రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

19, జనవరి 2018, శుక్రవారం

588 : స్క్రీన్ ప్లే సంగతులు!



   ఈ స్పీడు యుగంలో యాంత్రికంగా బతకడం అలవాటు చేసుకున్నాడు మనిషి. తన నుంచి తానూ పూర్తిగా వేర్పడిపోతూ దిక్కు తోచని స్థితిలో పడుతున్నాడు. దారీ తెన్నూ తెలీక దొరికిన వ్యక్తిత్వ వికాస పుస్తకమల్లా చదవడం మొదలెట్టాడు. కానీ ఇవే విజయానికి సోపానాల గురించి ఏనాడో పురాణాల్లోనే, జానపద కథల్లోనే రాసిపెట్టారన్న సంగతే గుర్తించ లేకపోయాడు. ఇదీ మనిషి మానసిక దివాళాకోరుతనం. పురాణాలు ఆత్మని కడిగితే, జానపదాలు మేధస్సుని పెంచుతాయి. నిగూఢంగా వున్న మానసిక శక్తుల్ని పైకి లాగి పోరా ఆకాశమే నీ హద్దూ అనేసి బతకడాన్ని బ్యాలెన్సు చేస్తూ జీవిత ప్రాంగణంలోకి ముందుకు తోస్తాయి.

        ఈపని జానపద చలన చిత్రాల తిరుగులేని కథానాయకుడిగా టీఎల్ కాంతారావు కొన్ని వందలసార్లు చేసి వుంటారు. కాంతారావు చేసిన మేలు మనం అప్పుడు తెలుసుకోలేదు గానీ, ఇప్పుడు ఆలోచిస్తే జానపద సినిమాలతో వ్యక్తిత్వ వికాసానికి బ్రాండ్ అంబాసిడర్ కి తక్కువకాని హోదాని తనే ఆనాడే పోషించారు!

         
పని సప్తస్వరాలుతో ఇంకా పరమ నిష్ఠగా చేశారు. సినిమా మొత్తంగా ఒక సైకలాజికల్ విహార యాత్ర. ఇందులోకి ప్రవేశిస్తే మనల్ని మనం తెలుసుకోగలం. నిమిష నిమిషానికీ మన మనసు చేసే మాయ, చిత్ర విచిత్రాలూ- వీటన్నిటినీ ఒక దారిలో పెట్టి, లక్ష్యాన్ని సాధించేందుకు మనం చేసే విశ్వ ప్రయత్నాలూ- దీన్నొక కదిలే బొమ్మల పర్సనాలిటీ క్విజ్ గా నిలబెడతాయి.

         
అలాగని సప్తస్వరాలు ఏవో కత్తులు పాడుకునే సంగీత సమ్మేళన మనుకుంటే కత్తుల మీద కాలేసినట్టే. సప్త స్వరాలు కేవలం మాధుర్యాన్ని చిలికే సరిగమలే కావనీ, సప్త సముద్రాలు, సప్త గిరులు, సప్తర్షులు, సూర్యుడి సప్తమాశ్వాలూ ఇవన్నీ మానవ కోటికి మహత్తర వరాలనీ, సప్త సంఖ్యామయమైన జగత్తే మొత్తంగా సప్తస్వరాల్లో ఇమిడి వుందనీ, సప్త స్వరాలని జయించిన వాడే శారదా పీఠాన్ని అందుకోగల్గుతాడనీ సినిమా కథలోని భావం. మెంటల్ పోస్ట్ మార్టం మేడీజీ అన్నమాట.

      అంతరంగ ప్రయాణం ప్రారంభించే ముందు ఏడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. లేకపోతే అగాథంలోకి పతనం ఖాయం. దీంతో తొలిసారిగా సినిమా నిర్మాణానికి పూనుకున్న కాంతారావు, తన ఉత్తమాభిరుచులేమిటో అడుగడుగునా దృశ్యాల్లో ప్రతిఫలించేలా చేశారు. దీని ఆర్ధిక పరాజయానికి కొన్ని రాజకీయాలు కారణమై వుండొచ్చు, కానీ విషయపరంగా దీన్ని శాశ్వత తత్వానికి ఎదురేదీ లేదు


        ‘దేవదాసు’ లాంటి భగ్న ప్రేమికుడి విషాదాంతంతో బాగా చాలా బాగా - ఏడ్పించేసి వదిలిన వేదాంతం రాఘవయ్య కి, సప్తస్వరాలుగమ్మత్తుగా భగ్నప్రేమికుడి విజయగాథ అయింది! మహా దర్శకుడి చిత్రీకరణలో పాత్రల నిమ్నోత్తమాలు, వాటి తాలూకు భావోద్వేగాలు, అభినయ విలాసాలు, అన్నీ మహోన్నతంగా ఉట్టి పడతాయి. కాంతారావు, నాగయ్య, రామకృష్ణ, ధూళిపాళ, సత్యనారాయణ, జగ్గయ్య, రాజబాబు, బాలకృష్ణ (అంజి గాడు), రాజశ్రీ, విజయలలిత, విజయనిర్మలల బారెడు తారాతోరణంతో రాఘవయ్య దర్శకత్వ లాఘవం మనల్ని కదలకుండా కట్టిపడేస్తుందంటే అతిశయోక్తి కాదు. అదే నీవంటివీ, కృష్ణయ్యా గడసరి కృష్ణయావంటి పాపులర్ గీతాలతో, నృత్యాలతో, సూటిపదాల సంభాషణలతో; రాజకోట, మాంత్రికుడి కళాత్మక సెట్స్ తో, సమ్మోహనకర ట్రిక్ ఫోటోగ్రఫీతో, కత్తి పోరాటాలతో పరిపుష్ట పంచభక్ష్య పరమాన్న విందిది. నిర్మాణ వ్యయాన్ని వేదాంతం ఆరు లక్షలకి పైగా లాగేశారని కాంతారావు వాపోయినా, వేదాంతం ఇచ్చిన విందు ముందు కాంతారావు ఖేదం బేఖాతర్ మనకి!

          విచిత్రంగా జానపదంలో పౌరాణీకాన్ని కలుపుకున్న జానర్ ప్రయోగమిది. దీంతో ఇది ఆథ్యాత్మిక యానం కోసం చేసే మనోవైజ్ఞానిక విహార యాత్రవుతోంది. హాలీవుడ్ చలన చిత్ర రాజం రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్లో ఆథ్యాత్మిక శక్తులున్న ఆర్క్ కోసం జరిపే పోరాటం ద్వారా మహా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఏం చెప్పాలనుకున్నాడో, సరీగ్గా లోక కల్యాణాన్నే ప్రబోధిస్తోంది సప్త స్వరాలుకూడా!
***
       చరిత్రలో హిట్లర్ దురంతాలు ఒక మాయని మచ్చ. చీకటి అధ్యాయం మీద చలన చిత్రాలు అనేకం వచ్చాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్సహా. సినిమాలు రెండు విధాలు : సమూహాల కథలు, వ్యక్తిగత మైన చిత్రణలు. అయితే యూరోపియన్ దర్శకులు తీసే ఒకటి రెండు పాత్రల వ్యక్తిగత కథలే అర్ధవంతంగా వుంటున్నాయని పరిశీలకులు అనేమాట. వ్యక్తీ, అతడి కుటుంబం- గ్రామం- గ్రామంలో కుటుంబం మీద వచ్చిపడిన నాజీ దళాలు- వాళ్ళు పెట్టే చిత్ర హింసలు, మరణాలూఇలాటి పర్సనల్ కథలతో నాటి మారణ హోమాన్ని మరింత దగ్గరగా చేసి చూపించడం యూరోపియన్ సినిమాలు చేస్తూ వచ్చాయి. అలాటి ఒక మరపురాని యూరోపియన్ సినిమానే ఇటలీకి చెందిన  'లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్అనే ప్రపంచవ్యాప్తంగా పాపులరైన మూవీ. హిట్లర్ కాలంలో యూదుల ఊచకోత పై వచ్చిన సినిమాలన్నీ విషాదభరితాలే. లక్షల మంది యూదుల్ని పొట్టన బెట్టుకున్న రక్కసి చరిత్రని వినోద భరితంగా తీసే సాహసం ఎవరైనా చేస్తారా? తీస్తే కచ్చితంగా విమర్శల పాలవడం, మనోభావాలు దెబ్బతినడం, నిషేధానికి గురికావడం వగైరా ఎన్నో ఆటంకాలు ఏర్పడ వచ్చు. దర్శకుడు వెలివేతకి కూడా గురికావచ్చు, దాడులు కూడా జరగ వచ్చు. విషాద చరిత్రని కామెడీ చేయడమంటే మాటలా? కానీ దీనికి సాహసించాడు దర్శకుడు, నటుడూ అయిన రాబర్టో బెనిగ్నీ. ప్రపంచాన్ని ఆశ్చర్య పరచాడు, ఆగ్రహపర్చలేదు. ప్రేక్షకుల్ని లోతుగా తాకాడు, రెచ్చ గొట్టలేదు. ప్రభుత్వాల్ని ఔరా అన్పించాడు, నిర్బంధాలకి గురికాలేదు. అతడి అధ్యయనానికీ,  అయిడియా చెప్పడానికి ప్రదర్శించిన సృజనాత్మకతకీ, కళాత్మకతకీ యావత్ప్రపంచం జేజేలు పలికింది.ఇంతకీ యూదుల ఊచకోత చరిత్రకి ఎలాటి చిత్రణ చేశాడు బెనిగ్నీ? అది హాస్యభరితం ఎలా అయ్యింది? ఇలా హాస్య విషాద రసాలని మేళవించే కళా ప్రక్రియని ఏమంటారు

      ఇక్కడ నటుడిగా సరే, బెనిగ్నీది నిరుపమాన పాత్ర పోషణ. దర్శకుడిగా అతడి పరిపక్వత గురించే చెప్పుకోవాలి. ఎక్కడా కామెడీ వల్ల విమర్శకి తావులేని సన్నివేశ కల్పనా, భావోద్వేగాలూ, సున్నితపు హాస్యమూ బ్యాలెన్స్ చేసి ఎవరూ వేలెత్తి చూపని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఇలాటి హాస్య- విషాద రసాలని మేళవించే ప్రక్రియని రసనఅన్నారు మహాకవి శ్రీశ్రీ. నాజీ రక్కసి అకృత్యాలపై   వచ్చిన అన్ని సినిమాల్లో కెల్లా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ఎందుకు ప్రత్యేకంగా నిల్చిందంటే, రసనప్రక్రియ వల్లే. నాజీల దుష్క్రుత్యాలకి ఇలాటి సృష్టి ఇంకెవరూ చేయలేరు, చేయబోరు కూడా- చేస్తే అది లైఫ్ ఏజ్ బ్యూటిఫుల్కి నకలు అవుతుంది. నిమిషం కూడా ప్రేక్షక లోకం ముందు నిలబడదు.

 ***
     పోకూరి బాబూరావు నిర్మించిన ‘ఎర్రమందారం’ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కొక పాఠం. ఈ కథలో సినిమా బండి రాముడుగా రాజేంద్రప్రసాద్ ప్రవేశించి, ఊరి దొర చేతిలో కీలుబొమ్మయ్యే దళిత సర్పంచ్ గా స్థిర పడి, తిరగబడి, చివరికి చచ్చి పోతాడు. పంచాయితీ రాజ్ వ్యవస్థలో రిజర్వేషన్ల ప్రహసనానికి పాత్ర, సినిమా మచ్చు తునకలు.
          
         ట్రాజడీల్లో పాత్రల మనస్తత్వాల పైన ముగింపులు  ఆధార పడతాయి. మనుషులు మారాలిలో శోభన్ బాబు పాత్ర మరణం, కేవలం శారద పాత్ర మానసిక స్థితి వల్ల  మరో విషాదాంతానికి దారి తీస్తుంది. అదే ఎర్రమందారంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర మరణంయమున  పాత్ర మానసిక బలం వల్ల  విజయానికి దారితీస్తుంది!  వైఫల్య సాఫల్యాలు రెండూ వాటి నేపధ్య బలాలతో సినిమా విజయానికి తోడ్పడతాయి. చాలినంత నేపధ్య బలం లేకపోతే   సినిమాలూ నిలబడలేని ముగింపులు ఎదురవుతాయి. 

         
ఇందులో స్క్రీన్ ప్లే పరిభాషలో చెప్పుకోవాలంటే, యమునది డెడ్ హ్యాండ్- ఆఫ్ పాత్ర. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్ర తాత్కాలికంగా కనుమరుగై, దాని ఆశయ సాధన కోసం ఇంకో పాత్ర కథని కొంతవరకు ముందుకు నడిపించి, తిరిగి ప్రధాన పాత్ర ప్రవేశించగానే ఆశయాన్ని లేదా  విజయ పతాకాన్ని ప్రధాన పాత్రకి అప్పగించి తప్పుకుంటుంది. ఇది హ్యాండ్ ఆఫ్ పాత్ర.  ఇలాకాక ప్రధాన పాత్రే మధ్యలో మరణిస్తే, చివరంటా దాని ఆశయాన్ని ముందుకు నడిపించే డెడ్ హ్యాండ్-  ఆఫ్ పాత్ర యమున పోషించిన పాత్ర లాంటిది. ఇంతకీ కథ ఏ పాత్రది అన్న ప్రశ్న వేస్తే, బాబూరావే ఈ ఇంటర్వ్యూలో  చెప్పినట్టు ఏ పాత్రదీ కాదుఅదొక కథ అంతే! 

         
ఎర్ర మందారంస్క్రిప్టు ఎలా తయారయ్యింది? ఇటీవల  ‘యజ్ఞం’, ‘రణం’, ‘ఒంటరిలాంటి భారీ సినిమాలు నిర్మించిన పోకూరి బాబూరావు అప్పట్లో నేటిభారతం’, ‘రేపటి పౌరులు’, ‘దేశంలో దొంగలు పడ్డారువంటి హిట్స్ కూడా నిర్మించి వున్నారు. ఒకరోజు ఆంధ్ర జ్యోతి’  దీపావళి ప్రత్యేక సంచికలో ఎంవిఎస్ హరనాథ రావు రాసిన లేడి చంపిన పులి నెత్తురుకథ చదివి ఇన్స్ పైర్ అయ్యారు బాబూరావు. 

         
దీన్ని సినిమాగా తీద్దామంటే, దీనికి  సరిపడా సినిమా లక్షణాల్లేవని తోసిపుచ్చారు హరనాథ రావే. బాబూరావు పట్టుబట్టడంతో ఇక తప్పదనుకుని ఆయనతో కలిసి కూర్చుని ఒక ఔట్  లైన్ తయారు చేశారు హరనాథ రావు. అది బాబూరావుకు నచ్చింది. కానీ హరనాథ రావుకి సంతృప్తి కలగలేదు. కథలో లైఫ్ మిస్ అయినట్టు వుందని, డాక్యుమెంటరీలా వుందనీ చెప్పి ఇంకో పది  రోజులు టైం తీసుకున్నారు. అప్పుడొచ్చి పూర్తిగా మార్చేసిన కొత్త ఔట్ లైన్ విన్పించారు. 

         
ఇంతకీ పత్రికలో వచ్చిన అసలు ఒరిజినల్ కథేమిటి? ఊరి దొర చేతిలో భర్తని పోగొట్టుకున్నయువతి,   దొర మీద పగదీర్చుకోవడం అచ్చులో వచ్చిన  స్టోరీ లైన్. ఇందులో పూర్వం జరిగిన భర్త హత్య గురించి రేఖా మాత్రమైన ప్రస్తావనే తప్ప, కథగా వుండదు. పూర్తి కథ ఆమె పరంగా నడిచేదే. దళితవాడ నుంచి పెట్రేగిన స్త్రీ కథ. కథలో దొర ఆమెని అనిభవిస్తాడు కూడా. కొడుకు ఆమెకి సాయంగా వున్నా, దొర హత్యలో పాలుపంచుకోడు.

         
చిన్న కథని సినిమాకి తీసుకునే సరికి భర్త పాత్రని పెంచుతూ  రిజర్వేషన్ల అంశం జోడించి, దొర చేతిలో అతను హతమయ్యేందుకు అవసరమైన నేపధ్య బలమంతా కల్పించారు. కథానాయికని దొర అనుభవించే ఘట్టం తొలగించి, సినిమా కాబట్టి హీరోయిన్ పాత్ర పావిత్ర్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో కమర్షియాలిటీ కోసం కొడుకు పాత్రని దొర హత్య కి తగు విధంగా యాక్టివేట్ చేశారు. ఇలా మారిపోయిన కొత్త  ఔట్ లైన్ బాబూరావుకి ఇంకా బాగా నచ్చి, మరో రచయిత సంజీవితో సీనిక్ ఆర్డర్,  ట్రీట్ మెంట్ వగైరా కానిచ్చారు. ఫైనల్ గా హరనాథ రావు డైలాగ్ వెర్షన్ రాశారు. ఇందులో ఆయన సోదరుడు, రచయిత మరుధూరి రాజా స్వల్ప పాత్ర పోషించారు. స్క్రీన్ ప్లే క్రెడిట్ బాబు రావు సంజీవీలు తీసుకుంటే, కథ -మాటలు హరనాథ రావు వేసుకున్నారు. 

         
స్క్రిప్టు దర్శకుడు ముత్యాల సుబ్బారావు చేతిలో ఎలా తెరకెక్కిందంటే, ఆయన లెఫ్ట్ కి ఎక్కువ ప్రాధాన్య మిచ్చినట్టు కన్పిస్తుంది. ముఖ్యంగా  రాత్రి పూట లాంతరు పట్టుకుని భర్త కోసం యమున వెతికే దృశ్యాల్లోని  మైన్యూట్ డిటైల్స్ అన్నీ, అచ్చం స్క్రీన్ ప్లేలో రాసిన వర్ణనలతోనే చిత్రీకరించడంతో, అదంతా ఒక సినిమా చూస్తున్నట్టు వుండదు, సినిమాని చదువుతున్నట్టు వుంటుంది.  అదీ సుబ్బయ్య టాలెంట్. దీనికి ఆర్.  రామారావు కెమెరా వర్క్ క్లాసిక్ టచ్ ఇచ్చింది.  

         
సాధారణంగా సినిమాల్లో విలన్ ఎంట్రీ ని అతను కన్పించగానే,  ప్రత్యక్షంగా అక్కడికక్కడే ఏదో దారుణానికి పాల్పడ్డంగా   చూపిస్తూంటారు. కానీ ఎర్ర మందారంస్క్రీన్ ప్లేలో విలన్ అయిన దొరని చూపించకుండానే అనుచరుల చేత అతడి దాష్టీకాన్ని చూపిస్తూ- చెప్పుల దండతో  గుడి పూజారిని ఊరేగించే దృశ్యంతో ఇలాటి కర్కోటకుడు విలన్ అంటూ  పరోక్షంగా తెలియజేయడం  ఎంతో రిలీఫ్ నిస్తుంది రొటీన్ మూస నుంచి మనకి!  విలన్ పాత్ర పరిచయం ఇలా ఎంత హాయిగా అన్పించిందో బాబూ రావుకి చెపితే, ఆయన హాయిగా చిరునవ్వు నవ్వేసి  వూరుకున్నారు.



సికిందర్