రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, February 11, 2014


హిందీ సినిమాలు ఇంతేనా ?

హిందీ సినిమాలు కూర్చోబెట్టే విషయం తక్కువగానూ, పారితోషికాలూ బడ్జెట్లు కళ్లు చెదిరేంత మహా ఎక్కువగానూ తయారైన ప్రమాదాన్ని పసిగట్టిన సుభాష్‌ఘాయ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తూ నాలుగేళ్ళు గడిపేశారు. అయినా ఏటా నూటయాభై తీస్తే నూటపాతిక ఫ్లాపయ్యే పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఏ మూకుమ్మడి ఫ్లాపులకి సినిమా రచనే కారణమని నిర్ణయించారో, ఆ స్క్రీన్‌ప్లే కోర్సులకోసం ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్ అభ్యర్థులు అయిపు లేకుండాపోయారు. మామూలుగా మూడు నెలలు, ఆరు నెలలు వుండే ఈ కోర్సుని ఏడాదిపాటు నూరిపోసినా, హిందీ సినిమాల్ని ఉద్ధరించే కథానుకథాయోధులు కాలేకపోయారు. కారణమొక్కటే కార్పొరేట్ సంస్థలు కూడా మూస ధోరణిలోమీ కథ తీసుకుంటే దర్శకత్వం వహించేదెవరు? దర్శకుణ్ణి పెట్టుకుంటే అతను తన కథే పట్టుకొస్తాడే, అప్పుడెలా?’ అని కళ్ళు తెరిపిస్తున్నారు. కార్పొరేట్ అయినంత మాత్రాన హాలీవుడ్ పద్ధతుల్ని పాటించాలని లేదు. ఇక్కడ ఫీల్డులో పాతుకుపోయిన పాత మూస భావాలతోనే అవికూడా దుకాణం తెరవాల్సిందే.

సీనియర్ రచయిత కమలేష్ పాండే కూడా హిందీ సినిమాల దుస్థితికి నేటి రచయితలే కారణమని భావిస్తారు. వీళ్ళు దర్శకులకి ఉపగ్రహాలనీ, వాళ్ళ ప్రాపకంకోసం విలువల్ని వదులుకుంటారనీ అంటారు. వాళ్ళిచ్చే డీవీడీలు చూసి, వాళ్ళు చెప్పినట్టు రాసి, ఆ స్క్రిప్టులమీద వాళ్ళ పేర్లే రాసిచ్చి, ఇచ్చింది పుచ్చుకుని వెళ్ళిపోయే వృత్తితత్వం తెలీని అర్భకులని కూడా అంటారు పాండే. వీళ్ళకసలు ముంబాయిలో కథలు నిండుకున్నాయని తెలీదనీ, కథలెక్కడున్నాయో ఆ గ్రామసీమలకెళ్ళలేరనీ నిందిస్తారు. కానీ పాండే తన కాలంలో వుండి మాట్లాడుతున్నట్టుంది. ఆ కాలంలో రచయితలకి బ్రాండ్ నేమ్ వుండేది. కమలేష్ పాండే, సలీం-జావేద్, రాహీ మసూంరాజా, రాబిన్ భట్... వీళ్ళ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలతో సబ్జెక్టులు తెరకెక్కేవి. ఇప్పుడవన్నీ దర్శకులేసుకుంటారు. రచయిత ఫిలిం ఇనిస్టిట్యూట్ పట్టా పొందినా, అనామకంగా దర్శకుల కొలువుల్లో చోటు సంపాదించుకోవాల్సిందే. ఫిలిం ఇనిస్టిట్యూట్ భాష మాట్లాడకుండా, అక్కడ నేర్చుకున్న శాస్త్రంకూడా మర్చిపోయి, సొంత కథా కాకరకాయా పక్కనపెట్టి, చెప్పింది రాసిపెట్టాల్సిందే. సొంత కథతో రచయిత అన్పించుకోవాలంటే తనే దర్శకుడవ్వాలి తప్ప మరో మార్గంలేదు. కమలేష్ పాండే లాంటి సీనియర్లకి ఇంకా సాగుతూండవచ్చు. తనింకా మూడు పెద్ద సినిమాలకీ, రెండు చిన్న సినిమాలకీ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ అదే ఐడెంటిటీ నిలబెట్టుకోవచ్చు. అలాంటి అవకాశం ఇప్పుడు కొత్త రచయితలకెక్కడిది. అలాంటప్పుడు అసలు సొంత టాలెంట్‌నే బయటపెట్టుకోలేని వీళ్ళు, హిందీ సినిమాల దుస్థితికి కారకులెలా అవుతారు. తమ కథే బాగాలేనప్పుడు గ్రామసీమలకెళ్ళి ఏం వెతుక్కుంటారు. అసలు గ్రామసీమల కథలు ఇప్పుడు చూసే హిందీ ప్రేక్షకులున్నారా?

నాటి ప్రసిద్ధ హీరో వినోద్‌ఖన్నా అయితే ఇంకో అడుగు ముందుకేశారు. ఫీల్డులోకి నవలా రచయితలు రాకపోవడమే ఈ దుస్థితికి మూలకారణమని తేల్చేశారు. నవలా రచయితలు మొహమాటపడుతుంటారని, వాళ్ళని బుజ్జగించి బామాలి తీసుకురావాలనీ, అంతేగాక యూనివర్సిటీల్లో స్క్రీన్‌ప్లే కోర్సులు ప్రవేశపెట్టాలనీ డిమాండ్ చేశారు. 

ఇది చోద్యంగానే వుంటుంది వినేవాళ్లకి. నవలా రచయితలు సినిమా రచయితలెప్పుడయ్యారు. ఆర్కే నారాయణ్ తను రాసిన గైడ్నీ, గుల్షన్ నందా కటీపతంగ్నీ ఇచ్చారేమో సినిమా తీసుకోమని. ఇచ్చి తప్పుకోవాలే తప్ప ఇంకెందులోనూ చేతులు పెట్టకూడదుగా. ఎన్నారై రచయిత ఫరూఖ్ ధోన్డీ కథతో సుభాష్‌ఘాయ్ కిస్నాతీస్తున్నప్పుడు, కథా చర్చల్లో పాల్గోడానికి పిల్చి ఏం మర్యాద చేశారో, అప్పట్లో ధోన్డీ డెక్కన్ క్రానికల్ ఎడిట్ పేజీలో ఇంత పొడుగు వ్యాసం రాసుకోవాల్సి వచ్చింది. చేతన్ భగత్ నవల ఫైవ్ పాయింట్ సమ్ ఒన్తో త్రీ ఇడియెట్స్తీసిన రాజ్‌కుమార్ హిరానీ, చేతన్ పేరు వేయకుండా రేపిన దుమారం తెలిసిందే. నవలా 

రచయితలకిస్తున్న గౌరవ మర్యాదల మాటలా వుంచితే, అసలు నవలా రచయితలు సినిమా రచనలో విఫలమవడం విశ్వవ్యాప్తంగా కన్పించే ఒక వాస్తవమే. నవలా రచన వేరు, సినిమా రచన వేరు. ప్రసిద్ధ నవలా రచయిత స్కాట్ ఫిట్జెరాల్డ్ అయినా, ‘జాస్రచయిత పీటర్ బెంచ్లే అయినా, ‘్ఫరెస్ట్ గంప్రాసిన విన్‌స్టన్ గ్రూమ్ అయినా తమ నవలల్ని సినిమాలుగా మలచడంలో విఫలమైన వాళ్ళే. ఫిట్జెరాల్డ్ తనదికాని రంగంలో విఫలయత్నంచేసి వెళ్ళిపోతే, వద్దన్నా పీటర్ బెంచ్లే జాస్స్క్రిప్టుని మూడుసార్లు రాసిచ్చి సమయం వృధాచేశారు. దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ చివరి నిమిషంలో తనకి తెలిసిన టీవీ రచయితని పిలిపించుకుని ఏరోజు సీన్లు ఆరోజు రాయించుకోవాల్సి వచ్చింది. ఇక ్ఫరెస్ట్ గంప్తో విన్‌స్టన్ గ్రూమ్‌తో తలెత్తిన వివాద ఫలితంగా స్క్రిప్టు రాయకున్నా, ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో నవలా రచయితగానైనా ఆయన పేరు ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో నవలా రచయితలకి మొహమాటాలు, వాళ్లకి బుజ్జగింపులతో ఆహ్వానాలూ జోకుకిందే లెక్కించవచ్చు. 

ఎటుతిరిగీ హిందీ సినిమాల వైఫల్యానికి నేటి రచయితలనే బాధ్యుల్ని చేస్తున్నారు. ఎలాటి బాధ్యతాయుత స్థానంలోనూ వుండని, సినిమాల జయాపజయాల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేని, ఈ అమాయకుల్ని అర్జెంటుగా సంస్కరించే పని పెట్టుకున్నారు. ఫిలిం ఇనిస్టిట్యూట్లూ, యూనివర్సిటీల్లో కోర్సులూ.. వామ్మో.. సినిమాల్ని హిట్ చేయడానికి సుశిక్షితులైన రాత పని కూలీలు ఎంతవసరం నిజంగా!
వ్యవస్థని బాగుచేయకుండా, వ్యవస్థలో నామమాత్రమైన రచయితల సంస్కరణతో ఏది బాగుపడుతుంది. హాలీవుడ్ ఇలా రచయితల వ్యవస్థని నాశనం చేసుకోలేదు, యూరప్ చేసుకుంది. 1960లలో యూరప్‌లో ఆధర్ థియరీఅనే పదాన్ని కాయిన్ చేసి, సినిమాకి నిజమైన కథకుడు దర్శకుడే, రచయితకాదని డిసైడ్ చేశారు. దీంతో అక్కడి పరిశ్రమ నిజమే కాబోలనుకుని రచయితల్ని అంటరాని వాళ్ళుగా చూడడం మొదలెట్టింది. అంతగాక ఫిలిం ఇనిస్టిట్యూట్స్‌లో స్క్రీన్‌ప్లే కోర్సుల్ని ఎత్తిపారేసింది. ఇక దర్శకులే రాసుకుని తీయడం మొదలెట్టారు. 

హాలీవుడ్‌లాగా యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా చూసే కమర్షియల్ సినిమాలు తీయలేవు. కాబట్టి అక్కడ చెల్లిపోతుంది. ఇది భారత్‌కెలా వర్తిస్తుంది. అయినా కమర్షియల్ సినిమాల కాలవాలమైన బాలీవుడ్ ప్రపంచంలో దర్శకులే రచయితలు కావడం మొదలెట్టారు. ఇది గత పదేళ్లలో వచ్చిన మార్పు. ఇక్కడ్నుంచీ రచయిత రచయితగా కథనిచ్చే హక్కుని కోల్పోయాడు. దర్శకుడు ఆ హక్కుని లాక్కున్నాడు. ఇక కమర్షియల్ సినిమాలకి నప్పని యూరప్ ఫార్ములా అమల్లో పెట్టేశారు.
తామే రాసుకుని తీస్తున్న హిందీ దర్శకులు దర్శకులుగా విఫలమవుతున్నారని కాదు, రచయితలుగా సినిమాల్ని ఫ్లాప్ చేస్తున్నారు. పాన్ సింగ్ తోమర్తీసిన తిగ్మాంశూ ధూలియా ఫస్ట్ఫా రచనకీ, సెకండాఫ్ రచనకీ సంబంధమే వుండదు. జోకర్తీసిన శిరీష్ కుందర్ మొత్తం సినిమా అంతా రాయరాక చతికిలబడ్డాడు. దీంతో సల్మాన్‌ఖాన్‌తో తెలుగు కిక్రీమేక్ అవకాశాన్ని కోల్పోయాడు. కాక్టెయిల్కి రాసి తీసి సినిమా అంతా ఏడ్పించాడు హోమీ అదజానియా. ఇలా ఎందరో.

హీరోలకీ తాము నటిస్తున్న కథల మీద పూర్తి అవగాహన వుండదు. తమ పాత్రవరకే చూసుకుని, దాన్ని హైలైట్ చేసుకోవడంకోసమే తంటాలు పడతారు. ఇలాటి హీరోలందరి సినిమాలూ ఫ్లాపవుతున్నాయి. ఒక్క అమీర్‌ఖాన్ తప్ప స్క్రిప్టుని కూలంకషంగా పరిశీలించే హీరోలు లేరు. అమీర్‌ఖాన్ తన పాత్రేగాక, ఇతర పాత్రల్నీ, మొత్తం కథనరీతుల్నీ పోస్టుమార్టం చేసి, ఒక సమంజసమైన కథాప్రపంచం సృష్టికి వొత్తిడి తెస్తాడు. తమ పాత్రల్ని మాత్రమే హైలైట్ చేసుకునే ఇతర హీరోలకి ఆ పాత్ర చిత్రణల గురించైనా అవగాహన వుండదు. దర్శకుడు ఏదో రాసుకొస్తే, అది యాక్టివ్ పాత్రా, పాసివ్ పాత్రా తెలుసుకోలేరు. పాసివ్ పాత్రల్లో నటించేసి ఫ్లాప్ చేస్తారు. నటనలో శిక్షణనిచ్చే ఇనిస్టిట్యూట్లు కూడా నటన నేర్పుతాయే తప్ప, యాక్టివ్, పాసివ్ గురించీ, పాత్ర చిత్రణల గురించీ చెప్పవు.
నిర్మాతలకి ఇదేం పట్టదు రచన విషయం దర్శకుడు చూసుకుంటాడు. నటించి హీరో అదరగొడతాడు. కాబట్టి హిట్టయి పోతుందనుకుని ఇతర వ్యవహారాలు చూసుకుంటారు. ఏదో రీమేకులతో కలిసివచ్చి సల్మాన్‌ఖాన్, అజయ్‌దేవ్‌గన్ లాంటి ఇద్దరు ముగ్గురు హీరోల సినిమాలు వంద కోట్లు దాటి వసూళ్లు చేసినంతమాత్రాన అంతా బాగున్నట్టు కాదు. నూటయాభైలో నూట పాతిక నుయ్యో గొయ్యో చూసుకుంటున్నాయి. రచయితలుగా మారిన దర్శకులు, నిర్మాతలు, శిష్య రచయితలూ కలిసి ఏం చేస్తూంటారో మనోజ్ త్యాగీ బాగా చెప్తారు.

 రచయిత అవుదామని బ్యాంకుద్యోగం మానేసిన త్యాగీ మాటల్లో, ప్రతీరోజూ నిర్మాతలు, దర్శకులు, రచయితలూ మీటింగులు పెట్టుకుంటారు. ఆ మీటింగుల్లో గత రాత్రి ఏమేం విదేశీ సినిమాలు చూశారో ముచ్చటించుకుంటారు. వాటిలోంచి ఏది పనికొస్తుంది. మొత్తం పనికొస్తుందా, అక్కడక్కడా ఎత్తిపోతలు చేసుకోవాలా, వాటిని ఇంకెవరయినా కాజేశారా అనే ఎజెండాతో మాఫిగా భేటీ లాంటిది పెట్టుకుంటారు. ప్రముఖ సినీ విమర్శకుడు కోమల్ నహతా ప్రకారమైతే, పనికిమాలిన స్టోరీలైన్లు, పేలవంగా అల్లుకున్న ప్లాట్లు, ఒక గ్రామర్, స్ట్రక్చరూ లేని స్క్రిప్టులతో తొంభయి శాతం సినిమాలు తీస్తున్నారు.

శిష్య రచయితల్లో సత్తావున్న వాళ్ళు వుండరని కాదు. రాంగోపాల్ వర్మతో సౌరభ్ శుక్లా, అనురాగ్ కాశ్యప్‌లున్నంతకాలం ఆయన సినిమాలు వేరు, వాళ్ళు దర్శకులుగా వెళ్ళిపోయాక వేరు. సత్తావున్న హిందీ రచయితలు కూడా తమ పేరుతో కథ ఇచ్చుకోలేని పరిస్థితులే వున్నప్పుడు దర్శకులవుతున్నారు. దర్శకుడు రచయిత అవడం, రచయిత దర్శకుడవడం అనే మ్యూజికల్ చైర్స్‌తో గమ్మత్తయిన ఆటాడుకుంటున్నారు. సీనియర్ రచయితల నిగ్రహ నిబద్ధతలు వేరు. కమలేష్ పాండేనే మీరెందుకు దర్శకుడు కాకూడదని అడిగితే-

నేను దర్శకుణ్ణి ఎందుకు కానంటే, రచయితగా నా పని ముగిసిపోలేదు. రచయితగా ఏక కాలంలో ఆరు కథల మీద పనిచేయగలను, అదే దర్శకుడ్నయితే ఒకే కథతో రెండేళ్లు ఇరుక్కుపోవాలి. అది భరించలేను. నేను చెప్పాల్సిన కథలు ఇంకా చాలా వున్నాయి, జీవితకాలం సరిపోదు. నా కథల్ని కోరుకుని వాటిని దివ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకులు నాకుండగా బాధే లేదు- అంటారు పాండే. తేజాబ్, ఖల్‌నాయక్, సౌదాగర్, చాలబాజ్, దిల్, రంగ్ దే బసంతీ, ఢిల్లీ-6 మొదలయిన ముప్పయి నాలుగు హిట్సిచ్చి, ఇప్పుడు ప్రియదర్శన్ కోహినూర్’, ‘మిస్టర్ ఇండియారీమేక్, కన్సైన్‌మెంట్, లైఫ్ ఆఫ్టర్ డెత్, భైరవీ మొదలయిన సినిమాలకి పనిచేస్తున్న పాండే గురించి ఇంకా చెప్పుకోవాలంటే, నేటి రచయితలు సిగ్గుపడేలా ఎప్పటికప్పుడు స్క్రీన్‌ప్లే పుస్తకాలు, ప్రతిరోజూ స్క్రీన్‌ప్లే వెబ్‌సైట్స్, కొత్త హాలీవుడ్ సినిమాల స్క్రీన్‌ప్లేలు, హిందీ పత్రికల్లో కాల్పనిక కథలూ చదవడం వగైరా, స్క్రీన్‌ప్లే వర్క్‌షాపులకి హాజరవడం వంటి వ్యాపకాలూ పెట్టుకుని నిత్యం అప్డేట్ అవుతుంటారు.



ఇలాటి సీనియర్ రచయితలు రంగంలో లేరు. ఉన్న అమాయక శిష్య పరమాణువులకి హిందీ సినిమాల ఉన్నతికోసం చాకిరేవు పెట్టాలని ఉపన్యాసాలిస్తున్నారు. అసలు కూర్చోబెట్టి స్క్రీన్‌ప్లే పాఠాలు బోధించాల్సింది రచనలుచేస్తున్న దర్శకులకీ, పాత్రలు తెలియని హీరోలకీ, అసలేమీ తెలియని నిర్మాతలకీ.. దీంతోబాటు మాఫియా భేటీల్ని అంతం చేస్తేగానీ హిందీ సినిమాలు బాగుపడవు. ఇది చేయకుండా, హిందీ సినిమాల క్వాలిటీ గురించి బాధపడ్డం అనవసరం!


సికిందర్ 
(ఆంధ్రభూమి)



Saturday, February 1, 2014

రివ్యూ..

మ్యూజికల్ ఎటాక్!


హార్ట్ ఎటాక్

నితిన్, అదా శర్మ, కేశా కంభటి, బ్రహ్మానందం, అలీ, ప్రకాష్ రాజ్, విక్రంజిత్ విర్క్ , అజయ్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్   సాహిత్యం:  భాస్కర భట్ల  కెమెరా : అమోల్ రాథోడ్  ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్,
బ్యానర్ : పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
నిర్మాత-రచయిత- దర్శకుడు : పూరీ జగన్నాథ్
విడుదల : 31 జనవరి 2014  సెన్సార్ :  ‘A’ 
***
ఓ రోమాంటిక్ కామెడీ ప్రతి పాటా ఉర్రూతలూగించే బాణీలతో మ్యూజికల్ గా అలరించడం ఇన్నాళ్ళకి జరిగింది! ప్రేమకథా చిత్రాల్లో ఒకటీ అరా తప్ప  అలరించే పాటలు కరువై పోయిన ఈ కాలంలో ‘హార్ట్ ఎటాక్’ దాని రోమాంటిక్ జెనర్ కి తగ్గ న్యాయం చేస్తూ చార్ట్ బస్టర్ మ్యూజిక్ తో ప్రేక్షక లోకానికి దగ్గరవడం, ఈ యేటి తొలిమాసాంతంలో ఒక రికార్డు అంశమే.

రెండో ఇన్నింగ్స్ ని  విజయవంతంగా ప్రారభంచిన హీరో నితిన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టినట్టే. అవే రోమాంటిక్ కామెడీల కోవలో కాన్వాస్ మారిపోయి, క్యారక్టర్స్ మారిపోతూ ఉన్నతమైన నిర్మాణ విలువలతో, అతడి సినిమాలు మూడూ వరుసగా వచ్చి విజయాలు సాధించడం అతన్నో టాప్ స్టార్ స్థాయికి చేర్చేశాయి.

ఈ మధ్య పెద్ద స్టార్స్ తో హిట్లు లేక అలమటిస్తున్న అగ్రదర్శకుడు పూరీ జగన్నాథ్ అప్ కమింగ్ స్టార్ నితిన్ తో జతకట్టడం తనకి మంచి ఊరట నిచ్చినట్టే. ఎదిగివస్తున్న నితిన్ ని మళ్ళీ వెనుకబాట పట్టించే 'క్రియేటివిటీ' తో కాక, కాస్త నేర్పుగా ‘హార్ట్ ఎటాక్’ ఇచ్చి న్యాయం చేశాడు.

‘హార్ట్ ఎటాక్’ ఖండాంతరాలకి విస్తరించిన తెలుగు సినిమా మార్కెట్ డిమాండ్లకి తగ్గట్టు ఆ స్థాయిలో దృశ్యాత్మక ఔన్నత్యాన్ని చాటుకుంటూ రెక్కలు విప్పార్చుకుని వాలిపోయింది. విషయపరంగా కొత్త అంశాల్నిఆవిష్కరించక పోయినా, ప్రేక్షకులు డిఫెండ్ అయ్యే ఎలాటి అపభ్రంశాలకీ పాల్పడకుండా సాఫీగా నడిచిపోయే వినోదాత్మక మసాలా దినుసుల దొంతరగా దిగుమతైంది.

అశ్లీలం, ద్వంద్వార్ధాలూ ఉట్టిపడితే తప్ప అది ప్రేమకథా చిత్రం అన్పించుకోదనే దృఢాభిప్రాయానికొ చ్చేసిన కొంతమంది ప్రస్తుత ట్రెండ్ దర్శకులకి ‘హార్ట్ ఎటాక్’ బ్రెయిన్ వాష్ చేయాలి తప్పక. 

ఓ పాటలోంచే దర్శకుడు ఈ పాటల ప్రేమకథా చిత్రాన్ని పుట్టించా నంటున్న ఈ సినిమాలో అసలేముందో చూద్దాం

దేశదిమ్మరి అతడు- దేశవాళీ ఆమె!
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి, ఆ బాధతో దేశాలు పట్టి తిరుగుతున్న వరుణ్ (నితిన్ ) కి స్పెయిన్ లో హయాతి (అదా శర్మ) అనే అందగత్తె కన్పించగానే అలజడిరేగి ఆమె వెంట పడతాడు. అతడి ఫిలాసఫీ ఒక్కటే : ఈ రోజుని అనుభవించు- రేపటి సంగతి తర్వాత -అనేది. అందుకు తగ్గట్టే మొబైల్ బెడ్, మొబైల్ కిచెన్ వెంటపెట్టుకుని, పేవ్ మెంట్ల మీద వండుకుతిని పడుకుంటుంటాడు. ‘బంజారా’ లాంటి బతుకీడుస్తూ, సంపాదన కూడా అప్పటి అవసరాన్ని బట్టి ‘కూలి’ చేసుకుని గడిస్తూ వుంటాడు. గోవాకి చెందిన హయాతి స్పెయిన్ లో ఫ్రెండ్ ప్రియ ( కేశా కంభటి) దగ్గరికొచ్చి వుంటుంది. ప్రియకో కృష్ణ భక్తుడైన తండ్రి (బ్రహ్మానందం) ఉంటాడు. ఇతడికి తెలీకుండా ఆమె ఒక నల్ల జాతీయుణ్ణి ప్రేమిస్తూంటుంది. హయాతి  వెంట పడుతున్న వరుణ్ ఫిలాసఫీని ఇంకా పొడిగిస్తే, అతడికి ప్రేమలమీద, పెళ్ళిళ్ళ మీదా నమ్మకం లేదు- ఉన్నదల్లా ఓ కిస్ తో సరిపెట్టుకుని వెళ్ళిపోవడమే. దీని ప్రకారమే ఓ గంట సేపు సుదీర్ఘమైన ముద్దు ఆమె చేత పెట్టించు కోవాలని పట్టుదల. దీంతో ఆమె అతణ్ణి అసహ్యించుకోవడం మొదలెడుతుంది. సభ్యతా సంస్కారాలతో కాస్త దేశావాళీగా వుండే అమ్మాయీమే.

ఈ ఆటలో ఎత్తుకు పై ఎత్తులేసుకుంటూ వుంటే, తండ్రి ససేమిరా అంటున్నప్రియ పెళ్లి సమస్య తన షరతు మీద వరుణ్ తీర్చడంతో, ఇక హయాతికి  ముద్దివ్వక తప్పని పరిస్థితేర్పడుతుంది. అయితే ఇందుకామే ఓ షరతు పెడుతుంది...ఈ షరతుకి అతను ఒప్పుకున్నాడా లేదా, ఒప్పుకుంటే జరిగేదేమిటనేది మిగతా కథ.

ఇందులో ఇంకో వైపు గోవాలో ఉంటూ స్పెయిన్ లో డ్రగ్ దందా చేసుకునే మకరంద్ కామాటీ (విక్రం జిత్ విర్క్) అనే గ్యాంగ్ లీడర్ ఉంటాడు. ఇతడి ఇంకో బిజినెస్ అమ్మాయిల్ని అపహరించి అమ్ముకోవడం. స్పెయిన్ లో ఇతడి ముఠా కి ‘కూలిపని’ చేసి పెట్టిన వరుణ్ కి తను చేసిన అసలు పనేమిటో (డ్రగ్స్ రవాణా) తెలిసివచ్చి చిత్తుగా తంతాడు. ఇలా ఈ శత్రుత్వం ఒకటి తర్వాతి పరిణామాల్లో గోవాలో అతణ్ణి వెన్నాడుతుంది.

హయాతిని వెతుక్కుంటూ గోవా వచ్చే వరుణ్ కి సహాయపడే మొబైల్ ఫుడ్ సెంటర్ తమిళ యజమాని పాత్రలో అలీ, చివర కూతురు కిడ్నాపైన కేసులో వచ్చే ధనికుడి పాత్రలో ప్రకాష్ రాజ్, గ్యాంగ్ లీడర్ అనుచరుడి పాత్రలో ఎజాజ్ ఖాన్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం.


అభినయాలు- అభ్యంతరాలు 
ట్రావెలర్ గా చెప్పుకునే దేశ దిమ్మరి పాత్రలో నితిన్ పూరీ మార్కు అతికి పోకుండా నటనని నియంత్రించుకుంటూ-సిసలైన లవర్ బాయ్ గా కన్పిస్తాడు. అతి తక్కువ చోట్లలో మాస్ డైలాగులు వల్లెవేసి రక్షిస్తాడు. అజయ్ దేహంలోకి బులెట్ పేల్చి నప్పుడు పలికే  ‘దూరిందా లేదా?’ లాంటి సింపుల్ డైలాగులే పవర్ఫుల్ గా పేలాయి. హీరోయిన్ తో వెకిలి తనాలకి పోకుండా చిలిపి నటనలోనూ నితిన్ ఓకే.

అయితే హీరోయిన్ అదా శర్మే మరీ శోకరసం ఊరే సాత్వికురాలి రూపురేఖలతో యూత్ అప్పీల్ కి దూరంగా కన్పిస్తుంది. ద్వితీయార్ధంలో పాత్ర కూడా విషాదమయం కావడంతో, ఆమె అమ్ములపొదిలో సమ్మోహనాస్త్రాలు వుండే అవకాశాలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఆ మాటకొస్తే ద్వితీయార్ధంలో నితిన్ కీ ఇదే అవస్థ!  (ఇలా ఎందుకు జరిగిందో తర్వాత  స్క్రీన్ ప్లే సంగతుల్లో చూద్దాం)

ప్రథమార్ధంలో బ్రహ్మానందం, ద్వితీయార్ధంలో అలీ నవ్వించే బాధ్యత మీదేసుకున్నారు. కానీ బ్రహ్మానందానికి రాసిన సిట్యుయేషనల్ కామెడీ ఎపిసోడ్లు అలీకి రాయకపోవడంతో, బ్రహ్మానందం బ్రహ్మాండంగా పేలి, అలీ ఉత్తి వదరుబోతు క్యారెక్టర్ గా మిగిలిపోవాల్సి వచ్చింది.

ఇక విలన్లు షరామామూలు పూరీ బ్రాండ్ దుష్ట నాయకులే. చివర్లో మూడు సీన్లలో కన్పించే ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో తనదైన బ్రాండ్ నటనతో కాస్సేపు హడావిడీ.


సాంకేతికాల సరితూకం 
ఈ సినిమాకి తెరమీద కన్పించే నటీనటులు మాత్రమే కాదు, చాలా అరుదైన విన్యాసాలు చేస్తూ రక్తికట్టించే తెరవెనుక సాంకేతికులూ వున్నారు. పూరీ జగన్నాథ్, అమోల్ రాథోడ్ (కెమెరా), అనూప్ రూబెన్స్ (సంగీతం), భాస్కరభట్ల (సాహిత్యం), ఎస్ ఆర్ శేఖర్ ( ఎడిటింగ్) ప్రభృతులంతా కళ్ళకి, చెవులకి, మెదడుకి, మనసుకీ కావలసినంత క్రేజీ పనులు చేసిపెట్టారు. పూరీ దర్శకత్వం ఎలాటి కాలుష్యకారక పోకడల్లేకుండా నీట్ గా వుంటే, అమోల్ రాథోడ్ ఛాయాగ్రహణం హైక్లాస్ విజువల్ బ్యూటీని ఆవిష్కరించింది. అవుట్ డోర్స్ ఎక్కువ వుండడం వల్ల స్పెయిన్, రోమానియా, గోవా ప్రాంతాల సౌందర్యాలన్నీ ఏ అంతర్జాతీయ స్థాయికీ తీసిపోకుండా వెండితెరని వెలిగించేశాయి. ఇంకా రాబోయే పూరీ సినిమాల్లో కూడా ఇదే స్థాయి ఛాయాగ్రహణాన్ని ఆశించవచ్చునేమో!

అనూప్ రూబెన్స్ ప్రతీ పాటకీ క్యాచీ ట్యూన్స్ కట్టి థియేటర్లో హుషారు తెగ పుట్టిస్తే, భాస్కరభట్ల ‘ఈ లైఫుకి సీక్వెల్ లేదు మామా’ లాంటి  వెర్రెత్తించే భావుకతతో కొత్త పుంతలు తొక్కాడు.  ఇక రాజ్ కపూర్ తీసిన ‘సత్యం శివం సుందరం’ లోంచి- యశోమతి మయ్యాసే బోలే నందలాలా- రాధా క్యోఁ గోరీ, మై క్యోఁ కాలా’ (యశోదతో కృష్ణుడు అన్నాడట-రాధేమో తెల్లగా వుంటే, నేనెందుకు నల్లగా వున్నానని!)పాట బిట్ -  నల్లజాతీయుడి మీద సందర్భ వశాత్తూ కుదరడం ఒక కొత్త  ప్రయోగంగా నిలబడుతుంది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ లో వాడిన టెక్నిక్కులు సినిమాని ట్రెండీగా మార్చేశాయి.

ముద్దు సన్నివేశాన్ని కూడా ‘దుప్పటి’ కప్పేసి మరుగుపర్చిన ఈ కాలక్షేప రోమాన్స్ ని కుటుంబాలు కూడా నిరభ్యంతరంగా చూడొచ్చు- అయితే ‘దుప్పటి’ కప్పి సాధించిందేమిటో గానీ- అది రోమాన్స్ కి అత్యంత అవసరమైన ఎమోషనల్ బాండింగ్ ని హాం ఫట్ చేసేసింది!


స్క్రీన్ ప్లే సంగతులు!
సినిమా కథని ఓ పాట విని అందులోంచి తయారు చేసుకున్నానని దర్శకుడి ఉవాచ. అది ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన ‘రాక్ స్టార్’ (2011) లో,  ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకత్వంలో ఇర్షాద్ కమ్లీ రాసిన ‘ఔర్ హో’ పాట. ఈ పాటలో పల్లవి, ప్రారంభ చరణం ఇలా వుంటాయి :
మేరీ బేబసీ కా బయాన్ హై
బస్ చల్ రహానా ఇస్ ఘడీ
రస్ హస్రత్ కా నిఛోడ్ దూఁ
కస్ బాహోమే  ఆ తోడ్ దూఁ
చాహూఁ క్యా జానూఁ నా
ఛీన్ లూఁ    ఛోడ్ దూఁ
ఇస్ లమ్హే  క్యా కర్ జావూఁ
ఇస్ లమ్హే క్యాకర్ దూఁ  జో ముఝే  చైన్ మిలే  ఆరాం మిలే
ఔర్ హో ! ఔర్ హో!
(ఈ సమయంలో నా నిస్సహాయ గొంతుక నా వశంలో లేదు. నా కోరికల రసాన్ని పిండెయ్యనా...రా, నా బాహువుల్లో బిగించి నిన్ను విరిచేస్తా. నాకేం కావాలో నాకు తెలీదు, నిన్ను కాజెయ్యనా వదిలెయ్యనా?ఈ క్షణాన ఏం చెయ్యను? ఏం చేస్తే సుఖ శాంతులు లభిస్తాయి---ఇంకా ఇంకా కావాలి !)

ఇందులోంచి మొదట నితిన్ పాత్ర పుట్టి వుండొచ్చు, అందులోంచీ కథ! పాత్రలేకుండా కథని ఊహించలేం గనుక! నితిన్ తో పాటు అదాశర్మ పాత్రనీ, కథనీ ఏ రస ప్రధానంగా చూపాలన్న దానిమీద దృష్టి పెట్టకపోవడంవల్ల- ప్రేక్షకులనుంచి ఫస్టాఫ్ అంత హుషారుగా సెకండాఫ్ లేదనే అసంతృప్తి వ్యక్తమౌతోంది. దర్శకుడు రోమాంటిక్ కామెడీ తీయాలనుకున్నాడా లేకపోతే  ఎమోషనల్ లవ్వా? మొదటిదే అయితే అదా శర్మ పాత్ర అలా ప్యాసివ్ గా వుండకూడదు. రెండో దయితే అలాటి అదా శర్మ పాత్ర లాగే నితిన్ పాత్ర ఇంటర్వెల్ మలుపు తర్వాత మారడానికి చూపిన కారణం బలంగా వుండాలి. అంటే ఫస్టాఫ్ నితిన్ పాత్రతో రోమాంటిక్ కామెడీగా నడిపి, సెకండాఫ్ ని ఎమోషనల్ గా మార్చాలన్న మాట!

అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఒక ఒరలో రెండు కత్తులు ఇమడనట్టే, మొదటి సగం రోమాంటిక్ కామెడీ- రెండో సగం ఎమోషనల్ ప్రేమకథా అనే  రెండు విభిన్న జెనర్స్ ని కలిపి ఒక సినిమాగా తీస్తే రసభంగమే అవుతుంది. వినోదాత్మకంగా వున్న మొదటి భాగానికి సెటిలై ఎంజాయ్ చేస్తూ వున్న ప్రేక్షకులు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించిన రెండో సగం సీరియస్ నెస్ కి అంత సులువుగా అడ్జెస్ట్ కాలేరు.ఇదే మొన్న ‘లవ్ యూ బంగారం’ విషయంలోనూ జరిగింది. బూతో నీతో ఒక ప్రేమ కథంటూ మొదలెట్టాక,  దాన్ని అకస్మాత్తుగా క్లైమాక్స్ లో క్రైం ఎలిమెంట్ తో మలుపుతిప్పడంతో మొత్తం అభాసయ్యింది. ఈ మధ్యే విడుదలైన ‘క్షత్రియ’ లోనూ సైకాలజీ- హారర్- సైన్స్ ఫిక్షన్ -సస్పెన్స్ థ్రిల్లర్ మొదలైన జెనర్స్ అన్నిటినీ  కలిపేసి తీసి భంగపడ్డారు .  ఈ సినిమా దర్శకుడు ఉదయ చంద్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో కథ చెప్పినప్పుడు- అదేదో సైకలాజికల్ సబ్జెక్ట్ లా అన్పించింది. అది కూడా డ్రైగా తోచడంతో, ఇందులో ఎంటర్ టైన్మెంట్ ఏదని అడిగితే సరైన జవాబు చెప్పలేదు. తీరా సినిమా చూస్తే అది జెనర్స్ కాక్ టైల్ గా బయటపడింది!



ఇలా చేస్తే ఇంతే!
హాలీవుడ్ లో గత నవంబర్ లో విడుదలైన ‘అమెరికన్ హసిల్’ లో కూడా క్రైం కథని బ్లాక్ కామెడీ జెనర్ తో కలిపి తీశారు. ఇవి రెండూ కూడా విజాతి ధృవాలే. ఈ రెంటినీ కలిపి కూడా ఎలా నిర్వహించాలో తెలీక రచయితలు కోహెన్ బ్రదర్స్ చతికిల బడ్డట్టు- ఈ స్క్రిప్టు విశ్లేషణ చేసిన స్క్రీన్ ప్లే ట్యూటర్ జాన్ ట్రూబీ పేర్కొన్నాడు. ఆస్కార్ కి వెళ్ళే ఈ సినిమా మంచి సినిమా కావొచ్చుగానీ, గొప్ప సినిమా మాత్రం కాబోదని అభిప్రాయ పడుతూ, ‘ The verdict for American Hustle? The comedy is often quite funny, but the serious drama doesn’t work ’-అని తేల్చాడు.

పూర్వం తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేల విషయంలో మన ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళుగా వుండే వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం సినిమా చూసొచ్చి- ‘ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ స్టోరీ రా!’ అంటూ కామెంట్లు విసిరేవాళ్ళు. అంటే ఫస్టాఫ్ అంతా కామెడీ కామెడీగా నడిపేసి, ఇంటర్వెల్లో పాయింటు కొచ్చి, అప్పుడుగానీ సెకండాఫ్ లో కథలోకి వెళ్ళేవాళ్ళు కాదు దర్శకులు. ప్రేక్షకులు ఫస్టాఫంతా కామెడీ ఎంజాయ్ చేసి, ఇక సెకండాఫ్ లో ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా ఆ కథలోకి వెళ్లేందుకు సర్వ సన్నద్ధులై పోయేవాళ్ళు అలవాటు కొద్దీ - ఇంకే మారామూ చెయ్యకుండా!

ఈ తరహా నిర్మాణాన్ని ఫస్టాఫ్- సెకండాఫ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనొచ్చు. ఇది సాంప్రదాయ మూడంకాల నిర్మాణం తో విభేదిస్తుంది. తర్వాత్తర్వాత తెలుగు సినిమాలు ఈ సంప్రదాయ మూడంకాల (త్రీ యాక్ట్) నిర్మాణం లోకే వచ్చేసి  కలవడంతో, కథలు శాస్త్రీయంగా ఫస్టాఫ్ లోనే ( ఫస్ట్ యాక్ట్ లో ) 30 -45 నిమిషాల వ్యవధిలో ప్రారంభించేసే కల్చర్ మొదలయ్యింది. అంటే పాత తరం ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీ పధ్ధతి లేదన్నమాట. ఈ ప్రకారమే ప్రస్తుత ‘ హార్ట్ ఎటాక్ ‘ లోనూ  ఫస్ట్ యాక్ట్ లో ముప్ఫయ్యోవ నిమిషంలో  స్టోరీ ప్రారంభ మైపోయింది - అదా శర్మకి నితిన్ ముద్దుని ప్రపోజ్ చేసే దృశ్యంతో.

తర్వాత ఇంతే ఫన్నీగా కథ నడుస్తూ 45వ నిమిషంలో ముద్దు డిమాండ్ మరో మెట్టెక్కింది. అంతే ఫన్నీగా నడిచి 75వ నిమిషంలో ఇంటర్వెల్లో ముద్దు పెట్టించుకునే కోరిక నెరవేరి పోవడంతో- నితిన్ ఇరకాటంలో పడే పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితే ఇక్కడ్నిచీ సెకండాఫ్ ని విషాదమయం చేసేసింది!


ఇది రోమాంటిక్ కామెడీ కుండాల్సిన టర్నింగ్ పాయింట్ కాదు. ఈ పాయింటు కూడా కామెడీగానే వుండాలి. హీరోయిన్ శోకమూర్తి కాకూడదు. ప్యాసివ్ గా అలాటి నిర్ణయం తీసుకోకూడదు. రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లలో ఎవరూ ప్యాసివ్ గా వుండరు. ఇద్దరూ యాక్టివ్ క్యారెక్టర్లుగానే వుంటూ, టర్నింగ్ పాయింట్ లో నువ్వా నేనా? అన్నట్టు పోటీ పడతారు. ఆ తర్వాతంతా అదే హాస్య ధోరణిని కొనసాగిస్తూ- సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ముగింపు దగ్గర మాత్రమే ( అంటే 75 శాతం కథ నడిచి పోయాక మాత్రమే ) ఏడ్పులూ విషాదాలతో సీరియస్ టర్న్ తీసుకుంటారు. ఇదీ రొమాంటిక్ కామెడీ లక్షణం. దీన్ని చిత్రపటంలో చూస్తే ఇలా వుంటుంది...


ఇందులో 1) ఎవేర్నెస్ పాయింటు దగ్గర- ప్రధాన పాత్ర తనకేం కావాలో నిర్ణయించుకుంటుంది, 2) ఫెమిలియారిటీ దగ్గర- ఇంకాస్త కథని పైకి లేపుతూ తను కోరుకున్న దాన్ని పొందేందుకు వలసిన సమాచారం, తగిన వ్యూహం సమకూర్చుకుంటుంది, 3) కన్సిడరేషన్ బిందువు దగ్గర- కథలో ఇంకాస్త వేడి పుట్టిస్తూ, కోరుకుంటున్నది సాధించు కునేందుకు ప్రత్యాన్మాయాల్ని మరింత జల్లెడ పడుతుంది, 4) ట్రయల్ దగ్గర-కథలో టెన్షన్ బాగా పెంచేస్తూ, పొందాలనుకున్న దాన్ని రుచి చూసేస్తుంది. 5) పర్చేజ్  పాయింటు దగ్గర కొచ్చేసి - ప్రధాన పాత్ర తను టేస్టు చూసిన దాన్ని సొంతం చేసుకోవడానికి కమిటైపోయి ఇక ఎంతదూరమైనా పోతుంది!

ఇంతే! ఇంతకంటే బ్రహ్మ రహస్యమేదీ లేదు. పోనీ ఈ సినిమాలో పైన చెప్పుకున్న పాత తీరు ప్రకారమే -ఫస్టాఫ్ కామెడీగానే నడిపాంగా, సెకండాఫ్ సీరియస్ చేస్తూ కథలోకి వెళ్తే అభ్యంతర మేంటి అనడగొచ్చు. కథ ఫస్టాఫ్ లో అరగంటలోనే మొదలయ్యిందని చెప్పుకున్నామని గమనించాలి- కాబట్టి ఇక్కడ్నించే ప్రేక్షకులు నిర్ధారించిన ఆ కామెడీ రస పోషణనే  ఆస్వాదిస్తూ పోతారు, మధ్యలో ఇంకెలాటి సీరియస్ ఝలక్కులకీ లొంగరు. కనుక రోమాంటిక్ కామెడీ కాకుండా ఎమోషనల్ లవ్ స్టోరీ నే తీయాలనుకుని వుంటే, ఫస్టాఫంతా కథే  లేకుండా పాత  పద్ధతిలో కామెడీ కామెడీ గా నడిపేసి- అప్పుడు ఇంటర్వెల్లో ముద్దు ప్రపోజల్ పెట్టాలి. అక్కడ్నించీ హీరోయిన్ ని హర్ట్ చేసి సినిమాలో చూపించినట్టు సెకండాఫ్ ని కావలసినంత సీరియస్ చేయొచ్చు.

అయితే ఫక్తు ఫటాఫట్ ఎంటర్ టెయిన్ మెంట్ తప్ప,  ఇంకెలాటి సీరియెస్ నెస్ నీ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సినిమాలకి మిగిలున్న యువ ప్రేక్షకులు ఒప్పుకోరుగాక  ఒప్పుకోరన్నది పదేపదే రుజువవుతున్న నిజమే! 

రోమాంటిక్ కామెడీనా, ఎమోషనల్ లవ్వా అన్న సందిగ్థతే డివైడ్ టాక్ రావడానికి కారణ మయ్యింది. ఇది చాలనట్టు విలన్ తో యాక్షన్ కథాకమామిషూ జొప్పించారు. రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్ధులుగా వుంటారు. వేరే విలన్స్ వుండరు. వుంటే ఆ లవ్ కే ట్రయాంగిల్ ని ఏర్పరుస్తూ కామిక్ విలనీ పండిస్తారు (‘కందిరీగ’ లో సోనూసూద్ లా).

ఇక ఈ కథకి ప్రధానమైన ప్లాట్ డివైస్ గా ప్రయోగించిన ‘ముద్దు’ అనే అంశంతో కూడా సెటప్స్ అండ్ పే అఫ్స్ ప్రక్రియ సరిగ్గా సాగలేదు. ముప్ఫయ్యోవ నిమిషంలో ముద్దు అనే ప్లాట్ డివైస్ ని సెటప్ చేసి, ఇది ఎప్పుడెప్పుడు నిజమౌతుందా చూడాలని ప్రేక్షకుల్లో రేపిన ఉత్కంఠని, తీరా ఇంటర్వెల్లో పే ఆఫ్ కొచ్చేసరికి- ఆ ముద్దు సీను మీద దుప్పటి కప్పేసి- ఆ పే ఆఫ్ ని నీరు గార్చేసి ప్రేక్షకులకి తీవ్ర అసంతృప్తికి లోను జేయడమేగాక, ఆ యిద్దరిమధ్యా ఎమోషనల్ బాండ్ కూడా వ్యక్తం గాకుండా చేశారు. ఇలా పే ఆఫ్ కాని సెటప్స్ ని ఏర్పాటే చేయకూడదు. ఏమంటే సెన్సార్ సమస్యలు రాకుండా జాగ్రత్త అన్నారు. మరెందుకు ఈ సినిమాకి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. ఆల్రెడీ లిప్ లాక్ సీన్లున్న రెండు మూడు సినిమాలు వచ్చేశాయి కూడా కదా!

పాత్రోచితానుచితాలు 
 బ్లాక్ బస్టర్ మూవీ లక్షణాల్లో ప్రధానమైనది వాటిలో ప్రధానపాత్ర అనాధగా, ఆవారాగా, దేశదిమ్మరిగా వుండడమని  జాన్ ట్రూబీ అభిప్రాయ పడతాడు. ఇది తు.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు నితిన్ పాత్ర తీరు తెన్నులు ఈ కోవలోనే వుంటాయి. ఈ పాత్రని దేశదిమ్మరి అనకుండా కాస్త మర్యాదిస్తూ ట్రావెలర్ అన్నారు. మరి హిప్పీ అనికూడా అనుకున్నట్టు నితిన్ అభిప్రాయపడ్డాడు. కానీ ఎప్పుడో డెబ్భయిల నాటి హిప్పీ సంస్కృతి ఏనాడో కనుమరుగయ్యింది. ఇది హిప్పీ పాత్రే అనుకుంటే ఇంకో చిక్కుల్లో పడతారు. హిప్పీలు హరే రామా హరే కృష్ణ కల్ట్ ఫిగర్స్. మరి నితిన్ పాత్రని కూడా అలాటి కృష్ణ భక్తుడైన బ్రహ్మానందం నిర్వహించే ‘ఇస్కాన్’ కార్యకలాపాల్లో కలిపి చూపించాల్సి వుంటుంది!

సెకండాఫ్ లో అదా శర్మ పాత్ర వైపు నుంచి బోల్డు ఎమోషనూ సానుభూతీ వర్కౌటై ఉండొచ్చు. కానీ అదంతా బాక్సాఫీసు అప్పీల్ కి వ్యతిరేకమని ఇందాకే చెప్పుకున్నాం. అయితే ఆమెకున్న డెప్త్  నితిన్ క్యారక్టర్లో లోపించడానికి కారణం-  ముద్దిచ్చిన అదా శర్మ  మీద తర్వాత పశ్చాత్తాపంతో మనసు కలగడానికి దోహదం చేసినట్టు చూపించిన ఘట్టం- రోమానియాలో వేరే అమ్మాయి ముద్దు అడిగినప్పటి ఘట్టం- పూర్తిగా తేలిపోవడమే.

ఎందుకు తేలిపోయిందంటే, రెండు వస్తువుల్ని పరస్పరం పోల్చాల్సి వచ్చినప్పుడు ఒకదాన్ని దాచిపెడితే పోలిక ఎలా తెలుస్తుంది? అదా శర్మతో నితిన్ లాంగ్ కిస్ సీను మీద అంత దుప్పటి కప్పేసి చూపిస్తే ప్రేక్షకులకి అది ప్రత్యక్షానుభవం లోకెలా వస్తుంది? అది ప్రత్యక్షాను భవమైతేనే కదా,  పరాయి అమ్మాయితో ముద్దు సీనులో ప్రియురాలు గుర్తొచ్చి నితిన్ పడ్డ బాధంతా  ప్రేక్షకులు ఫీలయ్యేది? 

ఇంటర్వెల్లో మాయదారి ఈ ముద్దు ఘట్టమే కొంపముంచింది. దీంతో ప్రేమకోసం తపించే నితిన్ పాత్ర చాలా కృతకంగా, మరో దొంగాటకం ఆడుతున్న వాడిలా ఆకట్టుకోలేకపోయింది.

ఇంతేకాదు, సెకండాఫ్ లో నితిన్ కోరుకున్నదల్లా జరిగిపోతుంటాయి. అలీ, ప్రకాష్ రాజ్ పాత్రలు ఇలా ఎంటరై అర్జంటుగా గట్టె క్కించేవే. దీంతో యాక్టివ్ పాత్ర తనే కథ నడుపుతున్నట్టుగా కాక- అంతా విధి కొదిలేసినట్టు -కథే పూనుకుని నడిపిస్తున్న ప్యాసివ్ పాత్రలా తయారయ్యింది!

ఇదంతా కాకుండా,  నిజంగా పూరీ ఓ రోమాంటిక్ థ్రిల్లర్ గా తీసివుంటే, అదొక ‘ ఇష్క్’ లాగానో , లేకపోతే ‘స్వామి రారా’ లాగానో ఈ గొడవంతా లేకుండా వచ్చుండే దేమో!

-సికిందర్ 















Friday, January 24, 2014

రివ్యూ ..
ఇదో పరాకాష్ఠ !

లవ్ యూ బంగారమ్
తారాగణం : రాహుల్ హరిదాస్, శ్రావ్య, రాజీవ్ తదితరులు
సంగీతం : మహిత్ నారాయణ్    నేపధ్య సంగీతం : జె బి
కెమెరా :  అరుణ్ సూరపనేని    ఎడిటింగ్ : ఎస్ బి ఉద్ధవ్
బ్యానర్ ; క్రియేటివ్ కమర్షియల్స్- మారుతీ  టాకీస్
నిర్మాతలు : వల్లభ, మారుతి      సమర్పణ : కే ఎస్ రామారావు
రచన- దర్శకత్వం : గోవి ( గోవింద రెడ్డి)
విడుదల : జనవరి 24, 2014
***
ప్రేమ కథలు కిరాతకంగా తీస్తేనే ఈ తరం దర్శకుడనే పేరొస్తుందని ఒకానొక  ‘ఈ రోజుల్లో’ సందర్భంతో కొత్త దర్శకులు కొందరికి నమ్మకం ఏర్పడి నట్టుంది. అలాటి కొత్త దర్శకుడు ‘గోవి’ అనగా గోవిందరెడ్డి, సినిమా ప్రారంభంలో తను దర్శకుడైనందుకు  కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ,  కుటుంబాలు ఇబ్బంది పడే సినిమా తీసి ‘ గ్రో అప్’ అని సినిమాలో ఒక భోళా పాత్రకి క్లాసు పీకించిన చందంగానే సదరు కుటుంబాలకే జ్ఞాన బోధ చేసే దాకాపోయాడు. సుప్రసిద్ధ  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ఈ యజ్ఞంలో పాలుపంచుకునేందుకు ఎలాటి మొహమాటమూ పడకుండా - ఈ తరహా సినిమాలకి ఇప్పటి ట్రెండ్ లో బ్రాండ్ నేమ్ గా వెలుగొందుతున్న దర్శకుడు మారుతి తో జతకట్టి సక్సెస్ కళ్ళ జూడా లనుకుంది. అధినేత కే ఎస్ రామారావే చెప్పినట్టు, తక్కువ బడ్జెట్ లో ఎక్కువ డబ్బులొచ్చే సినిమాలు మారుతీ తీస్తున్నాడు కాబట్టి ఈ జాయింట్ వెంచర్ ఇలా తెరకెక్కిం దన్నమాట!

‘ఈ రోజుల్లో’ తర్వాత ఈ సమీక్షకుడితో మారుతి ఒక విషయం చెప్పాడు- తను నానా ప్రయోగాలూ చేసి 5-డీలో  ‘ఈ రోజుల్లో’ తీసినట్టు  ఇంకెవరైనా 5-డీతో ప్రయత్నాలు చేస్తే చేతులు కాల్చుకుంటారని! అంతేగానీ అసలు అదేపనిగా  ‘ఈ రోజుల్లో’ లాంటి అడల్ట్ కంటెంట్ తో సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాపై పోతారని చెప్పలేదు. చెప్పాల్సిన పనిలేదు-చేసి చూపిస్తున్నాడు గనుక. ప్రస్తుత సినిమాతో  పరాకాష్టకి చేరిన తన ఈ బ్రాండు ‘క్రియేటివిటీ’ తో తన గమ్యం ఏమిటో తనకే తెలుస్తుందిక!

సరైన సినిమాల్లేక త్రిశంకు స్వర్గం లో కొట్టు మిట్టాడుతున్న ‘హేపీ డేస్’ ఫేం హీరో రాహుల్ హరిదాస్ ఈ సినిమాతో నటనలో కాస్త మెరుగయ్యాడు తప్పితే,  ఈ సినిమా తన కెరీర్ లో చెప్పుకో దగ్గదేం కాదు- గత సినిమా ‘ప్రేమ ఒక మైకం’ లాగే. శేఖర్ కమ్ముల అతడికి సృష్టించిన గుర్తుండిపోయిన ‘టైసన్’ లాంటి పాత్రని సృష్టించడంలో ఇతర దర్శకులు విఫలమైనట్టే ‘గోవి’కూడా చేతులెత్తేశాడు.

ఈ తరం ప్రేక్షకులకి యువజంట పెళ్లి కథ చెప్పాలనుకున్నారు. అభద్రతా భావంతో అనుమానాలు పెంచుకు తిరిగే హీరోని, ఆత్మవిశ్వాసం ఉరకలేసే  హీరోయిన్ తో కలిపి ఆ వైవాహిక జీవితం అనుమానాలతో ఏ మలుపులు తిరుగుతుందో చూపాలనుకున్నారు. విషయం కొత్తదేమీ కాదు, చాలాసార్లు చాలా సినిమాల్లో వచ్చేసిన ఈ పాత విషయాన్నే కొత్తగా ఏమైనా చెప్పారేమో ఈ క్రింద చూద్దాం.

ప్రేమో కామమో...
వైజాగ్ లో ఆకాష్ ( రాహుల్) ఓ సెల్ ఫోన్ల కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్. మీనాక్షి (   ) ఓ రాజకీయనాయకుడి కూతురు. ఫ్రెండ్స్ తో జల్సాగా తిరగడమే ఆమె పని. ఆకాష్ తండ్రి కూడా రాజకీయ నాయకుడే. సంపాదన లేని ఆ తండ్రి కొడుకు జీతమంతా లాగేసుకుని రాజకీయాలకి- తన తండ్రి విగ్రహ ప్రతిష్టాపన పన్లకీ తగలేస్తూంటాడు. ఓ సంఘటనలో ఆకాష్, మీనాక్షీలు కలుస్తారు. ఈ కలయిక కాస్తా ప్రేమకి  దారితీస్తే, రాజకీయ ప్రత్యర్ధులైన తండ్రులవల్ల పెళ్లి కుదరక పారిపోయి పెళ్లి చేసుకుంటారు. అంతలో రాహుల్ కి మేనేజర్ గా ప్రమోషన్ వచ్చి హైదరా బాద్ కి బదిలీ అవుతాడు.

ఇక్కడ ఓ ఏడాది ఇద్దరి కాపురం సజావుగా సాగిపోతుంది. అప్పుడు ఒంటరిగా ఇంట్లో బోరు భరించలేక మనాక్షి ఉద్యోగం చేస్తానని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతుంది. అలా జాబ్ కి వెళ్తున్న  ఆమెకి  బాల్య స్నేహితుడు మదన్ (రాజీవ్) తారసపడతాడు. ఇతడి గురించి ముందే చెప్పి ఉంచింది రాహుల్ కి.  ఇప్పుడామె ఆ మదన్ ని కలుస్తూ ఉండడంతో,  రాహుల్ కి అనుమాన బీజాలు నాటుకుని ఆమె కదలికల్ని కనిపెడుతూంటాడు. లోలోన కుమిలి పోతూంటాడు. తన సంగతి తెలిసిపోయిందని ఆమెకి తెలిసినా ప్రవర్తన మార్చుకోదు. ఇంతలో ఈ ముగ్గురి మధ్యకి అసలు గేమ్ ఆడుతున్న ఓ దుష్టుడు బట్టబయలవుతాడు...

ఇదీ విషయం. ఈ విషయాన్ని వీలైనంత అశ్లీలాన్ని జోడించి చెప్పారు. విషయం కాదు ప్రధానం, యువప్రేక్షకులకి కామోద్దీపన కల్గించడమే ముఖ్యమన్నట్టుగా సాగించారు. ఇందుకు హీరోయిన్ శ్రావ్య శాయశక్తులా సహకారం అందించింది. హీరో హీరోయిన్ల శృంగార చేష్టలకి పెళ్లి అనే లైసెన్సు ఇచ్చేయడంతో హద్దు లేకుండా పోయింది. అక్షేపణీయం కాని యూత్ అప్పీల్ ని రాజెయ్యడానికి ఇది చాలా తెలివిన ప్లానింగ్. పెళ్ళికాని యువజంట తో ఇలాటి చిత్రీకరణలు తీవ్ర విమర్శల పాలవుతాయి కాబట్టి  -పెళ్లి జరిపించేసి ఆ ముసుగులో యదేచ్ఛగా పడకగది దృశ్యాలకి తెరతీసినట్టుంది. మున్ముందు మారుతికి, మారుతి గ్రూప్ దర్శకులకీ ఇలాటి కొత్త కొత్త టెక్నిక్ లు ఎన్నితడతాయో వేచి చూడాల్సిందే!




contd..







Wednesday, January 22, 2014

స్క్రీన్ ప్లే సంగతులు - 1

స్క్రీన్ ప్లే ప్రయాణంలో మజిలీలు అక్కర్లేదా?

ఆరోజుల్లో కే ఏ అబ్బాస్ స్క్రిప్టు రాసుకొస్తే షోమాన్ రాజ్ కపూర్ శుభ్రంగా తలంటు పోసుకునిగానీ ఆ స్క్రిప్టుని ముట్టుకునే వాడు కాదట. దాన్నో పవిత్రగ్రంధంలా కళ్ళకద్దుకుని, నెత్తిన పెట్టుకుని పూజ గదిలోకి వెళ్ళే వాడట. ఆ స్క్రిప్టుకి పూజాదికాలు అవీ పూర్తిచేసి తెచ్చుకుని, అప్పుడు మాత్రమే దాని ముందు భక్తి భావంతో  మోకరిల్లి, ఏకబిగిన ఉచ్చ స్వరంతో చదివేసేవాడట!

అలాటి పవిత్ర గ్రంధం ఇప్పుడు స్క్రిప్టు కాదు. ఓ నిర్మాత తయారైన స్క్రిప్టు పట్టుకుని బోల్డు భక్తి శ్రద్ధలతో వెళ్లి తిరుపతి వెంకన్నని దర్శించుకున్నాడు. తిరిగొచ్చి కలం పట్టుకుని తన టాలెంటు ప్రదర్శనతో దాన్ని చెండాడేడు. అది దేవుడి కాపీ అన్న స్పృహే లేకుండా పోయింది. దాన్ని నానా కంగాళీ చేసి ఫెయిర్ చేయడానికి ఇచ్చాడు. దేవుడి దగ్గర మొక్కించిన కాపీని చెత్తబుట్ట దాఖలు చేశాడు. మనకెందుకులే అని ఈ రచయిత దాన్ని ఫెయిర్ చేసిచ్చాడు. ఆ దెయ్యం కాపీతో సినిమా తీశాడు నిర్మాత. సహజంగానే ఆ దేవుడి దయవల్ల దానికి దరిద్రం చుట్టుకుంది!

ఈ తరహా ధోరణికి కారణం స్క్రిప్టు కంటే కెమెరా ఉన్నతమైనదని భావించడమే. ప్రాక్టికల్ గా తెర మీద కదిలే బొమ్మల్ని సృష్టించే కెమెరాని మించిన సృజనాత్మక ఉపకరణం ఏదీ లేదనుకోవడమే. కెమెరాకి వుండే అన్ని భౌతిక సూత్రాల్లాంటివే  స్క్రిప్టుకీ ఉంటాయని అంగీకరించక పోవడంవల్లే స్క్రిప్టంటే చిన్నచూపు - దాంతో చిల్లరమల్లర ఫలితాలూ.

స్క్రిప్టులో  అంతర్భాగమైన స్క్రీన్ ప్లే అనే క్రియేటివ్ టూల్ కి కెమెరాకి ఉన్నట్టే  పాటించాల్సిన రూల్సూ  వున్నాయి. ఈ రూల్సు లోతుల్లోకి వెళ్తే అదొక అనంతమైన శాస్త్ర మౌతుంది. ఇది గుర్తించకుండా సినిమా అంటే  కేవలం  కెమెరా రూల్సేనని నమ్మడం వల్ల  ఏమీ ప్రయోజనం వుండదు. సినిమా ఆఫీసు తీస్తున్నప్పుడు అన్ని వాస్తు సూత్రాలూ పట్టించుకుని, తీరా స్క్రిప్టు కి  కూడా వుండే అలాటి ‘వాస్తు’ విలువల్నే తెలుసుకోకపోతే – అలాటి సినిమాతీసి కాశీకి ప్రయాణం కట్టడమే.

స్క్రీన్ ప్లే కీ ‘వాస్తు’ వుంటుంది. ‘వాస్తు’ దోషాలుంటాయి. సరిదిద్దుకుంటే సత్ఫలితాలుంటాయి. ప్రజాస్వామ్యమనే మహాసౌధానికి మూల స్తంభాలు నాల్గున్నట్టే, స్క్రీన్ ప్లే కీ ఐదు మూల స్తంభాలుంటాయి. అవి ప్లాట్ పాయింట్స్  -1, 2  లు, మిడ్ పాయింట్, పించ్ పాయింట్స్ -1, 2 లు. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో ఏ ఒక్కటి చాప చుట్టేసినా ప్రమాదమన్నట్టుగానే, స్క్రీన్ ప్లే సౌధం లో ఈ ఐదింటిలో ఏ ఒక్క మూల స్తంభం లోపించినా, లేదా బలహీన పడ్డా అది కుప్ప కూలడమే అవుతుంది.  ఐదు స్తంభాల స్క్రీన్ ప్లే అనే సౌధంలో విడుదు ల్లాంటి మూడు అంకాలుంటాయి.  వీటిలో ఏ ఒక్కటి వెళ్లి మరోదాన్ని (విడిదిని) దురాక్రమించినా మొత్తం ఆ ‘వాస్తు’ చెడిపోతుంది.

వేలసంవత్సరాలుగా వున్న ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించే నవీన వాదులూ వున్నారు. వీరిని ఫస్టాఫ్- సెకండాఫ్ వాదులందాం. వీరు స్క్రీన్ ప్లే కి ఒక నిర్మాణం చెప్పేసి అందులోనే కథ చెప్పలనడం అన్యాయమంటారు. ..


To be concluded..