రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, April 4, 2023

1316 : రివ్యూ!


 

        మితాబ్ బచ్చన్ నేవీ కెప్టెన్. సముద్రం మీద ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు షిప్పులోని 300 మంది ప్రాణాలని  పణంగా పెట్టి పారిపోతాడు. దీంతో అత్యంత నీచుడైన పిరికివాడుగా ముద్రవేసుకుంటాడు. సమాజం, కుటుంబం అతడ్ని బహిష్కరిస్తుంది. ఆ తప్పు చేసిన ఆపరాధభావంతో కుమిలిపోతూ, గతాన్ని మర్చిపోవడానికి  బొగ్గు గనుల్లో  కార్మికుడుగా చేరతాడు. శశికపూర్ ఆ గనుల్లో ఇంజనీర్. శశికపూర్ తో అమితాబ్ స్నేహం చేస్తాడు. అమితాబ్ కి నిద్రపోవాలని ప్రయత్నించిన ప్రతిసారీ  గతం వెంటాడుతూంటుంది. శత్రుఘ్న సిన్హా పారిపోయిన ఖైదీ. గని కార్మికుడుగా చేరి రహస్య జీవితం గడుపుతూంటాడు. అయినా నేర బుద్ధి పోనిచ్చుకోక తోటి కార్మికుల్ని ఇబ్బంది పెడుతూంటే అమితాబ్ ఎదుర్కొంటాడు. ఇలాటి ఒక సంఘటనలో శత్రుఘ్న గాయపడితే అమితాబ్ అతడ్ని శస్త్ర చికిత్సకి రాఖీ దగ్గరికి తీసుకుపోతాడు. రాఖీ అక్కడ డాక్టర్. అక్కడ అమితాబ్ శత్రుఘ్న కి రక్తదానం చేస్తాడు. అలా శత్రుఘ్న అమితాబ్ స్నేహితుడవుతాడు.

        ప్రేమ్ చోప్రా బొగ్గుగనుల కాంట్రాక్టర్. ఇతను నాసిరకం పరికరాలతో, అరకొర వైద్య సామాగ్రితో, ఇతర సౌకర్యాల కొరతతో, కార్మికుల జీవితాల్ని కష్టతరం చేస్తాడు. అమితాబ్, శశి, శత్రుఘ్న ఇతడి దురాగతాలకి వ్యతిరేకంగా ఏకమవుతారు. ప్రేమ్ చోప్రా విలనీ భూగర్భంలో వరద ముప్పుకి దారితీస్తుంది. గనుల్లో విరుచుకు పడుతున్న జలాల్లో చిక్కుకున్న వందలాది కార్మికుల ప్రాణాలు అమితాబ్ కి  తిరిగి ఆ నాటి షిప్పు ఘటనని కళ్ళముందుకి తెచ్చి పెడతాయి. జీవితం వృత్త సమానం. పాత కళంకాన్ని తుడిచి వేసుకునే అవకాశాన్ని జీవితం ఎప్పుడూ ఇస్తుంది...
        
కథానాయకుడు అమితాబ్ కి పాప విముక్తి కల్గించే ఈ కదిలించే కథ 1978 నాటి కాలా పథ్థర్ లోనిది. సలీం -జావేద్ రచన, యశ్ చోప్రా దర్శకత్వం. 1975 లో ఝార్ఖండ్ లోని ఛాస్నాలా బొగ్గుగనుల్లో 375 మంది కార్మికుల ప్రాణాల్ని బలిగొన్న దుర్ఘటన దీనికాధారం. ఇది డిజాస్టర్ జానర్ మూవీ.
          
తెలంగాణా మణిహారమైన, దేశంలోనే పెద్దదైన, సింగరేణి బొగ్గు గనులు ఏర్పాటై వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా  దసరా సినిమా నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కి పండగే. ఇది బొగ్గుగనుల కార్మికుల జీవితాల గురించి గాక, ఫ్యాన్సుకి కిక్కునిచ్చే మద్యపానం కథగా బాగా అలరిస్తోంది. కాలమహిమ. తెలంగాణా సినిమా ఇలా ఎదుగుతోంది. కానీ ఫ్యాన్స్ కేం కావాలో అదిచ్చారు నాని, కొత్త దర్శకుడు. ఎలా వుందని కాదు, ఆడిందా లేదా అన్నదే లెక్క. ఐమాక్స్ నుంచి బయటికొచ్చిన ప్రేక్షకుల్లో ఇద్దరు 16-17 ఏళ్ళ లోపు టీనేజర్లు మైకు ముందు కొచ్చి చేసిన కామెంట్లు లెక్కలోకి తీసుకోనవసరం లేదు. దర్శకుడికి కథ చేసుకోవడం రాలేదనీ, ఎవరైనా పెద్ద దర్శకుడితో కథ చేయించుకుని వుండాల్సిందనీ అప్పుడే అంతంత పెద్ద మాటలనేశారు. వీళ్ళనేమనాలి? ఏ లోకంలో వున్నారు వీళ్ళు? ఈ బాల మేధావుల్ని వెంటనే నిషేధించాలి.
        
త్రాగుట తెలంగాణా సంస్కృతి అని చెప్తున్నారు. ఈ సంస్కృతి ఆధారంగా ఈ సినిమా తీశారు. దీనికి సింగరేణి కాలరీస్ బ్యాక్ డ్రాప్ పెట్టుకున్నారు. దీంతో ఏ సంబంధం లేకుండా మద్యపానం కథ చేశారు. అలాంటప్పుడు గ్రామంతో బాటు తాగుబోతుల సిల్క్ బార్ సెట్స్ ఇంకెక్కడైనా చూపించొచ్చు. సింగరేణి దేనికి? ఇలాటి సందేహాలొస్తే అది సినిమా పరిజ్ఞాన మన్పించుకోదు.
        
గోదావరి ప్రాంతంలో బాటసారులు వంట కోసం కట్టెలు ముట్టించినప్పుడు, పొయ్యికి పెట్టిన రాళ్ళు ఎర్రగా కాలడం చూడడమే సింగరేణి బొగ్గు గనుల అంకురార్పణకి ఆవిష్కరణ. బొగ్గు పడింది, ప్రభుత్వం బాగు పడింది. సినిమాలో మందు పడింది, కలెక్షన్ పండింది. సినిమా విడుదల రోజున పొద్దున్నే శ్రీరామ నవమికి పూజ చేసుకుని వెళ్ళే ఫ్యాన్స్ కి మాంఛి మందు మైకం. త్రాగుట తెలంగాణా ఆట. ఇక వూరూరా సిల్కు బార్సు నెలకొల్పుట. పురస్కారాలు పంచుట.

హిట్టయ్యాక ఇంతే!

    ఫ్యాన్స్ కేం కావాలో అదివ్వడమే సినిమా పని. సినిమా హిట్టయ్యాక ఇచ్చిన మద్యపానం ప్యాకేజీ లోపల విషయం ఎలా వుందన్నది అనవసరం. ఇచ్చిన విషయం లోంచే నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి, ఇవి తెలుసుకోవడం సమాచార హక్కు చట్టం కింద మన ధర్మం.
        
చిన్నప్పుడు నాని, కీర్తి, దీక్షిత్ ఒక జట్టు. పెద్దయ్యాక కీర్తి టీచర్. నాని దీక్షిత్ తో కలిసి గూడ్స్ లో బొగ్గులు దొంగిలించి సిల్క్ బార్ లో తాగుతాడు. తను పిరికివాడు. తాగితేనే ధైర్యం వచ్చి కొడతాడు. నాని, దీక్షిత్ ల మధ్య గాఢ స్నేహం. కీర్తితో నానికి మానసిక ప్రేమ. కీర్తికి దీక్షిత్ మీద భౌతిక ప్రేమ. దీంతో నానికి మూగ వేదన. వూళ్ళో ఏర్పాటైన సిల్క్ బార్లో గ్రామస్థులు తాగుడుతో, కుటుంబ సమస్యలతో అల్లకల్లోలంగా జీవిస్తూ వుంటారు. నానికి చిన్నప్పటి నుంచి కీర్తి అంటే మానసిక ప్రేమే కానీ ఆమె దీక్షిత్ ని భౌతికంగా ప్రేమిస్తోందని తెలుసుకుని -తన మానసిక ప్రేమని చంపుకుని - వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించాలని నిశ్చయించుకుంటాడు.
        
గ్రామంలో సముద్రకని, అతడి కొడుకు షైన్ చాకో ఇద్దరూ సాయి కుమార్ రాజకీయ ప్రత్యర్ధులు. పంచాయితీ ఎన్నికల్లో సాయికుమార్ దీక్షిత్ ని నిలబెడతాడు. దీక్షిత్ గెలుస్తాడు. షైన్ చాకో ఓడిపోతాడు. దీక్షిత్ కీ కీర్తికీ పెళ్ళయిపోతుంది. పెళ్ళి రోజు రాత్రి షైన్ చాకో ముఠా దీక్షిత్ ని నాని కళ్ళ ముందే చంపేస్తారు. దీంతో నాని షైన్ చాకో మీద పగబడతాడు...
        
ఈ ఫస్టాఫ్ కథలో నాని పిరికి వాడు, పాసివ్ క్యారెక్టర్. దీక్షిత్ యాక్టివ్ క్యారెక్టర్. కథని అతనే లీడ్ చేస్తూంటాడు. కీర్తితో ప్రేమ, క్రికెట్లో గెలుపు, బార్ లో క్యాషియర్ ఉద్యోగం, సర్పంచ్ గా గెలుపు, కీర్తితో పెళ్ళి - ఈ ప్రధాన ఘట్టాలన్నీ అతడి మీదే వుంటాయి. ముఠా బారి నుంచి నానిని కాపాడుతూ చనిపోయే ఘట్టం కూడా.
        
ఈ కథలో విలన్ షైన్ చాకోని సీత (కీర్తి) మీద కన్నేసిన రావణుడిలా చూపించారు. నాని రాముడికి హనుమంతుడిలా వుండిపోయాడు. కానీ రాముడ్ని పోగొట్టుకున్న సీతకి హనుమంతుడి (నాని) తో పెళ్ళి జరిపించేశారు! ఈ పిచ్చి కథ ప్రేక్షకులకి నచ్చి తీరాలి. ముత్యాల ముగ్గు రామాయణమే, గోరంత దీపం రామాయణమే. ఇలాటి రామాయణం కాదు.
        
దీక్షిత్ చనిపోయే ఘట్టం... తాగితేనే ధైర్యంవచ్చి కొట్టే నాని, దీక్షిత్ మీద దాడి జరుగుతున్నప్పుడు తాగి వుండి కూడా ముఠా మీద తిరగగబడక, దీక్షిత్ తనని కాపాడుతూంటే పారిపోతూంటాడు. ముఠా దీక్షిత్ ని చంపేస్తుంది.
        
ముఠా ఎవర్ని చంపడానికొచ్చింది? బార్ లో నాని వుంటాడు. బార్ మీదికి ముఠా వచ్చినప్పుడు దీక్షిత్ అప్పుడే అక్కడికొస్తాడు. దీక్షిత్ శోభనం రాత్రి కీర్తిని వదిలి బార్ లో నాని దగ్గరికి ఎందుకొచ్చాడు? ముఠా దీక్షిత్ ని చంపాలనుకుంటే అతడి ఇంటి మీది కెళ్ళకుండా నాని కోసమన్నట్టుగా బార్ కెందు కెళ్ళారు?
        
తాగితే చెలరేగిపోయే నాని దీక్షిత్ తనని కాపాడుతూంటే అతడి వెంట వురకడమే తప్ప ముఠా మీద దాడి ఎందుకు చేయలేదు? హీరోయిన్ ని కాపాడడానికి హీరో ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తున్నట్టు, దీక్షిత్ నాని చేయి పట్టుకుని అలా వురకడమేమిటి? అంటే నాని కావాలనే ముఠాని ఎదుర్కోలేదా? ముఠా దీక్షిత్ ని చంపేస్తే కీర్తి తనకి దక్కుతుందని తెలివిగా ఆలోచించాడా?

మరిన్ని పాసివ్ గైడెన్సులు

        పాసివ్ క్యారెక్టర్ నాని సెకండాఫ్ లో షైన్ చాకో, దీక్షిత్ ని రాజకీయ కక్షతో కాకుండా, కీర్తి మీద కన్నేసి చంపాడనీ తెలుసుకుని కీర్తికి తాళి కట్టేస్తాడు! కీర్తి ఎవడో ఒకడు మగాడి సొత్తుగా వుండాలన్నట్టు. ఆమె ఇంకా భర్తని పోగొట్టుకున్న బాధలో వుండగానే. ఆమె కూడా ఆ తాళిని తెంచి పారెయ్యకుండా, దీక్షిత్ తో చైల్డ్ హుడ్ లవ్ లేదు గివ్ లేదన్నట్టు నానితో వెళ్ళిపోవడం. ఈమెది కూడా సెల్ఫిష్ క్యారెక్టరయింది.
        
ఇక్కడ కథ అయిపోయినట్టే. తర్వాత అమ్మ చెప్పిందని నాని అస్త్రసన్యాసం చేసినప్పుడూ కథ అయిపోయినట్టే. షైన్ చాకో భార్య చెప్తే దీక్షిత్ హత్యకి కారణం తెలియడం, అమ్మ చెప్తే అస్త్ర సన్యాసం చేయడం వంటివి నాని పాసివ్ క్యారెక్టరైజేషన్ కి అదనపు హంగులు. పాసివ్ క్యారెక్టర్లు సృష్టించాలనుకునే వాళ్ళకి గైడెన్స్.
        
చివరికి అస్త్రసన్యాసం చేసిన నానికి చాకో తో పనే లేదు. కథ అయిపోయింది కాబట్టి. చాకోకే నానితో పనుంది. అతడ్ని చంపి రెండు సార్లు పెళ్ళయిన కీర్తిని దక్కించుకోవడానికి. కీర్తికీ అభ్యంతర ముండనవసరం లేదు. ఒకసారి బానిస ఎప్పటికీ బానిసే. ఇక నాని ప్రారంభించాల్సిన క్లయిమాక్స్ తను పాసివ్ కాబట్టి తను ప్రారంభించకుండా చాకో ప్రారంభిస్తాడు. ఇలా చాకో యాక్షన్ తీసుకుంటే- ఎజెండా అతను సెట్ చేస్తూంటే- ఆ ట్రాప్ లో పడ్డ పాసివ్ నాని, దానికి రియాక్షన్ ఇస్తాడు పాసివ్ కాబట్టి. ఇక దసరాకి రావణ దహనంతో బాటు చాకో మరణం పూర్తి.

ఏది భావోద్వేగం

    బాలమేధావులు చెప్పిందేమిటాని ఆలోచిస్తే పై విధంగా వచ్చింది. మనం రాయాలి కాబట్టి ఆలోచిస్తాం, లేకపోతే అవసరమేముంది. ఏదో చూపింది చూశామా, ఇంటికెళ్ళి పడుకున్నామా ఇంతే. వారం రోజులుగా ఏం రాశాడా అని పాఠకులు బ్లాగుని క్లిక్కు మీద క్లిక్కు చేసి చూస్తున్నారు. క్లిక్కులతో బ్లాగు పగిలిపోయేట్టుంది. చివరికి బద్ధకం వదిలించుకుని లేటుగా చూసి లేటుగా రాశాం.
       
కాలా పథ్థర్ అమితాబ్ మీద కథ. పాప విముక్తి కోసం అల్లాడే ఇన్నర్ జర్నీ, గని కార్మి కుల కోసం పోరాటం అతడి ఔటర్ జర్నీ. ఇందులో ఈ రెండు త్రెడ్స్ ని డిస్టర్బ్ చేసే లవ్ లో సమస్యలు, ట్రయాంగులర్ లవ్ సమస్యలు, ఫ్రెండ్ షిప్పుల్లో సమస్యలు వుండవు. ఇది డిజాస్టర్ జానర్ మూవీ. అమితాబ్ కి రెండు డిజాస్టర్ లు - సముద్రం మీద షిప్పుతో, గనుల్లో వరదతో. కాబట్టి అమితాబ్ కి రాఖీతో సాఫీ ప్రేమ. శశి కపూర్ కి పర్వీన్ బాబీతో, శత్రుఘ్న సిన్హాకి నీతూ సింగ్ తో సాఫీ ప్రేమలు. కథలో భావోద్వేగం ప్రేమలతో కాదు, స్నేహాలతో కాదు. భావోద్వేగం చెదిరిపోకుండా ఏకధాటిగా, బలంగా వుండాల్సింది ప్రధాన కథ అయిన అమితాబ్ అంతర్ సంఘర్షణతో, విపత్తులో గని కార్మికులతో. హై డ్రామా ఇక్కడుంది, స్టార్లు ముగ్గురి హీరోయిజాలూ, ఆత్మబలి దానాలూ అన్నీ ఇక్కడే. దీంతోనే  భావోద్వేగం. ఇలాగే వుంది సినిమాలో. చివరికి ఇన్నర్, ఔటర్ జర్నీలు విజయవంతంగా ముగించుకునన్న అమితాబ్ మెచ్యూర్డ్ క్యారెక్టరవడం ఉత్తమ కథా లక్షణం ప్రకారం జరిగిన ప్రక్రియ.
        
దసరా లో ఏ భావోద్వేగం పట్టుకోవాలి? ఫ్రెండ్ షిప్పా? లవ్వా? రాజకీయమా? కులతత్వమా? మద్యపాన సమస్యా? రామాయణం ఫీలవ్వాలా? ...రాముడు పది హిట్లు కొడితే రావణుడు చచ్చిపోలేదు. రావణ దహనమంత ఈజీ కాదు. హిట్లు కొట్టిన కొద్దీ తలలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఈ కలుపుతో కాదని, మూలం మీద కొట్టాలని, బ్రహ్మాస్త్రంతో ఛాతీ మీద కొట్టి నేల కూల్చాడు. దసరా లో భావోద్వేగాలన్నీ కలుపు మొక్కలే.  కాలా పథ్థర్ లో భావోద్వేగం రాముడు వేసిన బ్రహ్మాస్త్రం. కానీ ఏ బ్రహ్మాస్త్రమూ లేకపోయినా దసరా సూపర్ హిట్టయ్యింది. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకుని, కలుపు మొక్కలతో ఆధునిక తెలుగు సినిమాలు ఇలాగే నిర్మించుకోవచ్చు. ఆప్ట్రాల్ బాక్సాఫీసుని మించిన కొలమానం లేదు.

—సికిందర్