రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, నవంబర్ 2017, శుక్రవారం

539 : రివ్యూ!


రచన – దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం  :
 రాజశేఖర్, పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీ లియోన్, అదిత్ అరుణ్, వివర్మకిషోర్, నాజర్, షాయాజీ షిండే,  పోసాని కృష్ణమురళి, అవరాల శ్రీనివాస్, అలీ, పృథ్వీ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో , నేపథ్య సంగీతం:  శ్రీచణ్ పాకాల , ఛాయాగ్రహణం : అంజి, సురేష్ ఆర్, శ్యామ్ ప్రసాద్, గీకా, బాకుర్ 
బ్యానర్ :   శివాని శివాత్మిక ఫిలింస్, జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్
నిర్మాత : ఎం.కోటేశ్వర్ రాజు 
విడుద: నవంబర్ 3, 2017 
***
        విజయాలు లేక రెండేళ్ళు విరామం తీసుకున్న రాజశేఖర్ అత్యంత భారీ యెత్తునపునరాగమన సన్నాహం చేశారు. ఒకప్పుడు మగాడుగా బాక్సాఫీసుని ఏలితే, ఇప్పుడు  సామాన్యుడుగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికొచ్చారు. చందమామ కథలు, గుంటూరు టాకీస్ వంటి నాల్గు చిన్న తరహా సినిమాలు తీస్తూ వచ్చిన  దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా బాణీమార్చి ఏకంగా బిగ్ బడ్జెట్  యాక్షన్ హంగామాకి పాల్పడ్డారు, అది కూడా రాజశేఖర్ తో.  ఇప్పుడు ఈ ఇద్దరి పరిస్థితేమిటి? వుంటారా, పోతారా? ఇది తెలుసుకోవడానికి సినిమాలోకి వెళదాం...

కథ
 
       శేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ లో అసిస్టెంట్ కమిషనర్. తన బృందంతో కలిసి నగరంలో ఆయుధాల, మాదకద్రవ్యాల ముఠాలని ప్రక్షాళన చేసే కార్యక్రమంలో వుంటాడు. ఈ ముఠాల దగ్గర ఒక ఎన్ క్రిప్ట్ చేసిన కోడ్ దొరుకుతుంది. దాన్ని హ్యాక్ చేస్తే, మూడు గంటల వ్యవధిలో బాంబు దాడి జరగబోతోందని తెలుస్తుంది. కష్టపడి  ఆప్రాంతాన్ని కనుక్కుంటే, అక్కడ ర్యాలీ జరుపుకోవడాని కొస్తున్న ప్రతాపరెడ్డి (పోసాని) అనే రాజకీయ నాయకుణ్ణి టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడి నుంచి ప్రతాపరెడ్డిని కాపాడిన శేఖర్ కి,  నిరంజన్ అనే అనుమానితుడు దొరుకుతాడు. ఈ నిరంజన్ దగ్గరే అసలు రహస్యమంతా వుంటుంది. 

          రాష్ట్రంలో బయటపడిన  ప్లుటోనియం నిల్వల్ని మైనింగ్ చేసి ఉత్తరకొరియాకి తరలించే కుట్ర చేస్తున్న మంత్రులు, అధికారులు, బ్రోకర్లూ అందరి గుట్టూ తెలుస్తుంది శేఖర్ కి. దీంతో నిరంజన్ సహా శేఖర్ ని చంపేసేందుకు వేటాడతుంది  మైనింగ్ మాఫియా. శేఖర్ కి ఇంటిదగ్గర భార్యతో సఖ్యత వుండదు. ఇటు భార్యతో సమస్య, అటు ప్రాణాల సమస్య నెదుర్కొంటూ శేఖర్,  మైనింగ్ మఫియాని ఎలా అంతమొందించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 

        అంతర్జాతీయ కుట్రకి సంబంధించిన  హై కాన్సెప్ట్ కథ. ఆమధ్య ‘ఘాజీ’ అనే ఇలాటిదే అంతర్జాతీయ హై కాన్సెప్ట్ కథ తెలుగులోనే వచ్చి విజయం సాధించింది. అది ఇండో - పాక్ యుద్ధనేపధ్యంలో వుంటే, ఇది అమెరికా -  ఉత్తర కొరియాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపధ్యంగా వుంది. ఉత్తర కొరియాకి ఇండియా నుంచి అణుపదార్ధాన్ని సరఫరా చేస్తున్న మాఫియా ఒక మాట అంటాడు – ఈ భారీ స్మగ్లింగ్ తెలిస్తే ఐక్యరాజ్య సమితిలో ఇండియా పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోమంటాడు. ఇరాక్, ఇరాన్ లకి పట్టిన గతే ఇండియాకీ పడుతుందని బెదిరిస్తాడు. కానీ అప్పటి దాకా ఉత్తర కొరియా చేతిలో ఈ అణుపదార్ధంతో అమెరికా వుంటుందా? అణుస్మగ్లింగ్ అనే ఐడియాతో  ఈ తెలుగుకథ కొత్తగా వున్నా, దీని నిర్వహణ ద్వితీయార్ధంలో మళ్ళీ మూస వాసనేస్తుంది. మూస వాసనని అధిగమించి విజువల్ అప్పీల్ తో కొత్తగా మారిపోయిన ‘గోల్ మాల్ ఎగైన్’ ఇటీవలే చూశాం. దీన్ని ఈ కథ సాధించలేక పోయింది, ఎంతైనా తెలుగు కథే  కదా అన్నట్టు.

ఎవరెలా చేశారు 

        రాజశేఖర్ పునరాగమన నటన పాతని వదిలించుకుంది. చొక్కాచేతులు పైకి మడిచి కళ్ళెర్రజేసి, సాయికుమార్ గళంతో భీకర రావాలు చేసే మ్యాననరిజమ్స్ దేవుడి దయవల్ల ఇకలేవు. చాలా సింపుల్ గా, అంతే శక్తివంతంగా, క్యాజువల్ డైలాగులతో సహజంగా నటించారు. ఇప్పుడు ఫేసులో తాజాదనం వుట్టిపడుతూ, చూసినకొద్దీ చూడాలనిపించేలా మారిపోయి వచ్చారు. తనెప్పుడో పోలీసు పాత్రల్లో ఆరితేరిపోయారు. ఇప్పుడు విలన్ నోట ‘నువ్వొక సామాన్యుడివేరా’  అని తిట్టించుకుని సామాన్యుడి పవరేంటో స్టయిలిష్ గా చూపించారు. ఇంటి దగ్గర భార్యతో గొడవలు కథలో కావాలని జొప్పించినట్టు వుండడంతో ఆ దృశ్యాల్లో రాజశేఖర్ నటన పెద్దగా ఆకట్టుకోదు. మిగతా సన్నివేశాల్లో, యాక్షన్ దృశ్యాల్లో ఇది తనకి గుర్తుండి పోయే పునరాగమనమే తప్ప విఫలయత్నం కాదు. ఇలాగే రియలిస్టిక్ గా విభిన్న తరహా పాత్రలు పోషిస్తే మళ్ళీ తన సినిమాలు బావుంటాయి. ఒకనాడు ఇలాటిదే టెక్నికల్ థ్రిల్లర్ ‘మగాడు’ తనకెంతో ఇప్పుడు ‘గరుడవేగ’ అంత. 


       హీరోయిన్ పూజా కుమార్ భర్త తనకి సమయం  కేటాయించడం
లేదని విడాకుల దాకాపోయే చాదస్తపు పాత్ర. బిజీ పోలీస్ ఏజెంట్లకి ఇంటి దగ్గర ఇలాటి భార్యల్ని కేటాయించడం ఒక ఫార్ములాగా మారింది. ఇలాటి కథలకి హాలీవుడ్ ప్రకారం బయట ఫిజికల్ యాక్షన్ తో హీరోవుంటే,ఇంట్లో భార్యతో ఎమోషనల్ యాక్షన్ వుండాలి. ఈ ఫిజికల్ - ఎమోషనల్ యాక్షన్ల ద్వంద్వాల ఉద్దేశం అర్ధం జేసుకోకుండా పెడితే ఇదిగో ఇలాగే జానరేతరంగా పానకంలో పుడకల్లా వుంటాయి సీన్లు. క్లయిమాక్స్ యాక్షన్ సీన్ల మధ్య  ఈ సంసార గొడవల సరిత్సాగరం మరీ దెబ్బ తీసింది జానర్ మర్యాదని. 

          విలన్ గా కిషోర్ ఎఫెక్టివ్ గానే వున్నాడు గానీ, కథలోకి ద్వితీయార్ధంలో ఎప్పుడోగానీ రాడు. ఈ యాక్షన్ కథ మిస్టరీతోకూడి వుండడం వల్ల ఈ పరిస్థితి. సన్నీలియోన్ ఒక డాబా పాటలో కవ్వించి పోతుంది. హీరో హీరోయిన్ల మధ్య సమస్యకి సైకియాట్రిస్టుగా అలీకి ఒకే దృశ్యముంది. ఇంకో డాక్టర్ గా పృథ్వీ కన్పిస్తాడు. పెద్దగా హస్యమాడే పాత్రలు కావివి.  రాజకీయ నాయకుడి పాత్రలో పోసాని అర్ధాంతరంగా అంతర్ధానమవుతాడు. ఎన్ ఐ ఏ ఏజెంటుగా రవివర్మ, హ్యాకర్ గా అదిత్ అరుణ్, ఎన్ ఐ ఏ బాస్ గా నాజర్ కన్పిస్తారు. ఇక టీవీ రిపోర్టర్ గా శ్రద్ధాదాస్ కి ఏమంత పాత్రలేదు. 



      సాంకేతికంగా బాగా ఖర్చుపెట్టి తీశారు. ఇప్పుడు రాజశేఖర్ మీద పదుల కోట్ల బడ్జెట్ అంటే రిస్కే. అనుకున్న బడ్జెట్ దాటి పెరుగుతూ పోయిందని చెప్పుకుంటున్నారు. పెరిగింది వృధా కాలేదు గానీ, వసూళ్ళకి ఏటికి ఎదురీదాలి. టికెట్టు కొన్న ప్రేక్షకుడు మాత్రం ఏడ్చుకుంటూ పోడు. పైపెచ్చు రొడ్డ కొట్టుడు సినిమాల మధ్య చాలా బెటరని తలవంచుకుని పోతాడు.

      బీమ్స్ సంగీతంలో రెండే పాటలున్నాయి.
శ్రీచణ్ పాకాల  నేపధ్య సంగీతం  చాలా హైలైట్ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి. ఇక ఎందరో ఛాయాగ్రాహకులు కలిసికట్టుగా ఈ యాక్షన్ హంగామాని సమున్న
తంగా దృశ్యమానం చేశారు. ఇంతవరకూ చిన్న బడ్జెట్ సినిమాలు తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఉన్నట్టుండి బిగ్ కాన్వాస్ తో, హై కాన్సెప్ట్ ని కూడా ఒంటి చేత్తో తీసి అవతల పడెయ్యగలనని ఆశ్చర్యకరంగా నిరూపించుకున్నారు.

(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)

సికిందర్  
www.cinemabazaar.in
(edited typos)