రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, మార్చి 2022, మంగళవారం

1148 - స్క్రీన్ ప్లే సంగతులు 2

బిగినింగ్ గాథ : 1975 లో ప్రభాస్ ఒక పేరున్న పామిస్ట్ (హస్తసాముద్రికుడు). గురువు కృష్ణం రాజు దగ్గర శాస్త్రం నేర్చుకున్నాడు. అత్యున్నత స్థానాల్లో వున్న వాళ్ళు కూడా అతడికి చేయి చూపించుకుంటారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా చేయి చూపించుకుంటుంది. ఆమె చేయి చూసి మీరు ఎమర్జెన్సీ విధిస్తారని చెప్పేస్తాడు. ఇందిరాగాంధి అవాక్కవుతుంది. ఈ సంచలన జోస్యం చెప్పిన తనని మీడియా చుట్టు ముట్టకుండా, పబ్లిసిటీని నివారించడానికీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అజ్ఞాతంలో విదేశాలు తిరుగుతూ ఇటలీలో రోమ్ నగరానికి చేరుకుంటాడు. ఇలా వివిధ దేశాల్లో అమ్మాయిలతో ఫ్లటేషన్షిప్ అని చెప్పి ఎంజాయ్ చేసి వస్తాడు. అతడి జాతకంలో పెళ్ళి యోగం లేనందువల్ల అమ్మాయిల్ని ఎంజాయ్ చేస్తూంటాడు. రోమ్ లో తల్లి భాగ్యశ్రీ, స్నేహితుడు కునాల్ రాయ్ కపూర్ వుంటారు. ఒకరోజు రోమ్ లోనే ట్రైన్లో పూజా హెగ్డేని చూసి ప్రేమలో పడతాడు. ఆమె డాక్టర్. ఆమె పెదనాన్న సచిన్ ఖేడేకర్ నిర్వహిస్తున్న  హాస్పిటల్లో పని చేస్తూంటుంది.  

       లా ట్రైన్లో పూజాతో ప్రభాస్ ప్రేమలో పడ్డ పై సన్నివేశంతో స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్ మలుపు వచ్చి బిగినింగ్ విభాగం ముగుస్తుంది. ఈ విభాగంలో ప్రధానంగా ప్రభాస్, పూజా, కృష్ణంరాజు ఆపరేటింగ్ పాత్రల పరిచయం వుంది. ప్రభాస్ ఫేమస్ పామిస్ట్. అతడి జోస్యం తప్పవదు. ఇందిరాగాంధీకి కూడా జోస్యం చెప్పాడు. త్వరలో ఎమర్జెన్సీ విధిస్తారన్నాడు. ఎమర్జెన్సీని ముందే వూహించాడు. అయితే ఇందుకు ఏ మాత్రం ఆందోళన చెందలేదు. నేను ఎమర్జెన్సీ విధించడమేమిటి, ఆ అవసరం ఎందుకొస్తుందని ఇందిర కూడా అడగలేదు. అడగకపోయినా అలాటి  పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అనుకోలేదు. అంటే ఆమె ఎమర్జెన్సీ విధిస్తానని ముందు  తెలిసినా విధించాలనే అనుకుందా? ప్రభాస్ అలా చెప్పాక ఆమె ఏమనుకుంది? ఇది స్పష్టమవక పోతే ఇందిర పాత్ర ఎలా అర్ధమవుతుంది? కేవలం ప్రభాస్ బిల్డప్ సీను కోసమే ఇందిర పాత్రని ఇలా బలిపెట్టారా స్వైరకల్పనలతో? రచనతో కల్పన చేయవచ్చు గానీ స్వైరకల్పనలు చేయకూడదేమో.

       ప్రభాస్ కూడా ఇందిర గురించి అంత జోస్యం చెప్పాక నిజంగా దాన్నుంచి వచ్చే పబ్లిసిటీని  తప్పించుకోవాలనే ఉద్దశంతోనే దేశం విడిచి వెళ్ళిపోయాడా, లేక ఎమర్జెన్సీకి భయపడి పారిపోయాడా? అసలు ప్రభాస్ ఇలా జోస్యం చెప్పాడని మీడియాకి ఎలా తెలుస్తుంది- పబ్లిసిటీతో అతను వీవీఐపీ అయిపోవడానికి? ఇలా లాజిక్ లేని ఫాల్స్ బిల్డప్పులతో పాత్ర నిలబడుతుందా?

       ఎమర్జెన్సీని ముందే వూహించిన ప్రభాస్ అంత ప్రమాదం రాకుండా ఇక్కడే వుంది ఏం చేయాలో ఆలోచించడమా, లేక దేశ ప్రజల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి విదేశాలకి పారిపోవడమా? ఏం చేస్తే అతడి హీరో క్యారక్టర్ ఔరా అన్పించుకుంటుంది? ఇలా పైపైన రాసేసి పైపైన తీసేస్తే పానిండియా స్టార్ పాత్ర చిత్రణవుతుందా? గొప్ప పీరియడ్ గాథ కోసం ఎమర్జెన్సీని భాగం చేసి పాత్రని హాస్యాస్పదం చేయడం భావ్యమేనా? క్వాలిటీ మేకింగ్ కి క్వాలిటీ రైటింగ్ లేకుండా బల్క్ రేటింగ్ ఆశిస్తే ఎలా? సినిమా ఫ్లాపైందని ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

పాత్రచిత్రణ ఇంకా...

పెళ్ళి రేఖ లేని ప్రభాస్ ఫ్లటేషన్షిప్ పేరుతో విదేశాల్లో అమ్మాయిల్ని ఎంజాయ్ చేస్తాడు. తను జోస్యం చెప్పిన ఎమర్జెన్సీతో దేశం కల్లోలమైతే హీరో అనే వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు. ఇక ఫ్లటేషన్షిప్ (Flirtationship) నే తీసుకుంటే,  పెళ్ళి యోగం లేని పామిస్టు ఏం చేస్తాడు? పామిస్టుగా తన సమస్యకి పరిష్కారం  చూసుకుని పెళ్ళి చేసుకోలేని వాడు వరల్డ్ ఫేమస్ పామిస్టు ఎలా అవుతాడు (అసలు ఈ మొత్తం గాథలో జోస్యాలే చెప్తాడు, వాటిలో సమస్యలుంటే పరిష్కారాలు చెప్పి సక్సెస్ అయినట్టు ఒక్క సీను కూడా చూపించ లేదు). ఇలా పెళ్ళియోగం లేదనిఅనుకుంటున్న వాడు అమ్మాయిల్ని భ్రమల్లో పెట్టి, కోరికలు తీర్చుకుని, ఏమంటే  ఫ్లటేషన్షిప్ అని అప్పుడు చెప్పి, అమ్మాయిల్ని వాళ్ళ ఖర్మానికి వదిలేసి వెళ్ళిపోవడం సబబైన క్యారక్టరైజేషనేనా?

       అసలు ఫ్లటింగ్ కి అర్ధం తెలుసో లేదో? ఫ్లట్ అంటే సరసం, సరసాలాడ్డం, చిలిపి ప్రవర్తన మాత్రమే. అదే క్రష్ అయితే ఫీలింగ్స్ వుంటాయి, డేటింగ్ కి దారితీస్తుంది, సెక్స్ వుంటుంది. ఫ్లటింగ్ లో ఫీలింగ్స్ వుండవు, డేటింగ్ వుండదు, సెక్స్ వుండదు. సరదాగా చిలిపిగా సరసాలాడ్డమే వుంటుంది. ఫ్లటింగ్ ఎప్పుడూ శారీరక సంబంధానికి దారి తీయదు. శారీరక సంబంధానికి దారితీస్తే అది డేటింగ్ గా మారుతుంది. డేటింగ్ లో ఏదో ఆశించడం వుంటుంది, ఫ్లటింగ్ కి ఆశించడం వుండదు. ఫ్లటింగ్ సైకాలజీ ఇదైతే ప్రభాస్ చేసింది వేరు. ఇలా క్యారక్టర్ని దిగజార్చి చూపించాలనుకుంటే పాత్రకి కావాల్సింది ఒన్ నైట్ స్టాండే తప్ప ఫ్లటింగ్ కాదు. అప్పుడు కనీసం అమ్మాయిలు వంచనకి గురి కాకుండా వుంటారు. ఇంటలిజెంట్ రైటింగ్ చేస్తే సినిమా ఆడదా? ఎంతో కొంత ఇంటలిజెంట్ రైటింగ్ చేసినవే ఆడుతున్నాయి కదా?

మదర్ బాండింగ్

ఈ గాథలో ప్రభాస్ పాత్రని ఐన్ స్టైన్ ఆఫ్ పామిస్ట్రీ అనీ, నాస్టర్ డామస్ ఆఫ్ ఇండియా అనీ పొగిడారు. అదే జ్యోతిష గురువు కృష్ణం రాజు గారు బ్రహ్మం గారు ఆఫ్ వెస్ట్ అని ఎందుకు పొగడలేదో? ప్రొఫెషనల్ జెలసీయా? దేశభక్తితో, రాష్ట్ర భక్తితో మనకైతే ప్రభాస్ పాత్ర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిగారే. ఐన్ స్టైనెవరో, నాస్టర్ డామసెవరో మనకేమాత్రం తెలీదు.

       ఇలా ప్రభాస్ లోకం చుట్టిన తర్వాత రోమ్ లోని అద్భుత బంగళాలో మదర్ భాగ్యశ్రీని కలుసుకుంటాడు. భాగ్యశ్రీని బాడీ షేమింగ్ చేయడం సరికాదు. కొడుకు కంటే తల్లి యంగ్ గా కన్పిస్తే తప్పేమిటి? ఆ కొడుక్కి గర్వకారణం. భాగ్యశ్రీ ప్రభాస్ కంటే పదేళ్ళు పెద్దదే. ఆమె యూత్ ఫుల్ నెస్ ని కాంప్లిమెంట్ చేయాలి. డిజైనర్ కథా కథనాల్లో డిజైనర్ పాత్రలే వుంటాయి. కాకపోతే భాగ్యశ్రీ మేకప్ బాగాలేదు. డీఐలో ప్రేమ కొద్దీ రుద్దినట్టుంది కలరిస్టు.

       ఇది కాదు విషయం, ఈ మదర్ తో బాండింగ్ ఏమిటనేది. బాండింగ్ కనిపించదు, గాథతో సంబంధం లేని పొడిపొడి సీన్లే వుంటాయి. మదర్ కన్పిస్తే చాలు అదే సెంటిమెంటు అన్నట్టుంది. ఈ మదర్ కి గాథలో, కొడుకు కష్టాల్లో ఏ సంబంధమూ  వుండదు. గీతాంజలి లో ఇలా కాదు-కథలో ఇన్వాల్వ్ చేస్తూ నాగార్జు నకీ, మదర్ (సుమిత్ర) కీ బలమైన బాండింగ్ వుంటుంది. యూట్యూబ్ లో ఈ సినిమా చూసిన హర్షవర్ధన్ అనే యువ ప్రేక్షకుడు ఇలా ఫీలయ్యాడు-When Nagarjuna say "amma annam pedatavaa " dialogue I couldn't controll my tears.

        ఈ రోజుల్లో యువ ప్రేక్షకులకి డ్రామా కదిలించ దనుకోవడం పొరపాటు. డ్రామాకి యూత్ ఎలా కనెక్ట్ అవుతున్నారో యూట్యూబ్ లో పాత సినిమాలకి పెడుతున్న కామెంట్సే చెప్తాయి. రాధేశ్యామ్ లాంటి రోమాంటిక్ ట్రాజిక్ డ్రామాలో ఒక్క కంట తడిపెట్టించే సీనూ లేదు. అలనాటి హాలీవుడ్ స్టార్ ఇంగ్రిడ్ బెర్గ్ మాన్, సినిమాలో అయిదుసార్లు ఏడ్పిస్తే సినిమా హిట్టవుతుందని చెబుతూండేది.
గీతాంజలి కి మరి కొన్ని యువ కామెంట్లు చూద్దాం-  
veerabhadram kastoori
చక్కని ప్లేమకావ్యం ఆయుస్సు తగ్గించి ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించారు.
Sagar u
More than 300 times chusa present 2021 Feb. Awesome acting and songs
Anitha anu Anu
From Karnataka.. Superb movie.. Heart melting climax...
Sanjitha Kayyala
Watching this movie for 1st time......sprrrrrr movie...makes me addicted 2 this.
Srinivas challa
Can't describe about this movie. It is a wonderful and heart touching movie magic by Mani Ratnam and Ilairaja Gods.
Prasad kdgamer
కన్నీళ్లు ఆగలేదు, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు.
Unil manohar aravind peteti 
Always in tears while watching this scene. Hats off to Maniratnam sir for his amazing direction and ilairaja for his great tunes and bgm.
Chaitu k
No one can stop tears...my lovely scene
Prati saari edustaanu ee scene chuste...I love this film...

పూజా హెగ్డే పాత్ర

 గీతాంజలి లో డాక్టర్ కూతురైన హీరోయిన్ గిరిజ క్యాన్సర్ పేషంట్ అయినట్టే, పూజా హెగ్డే కూడా క్యాన్సర్ పేషంటే. డాక్టర్ గా ఈమెకి పెదనాన్న సచిన్ ఖెడేకర్ వుంటే, తను కూడా డాక్టరే. ఇలాటి గీతాంజలి పోలికలు చాలా వుంటాయి మున్ముందు కూడా.

        ఈ బిగినింగ్ విభాగంలో రైల్లో పరిచయమై ప్రయాణికుల్ని గాభరా పెట్టే పని చేస్తుంది. కదులుతున్న రైల్లో వింటర్ స్కార్ఫ్ నడుంకి కట్టుకుని, రెండో చివర ప్రయాణికులకిచ్చి, స్కూబా డైవింగ్ చేస్తున్నట్టు ఒక్కసారి డోర్ లోంచి బయటికి వేలాడుతుంది. డేంజరస్ ప్లేని ఎంజాయ్ చేస్తుంది. ఆమె పడిపోకుండా పట్టి వుంచుతూ వాళ్ళు నానా పాట్లు పడతారు. ఇలా మిస్చీవస్ నేచరున్న పాత్రగా పరిచయ మవుతుంది.

        తర్వా త ఇదే అడ్వెంచర్ ప్రభాస్ తో చేస్తుంది. స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగుస్తూ, ఇది ఇద్దర్నీ కలిపే కీలక ప్లాట్ పాయింట్ వన్ మలుపు దృశ్యం. క్లాసిక్ లుక్ తో పురాతన ట్రైను, అద్భుత ప్రకృతి దృశ్యం, కింద లోయ పైన ఆకాశం, ఇద్దరూ రైలు బయట వేలాడుతూ టైటానిక్ మార్కు  ఐకానిక్ మూమెంట్. మంచి లిఫ్ట్ ఇరిగేషన్. బట్ వాటెబౌట్ రైటింగ్?

        మళ్ళీ రైటింగ్ దగ్గరే స్క్రీన్ ప్లేకి ఆయువు పట్టు అయిన ఈ పీపీ వన్ మలుపు కూడా తేలిపోయింది. ఈ ఐకానిక్ మూమెంట్ ఈ గాథ హీరో అయిన ప్రభాస్ కే ఎక్స్ క్లూజివ్ గా వుండాలి. ప్రభాస్ కే రిజర్వ్ చేసి అట్టిపెట్టేయాలి. సినిమాకే హైలైట్ అయిన ఈ ఐకానిక్  మూమెంట్ ని- లేదా బిగ్ ఈవెంట్ ని- ముందు వేరే పాత్రలతో చూపించకూడదు. ముందు వేరే పాత్రలతో చూపించేశాక తర్వాత ప్రభాస్ తో చూపిస్తే ఎంగిలి పడుతుంది సీను. హీరోకి ఎంగిలి పడ్డ సీన్లు వుండకూడదు. ఇదే సీనుతో ముందు పూజాతో, ఎవరో ప్రయాణీకులతో అనుభవించిన థ్రిల్, నావెల్టీ, సర్ప్రైజ్ ఎలిమెంట్ వగైరా ప్రభాస్ తో రిపీట్ చేస్తే వుండవు. ఇదే జరిగింది.  

పోనీ ప్రభాస్ తో సెకెండ్ హేండ్ సీనుగా రాజీపడి ఇలా రిపీట్ చేసినప్పుడు, ఇందులో గాథ కి సంబంధించి ఏమైనా విషయం వుందా? డెప్త్ వుందా? డైరెక్షన్ వుందా? డైనమిక్స్ వున్నాయా? చిన్న చిన్న సినిమాల్లో ఎలా వున్నా, బిగ్ మూవీస్ కి ప్లాట్ పాయింట్ వన్ మలుపు సంఘటనతో వుంటుంది. భూమికని మహేష్ బాబు రక్షించుకొచ్చే సంఘటన ఒక్కడు లో వుంది. ప్లాట్ పాయింట్ వన్ ప్రధాన పాత్రకి ఓ సమస్య నిచ్చి, దాన్ని సాధించే గోల్ నేర్పాటు చేసేది. దీంతో ఫస్ట్ యాక్ట్ ముగిసి, సెకండ్ యాక్ట్ తో కథ/గాథ  ప్రారంభమవుతుంది.

        ముందు సీనుకీ ఈ సీనుకీ తేడా ఏమిటంటే, ఈ సీనులో ప్రభాస్ కూడా బయటికి వేలాడుతాడు. ప్రభాస్ తొలిచూపులో ప్రేమ ఎస్టాబ్లిష్ చేసేందుకు మాత్రమే ఈ సీనుంది. ఇంతకి మించి విషయం లేదు. అప్పుడు ఇదో సీనే కాదుగా? ఈ సీను ఇంకెక్కడైనా తీయొచ్చు, రోడ్డుమీదైనా. ట్రైనుమీద ఇంత సాహోసోపేత జర్నీలో పట్టు తప్పి ఆమె పడిపో బోకపోతే, ఇంత ఖర్చు పెట్టి ఇంత బిగ్ ఈవెంట్ దీనికి?

        ప్రేక్షకుల గుండె ఝల్లుమనేట్టు ఆమె పట్టు తప్పడం, గబుక్కున అతను పట్టుకోవడం లాంటి గాథకి- కాన్సెప్ట్ కి - ప్రతీకాత్మకంగా వుండే సన్నివేశ సృష్టి జరగనిది, సంఘటన జరగనిది ఈ పీపీ 1 మలుపుకి సార్ధకత లేదు. నిస్సారం.   

        పీపీ వన్ ఘట్టం సుడిగాలిలా మలుపు తిరిగి వెళ్ళి సెకండ్ యాక్ట్ లో పడేలా వుండాలంటాడు సిడ్ ఫీల్డ్. ప్రమాదవశాత్తూ ఇండియన్ మిసైల్ వెళ్ళి పాకిస్తాన్ లో పడ్డట్టున్నా ఫర్వాలేదు. పీపీ వన్ ఘటన సెకండ్ యాక్ట్ ఇగ్నైట్ అవడాని కుపయోగపడే మిసైల్ లాంటిదనుకోవచ్చు. ఇదేమీ సిడ్  ఫీల్డ్ సొంత కవిత్వం కాదు తీసి పారేయడానికి. అనేక గొప్ప సినిమాల్లో చూసిందే మధించి శాస్త్రం చేశాడు. శాస్త్రాలన్నీ రచయితలు, దర్శకులు సృష్టించిన సినిమాల్లోంచే వచ్చాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి. పదార్ధం లేక శాస్త్రం లేదు. పానిండియా సినిమాలకి గొప్ప సినిమాల సశాస్త్రీయ గుణగణాలే కావాలి.

        పై ప్రతీకాత్మక సంఘటన హుక్ వేసి ప్రశ్నల్ని లేవదీస్తుంది. పూజా క్యారక్టరేమిటో ఇంకా పూర్తిగా మనకి తెలీదు. ప్రభాస్ కి పెళ్ళి యోగం లేదు. ఇలాటి వాడు ప్రేమలో పడ్డాడు, లోయలో పడిపోకుండా ఆమెని పట్టుకున్నాడు. ఈ కమిట్ మెంట్- తన జాతకం వీటితో ఎలా పోరాడతాడు? ఆమె లోయలోకి జారిపోకుండా కాపాడడంతో హీరోయిజం ఎలివేట్ అయింది. క్యారక్టర్ కలర్ఫుల్ గా మారింది. ఆడియెన్స్ విజిల్ వేసే మూమెంట్ ( “What is character but the determination of incident? What is incident but the illumination of character?” – Henry James). ఆమె విషయానికొస్తే, ఏదో జరగరానిది జరక్కపోతే ఆమె స్కూబా డైవింగ్ డేర్ డెవిల్రీకి ప్రయోజనం లేదు. కథంటే జరగడం, ఆ జరగడంలోంచి ప్రశ్నలు రేకెత్తడం కథనం. ఇక తర్వాత ఆమె క్యారక్టర్ తో బయటపడే క్యాన్సర్ అనే ప్లాట్ డివైస్ కి ప్రతీకాత్మకమే, ముందస్తు హెచ్చెరికే లోయ అనే మృత్యుముఖంలోకి ఆమె జారిపోబోవడం. ఇంకా ముందుకెళ్తే రేపు లోయలాంటి క్యాన్సర్ అనే మృత్యు ముఖంనుంచి  ఆమెని కాపాడ్డం అతడి బాథ్యతగా ఎస్టాబ్లిష్ అయ్యే  పీపీ వన్ సంఘటన!

కానీ జరిగిందేమిటంటే కథ అనుకుంటూ గాథ చేశారు. ఇందుకే పైన వివరించిన  విధంగా ప్లాట్ పాయింట్ వన్ లేదు. పాత్రల్ని పాసివ్ గా వుంచేసి, నడిపించేశారు. కథంటే ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ కూర్చోబెడుతుంది. గాథంటే స్టేట్ మెంట్. స్టేట్మెంట్ ఏం కూర్చోబెడుతుంది. అయినా గాథల్ని నిలబెట్టే సినిమాలు కూడా వున్నాయి. అవెలా  నిలబడతాయనేది వేరే టాపిక్. ఇప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, ఇన్ని లోపాలతో  ఈ బిగినింగ్ విభాగం ఎంత బలంగా వుందో అంచనా కట్టు కోవచ్చు. రేపు మిడిల్ చూద్దాం.

—సికిందర్