2022
లో
టాలీవుడ్
పని తీరు సంఖ్యా పరంగా14 హిట్స్ తో ఎప్పటిలానే స్టాండర్డ్ ఫలితాన్నిచ్చింది. ఏటా
10- 15 హిట్స్ తో 8-10 శాతం సక్సెస్ రేటుని నమోదు చేస్తూ వచ్చింది. ఈ సక్సెస్ రేటు
సినిమాల సంఖ్య 100-120 వున్నప్పుడు. 2022 లో ఈ సంఖ్య బాలీవుడ్ ని కూడా తలదన్నేలా రికార్డు
స్థాయిలో 300 కి చేరింది. ఒక సంవత్సరంలో 300 తెలుగు సినిమాలు నిర్మించేసి ఆలిండియా రికార్డు స్థాపించారు. అంటే నెలకు
25 సినిమాలు. అంటే దాదాపు రోజుకొకటి. ప్రేక్షకులు రోజూ ఒక సినిమా చూస్తే తప్ప
డిమాండ్ - సప్లయి బ్యాలెన్స్ కాదు. ఇదలా వుంచితే రివ్యూలు రాసేవాళ్ళ పరిస్థితేంటి?
ఇన్ని సినిమాలు ఎక్కడికిపోతున్నాయి? ఏమవుతున్నాయి? సంఖ్య పెరిగితే విజయా లేమైనా పెరిగాయా అంటే సగానికి పడిపోయాయి. 300 లో 14
హిట్స్ అంటే 4.67 శాతం విజయాలు. 8-10 శాతం నుంచి సగానికి పడిపోయిన టాలీవుడ్ పని
తీరు.
నష్టమెంతో
టాలీవుడ్ లో లెక్క తేలదు బాలీవుడ్ లో తేలినట్టు. అయితే 300 లో 14 హిట్స్ పోగా 286 ఫ్లాప్స్
కి పెట్టుబడి వేల కోట్లలోనే వుండొచ్చు. బాలీవుడ్ 102 సినిమాలు తీసి 3 వేల కోట్లు
నష్టపోతే టాలీవుడ్ 3 రెట్లు నష్టపోయి వుండాలి. ఇంత పెట్టుబడి టాలీవుడ్ లోకి
వస్తోందంటే టాలీవుడ్ మెగా రిచ్ పరిశ్రమే. ఫ్లాపయిన 286 లో పెద్ద హీరోలవి, చిన్న హీరోలవి కలిపి 43 పోగా, మిగిలిన 243 చిన్నా
చితకా సినిమాలే!
చిన్నాచితకా సినిమాలు నిర్మాతలకి
నష్టాలే మిగిల్చినా ఆ సినిమాలకి పని చేసే వాళ్ళందరికీ ఉపాధి కల్పించే సామాజిక
బాధ్యత వహిస్తున్నాయి. ఇది గొప్ప విషయం. కాబట్టి చిన్నా చితకా సినిమాలు
తీయాల్సిందే దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య దృష్ట్యా. పెద్ద, మధ్యతరహా సినిమాలు ఫ్లాపయినా పెద్దగా నష్టం వుండదు- ఓటీటీలు భర్తీ
చేస్తాయి కాబట్టి. ఇప్పటికే ఓటీటీలు ఫ్లాపుల అడ్డాగా పేరుబడ్డాయి. ఉందిగా
సెప్టెంబరు మార్చి పైన అని పాట పాడినట్టు, థియేటర్లో
ఫెయిలైనా ఓటీటీలో పాస్ అవచ్చు.
హిట్టయిన 14 సినిమాలేమిటో
చూస్తే- 2022 జనవరిలో ఒక్క హిట్టు కూడా లేదు. ఫిబ్రవరి నుంచి వరుసగా డీజే టిల్లు, భీమ్లా నాయక్, ఆర్ ఆర్ ఆర్,
సర్కారు వారి పాట, ఎఫ్ 3, మేజర్, బింబిసార, సీతారామం, కార్తికేయ
2, ఒకే ఒక్క జీవితం, గాడ్ ఫాదర్ మసూదా, హిట్ 2, ధమాకా. ఇవి చిరంజీవి,
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్- రామ్ చరణ్, శర్వానంద్, కళ్యాణ్ రామ్, అడివి శేష్,
నిఖిల్, దుల్కర్ సల్మాన్, సిద్దు
జొన్నలగడ్డ నటించినవి. అడివి శేష్ రెండు నటిస్తే రెండూ హిట్టయ్యాయి.
ఫ్లాపయిన 43 లో చిరంజీవి (ఆచార్య), నాగార్జున (బంగార్రాజు, ఘోస్ట్), రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ), ప్రభాస్ (రాధేశ్యామ్), విజయ్ దేవరకొండ (లైగర్), నాగచైతన్య (థాంక్యూ), శర్వానంద్ (ఆడవాళ్ళూ మీకు
జోహార్లు), నాని (అంటే సుందరానికి),
రామ్ (వారియర్), వరుణ్ తేజ్ (గని), గోపీచంద్
(పక్కా కమర్షియల్), నిఖిల్ (18 పేజెస్), విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కాళ్యాణం, ఓరి
దేవుడా), రానా (1945, విరాట పర్వం), సత్యదేవ్ (గాడ్సే), రాజశేఖర్ (శేఖర్), మోహన్ బాబు (సన్ ఆఫ్ ఇండియా), మంచు విష్ణు (జిన్నా), శ్రీవిష్ణు (భళా తందనాన, అల్లూరి), నాగశౌర్య (కృష్ణ వ్రింద విహారి), అల్లరి నరేష్
(ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం), అల్లు శిరీష్ (ఊర్వశివో
రాక్షసివో), ఆనంద్ దేవరకొండ (హైవే),
సుధీర్ బాబు (ఆ అమ్మాయి గురించి చెప్పాలి), సమంత( యశోద), తాప్సీ (మిషాన్ ఇంపాసిబుల్), కీర్తీ సురేష్ (గుడ్
లక్ సఖీ), ఆకాష్ పూరీ (చోర్ బజార్),
రాజ్ తరుణ్ (స్టాండప్ రాహుల్), కల్యాణ్ దేవ్ (సూపర్ మచ్చీ), అశోక్ గల్లా (హీరో), కిరణ్ అబ్బవరం 3 సినిమాలు, ఆది సాయికుమార్ 5
సినిమాలు వున్నాయి.
చిన్నా చితకా విషయానికొస్తే 243 లో
50 శాతమైనా సస్పెన్స్ థ్రిల్లర్లు వుంటాయి. ప్రేమ సినిమాలు తక్కువే. ఈసారి వీటి
బెడద తప్పింది. మాస్ మసాలా యాక్షన్లు, ఒకటీ అరా హార్రర్
కామెడీలు మిగిలిన సంఖ్యని భర్తీ చేశాయి. ఇవి కొత్త దర్శకులు కొత్త హీరోహీరోయిన్లతో
తీసిన సినిమాలే. వందల సంఖ్యలో వీళ్ళు వస్తున్నారు,
వెళ్ళిపోతున్నారు. కొత్త సంవత్సరం ఫ్రెష్ గా మళ్ళీ కొత్త కొత్త దర్శకులు, హీరోహీరోయిన్లు రావడం, వెళ్ళిపోవడం.
పెట్టుబడికే కాదు, కొత్త టాలెంట్స్ కి కూడా కొదవలేదు. తమ కోసం వందల సినిమాలు తీస్తున్న నిర్మాతలకి
న్యాయం చేద్దామని మాత్రం ఎవరికీ లేదు. ఒకరు ‘టాప్ గేర్’ అని రివర్స్ గేర్ వేస్తారు, ఇంకొకరు ‘ఎస్ 5 నో ఎగ్జిట్’ అని అవుటైపోతారు. ఇంకొకరు ‘డ్రైవర్ జమున’ అని పాత జమానాతో వచ్చి ఎటో వెళ్ళిపోతారు.
కనీస అవగాహన లేకుండా చేసే పనేదైనా వుంటే సినిమాలు తీయడమేనేమో. ఇలా 2023 లో 300
రికార్డుని కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. అసలు నిర్మాతలకి అవగాహన వుంటే ఇలా
జరగదు. కొత్తగా వచ్చే నిర్మాతలకి అవగాహనా తరగతులు నిర్వహించాలని ఆ మధ్య
అనుకున్నారు. అదింకా కార్యరూపం దాల్చడం లేదు. 2023 లోనైనా సంఖ్య తగ్గించి నాణ్యత
పెంచే వైపు దృష్టి సారిస్తా రేమో చూడాలి.
—సికిందర్