రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2019, శనివారం

792 : సందేహాలు - సమాధానాలు


  

Q : నేను కొత్తగా దర్శకత్వం చేపట్టాను. ఐతే డైలాగ్ వెర్షన్ నల్గురితో రాయిస్తున్నాను. రాయించవచ్చా? 

కెఎల్ ఆర్, కొత్త దర్శకుడు
A : రాయించ వచ్చు. ఒక్కరే రాసుకున్నా, పది మందితో రాయించుకున్నా సినిమాలు సక్సెస్ అయ్యేది ఆ 10 శాతమే. కాకపోతే పది మందికి పని దొరికినట్టవుతుంది. సామ్యవాదం అమలవుతుంది. 
Q : ఒక ప్రొడ్యూసర్ నేను చెప్పిన కథ కాదని తను చెప్పిన కథే తీయాలంటారు. ఆ కథ బాగాలేదు. తప్పుకుందామంటే ఎంతో స్ట్రగుల్ చేస్తే వచ్చిన అవకాశం ఇది. ఒప్పుకుందామంటే ఆ కథతో మనస్కరించడం లేదు.  
పి ఎస్, కొత్త దర్శకుడు
A : ఎప్పుడూ వుండే సమస్యే. అయినా మీ కథ బావుందని ఏమిటి నమ్మకం. పది శాతమే హిట్టవుతున్న సినిమాల్లో అదొకటి కాగలదా? ఎలాగూ 90 శాతం స్క్రిప్టులు ఫ్లాపయ్యేవే, కథలు కాదు. కథలతో చేస్తున్న స్క్రిప్టులు ఫ్లాపవుతున్నాయి. కాబట్టి వచ్చిన అవకాశం వదులుకోకుండా ప్రొడ్యూసర్ కథ చేసేయడమే. బాగా లేని కథల్ని బాగు చేసే మార్గాలుంటాయి. మళ్ళీ ఇంకో అవకాశం కోసం స్ట్రగుల్ చేసేకన్నా, ప్రొడ్యూసర్ కథనే బాగు చేయడానికి స్ట్రగుల్ చేస్తే అదొక ఆనందం. చేతిలో డబ్బులు ఆడతాయి. జీవితం హేపీగా వుంటుంది.
Q : అక్టోబర్ 8, 2018 స్క్రీన్ ప్లే సంగతులులో  దొంగరాముడు’ గురించి వివరిస్తూ ముగింపులో మీరిలా రాశారు :ఇలా దొంగరాముడి స్క్రీన్ ప్లే  ఏకంగా చిన్ననాటి కథతోనే బిగినింగ్ విభాగంగా మొదలయ్యింది. ఇది విషాదంగా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది ఒక గోల్ తో. ఇక పెద్దవాడుగా ఎంటరయ్యే దొంగరాముడికి, కథ నడపడానికి ఆల్రెడీ ఏర్పాటైన చిన్ననాటి గోలే అంది వచ్చింది. కనుక, అతడి ఎంట్రీతో ఇక మిడిల్ విభాగం ప్రారంభమైపోతుందన్న మాట! ఎంత సమయం ఆదా, ఎంత బడ్జెట్ ఆదా! అసలు హీరో ఎంట్రీతో ఏకంగా మిడిల్ విభాగం ప్రారంభమైపోయే సినిమా ఇంకేదైనా వుందా? ఇకముందు వుండడానికి ఇదేమైనా  స్ఫూర్తి అవుతుందా?
       ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ వివరించడం కష్టం. అవసరమైతే మీకు ఫోన్లో వివరిస్తాను. అయితే ఒక సందేహం. ఇలా చేయాలంటే తప్పని సరిగా చిన్నప్పటి కథ వుండాలి కదా? కథల్ని చిన్నప్పట్నుంచీ మొదలు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తారు కదా? చిన్నప్పటి కథతో కాకుండా ఇంకో స్కీము ఏదైనా వుందంటారా?
కేఎన్నార్, దర్శకుడు 
A : పైన దొంగరాముడు స్క్రీన్ ప్లే సంగతులు స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగపు క్రియేటివిటీ. ఆ కాలంలో చిన్నప్పటి నుంచీ కథ చెప్పడం వుండేది కాబట్టి దానికీ కొత్త క్రియేటివిటీ. ఈ రోజుల్లో  ఏ క్రియేటివిటీ లేకుండా ఒకే మూసలో చిన్నప్పటి కథలు చూపిస్తున్నారు. ఏమిటా చిన్నప్పటి కథలంటే, చిన్నప్పటి కథల పేరుతో చిన్నప్పుడు హీరో పాత్ర చిత్రణే. హీరో పాత్ర చిత్రణ చేయడానికి చిన్నప్పట్నుంచీ చూపించుకురావాలా? హీరో తెలివైన వాడని చెప్పడానికి ఎలా తెలివైన వాడయ్యాడో చిన్నప్పట్నుంచీ చూపించుకొస్తే తప్ప అర్దమవని ప్రేక్షకులున్నారా? హీరో ఎలా తెలివైన వాడయ్యాడో ఎక్కడా ఎవరికీ అవసరం లేని ప్రశ్న. అతనొక తెలివైన వాడు, అంతే. ఒక్క మాటతో, ఒక్క చర్యతో చెప్పేస్తే  సరిపోతుంది. చిన్నప్పటి కథల పేరుతో అరగంట నిడివికి అయ్యే బడ్జెట్ ని తగలేసే దురాచారం తప్పుతుంది.  పైగా శుభమా అంటూ సినిమా ప్రారంభించి పావు గంటో, అరగంటో ఎవరో చైల్డ్ ఆర్టిస్టుల చేష్టలు చూస్తూ కూర్చునే యువ ప్రేక్షకుల్లేరు. వాళ్ళకి వెంటనే తమ అభిమాన స్టార్ తెర మీదికి రావాలి. ఇలా మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ లేని చిన్నప్పటి కథలెందుకు?


        కాబట్టి చిన్ననాటి కథల పేరుతో పాత్ర చిత్రణలు  చూపించే బదులు ‘దొంగరాముడు’ లోలాగా కథే చెప్పేస్తే, ఆ బిగినింగ్ విభాగపు కథానానికే ప్లాట్ పాయింట్ వన్ కూడా ఏర్పరిస్తే, ఇంకాతర్వాత మిడిల్ లో హీరో ఎంట్రీ తర్వాత గోల్ కోసం ఇంకా బిగినింగ్ చూపించే వృధా తప్పుతుంది. చిన్ననాటి కథకి ఏర్పర్చిన గోలే హీరో గోల్ అయిపోతుంది. అయితే ఈ గోల్ చిన్నప్పుడు సైంటిస్టు అవ్వాలని గోల్ ఏర్పడిందనో, క్రికెటర్ అవ్వాలని గోల్ ఏర్పడిందనో కలల రూపంలో కాకుండా, ‘దొంగరాముడు’ లో లాగా జీవితం ప్రశ్నార్ధకమైన గోల్ గా వుండాలి. 
         అయితే క్రియేటివిటీ దొరికింది కదాని ఇదే వరసలో సినిమాలు తీస్తూపోతే లాభం లేదు. ఒకటి రెండు సినిమాలతోనే  ఈ వెరైటీ, నావెల్టీ అంతా పోతుంది. మళ్ళీ ఇంకో మూసగా తయారవుతుంది. అప్పుడు చిన్నప్పటి కథకి ప్రత్యాన్మాయం ఆలోచించడమే. హీరో గతంలో ఎక్కడో చిన్ననాటి సుదూర జీవితం దాకా ఎందుకు పోవాలి? సమీప జీవితాన్నే తీసుకోవచ్చు. అంటే పదిహేడు దాటిన టీనేజిని కూడా తీసుకోవచ్చు. అప్పుడు జరిగిన కథగా చూపించవచ్చు. ఇప్పుడూ వేరే టీనేజి ఆర్టిస్టుతో అదే సమస్య వుంటుంది – చైల్డ్ ఆర్టిస్టులతో యువ ప్రేక్షకులకి వుండే ఎవర్షన్ సమస్య. అందుకని ‘ఫ్యాన్’ లో షారుఖ్ ఖాన్ ని త్రీడీ స్కాన్ తో ఇరవై ఏళ్ల కుర్రాడిగా చూపించి సంచలనం సృష్టించినట్టు, తెలుగు స్టార్ తో ఈ వెరైటీ ప్రయోగం చేయొచ్చు. స్టార్ టీనేజిలో ఎలా వుండే వాడో చూపించేకన్నా క్రేజీ మార్కెట్ యాస్పెక్ట్ ఏముంటుంది. యువప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే టీనేజీ జీవితం చూపించడం కన్నా క్రియేటివ్ యాస్పెక్ట్  ఏముంటుంది.

 సికిందర్