రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 18, 2016

నాటి సినిమా!



     అక్కడ తాజ్ మహల్ గుండెని తడిమింది. వివశుడై అతను- ‘మా ఆవిడకో పాట పాడాలనుంది’ అన్నాడు నాటకీయంగా మెలిదిరిగిపోతూ. ఆవిడా అంతే  వాత్సల్యంతో ఆలింగనం చేసుకుందతణ్ణి. గాఢంగా చుంబించింది. వూరుకోకుండా అతనూ అమాంతం ఒళ్లోకి లాక్కుని ఆమెని అంతే దీటుగా చుంబించాడు. ఆగలేక ప్రేమదాసులా మోకరిల్లి ఆమె సుకుమార హస్తాల్ని పెదాలకి తాటించాడు సుతి మెత్తగా...


        క్లిక్ క్లిక్ మన్నాయి కెమెరాలొక్కసారిగా...

        ట్ -కట్- ఇదేదో తాజ్ మహల్ ఎదుట ‘మేఘసందేశం’ రవీంద్రబాబూ పార్వతిల ప్రణయ ఘట్టాన్ని తెరకెక్కించడం కాదు. అంత అదృష్టవంతురాలు కాలేదు పార్వతి. కరుడు గట్టిన రవీంద్ర బాబు కళాపిపాస ధాటికి ఆమె సంసార సుఖమంతా ఏనాడో ముక్కలయ్యింది. నా కళా- నా నాయికా అంటూ వేరే కాంతతో వెళ్ళిపోయాడతను. అలా శూన్యంలోకి చూస్తూ ఓడెళ్ళి పోయిన రేవులా మిగిలింది తను. ఆమె తాజ్ మహల్ కుప్పకూలింది...


        పాత్రల్ని అందరూ సృష్టిస్తారు. నూటికో కోటికో ఒక్కరే సైంటిఫిగ్గా మల్చగల్గుతారు.  సైకోఎనాలిస్ తెలిసి సజీవ సృష్టులు గావిస్తారు. కీకారణ్యంలా మారిపోయిన కళా ప్రాంగణంలో కాకులే ఎక్కువ. మరి కాకులకేం తెలుసు సైకోఎనాలిస్. పాత్రల మానసిక సంఘర్షణని పొల్లుపోకుండా ఔరా అన్పించేట్టు కల్పన చేసే వాళ్ళని భూతద్దం పెట్టి గాలించుకోవాలి. రాయడానికి కూర్చున్న ప్రతిసారీ ఏ క్షణంలోనైనా ప్రేక్షకుల్ని కోల్పోయే ప్రమాదం పొంచి వుంటుందని అంటాడొక స్క్రీన్ ప్లే పండితుడు. రాయడమనేది అనుక్షణం మెదడూ మనసుల లడాయే అయితే, ముందు మనసుతో రాసేసి ఆ తర్వాత మెదడుకి పనిచెప్పి  తిరగ రాసుకోమంటాడింకో స్క్రీన్ ప్లే నిపుణుడు. పాత్రల, సన్నివేశాల పరిపుష్టికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇదిగో, ఈ రెండు డైమెన్షన్ల మాస్టర్ డైరెక్టర్ గా మనకి మహోన్నతంగా దర్శనమిస్తాడు ‘మేఘసందేశం’ లో డాక్టర్ దాసరి నారాయణరావనే వ్యవస్థ. ఎలాగైతే 19 వ శతాబ్దపు నవలాకారుడు హెన్రీ జేమ్స్ ఒక సైంటిస్టులా కూర్చుని పాత్రల్ని నగిషీ చెక్కేవాడో, అలాటి సైకియాట్రిస్టు అంశతో కథనీ పాత్రల్నీ మధించే ఎక్స్ పర్ట్ రైటర్ గా, డైరెక్టర్ గా మంత్రముగ్ధుల్ని చేస్తాడు మనల్ని దాసరి ఈ సినిమాతో. 

        అనంతాకృతుల్ని  వక్రీభవించే కెలిడియో స్కోపు దాసరి మస్తిష్కం. ఎప్పుడే ఆకృతిని ఆర్టుగా కూడేసి బయస్కోపు చూపిస్తాడో తెలీదు. మనం బీ రెడీగా వుండాలి ఆయన చేసే ఆర్టిస్టికల్ బొంబార్డ్ మెంట్ ని కాచుకోవడానికి! ‘నీడ’ లాంటి కొత్త ప్రయోగం దగ్గర్నుంచీ ‘తాండ్ర పాపారాయుడు’  లాంటి భారీ చారిత్రాత్మకం వరకూ, ఏదైనా ఎప్పుడైనా అవలీలగా సృష్టించేయగలడు. ఇన్నని చెప్పలేని అద్భుతాల ఖని ఆయన మస్తిష్క సాగరమంతా. 



        అక్కినేని రవీంద్ర బాబు, జయసుధ పార్వతి, జయప్రద పద్మ, జగ్గయ్య జగన్నాథం పాత్రలు దాసరి కలంలో జన్మ పోసుకున్న మంచి స్టడీ మెటీరియల్ అభిజ్ఞులకి. అంతవరకూ తన మాటే వేదంగా వూళ్ళో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న రవీంద్రబాబు, ఏమైందో ఏమో వూళ్ళోకి మేజువాణి పద్మ రాకతో కవిగారై కూర్చున్నాడు. ఆమె నాట్యమూ తన కవిత్వమూ జత కట్టేసి పురులు విప్పుకున్నాయి. కుర్రకారు ఆమెవల్ల చెడిపోతున్నారని వాళ్లకి కాపలాగా వెళ్ళిన తనే, ఆమెకి దాసుడై పోయి పరువు ప్రతిష్టలన్నీ పోగొట్టుకున్నాడు. ఇది చూసి హతాశురాలైంది భార్య పార్వతి. వారం రెండు మూడు రోజులు పూజలూ ఉపవాసాలతో గడిపే తనకీ అరిష్టమేమిటో అంతుపట్టలేదు.  అన్నని ఆశ్రయించింది. అన్న జగన్నాథం మేజువాణి పద్మని దూషించి వెళ్లిపొమ్మన్నాడు వూళ్ళోంచి. ఆమె వెళ్ళిపోవడం వెర్రెత్తించేసింది రవీంద్ర బాబుకి. విపరీతంగా  ఆమె మీద కవిత్వం రాసుకుంటూ సంసారం గింసారం పట్టకుండా కూర్చున్నాడు. ఇలా కాదని జగన్నాథం, ఆ కవితల్ని పుస్తకంగా వేయించి ఘనసన్మానం కూడా జరిపించాడు-  ఇలాగైనా తిరిగి మనుషుల్లో పడతాడని. ఊహు, అది జరిగితేగా! మళ్ళీ ఆ సభలో పద్మ కళ్ళబడగానే మేకపిల్లలా చెంగు చెంగు మని వెళ్లిపోయాడామె వెంట. 

        ఇక విధిలేక పార్వతి అతణ్ణి వొదులుకుంది. కూతుర్ని తీసుకుని అన్నతో వెళ్ళిపోయింది. పద్మ కోసం పిచ్చివాడై పోయిన రవీంద్ర బాబుకి ఆమె దక్కిందా? కాల చక్రం సర్రున తిరిగి కూతురు పెళ్లీడు కొచ్చి పెళ్లి ఆహ్వానం అందితే వెళ్ళాడా? ముదిమి వయసులోనైనా తిరిగి భార్యని కలుసుకోగలిగాడా? ఇవన్నీ ప్రశ్నలు. 


        రవీంద్రబాబు శంకరాభరణం శంకరశాస్త్రి లాంటి వ్యవహారదక్షుడు గానీ, స్థిత ప్రజ్ఞుడు గానీ కాదు. శంకరశాస్త్రిలా సరిగమలతో బాటూ సంసారమూ సమాజమూ పట్టించుకోవాలన్న బాధ్యత లేనివాడు. దేవదాసు లాంటి పారనాయిడ్ పర్సనాలిటీ. ఆత్మవినాశక తత్త్వం. పక్క మీద భార్య ఎంతో ఆశతో చూసినా, అటు తిరిగి ప్రేయసి  జ్ఞాపకాల్లో స్వైరవిహారం చేసే జడుడు, మానసిక వ్యభిచారి. ఏ వేళలోనూ  భార్య అంటే ప్రేమే వుంది - కానీ నువ్వూ కావాలి, నీతో పాటూ నా కళా సాంగత్యానికి ఆమె కూడా కావాలనీ ధైర్యంగా చెప్పుకోలేని చేతకానితనం. 



      మనమిందాక తాజ్ మహల్ ముందు వివరించుకున్న సన్నివేశం మరింకెవరిదో కాదు- ఒక మహా నటుడు, అటెన్ బరో ‘గాంధీ’ లో మహాత్మా గాంధీ పాత్రని అద్వితీయంగా పోషించిన బెన్ కింగ్స్ లే, అతడి భార్య డెనీలా లావెండర్ లదే. ‘తాజ్’ అనే మరో సినిమాలో షాజహాన్ గా నటించేందుకు ఇండియా వచ్చిన కింగ్ స్లే, నిజ జీవితంలో ప్రెస్ కెమెరాల సాక్షిగా తాజ్ ముందు భార్యతో ఆడిన సరసంలో అతడి లోని పరిపూర్ణ కళాకారుడు బయటపడి థ్రిల్లవుతాం. కళాపిపాస వుంటే వుంటుంది- దాంతో పాటూ  అంతే రంజుగా సంసార సుఖమూ వుండాలి. ఈ అదృష్టాన్ని పొందగలిగీ దూరంగా వుండిపోయాడు పాపం రవీంద్రబాబు. రివర్స్ ఇమేజిలో శంకరశాస్త్రికి కళాకారుడి రూపం ఈ దాసరి అపూర్వ సృష్టి. 

        ఇందుకు భిన్నం పార్వతి. ఓ పాత కథ వుంది. అందులో ఓ రాజు తన ధర్మం కోసం అలక్ష్మిని ఇంటికి తీసుకొస్తే, ఇంటి లక్ష్మి తానుండ లేనని వెళ్ళిపోతుంది. ఇదే పరిస్థితి పార్వతిది. అయితే హూందాగా ప్రవర్తిస్తుంది ఈ దుస్థితిలో కూడా. ఇందులో అసలు పద్మ తప్పేంటని అన్ననే అడుగుతుంది. జెండర్ కి పైస్థాయిలో ఆలోచించే మనిషని ఇట్టే తెలిసిపోతుంది. భర్త ‘నువ్వు ఆడదానివేగా?’ అని ఎత్తి పొడిచినప్పుడు, ఏమనాలో తెలీక వెక్కి వెక్కి ఏడుస్తుంది. తను ఆడదే, కానీ అర్ధం చేసుకున్న ఆడదాన్నని ఎలా చెప్పాలి? అందుకే పద్మతో- ‘నేనెందుకో తగిన దాన్ని కాలేకపోయాను, మీ వల్ల ఆయన గొప్ప వారయ్యారు, అందువల్ల మీరు  నాతో  పాటు వచ్చెయ్యండి’ అని అనగల్గింది. 



      పద్మ నిమిత్తమాత్రురాలు. కోరి రవీంద్ర బాబు ప్రేమ కవిత్వం రాస్తే, సహజంగానే ఆమె సాని మనసు అందులో ముక్తిని వెతుక్కుంది. కానీ పార్వతికి అన్యాయం చేయలేక వెళ్ళిపోయింది. అయినా అతను  వెంటపడి వస్తే తనేం చేస్తుంది. అతణ్ణి కవిగా చేసేందుకే పార్వతి త్యాగం చేసుకున్నాక- ఆ బాధ్యత ఇప్పుడు తను తీసుకోక తప్పదుగా!

        ఇక జగన్నాథం బాధ్యత మీదేసుకున్న కార్యశీలి.  ఇందాక పాక్షికంగా ప్రస్తావించుకున్న పాతకథలో రాజుగారు తెచ్చుకున్న అలక్ష్మీ వల్ల లక్ష్మితో పాటూ నారదుడూ వెళ్లి పోతాడు. ఇక్కడ నారదుడు లాంటి జగన్నాథం చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయాడు.


        ఈ టచింగ్ సైకలాజికల్ డ్రామాని అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్యలు పకడ్బందీగా పోషించారు. దాసరి విజన్ మార్చుకుని కొత్త పంథాలో,  అతితక్కువ సంభాషణలతో, అతి మధుర సంగీత సాహిత్యాలతో, క్లాసిక్ హోదాకి చేర్చిన చలనచిత్ర రాజమిదే. రమేష్ నాయుడు సంగీతం, సెల్వరాజ్ ఛాయాగ్రహణం, పసుమర్తి నృత్యాలూ  ...ఎప్పుడో కీర్తి ప్రతిష్ఠలందుకున్నాయి  కూడా.

డైలాగ్ డిస్ ప్లే 
అక్కినేని :
        “చేశారని అనుకోవడం వేరు, చేశారని తెలియడం వేరు.”
        “మతి చెడి మనసు చెడినప్పుడు పుట్టిన పిచ్చి గీతలు  నా హృదయంలో చోటు చేసుకున్న ఈ చీకటి రాతలు, ఈ కవితలు...”
        “ఆమె పరిచయం నాలో అజ్ఞాత కళాకారుణ్ణి  పైకి తీసుకొచ్చింది.”
జయసుధ :
        “రెండు పడవల మీద ప్రయాణం చేసే సాహసం మీకున్నా, చూసే సాహసం నాకు
లేదు.”
 జయప్రద :
        “చెడి ఇక్కడి కొచ్చారేమోగానీ ఇక్కడికొచ్చి చెడ్డ వాళ్ళెవరూ లేరు.”
 జగ్గయ్య :
        “ఏ శక్తో ఆవహిస్తే గానీ ఏ వ్యక్తీ హఠాత్తుగా మహాకవి కాలేడు.”
        “మగవాడు ఆడదాన్ని కాదన్నా మగవాడుగా బతకగలడు, కానీ మగవాడు కాదన్న ఆడదాన్ని ఆడదానిగా బతకనివ్వరమ్మా”


మూడింటా మేటి!
       అక్కినేనితో సినిమా అంటే ఆశువుగా కథలొచ్చేస్తాయి దాసరికి. ‘ప్రేమాభిషేకం’, ‘బహుదూరపు బాటసారి’, ‘బుచ్చిబాబు’, ‘శ్రీవారి ముచ్చట్లు’ ... ఇలా ఎన్నో. 1979లో ‘శంకరాభరణం’ ఘనవిజయంతో అలాంటి సినిమా తనెందుకు తీయకూడదన్న ఆలోచన వచ్చింది దాసరికి. స్వాభావికంగా శాస్త్రీయ సంగీత పక్షపాతియైన తను అలాటి ‘మేఘసందేశం’ కి శ్రీకారం చుట్టారు. అందరూ డైలాగుల దాసరి అనడం చూసి తక్కువ డైలాగులతో డిఫరెంట్ గా తీయాలన్న పట్టుదలా  వచ్చింది. కథ విని, వెంటనే ఓకే చేశారు అక్కినేని. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడు రంగంలోకి వచ్చారు. అప్పుడు పాటల విషయం  వచ్చేసరికి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మెదిలారు. అప్పుడాయన లేకున్నా, ఆయన రాసిన గీతాల్ని వెలికి తీసి ప్రజానీకానికి పరిచయం చేయాలన్పించింది దాసరికి. అలా- ఆకులో ఆకునై... ముందు తెలిసేనా...  వంటి కృష్ణ శాస్త్రి గీతాలు తీసుకున్నారు. వేటూరి చేత-  ఆకాశ దేశాన... ప్రియే చారుశీలే...  వంటి పాటలు రాయించారు. మరి అక్కినేనికి పాడే దెవరు? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో వున్నారు. పైగా  ‘శంకరాభరణం’ లో ఆయన పాడేశారు. ఇంకెవరైనా కొత్త గాయకుణ్ణి తన తరపు నజరానాగా ప్రేక్షకులకి అందించాలన్పించింది దాసరికి. అప్పుడు అడుగు పెట్టిందే గాన గంధర్వుడు కేజే ఏసు దాస్. ఇక ఏసుదాస్ గళం గలగలలతో  ఆ పాట లెక్కడ తాకాయో వేరే చెప్పనవసరం లేదు. పి. సుశీల సరే, ఆమెకి కూడా ఏసుదాస్ తో పాటుగా జాతీయ ఉత్తమ గాయని అవార్డు లభించింది. పాడనా వాణి కల్యాణిగా...అని బాలమురళీ కృష్ణ కూడా మరో పాట పాడి తెరాభినయం చేశారు కూడా. ఒకేసారి దాసరికి నాల్గైదు సినిమాలు చేసే సత్తా వున్నా, ‘మేఘసందేశం’ పూర్తయ్యేవరకూ మరో సినిమా జోలికి పోలేదు. ఇది తెలుగులో ఏ సినిమాకీ దక్కని 27 అవార్డులూ గెల్చుకుంది. ఇప్పుడూ దాసరి చాలా బిజీ. ఈ విశేషాలు చెప్పడానికి ఆయన అసిస్టెంటూ దర్శకుడూ అయిన నందం హరిశ్చంద్రరావు ముందు కొచ్చారు ఉత్సాహంగా. ఈయన కృష్ణం రాజు, జయప్రదలతో ‘సర్దార్’, జయసుధతో ‘దుర్గాదేవి’ లు తీయడమేగాక, ‘చిరునవ్వుల వరమిస్తావా’ లో తమిళ స్టార్ విక్రంని పరిచయం చేసిన ఘనత కూడా దక్కించుకున్నారు.


-సికిందర్
(డిసెంబర్ 2009, ‘సాక్షి’)
http://www.cinemabazaar.in