రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, జనవరి 2017, బుధవారం

రివ్యూ!







స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వి.వి.వినాయక్

తారాగ‌ణం: చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా, బ్ర‌హ్మానందం, అలీ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ర‌ఘుబాబు, నాజర్, నాగబాబు తదితరులు 

కథ : ఏ ఆర్. మురుగదాస్, రచన : ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, రచనా సహకారం : సత్యానంద్, మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా, వేమారెడ్డి 
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు
బ్యానర్ : కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, నిర్మాత: రామ్‌చ‌ర‌ణ్‌
విడుదల : జనవరి 11, 201

***

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా స్టార్ చిరంజీవి పునరాగమన ‘ఖైదీ నెం. 150’ ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు చేసుకున్న ప్రేక్షకాభిమానులకి సంక్రాంతి కానుకగా వచ్చేసింది. తన రెండు దశాబ్దాల ఏకఛత్రాధిపత్య సినిమా రంగాన్ని సన్యసించి పదేళ్ళు వనవాసాని కెళ్ళిన చిరంజీవి, అక్కడ ఢక్కామొక్కీలు తిని తిరిగి వచ్చారు తన సామ్రాజ్యాన్ని తిరిగి క్లెయిమ్ చేసుకోవడానికి. పదేళ్ళ గ్యాప్ తర్వాత నూట యాభయ్యోవ సినిమా స్థాయి దేవుడెరుగు- అసలు వెళ్ళిన బాసు బాస్ లాగా తిరిగి రాకపోతే, తను లేని కాలంలో రకరకాల పాగాలు వేసుకున్న యంగ్ స్టార్ లతో పోటీ పడే స్టామినాతో, స్టయిలింగ్ తో  రీఎంట్రీ ఇవ్వకపోతే, అంతా బురదలో పోసిన పన్నీరైపోతుంది. ఈ పరీక్షే చిరంజీవి ముందున్న అతిపెద్ద ఛాలెంజి. దీన్ని  ఆయనెలా ఎదుర్కొన్నారు? ఎదుర్కొని సక్సెస్ అయ్యారా? సినిమా స్థాయి కంటే  చిరంజీవి స్థాయినే తెరమీద ప్రతీక్షణం, ప్రతీ కదలికలో గమనించడంలో లీనమైపోతారు ప్రేక్షకులు- కాబట్టి మెగా స్టార్ గా చిరంజీవి  తిరిగి అదే తన పూర్వ ఇమేజిని నిలబెట్టుకున్నారా లేదా అన్నదే ప్రధాన పాయింటై పోతుంది. ఇందులోకి వెళ్ళే ముందు కథెలా వుందో ఒకసారి చూద్దాం...


కథ 


     కత్తి శీను (చిరంజీవి) ఒక జైలు పక్షి. కలకత్తా జైలునుంచి పారిపోయి వచ్చి పాత  నేస్తం మల్లి (అలీ)తో  కలిసి బ్యాంకాక్ పారిపోయేందుకు ప్లానేస్తాడు. ఇంతలో అందాల బొమ్మ సుబ్బలక్ష్మి (కాజల్ అగర్వాల్) కన్పించడంతో ఆమె ఆకర్షణలో  పడి బ్యాంకాక్ ఆలోచన మానుకుంటాడు. ఓ రాత్రి తన ఎదుటే శంకర్ అనే వ్యక్తి  మీద హత్యా యత్నం చేసి పారిపోతుంది ఓ గ్యాంగ్. ఆ శంకర్ (చిరంజీవి రెండో పాత్ర) ని కాపాడేందుకు వెళ్ళిన  శీను కి తన పోలికలతోనే అతను కన్పిస్తాడు. దీంతో మల్లితో ప్లానేసి, శంకర్ ని శీనులా ఆస్పత్రిలో జాయిన్ చేసి, తను శంకర్ వుండే అడ్రసుకి శంకర్ లా వెళ్తాడు. ఆ ఒల్డేజీ  హోంలో వుంటున్న వృద్ధులు శీనుని శంకర్ గానే నమ్ముతారు.  అటు శీను కాని శంకర్ శీనుగా  ముద్రపడి కలకత్తా జైల్లో బందీ అయిపోతాడు. శీనుని శంకర్ గా నమ్ముతున్న ఒల్డేజీ  హోంలో వృద్ధులదో  కథ. వాళ్ళందరికీ శంకర్ నాయకుడు. నీరూరు అనే ఒక వూళ్ళో వీళ్ళ భూములు లాక్కుని కూల్ డ్రింక్స్  ఫ్యాక్టరీ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు అగర్వాల్ (తరుణ్ అరోరా) అనే కార్పొరేట్ అధిపతి. ఈ కథ తెలుసుకున్న శీనులో పరివర్తన వస్తుంది- ఇక శంకర్ ఆశయం  కోసం శంకర్ లా అగర్వాల్ తో తలపడేందుకు సిద్దమవుతాడు...

ఎలావుంది కథ
    2014 లో తమిళంలో ఏఆర్ మురుగదాస్ విజయ్ తో తీసిన ‘కత్తి’ కి రిమేక్ కథ ఇది. కథలో మార్పేమీ చేయలేదు. రైతు సమస్య కేంద్రంగా పరిభ్రమించే యాక్షన్ మసాలా కథతో కూడిన తమిళ ఒరిజినల్ కి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో బాటు, ఫిలిం ఫేర్, విజయ్ అవార్డ్స్ లలో  మొత్తం 26  అవార్డులు లభించాయి. 2018 లో మురుగదాస్ దీన్నే హిందీలో ‘ఇక్కా’ అనే టైటిల్ తో అక్షయ్ కుమార్ తో నిర్మించబోతున్నాడు. ఈ కథ చిరంజీవికి సూట య్యిందా  లేదా అన్నదే ప్రశ్న. పక్కాగా  సూటయ్యింది. రెండు పాత్రల్లో  తన ఫిక్స్డ్ ఇమేజికి తగ్గ పని దొరికింది. ఈ కథ చాలా జాగ్రత్తగా సేఫ్ సైడ్ చూసుకునే దర్శకుడు వివి వినయక్ కీ సూటయ్యింది. ఈ కథలో తండ్రి చేత నటింపజేస్తూ నిర్మాతగా బోణీ చేసిన రామ్ చరణ్ కీ వర్కౌట్ అయ్యింది. 

ఎవరెలా చేశారు  
     ఇందులో ఇతర తారాగణం ఎవరెలా చేశారని చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. సహాయ నటులూ కమెడియన్లు సహా సీన్లు నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నం రొటీన్ గానే చేసుకుపోయారు. అయితే ముళ్ళపూడి మార్కు మాటలతో హాస్యం పండించడానికి ప్రయత్నించడం వల్ల ఓల్డ్ లుక్ కన్పిస్తుంది. చిరంజీవి కామెడీకి కూడా ఇలాటి మాటలే వాడారు. ఈ తరహా సాత్విక డైలాగులు ఇంకా చిన్న తరహా కామెడీ  సినిమాలకైతే సరిపోతాయన్నట్టున్నాయి. సెకండాఫ్ ప్రారంభంలో పోసాని అండ్ గ్రూపుతో చిరంజీవి చేసిన సీను ఒక్కటే పక్కా మాస్ కామెడీతో బాగా పేలింది ఈ స్థాయి బిగ్ కమర్షియల్ కి తగ్గట్టుగా. 

          హీరోయిన్ కాజల్ అగర్వాల్ ది ఏమీ చెయ్యని పాత్ర. అనేక సీన్లలో బ్యాక్ గ్రౌండ్ లో అలా నిలబడి వుంటుందంతే. అయితే ఆమెతో చిరంజీవికి రోమాంటిక్ సీన్లు పెట్టకుండా, అదే పనిగా ఆమెని లవ్ లో పడెయ్యడానికి చిరంజీవి టీజ్ చేసే సీన్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఒక మాట అనుకుని, పాటల్లోకి వెళ్ళిపోయే రోమాన్సే ఇబ్బంది లేకుండా. 

          విలన్ పాత్రధారి తరుణ్ అరోరా చాలా మైనస్ ఈ సినిమాకి. బొమన్ ఇరానీ వుండి  వుంటే మెగా స్టార్ కి దీటుగా వుండేవాడు. సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులు తప్ప మిగిలిన సహాయ నటులూ కమెడియన్లూ వయసులో పెద్ద వాళ్ళే. చిరంజీవి తన కాలపు నటుల్నే  పెట్టుకుని చాలా పొరపాటు చేశారు. కనీసం  కమెడియన్ లైనా నేటి వెన్నెల కిషోర్ లాంటి యంగ్ స్టర్స్ ని  తీసుకుని వుంటే ఫ్రెష్ నెస్ వచ్చేది. ఈ సినిమాలో అదేమిటో గానీ యువ ప్రాతినిధ్యమే లేదు. ఇది చాలా నిరుత్సాహం యువప్రేక్షకులకి. ఇప్పుడు మళ్ళీ ఆనాటి చిరంజీవి సినిమా చూస్తున్నట్టు వుండకూడదుగా.

          ఇక చిరంజీవి విషయానికొస్తే ఆయన రాటుదేలి  రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సందేహం లేదు. యువ స్టార్స్ ఆయనతో కలిసి నటించేందుకు పోటీ పడేంతగా, వాళ్ళే ఈర్ష్య పడేంతగా మేకోవర్ తో, ఫిట్ నెస్ తో నవయువకుడై తిరిగి వచ్చారు. బాస్ ఈజ్ బ్యాకే బ్యాక్ అయిపోకుండా. దొంగోడు- మంచోడు ఈ రెండు పాత్రల్లో సరిపోయారు. క్లయిమాక్స్ లో రైతుల గురించి చేసే ప్రసంగం హూందా తనాన్ని నిలబెట్టింది- ఆయనలోని రాజకీయ నాయకుణ్ణి  కాకపోయినా. కామెడీ లో అదే తన పూర్వ టైమింగ్, ఫైట్స్ లో వేగమూ  తగ్గలేదు. రెండు మాస్ పాటలకి డాన్సుల్లో మాత్రం ఇప్పటి యంగ్  స్టార్స్  చేసే  ఎరోబిక్స్ కి దూరంగా వున్నారు. వయసు రీత్యా అవసరమే గానీ- ఆ పాటలకి అంత కిక్ వచ్చిందా అన్నదే ప్రశ్న.  

          ప్రతీ సీనులో, ప్రతీ పాటలో కన్పించే డ్రెస్సింగ్ తో చిరంజీవిని మాత్రం ఎవరూ బీట్ చేయలేరు. ఎప్పుడూ అవే ఫెడెడ్ జీన్స్, డిజైనర్ టీషర్ట్స్ తో యువ స్టార్స్ ని చూసి చూసి విసిగిన కళ్ళకి,  చిరంజీవి కూల్ కాస్ట్యూమ్స్- ముఖ్యంగా మార్చిమార్చి ఆయన ధరించిన వేర్వేరు ఓవర్ కోట్స్  గ్రేస్ ఫుల్ లుక్ నిచ్చాయి. ఆయన మాస్ పనులు చేస్తూనే  జంటిల్ మాన్ గా కన్పిస్తారు. 


          దేవీశ్రీ ప్రసాద్ ఇంకో హీరో ఈ సినిమాకి. పాటలూ నేపధ్య సంగీతమూ తన ప్రాణం అన్నట్టుగా పోషించుకున్నారు. కెమెరా మాన్ రత్నవేలూ, కళాదర్శకుడు తోట తరణీ, ఫైట్ మాస్టర్లు రామ్- లక్ష్మణ్ తదితర సాంకేతికులంతా ఈ నూట యాభయ్యోవది తమకి ప్రతిష్టాత్మకం అన్నట్టుగా కృషి చేసి సత్ఫలితాచ్చారు. నిర్మాతగా రామ్ చరణ్ ఎక్కడా తగ్గకుండా రిచ్ ప్రొడక్షన్ విలువల్ని కలిపి తన తండ్రికి కానుకగా ఇచ్చారు ఈ ప్రయత్నాన్ని. 


చివరికేమిటి 
      చిరంజీవి పరీక్షకి నిలబడాల్సి రావడమే ఒక పెద్ద ఐరనీ. గ్యాప్ లేకపోతే ఈ పరీక్ష ఎదురయ్యేది కాదు. ఈ పరీక్షని  చాలా ఈజ్ తో, అసలు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని  తపన పడుతున్నట్టు ఎక్కడా కన్పించకుండా,  నెగ్గేశారు. అనుక్షణం తెరమీద ఆయన్నే పట్టి పట్టి చూస్తున్న ప్రేక్షుకుల కళ్ళు  ఈ రీ- ఎంట్రీని ముక్త కంఠంతో అంగీకరించక తప్పలేదు. అలాగే దర్శకుడు వివి వినాయక్ విషయం కూడా. చాలా ఆత్మ విశ్వాసంతో ఆయన ఇప్పుడు చిరంజీవిని హేండిల్ చేయడం, సినిమాని నిలబెట్టడం ఈ సంక్రాంతి సందడికి న్యాయం చేశాయి. అయితే రైటింగ్ సైడ్ ఓల్డ్ టైపు నడకలు పోకపోలేదు. సీన్లు ట్రెండీ గా వుండాల్సింది. నటుల్లో యువ ప్రాతినిధ్యం కూడా వుంటే ఆ  పెప్ రైటింగ్ లో కూడా వచ్చేదేమో. ఫస్టాఫ్ సీన్లు మరీ సాదాగా వున్నాయి. హాయ్ ల్యాండ్ సభలో పాల్గొన్న చిరంజీవియే చెప్పారు- తను సినిమాలు మానేసినప్పుడు  ఆరేడు ఏళ్ల  వయసున్న పిల్లలకి తను పరిచయమే లేడు-  అలాటి వాళ్ళు ఇప్పుడు టీనేజీ  కొచ్చి తనని చూసి ఇంతలా కేరింతలు కొట్టడం ఆశ్చర్య పర్చిందని. సినిమా లెప్పుడూ యూత్ కే మిఠాయి పొట్లాలు. అందుకే అవి యూత్ ఫుల్ గానే వుండాలి ఎప్పుడూ. ‘దంగల్’ లో యూత్ ఫుల్ గానే నవ్విస్తూ కవ్విస్తూ అంత భారీ మాస్- క్లాస్ కథ చెప్పారుగా! 


-సికిందర్
http://www.cinemabazaar.in