రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, February 22, 2021

 

     ఇంటర్వల్ సీన్లో ఆయిల్ ప్లాంట్ పేలిపోవడం -"This attack we won like crazy!” మూమెంట్ లాంటిది డానీకి అర్నాబ్ లాగా. దురదృష్టంలో అదృష్టాన్ని చూశాడు- పేలుడుతో కాళ్ళ కింద చమురు సముద్రాలున్నాయని తెలిసి! ఇదే సమయంలో ఇదే పేలుడు కొడుకు వినికిడి శక్తి పోగొట్టిందని బాధతో వుంటాడు ఇప్పుడు సెకండాఫ్ లో. డాక్టర్ కి చూపిస్తాడు. లాభం లేదని అంటాడు డాక్టర్ పరీక్షించి. ఏం చేయాలో అర్ధం గాదు. కంపెనీ విస్తరణ కార్యక్రమాలు చేపడతాడు. చుట్టు పక్కల భూముల్లో మరిన్ని ప్లాంట్లు నిర్మిస్తాడు. ఇదంతా చూసి ఇలై వస్తాడు. చర్చి చందా పదివేల్లో ఐదు వేలు బాకీ ఇమ్మంటాడు. డానీ రగిలిపోయి మీదపడి కొట్టడం మొదలెడతాడు. బురదలో తొక్కితొక్కి కొడతాడు. నీ మహిమలతో నా కొడుక్కి నయం చేయలేక పోయావ్, డబ్బులు కావాలా అని దారుణంగా కొడతాడు.

        దీంతో ఇలై ఇంటికి వెళ్ళిపోయి తండ్రిని కొడతాడు. కిందపడేసి ఎలాపడితే అలా కొడతాడు. నీవల్లే వాడిక్కడ బలపడ్డాడని నోటి కొచ్చినట్టు తిడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి...హెన్రీ అనే అతను వచ్చి డానీ ఇంటి ముందుంటాడు. ఎవరు నువ్వంటే, మనం అన్నదమ్ముల మంటాడు. మన తల్లులు వేరైనా తండ్రి ఒకడే అంటాడు. మూడు నెలల క్రితం తండ్రి కూడా పోయేసరికి, ఎక్కడా సెటిల్ కాలేక వచ్చాననీ, ఇక్కడ పని ఇప్పిస్తే ఇక్కడే వుంటాననీ అంటాడు. 


       డానీ చాలా ప్రశ్నించి, గుర్తింపు పత్రాలు చూసి సరేనంటాడు. బిజినెస్  మీటింగుల్లో తన వెంట వుంచుకుంటాడు. సముద్రంలో ఈత కొడతారు. కలిసి సరదాగా గడుపుతారు. డానీ తన కలల గురించి చెప్తాడు. పెద్ద బంగాళా కొనుక్కుని, మనుషులకి దూరంగా ఒక్కడే గడపాలన్న కలలు.

        జూనియర్ డానీ వీళ్ళని గమనిస్తూ వుంటాడు. ఓ రాత్రి ఇంటిని తగుల బెట్టేసి పారిపోతాడు. డానీ పట్టుకుని, వీడికి సైన్ లాంగ్వేజీ నేర్పించాలని తీసుకుని బయల్దేరతాడు, ట్రైన్ ఎక్కించి వదిలేసి వచ్చేస్తాడు.

        ఆయిల్ కంపెనీతో మీటింగ్ కి వెళ్తాడు. వాళ్ళకి ఆయిల్ సరఫరా చేయాలంటే పైపు లైన్ వేయాలి. పైపు లైన్ వేయాలంటే మధ్యలో విలియం బాండీ భూములున్నాయి. విలియం బాండీ కోసం పోతే అతను ఇంటి దగ్గరుండడు. తిరిగి హెన్రీతో గడుపుతాడు. గడుపుతూంటే అనుమానం వేసి నిజం చెప్పమని బెదిరిస్తాడు. తను హెన్రీ కాదనీ, హెన్రీ క్షయ వ్యాధితో చనిపోయాడనీ, తను హెన్రీలా నటిస్తూ ఇక్కడ ఉపాధి పొందాననీ చెప్పేస్తాడు డూప్లికేట్ హెన్రీ. దీంతో అతణ్ణి చంపి పాతి పెట్టేస్తాడు డానీ.

చెట్టుకింద నిద్ర పోతూంటే వచ్చి లేపుతాడు విలియం బాండీ. నువ్వేం చేశావో నాకు తెలుసులే గానీ, అదలా వుంచితే, నీకు పైపు లైను వేయడానికి నా భూములు అవసరం. భూములు కావాలంటే చర్చికొచ్చి నువ్వు మతాన్ని ఒప్పుకోవాలి - అని బ్లాక్ మెయిల్ చేస్తాడు.

***

        2.  పై మిడిల్ 2  కథనం బ్లాక్ మెయిల్ తో పీపీ 2 గా ఏర్పడింది. ప్లాట్ పాయింట్ 2 అంటే మొత్తం మిడిల్ విభాగ మంతటికీ ముగింపు. ఈ పీపీ 2 అనేది మిడిల్ ప్రారంభంలో పీపీ 1 లోని విషయానికి వ్యతిరేకంగా వుండడం స్ట్రక్చర్ అవుతుంది. సాధారణంగా కథల్లో పీపీ 1 దగ్గర పాత్ర ప్రాబ్లంలో పడితే, పీపీ 2 లో పాత్రకి ఆ ప్రాబ్లంకి  పరిష్కార మార్గం లభిస్తుంది. పీపీ 1 లో పాత్ర తానే ఇంకొకరికి ప్రాబ్లం సృష్టిస్తే, పీపీ 2 లో తానే ఇంకా ప్రాబ్లం లో పడుతుంది. అలా ఇక్కడ ఈ గాథలో కూడా డానీ చాలా ప్రాబ్లంలో పడ్డాడు బాండీ బ్లాక్ మెయిల్ తో. పీపీ 1 లో డానీ భూములు కొనడానికి ఇలై ఇంటికి రావడమనే ఘట్టం మతంతో కొట్లాట పెట్టుకోవడమైంది. అడుగడుగునా మతాన్ని అవమానిస్తూ పోయాడు. ఇప్పుడు పీపీ 2 లో అదే మతాన్ని ఒప్పుకోవాల్సిన ఇరకాటంలో పడ్డాడు బాండీ బ్లాక్ మెయిల్ తో. ఇదీ ఈ గాథ మిడిల్ స్ట్రక్చర్ స్థూలంగా.

***


        3.  మిడిల్ 2 ప్రారంభం కొడుకు జూనియర్ డానీ వైద్యంతో వుంది. డాక్టర్ కూడా తేల్చేయడంతో చాలా ఆందోళన పడ్డాడు డానీ. వీడేం తప్పు చేశాడనీ ఈ శిక్ష. ఇంటర్వెల్ పేలుడుతో చమురు సముద్రాలున్నాయనుకోవడం, మతం మీద తనదే గెలుపనుకోవడం విజయంతో ఉత్థానమైతే, ఇప్పుడు ఈ మిడిల్ 2 ప్రారంభంలో కొడుకు సమస్యతో అపజయంతో పతనం. చేసేదిలేక ఇంటర్వెల్ పాయింటుని అందిపుచ్చుకుని, గాథని కొనసాగిస్తూ కంపెనీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాడు. ఇక అందినంతా చమురు తోడుకుందామని.

        ఇప్పుడు ఇలై వచ్చి బాకీ డబ్బులు అడిగాడు. అతడి మీద ఎటాక్ చేసి చిత్తుగా తన్నేశాడు డానీ. కొడుకు చెవిటివాడైన కష్టంలో తనుంటే, మహిమలతో బాగుచేయకుండా వచ్చి డబ్బులు అడుగుతాడా అని కొట్టేశాడు. పాస్టర్ అనికూడా చూడకుండా కొట్టేశాడు. వూహించని షాకింగ్ దృశ్యానికి తెగబడ్డాడు. మిడిల్ 1 ప్రచ్ఛన్న యుద్ధంగా వుంటున్నది కాస్తా, ఇప్పుడు మిడిల్ 2 తో ప్రత్యక్ష యుద్ధంగా ఇలా మారిపోయింది. టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ కి న్యాయం చేస్తూ. స్క్రీన్ టైమ్ గడుస్తున్న కొద్దీ, టెన్షన్ పెరుగుతూ పోవాలన్న రూలు ప్రకారం.

        ఇది డానీ ఉత్థానమే. నైతికంగా కాదు, ఇగో పరంగా. నైతికంగా పాస్టర్ ని కొట్టి పతనం. ఇలైకి ఇది ఇగో పరంగా ఇప్పుడు పతనం. మిడిల్ 1 చర్చి సీనులో అతను మతాన్ని వదిలేసినట్టు సైతానుగా మారాడు. దానికి శిక్షగా డానీ చేతిలో ఇప్పుడు దెబ్బలు. ఎలా చేసుకున్న ఇద్దరి కర్మలే అలా ఈ గాథని నడిపిస్తున్నాయి.

        ఇక్కడ దెబ్బలు తిన్న ఇలై వెళ్ళి రియాక్షన్ గా తండ్రిని కొట్టాడు. పాస్టర్ అయివుండి తండ్రిని కొట్టాడు (పతనం). అతడి అంతం ఇక సమీపించింది...

        ఈ మిడిల్ 2 కథనపు అల్లిక గమనించాలి. చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ గా దేనికదిగా నడుస్తోంది. దీంతో ప్రతీ చాప్టర్ స్పష్టంగా వుంటూ, బలంగా ముద్ర వేస్తోంది. మొదటి చాప్టర్ కొడుకు వైద్యం, రెండో చాప్టర్ డానీ ఇలైని కొడితే ఇలై తండ్రిని కొట్టడం. ఇలా ఒక చాప్టర్ నడుస్తూండగా ఇంకో చాప్టర్ సీను మధ్యలో వేయడం గానీ, ఇంకో రాబోయే చాప్టర్ లోని పాత్రని  తేవడం గానీ జరగలేదు. ఈ విధానం కథకి పనిచేస్తుందా లేదా ఆలోచించాల్సిన విషయం. గాథకి మాత్రం బావుంది.

        ఇలాగే ఇప్పుడు మూడో చాప్టర్ లో డానీ తమ్ముడి నంటూ హెన్రీ రాక. ఇక వీళ్ళిద్దరితో వరసగా సీన్లు వస్తాయి. అన్నదమ్ములుగా ఇద్దరి బాండింగ్. ఆయిల్ బిజినెస్. ఈ చాప్టర్ ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఉత్కంఠ. డానీ తన కలలు హెన్రీతో పంచుకుంటాడు. ఇది జరుగుతూండగా మధ్యనుంచి ఇంకో చాప్టర్ లాగుతాడు దర్శకుడు. కొడుకు జూనియర్ డానీ చాప్టర్.


        ఈ చాప్టర్ లో తండ్రినీ హెన్రీనీ చూస్తూ, చెవిటి వాడైన తను హర్ట్ అవుతాడు జూనియర్ డానీ. తనని పట్టించుకోవట్లేదు తండ్రి. ఇక హెన్రీ తోనే వుంటాడేమో, తను అక్కర్లేదిక. దీన్ని నిజం చేస్తాడు డానీ. ఎప్పుడో పసి తనంలో ఎవడికో పుట్టిన వీణ్ణి లాలించడం వేస్టనీ, పాలల్లో మద్యం కలిపి తాగించేస్తూ వుండిన డానీ, అదే ఇప్పుడు మళ్ళీ చేస్తాడు. పదేళ్ళ ఎదిగిన కొడుకు కళ్ళ ముందే. ఇన్నాళ్ళూ బిజినెస్ కి పనికొచ్చిన వీడు, ఇప్పుడు చెవిటి వాడుగా వేస్ట్ అన్నట్టు, హెన్రీయే ఇప్పుడు అవసరమన్నట్టు, పాలల్లో మద్యం కలిపి, బలవంతగా సీసా నోట్లో కుక్కి తాగిస్తాడు. దీంతో జూనియర్ డానీ డిసైడ్ అయిపోతాడు. ఇక డానీ, హెన్రీ నిద్రపోతూండగా ఇంటికి నిప్పంటించి పరారవుతాడు.

        డానీ పట్టుకొచ్చి, సిటీలో వీడికి సైన్ లాంగ్వేజీ నేర్పేందుకు జాయిన్ చేయాలని తీసుకు బయల్దేరతాడు. కొడుకుతో పాటు ట్రైనెక్కి కూర్చుంటాడు. ఇప్పుడే వస్తాను, ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పి ట్రైను దిగుతాడు. అంతే, మళ్ళీ ఇక రాడు. ట్రైన్ కదులుతూంటే కంగారుగా దిగిపోబోతాడు కొడుకు. ఎవరో వెనక్కి లాగి కాపాతారు. ట్రైన్ వెళ్లిపోతుంది. డానీ కారెక్కి ఇంటికెళ్ళి పోతాడు. కొడుకుని ఇలా వదిలించుకున్నాడన్న మాట. హృదయ విదారకంగా వుండే ఈ ఫ్యామిలీ డ్రామాలో డానీ ఇగోకి మరో విజయం, నైతికంగా పరాజయం. ఇలా కొడుకు చాప్టర్ మరో చాప్టర్ సీను అడ్డురాకుండా, ఏకధాటిగా నడుస్తూ, బ్రేక్ అవని భావోద్వేగాల్ని తారాస్థాయికి తీసేకెళ్ళి ముగుస్తుంది.

***

         4. తిరిగి హెన్రీ చాప్టర్ అందుకుంటుంది. హెన్రీతో గడుపుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకి చెప్పలేక హెన్రీ డూప్లికేట్ గా దొరికిపోతాడు. రెచ్చిపోయి అతణ్ణి చంపి పాతి పెట్టేస్తాడు డానీ. హెన్రీని చూసి కొడుకుని అలా వదిలించుకున్న డానీకి, హెన్రీయే దొంగగా తేలాడు. ఇగో పతనం. కొడుకు నైతిక విజయం. హెన్రీని చంపడం హెన్రీ మీద డానీ ఇగో విజయం. ఈ విజయంతో చాప్టర్ పూర్తయ్యింది.

        ఇంతకీ గాథలో హెన్రీ ప్రవేశం దేనికి? లేకపోతే వచ్చే నష్టమేమిటి? మధ్యలో టైమ్ పాస్ లాగా అన్పించే ఈ చాప్టర్ తో గాథకి ఇంకేదైనా ఉపయోగముందా? వుంది. డానీ బయోగ్రఫీ కోసం, డానీ అధోగతి కోసం. ఈ గాథ మొదట్నుంచీ ఇప్పటి వరకూ డానీ ఎవరో, పుట్టుపూర్వోత్తరా లేమిటో, ఎక్కడ్నించి వచ్చాడో ఏమీ తెలియదు. ఇదెక్కడో చెప్పక పోతే పాత్ర సమగ్రంగా వుండదు. ఎక్కడ చెప్పాలి? ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో పాత్రల పరిచయ క్రమంలో చెప్పేయాలా? సర్వ సాధారణంగా చెప్పేస్తారు తెలుగు సినిమాల్లో. ఇలా చెప్పేస్తే పాత్రతో సస్పెన్స్ పోతుందంటే అర్ధం జేసుకోరు. పాత్ర ఎవరో తెలియక పోతే తెలుసుకోవాలన్న త్రెడ్ తో పాత్రని ఫాలో అవుతూంటారు ప్రేక్షకులు. ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలన్న ధ్యాస వుండాలిగా ముందు కథకుడికి.

        ఆఫ్ కోర్స్, కథతో ఫాలో అవుతారు ప్రేక్షకులు. అయితే ఒక్క కథతో ఫాలో అయితే సరిపోదు. పాత్ర ఎవరో తెలుసుకోవాలన్న సస్పెన్స్ తో కూడా ఫాలో అయితే కథకి డైమెన్షన్ వస్తుంది. ఎప్పటిదాకా ఫాలో అవాలనేది కథని బట్టి వుంటుంది. ఈ గాథలో సెకండాఫ్ లో ఆ టైమింగ్ వచ్చింది.   

 హెన్రీ చాప్టర్ ఇందుకే. అతనొస్తేనే డానీ బయోగ్రఫీ వస్తుంది. ఇలాగాక, డానీ ఎక్కడో తాగుతూ ఎవరికో తన బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవచ్చు. అది పాత్రకి కథకుడు బయటి నుంచి తన వంతుగా అతికించి నట్టవుతుంది. మాట్లు వేసే వాడిలా అతికింపులు అతికించే కథకుడు చీడపురుగు కథకీ పాత్రకీ. వెంటనే కథకుడి మీద ఎండో సల్ఫాన్ స్ప్రే కొట్టాలి. దోమల మందు పెట్టినా సరే.


       హెన్రీ రాకతో డానీ తన గతాన్ని స్మరించుకునే వీలయ్యింది. అతడికో తండ్రీ,  ఆ తండ్రికో ఇద్దరు భార్యలూ వుండే వాళ్ళని మనకి తెలిసింది. తను ఎప్పుడు ఇల్లొదిలేసి వచ్చేశాడో తెలియదు. ఆర్కియాలజీ చేశాడు. అలా అలా ఒక గమ్యం కోసం తిరుగుతూ,  వెండి గనులతో ప్రయత్నం చేసి చమురు దాకా వచ్చాడు. తండ్రి ఇటీవలే చనిపోయాడని ఇప్పుడు హెన్రీ చెప్పేదాకా తెలీదు.

        ఇలా డానీ బ్యాక్ గ్రౌండ్ తెలియడానికి ఈ చాప్టర్ ఉపయోగపడింది. ఇంకా డానీ గురించి ఇంకో పార్శ్వం తెలియకుండా వుండిపోయింది : అతడి ఇన్నర్ డ్రీమ్ వరల్డ్ ఏమిటో మనకి తెలియదు. అది తమ్ముడికేగా వెల్లడించుకో గలడు. ఎక్కడో పెద్ద బంగళా, మనుషులకి దూరంగా ఏకాంతంలో జీవితం...అయితే ఒక లోటు వుందని కూడా చెప్తాడు. బంగాళాలో ఆడుకుంటూ తన పిల్లలు...అంటే అతడికి పెళ్ళి చేసుకోవాలని వుంది. కానీ సంపన్నుడుగా ఎదగాలన్న కోరిక పెట్టుకుని పెళ్ళిని తెగ నిర్లక్ష్యం చేశాడన్న మాట.

        అతడి లోపలి మనిషిని మనమిలా చూశాక, అతడ్ని చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియదు మనకిప్పుడు. లోలోపల దాచుకునీ కల లు చూస్తే అలా వున్నాయి, వాటి కోసం చేసే పనులు చూస్తే ఇలా వున్నాయి....

        ఇప్పుడు హెన్రీని చంపి హంతకుడు కూడా అయ్యాడు. ఇలై లాగే ఇతడి అంతం కూడా సమీపించింది ఈ మిడిల్ 2 లో. ప్రత్యర్ధులిద్దరి క్యారెక్టర్స్ జర్నీ సమాంతరంగా సాగుతున్నట్టు గమనించాలి. మిడిల్ 2 సంఘర్షణ అంటే మిడిల్ 1 కంటే హై డిగ్రీ సంఘర్షణ. మర్డర్ అంత పతాకస్థాయికి తీసికెళ్ళే అంతటి సంఘర్షణ ఇంకోటి వుండదు. ఇలా డానీని హంతకుడుగా అథోగతిన పడేయడం కోసం కూడా హెన్రీ రాక, అతడి చాప్టర్ తప్పవు.

***

        5. ఈ హత్య కనిపెట్టిన విలియం బాండీ వచ్చి, డానీని బ్లాక్ మెయిల్ చేయడం డానీకి పీక్కోలేని ఇరకాటం. మతానికి ముడిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు బాండీ. దొరికావురా మతాన్ని అవమానిస్తావురా, ఇప్పుడొచ్చి మతాన్ని ఒప్పుకుని, పాపినాని క్షమించమని వేడుకో- అనే టైపులో బాండీకి చిక్కాడు డానీ. ఇప్పుడేం చేస్తాడు?  మతానికి లొంగిపోతాడా? బద్ధశత్రువు ఇలై చేతుల మీదుగా? ఇది ఎండ్ విభాగంలో చూద్దాం.

సికిందర్

Q :  హాయ్ అండి, ‘ఉప్పెన సినిమా పెద్ద హిట్. కొంత మంది మిత్రులు ఆ సినిమాను తిడుతూ ఇంకా ఎన్ని రోజులు ఈ పాత సినిమాలు, పాత సీన్స్ తో తీస్తారు అన్నారు. కొంత మంది ఇంటర్, డిగ్రీ కుర్రాళ్ళను అడిగితే అందరూ మాకు సినిమా బాగా నచ్చిందని అన్నారు. ఒక సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే అందులో ప్రేక్షకుడికి నచ్చే అంశాలు ఉండే ఉంటాయి అని నా నమ్మకం. ఒక విశ్లేషకుడిగా ఆ సినిమా మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
మహేష్, రైటర్
          A : మేల్ ఇగో లేదా సెల్ఫ్ పీటీ. మేల్ ఇగోతో వుండే వాళ్లకి తామే పరిస్థితుల్లో వున్నా అమ్మాయి తమ కోసమే వుండాలన్న మైండ్ సెట్ తో కావచ్చు;  ప్రస్తుతం దయనీయ స్థితిలో వున్న వాళ్ళకి అమ్మాయి తమ పట్ల జాలితో వుందన్న సెల్ఫ్ పీటీ వల్ల కావచ్చు - సినిమాని హిట్ చేసి వుంటారు. 
***