రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఏప్రిల్ 2018, బుధవారం

637 : సందేహాలు -సమాధానాలు!



Q :       హిందీ రచయిత, దర్శకుడు సాకేత్ చౌదరి ఇంటర్వ్యూ చదివాను. ‘హిందీ మీడియం’  సినిమాలో విద్యా హక్కు చట్టం అనే సందేశాన్ని హాస్యాన్ని జోడించి చెప్పామన్నారు సాకేత్ గారు. 'చావుకు గాని సెక్స్ కు గాని హాస్యాన్ని జోడిస్తే దాని తీవ్రతను కోల్పోతుంది' అని మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు ఏదో నవలలో రాసినట్టు గుర్తు. ఏదైనా సీరియస్ గా చెప్పాల్సిన విషయాన్ని కామెడీ గా చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. సినిమా ద్వారా మనం చెప్పాల్సిన సందేశాన్ని చాలా ఇంటెన్సిటీతో, సీరియస్ గా చెప్పాలనేదే నా స్ట్రాంగ్ బిలీఫ్. ఇది తప్పురా బాబు అని కొరడా పట్టుకుని చెప్తున్నా జనం పట్టించుకోవట్లేదు. అలాటిది కామెడీ గా చెప్తే వింటారా?
అజయ్ (మారుపేరు),  దర్శకుడు

 A :   సినిమా అంటే వినోదమే కదా? వినోదంతో బాటు ఇతర రస ప్రధాన సినిమాలు ఒకప్పుడు ఆడాయి. ఆ రోజుల్లో ‘ఈ చదువులు మాకొద్దు’ అని సీరియస్ గా తీస్తే  చూశారు. ‘చదువు – సంస్కారం’ అని కూడా సీరియస్ గానే తీస్తే చూశారు. అదే ‘ఆకలి రాజ్యం’ నిరుద్యోగ  సమస్యని  వినోదాత్మకంగా తీస్తే చూశారు. ‘ముత్యాల ముగ్గు’ కుటుంబ కథలో తలెత్తే సమస్యలో వుండేది పుట్టెడు శోక రసమే. దాన్ని అలాగే తీస్తే ఎవరూ చూసేవాళ్ళు కాదు. ఆ సమస్యని అద్భుత రసంతో  వినోదాత్మకంగా చూపించడంతో విరగబడి చూశారు.


      ఈ శతాబ్దం యూత్ సినిమాల ట్రెండ్ తో ఆరంభమయ్యింది. ఇది మలి వ్యాపార యుగం. యుగ లక్షణాలకి తగ్గట్టే వినోద సాధనాల రూపురేఖలు మారిపోయాయి. సినిమాలు కేవలం ఒక్క హాస్య రసాన్నే ఒలికిస్తూ ఎంటర్ టైనర్స్ గా మారిపోయాయి. సీరియస్ సినిమాలకి స్థానం లేకుండా పోయింది. కానీ సీరియస్ విషయాలని వినోదాత్మకంగా చెప్పడం ఇప్పుడూ వుంది. ఈ తరం ప్రేక్షకులు చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. వాళ్లకి వినోదమే కావాలి. చిన్న పిల్లలకి ఆటలే కావాలన్నట్టు. పిల్లల్ని వెళ్లి వ్యాయామం చెయ్ అంటే చెయ్యరు. ఆడుకోండి పొమ్మంటే వెళ్లి ఆడుకుంటారు. అందుకని జేమ్స్ బానెట్  ‘ది షుగర్ కోట్’ అనే చాప్టర్ లో ఇలా చెప్పాడు – క్రీడలన్నీ పైకి వినోదాలే అయినా, అంతర్లీనంగా అవి వ్యాయామాలు. మానవజాతి వ్యాయామానికి వినోదమనే షుగర్ కోటింగ్ ఇచ్చి క్రీడల్ని సృష్టించింది. కుర్రాణ్ణి నిలబెట్టి బస్కీలు తీయిస్తే తీయడు. వామ్మో నొప్పీ అని ఏడుస్తాడు. అదే పోయి ఆడుకోమంటే భలేగా ఆడుకుని వస్తాడు. అప్పుడు వాడికి ఆ డుకున్నానన్న ఆనందం వుంటుంది, లోపల వాడికి తెలీకుండా మనకి కావాల్సిన శారీరక సౌష్టవంతో చక్కగానూ వుంటాడు. సినిమాల్లో చెప్పాల్సిన సీరియస్ విషయాల పట్ల కూడా ఇంతే. సీరియస్ విషయాలకి ఎంటర్ టైన్మెంట్ అనే షుగర్ కోటింగివ్వడం.

       నేటి తరం ప్రేక్షకులకి ఇదే మందు. కాబట్టే ‘దంగల్’ లాంటి సీరియస్ క్రీడా చిత్రం అంతటి  హాస్య రస ప్రధానంగా వుంది. తరాల అంతరాల్ని,  పేరెంట్స్ అంటే పిల్లల కన్నెర్రనీ  ఎంత హాస్యాయుతంగా పరిష్కరించారు. 



          ‘హిందీ మీడియం’ కూడా ఇంతే. ఇది వ్యవస్థ మీద సెటైర్. సెటైర్ అంటే సున్నిత ధిక్కారమే. ఇందులో పైకి కన్పించే కామెడీలో అంతర్లీనంగా ఏ సంఘర్షణ వుందో తెలిసిపోతూనే వుంటుంది. కాకపోతే సమస్యకి పరిష్కారం దగ్గర తేలిపోయింది. చదువులెలా వుండాలో చెప్పే సినిమాలు కూడా ఆ దర్శకులు లేదా  కథకులు చదువుకోలేదని నిరూపిస్తున్నాయి. 

          మీరు చెప్పిన మల్లాది గారి అభిప్రాయం ఆయన ఏ సందర్భంలో అన్నారో తెలీదు. ఎందరో బామ్మల చావుల్ని కామెడీగా చూపించిన సినిమాలున్నాయి. అలాగే ఎందరో  విలన్లు కామెడీగా చచ్చిన సినిమాలున్నాయి. కథని ప్రభావితం చేసే చావులైతే  సీరియస్ గానే చూపించాలి. ఇంతవరకూ నిజం. ఇక సెక్స్ తో కామోద్రేకాలని రెచ్చగొట్టాలనుకున్నప్పుడు హాట్ హాట్ గానే చూపించాలి. హాస్యం చేస్తే రస భంగమవుతుంది. అయితే సెక్స్ ని కామెడీ చేసిన సినిమాలెన్ని లేవు. స్క్రూ బాల్ కామెడీలు అవేగా. మల్లాది గారి ‘తేనెటీగ’ ఏమిటి? 

         సినిమా ద్వారా చెప్పాల్సిన సందేశాన్ని చాలా ఇంటెన్సిటీతో, సీరియస్ గా చెప్పాలన్న మీ స్ట్రాంగ్ బిలీఫ్ ని ఎవరూ కాదనలేరు.  కానీ ద్వంద్వాల పోషణతో  ‘దంగల్’, ‘హిందీ మీడియం’, ఇంకా ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ లాంటి సందేశాత్మక వినోదాలు తీయడమే చాలా కష్టం. తీయడం ఎంత కష్టమో,  మెప్పించి కాసులు పండించుకోవడం అంత  సులభం. ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ లో పొట్టి రాజ్ పల్ యాదవ్ కి పొడుగు భార్యతో వుండే ఆత్మ న్యూన్యతా భావం, దాంతో సమస్యలు తెచ్చుకుని  పడే బాధా తీయాలంటే కష్టమైన పనే. ఆ  నవ్విస్తూ ఏడ్పించడమనే  ద్వంద్వాల పోషణే దాని ఘన విజయానికి కారణమైంది. పాత్ర ఏదో సమస్య పెట్టుకుని లోలోపల కుమిలిపోవడం దాని బాధ, ఆ బాధలోంచి బయటపడేదుకు పాల్పడే చర్యలు ప్రేక్షకులకి హాస్య వినోదం.  ‘జో సమ్ బడీ’ లో పిరికివాడైన టిమ్ అలెన్, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని కొట్టాడని, తనూ  బలవంతుడై కూతురి ముందే వాణ్ణి కొట్టాలని చేసే ప్రయత్నాలు ఆ పాత్రకి సీరియస్, ప్రేక్షకులకి నవ్వులు. ఇంత సింపుల్ ఎంటర్ టైనర్ లో ఎంత బలమైన సందేశం, నీతీ వుంటాయో మాటల్లో చెప్పలేం. ఇది ఎన్నోభాషల్లో డబ్బింగ్ అయి ఆడింది. మీరన్నట్టు కొరడా పట్టుకుని సందేశాలూ నీతులూ చెపితే వినకపోవచ్చు గానీ, కథనంలో వాటిని అంతర్లీనం చేసి ఫన్నీగా చెప్తే అంగీకరిస్తారు ప్రేక్షకులు. కానీ ఈ ఇచ్చే సందేశాలతో ప్రేక్షకులు మారాలనుకోవడం అత్యాశే. అయినా స్ట్రాంగ్ బిలీఫ్ తో ఎవరైనా సీరియస్ సినిమాలు తీస్తే మంచిదే. ఒక రకం సినిమాల వొరవడిలో కొట్టుకుపోతున్న ప్రేక్షకులకి అప్పుడప్పుడు కొరడా చరుపు లాంటి సినిమాలవసరమే.

Q :   స్ట్రక్చర్ ఆర్టికల్స్ కి  థాంక్స్. చదివిన ప్రతిసారీ ఓ కొత్త విషయాన్ని నేర్పుతున్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, క్యారెక్టర్ ఆర్క్ అంటే  ఏమిటి? స్క్రీన్ ప్లే లో ఆర్క్ తప్పని సరా?  చాలా కమర్షియల్ సినిమాల్లో ఎలా మొదలైన పాత్రలు అలాగే ముగుస్తాయి కదా ?
అనిల్ (మారుపేరు) అసోషియేట్

A :    చాలా కమర్షియల్ సినిమాల్లో ఎలా మొదలైన పాత్రలు అలాగే ముగియ కూడదనేగా స్ట్రక్చర్ వ్యాసాలు. ఆ కమర్షియల్ సినిమాలన్నీ హిట్టవుతున్నాయా? పది శాతం కూడా హిట్లు వుండడం లేదు. హాలీవుడ్ లో యాభై శాతం హిట్లు ఎలా వుంటున్నాయి?  అక్కడ స్ట్రక్చర్ వద్దంటే తంతారు. ఆ స్ట్రక్చర్ తో హిట్టయ్యే హాలీవుడ్ సినిమాలని తెలుగులో కాపీ కొట్టాలంటే మాత్రం స్ట్రక్చర్ వద్దంటారు. ఏళ్ల తరబడి ఈ వ్యాసకర్త స్ట్రక్చర్ గురించి రాయగా రాయగా చివరికి కనువిప్పయిందేమిటంటే, తెలుగు సినిమాలు పూర్తిగా క్రియేటివ్ కాసారాలు. 90 కాదు, నూటికి నూరు ఫ్లాపైనా ఆ కాసారాల్లోనే కాపురాలుంటాయి తప్ప అది దాటి బయటికి రావు. మీ లాంటి కొందరు స్ట్రక్చర్ పట్ల ఆసక్తితో వున్నారు. స్ట్రక్చర్ అంటే తెలియని నిర్మాతలు మీ స్ట్రక్చర్ లో వేళ్ళు పెట్టి వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకున్నా మీకే చాలా నష్టం. ఇంతా చేసీ మీరు ఏడాదికి 70 మంది కంపల్సరీ కొత్త ఫ్లాపు డైరెక్టర్ల  జాబితాలో చేరిపోయి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్న స్ట్రగులే  చేస్తూ వుండి పోతారు ఇంకో అవకాశం కోసం. స్ట్రక్చర్ వ్యాసాలు ఎంత చదివినా, క్యారెక్టర్ ఆర్క్ ఎంత నేర్చుకున్నా - ముందు మీరు తేల్చు కోవాల్సింది,  స్క్రిప్టుతో మీకుండే స్వేచ్ఛ ఎంతన్నది. స్వేచ్ఛ అనుమానాస్పదమనిపిస్తే, స్ట్రక్చర్ నేర్చుకోవడం మానెయ్యండి. క్రియేటివ్ స్కూల్లో ఆ నిర్మాత, లేదా హీరో కెలాకావాలో అలా చేసేసి చేతులు దులుపుకోండి. 90 శాతం ఫ్లాపుల ప్రవాహం ప్రళయంగా మారిన నేటి పరిస్థితుల్లో ఎదురీదాలనుకోకుండా, అందరితో పాటూ ఆ మునకల్ని మీరూ ఎంజాయ్ చేయండి. సబ్కే సాథ్ సబ్కా వినాశ్, ఇంతే అనుకోండి. 

     క్యారెక్టర్ ఆర్క్ గురించి ఈబ్లాగులో పక్కన సైడ్ బార్ లో కన్పిస్తున్న ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాస గుచ్ఛంలో ‘శివ’ బిగినింగ్ విభాగం స్ట్రక్చర్ ని చదవండి. పాత్ర సమస్యతో సంఘర్షిస్తున్నప్పుడు పడుతూ లేస్తూ పోతూంటుంది. ఈ ఎత్తుపల్లాల ప్రయాణం ఒక ఆర్క్ (చాపం) ని ఏర్పరుస్తుంది. దీన్నే క్యారెక్టర్ ఆర్క్ లేదా పాత్రోచిత చాపం అంటారు. పాత్ర ఎన్ని సార్లు పడింది, ఎన్ని సార్లు లేచిందనే దాని మీద కథనంలో వేగం ఆధారపడుతుంది. మిడిల్ విభాగంలో ఈ ఉత్థాన పతనాలు ఎంత త్వరత్వరగా  జరుగుతూంటే కథనంలో అంత వేగం వస్తుంది. పాత్ర ఒకసారి లేచి పడిపోయాక అలాగే పడుంటే అది పాసివ్ పాత్ర కిందికి దారి తీస్తుంది.  క్రియేటివ్ స్కూలు సినిమాల్లో మీరన్నట్టు,  ఎలా మొదలైన పాత్ర అలాగే ముగుస్తున్నాయంటే అవి అసంపూర్ణ పాత్ర చిత్రణలు. ఇవి ప్రేక్షకుల హృదయాంతరాళ అంచుల్ని కూడా తాకవు. 

          స్ట్రక్చర్ స్కూలు ఏం చెప్తుందంటే,  పాత్ర అనేది మన ఇగో. కథ అనేది ఆ ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చే సాధనం. కథ అనేది ఆ హీరో (ఇగో) అనుభవం. ఆ అనుభవం లోంచి ఆ హీరో (ఇగో)  ఏమీ నేర్చుకోలేదంటే ఏమీ మారనట్టే. ఇందుకే మీరన్నట్టు ఎలా మొదలైన పాత్రలు అలా డొల్లగా ముగుస్తున్నాయి. స్ట్రక్చర్ కథనానికి వాడే ప్రతీ పరికరానికీ ఒక అర్ధం చెప్తుంది, దాని అవసరం ఏమిటో చెప్తుంది. క్రియేటివ్ స్కూల్లో కష్టం. 

సికిందర్