రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 11, 2023

1318 : మూవీ నోట్స్

 


టాలీవుడ్ (బెంగాలీ సినిమా పరిశ్రమ) లో ప్రోస్థెటిక్స్ మేకప్ ఆర్టిస్టు విన్సీ డాఇతను జగత్ప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ వీరాభిమాని. డా విన్సీ పేరుని తిరగేసి తన పేరుగా పెట్టుకున్నాడు. ఇతను పరమ నీచంగా మారిన తన జీవిత కథ చెప్పుకొస్తూంటాడు. ఈ కథలో ఆది బోస్ అనే 18 ఏళ్ళ వాడు తల్లిని వేధించే తాగుబోతు తండ్రిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేస్తాడు. పోలీసులకి లొంగిపోతాడు. కోర్టు పిచ్చాసుపత్రికి పంపిస్తుంది. ఇలా వుండగా, టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అయిన విన్సీ డా తండ్రి చనిపోవడంతో, అతడి కొడుకుగా టాలీవుడ్ లో మేకప్ ఆర్టిస్టు అవకాశాలు పొందడానికి స్ట్రగుల్ చేస్తూంటాడు. డావిన్సీ కళనే నమ్మిన తను, ఆ కళా ప్రక్రియతో రాణించే పరిస్థితుల్లేక తీవ్ర నిరాశతో వుంటాడు. ఇలా వుంటూనే జయ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.

ప్పుడు  ఆది బోస్ పెద్దవాడై జైలు నుంచి విడుదలవుతాడు. ఇతను తనని తాను సీరియల్ లాయర్ గా భావించుకుంటాడు. అన్యాయానికి గురైన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఒక దుర్మార్గమైన పథకాన్ని ఆలోచించుకుంటాడు. జైల్లో మానసిక చికిత్స అతడి క్రూర సైకో మనస్తత్వాన్ని ఏ మాత్రం రూపు మాపలేదు. ఆ పథకంతో సినిమా దర్శకుడుగా నటిస్తూ విన్సీ డా ని కలుస్తాడు. తనకి కొన్ని వందల కోట్లు బ్యాంకు స్కామ్ చేసిన శ్యామ్ సుందర్ అనే బిజినెస్ మాన్ రూపంతో మాస్కు కావాలంటాడు. ఆర్ధిక సమస్యల్లో వున్న విన్సీ డా ఈ పనికి ఒప్పుకుని మాస్క్ తయారు చేసి ఇస్తాడు. ఆది బోస్ ఆ మాస్క్ వేసుకుని బ్యాంకుని దోచుకుని, సెక్యూరిటీ గార్డ్ ని చంపేసి పారిపోతాడు. దీంతో బ్యాంకు స్కామ్ కేసులో తప్పించుకున్న బిజినెస్ మాన్ శ్యామ్ సుందర్, ఇప్పుడు బ్యాంకు దోపిడీ ప్లస్ హత్య కేసులో అరెస్టయి పోతాడు.

ఇది తెలుసుకున్న విన్సీ డా షాకవుతాడు. ఆది బోస్ తనని మోసం చేశాడని అర్ధమవుతుంది. ఇందులో అమాయకుడైన సెక్యూరిటీ గార్డుప్రాణాలు  కోల్పోవడమే కలచివేస్తుంది. తను ఆరాధించే ప్రోస్థెటిక్స్ కళ ఇలా నేరానికి ఉపయోగపడిందన్న భయంకర సత్యం నిద్రపోనివ్వదు. ఈ పరిస్థితుల్లో ఇక వీన్సీ డా మరిన్ని మాస్కులు తయారు చేయడని గ్రహించిన ఆది బోస్, విన్సీ డా మొదటి మాస్కు తయారు చేసినప్పుడు తీసిన వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తాడు.

దీంతో అరెస్టు భయంతో బ్లాక్ మెయిల్ కి లొంగిన విన్సీ డా
, రెండో మాస్కు తయారు చేసి ఇస్తాడు. ఈసారి ఒక రాజకీయ నాయకుడి కొడుకు మాస్కు. ఈ కొడుకు నిర్లక్ష్యంగా కారు నడిపి కొందర్ని చంపేసిన కేసు నుంచి బయటపడ్డాడు. ఇతడి మాస్కు వేసుకున్న ఆది బోస్, ఫుట్ పాత్ మీద పడుకున్న వాళ్ళ మీద కారు తోలి చంపేస్తాడు. దీంతో అప్పుడు అంత మందిని చంపి తప్పించుకున్న రాజకీయ నాయకుడి కొడుకు, ఇప్పుడు తప్పించుకోలేని విధంగా ఇరుక్కుంటాడు.

ఆ చనిపోయిన వాళ్ళల్లో ఒకడి కొడుకు విన్సీ డా ని కలుసుకోవడంతో విన్సీ డాకి జీవితం మీద విరక్తి పుడుతుంది. ఇంకా ఈ నేరాల్లో ఆది బోస్ కి భాగస్థుడ్ని కాలేనని ఎదురు తిరుగుతాడు. ఆది బోస్ విన్పించుకోకుండా, చివరి మాస్కు ఒక రేపిస్టుది తయారు చేయమంటాడు. ఆ మాస్కు వేసుకుని రోడ్డు మీద పోతున్న ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు. ఆ వీడియో తీసి పోస్ట్ చేస్తాడు. ఇది వరకు రేప్ కేసులో విడుదలై పోయిన రేపిస్టు ఈసారి బయటపడలేని విధంగా ఇరుక్కుంటాడు. అయితే ఆ వీడియో చూసిన విన్సీ డా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆది బోస్ రేప్ చేసింది ఎవర్నో కాదు,  తన గర్ల్ ఫ్రెండ్ జయనే! ఆమె ఆత్మహత్య చేసుకోబోతూంటే కాపాడుకుంటాడు.

ఇక ఆది బోస్ మీద పగబట్టి అతడి మీద విష ప్రయోగం చేస్తాడు విన్సీ డా. ఆది బోస్ మాస్కు వేసుకుని ఆది బోస్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నమ్మిస్తూ వీడియో తీస్తాడు. ఈ వీడియో చూసిన పోలీస్ ఇన్స్ పెక్టర్, వీడియోలో ఆది బోస్ గొంతు తేడాగా వుందని ఇన్వెస్టిగేట్ చేసి విన్సీ డా ని పట్టుకోబోతే, వృద్ధులుగా మారువేషాల్లో వున్న విన్సీ డా, జయా దేశం విడిచి పారిపోతారు.

ఆ కథతో ఈ కథ

పై కథ 2019 లో శ్రీజిత్ ముఖర్జీ దర్శకతంలో వచ్చిన విన్సీ డా అనే బెంగాలీ సినిమాలోది. క్రైమ్ జానర్ సినిమాని పునర్నిర్వచించిన మూవీ ఇది. నేరస్థుల్ని శిక్షించ డానికి అమాయకుల్ని బలిగొనే దుర్మార్గపు శిక్షా స్మృతి వీక్షకుల్ని, అదే సమయంలో సమీక్షకుల్నీ ఉలిక్కి పడేలా చేసింది. ఇది చూసి దర్శకుడు సుధీర్ వర్మ, రచయిత శ్రీకాంత్ విస్సా కూడా సముచిత రీతిలో ఉలిక్కిపడి వుంటారు. మాస్ మహారాజా రవితేజకి చెప్తే, ఆయన కూడా తగు విధంగా ఉలిక్కిపడి వుంటారు. ఉలిక్కిపడ్డ ముగ్గురూ కలిసి  విన్సీడా కి రుసుము చెల్లించకుండా ఉచితంగా సంగ్రహించి, రావణాసుర గా ప్రేక్షకుల్ని ఉలిక్కిపడేలా చేద్దామనుకుంటే, చీమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రేక్షకులకి! 

కథ ఫ్రీగా దొరికిందని రవితేజ హీరోయిన్ని రేప్ చేసి, ఒరిజినల్లో కూడా లేనివిధంగా  -బోనస్ గా గొంతు కూడా కోసి క్రూరంగా చంపితే ఎలా? విన్సీ డా లో చిన్న హీరోలిద్దరూ ఏమైనా చేయొచ్చు. అందులోని  ఆది బోస్ విలన్ పాత్ర వేయాలని ఏ పాపులర్ స్టారూ అనుకోడు. అది రెగ్యులర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న హీరో కథ కాదు. దానికి నెక్స్ట్ జన రేషన్ కథ. పాపులర్ స్టార్ నటించాల్సింది కాదు. నటిస్తే విన్సీ డా పాత్ర నటించుకోవచ్చు. ఆది బోస్ పాత్రతో రవితేజ కోసం కథ మార్చినప్పుడు చేసిన ఇంకో చేయరాని పనేమిటంటే, రొటీన్ సీరియల్ కిల్లర్- ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా చుట్టేయడం.

మెడికల్ మాఫియా అనే పాత రొటీన్ కి, ఆ మాఫియాలు ఒక్కొక్కర్ని  చంపడానికి విన్సీ డా లోని మాస్కులు తగిలిస్తే, ఈ చంపుతున్న సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే- కథంతా లాజిక్కుల సమస్యతో కలగాపులగమైపోయింది. పైగా ఇలాటి పోలీస్ వెర్సెస్ కిల్లర్ కథకి సస్పెన్స్, థ్రిల్ అనేవి లేకుండాపోయాయి. ఎందుకు చంపుతున్నాడని ఫ్లాష్ బ్యాక్ చెప్తే, అది వందల సినిమాల్లో చూపించిన మూస కారణమే. ఇలా ఏదో అన్యాయానికి గురైన హీరో, చట్టాన్ని  చేతుల్లోకి తీసుకున్న కాన్సెప్ట్ కాదు విన్సీ డా. ఆడుతున్న నెమలిని తీసుకొచ్చి అరుస్తున్న కాకిని చేశారు.

ఇక మాస్కులు తయారు చేసే విన్సీ డా పాత్ర నటించిన సుశాంత్ కి  విన్సీ డా లోని మేకప్ ఆర్టిస్టు బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. వూరికే మాస్కులు తయారు చేసే పాత్రగా ఫ్లాట్ గా వుంటాడు. అసలు  విన్సీ డా పోలీస్ వర్సెస్ కిల్లర్ కథ కాదు. విన్సీ డా ఇద్దరు హీరోల మధ్య విన్సీ డా వర్సెస్ సైకో కిల్లర్ కథ! అందుకని విన్సీ డా లో లాజిక్కులు, సస్పెన్సులు, థ్రిల్సు వుండవు. విన్సీ డా కథ వీటి గురించి కాదు. రెండు భిన్న ధృవాలుగా వున్న పాత్రల మధ్య, నైతికతలకి సంబంధించిన - ఒక డిస్టర్బింగ్ ఐడియాలజీని స్థాపించే డ్రామా. ముందు ఈ జానర్ మర్యాదని అర్ధం జేసుకోవాలి!

అతి మానవుడి అవతరణ

ఈబర్ మెంచ్ (Übermensch) అనేది 1883 లో జర్మన్ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే కాయిన్ చేసిన పదం. అంటే తనని తాను అతి మానవుడు (సూపర్ హ్యూమన్) గా భావించుకునే వాడని అర్ధం. తను రాసిన  'థస్ స్పేక్ జరతూస్త్ర' లో దేవుడు ఎలా చనిపోయాడో వివరిస్తాడు నీషే. దరిమిలా మెరుగైన భవిష్యత్తు కోసం ప్రపంచాన్ని క్రమబద్ధీకరించే బాధ్యత ఈబర్ మెంచ్ పై వుంటుంది.  దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ  'విన్సీ డా' కథా కథనాలకి ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. ఇది మానసికంగా కుంగిపోయిన ఆది బోస్ కథ.  ఇతను తనని తాను నీషే తలపోసిన ఈబర్ మెంచ్ గా భావించుకుంటాడు. అవినీతి వ్యవస్థ కారణంగా న్యాయాన్ని తప్పించుకునే, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులకి వ్యతిరేకంగా తను పాల్పడే చర్యల్లో, అమాయకుల్ని బలి చెయ్యాల్సిందేనన్న దుర్మార్గాన్ని ఈజీగా తీసుకునే రకం.

ఇంతవరకూ విజిలాంటీ జస్టిస్ (న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం) సినిమాలు చూశాం. 1974 లో డెత్ విష్ దీనికి పెద్ద బాట వేస్తూ, అదే సమయంలో ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంది. అప్పటి విలువలకి - సమాజాలకి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మింగుడు పడని వ్యవహారంగా వుంది. కానీ సినిమా టెంప్లెట్ల లంపటంలో చుట్టుకుని అక్కడక్కడే పడి వుండదు. కాలానికి ముందుంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే డెత్ విష్ తర్వాత నెక్స్ట్ లెవెల్  ఏంటి? దీనికి సమాధానమే నేటి కాలాని కంటే ముందున్న విన్సీ డా’.

నీషే ప్రకారం దేవుడు చనిపోయి ఈబర్ మెంచ్ అవతరిస్తే వేరేగా వుంటుంది లోకం. నేరస్థులు న్యాయ స్థానం నుంచి, దేవుడి శిక్షనుంచీ తప్పించుకుంటే ఇంకేం జరగాలి? చట్టమూ చచ్చిపోయి, దేవుడూ చచ్చిపోతే ఇక న్యాయం కోసం ఎక్కడికెళ్ళాలి? అందుకని ఈ సామాజిక రొష్టులోంచి అతిమానవుడు రొష్టుగా అవతరిస్తాడు. నేరస్థులు చేసిన నేరాల్నే పిచ్చెక్కి అమాయకుల్ని బలి పశువుల్ని చేసి రీక్రియేట్ చేస్తాడు. నేరస్థుల్ని జైల్లో కుక్కేస్తాడు. అతిమానవుడి కచ్చ నేరస్థులతో కాదు. నేరస్థుల్ని చంపే విజిలాంటీ జస్టిస్ కాదు. ఆ రోజులు పోయాయి. చట్టం మీద, దేవుడి మీద అతడి కచ్చ. చట్టమూ, దేవుడనే వాడుంటే  దేవుడూ వొళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించకపోతే అతి మానవుడు అతలాకుతలం చేసి  చూపించే సన్నివేశం ఇదే!

        ఇంత అర్ధంతో స్టడీ చేసి శ్రీజిత్ ముఖర్జీ విన్సీ డా తీస్తే, ఇదా రావణాసుర తో మర్యాద?