రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, May 28, 2019

832 : స్క్రీన్ ప్లే సంగతులు

    “నా పేరు సీత - నే గీసిందే గీత!” అని సీత ఊతపదం. కానీ ఎమ్మెల్యే పెట్టే ట్విస్టులకి తనే పరుగులు తీస్తూ వుంటుంది. ఇదలా వుంచితే, ప్లాట్ పాయింట్ వన్ లో సీత భూటాన్ బయల్దేరడం చూశాం. ఈ ప్లాట్ పాయింట్ వన్ లో కథని ప్రారంభించడానికి సీతకి సమకూరిన కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే నాల్గు గోల్ ఎలిమెంట్స్ ఎలా వున్నాయో చూద్దాం. ఈ దృశ్యంలో సీతకి మంగళ సూత్రం మాత్రమే దక్కి, ఐదు వేల కోట్లూ మంగళ హారతి అయిపోయాయి. తండ్రి ఈ ఆస్తిని భూటాన్ లో రామ్ అనే వాడికి రాసేశాడు. కథలో ఇంతవరకూ భాగ్యరాజ్ రామ్ కేమవుతాడో మనకి రివీల్ చేయలేదు. ఇప్పుడు సీత తల్లి మంగళ సూత్రమని సీతకి చెందేలా వీలునామా రాసి చనిపోవడం చూస్తే, సీతకి తండ్రి అవచ్చని ఒక అనుమానం వేస్తుంది. అప్పుడు రామ్ కేమవుతాడు తెలుగు సినిమా ప్రకారం మేనమామే అవుతాడు. ఇప్పుడు సీతారాములు బావామరదళ్ళే  అవుతారు సినిమా ప్రకారమే.


        ఇది ఆడియెన్స్ కి ఇంకా రివీల్ చేయకపోయినా ఈ సీన్లో సీతకీ, లాయర్ కీ తెల్సు. సీతకి ఇంకా చాలా తెల్సు. ఇంకా మనకి చూపెట్టని ఫ్లాష్ బ్యాక్ ప్రకారం, ఈ ఆస్తి ఆల్రెడీ ఎవరి పరమై వుందో ఆమెకి బాగా తెల్సు. తను ఏం చేస్తే ఆస్తిని అనుభవించగలదో కూడా స్పష్టంగా తెల్సు. బావ అయిన రామ్ ని చేసుకుంటేనే ఆస్తిని అనుభవించ గలదు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఇదంతా తండ్రి చెప్పేశాడు. సీత సొంతంగా ఎదగడానికి యాభై కోట్లు అడిగినప్పుడు జరిగిన విషయమిది. అప్పుడు ఆస్తి మ్యాటర్ చెప్పేసి, తన సొంత డబ్బు ఏడు కోట్లూ ప్లస్ హైదరాబాద్ లో వుండడానికి ఇల్లూ ఇచ్చేసి పంపించేశాడు మాట వినని సీతని. ఏడాదికల్లా వంద కోట్లు సంపాదించి చూపిస్తానని చెప్పేసింది. 

          ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీను చూసినప్పుడు, తండ్రి మరణ వార్త విని ఐదువేల కోట్లూ తనవే నని, దాంతో చందూలాల్ అప్పు ఐదు కోట్లూ తీర్చేస్తాననీ చెప్పి వచ్చింది. అలా ఎలా అనుకుని వస్తుంది - ఆస్తిని ఆమె పెళ్ళితో లింకు పెట్టి తండ్రి చెప్పేశాక? ఆస్తి రామ్ దని తెలిశాక? అసలు తండ్రి ఇచ్చిన ఇల్లే అమ్మేసి చందూలాల్ అప్పు తీర్చేయవచ్చుగా? 

          ఇంకా రివీల్ చేయని ఈ ఫ్లాష్ బ్యాక్ నేపధ్యంలో, విషయాలన్నీ తెలిసిన సీత, తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసి, తండ్రి కిచ్చిన మాట గుర్తుచేసుకుని దండం పెట్టుకోవాలి (ఆమెకి  డబ్బే కావాలి, ఇలా చెయ్యదంటే కుదరదు. పాత్రకి అప్ అండ్ డౌన్స్ వుంటాయి నైతిక ప్రతిపాదికన) పెట్టుకుని, లాయర్ వీలునామా చదవబోతే, ‘అదంతా నాకు తెల్సు, మా అమ్మ మంగళ సూత్రమిలా ఇవ్వం’ డని తనే అడిగి తీసుకుని భూటాన్ బయల్దేరాలి. 

          కానీ ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో ఇలా జరగలేదు. ఇలా చేయకుండా సీత,  ఐదువేల కోట్ల ఆస్తి నీకు రాయలేదని లాయర్ అనగానే షాక్ అవుతుంది. నిజానికి ఇంకా ఫ్లాష్ బ్యాక్ తెలియని ప్రేక్షకులకి ఇలా షాక్ ఇస్తే, ప్లాట్ పాయింట్ వన్ కి బావుంటుందని కవిహృదయం కావొచ్చు. విషయం తెలీని ఆడియెన్స్ కి, విషయమంతా తెల్సిన సీతతో ఇలా నకిలీ షాక్ ఇప్పించడం. అప్పుడామె మనసులో అనుకునే వుంటుంది- నాకు లోగుట్టు తెలుసు. కానీ దర్శకుడి ఆదేశాల మేరకు ఆడియెన్స్ ని డూప్ చేయడానికి, ఆత్మ వంచన చేసుకుని నకిలీ షాక్ నటిస్తున్నానని!  అసలు తండ్రి మాట ప్రకారం రామ్ ని చేసుకుని అంత ఆస్తినీ అనుభవించెయ్యడానికి వచ్చిన అభ్యంతర మేమిటో అర్ధం గాదు. ఏ మనీ మైండెడ్ అమ్మాయైనా ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంటుంది. మనీ మైండెడ్ అమ్మాయనే కాదు, డబ్బు పిచ్చి వున్న ఎవరైనా ఛాయిస్ కోరుకోరు, ఛాన్స్ కొట్టేస్తారు. అసలీ పాత్ర క్యారెక్టర్ బయోగ్రఫీయే సరిగా లేదు. ఎప్పుడెలా తోస్తే అలా నడిపించేసినట్టుంది. 

          కథనం ఇంత గందరగోళంగా వుంటే, ఈ చిక్కులు విదదీసి వివరించడం కష్టమైపోతుంది. చదివే వాళ్ళకీ అర్ధమవడం కష్టమైపోతుంది. ‘మహర్షి’ తో కూడా ఇదే ప్రాబ్లం. 

        ఇప్పుడు సినిమాలో చూపించిన ప్రకారమే, ఈ ప్లాట్ పాయింట్ వన్ కొచ్చేసరికల్లా సీత ఎమోషనల్ మజిలీ ఏమిటి? ఆస్తి పొందుదామని వస్తే ఆస్తి ఇంకెవరికో పోయింది. ఇంతకన్నా ఎమోషనల్ సెట్ బ్యాక్ లేదు. 1. ఆమె కోరికేమిటి? చందూలాల్ అప్పుతీర్చేసి ఎమ్మెల్యేని దెబ్బ కొట్టడం. ఇది జరిగే పనేనా? దీంతో ఎమ్మెల్యే ఆగుతాడా? సమస్యకి మూలాన్ని పెకిలించి వేయక,  దాని సైడ్ ఎఫెక్ట్స్ కి చికిత్స చేయడమేమిటి? తను రాసిచ్చిన అగ్రిమెంట్ పత్రాన్నే చెల్లకుండా చేస్తే, ఎమ్మెల్యే పీడా విరగడై పోతుందిగా? అప్పుడీ చం దూలాల్ ఎవడు?  కాబట్టి ఈ ప్లాట్ పాయింట్ వన్ కథా ప్రారంభంలో,  సీత గోల్ ఎలిమెంట్స్ లో మొదటిదైన ఆమె పెట్టుకున్న కోరిక నిర్వీర్యమై పోయింది. 

          కోరికే నిర్వీర్యమై పోయాక ఇక గోల్ ఏముంటుంది? లేని గోల్ కి 2. పణంగా పెట్టాల్సిం దేముంటుంది? లేని గోల్ కి 3. పరిణామాల హెచ్చరి కేముంటుంది? గోలే లేకపోయాక  ఇక 4. ఎమోషన్ ఏముంటుంది?  కాబట్టి గోల్ ఎలిమెంట్స్ నాల్గూ లేవు, గోలే లేదు. ఇందుకే చందూలాల్ బాకీ గురించి ఈ కథ నడపకూడదని ముందు నుంచీ చెబుతున్నది. అసలీ బాకీ కథ సినిమా స్థాయి కథ కాదని కూడా చెప్తున్నది. 

          ఇప్పుడామె కల్పించుకున్న ఫిరాయింపు  గోల్ ఏమిటి? నేతలు పార్టీ ఫిరాయిస్తారు. ఇలాటి సీతలు గోల్ ఫిరాయిస్తారు. రామ్ కి రాసిన ఆస్తిని తను రాయించుకోవడమే ఇప్పుడు సీత ఫిరాయిస్తున్న గోల్. ఇదామె ఇక్కడ చెప్పదు. పైగా వాణ్ణి పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అనేస్తుంది. అసలామె వచ్చిందే ఆస్తికోసం. దక్కింది మంగళ సూత్రం. అది తీసుకుని కోపంతో వెళ్ళిపోతుంది. ఇంత అవమానం జరిగాక మంగళ సూత్రం ఎందుకు తీసుకుంటుంది. లాయర్ మీదికే విసిరేసి వెళ్లిపోవాలి. మళ్ళీ వచ్చి తీసుకోవాలి.  అప్పుడు ‘వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి అనుకుంటున్నారేమో...నా మదర్ సెంటిమెంటుతో మాత్రమే దీన్ని తీసుకుంటున్నా’ అనేస్తే క్యారెక్టర్ బాగా అర్ధమయ్యే అవకాశముంది. క్లయిమాక్స్ దగ్గర్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. దాని ప్రకారం తల్లి బుద్ధులే తన కొచ్చాయి. ఈ జస్టిఫికేషనుతో, ఇంత అవమానం జరిగినా మళ్ళీ వచ్చి మంగళ సూత్రం తీసుకెళ్ళడానికి ఆర్ధముంటుంది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ తెలియని ప్రేక్షకుల పాయింటాఫ్ వ్యూలో - ఏదో ప్లానేస్తోంది సీత అన్నట్టు వుంటుంది. 

       ఇప్పుడు సీత కల్పించుకున్న కొత్త గోల్ ప్రకారం ఎలిమెంట్స్ చూద్దాం : 1. కోరిక వచ్చేసి, రామ్ కి రాసిన ఆస్తిని తన పేర బదలాయించుకోవడం, 2. ఈ కోరిక సాధించుకోవడానికి  సీత ‘పణం’ గా పెడుతున్నది ఏమీ లేదు. వస్తే ఆస్తి వస్తుంది, రాకపోతే పోయేదేమీ లేదు పెట్టుబడిగా పెడుతున్న శ్రమవృథా అవడం తప్పితే, 3. పరిణామాల హెచ్చరికలేమిటి? ఈ ప్రయత్నంలో తానెర్కోబోయే అత్యంత తీవ్ర పరిణామాలేవై వుండొచ్చు? చీటర్ గా అరెస్టయి జైలు కెళ్ళవచ్చు. కానీ ఇలా జరగనివ్వడు ఎమ్మెల్యే. తనకింత డబ్బొస్తోందని తెలిస్తే  ఇక సహజీవనం కాదు, ఎత్తుకెళ్ళి ఇదే మంగళ సూత్రం ఇదే తన మెళ్ళో కట్టేయ వచ్చు, 4. ఏ ఎమోషన్ తనని ఈ గోల్ కి పురిగొల్పుతోంది? ఇప్పుడు చందూలాల్ బాకీ ఒక ఎమోషనే కాదు, ఈ నడమంత్రపు సిరితో దిమ్మదిరిగే రిచ్ అయిపోతుంది తను. బాగా రిచ్ అవ్వాలన్న ఏకైక ఎమోషనే కదా తనకున్నది? 

          మరి ఈ గోల్ ఎలిమెంట్స్ ప్రకారమైనా మిడిల్ కథ నడిచిందా అంటే లేనేలేదు. గోల్ ఎలిమెంట్స్ లో కోరిక ఒక్కటి తప్ప మిగతావి కథలో లేవు. పణంగా ఒడ్డిందేమీ లేదు. పరిణామాల హెచ్చరిక ప్రకారం ఆస్తిని కొట్టేసే ప్రయత్నంలో చీటర్ గా అరెస్టయ్యే సూచనలుగానీ, ఇంత ఆస్తి కోసం ప్రయత్నిస్తోందని అసలు ఎమ్మెల్యేకి తెలియడం గానీ లేనే లేవు. ఉన్నదల్లా చందూలాల్ చెక్ బౌన్స్ కేసులోంచి బయట పడే ప్రయత్నాలతోనే కథ! ఇక ఎమోషన్ రిచ్ అవడం గురించి కాక, చెక్ బౌన్స్ కేసులోంచి బయట పడడం గురించే వుంది! 

          ఇలా కూడా ప్లాట్ పాయింట్ వన్ కి బలం లేకుండా పోయింది. అంటే ఇక ఇక్కడ్నించీ ప్రారంభమయ్యే రెండు గంటలా పది నిమిషాల సుదీర్ఘమైన కథకి బలం లేదని ముందే తెలిసిపోతోంది - ప్లాట్ పాయింట్ వన్ ఎనాలిసిస్ ద్వారా.  

         ఇక మిడిల్ - 1 కథనం :  భూటాన్ వెళ్ళిన సీతకి మఠంలో రామ్ (బెల్లంకొండ శ్రీనివాస్)  అమాయక బాలుడిలా ఎదురవుతాడు. పెద్దయాక వచ్చిన సీతని చూసి ఆనందంతో ఒక పాటేసుకుంటాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్న అతణ్ణి ఛీత్కరించుకుని, మంగళ సూత్రం చూపిస్తూ, ‘అసలు మా నాన్నతో నాకు గొడవేంటో తెల్సా?’ అంటుంది నేస్తం రూపతో (మిన్నారా చోప్రా). 

          ఫ్లాష్ బ్యాక్ : వైజాగ్ లో తండ్రి దగ్గరి కెళ్ళి యాభై కోట్లు అడుగుతుంది. రామ్ ని చేసుకుంటానంటే ఇస్తానంటాడు. ససేమిరా అంటుంది. ఐతే నీ దారి చూసుకోమంటాడు. సంపాదించి చూపిస్తానంటుంది. ఎంత సంపాదించి చూపిస్తావంటాడు. వంద కోట్లు అంటుంది. ఎంత కాలంలో అంటాడు. ఏడాదిలోగా అంటుంది. ఏడుకోట్లు సొంత డబ్బు చెక్కు రాసిచ్చేస్తాడు. వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ ఓవర్. 

          ఇది చెప్పి రామ్ దగ్గరికెళ్ళి, ఆస్తి కోసం నిన్నుచేసుకునేది లేదని మంగళ సూత్రం మీద పడేస్తుంది. మఠం గురువుకి విషయం చెప్పేస్తుంది. అతను బయటి ప్రపంచంలో కుట్రలూ కుతంత్రాలూ తెలీని అమాయకుడమ్మా అంటాడు గురువు. వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్లిపోతుంటే ఎమ్మెల్యే కాల్ చేసి, చందూలాల్ చెక్ బౌన్స్ కేసులో అరెస్టు వారెంట్ వచ్చిందని ట్విస్ట్ ఇస్తాడు. వెనక్కి పరుగెత్తు కొచ్చి, రామ్ ని ‘కిడ్నాప్’ చేసుకు హైదరాబాద్ వచ్చేస్తుంది.

          ఇక్కడ బ్యాంక్ కెళ్ళి పోయి, రామ్ డబ్బు తనకి ట్రాన్స్ ఫర్ చేయమంటుంది. రామ్ ఎక్కౌంట్ లోనే డబ్బు లేదు, వీలునామా ప్రాసెస్ పూర్తి చేసుకుని రమ్మంటాడు మేనేజర్. లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆమెని అరెస్ట్ చేయడనికి సీఐ గాలిస్తూంటాడు. సాయంత్రం ఐదింటికల్లా చందూలాల్ డబ్బు కట్టక పోతే అరెస్ట్. నాల్గింటికే కట్టేస్తానని ఆమె ఛాలెంజ్. ఇక్కడ లాయర్ తో లీగల్ ప్రాసెస్ కుదరదు. ఇంకో లాయర్ దగ్గరికి పరుగు. అక్కడ ఆస్తి బదలాయింపు పత్రాల మీద రామ్ సంతకం పెట్టడు. పెళ్లి ప్లానేస్తుంది. గుళ్ళో పెళ్లి డ్రామా చేస్తూ, రూప చేత కాల్ చేయించుకుంటుంది పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారనీ. ఇప్పుడెలా అని ఏడ్చేస్తూంటే, సంతకం పెట్టేస్తాడు రామ్. ఇప్పుడే వచ్చేస్తానని బ్యాంకుకి జంప్ అవుతుంది. మంగళ సూత్రం పట్టుకుని ఆమెకోసం ఎదురుచూస్తున్న రామ్ మీద రౌడీలు కన్నేస్తారు.

          సీత బ్యాంకులో వుందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ విషయం సీఐ కి చెప్తాడు. సీఐ వచ్చేస్తున్నాడని తెలుసుకున్న సీత డీలా పడిపోతుంది. అటు గుడి దగ్గర మంగళ సూత్రం కోసం రామ్ ని కొడుతూంటారు రౌడీలు. ఇంకా అటు హేపీగా వుంటాడు ఎమ్మెల్యే. ఇంటర్వెల్.

పద, సరీగ్గా ఎంట్రీ ఇవ్వు!
     సీత భూటాన్ వెళ్తే అక్కడ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ఎంట్రీ సీను, పాత్ర పరిచయం వ్యూహాత్మకంగా, యూత్ అప్పీల్ తో వుండవు. ఇరవై ఏళ్ళూ మఠంలో వున్నా, చిన్నప్పటి మానసిక స్థితిలోనే వుండిపోతాడు. చిన్న పిల్లాడిలా మారాం చేస్తాడు. అతడికి ఉదయం పదిన్నర కల్లా టీ, రెండు బటర్ బిస్కెట్లు, ఒక ఎర్ర మాత్ర, ఇంకో పచ్చ మాత్రా కావాలి. లేకపోతే ఫిట్స్ వచ్చిన వాడిలా వణికిపోతాడు. అతను ఏదైనా కోరుకుంటే దానికోసం మారాం చేసి సాధించు కుంటాడు. పదిన్నరకి ‘టీ కావాలీ!  టీ కావాలీ!!  టీ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. హైదరాబాద్ వచ్చాక లాయర్ దగ్గరి కెళ్తే  ‘బుక్ కావాలీ! బుక్ కావాలీ!! బుక్ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. ఇంకో లాయర్ దగ్గరి కెళ్తే  ‘టాయిలెట్ కావాలీ! టాయిలెట్ కావాలీ!! టాయిలెట్ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. కోర్టు కెళ్తే జడ్జి ముందు ‘టీ కావాలీ!  టీ కావాలీ!!  టీ కావాలీ!!!’ అని మారాం చేస్తాడు. 

          ఆధ్యాత్మిక గురువు ఇలా తయారు చేసి వదిలాడు. మఠంలో చేరితే మఠం వస్త్ర ధారణలోకి మార్చెయ్యకుండా జీన్సు - టీస్ లో అలాగే వదిలేశాడు. ఇంగ్లీషు మందులతో నయం చేద్దామనుకున్నాడు. ఇరవై ఏళ్లయినా నయం చేయలేకపోయాడు. వాణ్ణి కుదేసి బౌద్ధుల హఠ యోగానే చేయిస్తే, రోగమంతా వదిలిపోయి, స్కిల్స్ డెవలప్ అవుతాయి. మానసికంగా కత్తిలా, శారీరకంగా శక్తిమాన్ లా వుంటాడు. ఈ స్కిల్స్ ప్రదర్శించలేదని కాదు. సీత ‘కిడ్నాప్’ చేసి తీసి కెళ్తున్నప్పుడు, రోడ్డు మీద అడ్డున్న కంటెయినర్ ని ఏనుగులతో కలిసి నెట్టేస్తాడు. ఎవరైనా తన మీదికొస్తే ఫైట్ చేస్తాడు. పుల్లలు కుప్పగా పడేస్తే అవెన్నున్నాయో చూసి చెప్పేస్తాడు. లా బుక్ ఒక్క లుక్కేసి, కోర్టులో కేసు కూడా వాదించి సీతని గెలిపించేస్తాడు. ఇవేవీ వార్కౌట్ కాలేదు. మరోవైపు ఫిట్స్ తో బతుకు బండి లాగిస్తాడు. మానసికంగా కిండర్ గార్టెన్ క్వాలిటీతో వుంటాడు. 

          ఈ స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి? ఇది చూపించలేదు. ఇందుకే హీరో ఎంట్రీ సీను స్కిల్స్ ప్రదర్శనతో పవర్ఫుల్ గా వుండాలనేది. సీత వెళ్లేసరికి కాషాయ వస్త్రధారియై బ్రహ్మాండమైన శారీరక, మానసిక శక్తుల ప్రదర్శన చేస్తూండాలనేది. ఫిట్స్ గిట్సు, కిండర్ గార్టెన్ నాన్సెన్స్ అంతా లేకుండా - సీతకి గట్టి షాకివ్వాలనేది. వీణ్ణి బుట్టలేసుకుని ఆస్తి కొట్టేద్దామని వస్తే, వీడేంటి మనకి మించి వున్నాడని ఆమెకి అన్పించాలనేది. సినిమా ప్రారంభంలో రామ్ ని మఠంలో చేర్పిస్తున్నప్పటి మిస్టీరియస్ వాతావరణం ఇలా పే ఆఫ్ కావాలనేది. ఆ ఓపెనింగ్ ఇమేజి రామ్ పాత్రకి ఇలా బదలాయింపు అయి కలవాలనేది. మఠం అనే ఆధ్యాత్మిక కేంద్రపు ఓపెనింగ్ ఇమేజి, ఇలా భౌతిక వాదపు కథకి కాంట్రాస్ట్ కావాలనేది. సీత భౌతికవాదానికి, ఆమె గోల్ కి -  మఠ వాసియైన రామ్ ఆధ్యాత్మిక వాదం ప్రతిబంధకం కావాలనేది. ఆమె గోల్ కి ఇక్కడే గట్టి బ్రేకు పడాలనేది. ఎంత గట్టి బ్రేకు (పరీక్ష) పడితే పాత్ర అంత ఆసక్తి రేపుతుందనేది. 

          ఎమ్మెల్యేని (విలన్) ని ఎదుర్కోలేక ఇక్కడికొచ్చి, అమాయకుడైన రామ్ ని మాయ చేసి బయటపడదామనుకునే పాత్ర ఓ పాత్రేనా? యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని ఇలా హీరోయిన్ వెంట వుండే,  పప్పుసుద్ద పాసివ్ పాత్రలో ఎవరు చూస్తారు? ఈ పాత్ర నటించి మెప్పించడం సాధ్యం కూడా కాలేదు. సరే, ఇప్పుడిక బెల్లంకొండ శ్రీని
వాస్ ఈ అమాయక పాత్రతో ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అని స్పష్టమైంది.

        మిడిల్ వన్ అంటే కేవలం గోల్ కోసం సమస్యతో జరిగే సంఘర్షణ. కన్పిస్తున్న కథ ప్రకారం చందూలాల్  అప్పు తీర్చడమే గోల్. దీంతో సంఘర్షణే మిడిల్ వన్ కథాంశం. ఇప్పుడు మఠంలో రామ్ అమాయకుడిలా పరిచయమయ్యాక, సీత ఫ్లాష్ బ్యాక్ అసలు విశ్లేషణ ఒక్క ముక్కలో చూద్దాం : ‘అసలు మా నాన్నతో నాకు గొడవేంటో తెల్సా?’ అని చెప్తుంది. ఇందులో రామ్ తో పెళ్లిని తిరస్కరించడమే వుంటుంది. తనకి  డబ్బిస్తే వంద కోట్లు సంపాదించి చూపిస్తాననే వుంటుంది. మరిప్పుడు ప్రాబ్లం ఏమిటి? ఫాదర్ డబ్బిచ్చాడు. ఆ వంద కోట్లు సంపాదించే పనిమీద వుండక, వద్దనుకున్న రామ్ దగ్గరికే  ఎందుకొచ్చింది? ఇక్కడికి తన రాకనే ప్రశ్నించే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవడంలో ఏమైనా అర్ధముందా? అర్ధం పర్ధం, సరైన ప్రణాళికా అంటూ లేని క్యారెక్టర్ వంద కోట్లు సంపాదిస్తుందా? 

          ఇక రామ్ ని ఛీకొట్టి వెళ్లిపోతూంటే, ఎమ్మెల్యే ఫోన్ చేసి చందూలాల్ కిచ్చిన చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ వారెంట్ అంటూ ఇంకో ట్విస్టు ఇస్తాడు (ఈ చందూలాల్ ఎవడండీ బాబూ, ఒకప్పటి కాబూలీ వాలాలాగా ఏనాటి పాత్ర!). అప్పుడు గబుక్కున వెనక్కొచ్చి మాయమాటలు చెప్పి రామ్ ని కిడ్నాప్ చేసి తీసి కెళ్ళి పోతుంది. ఈ పనేదో ముందే చేయవచ్చుగా?  తను పెట్టుకున్న ఆస్తి కొట్టేసే గోల్ కి, ఎంతో ప్లానింగ్ గా వచ్చి,  రామ్ అనే బచ్చాని గభాల్న ఎత్తుకెళ్ళి పోవచ్చుగా? చిన్నపిల్లల కిడ్నాపులు ఎన్ని జరగడం లేదు? ఎమ్మెల్యే ట్విస్టు ఇస్తేనే ఏం చేయాలో తెలిసివచ్చిందా? ఎందుకింత వేస్టుగా భూటాన్ దాకా వచ్చినట్టు? 


          హైదరాబాద్ వచ్చేశాక బ్యాంకెళ్ళి రామ్ ని చూపించి, ఎమౌంట్ తన ఎక్కొంట్ కి ట్రాన్స్ ఫర్ చేయమంటుంది. ‘పోవమ్మా వీడికి ఎక్కౌంటే లేదు, ముందు వీలునామా ప్రాసెస్ చేసుకుని వీడి ఎక్కౌంట్ లో డబ్బు పడ్డాక ట్రాన్స్ ఫర్ చేయించుకో ఫో!’ అని ఇంత రఫ్ గా అనకపోయినా, బాగానే అంటాడు మేనేజర్. సీతమ్మ తెలివి తేటలిలా వున్నాయి. ఐదువేల కోట్ల ఆస్తి వ్యవహారం ఇప్పటికిప్పుడు సాయంత్రం ఐదింటికల్లా తేలిపోకపోతే ఐదుకోట్ల చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అవుతుంది తను! 


          లండన్లో మాల్యా లాగా తను భూటాన్ లోనే వుంటే సరిపోయేది కదా? ‘మిస్టర్ రామ్, నాకు ఐదుకోట్లే కావాలి. వందకోట్లు సంపాదించాక నీ కిచ్చేస్తాను. నీ డాక్యుమెంట్స్  బ్యాంకులో చూపించి నాకు ష్యూరిటీ మాత్రమే ఇవ్వు  చాలు’ అంటే సమస్య చెల్లు కదా? ఆమెకి హైదరాబాద్ లో తండ్రి ఇచ్చిన ఇల్లు వుందన్న సంగతి మర్చిపోదాం విశ్లేషణా సౌలభ్యం కోసం. అలాగే తన దగ్గర డబ్బు లేనప్పుడు చందూలాల్ కి చెక్కు ఎందుకిచ్చిందని కూడా వదిలేద్దాం. అసలు తనేం చేస్తోందో తనకి తెలిస్తేగా?  పదికోట్ల స్థలం తనకుండి  కూడా ఈ పరుగులు. 


          ఎత్తుకున్న ఎకనమిక్స్ కథ కూడా ప్రాక్టికల్ గా, నాలెడ్జబుల్ గా  లేకపోతే ఎలా? అంతా మూస ఫార్ములా రొడ్డకొట్టుడేనా ఇంకా? 


          ఇక ఈమెని అరెస్ట్ చేయడానికి సీఐ తిరగడం, ఎమ్మెల్యే పెట్టిన కామెడీ గ్యాంగ్ సీత ఎక్కడి కెళ్తోందో ఫాలో అయి సమాచారమివ్వడం, ఆ సమాచారాన్ని ఎమ్మెల్యే సీఐకి   అందించడం - ఈ ఇంటలిజెన్స్ నెట్వర్క్ సీక్రెట్ గా ఓ పక్క!


          ఎమ్మెల్యే ఒక లాయర్ దగ్గరి కెళ్ళి, సీత వస్తే ఆపి వుంచమంటాడు సీఐ అరెస్ట్ చేయడానికి. ఈమాట చెప్పడానికి పెద్ద బిల్డప్ సీను, ఒక కాల్ చేస్తే పోయేదానికి. ఐదు వేల కోట్ల ఆస్తికి సీత గీత గీసిందని తెలిసి కూడా, చెక్ బౌన్సు పట్టుకుని కూర్చున్నాడు ఎమ్మెల్యే.  బిగినింగ్ విభాగంలో, డబ్బు తన దగ్గర చాలా మూల్గుతోందనీ, డబ్బు కాదు కావాల్సింది, నీతో సహజీవనమనీ అంటాడు. ఇప్పుడు సీత ఐదువేల కోట్లతో తన కంటే పవర్ఫుల్ అవుతోంటే ఇంకెక్కడి సహజీవనం! 


          ఆ లాయర్ దగ్గరికి సీత రామ్ తో వస్తే, రామ్ టాయిలెట్ కావాలంటూ మారాం చేస్తాడు. లాయర్ ఇద్దర్నీ వెళ్లగొట్టేస్తాడు. ఇంకో లాయర్ దగ్గరి కెళ్తే  బుక్ కావాలీ అంటూ మారాం చేస్తాడు. నిమిషంలో ఆ లా బుక్ లో  చట్టాలు మొత్తం చదివేసి జీర్ణం చేసుకుంటాడు. ఇక్కడ ఆస్తి బదలాయింపు పని పూర్తి చేసుకుంటుంది. ప్రభుత్వంతో పని లేకుండా లాయర్ ముద్ర కొట్టి ఆస్తులిచ్చేస్తాడా!  కానీ రామ్ సంతకం పెట్టడు. దీంతో వొళ్ళు మండిపోయిన సీత ఉత్తుత్తి పెళ్లి ప్లానేస్తుంది. ఈ ఆలోచన రావడానికామె బాత్ టబ్బులో ఐసు గడ్డల మధ్య పవళించాల్సి వచ్చింది.  భూటాన్ మంచుకొండల మధ్య ఎప్పుడో రావాల్సిన ఆలోచన. వచ్చుంటే ఇంతవరకూ రోమాంటిక్ కామెడీ వుండేది. 


          గుళ్ళో పెళ్లి డ్రామా నడిపిస్తూ ఫ్రెండ్ చేత పోలీసు లొచ్చేస్తున్నారని కాల్ చేయించుకుని, రామ్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. సంతకం పెట్టేస్తాడు. మంగళ సూత్రం అతడి చేతిలో పెట్టేసి సంతోషంగా బ్యాంకుకి జంప్ అవుతుంది



       ఈ మిడిల్ వన్ ని ఇంకా విశ్లేషిండం అవసరం లేదు. ఒక్క పూటలో ఎన్నెన్ని జరిగి పోతున్నాయి. ఎన్నెన్ని ట్విస్టులు. అప్పుడే బ్యాంకు పనులు, అప్పుడే లాయర్లతో పనులు, అప్పుడే ఆస్తి బదలాయింపులు, అప్పుడే పెళ్లి పనులు... సెకండాఫ్ లో చెక్ బౌన్సు కేసు కూడా కోర్టులో అప్పుడే గెలిచిపోతుంది సాయంత్రం ఐదింటికల్లా. ఈ మిడిల్ వన్ కథనంలో సంఘర్షణంతా సినిమాకి చాలని ఆఫ్టరాల్ చందూలాల్ చెక్ బౌన్సు కేసుతోనే. ఇదంతా తూతూ మంత్రపు కథనమే. ఐదువేల కోట్లు అనే కిల్లర్ పాయింటు మీదికి వెళ్ళకుండా, ఆమెకి అరెస్టు భయం కల్పించి లొంగ దీసుకోవాలని విలన్ ఆచితూచి కోరుకోవడం; పాత్రచిత్రణ లేక సీత, అసలు పాత్రే కాక రామ్, లేని కథలో పరుగులు పెట్టడం గంటన్నర పాటూ సాగుతూ వుండే ఆ ఫస్టాఫ్ ని  వృధా చేశాయి.  

సికిందర్