రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

Monday, December 14, 2015

కొటేషన్ల కహానీ!
ర్శకులకీ, రచయితలకీ  ది బెస్ట్ కొటేషన్ గా నిల్చిపోయిన నా ఫేవరేట్ ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కొటేషన్ ఏమిటంటే, విసుగెత్తే  అంశాలన్నిటినీ  కత్తిరించేసిన నాటకీయతే నిజ జీవితమని! అలాగే మరొక కొటేషన్ జీన్ లక్ గోడార్డ్ చెప్పింది కూడా నా ఫేవరేట్ కొటేషనే : సినిమా అంటే సత్యంకోసం, లేకపోతే  సత్యాన్ని  కనుగొనే ప్రయత్నం కోసం, సెకనుకి 24 అసత్యాలని చెప్పే అబద్ధాల పుట్ట అని నేనల్లప్పుడూ చెబుతూ వచ్చాను- అనేది.

కొటేషన్స్ గురించి ఆలోచించండి. రెండూ వాస్తవాలే. ఉదాహరణకి, మీ క్యారక్టర్ ఒకటి ఒక ప్రదేశాన్నుంచీ  ఇంకో ప్రదేశానికి ప్రయాణించాలనుకుందాం. ఓ గంటో ఇంకా ఎక్కువ సేపో  ఆ  క్యారక్టర్ చేస్తున్న ప్రయాణాన్ని చూపిస్తూ పోనక్కర్లేదు. క్యారక్టర్  కారెక్కుతుంది, డ్రైవ్ చేసుకుంటూ పోతుంది, అలా వెళ్ళిన క్యారక్టర్ బహుశా తర్వాతి సీన్లో గమ్యం చేరుకున్నట్టు  మీరు చూపిస్తారు. ఈ పాయింటు దగ్గర్నుంచి నేరుగా  ఆ క్యారక్టర్ ఇంటి తలుపు కొడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.  లేదా ఆ ఇంటి లోపల కూర్చుని కాఫీ తాగుతూ తను ఎవరికోసం వచ్చిందో వారితో మీ క్యారక్టర్ మాట్లాడుతున్నట్టు మీరు చూపించ వచ్చు.

అంతే గానీ మీ  క్యారక్టర్ కారు ఇంజన్  ఆఫ్ చేసి, కారు దిగి, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఇంటి దాకా వెళ్లి నట్టు మీరు చూపించరు. ఉద్దేశపూర్వకగా ఒక పాయింటుని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే తప్ప అలా డిటైల్డ్ గా చూపించరు. బహుశా మీ క్యారక్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ రకం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు, అలా వివరంగా దాని చర్యల్ని ప్రధానం చేసి చూపించవచ్చు. కీ తిప్పి ఇంజన్ ఆఫ్ చేసి, డాష్ బోర్డు తుడిచి, అనుమానంతో మళ్ళీ కీ తిప్పి ఇంజన్ ఆన్ –ఆఫ్ చేసి, ఆఫ్ లోనే వుందని నిర్ధారించుకుని, అప్పుడు గానీ కారు  దిగినట్టు చూపించవచ్చు.

సినిమాలు అబద్ధాల పుట్టలని చెప్పడం  పూర్తిగా నిజం. ఎందుకంటే మొత్తం క్యారక్టర్ జీవితకాలాన్నీ ఓ రెండు గంటల్లో  చూపించేసి ముగించేస్తారు  గనుక.

రచయితలు  సర్వ సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే, సీన్లు ముందుకు కదలకుండా అనేక వివరాలు ఇచ్చుకుపోవడం. ప్రతీ సీన్లో ఏదో క్యారక్టర్ రావడం, తనకి  హాబీ అయిన గేమ్ ఏదో ఆడడమో, ఇంకోటేదో చేయడమో చేసి, మంచినీళ్ళేదో తాగి, చెప్పాలనుకున్న డైలాగు చెప్పేసి వెళ్ళిపోవడం...ఇలాటివి!  ఇలా మీ క్యారక్టర్ ప్రవేశ  నిష్క్రమణాల్ని సవివరంగా చూపించే పని పెట్టుకో కూడదు. ఎందుకంటే సినిమా నిజ జీవితం కాదు. సినిమాల్లో రియల్ టైం లో సీన్లు నడవవు. వ్యర్ధమైన ఈ క్యారక్టర్ మూవ్ మెంట్స్ వల్ల, సీన్లు డైనమిక్స్ తగ్గి బోరు కొడతాయి.  హిచ్ కాక్ మాటల్లోనే  చెప్పుకుంటే, కత్తిరించి పారెయ్యదగ్గ  విసుగెత్తే అంశాలివి.

ఇదే సంగతి గోడార్డ్  ఇంకోలా చెప్పారు.  సినిమాలో జరిగిన క్రమం జరిగినట్టు స్పేస్ నీ , సమయాన్నీమింగేస్తూ చూపించడాన్ని అంతర్లీనంగానే కళ నిరోధించుకుంటూ పోతుంది. కనుక ఎమోషన్ ని పణంగా పెడుతూ  వాస్తవికత కోసం యమ కష్ట పడనవసరం లేదు. పకడ్బందీగా, డైనమిక్స్ తోనూ కూడినవిగా మీ  కథలుండాలంటే, వాస్తవికతని సర్దుబాటు చేసే భాష్యం వాటికి అవసరం. అప్పుడే కథలోని ఎమోషనల్ కోణం పట్టుబడుతుంది. ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని స్పర్శించగల్గడమే ఇక్కడ ముఖ్యం.  లేకపోతే అచ్చం వాస్తవికతనే ప్రతిఫలించే కథలు ప్రేక్షకుల ఇంద్రియాల్ని ఉత్తేజపరచే బదులు నిద్ర పుచ్చుతాయి.

విసుగెత్తే అంశాల కత్తిరింపు విషయానికొస్తే, మీ సినిమా కథని  వివరణ లిచ్చుకోవడంతో నింపెయ్య వద్దు. క్యారక్టర్స్  పనిలోకి దిగాలంటే, చాంతాడంత వివరణ ఇచ్చి దింపకూడదు. మీ కథలో క్యారక్టర్ చేసే జర్నీ ద్వారా,  ప్రతీ సీనులోనూ  ప్రేక్షకులని ఇన్వాల్వ్ చేయడమే ముఖ్యమని  గుర్తు పెట్టుకుంటే, విసుగెత్తే వివరణ జోలికి  మీరెళ్ళ లేరు. యాదృచ్ఛికంగా స్ట్రక్చర్ మీదా, కథ నడక మీదా దృష్టి పెట్టగల్గుతారు. ఇలా క్యారక్టర్, ప్లాట్ రెండిటి డెవలప్ మెంట్ తో కథమీద ఫోకస్ కూడా వుంటుంది.  ఈ సూత్రాల్ని పాటించడం వల్లే, సినిమా చరిత్రలో నిలిచి పోయిన ఉత్తేజభరితమైన సన్నివేశాల్నీ, కాల పరీక్షకి  తట్టుకుని నిలబడ్డ చలన చిత్రాలనూ రూపొందించగల్గారు హిచ్ కాక్,  గోడార్డ్ మహాశయులు.

వెండీ క్రామ్
(స్క్రీన్ రైటర్స్ కన్సల్టింగ్ కంపెనీ  నిర్వాహకురాలు)No comments: