―పి. అశోక్, అసోసియేట్
A : మీ భాష బావుంది. పాండమిక్ ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం ఏ కళా ప్రక్రియైనా -సినిమా, టీవీ, నాటకం వగైరా- చేయాల్సిన మొట్టమొదటి పని. మనమొక చారిత్రక సందర్భంలో వున్నాం. వందేళ్ల తర్వాత స్పానిష్ ఫ్లూ లాంటి మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తరాలు, చరిత్రకారులు మనవైపు చూస్తారు. మహమ్మారితో మనమేం అనుభవించాం, నష్టపోయాం, ఎలా జయించాం ఇవన్నీ వార్తల రూపంలో, శాస్త్రవేత్తల నివేదికల రూపంలో లభ్యమవుతాయి. నేటి కళలు ఏం బాధ్యత నిర్వర్తించాయన్నది భవిష్యత్తరాలు చూస్తే తెలియాలి. ఇందుకు రిఫరెన్స్ మాత్రం లేదు. 1918- 20 మధ్య 5 కోట్ల మందిని (మనదేశంలో కోటిన్నర మందిని) రాల్చేసిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి తర్వాత, హాలీవుడ్ లో సినిమాలు ఎప్పటి కథలతోనే తీస్తూ పోయారు. కారణం 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం. 1918 లో మొదటి ప్రపంచయుద్ధం ముగియగానే స్పానిష్ ఫ్లూ మొదలైంది. దీంతో యుద్ధ ప్రభావంతో వున్న హాలీవుడ్ స్పానిష్ ఫ్లూ తో కథలు మార్చుకోవాలని ఆలోచించలేదు. అప్పట్లో సినిమాలు తీయడమే గొప్ప. అవీ మూకీలు. ఇక యుద్ధ ప్రభావంతో యుద్ధ సినిమాలూ తీయలేదు. విషాదాన్ని సొమ్ము చేసుకునే ఆలోచన సినిమా రంగం చేయలేదు.
1945 లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా యుద్ధ సినిమాలు తీయలేదు. తీసినవి ఆడలేదు. బిల్లీ వైల్డర్ రోమాంటిక్ కామెడీ, హిచ్ కాక్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇంకా ఇతర కామెడీలూ, కౌబాయ్ లూ, ఫిలిం నోయర్లూ, డ్రామాలూ, ఫాంటసీలూ విరివిగా తీశారు. ఈ సినిమాల్లో ఎక్కడా యుద్ధ ప్రస్తావనే తీసుకురాలేదు, గుర్తు చేయలేదు (తాజాగా ఒకరు పంపిన రోమాంటిక్ థిల్లర్ స్క్రిప్టులో హాస్పిటల్లో సీను, అక్కడ ఆక్సిజన్ తో కుట్రా వుంటే తీసేయాల్సిందిగా కోరాం). 9/11 అమెరికా జంట హార్మ్యాల మీద దాడి విషాదాన్ని కూడా హాలీవుడ్ సొమ్ము చేసుకోవాలనుకోలేదు. తర్వాత సినిమాల్లో ఎక్కడైనా ఆ ప్రస్తావన వుంటే తీసేశారు. దాడికి పూర్వం తీస్తున్న ఒక సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో జంట హార్మ్యాలు కన్పిస్తూంటే ఆ షాట్ తొలగించారు.
ప్రాణనష్టం జరిగిన విషాద ఘట్టాలతో హాలీవుడ్ ఇలాటి మర్యాద
పాటిస్తే, ఆర్ధిక
నష్టాలప్పుడేం చేసిందో చూద్దాం : 1929- 33 ఆర్ధిక మహా మాంద్యంలో గ్యాంగ్ స్టర్
సినిమాలు, కామెడీలూ తీస్తూపోయారు. అప్పటికి టాకీల శకం
ప్రారంభమైంది. ఆర్ధికమాంద్యంలో ఈ సినిమాలతో హాలీవుడ్ కి స్వర్ణయుగం అంటారు.
డబ్బులు బాగా గడించారు. నిరుద్యోగంతో, ఇతర ఆర్ధిక
నష్టాలతో దిక్కుతోచని ప్రజలు ఈ సినిమాలకి ఎగబడ్డారు. దోపిడీలు చేసే గ్యాంగ్ స్టర్ల
సినిమాలు!
తర్వాత 2008 ఆర్ధిక మాంద్యంలో రోమాంటిక్ కామెడీలతో ఆర్ధిక సమస్యల్ని మరిపించాలని ప్రయత్నించింది హాలీడ్ వుడ్. ఇప్పుడీ మహమ్మారి. ఇప్పుడు మనకేం సినిమాలవసరం? అవసరమా? మన దారే వేరు. తెలుగు ప్రజలెలాలాటి పరిస్థితుల్లో వున్నా సినిమాలవే వుంటాయి. తీస్తున్నవే వుంటాయి. ఎప్పుడు ప్రజల పక్షాన వున్నాయి గనుక. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, తీసే వాళ్ళూ చూసే వాళ్ళూ ఒకే మునిగే నావలో వున్నారు. మహమ్మారి తెచ్చిన వ్యాధి బారిన అందరూ పడలేదు, ఆర్ధిక సంకటంలో మాత్రం అందరూ పడ్డారు. వ్యాధి బారిని పడినా పడక పోయినా, పడి ప్రాణాలు కోల్పోయినా నిలబెట్టుకున్నా, ఎదర బ్రతుకంతా చిందర వందరై కన్పిస్తోంది. ఉపాధులు పోయాయి, మూడున్నర కోట్ల ఉద్యోగాలు పోయాయి, 23 కోట్ల మధ్య తరగతి పేద తరగతికి పతనమయ్యారు. ప్రభుత్వాలు ఆరోగ్యం వరకూ చేస్తాయేమో గానీ, ఆర్ధికంగా ఆదుకోవు. ఎవరి పోరాటం వాళ్ళు చేసుకోవాల్సిందే. చిన్న కుండలమ్ముకునే ముసలమ్మ కాడ్నించీ, పెద్ద సినిమాలు తీసే నిర్మాతల వరకూ.