రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, నవంబర్ 2018, గురువారం

704 : రివ్యూ


రచన – దర్శకత్వం : విజయ్ కృష్ణ ఆచార్య
తారాగణం : అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్, జాకీ ష్రాఫ్, అబ్దుల్ ఖదీర్ అమీన్, లాయిడ్ ఓవెన్, రోణిత రాయ్, తదితరులు
సంగీతం : మానుష్ నందన్, ఛాయాగ్రహణం :
బ్యానర్ : యశ్ రాజ్ ఫిలిమ్స్,
నిర్మాత : ఆదిత్యా చోప్రా
విడుదల : నవంబర్ 8. 2018
***

         బాలీవుడ్ లో ఇప్పుడు చారిత్రక సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్ లో చరిత్ర సృష్టించిన బందిపోట్ల కథల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఒకవైపు సైఫలీ ఖాన్ తో రాజస్థాన్ బందిపోటు ‘హంటర్’ తీస్తూంటే, మరోవైపు  రణబీర్ కపూర్ తో మధ్యప్రదేశ్ బందిపోటు ‘షంషేర్’ ముస్తాబవుతోంది. ఇంకో వైపు ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ నిర్మాణం పూర్తి చేసుకుని ఈ వారం విడుదలై పోయింది. అమీర్ ఖాన్ – అమితాబ్ బచ్చన్ లతో సుప్రసిద్ధ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ ఎపిక్ యాక్షన్ మీదే దేశమంతా దృష్టి పెట్టి వుంది. 210 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో  నిర్మించిన ఈ మెగా పీరియడ్ మూవీ కోసం ఏకంగా రెండు భారీ షిప్పులే  నిర్మించారు. ఇంకా హేమా హేమీలైన నటీనటులూ, సాంకేతిక నిపుణులూ కలిసి అవిరళ కృషి చేశారు.  ‘ధూమ్’ సిరీస్ సినిమాలు తీసిన విజయ్ కృష్ణ ఆచార్య  ఇంత భారీ బాధ్యత భుజానేసుకున్నాడు.  మొదటి రోజు అన్ని ఆటలకి రెండు లక్షల టికెట్లు అమ్ముడుబోయి విడుదలకి ముందే సంచలనం సృష్టిస్తున్న మూవీలో కన్పించే ఈ థగ్గుల ముఠా ఏ మాత్రం ప్రేక్షకుల్ని అలరించారో చూద్దాం...

కథ  
       18 వ శతాబ్దంలో  బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ  చిన్న చిన్న రాజ్యాల్ని కబళిస్తూ రౌనక్ పూర్ మీద కన్నేస్తుంది. బ్రిటిష్ అధికారి జాన్ క్లైవ్,  రౌనక్ పూర్ రాజు మీర్జా బేగ్ ని మోసంతో హతమార్చి రాజ్యాన్ని కాజేస్తాడు. కుటుంబం మీద జరిగిన ఆ ఘాతుకం బారినుంచి సైన్యాధ్యక్షుడు ఖుదాబక్ష్ (అమితాబ్ బచ్చన్) మీర్జా బేగ్ కూతురు జఫీరా (ఫాతిమా సనా షేక్) ని కాపాడి తీసికెళ్ళి పోతాడు. బ్రిటిషర్ల మీద తిరుగుబాటు ప్రకటించి రెబెల్ గా ముఠా కడతాడు. 
          ఒక ఫిరంగీ మల్లా (అమీర్ ఖాన్) అనే ఆవారా మోసకారి వుంటాడు. ఇతను బ్రిటిషర్ల ఏజెంటుగా వుంటూ వ్యక్తుల్ని పట్టిస్తూంటాడు. ఆజాద్ పేరుతో రెబెల్ గా మారిన ఖుదాబక్ష్ ని పట్టించే పనిని బ్రిటిషర్లు ఇతడికే అప్పజెప్తారు. ఫిరంగీ ఆజాద్ దగ్గర మాయోపాయంతో చేరి అతణ్ణి బ్రిటిష్ వాళ్ళకి పట్టించడంతో ఉద్రిక్తతలు నెలకొంటాయి. మోసం చేసిన ఫిరంగిని ఆజాద్ ఏం చేశాడు? అసలు ఫిరంగి ఆంతర్యమేమిటి? బ్రిటిష్ వాళ్ళు ఏమయ్యారు?...ఇదీ మిగతా కథ. 
ఎలా వుంది కథ
          బాలీవుడ్ లో ఇప్పుడు చరిత్రలోకి తొంగి చూసే సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కల్పిత కథలు, కల్పిత పాత్రలూ గ్లామర్ కోల్పోయాయి. వరసకట్టి ఒక అరడజను చారిత్రక సినిమా లు రాబోతున్నాయి. వీటిలో ప్రముఖమైనది ప్రస్తుత మెగా కథ. 1839 లో ఫిలిప్ మీడోవ్స్ టేలర్ అనే రచయిత రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ ఏ థగ్అన్న నవల ఈ మూవీకి స్ఫూర్తి అని  చెప్పారు. థగ్గులనే వాళ్ళు దారి దోపిడీలకి పాల్పడి చంపేసే కౄర హంతక తెగ. వీళ్ళు 600 ఏళ్ళపాటు అవిచ్ఛిన్నంగా దురాగతాలు సాగించారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాకే ఈ తెగని నామరూపాల్లేకుండా అంతమొందించారు. ఈ చరిత్రతో పైన చెప్పుకున్న నవలకీ, ఈ సినిమాకీ ఏ సంబంధమూ లేదు. థగ్గుల గురించి తెలుసుకుందామని పోతే నిరాశే మిగిలుతుంది. కేవలం థగ్స్ అనే పేరుని బాక్సాఫీసు అప్పీల్ కోసం వాడుకున్నారు. అమీర్ పాత్ర థగ్గు కాదు, అతడికో ముఠా కూడా వుండదు. ముఠా వుండేది అమితాబ్ పాత్రకే. అతడిది బ్రిటిషర్ల మీద రెబెల్ పాత్ర. దోపిడీ ముఠాలే లేవు. సింపుల్ గా చెప్పాలంటే  కొందరు సామాన్యులు బ్రిటిషర్లని ఓడించే రొటీన్ కల్పిత ఫార్ములా కథ ఇది. అమీర్, అమితాబ్ లిద్దరివీ కూడా చారిత్రక పాత్రలు కావు. పైన చెప్పుకున్న సైఫలీ ఖాన్, రణబీర్ కపూర్ల చారిత్రక సినిమాల్లో వాళ్ళవి చరిత్రలో నిజ పాత్రలు. నిజ పాత్రల ఉనికి లేకుండా చరిత్ర పేరు చెప్పి సినిమా తీస్తే ఆ కథతో ప్రేక్షకులెలా కనెక్ట్ అవుతారు. ఇంతకంటే అప్పట్లో మనోజ్ కుమార్ తీసిన బ్రిటిషర్లతో  భారీ కాల్పనిక దేశభక్తి ‘క్రాంతి’ సినిమా
చాలా  నయం.
ఎవరెలా చేశారు

      థగ్గులతో చారిత్రాత్మక సినిమా అన్న కలరిచ్చి, ఆ థగ్గుల పాత్రలే లేకుండా అమితాబ్, అమీర్ లని అరిగిపోయిన రొటీన్ ఫార్ములా పాత్రలుగా చూపించడం సగం ఆసక్తిని  చంపేస్తుందీ సినిమా. పాత్రలు ఫ్రీడం, ఫ్రీడం అంటూ వుంటాయి- బ్రిటిషర్ల నుంచి ఇలాటి స్వాతంత్ర్య పోరాటపు సినిమాలు వచ్చీ వచ్చీ ఇక అరిగిపోయాయి. అందుకే చరిత్రలో పోరాటయోధుల్ని వెతికి సినిమాల్ని తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యే 1948 ఒలింపిక్స్ లో,  హాకీలో బ్రిటిషర్లని ఓడించి కసి తీర్చుకున్ననిజ ఆటగాళ్ళ పాత్రలతో ‘గోల్డ్’ తీశారు. ఇది ఎంతో అలరించింది. ఇలాటి చారిత్రక మూలాల్లేని పాత్రలు కాకపోవడంతో అమితాబ్, అమీర్ ల పాత్రలూ నటనలూ తేలిపోయాయి.

        సురయ్యా అనే డాన్సర్ పాత్రలో కత్రినా కైఫ్ చేసే రెండు డాన్సులు అద్భుతంగా వుంటాయి. కానీ పాత్రగా ఆమెకి స్థానం లేదు. స్థానమున్న పాత్రలో జఫీరాగా నటించిన ‘దంగల్’ ఫేమ్ ఫాతిమా చేసే యాక్షన్ సీన్స్ ఉత్కంత రేపుతాయి. జ్యోతిషం చెప్పే శనిచర్ పాత్రలో మహ్మద్ జీషాన్ అయూబ్, బ్రిటిషర్ జాన్ క్లైవ్ పాత్రలో లాయిడ్ ఓవెన్ లు కన్పిస్తారు. ఈ ఆరుపాత్రల చుట్టే కథ వుంటుంది. 
          పాటలూ వాటి భారీ సెట్టింగుల చిత్రీకరణా వొక విజువల్ అప్పీల్. పోరాట దృశ్యాలు అంత అద్భుతంగా ఏమీ వుండవు - ఓడల మీద యాక్షన్ సీన్స్ సహా. కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా వున్నాయి. లోకేషన్స్, కాస్టూమ్స్ వగైరా ఇష్టారాజ్యమే,  ఎందుకంటే చరిత్రతో సంబంధం లేదు కాబట్టి. సంభాషణల పరంగానూ బలహీనమే. అమీర్ కంత్రీ పాత్రకి కూడా డాఈళాఈఊఓ కిక్కులేదు. మనిషి గురించి, జీవితం గురించీ అమితాబ్ వల్లే వేస్తూ వుండే బరువైన డైలాగులు ఇప్పుడెవరికి కావాలి. 
చివరికేమిటి 


 ఈ సినిమా చివరి షాట్ లో అమీర్ ఖాన్  ఓడెక్కి- మనల్ని ఇంతకాలం దోచుకున్న తెల్లవాళ్ళని దోచుకోవడానికి ఇంగ్లాండ్ పోతున్నానంటాడు. ఇదే ముగింపు డైలాగు. దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్యకి ఇప్పుడు బోధ పడిందన్న మాట - థగ్గులతో కథ తీస్తే దోచుకోవడం మీద తీయాలని! అమీర్ ఖాన్ ఆ దోచుకునేదేదో దేశంలో దోచుకుంటున్న బ్రిటిష్ వాళ్ళని దోచుకుంటూ ముప్పు తిప్పలు పెడితే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథ. థగ్గుల చరిత్రలో థగ్గులు  బ్రిటిష్ వాళ్ళ  ఖజానాల్ని గుల్ల చేస్తూంటేనే బ్రిటిషర్లకి కోపమొచ్చి థగ్గుల్ని ఏరి ఏరి  ఫినిష్ చేశారు. ఎలా వుండాల్సిన కథ ఎలా తీశారో. రెండు పెగ్గులేసి పడుకోవాలన్పించే కథ. దీని స్క్రీన్ ప్లే నైతే చెప్పనవసరం లేదు. పైగా మందకొడి నడక. చిన్నప్పుడు ఫాతిమా పాత్ర దసరాకి నా రెండు పళ్ళూడి పోయాయని సెక్యులరిజాన్ని జోడించి చెప్తుంది. పెద్దయ్యాక అదే దసరాకి రావణ దహనం అప్పుడు నిప్పుల బాణం వేసి రావణుడి సహా తెల్లవాడిని దగ్ధం చేస్తుంది. ఇది కూడా గంగా జమున తెహజీబ్ లా బాగానే  వుంది గానీ,  మొదట్లో పళ్ళూడి పోయాయని చెప్పడం దగ్గర్నుంచీ దర్శకుడు కోరలు పీకేశాడు సినిమాకి.
సికిందర్