రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, October 3, 2017


526 : నివేదన          ఇన్నేళ్ళ తర్వాత కొన్ని సందేహాల్ని తీర్చాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇరవై ఏళ్లుగా సినిమా రివ్యూలు రాస్తున్నా ఈ వ్యాసకర్తకి నంది అవార్డు ఎందుకు రాలేదన్న సందేహాలూ , ఊహాగానాలూ ఈ వ్యాసకర్త దృష్టికి అడపాదడపా వస్తూనే వున్నాయి. వీటిని బ్లాగ్ ముఖంగా తీర్చకపోతే సామర్ధ్య లోపమన్న భావం బలపడే అవకాశముంది. అవార్డు రాకపోవడం కాదు, తీసుకోక పోవడానికి రెండు కారణాలున్నాయి:  పుట్టు రచయితగా డిటెక్టివ్ సాహిత్యంలోంచి వచ్చిన  ఈ వ్యాసకర్త ఎప్పుడూ తనని తానూ సినీ విమర్శకుడుగా, క్రిటిక్ గా భావించుకోలేదు. అలా చెప్పుకోలేదు. రచయిత కుండే సహజ జిజ్ఞాస కొద్దీ సినిమా కథల లోతుల్లోకి వెళ్లి విశ్లేషించాల్సి వచ్చిందే తప్ప మరొకటి కాదు. కాబట్టి రైటర్ అనే ఒకేఒక్క  ఐడెంటిటీకి  కట్టుబడ్డ వ్యాసకర్త,  సినీ విమర్శకుల కిచ్చే అవార్డుల జోకిలి పోలేదు. రెండో కారణమేమిటంటే, ఒకవేళ ఈ ఐడెంటిటీ అనే గొప్ప తీసి అవతల పడేసి,  మనం కూడా ఓ అవార్డు లాగించుకుందామనుకున్నా, ఒక ప్రమాదం పొంచి వుంటుంది. నంది క్రిటిక్ అవార్డు తీసుకుంటే మళ్ళీ రివ్యూలు రాస్తూ కన్పించకుండా పోయే ప్రమాదం. ఇందుకు తార్కాణాలు అనవసరం. అలా అజ్ఞాత వాసంలో గడిపే భయంకర పరిస్థితి రాకూడదని కూడా ఈ వ్యాసకర్త అవార్డుకి దూరంగా వున్నాడు. 2005 లో ఒకసారి నంది కమిటీ మెంబర్ ఒకరు – మీరు అప్లై చేసుకోండి, అవార్డు ఇచ్చి తరిస్తాం అన్నాకూడా ఈ వ్యాసకర్త స్పందించలేదు. కనుక  ఏనాడూ అప్లయే  చేసుకోనిది అవార్డు రావడమో, రాకపోవడమో ఎలా జరుగుతుంది.  అందువల్ల సామర్ధ్యం లేక అవార్డు రాలేదని  చెవులు కొరుక్కునే పరిస్థితి ఎవరికీ రాకూడదని, ఈ అనివార్య అనవసర వివరణాత్మక నివేదన.

-సికిందర్