రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఆగస్టు 2017, బుధవారం

500 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 13



     ఇంటర్వెల్ స్పాట్ అనేది ఓ చౌరస్తా,  సెకండాఫ్ అనేది కారడవి. చౌరస్తాలో నిలబడి కారడవి లోకి చూస్తున్నప్పుడు ఏ మార్గాన వెళ్తే తప్పిపోకుండా దాటవచ్చో తెలియడం అవసరం. ఇంటర్వెల్ అనే చౌరస్తా నుంచీ ఈ సెకండాఫ్ అనే కారడవిలో దారీతెన్నూ కానరాక, గల్లంతయిన  తెలుగు సినిమాలెన్నో. కారడవిలో కొన్ని గల్లంతయినా గమ్మత్తుగా గట్టెక్కుతాయి స్టార్ క్రేజ్ వల్ల - ‘నిన్నుకోరి’, ‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటివి- ఎత్తుకున్న పాయింటుని కిల్ చేస్తూ. కొన్ని సార్లు ‘బ్రహ్మోత్సవం’ లాంటివి  ఎంత స్టార్ పవర్ వున్నా, అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి సెకండాఫ్ లో దారి తప్పడంవల్ల.  సెకండాఫ్ సిండ్రోమ్ అనేది తెలుగు సినిమాలకి స్వకీయ  శాపం. ఇంకా కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, డిక్టేటర్, బ్రూస్ లీ, జ్యోతి లక్ష్మి, సైజ్ జీరో, ఆటోనగర్ సూర్య, దొంగోడు, ధమ్ లాంటివి వచ్చి బోల్తా కొడుతూనే వుంటాయి. సింపుల్ గా ఏమిటంటే ఐడియా స్థాయిలోనే , పోనీ దాని తర్వాత సినాప్సిస్ దశలోనే దొరికిపోయే ఈ తప్పుని - చాలా ఖరీదైన  తప్పుని -  మొదటే గుర్తించలేక స్క్రీన్ ప్లేలూ డైలాగులూ అనే దశలు కూడా పూర్తి చేసేసి, షూటింగ్ కూడా చేసి పారేసి,  మార్నింగ్ షోకల్లా తెల్లమొహం వేయడం పరిపాటవుతోంది. ఐడియా దగ్గరే, సినాప్సిస్ దగ్గరే తేలిపోయే జాతకాన్ని సినిమా అంతా తీసిగానీ  తెలుసుకోలేక పోవడం- ప్చ్ ప్చ్ ప్చ్, చాలా బ్యాడ్ సాంప్రదాయం.  ఐడియాకి శాస్త్రం ఏమిటీ, సినాప్సిస్ కి సూత్రాలేమిటీ అనుకుంటే, ఆతర్వాత ఇక దేనికీ ఏదీ వుండదు- ఎటూకాని సినిమా వుంటుంది. 


            The function of the mid- point is to keep the story moving  forward, it is a link in the chain of the dramatic action connecting the First Half of Act -2, with the Second Half of Act -2” అనీ రాశారు సిడ్ ఫీల్డ్. సిడ్ ఫీల్డ్ ని బోలెడంత మంది చదివేస్తున్నారు. సిడ్ ఫీల్డ్ ని చదవడం వేరు, పాటించడం వేరు. సిడ్ ఫీల్డ్ ని చదివినా, ఇంకెవర్ని చదివినా, రాయడాని కొచ్చేటప్పటికి ఏమీ అర్ధంగాక  చేతులెత్తేసే వాళ్ళే ఎక్కువ. ఆస్ట్రేలియా నుంచి ఒక తెలుగు షార్ట్ ఫిలిం స్క్రీన్ ప్లే అందింది మూల్యాంకన కోసం. పది సీన్ల ఆ కథ స్ట్రక్చర్ తో అద్భుతమైన శైలిలో మెచ్యూర్డ్ గా,  ఎక్సైటింగ్ గా వుంది. దాన్ని సరిదిద్దడానికేమీ లేకుండా పోయింది. చాలాచాలా అరుదుగా ఇలాటి మెరుపులు మెరుస్తాయి. 

            ఉపోద్ఘాతం ఆపి విషయానికొద్దాం. ఏదో అనుకుని మొదలెడితే ఈ ‘బ్లడ్ సింపుల్’ మహాభారతమై పోయింది. ఎంతకీ తెగడం లేదు. జీవితమంతా చెట్టుకింద తపస్సు చేసి రాసుకునే పరిస్థితి. ఎబ్బీ, రే, మార్టీ, విస్సర్ పాత్రలు చుట్టూ చేరి  తమని ఇంకా ఇంకా తెలుసుకోమని రొద పెడుతున్నాయి. డార్క్ మూవీస్ లక్షణమే ఇంత. ఆర్టు సినిమాల్లో కూడా ఇంత విషయముండదు. క్రితం వ్యాసంలో ఫస్టాఫ్ పూర్తి చేశాం, ఇప్పుడు సెకండాఫ్ కొస్తే- ఇంటర్వెల్ దగ్గర మార్టీని రే సజీవ సమాధి చేసిన నేపధ్యంలో ఇప్పుడేమిటి? ఎలా సాగాలి ముందు కథ? 

            ఇంటర్వెల్ అనే చౌరస్తాలో నిలబడి సెకండాఫ్ అనే కారడవిలోకి చూస్తే ఏం కన్పిస్తుంది? ముగింపు కన్పిస్తోందా? కాదు, ప్లాట్ పాయింట్ టూ మాత్రమే కన్పిస్తుంది. ఈ పీపీ టూకి దారేసుకుంటూ వెళ్ళడమే కారడవిలో కాంట్రాక్టు మేస్త్రీ పని. స్క్రీన్ ప్లే పరిభాషలో సెకండాఫ్ అంటే మొత్తం సెకండాఫ్ అంతా  కాదు. మిడిల్ – 2 వరకు మాత్రమే. అంటే  ప్లాట్ పాయింట్ టూ వరకు. పీపీ వన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ మిడిల్ ఫస్టాఫ్, ఇంటర్వెల్ నుంచీ పీపీ టూ వరకూ మిడిల్ సెకండాఫ్.

            ప్లాట్ పాయిట్ వన్ దగ్గర ఏర్పడే గోల్ సహిత సమస్యకి పీపీ టూ దగ్గర పరిష్కారమార్గం దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గంతో పై చేయి సాధించి  క్లయిమాక్స్ పూర్తి చేస్తుంది పాత్ర. పీపీ టూ దగ్గర ఏం జరగాలో తెలియాలంటే పీపీ వన్ లోకి చూడాలి తప్ప మరో ఆలోచన పనిచెయ్యదు. ఈ రెండూ ఎదురెదురు అద్దాల్లాంటివి. ఏ కథకైనా ముగింపు పీపీ వన్ లోనే దాగి వుంటుంది. దాన్ని పట్టుకోగల్గాలే తప్ప, ఇంకేదో చేద్దామంటే కుదరదు. ఎలాగయితే మిడిల్  వన్ కి గమ్య స్థానం ఇంటర్వెల్లో, అలా మిడిల్ టూకి పీపీ టూ గమ్యస్థానం. 

            ఈ గమ్యస్థానం తెలియాలంటే పీపీ వన్ ని చూడాలి. పీపీ వన్ దగ్గర  పైకి వేరు లోపల వేరుగా వున్న గోల్ తో మిస్టీరియస్ గా కథ ప్రారంభించిన విస్సర్, ఆ తర్వాత అనేక ఒడిడుకుల పాలయ్యాక, ఒడ్డున పడాలంటే, పీపీ వన్ దగ్గర ఏ ఎబ్బీ, రేలని చంపకుండా వేరే ప్లానేశాడో - ఆ ఎబ్బీ, రే లనే  చంపి బయటపడాలి. ఇదే కథకి  ముగింపు. ఐతే ఇతను యాంటీ హీరో అవడంవల్ల ఆ తర్వాత బతికి వుంటాడా లేదా అనేది క్యారక్టర్ ముగింపు. పీపీ టూ మాత్రం ఎబ్బీ - రేల మీద అఘాయిత్యం తలపెట్టడమే. డ్రామాకి  డార్క్ మూవీస్ కర్మ సిద్ధాంతాన్ని బాగా వాడుకుంటాయి. ఎబ్బీ - రేలని చంపుతానని మార్టీకి విస్సర్ మాటిచ్చి ప్లేటు ఫిరాయించినా, వాళ్ళని చంపాల్సిన మౌలిక పరిస్థితిని ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు కల్పించక మానదు. మాటతోనో, చేతతోనో, ఆలోచనతోనో మనుషులు చేసుకునే మంచి చెడు కర్మల్ని ప్రకృతి లేదా సబ్ కాన్షస్ మైండ్ ఏదీ బ్యాలెన్స్ ఉంచదు. ఏదో ఒక రూపంలో న్యూటన్ మూడో చలన సూత్రాన్ని రుచి చూపించి తీర్తుంది : ప్రతీ చర్యకీ సమానమైన వ్యతిరేక ప్రతిచర్య! 

            అప్పుడు ఎబ్బీ- రేలని విస్సర్ చంపాల్సి రావడమే పీపీ టూ సీను అవుతుంది. ఈ సీనుకి పించ్ టూ సీను ఉప్పందించాలి. ఏమిటా పించ్ టూ సీను? చూద్దాం.

            అయితే,  ఇంటర్వెల్ దగ్గర్నుంచీ మిడిల్ టూకి ఏఏ సీన్లు వేస్తూపోతే, పీపీ టూలో ఎబ్బీ, రేలని విస్సర్ చంపే సీను రావచ్చు? ఈ సీన్లే కారడవిలో వేసుకునే రాచ బాట. ఈ సీన్లని దేని ఆధారంగా వేయాలి?  వెనుక కథ ప్రారంభమయ్యాక మిడిల్ వన్ లో నాటిన యుక్తులతోనే. ఏమిటా యుక్తులు? యుక్తులన్నీ విత్తనాలు. అవి ఇప్పుడు మిడిల్ టూ లో మొలకెత్తుతాయి.

            హత్యా స్థలంలో విస్సర్ లైటర్ ని మర్చిపోయాడు, విస్సర్ తీసిన ఫేక్ ఫోటో మార్టీ సేఫ్ లో దాచాడు, ఎబ్బీ చంపిందని రే అనుకుంటున్నాడు, విస్సర్ అనే కిల్లర్ వున్నాడని ఎబ్బీ - రేలకి తెలీదు. సింపుల్ గా నాల్గే యుక్తులు. ఈ నాల్గిటినీ పే ఆఫ్ చేస్తూ వేసేవే మిడిల్ టూ సీన్లు అవుతాయి. దీనికే కాదు, ఇంకే జానర్ కథ కైనా ఆ కథా సంవిధానానికి తగ్గట్టు ఈ ఏర్పాట్లే వుంటాయి. 

            ముందుగా ఎవరితో  ప్రారంభించాలి? విస్సర్ తోనా, ఎబ్బీ – రేలతోనా?  ఇక్కడే వుంటుంది కారడవిలో వేసే మొట్ట మొదటి కీలక అడుగు. చాలా వరకూ హ్యూమన్ టచ్ ని కాదని, యాక్షన్ తోనే  ముందుకి దూకేస్తూంటారు. ఆ దూకడం దూకడం ఎక్కడ తేల్తారో దిక్కుతోచని టూర్ అయిపోతుంది. సెకండాఫ్ సిండ్రోమ్  నోట్లో తలపెట్టడం అవుతుంది.  విస్సర్ ని యాక్షన్ లోకి దింపుతూ  లైటర్ కోసం, మార్టీ దాచిన ఫేక్ ఫోటో కోసం కథగా సెకండాఫ్  ప్రారంభించేసే చపలత్వాకి లోనైతే, ఏమవుతుంది? ప్రధానంగా రసభంగమవుతుంది. రసభంగంతో రభసా రచ్చా రెండూ  అవుతాయి. 

            హ్యూమన్ టచ్ ఎప్పుడూ అరిటాకులాంటిది. యాక్షన్ ముల్లు లాంటిది. కాబట్టి ముందుగా అరిటాకు కథే చెప్పాలి. చెప్పినంత చెప్పి అప్పుడు ముల్లుతో పొడవాలి. అరిటాకే లేనప్పుడు ముల్లుతో దేన్ని పొడుచుకుంటారు – అందుకే ప్రేక్షకులు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారు.  మిడిల్ వన్ లో ఏం అరిటాకు పర్చారు?  తమ వెనుక ఒక కుట్ర జరుగుతోందని తెలీని హ్యూమన్ టచ్ తో వున్న ప్రేమకథ అనే అరిటాకు. పీపీ వన్ దగ్గర  ఏ కథ పుట్టిందో అదే కొనసాగాలి తప్ప,  ఇంటర్వెల్ తర్వాత మారిపోకూడదు. ఏకసూత్రత దెబ్బ తిని రసభంగమవుతుంది. పీపీ వన్ దగ్గర కథ పుట్టించిన వాడు విస్సర్, కథకి పుట్టిన వాళ్ళు ఎబ్బీ- రేలు. పుట్టిన వాళ్ళ గురిచే కథ వుంటుంది తప్ప, పుట్టించిన వాడి గురించి కాదు- వాడు సూత్రధారి.  తెరచాటున వుండి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని వస్తాడు. 

            ఈ తెరచాటు పాత్రతో కాక తెరమీద స్ట్రగుల్ చేస్తున్న అరిటాకు పాత్రల కథనే కొనసాగిస్తూ సెకండాఫ్ ప్రారంభించాలనేది ‘బ్లడ్ సింపుల్’ కూడా చెప్తున్న యూనివర్సల్ ట్రూత్. రేపు సీన్లు చూద్దాం.

(సశేషం)
 -సికిందర్