రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, అక్టోబర్ 2020, ఆదివారం

990 : సందేహాలు- సమాధానాలు


 

       Q : ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో వంటి సినిమాల రివ్యూస్ ఇవ్వొచ్చుగా, సంక్షిప్తంగానైనా?
ఎపి, అసోసియేట్
       A : ఇలాటివి చూసి చూసి రాసి రాసి వున్నాం. ఇంకా ఇలాటివి చూస్తే రాయ బుద్ధిగావడం లేదు, ఏం చేద్దాం. ఇవి చూసి మీరైనా నేర్చుకునేదేమిటి? నిర్మాణమా, కథాకథనాలా, మార్కెట్ - క్రియేటివ్ యాస్పెక్ట్సా? ఏం నేర్చుకుంటారు. మీరే నేర్పగల స్థాయిలో వుంటారు. కాబట్టి ఏదైనా రవంత నేర్చుకోదగ్గ సినిమాలుంటే వాటి గురించి చెప్పుకోవడం బెటర్. సినిమా లవర్స్ ప్రతీ సినిమా చూస్తూ కాలక్షేపం చేస్తారు. సినిమా మేకర్స్ ప్రతీ సినిమా చూడరు, మాట్లాడరు. 

     Q : నావి రెండు ప్రశ్నలు. 1. రోజే (అక్టోబరు 24) ఆహా ఓటిటి లో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా చూశాను. అయితే సినిమాలో చోట హీరో పాత్ర 'నేను కథానాయకుడుని కాదు, కథా వస్తువుని మాత్రమే అని డైలాగ్ చెబుతాడు. మరి వాళ్ళు తెలిసి అలా డైలాగ్ వాడారో లేక తెలియకుండా చెప్పించారో గానీ, సినిమా మాత్రం మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోయింది. అసలు కథానాయకుడు, కథావస్తువు ఏమిటో వివరించగలరు. 

    2. ప్రేమ సినిమాలలో ఎంత చెత్త సినిమా అయినా కూడా లవర్స్ కలుసుకోవడం, ప్రేమలో పడటం, తర్వాత విడిపోవడం, మళ్లీ కలుసుకోవడం ఉంటుంది. నిజానికి ఇంటర్వల్ కి వాళ్ళు  ప్రేమలో పడ్డాక, వాళ్ళ ప్రేమకు ఏదో అడ్డంకి వస్తుంది. కానీ కలర్ ఫోటో సినిమా లో ఇంటర్వల్ టైమ్ కు హీరో హీరోయిన్ల ప్రేమ స్టార్ట్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్ సగానికి పైగా ప్రేమించుకోవడానికే సరిపోయింది. వాళ్ల మధ్య సమస్య వచ్చేసరికి క్లయిమాక్స్ వచ్చేసింది. స్ట్రక్చర్ ఫాలో అవకపోతే ఇంత దారుణంగా ఉంటుంది వ్యవహారం. కొంచెం ప్రేమకథ సినిమాలకు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నది వివరించండి.       
విడి, అసోసియేట్
    A : 1. నేను కథానాయకుడుని కాదు, కథా వస్తువుని మాత్రమే అనేది గొప్ప గ్రౌండ్ బ్రేకింగ్, చారిత్రాత్మక డైలాగు అనాలి. దీనర్ధం తెలిసే వాడారా లేదా అనేది దర్శకుణ్ణే అడగాలి. తెలిసి వాడి వుంటే, ఇలా సినిమా తీస్తే ఏమవుతుందో తెలిసే తీసి వుండాలి. దీనర్ధం ఏమిటయ్యా అని నిర్మాతే గనుక అడిగి వుంటే, ఆ నిర్మాతకి దర్శకుడు పూర్తి నిజం చెప్పేసి వుంటే, ఈ సినిమా తీయడం మానేసి పెట్టుబడి భద్రపర్చుకునే వాళ్లేమో. ‘నేను కథానాయకుణ్ణి అంటే కథకి నాయకుడు. అంటే కథని తాను నడిపే యాక్టివ్ క్యారక్టర్. నేను కథావస్తువుని అంటే, తనే కథ, లేదా కథావస్తువు. అంటే కథే/కథావస్తువే తనని నడిపిస్తుంది. అంటే బస్సుని డ్రైవర్ నడిపినట్టు గాక, బస్సే వచ్చేసి డ్రైవర్ ని నడిపినట్టు ఇలాటి సినిమాలు తీసి ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు. అంటే కథావస్తువు లేదా కథ నడిపినట్టూ నడుచుకునే పాసివ్ క్యారక్టరన్న మాట తను. నేను కథానాయకుణ్ణి అంటే అది కథవుతుంది. నేను కథావస్తువుని అంటే గాథ అవుతుంది. కమర్షియల్ సినిమాలకి గాథలు పనికి రావని చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా కథకీ గాథకీ తేడా తెలీక తీసి ఫ్లాప్ చేస్తూనే వుంటారు. ఈ సినిమాలో హీరో కథావస్తువుని అనడం, దీనికి తగ్గట్టే స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ గా వుండడమూ సరిపోయాయి గాథ లక్షణాలకి. కంగ్రాట్స్ చెపుదాం.

     2. ఏ జానర్ సినిమాకైనా స్ట్రక్చరొకటే. బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, వాటి నియమిత నిష్పత్తులు, వాటిలో జరిగే బిజినెస్సులతో కూడిన త్రీయాక్ట్ స్ట్రక్చర్. నిష్పత్తులు గల్లంతయితే మిడిల్ మటాషులు, మటన్ షాపులు, కైమా కొట్టించుకున్న దర్శకుల జీవితాలు. ఈ మిడిల్ మటాషులెప్పట్నించి ప్రారంభమయ్యాయో తెలుసా? 2000 సంవత్సరం నుంచీ రచయితల్ని మూల కూర్చోబెడుతూ, కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం అని తామేనంటూ సినిమా గురించి తెలియని కొత్తకొత్త దర్శకులు- యూత్ సినిమాలంటూ ప్రారంభించిన లైటర్ వీన్ అనే బలహీన ప్రేమ సినిమాల ట్రెండ్ తో. రచయితల్ని మూల కూర్చోబెట్టాక ఇక మిడిల్ మటాషులే మటాషులు ఈ 2020 వరకూ. 2000 కి పూర్వం మిడిల్ మటాషుల్లేవు. 

        ప్రేమ సినిమాల స్ట్రక్చర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ వుండదు. పైన చెప్పుకున్నట్టు అన్ని జానర్లకీ ఒకే త్రీయాక్ట్ స్ట్రక్చర్. జానర్ ని బట్టి స్ట్రక్చర్ మారేది కాదు. జీవితాల్ని బట్టి మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్ మారుతుందా? అదే కాన్షస్ మైండ్, అదే సబ్ కాన్షస్ మైండ్, వీటితో ఆడుకునే అదే ఇగో - ఇదీ మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్. మనిషి బ్రెయిన్ స్ట్రక్చర్ లోంచి ఏర్పాటయిందే వెండి తెరమీద స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. అప్పుడే మనిషి బ్రెయిన్ చక్కగా కనెక్ట్ అవగల్గుతుంది. మనిషి బ్రెయిన్ లాగే కథల స్ట్రక్చర్ శాశ్వతం, సార్వజనీనం. సినిమా కథలనే కాదు, ఇంకే రూపంలో కథకైనా ఇదే స్ట్రక్చర్. ఆధ్యాత్మికంగా ప్రపంచ పురాణాల్లోంచి, జానపదాల్లోంచీ వచ్చిన స్ట్రక్చర్. ఇందుకే స్ట్రక్చర్ గురించి మనమింత పట్టుబట్టేది.

    ఇక ఈ స్ట్రక్చర్ కి లోబడి ఏ జానర్ కా కథనం, జానర్ మర్యాదలు వుంటాయి.  రోమాన్స్ జానర్లో రోమాంటిక్ కామెడీ సబ్ జానర్ కథనం, జానర్ మర్యాదలు వేరు; రోమాంటిక్ డ్రామా సబ్ జానర్ కథనం, జానర్ మర్యాదలు వేరు. వీటి గురించి విపులంగా రోమాంటిక్ కామిడేడ్పులు అన్న వ్యాసం వుంది బ్లాగులో. 

    Q : నేను డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ని. నా ఫ్యూచర్ గోల్ దర్శకుడిని కావడమే. నేను ఒక కథ మొదలు పెడతాను. అది పూర్తి చేయకుండా ఇంకొకటి మొదలు పెడతాను. ఇలా చాలా కథలు మొదలు పెట్టి పూర్తి చేయలేక పోతున్నాను. మీరు ప్రొడక్టివిటీ గురించి పెట్టిన పోస్టు చదివాను. అందులో నా సమస్య తీరలేదు. ఏం చేయమంటారో వచ్చే ఆదివారం చెప్పండి.
రెడ్డి కెఎస్
       
A : చాలా పెద్దగా రాసిన ప్రశ్నని తగ్గించాం. కథ రాయడం గురించి చెప్పమంటే చెప్పవచ్చు గానీ, కథలు పూర్తి చేయలేక పోతున్నమీ వ్యక్తిగత క్రమశిక్షణకి సంబంధించిన సమస్యని వ్యక్తిత్వ వికాస నిపుణుల ముందు పెట్టాలేమో ఆలోచించండి. దర్శకుడు కావాలన్న మీ గోల్ పట్ల మీకు నిబద్ధత లేదేమో, వున్నానిలకడతనం లేదేమో. ఇలా మానసిక కారణాలుండవచ్చు. రాత సమస్యగా కథ పూర్తి చేయడంలో వచ్చే ఇబ్బందులు, వాటి పరిష్కారాల గురించయితే చెప్పొచ్చు. ఈ రాత సమస్య మీకుందేమో చెక్ చేసుకోండి. పూర్తి స్థాయిలో సినాప్సిస్ లేదా ఔట్ లైన్ ముందుగా సిద్ధం చేసుకోక పోతే, రాస్తున్న కథ ముందుకు కదలక పోవచ్చు. అప్పుడు ఈ కథ లాభం లేదని మధ్యలో ఆపేసి ఇంకో కథ మొదలెట్ట వచ్చు. అదీ ముందుకు కదలక ఆపేసి ఇంకోటి మొదలెట్టొచ్చు. ఇలా సాగుతూనే వుంటుంది. ముందు ప్లాను వేసుకోకుండా ఇల్లు కట్టగలరా?   

    ఇదే మీ సమస్య అయితే ఇలా చేయాలి : ముందుగా కథ అనుకోకూడదు, చిన్న ఐడియా తీసుకోవాలి. ఏం ఐడియా తీసుకోవాలా అని ఐడియా కోసం షాపింగ్ చేయవద్దు. అయిడియా మీరు చూస్తున్న, చదువుతున్న, వింటున్న వాటిలోంచి యాదృచ్ఛికంగా మీకు స్ఫురించాలి. అప్పుడే ఒరిజినల్  అయిడియా అవుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. 

    ఉదాహరణకి ఇటీవల ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్, దీనికి పూర్వం ఇంకో రాష్ట్రంలో ఇంకో పెద్ద గ్యాంగ్ స్టర్ ఎన్ కౌంటర్ రెండూ గమనిస్తే ఒకటి అన్పించింది : ఈ గ్యాంగ్ స్టర్స్ బ్లడీ ఫూల్స్. ప్రభుత్వ యంత్రాంగంతో, రాజకీయ పక్షంతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళకోసం తాము చేస్తూ, తమ కోసం వాళ్ళతో చేయించుకుంటూ ఎదురు లేదని విర్రవీగుతారు. తీరా ఇద్దరి బండారం బయటపడే రోజు వస్తుంది. ఎవిరీ మ్యాడ్ డాగ్ హేజ్ టు ఫేస్ అడ్వాన్సుడు డెత్ అన్నమాట. ఆ రోజు రాగానే అదే అధికార యంత్రాంగం, రాజకీయ పక్షం అరెస్ట్ చేసి తీసికెళ్లి ఎన్ కౌంటర్ చేసేసి పునీతమైపోతారు. కాబట్టి ఇలాటి ప్రతీ గ్యాంగ్ స్టర్ ఫూలిష్ గా తన భవిష్యత్ ఎన్ కౌంటర్ కి తనే బాట వేసుకుంటున్నాడని తెలుసుకోని ఒక బలిపశువు. ఈ నీతితో కొత్త గ్యాంగ్ స్టర్ కథ పుట్టవచ్చు.  

    ఇలా థ్రిల్లింగ్ ఐడియా స్ఫురిస్తే ఆపమన్నా ఆపలేరు. తర్వాత ఈ అయిడియాని రీసెర్చి చేయాలి. ఆ తర్వాత సినాప్సిస్ లేదా ఔట్ లైన్ స్ట్రక్చరల్ గా విభజించుకుని (బిగినింగ్- మిడిల్- ఎండ్) రాసుకోవాలి. అప్పుడు ఏం రాయాలో ఎలా రాయాలో పూర్తి బ్లూప్రింట్ చేతికొస్తుంది. దాంతో ఆర్డర్ వేసుకోవాలి. ఇక ఆగమన్న ఆగదు కథ. కాకపోతే ఏ ఆర్నెల్లకో ఒక సారి ఆవులిస్తూ వొళ్ళు విరుచుకుని లేచి పూర్తి చేయడానికి కూర్చోకూడదు. ఒకటే బండ గుర్తు : ప్రాక్టికల్ గా కథ ముందుకు కదలని రాత సమస్య వస్తోందంటే, వచ్చిన ఐడియాకి ప్రారంభ ముగింపుల సినాప్సిస్ లేదా ఔట్ లైన్ రాసుకోలేదనే, లేదా సరిగ్గా రాసుకోలేదనే అర్ధం.

       Q : సినిమా క్రియేటివిటీకి నేను కొన్ని పుస్తకాలు కొన్నాను. అర్ధం గావడం లేదు. బోరు కొడుతున్నాయి. వీటికంటే సినిమాలు చూసి నేర్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను. అర్ధమయ్యే మంచి స్క్రీన్ ప్లే పుస్తకాలు చెప్పండి.
ఆర్ శ్రీనివాస్, అసిస్టెంట్
       
A : సినిమాలు చూసి నేర్చుకోవడం కూడా ఒక పద్ధతి. అదొక స్కూలు. సొంత స్కూలు. ఇంకో పద్ధతి అకడెమిక్ స్కూలు. స్క్రీన్ ప్లే పుస్తకాలు సరదాగా చదువుకునే సినిమా కబుర్లు కావు. స్క్రీన్ ప్లే పుస్తకాలు అకడెమిక్ (విద్యా సంబంధమైన) పుస్తకాలు. ఈ స్కూలుతో ఆసక్తి లేకపోతే అకడెమిక్ పుస్తకాలు బోరే కొడతాయి. కానీ సినిమా క్రియేటివిటీకి అకడెమిక్స్ తో సంబంధముంది. అకడెమిక్స్ లేకుండా సినిమా క్రియేటివిటీ లేదు. కాబట్టి బోరు కొడుతున్నాయనే అభ్యంతరకర మాట మానెయ్యాలి. 

    పోతే, స్క్రీన్ ప్లే పుస్తకాలే కదాని ఏది పడితే అది చదవకూడదు. మార్కెట్ లో చాలాచాలా స్క్రీన్ ప్లే టాపిక్స్ తో పుస్తకాలు ఆకర్షిస్తూంటాయి. 150 స్క్రీన్ రైటింగ్ ఛాలెంజెస్ అన్నాడు ఏమిటో చూద్దామని కొనేస్తే నెత్తినేసి కొట్టుకోవడమే. ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్ అంటున్నాడు చదివేద్దామని చేజిక్కించుకుంటే నెత్తికింద తలగడ చేసుకుని నిద్రపోవడమే. చాలా మంది చేస్తున్న ఘోరమైన నేరాలు- అతి కిరాతకాలు ఇవే. 

    ముందు ఎలిమెంటరీ, తర్వాత హై స్కూలు, ఆ తర్వాత కాలేజీ, ఇంకా తర్వాత యూనివర్సిటీ పుస్తకాలన్నట్టు, ఈ క్రమ పద్ధతిలో ప్రోటోకాల్ పాటిస్తేనే పుస్తకాలు అర్ధమై లాభపడతారు. ముందుగా స్ట్రక్చర్ కి సంబంధించి బేసిక్స్ సులభంగా అర్ధమవడానికి సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే చదువుకోవాలి. రివ్యూలు రాయడానికి మనం బుద్ధిగా చేసిన మొట్టమొదటి పని ఇదే. దీని మీద పట్టు సాధించకపోతే ఇంకేదీ చదవక్కర్లేదు, అర్ధంగావు కూడా. అప్పుడు ఈ స్కూలులో స్క్రీన్ రైటర్ అవుదామన్న ఆలోచన ఇక మానెయ్యొచ్చు.

      తర్వాత ఐడియాని ఎలా నిర్మించాలన్న దాని గురించి ఎరిక్ బోర్క్  ది ఐడియా’ అన్న పుస్తకం, దీని తర్వాత సినాప్సిస్ ఎలా రాయాలన్న దాని గురించి  scriptreaderpro.com అన్న వెబ్సైట్; ఇక ఆర్డర్ వేయడానికి జెన్నిఫర్ గ్రిసాంటీ స్టోరీ లైన్ అన్న పుస్తకం, ట్రీట్ మెంట్ రైటింగ్ కి studiobinder.com అన్న వెబ్సైట్ తీసుకోవచ్చు. 

    దీంతో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అర్ధమవడం పూర్తవుతుంది. ఇది మన వరకు. హాలీవుడ్ లో డైలాగుల్ని కూడా కలుపుకుని స్క్రీన్ ప్లే అంటారు. ఈ స్ట్రక్చర్ అనేది అస్థిపంజరం. అస్థిపంజరం తయారీ అర్ధమైన తర్వాత, దీనికి రక్త మాంసాలద్దడానికి క్రియేటివిటీకి సంబంధించిన పుస్తకాల జోలికి పోవాలి. అప్పటివరకూ ఇప్పుడు చెప్పబోతున్న పుస్తకాల జోలికి పోకూడదు. పై అభ్యాసం లేకపోతే ఏమీ అర్ధంగావు. వీటిని ఈ వరస క్రమంలో చదవాలి : జాన్ ట్రూబీ ది అనాటమీ ఆఫ్ స్టోరీ’, జెఫ్రీ కల్హాన్ ది గైడ్ ఫర్ ఎవిరీ స్క్రీన్ రైటర్ - ఫ్రమ్ సినాప్సిస్ టు సబ్ ఫ్లాట్స్’, రాబర్ట్ మెక్ కీ స్టోరీ’, థామస్ లెన్నన్ -రాబర్ట్ బెన్ గరాంట్ రైటింగ్ మూవీస్ ఫర్ ఫన్ అండ్ ప్రాఫిట్’ అన్న పుస్తకాలు.

     దీంతో పూర్తి స్థాయి సమగ్ర స్క్రీన్ ప్లే విధానాన్ని స్వయంగా అర్ధం జేసుకోవడమో, నేర్చుకోవడమో పూర్తవుతుంది. అప్పుడే అడిషనల్ స్టడీస్ జోలికి పోవాలి. అంటే చేసే తప్పులు, పొరపాట్లు, వాటి పరిష్కారాలకి సిడ్ ఫీల్డ్ ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’, విలియం అకర్స్ యువర్ స్క్రీన్ ప్లే సక్స్ మొదలైనవి. ఈ మొత్తం పుస్తకాల సెట్టుకి ఎనిమిది వేలు వరకూ పెట్టుకోవాలి.    

    అయితే ఎంత హాలీవుడ్ నుంచి స్ట్రక్చర్ తెలుసుకున్నా, దాన్ని తెలుగు సినిమాలకి కస్టమైజ్ చేసుకున్నప్పడే ప్రయోజనం. స్ట్రక్చర్ గురించి ఏం తెలుసుకుంటున్నా, దాన్ని తెలుగు సినిమాలకి ఎలా అన్వయించాలా అని ఆలోచించాలే తప్ప, ఉన్నదున్నట్టు హాలీవుడ్ ని దింపెయ్యకూడదు. దెబ్బతింటారు. సింపుల్ గా చెప్పాలంటే స్ట్రక్చర్ని తెలుగుకి కస్టమైజ్ చేసుకుని ఓన్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేటివిటీకి పనిచెప్పాలి.  

    ఇలా పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయిపోయాం కదాని మార్కెట్లో ఆకర్షించే ఇతర సవాలక్ష పుస్తకాల మీద పడకూడదు. పని చేసుకోవాలి. అవన్నీ చదువుకుంటూ కూర్చుంటే చదవడమే వ్యసనమై రాసే పని, తీసేపని మొదలెట్టలేరు. పుస్తకాలు పట్టుకుని తిరుగుతూ చర్చలు పెట్టుకుంటారు. పనికిరాని మ్యాడ్ మేధావి అయిపోతారు. ఇలాటి శాల్తీలున్నారు. ఈ ట్రాప్ లో పడకుండా అప్రమత్తంగా వుండాలి.

            ఇంతేగాకుండా, గొప్ప స్ట్రక్చరాశ్యులై పోయామని అభిప్రాయం కల్గించకూడదు. అందరూ స్ట్రక్చర్ స్కూల్లో వుండరు. సొంత స్కూళ్ళు వున్నాయి. వాటిదే హవా, వాటివే 90% ఫ్లాపులు. నేర్చుకున్న స్ట్రక్చర్ మీలోనే దాచుకుని, పనిలో ఉపయోగించుకుంటూ పోవాలి. డాంబికంగా స్ట్రక్చర్ అనో పచ్చిపులుసు అనో డిస్కషన్స్ లో అదరగొట్టే పని చేయకూడదు. రాబర్ట్ మెక్ కీ మాట గుర్తుంచుకోవాలి : విలుకాడు విలువిద్య నేర్చుకునే వరకే అందులో వుండే సాంకేతికాలు చర్చిస్తాడు. నేర్చుకున్న తర్వాత బాణాలేయడం దానికదే అలవాటైపోతుందే తప్ప, అందరి ముందూ నేర్చుకున్న శాస్త్రం వల్లె వేస్తూ బాణాలేయడు. ఆటోమేటిగ్గా వేసేస్తాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి (మనమంటే ఈ బ్లాగులో రాయాలి కాబట్టి వివిధ భంగిమల్లో ఇలా శాస్త్రాభినయం చేస్తున్నాం, బయట నోర్మూసుకుని వుంటాం).      

    అప్పుడు వృత్తిలో స్థిరపడ్డాక, వృత్తి ప్రయాణంలో అప్డేట్ అవుతూ వుండడానికి, తీరిక దొరికినప్పుడు ఇతర సవాలక్ష పుస్తకాలు నవలల్లాగా చదువుకుంటూ వుంటే ఇబ్బంది లేదు. (ది నట్షెల్ టెక్నిక్’, మేకింగ్ ఏ గుడ్ స్క్రిప్ట్ గ్రేట్ వంటివెన్నో). స్క్రీన్ ప్లే పుస్తకాలనే కాదు, కెమెరా, ఎడిటింగ్, సౌండ్ మొదలైన సాంకేతికాలకి సంబంధించిన పుస్తకాలూ చదవొచ్చు. ఇంకా వెబ్సైట్స్ చూడొచ్చు. సినిమా రచనా సాహిత్యం ప్రపంచంలో ఒక్క హాలీవుడ్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఎందుకంటే ఇతర దేశాల్లో రాయడానికి స్ట్రక్చర్ వుండదు. ఆ సినిమాలు ఎక్కడికక్కడ సొంత స్కూలు సినిమాలు. వీటికి రచనా సాహిత్యం వుండదు. ఉదాహరణకి వరల్డ్ మూవీస్.

    కమర్షియల్ సినిమాలకి అంతర్జాతీయ మార్కెట్ గల భారీ పరిశ్రమ అయిన ఒక్క హాలీవుడ్ మాత్రమే సొంత స్కూళ్ళు పెట్టకోకుండా సార్వజనీన, సార్వకాలిక మన్నికగల స్ట్రక్చర్ సాహిత్యం (సినిమా రచనా సాహిత్యం) తోబాటు, వివిధ శాఖల టెక్నాలజీ సాహిత్యం -అంటే కెమెరా, ఎడిటింగ్, సౌండ్ వగైరా - అందించగలదు. ఎక్కడి ఫిలిమ్ స్కూల్లోనైనా కోర్సులుండేది స్ట్రక్చర్ సాహిత్యంతోనే. క్రియేటివ్ ఫీల్డు నిత్య అధ్యయనం ఫీల్డు. స్టిరపడ్డాం కదాని అప్డేట్ అవడం మానేస్తే అవుట్ డేటెడ్ అయిపోతారు.

సికిందర్