పాకిస్తానీ వెబ్
సిరీస్ ‘సేవక్ -ది
కన్ఫెషన్స్’ ని కేంద్ర ప్రభుత్వం నిన్న నిషేధించింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, విదేశీ సంబంధాలు ఈ
వెబ్ సిరీస్ తో దెబ్బతినేలా వున్నాయని ప్రకటించింది. వెబ్ సిరీస్‌లో భారత వ్యతిరేక కంటెంట్ ని చూపించినందుకు పాకిస్తాన్ కి చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం ‘విడ్లీ టీవీ’ వెబ్‌సైట్, రెండు మొబైల్ అప్లికేషన్‌లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు, ఒక స్మార్ట్
టీవీ యాప్ ని బ్లాక్ చేసినట్టు కేంద్రం
ప్రకటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్ లో అందుబాటులో వుంది. నవంబర్ 26 నుంచి
స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ యూట్యూబ్ లో అప్ లోడ్ అవగా, రెండో ఎపిసోడ్ గత
వారం అప్ లోడ్ అయింది.
సమాచార ప్రసార
మంత్రిత్వ శాఖ వెబ్ సిరీస్‌లో వున్న అనేక అభ్యంతరకర అంశాలని హైలైట్ చేసింది. వీటి ఆధారంగా ఈ
నిర్ణయం తీసుకుంది. 1) వెబ్ సిరీస్ టైటిల్స్ లో జాతీయ పతాకంలో అశోక చక్రాన్ని
మంటల్లో చూపడం, 2) భారత్ కి సంబంధించిన
చారిత్రక ఘటనల వక్రీకరణ- ఉదా. ఆపరేషన్ బ్లూ స్టార్, దాని పర్యవసానాలు; అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, క్రైస్తవ మిషనరీ గ్రాహం స్టీన్స్ హత్య, మాలెగావ్ పేలుళ్ళు, సంఝౌతా ఎక్స్ ప్రెస్ పేలుళ్ళు, సట్లెజ్ యమునా లింక్ కాలువకి సంబంధించిన అంతర్జాతీయ నదీ జలాల వివాదం
మొదలైనవి.
3)
భారత ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేషాన్ని పెంచే చిత్రీకరణలు. ఉదా. ఆపరేషన్
బ్లూ స్టార్ పర్యవసానంగా జరిగిన సంఘటనల గాయాల్ని తర్వాతి తరం సిక్కు ప్రజల్లో
రేపడం, భారత ప్రభుత్వం ముస్లిం
సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకమని చెప్పడం, బాబ్రీ మసీదు
కూల్చివేతలో అన్ని రాజకీయ పార్టీలూ చేతులు కలిపాయని చూపడం; ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు భారతదేశ అంతర్గత ముప్పు అని ఒక న్యూస్ ఛానెల్
పేర్కొంటున్నట్టు చూపడం.
4) భారత్ పట్ల సిక్కు సమాజంలో
వేర్పాటువాదాన్ని, అసంతృప్తినీ ప్రేరేపించడం; ఆపరేషన్ బ్లూ స్టార్ ని అమాయక సిక్కుల ఊచకోతగా చిత్రీకరించడం, ఆపరేషన్ బ్లూ స్టార్
తర్వాత పంజాబ్‌లోని పరిస్థితుల్ని దురుద్దేశపూర్వకంగా, బలమైన మతతత్వ స్వరంతో చూపించడం; హింస, దానిపై పోలీసు చర్య మతపరమైన కారణాలతో జరిగినట్టు చూపడం, పంజాబ్‌లోని
పోలీసులందర్నీతలపాగాలు లేకుండా చూపడం, సిక్కుయేతర పోలీసులు సిక్కు జనాభాని ఖలిస్తానీ ఉగ్రవాదులుగా ముద్రవేశారని చెప్పడం.
5) ఒక సన్నివేశంలో, హిందూ పిల్లలు
ముస్లిం-క్రిస్టియన్- సిక్కు మతస్థుల్ని చంపడానికి పెరగాలని, వారివల్ల మైల పడిన మాతృభూమిని
శుభ్రపరచాలని ఒక హిందూ పూజారి ప్రకటిస్తున్నట్లు చూపించడం.
6) షెడ్యూల్డ్ కులాల వారిని హిందువులుగా
వుండవలసిందిగా బలవంత పెడుతున్నట్టు ఒక దృశ్యంలో చిత్రీకరించడం. మతపరమైన చిహ్నాల నుపయోగించి, 1984 నాటి సిక్కు
వ్యతిరేక అల్లర్లను సిక్కులపై హిందువులు చేసిన దాడిగా చూపించడం.
పై ఉద్దేశపూర్వక దుష్ప్రచార
సామగ్రిని కలిగి వున్నందున్న వెబ్ సిరీస్ ని నిషేధిస్తు న్నట్టు కేంద్రం విడుదల
చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే
సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ కి వ్యతిరేకంగా దుమారం రేగుతోంది.
‘సేవక్: ది కన్ఫెషన్స్’ వెబ్ సిరీస్ ఎనిమిది ఎపిసోడ్స్ లో రెండు ఇప్పటికే
విడుదలయ్యాయి. కేంద్రం ఓటీటీ ప్లాట్ ఫాంని బ్యాన్ చేసినా యూట్యూబ్ లో వైరల్
అవుతోంది. పాకిస్థానీ నిర్మాతలు భారత ప్రభుత్వ బ్యాన్ ని ఎదుర్కోవడానికే యూట్యూబ్
లో అప్లోడ్ చేస్తున్నట్టుంది. ఈ వెబ్ సిరీస్ 1984 నుంచి 2022 వరకూ భారత్ లో తీవ్రవాద
గ్రూపులు చేసిన దురాగతాల్నివివరిస్తూ రచయిత సాజి గుల్, దర్శకుడు అంజుమ్ షెహజాద్ రూపొందిస్తున్నారు.
రెండవ ఎపిసోడ్ మొదటి దానికంటే
తీవ్రమైన కంటెంట్ తో వుంది. భారత్ లోని ముస్లిం, సిక్కు కుటుంబాల్ని నాశనం చేసిన కొన్ని లోతైన రాజకీయ
రహస్యాల్ని విప్పుతున్నట్టు చెప్పుకుంటూ సాగుతోందీ ఎపిసోడ్. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 26న పాకిస్థాన్‌లో
విడుదలైంది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కు వ్యతిరేక
అల్లర్లు, 2002లో గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు వివాదం-
వీటి ఆధారంగా వెబ్ సిరీస్ ని రూపొందించినట్టు చెప్పుకుంటున్నారు. హిందూ సాధువుల్ని క్రిమినల్స్ గా చూపడంతో బాటు, మహారాష్ట్రలోని
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధిపతి హేమంత్ కర్కరేని, జర్నలిస్టు గౌరీ లంకేష్ నీ, ఖలిస్తానిస్టు దీప్ సిద్ధూని కూడా వెబ్ సిరీస్‌లో చూపించారు.
‘సాధూజీ కెహతే హై
జిస్ దిన్ మనుష్ జనమ్ లేతా హై, ఉసీ దిన్ ఉస్ కా రాక్షస్ భీ జనమ్ లేతా హై’ (మనిషి జన్మించినప్పుడే అతడితో బాటూ రాక్షసుడూ జన్మిస్తాడని సాధూజీ
అంటున్నారు) వంటి డైలాగులున్నాయి. ఈ కథలో సినిమా హీరో జీత్ సింగ్ మరణం
వెనుక వున్న నిజాన్ని
తెలుసుకోవాలనే తపనతో జర్నలిస్టు విద్య, ఆమె ఇన్‌ఫార్మర్ మన్నూ
సాగించే ప్రయాణంలో గత చరిత్రలో సంఘటనలు వెల్లడవుతూంటాయి. ఒకవైపు ‘కాశ్మీర్ ఫైల్స్’, ఇంకో వైపు ‘సేవక్
ది కన్ఫెషన్స్’,
మరోవైపు రాత్రయిందంటే గోదీ మీడియా హిందూ ముస్లిం డిబేట్ల మంటలు- ఈ ఫేక్ న్యూసులన్నీ సృష్టిస్తున్న
కాలుష్యాన్నంతా కడిగి, మాతృభూమిని శుభ్రపర్చాల్సిన అవసరం చాలా
వుంది.
—సికిందర్