రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, June 19, 2021

1048 : స్పెషల్ ఆర్టికల్


     ఐడియాలు రెండు రకాలు : నిజ కథల ఐడియాలు, కల్పిత కథల ఐడియాలు. రీసెర్చి అన్నప్పుడు ఐడియాలకి రీసెర్చి అవసరం, కథలకి కాదు. కథలు క్రియేటివ్ కలాపం మాత్రమే. ఇది ఐడియాని బట్టి చేసుకోవచ్చు. ఐడియాలనేవి కథలకి క్రియేటివ్ కథనాన్నిచ్చే ఇంటలిజెన్స్ -మదర్ బోర్డ్ - కంట్రోల్ రూమ్ - ఏదైనా అవచ్చు-  అలా ఐడియాలు కథల్ని కంట్రోలు చేస్తాయి. కథ చేస్తున్నప్పుడు అనుకున్న ఐడియాని ఎక్కడో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కూడా జరుగుతూంటుంది. లైన్ ఆర్డర్ తర్వాత ట్రీట్ మెంట్ మారవచ్చు, ట్రీట్ మెంట్ తర్వాత డైలాగ్ వెర్షనూ మారవచ్చు. కానీ మొదట అన్నివిధాలా విశ్లేషించుకుని నమ్మి నిర్మించుకున్న ఐడియా మాత్రం ఏ దశలోనూ మారకూడదు. కథ- అంటే లైనార్డర్ ట్రీట్మెంట్ డైలాగ్వెర్షన్ వీటన్నిటినీ కలుపుకుని కంట్రోల్ చేసేదే ఐడియా. ఐడియా అంటే కథకి గోల్. అందుకని ఐడియా పాలనలో క్రియేటివ్ కల్పన వుండేట్టు చూసుకోవడం ముఖ్యం.

      కనుక ఐడియాలకే రీసెర్చి అవసరం. తర్వాత పాత్రలకి కథనానికి రీసెర్చి అవసరముంటే చేసుకోవడం అది వేరే అనుబంధ ప్రక్రియ. ఐడియా రీసెర్చి వుంటేనే ఈ ప్రక్రియ. ఇది సమస్య కాదు. ఐడియాల విషయానికొస్తే, ఈ వ్యాసం మొదటి భాగం 1045 లో ఐడియా రీసెర్చికి ముందుగా ఐడియా పూర్తి స్థాయి మార్కెట్ యాస్పెక్ట్ విశ్లేషణ, స్ట్రక్చర్ చూసుకున్న తర్వాతే, ఇవి కుదిరినప్పుడే, రీసెర్చికి పూనుకోవాలని చెప్పుకున్నాం. ఐడియాని  రీసెర్చి చేయడమంటే ఐడియాకి సంబంధించిన విషయకరణ చేయడం. విషయ సేకరణ కష్టమేం కాదు. దీనికి అందుబాటులో చాలా వనరులుంటాయి. ముందుగా ఐడియాని అది కోరుకుంటున్న గరిష్ట స్థాయి వినియోగ శక్తిని గుర్తించడమే కష్టం. దీన్ని సులభతరం చేయడానికే ఈ వ్యాసం.
        
    ఐడియా రబ్బరు బ్యాండు లాంటిది. ఎంత లాగితే అంత సాగుతుంది. తక్కువ లాగితే తక్కువలో వుండిపోతుంది. అందుకని దాని సాగే గుణాన్ని (స్థితి స్థాపక శక్తిని) గుర్తించడం అవసరం. లేకపోతే గత వ్యాసంలో చెప్పుకున్నట్టు నాంది’, మోసగాళ్ళు’, ఒన్ లాంటి పానిండియా వైరల్ అవాల్సిన ఐడియాలు లూజ్ రబ్బర్ బ్యాండులై పోతాయి.
         
    ఒక వేళ ఐడియా గరిష్ట సామర్ధ్యాన్ని గుర్తించినా, ఇదంతా మన తెలుగు సినిమాల కెందుకులే అని రిస్కు తీసుకోకుండా, ప్రేక్షకులకి అలవాటైందని భావించుకుంటున్న ఫార్ములా చట్రంలో బిగించేద్దామనుకుంటే- ఆ ఐడియాలు పై మూడిటి ఐడియాల్లాగే కాలం చెల్లిన రొటీన్ ఫార్ములా కథలై పోతాయి. ప్రేక్షకులే రిస్కు అనుకోకుండా, మెయిన్ స్ట్రీమ్ కాదనుకోకుండా, వివిధ రియలిస్టిక్, ఆల్టర్నేట్, ఇండీఫిలిం వెరైటీలు చూస్తున్నప్పుడు, వాళ్ళ స్థితి స్థాపక శక్తి ని కూడా ఆదరించనట్టే అవుతుంది. ఇలా చేయాలనుకున్నప్పుడు రీసెర్చి అవసరమే లేదు.

వ్యతిరేకంగా ఆలోచించాలి
     మండేలా’, బర్ఫీ’, మనం’, హాలాహల్ లాంటి ఐడియాలు వైరల్ అవడానికి కారణం ఇవి ఇన్నోవేట్ చేసిన ఐడియాలు. పాత ఐడియాల్నే మరికొంత లాగి చూస్తే రబ్బర్ బ్యాండులా సాగిన ఐడియాలివి. అపార్ధాలతో విడిపోయి చివరికి కలిసిపోవడం ప్రేమ సినిమాల రెగ్యులర్ టెంప్లెట్. ఇంతవరకే లాగిన ఈ రబ్బర్ బ్యాండుతో వున్న ఐడియాని, మరింత సాగలాగితే, అపార్థాలతో విడిపోవడం గాకుండా, కొట్టుకుని చివరికి విడిపోయే రాడికల్ ఐడియా అవచ్చు. ఐడియాలని what if? ఫ్యాక్టర్ తో ఆలోచించడం అవసరం. అంత వరకూ వచ్చిన, అమల్లో వున్న ఐడియాలనే 'ఇలా జరిగితే?' అని ప్రశ్నించుకుని, వ్యతిరేకంగా ఆలోచిస్తే వైరల్ ఐడియాలవుతాయి.

    ఓటు హక్కు అనే పాత ఐడియా 'మండేలా' గా కొత్త రూపం సంతరించుకుంది. ట్రాజిక్ గా చూపిస్తూ వస్తున్న అంగవైకల్యపు ఐడియాని కామిక్ గా, క్రైమ్ తో కలిపితే 'బర్ఫీ' వైరల్ అయింది. వికలాంగుణ్ణి నేరగాడుగా, కామెడీగా చూపడమేమిటని ధైర్యం చేయకపోతే 'బర్ఫీ' లేదు. 'మనం' లో మూడుతరాల ఐడియానే రీబూట్ చేస్తే, పాత వాసనలు వదిలి ట్రెండీ ఫ్యామిలీ డ్రామా అయింది. హాలాహల్ లో ఒక మెడికల్ స్కామ్ ని తీసుకుని జీవితంలో జరిగే యాంటీ క్లయిమాక్స్ చేశారు. ఇలా హీరో విలన్ చేతిలో చావకూడదనేం లేదు. 'మిస్ ఇండియా' లో అమెరికాలో ఎప్పుడో పరిచయమున్న ఇండియన్ టీని పరిచయం చేసే ఐడియా, వాస్తవ విరుద్ధంగా వుండి బెడిసికొట్టింది. ఇది రీసెర్చి చేయని, వాస్తవాలు తెలుసుకోని విఫల ఐడియా. 
        
    ఐడియాకి రబ్బరు బ్యాండు గుణం కల్పించడానికి చేసే రీసెర్చిలో పత్రికలు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, టీవీ, యూట్యూబ్ వంటి ప్రాప్తి స్థానాలు చాలా వుంటాయి. Weird news వెబ్సైట్లు వుంటాయి. చాలా విచిత్ర, నమ్మశక్యం గాని వార్తలు వీటిలో వుంటాయి. ఐడియాకి రబ్బర్ బ్యాండ్ గుణాన్ని కల్పిస్తాయి. ట్రెండింగ్ న్యూస్ లో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటనలు ఐడియాని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళడానికి పనికొస్తాయి.

ఒక ఉదాహరణ
     రబ్బర్ బ్యాండ్ లా సాగే గుణం గురించి ఒక ఉదాహరణ చూస్తే - మమ్ముట్టి నటించిన మలయాళం ‘ఒన్’ ని తీసుకోవచ్చు. దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోదు. సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీసినప్పుడే రబ్బరు బ్యాండులా సాగుతుంది ఐడియా. కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు నెక్స్ట్ లెవెల్ కథల్ని అందించే అవకాశం వుంటుంది.

    ‘'ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టం గురించి ఐడియా. ప్రజలు తామెన్నుకున్న  ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టూ రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. ఈ ఐడియా తీసుకుని రైట్ టూ రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యంగా కథ చేశారు. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు కల్పన చేసి చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. ఇంతే. ఇలా ఈ కథ రైట్ టూ రీకాల్ ఐడియాతో  కథ పూర్తి వికాసం చెందకుండా అర్ధోక్తిలో ఆగిపోయింది. రైట్ టూ రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించకపోవవడంతో, ఉపోద్ఘాతంలా వుందే తప్ప, అసలు కథ చెలామణిలోకి రాకుండా వుండి పోయింది.

     ఏమిటా తవ్వి తీయాల్సిన అసలు కథ? చట్టం పాసయిందా కాలేదా అని కాకుండా, పాసైతే ఎలాటి కొత్త రాజకీయ వాతావరణాన్ని కళ్ళ జూస్తామా అని ప్రజలు ఎదురు చూస్తూంటారు. ఈ తృష్ణ తీర్చాలి. ఇందుకు రైట్ టు రీకాల్ చట్టం గురించి డేటా ఏమేముందో సేకరించాలి. ఇదీ రీసెర్చి.  రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్ వుంది. ఇందులో చట్టం అమలైతే ఎలా వుంటుందో సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లన్నీ వున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని ‘ఒన్’ ని మించిన హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తీయవచ్చు. చెప్పాల్సిన కథ ఇందులో వుంది.  అంతేగానీ కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే డ్రామాగా సరిపెట్టడంలో లేదు.

ఉపోద్ఘాతం కూడా...

       పార్లమెంటులో మహిళా బిల్లు కూడా పాస్ కాకుండా వుంది. ఈ ఐడియాని పాస్ చేయించే ఐడియాగా చేసి కథ చేస్తే ఏమిటి ఉపయోగం. పాసైతే ఎన్నికల్లో పాల్గొనడానికి మహిళలు 33 శాతం రిజర్వేషన్ తో రాజకీయాల్లో ఎలాటి మార్పు తేవచ్చో చూపించడంలో థ్రిల్లింగ్ వైరల్ ఐడియా పాయింటు వుంది. ఇదీ పట్టుకోవాల్సిన సరైన మార్కెట్ యాస్పెక్ట్.         

    సూర్య నటించిన తమిళ డబ్బింగ్ ఆకాశమే నీ హద్దురా ఐడియాకూడా దాని గరిష్ట సామర్ధ్యాన్ని అందుకోలేక పోయింది. చూపించాల్సిన కథ అది కాకుండా పోయింది. ప్రేక్షకులు చూడాల్సిన కథ సినిమాలో చూపించిన కథ కాదు. అది కథ కూడా కాదు. కేవలం ఉపోద్ఘాతం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ విభాగాల బిజినెస్ దృష్ట్యా చూస్తే, అది కేవలం బిగినింగ్ విభాగం. బిగినింగ్ లో వుండే బిజినెస్సే, అంటే కథకి ముందుండే ఉపోద్ఘాతమే సినిమా అంతా.

    ఐడియాలో కథ వుందా గాథ వుందా ముందుగా సరి చూసుకోవాలని గత వ్యాసంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒన్’, ఆకాశమే నీ హద్దురా లాంటివి చూస్తే- ఐడియాలో కథ వుందా, గాథ వుందా అని మాత్రమే గాకుండా, కొంపదీసి ఉపోద్ఘాతముందేమోనని కూడా అదనపు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కన్పిస్తోంది.      

      ఆకాశమే నా హద్దురా  కెప్టెన్ గోపీనాథ్ నిజ కథ. చవకలో సామాన్యుల విమానయాన కోరిక నెరవేర్చిన ఘన చరిత్ర అతడి జీవితం. విజయవంతంగా అలాటి విమానయాన సంస్థని కొంత కాలం నడిపి అమ్మేశాడు. ఇది గరిష్ట స్థాయి స్టోరీ ఐడియా. కానీ సినిమాలో చూపించింది మాత్రం అతనా సంస్థని ప్రారంభించడానికి పడిన కష్టాలే. అప్పుడిది పాక్షిక ఐడియా మాత్రమే కాదు, ఉపోద్ఘాతం కూడా అయింది. మెక్ డోనాల్డ్స్ వ్యాపార చరిత్ర ఐడియాతో ది ఫౌండర్ తీశారు. అప్పటికి కేవలం ఒక సెంటర్ నడుపుతున్నమెక్డొనాల్డ్స్ సోదరులతో ఒప్పందం కుదుర్చుకుని, విస్తృతంగా ఫ్రాంచైజీలు ప్రారంభించిన రే క్రాక్, ఏకంగా టేకోవర్ పథకమేసి సంక్షోభం సృష్టిస్తాడు. దీన్ని ఆ సోదరులెలా ఎదుర్కొన్నారన్నది పూర్తి స్థాయి ఐడియా. ఇదీ రీసెర్చి చేయాలి. సంస్థని ప్రారంభించడం కథకాదు, ప్రారంభించాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ప్రేమలో పడడం కథ అవదు,డు, పడ్డాక ఏం జరిగిందన్నది కథవుతుంది. హత్య జరగడం కథవదు. జరిగాక ఏం జరిగిందన్నది కథవుతుంది. ఐడియాని ఇలా విశ్లేషించుకున్నప్పుడు గరిష్టంగా దాని సామర్ధ్యం కనపడుతుంది.

సికిందర్