రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, అక్టోబర్ 2016, గురువారం

రివ్యూ

రచన- దర్శకత్వం: మహదేవ్‌
తారాగణం : నిఖిల్‌ గౌడ, దీప్తీ సతి, జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌, అవినాష్‌, సుప్రీత్‌, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు
కథ : విజయేంద్ర ప్రసాద్,
సంగీతం: ఎస్ ఎస్ తమన్‌,  ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
బ్యానర్ :
చన్నాంబికా  ఫిల్మ్స్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి,
నిర్మాత: అనితా కుమారస్వామి
విడుదల: అక్టోబర్ 6,  2016
         ***
       మాజీ ప్రధాని  హెచ్ డి దేవె గౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి గౌడ కొడుకూ అయిన  నిఖిల్ గౌడ హైపర్ యాక్షన్ హీరోగా అట్టహాసంగా కన్నడ- తెలుగు వెండి తెరలకి ఈవారం పరిచయమయ్యాడు. భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఎస్ ఎస్ రాజమౌళి క్యాంపు నుంచి విజయేంద్ర ప్రసాద్ కథ అందించి, మహాదేవ్ దర్శకత్వం వహించి ‘జాగ్వార్’ అనే ఈ బిగ్ బడ్జెట్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దక్షిణాదిలో 75 కోట్ల బడ్జెట్ తో ఓ  కొత్త హీరోతో నిర్మించిన మొదటి సినిమాగా రికార్డుల కెక్కిన ఈ తెలుగు- కన్నడ బై లింగ్వల్ లో జగపతిబాబు, బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌ రాజ్, ఆదిత్యామీనన్‌,  రావు రమేష్‌, రమ్యకృష్ణల వంటి హేమాహేమీల్ని  నటింపజేసి కన్నడ వాసనలు సోకకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఉన్నత శ్రేణి సాంకేతికులు, ఉన్నత నిర్మాణ విలువలూ కలిగిన ఈ యాక్షన్ మూవీలో అసలు విషయమేమిటి? సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాగా  జాగ్వార్ ఒక సూపర్ హీరో కథనా? టెక్నో థ్రిల్లర్ అనిపించే ఒక స్వాప్నిక జగత్ విహారమా? ఇది తెలుసుకోవాలంటే ఓసారి విషయంలో కెళ్ళాలి...
కథ  
    శౌర్యప్రసాద్ (సంపత్ రాజ్) ఎస్ ఎస్ టీవీ ఛానెల్ యజమాని. ఓ రాత్రి అతడి ఛానెల్లో ఓ హత్యా దృశ్యం లైవ్ గా ప్రసారమవుతుందని ప్రచారమవుతుంది. లక్షలాది ప్రేక్షకుల సాక్షిగా  ఓ ముసుగు వీరుడు ఓ జడ్జి (రవి కాలే) ని హత్య చేసి పారిపోతాడు. ఈ సంచలనంతో సీబీఐ అధికారి జేబీ (జగపతి బాబు)  ఆ ముసుగు వీరుణ్ణి పట్టుకోవడానికి రంగంలోదిగి, వాడికి  జాగ్వార్ అని నామకరణం చేస్తాడు. జాగ్వార్ అయిన ఎస్ ఎస్ కృష్ణ అనాధ నని చెప్పుకుని  ఏమీ తెలీనట్టు మెడికల్ కాలేజీలో చేరతాడు. ఆ మెడికల్ కాలేజీ - కమ్ - ఆస్పత్రి చైర్మన్ గా ఆదిత్య (ఆదిత్యా మీనన్) వుంటాడు. ఇదే కాలేజీలో ఆర్య (ఆదర్శ్ బాలకృష్ణన్), అతడి చెల్లెలు ప్రియ ( దీప్తీ సతి) చదువుతూంటారు. చలాకీ కుర్రాడైన ఎస్ ఎస్ కృష్ణ  ప్రియని తన ప్రేమలో పడేసుకుంటానని ఆమె అన్నని ఉడికిస్తూ  ఆమె వెంటపడుతూంటాడు. కాలేజీలో విద్యార్థి నాయకుడైన ఆర్య, ఆస్పత్రిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన లేవదీస్తాడు. ఈ ఆందోళనని అణచడానికి వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్  శంకర్ (సుప్రీత్) ని రాత్రి పూట చంపుతూ, అదే టీవీ ఛానెల్లో మరో లైవ్ ఇస్తాడు జాగ్వార్ కృష్ణ. తమ ఛానెల్ ని ఎవడో జాగ్వార్ గాడు హ్యాక్ చేసి ఇలా హత్యల్ని లైవ్ ఇస్తున్నాడనీ ఆగ్రహించిన యజమాని శౌర్యప్రసాద్- అలాగే తమ ఆస్పత్రి అక్రమాలపై విద్యార్దులు ఆందోళన చేస్తున్నారనీ చైర్మన్ ఆదిత్యాలు- ఆర్యని  జాగ్వార్ గా అనుమానించి అతణ్ణి చంపడానికి ప్లానేస్తారు. ఈలోగా సీబీఐ అధికారి జేబీ  తన ఏజెంట్ గా పద్మనాభం  (బ్రహ్మానందం) ని  ఆదిత్య ఇంట్లోకి దింపుతాడు. కృష్ణ కూడా అదే ఇంట్లో చేరతాడు. ఇలా విలన్ల ఇంట్లో పాగావేసిన ఈ ఇద్దరూ- ఏం చేశారు? అసలు విలన్ల మీద కృష్ణ పగకి కారణ మేమిటి? ఇంకెంత మందిని ఇలా చంపుతాడు? దీనికి అతడి తల్లిదండ్రులతో (రమ్యకృష్ణ, రావురమేష్) లతో సంబంధ మేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే! 

ఎలావుంది కథ 
      తెలుగులో ప్రతీవారం వస్తున్న ఇడ్లీ కథలాగే వుంది. ఇందులో ఇంకో మాటకి తావులేదు. ఓల్డ్ మాస్టర్ విజయేంద్రప్రసాద్ చాలా ఓల్డ్ రివెంజి డ్రామాని రాసేసి శిష్యుడు మహదేవ్ కి ఇచ్చేశారు. ‘జాగ్వార్’  అంటే ఇదేదో ‘మ్యాట్రిక్స్’ లా, ‘ధూమ్ -3’ లా టెక్నో థ్రిల్లర్ అయివుంటుందని భావించుకుని కళ్ళకద్దుకుని కొత్త కుర్రాడి మీద తీసేశాడు దర్శకుడు మహాదేవ్. కొత్త కుర్రాడికి పాతిక ముప్పయ్యేళ్ళ క్రితం కథలిలా వుండేవని ఏం తెలుస్తుంది. పైగా ఒక రేస్ బైక్, స్పై కెమెరా, బ్లాక్ కాస్ట్యూమ్స్ అందిస్తే కొత్త కొత్తగానే కన్పిస్తుంది అంతా. చాలా పాత మోడల్ కథకి అత్యాధునిక హంగులు జతచేస్తే కొత్తకాలానికి చెల్లిపోదని ఈ కథతో రుజువవుతోంది. తన చిన్నప్పుడు తల్లిదండ్రులకి జరిగిన అన్యాయానికి పగదీర్చుకునే హీరో కథే పాత అనుకుంటే, ఇందులో మళ్ళీ కోన వెంకట్ బ్రాండ్- ‘సెకండాఫ్ కథలో విలన్ ఇంట్లో హీరో చేరి వాళ్ళని బకారాలని చేయు’ అనబడు సింగిల్ విండో స్కీమ్ కథ  మళ్ళీ ఇక్కడా ప్రత్యక్షమయ్యింది- ఈ మధ్య ఇలాటి కథలతో  సినిమాల గొడవ వదిలిందనుకుంటే. రచయిత విజయేంద్ర ప్రసాద్ తను ఒక సినిమా కథ రాసేముందు  విధిగా ‘షోలే’ చూస్తానన్నారు. ‘షోలే’ నే చూస్తూంటే ఎలా, ఓసారి ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’  చివరి భాగంకూడా చూసి వుంటే ప్రస్తుత పాత కథకే  ఎంతో  వన్నె చేకూర్చే వారయ్యే వారు. పాత కథలకి వన్నె చేకూర్చేది కొత్త కథన టెక్నిక్కులే తప్ప- ఎలాటి పిక్చరైజేషన్ టెక్నాలజీ కాదు. 

ఎవరెలా చేశారు 
    కొత్త హీరోగా అడుగు పెట్టిన నిఖిల్ గౌడ శారీరకంగా సమసౌష్టవంగా వున్నా, వ్యావహారికంగా ఇంకా వికసించాల్సి వుంది. మన హీరో కాదు కాబట్టి ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. జగపతి బాబు ఈ సినిమాలో ఎందుకు నటించినట్టో అర్ధంగాదు. చంపుతున్న హీరోకి జాగ్వార్ అని తనే నామకరణం చేసి, పట్టుకునే తంతు లేకుండా,  హత్యలుచేస్తూంటే ఆపే పనే లేకుండా,  సెకండాఫ్ లో కాసేపటికి సినిమాలోంచే హాయిగా అదృశ్యమైపోయే ‘నిరుద్యోగ పాత్ర’ ఎందుకు పోషించినట్టో సినిమా కథని మించిన మిస్టరీగా వుంది. కథలో విజయేంద్ర ప్రసాద్ ఇవ్వలేని లేని మిస్టరీని,  ఇలా హాయిగా తన అదృశ్యంతో తీర్చినట్టుంది. బ్రహ్మానందం, రఘుబాబుల పాత్రలు కూడా డిటో- అర్ధోక్తిలో హాయిగా అంతర్ధానమై పోతాయి. రమ్యకృష్ణ, రావురమేష్ లుకూడా హాయిగానే జీవంలేని పాత్రల్లో  కన్పిస్తారు. రావురమేష్ చాలా అనాసక్తిగా వున్నట్టన్పించే  పాత్ర పోషణ ఇదే బహుశా. ఇద్దరు విలన్లు- సంపత్ రాజ్, ఆదిత్యా మీనన్ లు- వీళ్ళే  రొటీన్ గానే అయినా కాస్త హడావిడీ చేస్తూ కన్పిస్తారు. ఇక హీరోయిన్ దీప్తీ సతి గురించి చెప్పుకోవడానికేమీ లేదు- పాటలకి, ప్రేమ సీన్లకి కన్పించే గ్లామర్ బొమ్మ పాత్ర కాబట్టి. చివరి పాటలో ఐటెం గర్ల్ గా దర్శన మిచ్చే తమన్నాతో  ఆ కాసేపూ హుషారొస్తుంది ప్రేక్షక దేవుళ్ళకి. 

        సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ తన పూర్వ వైభవం కోసం విఫల యత్నం చేస్తున్నట్టు మళ్ళీ కన్పిస్తుంది ఈ సినిమాలో. బిజిఎం కూడా సరీగ్గా కుదరలేదు. మనోజ్ పరమహంస సమకూర్చిన ఛాయాగ్రహణం ఎప్పట్లాగే తన బ్రాండ్ విలువలతో చెప్పుకోదగ్గదిగా వుంది. క్లైమాక్స్ లో రామ్  - లక్ష్మణ్ లు సమకూర్చిన యాక్షన్ కొరియోగ్రఫీ చాలా కాలం తర్వాత మొనాటనీని బద్దలు కొట్టి ఫ్రెష్ గా వుంది.

చివరికేమిటి 
     నందమూరి బాలకృష్ణతో గతంలో ‘మిత్రుడు’ తో విఫలయత్నం చేసిన దర్శకుడు మహదేవ్ ప్రస్తుత మెగా మూవీతోనూ అడుగు ముందుకు వేయలేకపోయాడు. ప్రధాన కారణం స్క్రిప్టే. ప్రొడక్షన్ విలువలతో స్క్రిప్టు విలువలు సరితూగకపోవడం. ఇంత భారీ బడ్జెట్ తో ఈ స్క్రిప్టు పదునైన కత్తిలా వుండాల్సింది. మనస్కరిస్తే అలా ఉండేందుకు చాలా అవకాశముంది- కానీ ‘రుజువైన, ప్రేక్షకులకి కొట్టిన పిండి అయిన పాత ఫార్ములాయే’  చాలు మనకి సేఫ్ అనుకుంటే సానబెట్టేందుకు ఏమీ వుండదు, అసలుకే ఎసరొస్తుంది.  కానీ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ కాలానికంటే  ముందుంది  కథనానికి. అందుకనే ఇవ్వాళ్ళ రిమేక్ చేసినా ఇవాల్టి సినిమాలాగే వుంది తప్ప- ‘జాగ్వార్’ లా గడిచిపోయిన కాలపు చాదస్తంలా లేదు. ముసుగు వీరుడు జాగ్వార్ మెరపులా ఎక్కడ్నించి వస్తాడో, ఎవర్ని చంపుతాడో అంతుచిక్కని మిస్టరీగా వుండాల్సింది- అతణ్ణి  రొడ్డ కొట్టుడుగా, నవ్యత లేకుండా  అదే అరిగిపోయిన కాలేజీ స్టూడెంట్ గా  మార్చేసినప్పుడే కిక్, పెప్ అంతా పోయింది. ఎన్ని సార్లు ఈ కాలేజీ కజ్జాలూ, వారం వారం చూస్తున్న అదే ఫార్ములా ప్రేమలూ పాటలూ చూస్తూ ఇంటర్వెల్ వరకూ సహనం వహించాలి? అన్ని ఆర్ధిక వనరులూ, సాంకేతిక సహాయమూ వున్న ఇలాటి మెగా మూవీస్ కూడా సగటు సినిమా విషయ విన్యాసాలతో విసుగెత్తేలా వుండాల్సిందేనా? జరుగుతున్న అక్రమా లపై  విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలకి అదృశ్య శక్తిగా, ఆపద్బాంధవుడిగా, జేజేలందుకునే ఒక ఆరాధ్య దైవంలా జాగ్వార్ వుండాల్సింది పోయి- పాత మోడల్ డ్రామా లేస్తూ విలన్ ఇంట్లో కూర్చోవడమేమిటి? ఎన్ని సార్లు ఇదే చూపిస్తారు? అతనొక హ్యాకర్, టెక్నో క్రాట్, లోకానికి ఐడెంటిటీ తెలీని హైటెక్ కిల్లర్- అలాటివాడు లోకకల్యాణం కోసమే అస్త్రశస్త్రాలు ప్రయోగించాలే  తప్ప- ఓపెన్ గా సొంత పగేదో తీర్చుకుంటూ దిగజారి పోవడమేమిటి? మాకు జాగ్వారే కావాలి, జాగ్వారే రావాలి – అంటూసమాజం ఎలుగేత్తేలా ఆ వేషధారణతో,  మానవాతీత వ్యూహాలతో ఒక పురాణ పాత్ర (మిథికల్  క్యారక్టర్) లా ఆత్మిక దాహాన్ని తీరుస్తూ వుండాలే గానీ- తన స్వార్ధం కోసం తన దాహం తాను తీర్చుకునే అట్టడుగు వ్యక్తిలా వుండడ మేమిటి? 

        డెంజిల్ వాషింగ్టన్ ‘ది మాగ్నిఫిషెంట్ సెవెన్’ లో తన కౌబాయ్ గ్రూపుతో గ్రామానికి విలన్ ముఠా పీడా విరగడ చేయడానికి ఆపద్బాంధవుడిలా వస్తాడు. పీడా విరగడ చేసి, చివరికి విలన్ని చంపుతూ - ‘నా చిన్నప్పుడు  మా అమ్మనీ, ఇద్దరు చెల్లెళ్ళ నీ నువ్వు చంపావ్ గుర్తుందా?’ అంటాడు. ఈ ఎండింగ్ స్టేట్ మెంట్ కి మనం కూడా షాకవుతాం. విలన్తో అతడికి పాతపగ వుందని మనకి కూడా అప్పటివరకూ తెలియదు. ఇలా చివరికి తెలిసినప్పుడు వాషింగ్టన్ పాత్ర ఎంతో ఉన్నతంగా కన్పిస్తుంది. అతను ఇంత బాధ దాచుకుని గ్రామం కోసం చేశాడన్న మాట. హీరో అనేవాడి  మొదటి ప్రాధాన్యం  పర సుఖమే, తన సుఖం తర్వాత!

-సికిందర్
http://www.cinemabazaar.in