడైన తండ్రి ఆశయాల్ని కొనసాగించాలంటే ఆ చదువు చదవలేక, కుస్తీ పట్లు నేర్చుకోలేక, హనుమాన్ భక్తి మాత్రమే  క్వాలిఫికేషన్ గా తిరుగుతున్నఅతణ్ణి, తండ్రి ఢిల్లీ లో తన మిత్రుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని, ఆయన చూపించే జాబ్ చేసుకొమ్మని పంపించేస్తే – అక్కడ సద్బ్రాహ్మణుడైన ఆ మిత్రుడు దిగంబర్ ( శరత్ సక్సేనా) ఇంట్లో సెటిలై కూతురు రసిక ( కరీనా కపూర్) తో ప్రేమలో పడ్డాడు. ఆర్నెల్లలో ఇల్లు కొనుక్కోగలిగితే పెళ్లి చేస్తానన్నాడు దిగంబర్. ఆ ప్రయత్నాల్లోనే వున్న తనకి ఇక్కడ కురుక్షేత్రలో భారీ ఎత్తున హనుమాన్ పూజ జరుగుతోందని తెలిసి ఆగలేక వచ్చేశాడు..


          ఇలా ఇక్కడ దొరికిన మూగమ్మాయిని వెంటబెట్టుకుని దిగంబర్ ఇంటి కెళ్ళే సరికి, ముందు తెల్లగానే వుంది గనుక బ్రాహ్మణ పిల్లే అయివుంటుందన్న పవన్ మాటల్ని నమ్మి  ‘మున్నీ’ అని పేరు పెట్టుకుని దిగంబర్ ఇంట్లోనే పెట్టుకుంటే,  తర్వాత ఆమె దొంగ చాటుగా చికెన్ తినేసేసరికి క్షత్రియ అయి ఉంటుందిలే, వాళ్ళూ తెల్లగానే ఉంటారని పవన్ సర్ది చెప్పాక, ఆఖరికా అమ్మాయి మసీదులో ప్రార్ధన కూడా చేసేసరికి పవన్ సహా మొత్తమంతా ఠారెత్తి పోయి గగ్గోలు పెడతారు. ఇలా ఆలోచించ కూడదని వారిస్తుంది రసిక. ఇలాకూడా సర్దుకున్నాక, టీవీలో క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు గెలిచేసరికి మున్నీ ఆనందంతో గంతులేసేసరికి- ఆమె పాకిస్తానీ అని కూడా అర్ధమైపోయి- అసలే దేశభక్తీ, మతభావాలూ ఎక్కువున్న పవన్ ఇక మున్నీని వదిలించుకోవాలని నిర్ణయించుకుంటాడు.
          అయితే ఏమూలో వున్న మానవత్వం వల్ల ఏ బజార్లోనో వదిలెయ్యక, ఆమె దేశంలో ఆమె ఇంటికే  తీసికెళ్ళి అప్పగించాలని ప్రణాళిక వేసుకుంటాడు. లేకపోతే తన హనుమాన్ ఒప్పుకోడు!
          ఈ ప్రణాళికలో ఎన్ని ఎదురు చూడని మలుపు లెదురయ్యాయి, ఎన్నికష్టాలు పడ్డాడు, పర దేశంలో ఇండియన్ ఏజెంటుగా ముద్రపడి ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు- అయినా మానవత్వం కోసం నిల్చి ఆ దేశపు వాళ్ళని ఎలా తన పాదాక్రాంతం చేసుకున్నాడు.. ఇవన్నీ ఇక్కడ్నించీ కొనసాగే ద్వితీయార్ధపు ఘట్టాలు..

ఎవరెలా చేశారు
      సూపర్ స్టార్ గా సల్మాన్ ఖాన్  తన ఇమేజిని సైతం చంపేసుకుని పూర్తిగా డౌన్ ప్లే చేసిన పాత్ర ఇది. తెచ్చిపెట్టుకున్న హీరోయిజం లేదు, పోరాట విన్యాసాల్లేవు. కేవలం ఒక అమాయక చక్రవర్తి పాత్రగానే, అబద్ధం చెప్పని విలువలున్న హనుమాన్ భక్తుడి కుండాల్సిన వినమ్రతతోనే  చివరివరకూ మిస్సవని అదే ఫ్లోలో పాత్రని నిలబెడుతూ పోయాడు. సంఘర్షణ తన లోపలే వుంటుంది. శాఖాహారి అయిన తనకి మున్నీ మాంసాహారి అని తెలిసినప్పుడు పడే సంఘర్షణ, ఆమెది  వేరే మతం- దేశం అని తెలిసినప్పుడు కలిగే వైముఖ్యం,  పరదేశంలో జైశ్రీరాం అంటూ నమస్కరిచడం తప్ప, సలాము చెయ్యని నిబద్ధత- ఇలాటి తను నెమ్మది నెమ్మదిగా మానవత్వం వైపు మొగ్గే స్థితి కి చేరుకోక తప్పని పరిస్థితులూ.. చివరికా దేశం నుంచి వెను దిరుగుతు
న్నప్పుడు నేర్చుకున్న మానవత్వపు   పాఠాలకి సలాము చేయడం..ప్రతిగా వాళ్ళూ అతడి పేరుతో నినాదాలు హోరెత్తించడమూ..ఇవన్నీ కేవలం.. కేవలం ఆ పాత్రే కన్పించేట్టు చేశాయే తప్ప సల్మాన్ ని కాదు!  
          అయినంత మాత్రాన ఇది పాసివ్ పాత్రకాదు. ఆత్మరక్షణ కోసమైనా, కళ్ళముందు అన్యాయం జరిగినా ఎదురు తిరిగి కొట్టేసే తత్త్వమే. పాక్ పోలీస్ స్టేషన్లో మున్నీతో మిస్ బిహేవ్ చేసిన పోలీసుల్ని చితగ్గొట్టి పారిపోయే సీను అలాటిదే. తన దగ్గర పాస్ పోర్టు వీసాల్లేవు, శాఖాహారి కూడా, పైగా అక్రమంగా వాళ్ళ దేశంలో చొరబడ్డాడు. ఒక హనుమాన్ భక్తుడిగా ఈ నిజాలే చెప్పి, తనకి లీగల్ గా అనుమతి నివ్వందే కదలనంటాడు. ఇలా అనుమతి ఇచ్చే పరిస్థితి లేక, విసిగిపోయిన ఆ గస్తీ సైనికాధికారి  - అలాగే పోరా బాబూ, మా దేశంలో తగలడు ఫో! – అన్నాకూడా, అధికారికంగా పోనిస్తేనే అమ్మాయిని తీసుకుని మీ దేశంలోకి పోతానని పేచీ పెట్టుకుంటాడు. ఇలా భోళాతనంతో సిట్యుయేషనల్ కామెడీతో ఎంటర్ టెయిన్ చేసే దృశ్యా లెన్నో.
          సాధారణంగా ఏం జరుగుతుందంటే, హీరో ఒక వేళ అమాయకుడిలా వున్నా, ఇంటర్వెల్ దగ్గర ప్రాబ్లం లో పడేసరికి ఆ తర్వాత నుంచి క్యారెక్టరైజేషన్ ని మార్చేసి, డేర్ డెవిల్ గా
- ఫుల్ టైం యాక్షన్ హీరోగా చూపిస్తూంటారు. కానీ ఈ సినిమాలో అదే అమాయక చక్రవర్తి క్యారెక్టర్ ని చివరి వరకూ  కొనసాగించారు. ఇందుకు రెండు కారణాలున్నాయి : హనుమాన్ భక్తుడిగా అతడిది  సెంటిమెంటుతో నీతికీ నిజయితీకీ కట్టుబడే సున్నిత పాత్ర కావడంతో, ఉన్నపళాన యాక్షన్ హీరోగా మారిపోలేడు. రెండోది, యాక్షన్ హీరోగా మారిపోతే చెప్పాలనుకున్న అర్ధవంతమైన క్యారక్టర్ గ్రోత్ మంట గలిసిపోతుంది. అంత అవసరం లేని మౌఢ్యంతో వున్న అతణ్ణి మతాలకీ, దేశాలకీ అతీతమైన మానవత్వం వైపు నడిపించాలంటే యాక్షన్ కథనం తో సాధ్యం కాదు. ఇంకో పక్క యాక్షన్ కథగా మార్చేస్తే, ఈ సినిమాకి ఆయువుపట్టులాంటి బాలనటి పాత్ర అన్యాయమైపోయి సినిమా కూడా గంగలో కలిసిపోతుంది. అదెలాగో ఈ కింద చూద్దాం.
***


           అసలు సల్మాన్ ఖాన్ తన పాత్రతో ఏమీ ఏడ్పించడు. ఆ మాట కొస్తే ఏడ్పు తెప్పించడానికి ఇంకే పాత్రనీ వాడుకోలేదు- మూగమ్మాయి తల్లిని కూడా! అలా చేస్తే ఆ ఫీల్ ఆయా పాత్రల మీదికి మళ్ళి అసలు పాత్ర మీద ప్రభావం చూపకుండా పోతుంది. ఆ అసలు పాత్ర కూడా వాళ్ళల్లో ఒకటిగా ప్రాధాన్యం కోల్పోతుంది - ఏడ్పంతా, కళ్ళు చెమర్చేదంతా, హృదయాల్ని మెలిదిప్పేదంతా- ఆ అసలు పాత్ర షాహెదా అలియాస్ మున్నీకే  పరిమితం చేసి మంచి కథకుల లక్షణాన్ని ప్రదర్శించికున్నారు రచయితలూ దర్శకుడూ.   
          ఈ పాత్ర లేకపోతే కొంత, ఈ పాత్ర నటించిన బాలనటి హర్షాలీ మల్హోత్రా లేకపోతే మొత్తం సినిమాయే వుండదనేది నిశ్చయం. ఈ బాలనటితో సల్మాన్ సెన్సిబుల్ గా నటించడం వరకూ మాత్రమే చేశాడు. ఆయా సన్నివేశాల్లో ఈ బాలనటి పరిస్థితులకే ఎమోషన్స్ పెల్లుబికి ఏడ్పులొచ్చేస్తాయి. తను ఏడ్వకుండానే ఏడ్పించ గలగడం ఈ బాలనటి మూగ పాత్ర చిత్రణకున్న బలం. ఈ పాత్ర కథలో ప్లాట్ డివైస్ లాంటిది. సాధారణంగా ప్లాట్ డివైస్ లు ఎక్కడో దొరికే ఏ తాళం చెవో, లేదా కారు డిక్కీలో ఏ  శవమో, ఇంకేదో అయి వుండి వాటి చుట్టే- థ్రిల్స్, సస్పెన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్స్ వగైరా ఏర్పడి కథకి బలాన్నిస్తాయి. అలాటి ప్లాట్ డివైస్ గా మాత్రమే ఈ మూగ బాలిక పాత్ర చుట్టూ అన్ని భావోద్వేగాలూ కేంద్రీకృతమై కథకి ఆత్మ అయి కూర్చున్నాయి.    ముగింపు దృశ్యంలో మూగ బాలిక ప్రయత్నం ఫలిస్తే ప్రేక్షకులెంత కేరింతలు కొడతారో- ఆ వెంటనే చిట్ట చివరి షాట్ లో సల్మాన్- మూగ బాలికల హేపీ మూమెంట్స్ కి  అంత కళ్ళు తుడుచుకుంటూ బయటికొస్తారు. కాబట్టి ఈ బాలనటి పాత్రతో తో కనీసం డజను సార్లు చాపకింద నీరులా ఉంటూ పెల్లుబికించే అశ్రునయన సహిత సన్నివేశాలకి ముందు జాగ్రత్తగా ప్రేక్షకులు కర్చీఫులు, టవల్సు వెంట బెట్టుకు వెళ్ళడం మంచిది. వూహ కూడా తెలీని వయసులో బాలనటి హర్షాలీ కిది  హేట్సాఫ్ చెప్పాల్సిన విజయం. ఇలాటి బలమైన మూగ బాలిక పాత్ర ఉన్నాక కథని సల్మాన్ మీదికి తోసేసి అతణ్ణి యాక్షన్ హీరోగా మార్చేస్తే బాలిక పాత్ర గల్లంతై పోతుంది- దాంతో సందేహం లేకుండా సినిమా కూడా!
***


        మూడో కీలక పాత్ర నవాజుద్దీన్ సిద్దిఖీది. ఏ భేషజాలూ లేకుండా కొన్ని సినిమాల్లో ఆర్ట్ ఫిలిం తరహా పాత్రలు కూడా పోషిస్తూ ఒక విభిన్న సహాయ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న నవాజుద్దీన్, ఈ సినిమా  ద్వితీయార్ధంలో పాకిస్తాన్ లో ఎంట్రీ ఇస్తాడు- అయోమయపు డబ్బా టీవీ జర్నలిస్టు చాంద్ నవాబ్ గా- ఎప్పుడూ బిరికింగ్ ( బ్రేకింగ్ కి అతడి యాస!) న్యూస్ ఇవ్వాలనుకునే ఆరాటంతో. కొన్ని దురదృష్టకర పరిణామాలు సంభవించి పవన్ తో, ఆ మూగమ్మాయితో కలిసి పారిపోతూ ఉండాల్సి వస్తుంది పోలీసుల్నుంచి. ఈ అనుభవాలతో ఒక్కటి మాత్రం ప్రొఫెషనల్ గా అర్ధం జేసుకుని  అంటాడు- ద్వేషం అమ్ముడుపోయినంత సులభంగా ప్రేమ అమ్ముడు పోదని!  ఓపెన్ కామెడీతో సెకండాఫ్ లో మరొక ప్రధానాకర్షణ అయ్యాడతను.
          ఇక కరీనా కపూర్ ది సింపుల్ మధ్యతరగతి టీచర్ పాత్ర. వృత్తికి తగ్గ సెక్యులర్ భావాలే గాక, జీవితం పట్ల స్పష్టత, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో కాదనలేని లాజిక్ ఆమె సొంతం. ఎవరితోనో పెళ్లి చూపులప్పుడు, పవన్ చేయి పట్టుకు లాక్కొచ్చి తండ్రితో అంటుంది అందరి ముందూ- పవన్ లో తను  ఫాదర్ ఫిగర్ ని చూశాననీ, అది ఇంకెవరిలోనూ చూడలేననీ. అప్పుడా తండ్రి వెంటనే ఆమెని ఆలింగనం చేసుకుంటాడు. ఆడపిల్లల గురించి సైకాలజీ ఏమంటుందో అదిక్కడ ప్లే చేసి అర్ధవంతమైన పాత్రగా మార్చారు. ఐతే ఈ పాత్ర తో ఇంటర్వెల్ తర్వాత పవన్ పాకిస్తాన్ వెళ్ళిపోయాక పనిలేకుండా పోయింది. అలాగని రొటీన్ గా సినిమాల్లో చూపిస్తున్నట్టు పరస్పరం తల్చుకుని డ్రీమ్  సాంగులు పాడుకోవడం లాంటి పన్లకి పొరపాటున కూడా పాల్పడలేదు. ఈ పని చేసి వుంటే  సెకండాఫ్ సర్వనాశన మయ్యేది.
          ఇక ఆసీమ్ మిశ్రా ఛాయాగ్రహణం, ప్రీతమ్ సంగీతం సినిమాకి  హైలైటనే చెప్పొచ్చు. దర్శకుడుగా కబీర్ ధైర్యం తో బాటు నిగ్రహం కూడా కనబరచాడు. అలాగే సినిమాని హేండిల్ చేసే విషయంలో  పరిణతి కూడా ప్రదర్శించాడు. ఆరెస్సెస్ వంటి సంఘపరివార్ దళాల్ని చూపించడం, ఢిల్లీలో పాక్ ఎంబసీ మీద దాడి చేయించడం, పాకిస్తాన్లో  సైనిక- పోలీసు దళాల తెలివితక్కువతనాన్ని చూపడం, వాఘా  బోర్డర్లో రైళ్ళ రాకపోకల విధానం, పాకిస్తాన్ లోతట్టు గ్రామాల వాతావరణం  చూపడం వంటి దృశ్యాలు ప్రేక్షకులకి ఇదివరకు వెండి తెరమీద చూడని కొత్త అనుభవాలుగా ఫ్రెష్ గా అన్పిస్తాయి. కురుక్షేత్ర  రైల్వే స్టేషన్ లో కాషాయ కార్యకర్తల హాడావిడి ఏరియల్ షాట్ మేజర్ ఎట్రాక్షన్. ఇలా చెప్పుకుంటే ఎన్నోవున్నాయి.

స్క్రీన్ ప్లే సంగతులు
          వి.విజయేంద్రప్రసాద్  రాసిన కథ ఇది. తనతోపాటు కబీర్ ఖాన్, మరో ఇద్దరు రచయితలూ కలిసి రూపొందించారు ఈ స్క్రీన్ ప్లేని. ఏ మాత్రం గజిబిజి, గందరగోళం, ఏం చెప్తున్నామో అర్ధంగాని అయోమయం, చెప్తున్నది వదిలేసి పక్కదారి పట్టించడం లాంటి అవక్షణాలు లేని స్క్రీన్ ప్లే ఇది. దేని ఆధారంగా ఎవరి కథ చెప్పాలి, ఆ కథ మీంచి, ఆ పాత్ర మీంచి దృష్టి చెదరకుండా ఎలా చెప్పాలీ  అన్న- సరైన ఎజెండా ఏర్పాటు చేసుకుని, సెన్సిటివిటీ అనే ఒకే ఒక్క ట్రాక్ మీద సీదాగా నడిపించుకొచ్చిన వైనం స్పష్టంగా కనపడుతుంది. ఒక మంచి స్క్రీన్ ప్లే ని విశ్లేషించే అవకాశం ‘మనం’ తర్వాత ఇదే.
          ఏ స్క్రీన్ ప్లే కైనా  రెండు మూల స్తంభాల వంటి మలుపులు- బిగినింగ్ ముగింపులో ఒకటి, మిడిల్ ముగింపులో ఒకటి ఉంటాయనేది తెలిసిందే. మొదటి మలుపు ప్రధాన పాత్రకి సమస్యని సృష్టిస్తే, రెండో ముగింపు ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని అందిస్తుంది.. ఈ రెండిటి మధ్య జరిగేది ఆ సమస్యతో ప్రధాన పాత్ర పోరాటమే. అయితే మంచి స్క్రీన్ ప్లే లో ఈ మలుపులు ఎలా ఉంటాయంటే- మొదటి మలుపు సమస్యా సృష్టికి దారి తీసే పరిస్థితుల కల్పన కొట్టొచ్చినట్టుండే సీన్లతో మనసులో ముద్ర వేసేస్తాయి. అలాగే రెండో మలుపు ఆ సమస్య  పరిష్కారమార్గానికి దారితీసే సీన్లు కూడా అంటే కొట్టొచ్చినట్టుంటాయి. సమస్య ని తెలుపుతూ సృష్టించే సీనుతో కలిపి  ఆ సీను కి దారితీసే సపోర్టింగ్ సీన్లూ;  మళ్ళీ పరిష్కార మార్గాన్ని సూచించే సీను తో కలిపి దీనికి దారి తీసే సపోర్టింగ్ సీన్లూ-  ఫస్టాఫ్ లో సెకండాఫ్ లో రెండువైపులా ఈ రెండు గుత్తులతో ఏర్పాటయ్యే మూలస్థంబాలు రెండూ కథకి అత్యంత బలాన్ని చేకూరుస్తాయి. కథని ప్రేక్షకుల మనోఫలకాల మీద బలంగా నాటుతాయి.
          దురదృష్ట వశాత్తూ ఇలాటి  రెండు మూల స్తంబాలూ సపోర్టింగ్ సీన్లు లేకుండానే, వున్నా అరకొరగా ఉంటూ కథకి ఇంపాక్ట్ ఇవ్వకుండానే చాలా సినిమాల్లో ఉంటున్నాయి. (ఇటీవల ఒక స్క్రిప్టుకి సంబంధించి కీలకమైన ఇంటర్వెల్ సీనుకి దారితీసే సీన్లు పించ్-వన్ దగ్గర ప్రారంభ
మైనప్పుడు, వాటి మధ్యకి వేరే సీన్లు రాకుండా అవే సీన్లు కంటిన్యూ అయితే ఇంటర్వెల్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పినా వినకుండా –[ There is no terror in the bang, only in the anticipation of it- Alfred Hitchcock]  ఆ సీన్ల మధ్యకి ఏవేవో కామెడీ సీన్లు జోప్పిస్తూ సడెన్ గా ఇంటర్వెల్ వేసి, దాని  ఇంపాక్ట్ ని పేలవం చేశారు. ఈ స్క్రిప్టు సొంత దార్లు ఒకసారి ‘భజరంగీ భాయిజాన్’  లో రెండు మూలస్తంభాల నిర్మాణాన్ని గమనిస్తే మనసు మార్చుకుంటారేమో చూడాలి. ఇలాగే  పూర్తి చేసిన ఇంకో సినిమాలో ఇంటర్వెల్ కి దారి తీసే సీన్లు గల్లంతయ్యాయి. ఆ పనికి రాని సీన్లని తీసేయించి ఇంటర్వెల్ లీడ్ సీన్లు రాసిస్తే, రీషూట్ చేసి కలుపుకుని  ఇప్పుడు ఫ్లో, ఇంపాక్ట్ బావున్నాయన్నారు)
***
ప్రస్తుత సినిమా స్క్రీన్ ప్లే ఇలావుంది..పాకిస్తాన్ మూగ బాలిక  తప్పిపోయే విధానం చూపించుకొచ్చి, ఒక పాటతో హీరోని ఇంట్రడ్యూస్ చేసి, ఆ బాలికని అతడికి ఎటాచ్ చేశారు. తర్వాత క్లుప్తంగా హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ తో ప్రేమా చెప్పేశారు. ఆ తర్వాత హీరో ఆ బాలికతో ఢిల్లీ ఓల్డ్ సిటీలో వుండే హీరోయిన్ ఇంటికి రావడం, అక్కడి వాతావరణం, సరదాలూ   చూపించారు. ఇంతవరకూ పాత్రలూ వాటి పరిచయం పూర్తయింది. కథా నేపధ్యం ఏమిటో తెలియ చెప్పారు. ఈ రెండూ ఇక్కడితో ముగించి,  ఇక సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొచ్చారు.
         
        ఈ పరిస్థితుల కల్పన సీను సీనుకీ తీవ్రత పెరిగేలా చూశారు. ముందు బాలిక చికెన్ తింటే బ్రాహ్మిన్ కాదని కలవరం, క్షత్రియ అయి ఉంటుందని సర్దుకోవడం, ఇంకో సీన్లో వద్దన్నా చికెన్ తినడం, మరింకో సీన్లో ఆమెని దూరంగా కూర్చో బెట్టి తామంతా వెజ్ భోజనం చేస్తున్నప్పుడు తను ఒంటరి తనం ఫీలవుతోందని- చికెన్ సాంగ్ పాడేసి ప్లేట్ల కొద్దీ చికెన్ పెట్టడం, దీని తర్వాత ఆమె మసీదులో ప్రార్ధన చేయడంతో ముస్లిం అని తెలిసిపోయి మరింత ఆందోళన చెందడం, ముస్లింగా మూగ బాలిక  కొనసాగింపు సీన్లు, అప్పుడు – టీవీలో క్రికెట్ చూస్తున్నపుడు ఆ బాలిక ముస్లిం మాత్రమే కాదనీ, పాకిస్తానీ కూడాననీ బయటపడి,  పెద్ద దుమారంతో సమస్యని  ఏర్పాటు చేయడం! బిగినింగ్ విభాగాన్ని ముగించడం!
         
       ఇక మిడిల్ ని ప్రారంభించారు. ఈ మిడిల్ బిజినెస్ ప్రకారం- ఏర్పాటు చేసిన సమస్యతో హీరోకి సంఘర్షణ ప్రారంభించారు. ఇది ద్విముఖ సంఘర్షణ. హీరోయిన్ తండ్రి ఇచ్చిన అల్టిమేటం  తో అంతర్గత  (ఎమోషనల్) సంఘర్షణ, బాలికని వదిలించుకోవడానికి పడే బహిర్గత ( ఫిజికల్) సంఘర్షణ. దీంతో హీరోకి పాత్రకి జవజీవాలు చేకూరాయి. బాలికని పాక్ ఎంబసీ కి తీసికెళ్ళడం, అక్కడ అనుకోని అవాంతరం ఏర్పడడం, ఇలా కాదని సంఘర్షణ కొనసాగిస్తూనే ఒక ఏజెంట్ ని సంప్రదించి ఇల్లీగల్ గా బాలికని పంపించేసేందుకు ఏర్పాటు చేయడం, అప్పుడా బాలికకి తానేమీ ఇచ్చి పంపలేదన్న ఆలోచనతో గాజులు కొని,  ఆ జనంతో కలిసి రిక్షాలో ఏజెంట్ తో పాటు వెళ్ళిపోతున్న బాలిక కోసం వెతుకులాటలో పడ్డం- ( బాలికకి గాజుల మీద మక్కువ గురించి, కురుక్షేత్ర పోలీస్ స్టేషన్లో ఆమె బేడీలు తీసి చేతికి తగిలించుకోవడంతో, మళ్ళీ పాకిస్తాన్ కి తీసికెళ్ళి నప్పుడు అక్కడా బేడీలు తీసి దాచుకోవడంతో, దీనికి ముందు వెనక ఢిల్లీలోనే మార్కెట్ లో గాజులమ్మేవాడు చూడకుండా గాజులు తీసుకుని వెళ్లిపోవడంతో..ఇలా ఎష్టాబ్లిష్ చేస్తూ పోయారు- ఆమె క్యారక్టరైజేషన్ లో భాగంగా).  

          ఆ గాజులతో హీరో వెతుకులాట వేశ్యా గృహానికి దారి తీయడం, అక్కడ ఎదురైన దృశ్యానికి  అంతవరకూ మతభావాలతో శిలాసదృశ మైన  హీరో వ్యక్తిత్వం పటాపంచలవడం, ఆ ఏజెంట్ చేసిన మోసానికి బాలిక అపుడే వేశ్యా గృహంలో...ఊహించడానికే భయంకరంగా వున్నా పరిస్థితికి చలించి వాళ్ళందర్నీ హీరో చావదాన్ని బాలికని తీసి కెళ్ళిపోవడం..ఇలా కావలసినంత వేడి పుట్టించిన సంఘర్షణ తో హీరో మానవత్వం వైపు కొంతవరకూ  మొగ్గడం, ఇక తనే బాలికని పాకిస్తాన్ కి తీసికెళ్ళేందుకు సిద్ధ పడ్డం...

          కొందరు ఈ ఇంటర్వెల్  సీను దగ్గరే, హమ్మయ్య ఇప్పుడు కథ ప్రారంభమయ్యిందని నిట్టూర్పులు విడుస్తున్నారు. మరి ఇంతవరకూ చూసిందేమిటి – మిడిలే కదా? అలవాటైపోయిన తెలుగు సినిమాల తంతుతో వచ్చిన తంటా ఇది.  తెలుగు సినిమాల్లో ఫస్టాఫ్ లో ఏమీ జరక్కుండా కాలక్షేపంతోనే సాగి సాగి,  ఇంటర్వెల్ దగ్గర మాత్రమే టర్నింగ్ వచ్చి కథ ప్రారంభమయ్యేది నిజమే.

          కానీ ప్రస్తుత సినిమాలో ఇంటర్వెల్ లోపే బాలిక  పాకిస్తానీ అని తెలిసిపోయిన సీనుతోనే కథ ప్రారంభమై హీరో సంఘర్షణలో పడ్డాడు. తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చిన సీను ఆ సంఘర్షణలో భాగంగానే పోటెత్తిన మజిలీ! మిడిల్ కి మిడ్ పాయింట్ మాత్రమే! కథా ప్రారంభం కాదు.

          ఇక ఆ తర్వాత హీరో బాలికతో ఇల్లీగల్ గా పాకిస్తాన్లోకి ఎంటర య్యేందుకు ప్రయత్నించడం, పాక్ లో అడుగు పెట్టాక ఇండియన్ ఏజెంటుగా అనుమానితుడై పోలీసులు  వెంటబడ్డం, టీవీ జర్నలిస్టుతో కలిసి మారు వేషాల ప్రహసనాలూ ఇత్యాది గడిచి- బాలిక ఒక స్కూల్లో ఒక సీనరీ చూసినప్పుడు, తన ప్రాంతం గుర్తుపట్టడంతో, ఆ సీనరీ ఎక్కడిడనే ప్రశ్నతో రెండో మూలస్తంభానికి (మిడిల్ ముగింపుకి) దారి తీసే సీన్లకి అంకురార్పణం చేశారు.
           
***



         ఇక రెండో మూలస్తంభానికి సపోర్టింగ్  సీన్ల పేర్పు చకచకా మొదలయ్యింది. అది పాకిస్తానీ సీనరీ కాదని తేలడం, అప్పుడు డల్ అయిన హీరో బాలికతో ఓ దర్గాలో జరుగుతున్న ఖవ్వాలీ పాటలో కూర్చోవడం,  అదే చోటుకి బాలిక తల్లి రావడం, బాలిక గానీ తల్లి గానీ పరస్పరం  చూసుకోక పోవడం- ఇదయ్యాక,  ఎందుకో అలిగిన బాలికని మూడ్ లోకి తెచ్చుకోవడానికి జర్నలిస్టు  తను తీసిన దర్గా దగ్గర వీడియో దృశ్యాల్ని చూపడం, బాలిక ఒక చోట ఎలర్ట్ అయి మళ్ళీ రిపీట్ చేయమనడం, అప్పుడా దృశ్యంలో నడిచి వస్తున్న తల్లిని గురు పట్టడం.. అప్పటికి ఆమె లేకపోవడం, కానీ వీడియోలో ఆమె వెనుక దూరంగా  ఒక బస్సు కన్పించడం, ఆ బస్సు ఆమె దిగిందనుకుని ఆ బస్సువాడిని పట్టుకుని అడిగితే, ఫలానా వూరునుంచి వచ్చానని చెప్పడం, ఆ రూట్లో వున్న ఊర్ల పేర్లు ఒకటొకటే జర్నలిస్టు చెప్తున్నప్పుడు తమ ఊరి పేరు దగ్గర బాలిక ఆపెయ్యడం...ఈ ఎక్సైటింగ్ సీనుతో మిడిల్ విభాగాన్ని ముగించడం!
          రెండో మూలస్థంభం దగ్గర హీరోకి పరిష్కారమార్గం దొరికింది! దీంతో ఇక అతను ఆ బాలిక వూరికి ప్రయాణం ప్రారంభిస్తూ, ఎండ్ విభాగం- అంటే క్లయిమాక్స్ ప్రారంభించాడు. 

***

  లా మొదటి మూలస్తంభానికి ఒక గుత్తిలో కొన్ని కొట్టొచ్చే సీన్లు, రెండో మూలస్తంభానికి ఒక గుత్తిలో మరికొన్ని కొట్టొచ్చే సీన్లూ సపోర్టుగా పెట్టుకుని- ఈ రెండు మూలస్థంభాల్నీ-దాంతో కథనీ బాగా హైలైట్ చేసిన స్ట్రక్చర్ ఇది.
          ఐతే ఈ స్క్రీన్ ప్లేలో అంతే  కొట్టొచ్చే ఒక లోపం కూడా వుంది. అది మొదటి మూల స్తంభానికి సంబంధించింది. ఆ మాట కొస్తే సినిమా ప్రారంభంలోనే లోపం దొర్లింది. ఈ లోపాలు లాజిక్ కి సంబంధించినవి. సరిహద్దులో బిడ్డని పోగొట్టుకున్న తల్లి పాత్ర తిరిగి ఆ బిడ్డని పొందడం కష్టమేమీ కాదు. కంప్లెయింట్ ఇస్తే చాలు. ఆ పని చేయకుండా ఆ పాత్ర కట్ అయిపోతుంది. 

          ఇక హీరో కూడా ఆ బాలిక పాకిస్తానీ అని తెలిసినప్పుడు మీడియా కి తెలియజేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సేల్ఫీ లేలేరే అని పాట పాడగల్గినవాడు, ఆ సోషల్ మీడియా ద్వారా కూడా బాలిక ప్రాబ్లం సాల్వ్ చేసేయొచ్చు. 

          కాబట్టి మొదటి మలుపు ( మూలస్థంభం) దగ్గర ఏర్పాటు చేసిన సమస్యలో ఈ లాజిక్ లోపించింది. లాజిక్ లేని సమస్య పట్టుకుని హీరో పోరాడాడు. లాజిక్ ప్రకారం చూస్తే హీరోకి ప్రాబ్లమే లేదు, ప్రాబ్లమే లేకపోయాక కథే లేదు.

          ఇక్కడ కామెడీలకి  సంబంధించే అయినా అరిస్టాటిల్ చేసిన వ్యాఖ్య గమనించాలేమో. కామెడీ కథల్లో ఏర్పాటు చేసే సమస్యలో లాజిక్ వుండాలి. లాజికల్ గా సమస్యని ఏర్పాటు చేశాక, ఆ వేదికమీద ఎంత ఇల్లాజికల్ గానైనా, ఇంకెంత  అసంబద్ధంగా నైనా కామెడీని నడిపించ వచ్చనేది.

          ఇది  మిగతా జానర్ కథలన్నిటికీ వర్తిస్తుందనడంలో సందేహం లేదు. సమస్య ఏర్పాటే లోపాలతో బలహీనంగా వుంటే అదొక సమస్య ఎలా అవుతుంది?

          పాక్ లో వున్న జర్నలిస్టు పాత్రకి కూడా మీడియా సహకారం గురించి వెంటనే తట్టదు- క్లయిమాక్స్ లో తప్ప! కథా సౌలభ్యం కోసం లాజిక్ ని క్లయిమాక్స్ కి వాయిదా వేసినట్టుంది తప్పితే మరేం కాదు..      
***


       సెకండాఫ్ కథా పథకం ఎలా వుండాలి? బాలిక బంధువుల్ని కనుగొనే హీరో గోల్ కాక, ఇంకా చెప్పడానికి ఏముంది? అతడి పాత్ర చిత్రణ మిగిలి వుంది. అతణ్ణి స్వమతాభిమానం వైపు నుంచీ మానవత్వం వైపు మళ్లించి మోక్షం కల్గించాల్సిన అవసరముంది. ఫస్టాఫ్ లో వేశ్యా గృహపు సీన్లోంచే ఈ క్రమం మొదలయ్యింది. అందుకే దేన్నైతే దూరంగా వుంచాడో దాన్నే ఆలింగనం చేసుకోక తప్పని పరిస్థితులు సెకండాఫ్ లో సృష్టించారు. పాకిస్తాన్లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బురఖా వేసుకోవాల్సి రావడం, మసీదులో దాక్కోవాల్సి రావడం, దర్గాలో ఖవ్వాలీ వింటూ కూర్చోవాల్సి రావడం మొదలైనవి. ఈసీన్లు ఏదో ఆడియెన్సుని వినోదపరచడం కోసం మాత్రమే  వేయలేదు- వీటి ద్వారా అతణ్ణి మానవత్వం వైపు మళ్ళించే పథకమూ వుంది. ఐతే అలాటి సీన్లే  ఎందుకు వేయాలంటే – ఎదుటి వర్గం, కులం, లేదా మతం ఏదైనా కావొచ్చు- దాన్ని దానివైన  ఆచారవ్యవహారాలతో సహా అంగీకరిస్తే తప్ప మానవత్వ ప్రకటనలో, ఆలింగానాల్లో నిజాయితీ వుండదు, హిపోక్రసీ అన్పించుకుంటుంది కాబట్టి.
***
       కాకతాళీయంగా ఈ సినిమా  సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగుతున్నప్పుడు విడుదలయ్యింది. అటు వైపు కూడా విడుదల కాబోతోంది. పాక్ పాలకులేమో గానీ, అక్కడి సైనిక వర్గం, మాజీ సైనికాదికారులు సహా, రెండు దేశాల మధ్య మంచిని అంగీకరించే పరిస్థితి లేనే  లేదని మళ్ళీ మళ్ళీ కూడా జాతీయ ఛానెళ్ళలో వాళ్ళ బుకాయింపుల్ని గమనిస్తే అర్ధమైపోతుంది. ఉఫాలో మోడీ- నవాజ్ లమధ్య చర్చలు వాళ్లకి ఇష్టం లేదు. అందుకే  డ్రోన్ లు ప్రయోగిస్తారు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అవతలి దేశం సైనిక వర్గం చేతుల్లో వున్నప్పుడు- ‘భజరంగీ భాయిజాన్’ లాంటి  స్నేహాన్ని, మానవత్వాన్నీ   కాంక్షించే సినిమాలు ఎన్ని తీసి మాత్రమేం ప్రయోజనం. మిలిటరీ ముఠాలో మార్పే రాదు. అటువైపు- ఇటువైపూ  ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని ఇలా సినిమాలు తీస్తూపోతే, మెడ మీద కత్తిలా వేలాడుతున్న వాస్తవ పరిస్థితిని  మభ్య పెట్టుకోవడమే అవుతుందేమో. ఈ సినిమాలో ఓంపురి పోషించిన మౌలానా పాత్ర-  ‘ఆధా కాశ్మీర్ ఇదర్ భీ హై’ ( సగం కాశ్మీర్ ఇటు కూడా వుంది) అన్నట్టు, ఈ ‘ఇదర్ భీ హై, ఉదర్ భీ హై’ అసలు గోలకి ఫుల్ స్టాప్ పెట్టే ఎజెండాతో, ధైర్యం చేసి అలాటి సినిమాలు తీసే సమయం ఆసన్నమైందేమో బాలీవుడ్ ఆలోచించాలి.

సికిందర్
























         









Thursday, July 16, 2015

నాటి సినిమా!



          వెండితెర మీద బహువిధ పాత్రలకి మించి నిజజీవితంలో పోషించే పాత్రలు సూపర్ హిట్టయితే ఆ చమత్కృతి పేరేమిటి?
          గన్ షాట్ గా పి. భానుమతే!

          టించిన సినిమాల్లో  ద్విపాత్రాభినయాల పరిమితిని దాటుకుని అక్కినేని, సంజీవ్ కుమార్, శివాజీ గణేశన్ ల నవవిధ పాత్రాభినయాలు, కమల్ హాసన్ దశావతారాలు, ఆఖరికి ప్రియాంకా చోప్రా భుజాన్నేసుకున్న పన్నెండు వేషాలూ ..డబుల్ యాక్షన్ తో మొదలెట్టి డజను యాక్షన్స్  వరకూ చేరిన వెండితెర బహువిధ పాత్రాభినయాల చరిత్ర అంత గర్వకారణ మేమీ కాదు ఆలోచిస్తే, గర్వకారణం నిజజీవితంలో భానుమతి బహుముఖ ప్రజ్ఞాపాటవమే!

          గటు ప్రేక్షకుడు సినిమాకొచ్చి తన అభిమాన నటీనటుల ప్రజ్ఞని విశ్లేషించుకుంటూ కూర్చోవాలనుకోడు. వాడి తహతహ అంతా కూడా కేవలం ఆ నటనల్లో తాదాత్మ్యం చెంది, వెంటాడే ఈ జీవితాన్నుంచీ కాసేపు దూరంగా పారిపోవాలనుకోవడం గురించే. అయితే ఆ తదాత్మ్యత  సాంద్రత పోషించే పాత్రలు పెరిగే కొద్దీ తరిగిపోవడం కూడా కద్దు. కమల్ ( ‘దశావతారం’), ప్రియాంకా ( ‘వాటీజ్ యువర్ రాశి’ ) వంటి ఇటీవలి బాక్సాఫీసు ఓటములే ఇందుకుదాహరణలు.

          భానుమతి కలాటి ఓటమిలేదు. నటిగా, గాయనిగా, కవయిత్రిగా, సంగీత కర్తగా, కథా రచయిత్రిగా, సినిమా దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, ఫిలిం ఎడిటర్ గా, ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల స్రష్టగా...ఇన్ని విభిన్న పాత్రల పోషణని తన జీవితంలో సూపర్ డూపర్ హిట్టు గా నిర్వహించుకుపోయిన వన్ ఉమన్ ఆర్మీ భానుమతీ రామకృష్ణ!
          జీవితం కాన్వాసు జగమంత, అందులో మేధస్సు విస్తృతి ఆకాశమంత, సినిమా కాన్వాసు కమర్షియాలిటీకి సరిపోయేంతే;  అందులో మళ్ళీ క్రియేటివిటీ పాలు ఆ కమర్షియాలిటీకి లొంగినంతే, అంతే! దాటిపోయిందంటే దవాఖానాలో పడకే. ఈ అపూర్వ సందేశాన్నే అందుకోవాలి భానుమతి నిండు జీవితంలోంచి.
          మరొకటుంది- చాలా డేరింగ్ వుమన్ కూడా భానుమతి!
          లేకపోతే ఏమిటా తెగింపు!  ఇంకా ఇరవయ్యారేళ్ళ లేత వయసులోనే 1953 లో, దేశంలో సినిమా దర్శకత్వం చేపట్టిన తొలి మహిళ ఎవరున్నారంటే, తనే అని అన్పించుకుంటూ- నిర్మాతగానూ మారి, ఇంకో చేత్తో భారతీయ సినిమాల్లో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని అవలీలగా పోషించి అవతలపారేసి,  తెలుగు- తమిళ- హిందీ బహు భాషా చిత్రంగా ‘చండీరాణి’ అనే మసాలా సినిమా తీసి, ఒకే రోజు ఆ మూడు భాషల్లోనూ విడుదల చేసి పారేసి, సత్తా చాటుకోవడం ఇంకెవరి వల్లయింది?
        ప్రపంచ సినిమా చరిత్రలో భానుమతితో పోల్చదగ్గ  చలనచిత్ర మహిళ ఇంకొక్కరే! ఆవిడ ఫ్రాన్సుకి చెందిన ఆలైస్ గై బ్లాంచ్ ( 1873-1963) అనే ఆవిడ. సినిమా అనే దృశ్య మాధ్యమాన్ని కనిపెట్టింది 1896లో ఫ్రాన్సు దేశస్థులైన లూమియర్ సోదరులహో అని అదేపనిగా బాజా వాయిస్తూంటాం గానీ, అదే సంవత్సరం ఆ విజయంలో ఓ చెయ్యి వేసిన  స్త్రీ మూర్తి గురించి పట్టించుకోం. మేడమ్ ఆలైస్ ప్రపంచంలోనే తొలి సినిమా ‘దర్శకురాలు’ గా ‘లాఫీ ఆక్ హాక్స్’ అనే మూకీ సినిమా తీయడమే కాదు, ఇంకే మూకీ దర్శకుడూ నిర్మాతా ఉత్పత్తి చేయనంత స్థాయిలో 700 వరకూ మూకీలు తీసి అవతల పారేసి కాలుమీద కాలేసుక్కూర్చుందంతే!!

అలైస్ గై బ్లాంచ్
              భానుమతి 1939లో 13వ యేట ‘వరవిక్రయం’ తో సినీరంగ ప్రవేశం చేసినా, 1945లో బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ‘స్వర్గసీమ’ లో నటించాకే మంచి పేరొచ్చింది. అందులో కథానాయకుడి ( వి. నాగయ్య) పండంటి సంసారాన్ని పీకి పందిరేసే ప్రతినాయిక సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. ‘ఒరేవొరే, భానుమతి కూడా మంచిది కాదురా, కాపురాలు కూల్చే రకం!’ అని నాటి ప్రేక్షకులు యమవర్రీ అయిపోయేవాళ్ళు- ఆవిడేదో తమ పక్కింట్లోనే మకాం వేసి తమ కొంపలకి  ఎసరుపెడుతున్నట్టు. ఇలాటి వాళ్ళని ఇంకా ఏడ్పించి వదలాలని కాబోలు, ‘విప్రనారాయణ’ లోనూ అదే వ్యాంప్ పోకడ పోయారామె!
          ‘విప్రనారాయణ’ భానుమతి నటజీవితాన్ని కీలక మలుపు తిప్పిన మహోజ్వల భక్తి రస ప్రధాన చలన చిత్రం. ‘లైలా మజ్నూ’, ‘మల్లీశ్వరి’, బాటసారి’ ల లాంటి మరెన్నో అద్భుత చలన చిత్రాలు ఆమెఖాతాలో పడివుంటే ఉండొచ్చు గాక- ఒక పూర్తి స్థాయి యాక్టివ్ పాత్రగా, కథలో ఓ ప్రధాన సంఘటనని సృష్టించి, ఆ కథని నడిపించే, కథనాన్ని కూడా పండించే దృశ్య కావ్యంగా  ‘విప్రనారా యణ’ నిలబడింది. అక్కినేని నాగేశ్వరరావు పోషించిన విప్రనారాయణ పాత్రపరంగా సినిమాకి నామకరణం జరిగినా,  నిజానికిందులో భానుమతి పోషించిన దేవదేవి పాత్రకే పెద్ద పీట. ట్రాజెడీల్లో ప్రధాన పాత్ర కర్మణి పాత్ర స్థానంలో వుండిపోయి, ప్రతినాయక పాత్ర కర్తగా తానే కథ నడిపించడం చూస్తూంటాం. అలాగే  ‘విప్రనారాయణ’ లో కూడా ఇలా ప్రతినాయిక పాత్రనే ప్రధాన పాత్రగా చేసి, సాగించిన కథనాన్ని నాటక పరిభాషలో ప్రకరణం అంటారు. ‘చింతామణి’, ‘వసంతసేన’, ‘స్వర్గసీమ’ లలోని ‘సుబ్బలక్ష్మి’ కథలు ఈ కోవకే చెందుతాయి.
          సరే, ఇంతకీ ఎవరీ విప్రనారాయణ?
         చరిత్రలో కెళ్ళాలి.  క్రీ.శ. 787 లో తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున మందంగుడి అనే గ్రామంలోజన్మించాడు తొండరాదిప్పొడి ఆళ్వార్. ఇతను నారాయణుడి ఆశీస్సులతో  జన్మించడంతో విప్రనారాయణ అయ్యాడు. విప్ర అంటే బ్రాహ్మణుడు. ఇతను పెరిగి పెద్దయి, వేదాలు చదువుకుని, శ్రీరంగ పట్టణం వెళ్లి శ్రీ రంగనాథుడి దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం అతడిలో భక్తి పారవశ్యాన్ని కల్గించి, ఇక అక్కడే వుండిపోయి ఆ రంగనాథుడి సేవలో తరించి పోయేందుకు పురిగొల్పింది. ఆ సేవలో ప్రధానమైనది మాలా కైంకర్యం. దాంతో ఆలయం వారగా తులసి మొక్కలు, రకరకాల పూల చెట్లూ పెంచి ఒక మనోహరమైన తోటని అభివృద్ధి చేశాడు. అనునిత్యం పూలమాలలు అల్లుతూ స్వామికి సమర్పించుకోవడమే దినచర్య అయిపోయింది.
          కావేరి ఆవలి ఒడ్డున కదంబణగారం అనే ఊరుంది. ఆ ఊళ్ళో దేవదేవి అనే వేశ్య ఉంటోంది. ఓ నాడామె చోళరాజు ఎదుట నృత్య ప్రదర్శన ఇచ్చింది. చోళ రాజు మెచ్చుకుని సత్కరించాడు. ఆమె తిరిగి వెళ్తూ తోటలో విప్రనారాయణని చూసింది. అతడి గొప్ప గురించి ఇదివరకే చెప్పి వుంది తన అక్క అలివేణి. దీంతో ఈ గొప్పవాడికి ప్రణమిల్లాలని ముందుకు సాగిన దేవదేవి కి భంగపాటు ఎదురయ్యింది. అప్పుడేదో పరధ్యానంలో వున్న విప్రనారాయణ ఆమె ప్రణమిల్లడాన్ని గమనించలేదు. దీంతో ఆమె అహం దెబ్బ తింది. అతడి పరధ్యానాన్ని అహంకారంగా భావించుకుని –ఈ మనిషిని ఎలాగైనా లొంగదీసుకుని పీచమణుస్తానని అక్కడికక్కడే ప్రతిజ్ఞ చేసింది.
          ఇక్కడ్నించే మొదలయ్యాయి విప్రనారాయణకి కష్టాలు! అతడి దైవ చింతన, భక్తీ ముక్తీ సర్వం ఆ ఒక్క ఆడగాలి సోకి పటాపంచలై పోయాయి. అనాధనని, అతడి సేవలో తరిస్తూ కష్టాలన్నీ మర్చిపోతాననీ బొంకి, పథకం ప్రకారం అతడి పంచన చేరిన ఆమె, ఓ వర్షపు రాత్రి అనుకున్నట్టూ లొంగ దీసేసుకుంది. అంతే, ఇక దీంతో అతడామెకి దాసుడైపోయాడు. ఆలయం నుంచి ఏకంగా మకాం ఆమె ఇంటికే మార్చేశాడు. కానీ, చిల్లికాణీకీ కొరగాని ఇతగాణ్ణి ఆమె తల్లి చీదరించుకుని, పైపెచ్చు ఇతడి మైకంలో కూతురు పడిందంటే తన ఆదాయమూ పడిపోతుందని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేసిందతణ్ణి.
      అయినా మూతబడ్డ తలుపులవతలే బైఠాయించి దేవదేవినే కలవరించసాగాడు. విప్రనారాయణ ఈ దుస్థితిని రంగనాయకి తో పట్టణ విహారాని కొచ్చిన రంగనాథుడు చూసి జాలిపడ్డాడు. దారి తప్పిన ఇతడికి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరించాడు. అటు ఆలయంలోని బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెట్టాడు. ఆ నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది.
          అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశించాడు. ఆ శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడాడు. ఇదంతా తాను ఆడించిన ఆట అని చెప్పాడు. పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొచ్చాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి ఆ స్వామి భక్తుడ య్యాడు.
          శ్రీరంగం టెంపుల్ వెబ్ సైట్లో పెట్టిన ఈ చరిత్ర పాఠాన్ని ఉన్నదున్నట్టూ తెరకెక్కించారు దర్శకుడు, భానుమతి భర్త రామకృష్ణ. కాలానుగుణమైన వాతావరణ నేపధ్యం, దృశ్యానుగతమైన నటనలూ ఇంత చక్కగా అమరిన ఈ కళా సృష్టి, మనల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎప్పుడో 1954 లోనే సినిమా క్రాఫ్ట్ ఇంత రాటుదేలి వుండడం ఒక అద్భుత విషయంగా కన్పిస్తుంది. వర్షపు రాత్రి సీనైతే ఫెంటాస్టిక్. మూడంకాల ( త్రీ యాక్ట్స్) కథా సంవిధానంలో ఆయా అంకాల్లో ఏ ఏ బిజినెస్సులు జరగాలో- ఆ కథన కవాతులు పొల్లుపోకుండా ఆకట్టుకుంటే, సందర్భానుసారంగా వచ్చే పాటలొక మంచి కవిసమయం. భానుమతి, ఏఎం  రాజాల గళాలు మధువులు నిండిన గళాసులు. సేవించే మనబోటి శాల్తీలకి సాంత్వన క్లాసులు. ‘ఎందుకోయీ తోటమాలీ..’,  ‘సావిరహే తవదీనా..’,  ‘చూడమదే చెలియా ..’  పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు చేతినుంచి జాలువారిన సంగీత ఝరులే. సముద్రాల రచన, రెహ్మాన్ ఛాయాగ్రహణం మరో రెండు పంచ ప్రాణాలు.
          ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు దాటింది. అయినా లోకంలో ఇంత శోకం ఇంకా మిగిలే వుంది. కష్టాలకి కుంగి పోతారు మనుషులు. భోరున విలపించేసి తమ బాధని ప్రపంచానికి ప్రకటిస్తారు. కష్టాలు రావడమంటే చేసిన పాత కర్మల దరిద్రం వదలడమేననీ, వదిలి పునీతులవడమే ననీ- ఈ సినిమా చూసి గ్రహించి వుంటే, ఇంత విషాదం ఈ  ప్రపంచంలో వుండేది కాదు. అక్కినేని, భానుమతి ల మధ్య రోమాన్సుని రోమాంచితం చేసి, షుగర్ కోటింగ్ సన్నివేశాలతో అలరింపజేస్తూ వెళ్లి, ఆఖర్లో అసలు గుట్టు విప్పుతూ, ఒక ఆధ్యాత్మిక ప్రభోదం చేస్తున్న ఈ చలన చిత్ర రాజం-  సృజనాత్మకతా పరంగా జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ స్లాట్ లో అగ్రస్థానాన్నే ఆక్రమిస్తోంది సగర్వంగా!
         అక్కినేనిది బాధిత పాత్ర కావడం వల్ల ఆ మేరకే ఆయన నటనా వుండి జాలి పుట్టిస్తుంది. ఎదురయ్యే సంఘటనల్ని ప్రతిఘటించే తత్త్వం కాకపోవడం చేత ఆయన ప్రదర్శించిన అమాయకత్వం నిండిన హావభావాలు చాలా రోజులూ మనల్ని వెన్నాడి తీర్తాయి! ఇక భానుమతి గురించి చెప్పుకోవాలంటే – ‘భానుమతి ఈజ్ ది షో ఉమన్’  అని చెప్పుకోవాలి. పాత్ర స్వభావం చేత ఆమెకి నవరసాల పోషణ దక్కింది. కథని నడిపించే పాత్రవడం చేత ఆ పాత్ర చివరంటా సినిమాకి చురుకుదనం పుట్టిస్తుంది. వేశ్యగా హొయలు, ప్రేమికగా హుందాతనం..ఈ రెండు శారీరక భాషల తో ఆమె అభినయ కళా విశేషాలు వెర్రెత్తించి వదుల్తాయి. తమిళులు కలైమా మణి  అనీ, బహుకళా ధీరతి శ్రీమతి అనీ, ఊరికే అనలేదు భానుమతి నుద్దేశించి. వ్యాంప్ కి చెరువైనా, గయ్యాళి తనానికి దూరం ఉంటూ, జీవితపు చరమాంకంలో వెండితెర మీద ది గ్రాండ్ ఓల్డ్ మదర్ గా మన్నన లందుకున్న పాలువాయి భానుమతీ రామకృష్ణ ( 1925- 2005) చక్కగా ‘విప్రనారాయణ’ నిర్మించి తనకి తానే నివాళి అర్పించుకున్నారు!

సికిందర్
( నవంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)
         
         





అదృశ్యం!

      
                                               
కథ- స్క్రీన్ ప్లే- నిర్మాణం- దర్శకత్వం : వాసు మంతెన
తారాగణం: శ్రేయాన్‌
, ప్రగతి, అభిమన్యుసింగ్‌, ముఖేష్‌ రుషి, కోట శ్రీనివాసరావు, స్నిగ్ధ, సత్య
మాటలు: వడ్డాలపు ప్రభాకర్‌,  ఛాయాగ్రహణం: వి.కె. గుణశేఖర్‌
సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి,  కూర్పు: గౌతంరాజు విడుదల
నిర్మాణం: వజ్మన్‌ ప్రొడక్షన్స్‌, విడిదల : 3 జులై
, 2015
*
         
సీనియర్ నటి జయసుధ కుమారుడు శ్రేయాన్ ని హీరోగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు వాసు మంతెన తనే నిర్మాతగా మారి నిర్మించిన ‘బస్తీ’ ని కనువిందు చేసే ఒక సృజనాత్మక ప్రయత్నంగా ఆహ్వానించవచ్చు. చిన్న బడ్జెట్ సినిమాల్లో ఈ స్థాయి దృశ్యపరమైన ప్రమాణాలు తెలుగులో చాలా అరుదుగా చూస్తూంటాం. దర్శకుడికి విజువల్ సెన్స్ వున్నప్పుడు ఛాయాగ్రహణం- కళ- కాస్ట్యూమ్స్ విభాగాలు  సైకలాజికల్ గా ట్రాన్స్ లోకి తీసికెళ్ళేట్టు చేస్తాయి ప్రేక్షకుల్ని. కళా దర్శకుడి కలర్ స్కీం, కాస్ట్యూమ్స్ స్పెషలిస్టు ఇచ్చే డ్రెస్సింగ్ స్కీం, ఈ రెండిటికి మ్యాచయ్యే ఛాయాగ్రాహకుడి లైటింగ్ స్కీం,  దృశ్యాల్లో మూడ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ మూడ్ క్రియేషన్ ని పర్యవేక్షించే దర్శకుడు కొత్తవాడై వుంటే అతను ప్రామిజింగ్ డైరెక్టర్ గా కనపడతాడు. వాసు మంతెన అలాటి ప్రామిజింగ్ డైరెక్టర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. చిన్న సినిమాలు తీస్తున్న కొత్త దర్శకులు తమదైన ముద్రతో ప్రామిజింగ్ డైరెక్టర్ లుగా కన్పించే దృష్టాంతాలు భూతద్దం పెట్టి గాలించినా కన్పించడం లేదు. ఏదో ఇలా వస్తున్నారు, అలా పోతున్నారు మొక్కుబడిగా..
          హీరో శ్రేయాన్ కెసిఆర్ అన్నట్టు తెలుగు అమితాబ్ బచ్చనే పొడుగు రీత్యా. ఆ పొడుక్కి చాక్లెట్ బాయ్ ఫేస్ కట్ ఒక భిన్నమైన కాక్ టెయిల్. కాకపోతే సరసన నటించే హీరోయిన్లతో రావచ్చు సమస్య. ఈ సినిమాలో వచ్చింది కూడా. హీరోయిన్ ప్రగతి హైటు చాలక చిన్నపిల్లలా కన్పిస్తుంది. పైగా ఈమె అంత వయసున్న కోట శ్రీనివాసరావుకు కూతురంటే కూడా నమ్మశక్యం కాదు- మనవరాలిలా వుంటుంది.
          దర్శకుడు ‘బస్తీ’ అనే ఈ యాక్షన్ మూవీని తనే రాసుకుని తనే తీసి ఎలా ఆకట్టుకోబోయాడో ఒకసారి చూస్తే ...
ప్రేమలు వేరు- చావులు వేరు   
       ఓపెనింగ్ సీనులో సిటీలో ఓ పొద్దుటే జాగర్స్ కి, వాకర్స్ కి పార్కులో ఓ అమ్మాయి శవం కంత పడుతుంది. ఓ క్లాసిక్ క్రైం / డిటెక్టివ్ సినిమాల్లో లాంటి సింపుల్ ఓపెనింగ్. పోలీసులొస్తారు, ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. కథా నేపధ్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. సిటీలో ఆ  ప్రాంతం ఒకప్పుడు బస్తీ. ఇప్పుడు పోష్  ఏరియా. బస్తీగా వున్నప్పట్నించీ అక్కడ భిక్షపతి ( కోట), అమ్మిరాజు ( ముఖేష్ రిషి) అనే గ్యాంగ్ స్టర్స్ మధ్య వైరాలు. ఇవి ప్రస్తుతం చల్లబడి ప్రశాంతత నెలకొన్నా- ఈ ప్రశాంతతకి కారకుడైన అమ్మిరాజుని వద్దన్నా ఏదో రకంగా  బిక్షపతి కొడుకు భవానీ ( అభిమన్యు సింగ్) రెచ్చ గొడుతూంటాడు.  అమ్మిరాజు భిక్షపతితో ఏనాడో శత్రుత్వం చాలించుకుని ప్రశాంతంగా తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఇలాటి సమయంలో అమ్మిరాజు ఏరియాలో భవానీ  ఓ అమ్మాయిని చంపించడంతో, అతడి చెల్లెల్ని, అంటే భిక్షపతి కూతురు స్రవంతి ( ప్రగతి) ని రహస్యం గా కిడ్నాప్ చేయించి తనింట్లోనే  బంధిస్తాడు అమ్మిరాజు. 
          ఇంతలో అమ్మిరాజు తమ్ముడు విజయ్ ( శ్రేయాన్) అమెరికానుంచి వస్తాడు. ఇంట్లో బంధించివున్న స్రవంతిని చూస్తాడు. విషయం తెలుసుకుంటాడు.  అన్న వాదాన్ని నమ్ముతాడు. స్రవంతితో పరిచయం పెరుగుతుంది, ఆమె కూడా దగ్గరవుతుంది. ఆ దగ్గరవడం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు.  దీనికి అమ్మిరాజు ఒప్పుకుంటాడు- ఇలాగైనా రెండు కుటుంబాల మధ్య శాంతి ఏర్పడుతుందని. ఈ విషయం ఎస్పీ కి చెప్పి భిక్షపతితో మీటింగ్ ఏర్పాటు చేయించమంటాడు. ఆ మీటింగులో ఉద్రిక్తత లేర్పడతాయి పెళ్లనగానే. భిక్షపతి ఒప్పుకున్నా, కొడుకు భవానీ అంగీకరించడు. కాల్చిపారేస్తాడు తండ్రిని, ఎస్పీనీ, అమ్మిరాజునీ...విజయ్ స్రవంతిని తీసుకుని పారిపోతాడు. భవానీ మరికొందరు అమ్మిరాజు బంధువుల్ని కూడా చంపేస్తాడు.
          స్రవంతి తో పారిపోయిన విజయ్ కర్ణాటకలో స్నేహితుల దగ్గర తలదాచుకుంటాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్రవంతిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకుంటాడు ...ఇదీ విషయం. ఇక భవానీని ఎదుర్కొని అమెరికా వెళ్లి పోగలిగారా అన్నది మిగతా కథ. 
బడ్జెట్ కి చాలని కథ 
      ఈ కథ చూస్తే దర్శకుడు పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమాలకి ప్రభావితుడైనట్టు తెలిసిపోతూంటుంది. సినిమా కథ అంటే పెద్ద బడ్జెట్ ఫార్ములా సినిమా కథే అన్న అభిప్రాయమో ఏమో అదిక్కడ బెడిసి కొట్టింది. పెద్ద బడ్జెట్ సినిమా కథల్ని పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే అన్ని భారీ హంగులతో చూసి ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు, పనిగట్టుకుని అలాటి హంగులు వుండని ఛోటా సినిమాల్లో కూడా చూడాలని ఎందుకు కోరుకుంటారు? సమస్య ఎక్కడ వచ్చిందంటే, తెలుగులో భారీ సినిమాలు హాలీవుడ్ ని అనుకరిస్తే, భారీ సినిమాల్ని చిన్న సినిమాలు అనుకరిస్తున్నాయి- ఐతే హాలీవుడ్ ని అనుకరించినా  భారీ సినిమాలు బతికుంటాయి, భారీ సినిమాల్ని అనుకరించే చిన్న సినిమాలు మాత్రం చచ్చూరుకుంటున్నాయి. ప్రస్తుత చిన్న సినిమాదీ ఇదే పరిస్థితి. అంతగా యాక్షన్ మూవీ తీయాలనుకుంటే నవ్యత తో కూడిన ఏ థ్రిల్లరో తీయవచ్చు.
          రెండోది, ఈ కథ మూస ఫార్ములాయే  అయినా దర్శకుడు ఒక విజన్ పెట్టుకుని రియలిస్టిక్ గా తీయాలనుకున్నట్టు కొన్ని సీన్లలో అర్ధమవుతుంది. ఓపెనింగ్ సీను అలాంటిదే. కానీ అంతలో అభద్రతాభావం వెంటాడినట్టు మళ్ళీ ఫార్ములా చిత్రీకరణల్లో సేఫ్ జోన్ చూసుకునే ధోరణి కన్పిస్తుంది. ఇదెక్కడిదాకా పోయిందంటే కామెడీ సీన్లన్నీ అలాటివే. ఇంకా పనిగట్టుకుని- ఫార్ములా సినిమాల్లో సెకండాఫ్ లో కథతో సంబంధం లేని కమెడియన్లని దింపి కామెడీతో టైం పాస్ చేసినట్టూ- ఇక్కడా అదే పరిస్థతి. మహావిష్ణువు పాత్రలో అలీ వచ్చేసి ఆ కామెడీ ఏమిటి? గే క్యారక్టర్ తో సత్య కామెడీ ఏమిటి? ఇవన్నీ బిగ్ బడ్జెట్ సినిమా ఫీల్ తీసుకురావడానికి దర్శకుడు పడ్డ పాట్లే!
          మూడోది, ఇలాటి కథ మహేష్ బాబు- ఆర్తీ అగర్వాల్ లతో ‘బాబీ’ గా వచ్చిందే. ఇద్దరి తండ్రులూ పగలు రగిలిన గూండాలే. ఇంకా మహేష్ బాబే నటించిన ‘ఒక్కడు’ లో మహేష్ బాబు హీరోయిన్ ని రహస్యం గా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఈ సినిమాలో హీరో అన్న హీరోయిన్ ని తెచ్చి రహస్యంగా ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ రెండు పాయింట్ల తోనే మొత్తం సినిమా అంతా నడించింది. ‘బాబీ’ లో తండ్రులిద్దరూ హింసతో నగరాన్ని అట్టుడికిస్తూంటే, అదేం పట్టనట్టు హీరో హీరోయిన్లు ప్రేమలతో, డ్యూయెట్లతో ఎలా కాలక్షేపం చేస్తారో- అలా ఈ సినిమాలోనూ ఇంతే. భవానీ అనే వాడు కుటుంబాల్నే హతమారిస్తే, ఈ ప్రేమ జంటకి పెళ్ళే ముఖ్యమైపోవడం,  చనిపోయిన వాళ్ళకోసం ఒక్క కన్నీటి బొట్టూ రాల్చకుండా అసలేం జరగనట్టే తిరగడం...ఎలా సాధ్యం?
          నాల్గోది, హీరో పాత్ర పాసివ్ పాత్రగా తయారైందని తెలుసుకోలేదు. ఈ సినిమా మొత్తం మీద హీరో ఏం చేశాడు? చిట్ట చివర్లో మాత్రం తన మీదికి వచ్చిన విలన్ ని రియాక్టివ్ గా చంపి, పేలవమైన డైలాగు కొట్టడం  తప్ప? హీరోయిన్ కుటుంబాన్ని కాసేపు పక్కన పెడితే, కనీసం తన అన్నని చంపినందు కైనా హీరో అనే వాడు ఆ భవానీని చంపేందుకు సిద్ధమవ్వాలిగా? అలాగాక హీరోయిన్ తో పారిపోయి- పెళ్లి చేసుకుని- అమెరికా వెళ్లి పోవాలనుకోవడం ఏ బాపతు పాత్ర, ఏ రకం కథనం?
          ఐదోది, ఆకస్మిక ముగింపు. ‘బాహుబలి’ లో లాంటి ఆకస్మిక ముగింపు! ‘బాహుబలి’ కంటే ముందు ఈ సినిమా తీసినా ఆటోమేటిగ్గా అలాటి బిగ్ బడ్జెట్ సినిమా ముగింపే దర్శకుడికి వచ్చేసిందంటే – ఇక సందేహం లేదు, దర్శకుడి ఊహాశక్తి అపరిమితమైనది! ‘బాహుబలి’ లోని ముగింపు సైతం కలలో కన్పించేంత ఫోర్సుగా బిగ్ బడ్జెట్ సిన్మా హంగులు తనమీద స్వారీ చేస్తున్నాయి!
          ఉరుము లేని పిడుగులా క్లయిమాక్స్ రావడం దర్శకుడు చేతులెత్తేసిన తనాన్నే పట్టిస్తోంది.
          ఒక కనువిందైన దృశ్య ప్రదర్శన చేశాడు తనకున్న విజువల్ సెన్స్ తో. మున్ముందు ఇదే   విజువల్స్ సెన్స్ తో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే, ఇక చేయాల్సిందొకటే- ఏ కథ, ఎలాటి స్క్రిప్టు - స్క్రీన్ ప్లే, ఏ క్యారక్టరైజేషన్లు అనే విషయపరమైన  పరిజ్ఞానం పెంపొందించుకుని ఇలా నష్టపోకుండా సినిమాలు తీయడమే. కథా కథనాలూ పాత్ర చిత్రణ లనే మహాసముద్రంలో కొంత లోతుకైనా వెళ్ళగలగడమే...

సికిందర్