రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, July 16, 2015

నాటి సినిమా!



          వెండితెర మీద బహువిధ పాత్రలకి మించి నిజజీవితంలో పోషించే పాత్రలు సూపర్ హిట్టయితే ఆ చమత్కృతి పేరేమిటి?
          గన్ షాట్ గా పి. భానుమతే!

          టించిన సినిమాల్లో  ద్విపాత్రాభినయాల పరిమితిని దాటుకుని అక్కినేని, సంజీవ్ కుమార్, శివాజీ గణేశన్ ల నవవిధ పాత్రాభినయాలు, కమల్ హాసన్ దశావతారాలు, ఆఖరికి ప్రియాంకా చోప్రా భుజాన్నేసుకున్న పన్నెండు వేషాలూ ..డబుల్ యాక్షన్ తో మొదలెట్టి డజను యాక్షన్స్  వరకూ చేరిన వెండితెర బహువిధ పాత్రాభినయాల చరిత్ర అంత గర్వకారణ మేమీ కాదు ఆలోచిస్తే, గర్వకారణం నిజజీవితంలో భానుమతి బహుముఖ ప్రజ్ఞాపాటవమే!

          గటు ప్రేక్షకుడు సినిమాకొచ్చి తన అభిమాన నటీనటుల ప్రజ్ఞని విశ్లేషించుకుంటూ కూర్చోవాలనుకోడు. వాడి తహతహ అంతా కూడా కేవలం ఆ నటనల్లో తాదాత్మ్యం చెంది, వెంటాడే ఈ జీవితాన్నుంచీ కాసేపు దూరంగా పారిపోవాలనుకోవడం గురించే. అయితే ఆ తదాత్మ్యత  సాంద్రత పోషించే పాత్రలు పెరిగే కొద్దీ తరిగిపోవడం కూడా కద్దు. కమల్ ( ‘దశావతారం’), ప్రియాంకా ( ‘వాటీజ్ యువర్ రాశి’ ) వంటి ఇటీవలి బాక్సాఫీసు ఓటములే ఇందుకుదాహరణలు.

          భానుమతి కలాటి ఓటమిలేదు. నటిగా, గాయనిగా, కవయిత్రిగా, సంగీత కర్తగా, కథా రచయిత్రిగా, సినిమా దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా, ఫిలిం ఎడిటర్ గా, ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల స్రష్టగా...ఇన్ని విభిన్న పాత్రల పోషణని తన జీవితంలో సూపర్ డూపర్ హిట్టు గా నిర్వహించుకుపోయిన వన్ ఉమన్ ఆర్మీ భానుమతీ రామకృష్ణ!
          జీవితం కాన్వాసు జగమంత, అందులో మేధస్సు విస్తృతి ఆకాశమంత, సినిమా కాన్వాసు కమర్షియాలిటీకి సరిపోయేంతే;  అందులో మళ్ళీ క్రియేటివిటీ పాలు ఆ కమర్షియాలిటీకి లొంగినంతే, అంతే! దాటిపోయిందంటే దవాఖానాలో పడకే. ఈ అపూర్వ సందేశాన్నే అందుకోవాలి భానుమతి నిండు జీవితంలోంచి.
          మరొకటుంది- చాలా డేరింగ్ వుమన్ కూడా భానుమతి!
          లేకపోతే ఏమిటా తెగింపు!  ఇంకా ఇరవయ్యారేళ్ళ లేత వయసులోనే 1953 లో, దేశంలో సినిమా దర్శకత్వం చేపట్టిన తొలి మహిళ ఎవరున్నారంటే, తనే అని అన్పించుకుంటూ- నిర్మాతగానూ మారి, ఇంకో చేత్తో భారతీయ సినిమాల్లో తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని అవలీలగా పోషించి అవతలపారేసి,  తెలుగు- తమిళ- హిందీ బహు భాషా చిత్రంగా ‘చండీరాణి’ అనే మసాలా సినిమా తీసి, ఒకే రోజు ఆ మూడు భాషల్లోనూ విడుదల చేసి పారేసి, సత్తా చాటుకోవడం ఇంకెవరి వల్లయింది?
        ప్రపంచ సినిమా చరిత్రలో భానుమతితో పోల్చదగ్గ  చలనచిత్ర మహిళ ఇంకొక్కరే! ఆవిడ ఫ్రాన్సుకి చెందిన ఆలైస్ గై బ్లాంచ్ ( 1873-1963) అనే ఆవిడ. సినిమా అనే దృశ్య మాధ్యమాన్ని కనిపెట్టింది 1896లో ఫ్రాన్సు దేశస్థులైన లూమియర్ సోదరులహో అని అదేపనిగా బాజా వాయిస్తూంటాం గానీ, అదే సంవత్సరం ఆ విజయంలో ఓ చెయ్యి వేసిన  స్త్రీ మూర్తి గురించి పట్టించుకోం. మేడమ్ ఆలైస్ ప్రపంచంలోనే తొలి సినిమా ‘దర్శకురాలు’ గా ‘లాఫీ ఆక్ హాక్స్’ అనే మూకీ సినిమా తీయడమే కాదు, ఇంకే మూకీ దర్శకుడూ నిర్మాతా ఉత్పత్తి చేయనంత స్థాయిలో 700 వరకూ మూకీలు తీసి అవతల పారేసి కాలుమీద కాలేసుక్కూర్చుందంతే!!

అలైస్ గై బ్లాంచ్
              భానుమతి 1939లో 13వ యేట ‘వరవిక్రయం’ తో సినీరంగ ప్రవేశం చేసినా, 1945లో బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ‘స్వర్గసీమ’ లో నటించాకే మంచి పేరొచ్చింది. అందులో కథానాయకుడి ( వి. నాగయ్య) పండంటి సంసారాన్ని పీకి పందిరేసే ప్రతినాయిక సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. ‘ఒరేవొరే, భానుమతి కూడా మంచిది కాదురా, కాపురాలు కూల్చే రకం!’ అని నాటి ప్రేక్షకులు యమవర్రీ అయిపోయేవాళ్ళు- ఆవిడేదో తమ పక్కింట్లోనే మకాం వేసి తమ కొంపలకి  ఎసరుపెడుతున్నట్టు. ఇలాటి వాళ్ళని ఇంకా ఏడ్పించి వదలాలని కాబోలు, ‘విప్రనారాయణ’ లోనూ అదే వ్యాంప్ పోకడ పోయారామె!
          ‘విప్రనారాయణ’ భానుమతి నటజీవితాన్ని కీలక మలుపు తిప్పిన మహోజ్వల భక్తి రస ప్రధాన చలన చిత్రం. ‘లైలా మజ్నూ’, ‘మల్లీశ్వరి’, బాటసారి’ ల లాంటి మరెన్నో అద్భుత చలన చిత్రాలు ఆమెఖాతాలో పడివుంటే ఉండొచ్చు గాక- ఒక పూర్తి స్థాయి యాక్టివ్ పాత్రగా, కథలో ఓ ప్రధాన సంఘటనని సృష్టించి, ఆ కథని నడిపించే, కథనాన్ని కూడా పండించే దృశ్య కావ్యంగా  ‘విప్రనారా యణ’ నిలబడింది. అక్కినేని నాగేశ్వరరావు పోషించిన విప్రనారాయణ పాత్రపరంగా సినిమాకి నామకరణం జరిగినా,  నిజానికిందులో భానుమతి పోషించిన దేవదేవి పాత్రకే పెద్ద పీట. ట్రాజెడీల్లో ప్రధాన పాత్ర కర్మణి పాత్ర స్థానంలో వుండిపోయి, ప్రతినాయక పాత్ర కర్తగా తానే కథ నడిపించడం చూస్తూంటాం. అలాగే  ‘విప్రనారాయణ’ లో కూడా ఇలా ప్రతినాయిక పాత్రనే ప్రధాన పాత్రగా చేసి, సాగించిన కథనాన్ని నాటక పరిభాషలో ప్రకరణం అంటారు. ‘చింతామణి’, ‘వసంతసేన’, ‘స్వర్గసీమ’ లలోని ‘సుబ్బలక్ష్మి’ కథలు ఈ కోవకే చెందుతాయి.
          సరే, ఇంతకీ ఎవరీ విప్రనారాయణ?
         చరిత్రలో కెళ్ళాలి.  క్రీ.శ. 787 లో తమిళనాడులోని కావేరీ నది ఒడ్డున మందంగుడి అనే గ్రామంలోజన్మించాడు తొండరాదిప్పొడి ఆళ్వార్. ఇతను నారాయణుడి ఆశీస్సులతో  జన్మించడంతో విప్రనారాయణ అయ్యాడు. విప్ర అంటే బ్రాహ్మణుడు. ఇతను పెరిగి పెద్దయి, వేదాలు చదువుకుని, శ్రీరంగ పట్టణం వెళ్లి శ్రీ రంగనాథుడి దర్శనం చేసుకున్నాడు. ఆ దర్శనం అతడిలో భక్తి పారవశ్యాన్ని కల్గించి, ఇక అక్కడే వుండిపోయి ఆ రంగనాథుడి సేవలో తరించి పోయేందుకు పురిగొల్పింది. ఆ సేవలో ప్రధానమైనది మాలా కైంకర్యం. దాంతో ఆలయం వారగా తులసి మొక్కలు, రకరకాల పూల చెట్లూ పెంచి ఒక మనోహరమైన తోటని అభివృద్ధి చేశాడు. అనునిత్యం పూలమాలలు అల్లుతూ స్వామికి సమర్పించుకోవడమే దినచర్య అయిపోయింది.
          కావేరి ఆవలి ఒడ్డున కదంబణగారం అనే ఊరుంది. ఆ ఊళ్ళో దేవదేవి అనే వేశ్య ఉంటోంది. ఓ నాడామె చోళరాజు ఎదుట నృత్య ప్రదర్శన ఇచ్చింది. చోళ రాజు మెచ్చుకుని సత్కరించాడు. ఆమె తిరిగి వెళ్తూ తోటలో విప్రనారాయణని చూసింది. అతడి గొప్ప గురించి ఇదివరకే చెప్పి వుంది తన అక్క అలివేణి. దీంతో ఈ గొప్పవాడికి ప్రణమిల్లాలని ముందుకు సాగిన దేవదేవి కి భంగపాటు ఎదురయ్యింది. అప్పుడేదో పరధ్యానంలో వున్న విప్రనారాయణ ఆమె ప్రణమిల్లడాన్ని గమనించలేదు. దీంతో ఆమె అహం దెబ్బ తింది. అతడి పరధ్యానాన్ని అహంకారంగా భావించుకుని –ఈ మనిషిని ఎలాగైనా లొంగదీసుకుని పీచమణుస్తానని అక్కడికక్కడే ప్రతిజ్ఞ చేసింది.
          ఇక్కడ్నించే మొదలయ్యాయి విప్రనారాయణకి కష్టాలు! అతడి దైవ చింతన, భక్తీ ముక్తీ సర్వం ఆ ఒక్క ఆడగాలి సోకి పటాపంచలై పోయాయి. అనాధనని, అతడి సేవలో తరిస్తూ కష్టాలన్నీ మర్చిపోతాననీ బొంకి, పథకం ప్రకారం అతడి పంచన చేరిన ఆమె, ఓ వర్షపు రాత్రి అనుకున్నట్టూ లొంగ దీసేసుకుంది. అంతే, ఇక దీంతో అతడామెకి దాసుడైపోయాడు. ఆలయం నుంచి ఏకంగా మకాం ఆమె ఇంటికే మార్చేశాడు. కానీ, చిల్లికాణీకీ కొరగాని ఇతగాణ్ణి ఆమె తల్లి చీదరించుకుని, పైపెచ్చు ఇతడి మైకంలో కూతురు పడిందంటే తన ఆదాయమూ పడిపోతుందని ఇంట్లోంచి వెళ్ళ గొట్టేసిందతణ్ణి.
      అయినా మూతబడ్డ తలుపులవతలే బైఠాయించి దేవదేవినే కలవరించసాగాడు. విప్రనారాయణ ఈ దుస్థితిని రంగనాయకి తో పట్టణ విహారాని కొచ్చిన రంగనాథుడు చూసి జాలిపడ్డాడు. దారి తప్పిన ఇతడికి సాయపడాలని, ఆలయంలోంచి బంగారు గిన్నె తొలగించి తెచ్చి, అది విప్రనారాయణ పంపిన కానుక అంటూ  దేవదేవికి బహూకరించాడు. అటు ఆలయంలోని బంగారు గిన్నె చోరీ జరిగిందని పూజారి గోల పెట్టాడు. ఆ నేర విచారణలో విప్రనారాయణుడే నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది.
          అప్పుడు  చోళ రాజు అతడి దోషిత్వాన్ని నిర్ధారించుకుని, శిక్షగా చేతులు నరికెయ్యాలని ఆదేశించాడు. ఆ శిక్ష అమలవుతూండగా, రంగనాథుడు ప్రత్యక్షమై కాపాడాడు. ఇదంతా తాను ఆడించిన ఆట అని చెప్పాడు. పూర్వ జన్మలో విప్రనారాయణ వైజయంతీ మాలా రూపుడనీ, శాపవశాత్తూ మానవుడిగా జన్మించాడనీ, దేవదేవి కూడా పూర్వజన్మ కర్మానుభవం కోసం మానవిగా జన్మించిన గంధర్వ కాంత అనీ, అలా వీళ్లిద్దరికీ సంబంధ బాంధవ్యాలు కల్పిస్తూ, వాళ్ళ కర్మ శేషం హరింపజేసేందుకే, తన సన్నిధి లోని బంగారు గిన్నెని సాని ఇంటికి పంపాననీ, చెప్పుకొచ్చాడు రంగనాథుడు. దీంతో విప్రనారాయణ కష్టాలన్నీ గట్టెక్కి, తిరిగి ఆ స్వామి భక్తుడ య్యాడు.
          శ్రీరంగం టెంపుల్ వెబ్ సైట్లో పెట్టిన ఈ చరిత్ర పాఠాన్ని ఉన్నదున్నట్టూ తెరకెక్కించారు దర్శకుడు, భానుమతి భర్త రామకృష్ణ. కాలానుగుణమైన వాతావరణ నేపధ్యం, దృశ్యానుగతమైన నటనలూ ఇంత చక్కగా అమరిన ఈ కళా సృష్టి, మనల్ని ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఎప్పుడో 1954 లోనే సినిమా క్రాఫ్ట్ ఇంత రాటుదేలి వుండడం ఒక అద్భుత విషయంగా కన్పిస్తుంది. వర్షపు రాత్రి సీనైతే ఫెంటాస్టిక్. మూడంకాల ( త్రీ యాక్ట్స్) కథా సంవిధానంలో ఆయా అంకాల్లో ఏ ఏ బిజినెస్సులు జరగాలో- ఆ కథన కవాతులు పొల్లుపోకుండా ఆకట్టుకుంటే, సందర్భానుసారంగా వచ్చే పాటలొక మంచి కవిసమయం. భానుమతి, ఏఎం  రాజాల గళాలు మధువులు నిండిన గళాసులు. సేవించే మనబోటి శాల్తీలకి సాంత్వన క్లాసులు. ‘ఎందుకోయీ తోటమాలీ..’,  ‘సావిరహే తవదీనా..’,  ‘చూడమదే చెలియా ..’  పాటలన్నీ సాలూరు రాజేశ్వరరావు చేతినుంచి జాలువారిన సంగీత ఝరులే. సముద్రాల రచన, రెహ్మాన్ ఛాయాగ్రహణం మరో రెండు పంచ ప్రాణాలు.
          ఈ సినిమా విడుదలై యాభై ఏళ్ళు దాటింది. అయినా లోకంలో ఇంత శోకం ఇంకా మిగిలే వుంది. కష్టాలకి కుంగి పోతారు మనుషులు. భోరున విలపించేసి తమ బాధని ప్రపంచానికి ప్రకటిస్తారు. కష్టాలు రావడమంటే చేసిన పాత కర్మల దరిద్రం వదలడమేననీ, వదిలి పునీతులవడమే ననీ- ఈ సినిమా చూసి గ్రహించి వుంటే, ఇంత విషాదం ఈ  ప్రపంచంలో వుండేది కాదు. అక్కినేని, భానుమతి ల మధ్య రోమాన్సుని రోమాంచితం చేసి, షుగర్ కోటింగ్ సన్నివేశాలతో అలరింపజేస్తూ వెళ్లి, ఆఖర్లో అసలు గుట్టు విప్పుతూ, ఒక ఆధ్యాత్మిక ప్రభోదం చేస్తున్న ఈ చలన చిత్ర రాజం-  సృజనాత్మకతా పరంగా జేమ్స్ బానెట్ స్టోరీ వీల్ స్లాట్ లో అగ్రస్థానాన్నే ఆక్రమిస్తోంది సగర్వంగా!
         అక్కినేనిది బాధిత పాత్ర కావడం వల్ల ఆ మేరకే ఆయన నటనా వుండి జాలి పుట్టిస్తుంది. ఎదురయ్యే సంఘటనల్ని ప్రతిఘటించే తత్త్వం కాకపోవడం చేత ఆయన ప్రదర్శించిన అమాయకత్వం నిండిన హావభావాలు చాలా రోజులూ మనల్ని వెన్నాడి తీర్తాయి! ఇక భానుమతి గురించి చెప్పుకోవాలంటే – ‘భానుమతి ఈజ్ ది షో ఉమన్’  అని చెప్పుకోవాలి. పాత్ర స్వభావం చేత ఆమెకి నవరసాల పోషణ దక్కింది. కథని నడిపించే పాత్రవడం చేత ఆ పాత్ర చివరంటా సినిమాకి చురుకుదనం పుట్టిస్తుంది. వేశ్యగా హొయలు, ప్రేమికగా హుందాతనం..ఈ రెండు శారీరక భాషల తో ఆమె అభినయ కళా విశేషాలు వెర్రెత్తించి వదుల్తాయి. తమిళులు కలైమా మణి  అనీ, బహుకళా ధీరతి శ్రీమతి అనీ, ఊరికే అనలేదు భానుమతి నుద్దేశించి. వ్యాంప్ కి చెరువైనా, గయ్యాళి తనానికి దూరం ఉంటూ, జీవితపు చరమాంకంలో వెండితెర మీద ది గ్రాండ్ ఓల్డ్ మదర్ గా మన్నన లందుకున్న పాలువాయి భానుమతీ రామకృష్ణ ( 1925- 2005) చక్కగా ‘విప్రనారాయణ’ నిర్మించి తనకి తానే నివాళి అర్పించుకున్నారు!

సికిందర్
( నవంబర్ 2009, సాక్షి- ‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)