రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, July 15, 2016

రివ్యూ!





స్క్రీన్ ప్లే – దర్శకత్వం : జి. ఈశ్వర్ రెడ్డి


తారాగణం : అల్లరి నరేష్, సాక్షీ చౌదరి, కామనా రణౌత్, రవిబాబు, పృథ్వీ, నాగినీడు. సప్తగిరి, షకలక, సత్య తదితరులు
మాటలు : డైమండ్ రత్నం, సంగీతం : సాయికార్తీక్, ఛాయాగ్రహణం : లోకనాథ్
 బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్ – గోపీ ఆర్ట్స్
నిర్మాత : చలసాని రామబ్రహ్మం చౌదరి
విడుదల : 15 జులై, 2016  
 ***

       అల్లరి నరేష్ కి ఇంకా అల్లరి తక్కువ అయోమయం ఎక్కువా అన్నట్టు తయారయ్యింది. 2012 లో ‘సుడిగాడు’  తర్వాత ఇంతవరకూ ఇంకో హిట్ కూడా లేని (వరసగా 9 ఫ్లాపులు) తనకి ఇప్పడు మరో ఫ్లాపు కూడా తోడయ్యింది. తన బ్రాండ్ అల్లరిని పూర్తిగా మర్చిపోయి, ఎంతసేపూ  ‘సుడిగాడు’ నే అనుకరిస్తూ,  అదేపనిగా ఇతర హీరోలని పేరడీ చేసే మూసలో పడిపోవడం ఈ ఏకైక కామెడీ హీరోకి  ట్రాజెడీగా పరిణమించింది. పేరడీలమయమైన ‘సెల్ఫీరాజా’ టైటిల్ ని  ‘స్పూఫీ రాజా’ గా పెట్టుకుని ఇది మరో పేరడీ గారడీ అని  డైరెక్టుగా చెప్పేస్తే సరిపోయేది- ‘సెల్ఫీ రాజా’  టైటిల్ తో ఈ సినిమా కథ(?) కేం సంబంధం లేదు!

       దర్శకుడు జి. ఈశ్వర్ రెడ్డి ఇంకా గత శతాబ్దంలోనే వుండిపోవాలనుకుంటే వుండి పోవచ్చు. కానీ బయ్యర్లూ ప్రేక్షకులూ  ఈ శతాబ్దంలో వుండాలనుకుంటున్నారు. అందుకు పది వారాలుగా ‘బిచ్చగాడు’ ని ఆడిస్తున్నారు. ఇంకా కథా కాకరకాయా లేని పేరడీలూ; పాములతో, మారు వేషాలతో, దాగుడుమూతల దొంగాటలతో చెలామణి చేద్దామనుకునే చైల్డిష్  కామెడీల్ని, బూతు వ్యవహారాల్నీ ఎంజాయ్ చేసే ఓపికతో  ప్రేక్షకులు లేరు. గృహమే కదా స్వర్గసీమా అన్నట్టు ఈ దర్శకుడు తనలోకంలో తాను  ఎంజాయ్ చేసిందే కామెడీ అనుకుంటూ సబ్జెక్టివ్ గా ప్రేక్షకుల నెత్తిన రుద్దిన ‘సి’ గ్రేడ్ సరుకులా వుందిది. 

        కథంటూ వుంటే అది ఇంటర్వెల్ లోపే అయిపోవడం,  ఆపైన సాగదీసిందంతా తలాతోకాలేని, ఏమిటో అర్ధంకాని, గజిబిజి గందరగోళం కావడం-  ఇదంతా ఈసారి కామెడీతో పరాకాష్టకి చేరిన అల్లరి నరేష్ పరిహాసంలా వుంది! 

కథ 
      రాజా (అల్లరి నరేష్) సెల్ఫీ  పిచ్చితో ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, నోటి దూలతో తనే ఇబ్బందుల్లో పడ్డం జీవితంగా గడుపుతూంటాడు. ఏం చేస్తూంటాడో మనకి  తెలీదు, చెవిటి వాళ్ళయిన బాబాయ్- పిన్నీలతో  వుంటాడు. ఒకరోజు పోలీస్ కమిషనర్ (నాగినీడు) కూతురు శ్వేతతో (సాక్షీ చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఈమె కూడా ఏం చేస్తూంటుందో మనకి తెలీదు. ఇద్దరికీ పెళ్లి నిశ్చయమై  ఆ పెళ్లి  కాస్తా జరిగిపోతుంది. మొదటి రాత్రి  రాజా గర్ల్  ఫ్రెండ్ ఒక గిఫ్ట్ పంపడంతో రాజాతో కొట్లాడి శ్వేత విడిపోతుంది. ఆమెకి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు, వెళ్లి చావమంటుంది. చావడానికి విఫలయత్నాలు చేస్తాడు. ఒక కాకి (కాంట్రాక్ట్ కిల్లర్- రవిబాబు) కన్పిస్తాడు. అతడికి డబ్బిచ్చి తనని చంపమంటాడు.  ఇంతలో శ్వేత వచ్చి రాజా గర్ల్ ఫ్రెండ్ గురించి తను తప్పుగా అర్ధం చేసుకున్నానని  కాళ్ళ మీద పడుతుంది. రాజా కంగారు పడతాడు, తనని చంపకుండా కాకి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు...

 ఎలావుంది కథ 
        పైన చెప్పుకున్నంత వరకే కథ- ఆపైన కథ వుండేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే  శ్వేత వచ్చి కాళ్ళ మీద పడిందో ఆ గంట లోపే కథ ఖతం! ఇంకో గంట కథ ఉండాలి కాబట్టి లేని కథకి – ఎలాగైతే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లో ఇంటర్వెల్ నుంచీ వేరే  దొంగల కథ తెచ్చి అతికించారో -  అలా అంతకంటే రసాభాసగా అర్ధంపర్ధంలేకుండా నింపేశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ కి కవల తమ్ముడు ‘సెల్ఫీ రాజా’. 

 ఎవరెలా చేశారు 
      ఎవరూ ఏమీ చేయలేదు. చేసి వుంటే మొదటి గంట లోపే - కథ ఉన్నంత సేపే- అల్లరి నరేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్, పృథ్వీ, మరికొందరు జబర్దస్త్ కమెడియన్లు చేశారు. ఆ తర్వాత చేసిందంతా తలకాయనొప్పి. బూతు- చివరి షాటు వరకూ ‘‘గే’ కామెడీ. మొదటి గంటలోపు కామెడీకి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ - థాంక్స్ టు  డైమండ్ రత్నం డైలాగ్స్- రెండో గంటంతా లేదు. ఇక రెండో పాత్రలో అల్లరి నరేష్ దిగడం వున్న అర్ధంకాని వ్యవహారానికి ఇంకా సహన పరీక్షయి కూర్చుంది. సినిమా అంటే నిమిషానికో పాత్రని దింపుకుంటూ పోవడమే అన్నట్టుంది- ఏ పాత్ర ఏమిటో ఎందుకో అర్ధంగాక ఫాలో అవడం మానేస్తాం మనం. ఇక హీరోయిన్లకి పాత్రలే లేవు- వున్నట్టుండి వచ్చే పాటల్లో  కన్పించి వెళ్లిపోతూంటారు. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్  కూడా ఏమంత గ్లామరస్ గా లేదు. పాత్ర ఎలా ఎస్టాబ్లిష్  అయింది, ఎలా చిల్లర కామెడీ కింద దిగజారిందీ తెలిసీ పాపం రవిబాబు నానా కంగాళీ చేస్తూంటే జాలిపడాల్సి వస్తుంది మనకి.  

        సాయికార్తీక్ కూర్చిన పాటలు మాత్రం క్యాచీగా వున్నాయి, అలాగే లోకనాథ్ ఛాయాగ్రహణం ప్లెజంట్ గా వుంది. ఈశ్వర్ రెడ్డి కథా నిర్వహణ, దర్శకత్వం మాత్రం చాలా దిగువ స్థాయిలో  వున్నాయని చెప్పక తప్పదు. అతనింకా బేసిక్ గా సినిమా అంటే ఏమిటో, ప్రేక్షకులతో ఎలా కనెక్ట్ అవాలో అ ఆ ల దగ్గర్నుంచీ నేర్చుకోవాల్సి  వుంది- కళాఖండాల గురించి కాదు, ఉత్త కమర్షియల్స్ గురించే!

చివరికేమిటి
        అరగంట లోపు బిగినింగ్ ని సెటప్ చేస్తే అది ప్రాణాంతాకంగా మారడం పరిపాటైంది ఈ మధ్య తెలుగు సినిమాలకి. అరగంటలోపే  హీరోని సమస్యలో పడేశాక ఆతర్వాత మిగతా గంటన్నరో, రెండు గంటలో కథ ఎలా నడపాలో అంతుచిక్కక  ఇంటర్వెల్ కల్లా చేతు లెత్తేస్తున్నారు. తాజాగా  ‘రోజులు మారాయి’ లోకూడా చూశాం. ఇప్పుడు ‘సెల్ఫీ రాజా’ లోనూ అరగంటలో అల్లరి నరేష్ పెళ్లి చేసేసి భార్యతో సమస్యలో పడేస్తూ ఆశ్చర్య పరుస్తుంది. ఇక్కడ్నించీ ఫస్టాఫ్ అంతా, ఇంకా సెకండాఫ్ అంతా ఆ సమస్యతో ఎలా నడుపుదామని?

         
దర్శకుడు అల్లరి నరేష్ కిచ్చింది యాక్టివ్ క్యారక్టరేనా? అది పాసివ్ క్యారక్టర్ కాదా? మరైతే భార్య తనని అనుమానించినప్పుడు- అసలా గిఫ్ట్  పంపిన ఆకాశరామన్న  ఎవడో  తనే తెలుసుకుని-  భార్య  అనుమానం తీర్చకుండా వూరికే భార్యకి నచ్చజెప్పుకునే విఫలయత్నా లెందుకు చేస్తాడు? ఆకాశరామన్న ఎవడో  పోలీస్ కమీషనర్  అయిన మామ తెలుకోవాల్సి వచ్చింది! అప్పుడు భార్య వచ్చి కాళ్ళ మీద పడితే అల్లరి నరేష్ సమస్య తీరిపోయింది! ఇది పాత్రేనా? దీంతో ఇదొక కథేనా?

        దీనికంటే ముందు విసిగిన భార్య వెళ్లి చావమంటుంది. నరేష్ చావాలనుకోవడం మంచి మలుపే. కానీ దీనికి తగ్గ సెటప్ ఏదీ? బిగినింగ్ ని ముగిస్తూ భార్య విడిపోయినప్పుడు,  నరేష్ కి పెట్టిన సమస్య కి - అపార్ధం తొలగించాలన్న గోల్ కీ - ఉండాల్సిన సీరియస్ బ్యాక్ గ్రౌండ్ ఏదీ? కామేడీల్లో బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా లేకపోతే   హీరోకి కామెడీతో సమస్య ఎలా పుడుతుంది? గోల్ ఎలా ఏర్పడుతుంది? ఆపైన కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది? కామెడీల్లో బ్యాక్ గ్రౌండ్  సీరియస్ గా వుండి, హీరో సీరియస్ గా వుండనవసరం లేదు కదా?  బ్యాక్ గ్రౌండూ సీరియస్ గా లేకుండా, నరేష్  కామెడీగా వుండడం వల్లే కదా అతను చావాలనుకోవడం అల్లాటప్పా వ్యవహారంగా మారిపోయింది?

        చావాలనుకోవడం పాసివిజం కాదు, బ్యాక్ గ్రౌండ్ సీరియస్ గా వుంటే! నరేష్  తనే ఆకాశ రామన్నని పట్టుకుని నిజం నిరూపించినా ఎందుకో నమ్మని భార్య- ఇంకా బలమైన మాటలతో  గాయపరిస్తే - అప్పుడు మాత్రమే చావాలనుకోవడం వర్కౌట్ అవుతుంది. సానుభూతి కూడా పుడుతుంది. ఐరనీ లోంచే హాస్యం పుడుతుంది. ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే హిందీ హిట్ కామెడీ లోనూ ఇంతే. అప్పుడు చావాలకునే గోల్ తో నరేష్  ఎంత అసంబద్ధ కామెడీ నైనా సృష్టించవచ్చు. చావడానికి రెండో ప్రయత్నంగా అల్లరి నరేష్ బిల్డింగ్ ఎక్కినప్పుడు తాగుబోతు రమేష్ అతణ్ణి తోసెయ్యడం, అక్కడ్నించీ ఇంకెవరొచ్చినా   తోసిపారేస్తూ వుండడం పడీ పడీ నవ్వించ గల్గిన కామెడీనే. ఇంత సామర్ధ్యం ఆతర్వాత దర్శకుడిలో ఏమైపోయింది? బ్యాక్ గ్రౌండ్ లో సీరియస్ నెస్ లేకపోయినా ఇది వర్కౌటయింది. కానీ పదే పదే వర్కౌట్ కాదు. అప్పుడు తనని చంపమని కాకికి సుపారీ ఇచ్చాడు నరేష్. అంటే ఈ పాయింటుతో కథ ఇక్కడ్నించీ రన్ అవుతుందని అర్ధం. ఈ పరిణామాలన్నీ సమస్యతో నరేష్ చేస్తున్న సంఘర్షణలో భాగం  కిందికే వస్తాయి. 

        దీంతో అభ్యంతరం లేదు గానీ- భార్య వచ్చి కాళ్ళ మీద పడగానే ఓ ఫ్లాష్ బ్యాక్ వేసి అంతకి ముందు కాకికి తను కాంట్రాక్ట్ ఇచ్చింది చూపించి వెంటనే ఇంటర్వెల్ వేసెయ్యడం  ఉరుములేకుండా పిడుగు పడేసినట్టుంది. హఠాత్తుగా  ముగించి పారేసే సినిమాల్ని చూశాం గానీ, ఇలా హఠాత్తుగా ఇంటర్వెల్ వేసే సినిమాల్ని చూసి వుండం! తెల్లబోయి ఖాళీ వెండి తెర కేసే చూడ్డం మన వంతవుతుంది! 

     వాస్తవానికి భార్య దారికొచ్చి నప్పుడే  అల్లరి నరేష్ ఏమీ చేయకుండానే ఇంటర్వెల్ లోపే కథ సుఖాంతమైంది. ఇక మిగిలింది కాకి గురించిన ఫినిషింగ్ టచ్చేనా? ఒకసారి కాంట్రాక్టు తీసుకున్నాక చంపకుండా వదలనన్న వాడి గురించేనా? వాడి సంగతి కూడా నెక్స్ట్ సీన్లోనే పోలీస్ కమీషనర్ మామ చూసుకుని ఫినిషింగ్ టచ్ ఇస్తాడుగా- ఆపైన ఇంటర్వెల్ లేకుండా శుభం కార్డు వేసేస్తూ?


        చంపాలన్న కాకి ఏటో పోతాడు. కమీషనర్ తో ఇరవైఏళ్ల పగ వున్న  రౌడీ ఒకడు   నరేష్ ని చంపాలని వెంటబడతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ పృథ్వీ చేసిన బూతు పనికి ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళ గుంపుతో అతడి వెంటపడతారు. రవిబాబు, అతడితో బాటు నరేష్ తన పాములతో పాల్పడిన ఇంకో బూతుకి అవి చచ్చాయని ఓ పాములోడు షకలక శంకర్ వాళ్ళిద్దరి వెంటా  పడతాడు. రవిబాబు తమ్ముణ్ణి అంటూ ఇంకో అల్లరి నరేష్ దిగుతాడు. ఇతన్ని చంపడానికి ఇంకెవరో....గోలగోలగా అరుపులూ, కొట్టుకోవడాలూ పారిపోవడాలూ...అసలు మొదలెట్టిన కథేమిటి? ఫోకస్ చెదిరి జరుగుతున్న దేమిటి? 

        భార్య అప్పుడే కాళ్ళ మీద పడకుండా,  తనని చంపమని కాకికి అల్లరి నరేష్ ఇచ్చిన కాంట్రాక్టుతో మరో కోణంలో మరిన్ని విఫలయత్నాలు చూపిస్తూ కథని ఫోకస్ లో పెట్టుకోకుండా,  దర్శకుడు తానొక్కాడు ఆనందిస్తే చాలు అదే కామెడీ అనుకోవడం నిజానికి కామెడీ అనుకోవాలి ఇక్కడ!


-సికిందర్
http://www.cinemabazaar.in