స్క్రీన్ ప్లే- దర్శకత్వం : నిఖిల్ అద్వానీ
తారాగణం : ఇమ్రాన్ ఖాన్, కంగనా రణౌత్
కథ- మాటలు : అన్శుల్ సింఘాల్, సంగీతం : శంకర్- ఎహెసాన్- లాయ్,
ఛాయాగ్రహణం : తుషార్ కపూర్
బ్యానర్ : యూటీవీ మోషన్ పిక్చర్స్- ఎమ్మే ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : సిద్ధార్థ్ రాయ్ కపూర్, నిఖిల్ అద్వానీ
విడుదల : 18 సెప్టెంబర్ 2015
***
తీసిన పది సినిమాల్లో ఎనిమిది ఫ్లాపులిచ్చి కూడా బిజీగా
ఉంటున్న దర్శకుడెవరా అంటే నిఖిల్ అద్వానీయే.
గతవారం, ఈ వారం వెంట వెంటనే ‘హీరో’, కట్టీ బట్టీ’ అనే రెండు అట్టర్ ఫ్లాపులిచ్చి
సత్తా చాటుకున్న అద్వానీకి, ఫ్లాపులివ్వడంలో సూపర్ ఫాస్ట్ డైరెక్టర్ గా అవార్డు లివ్వొచ్చు.
ఎన్ని ఫ్లాపులిచ్చినా, ఇంకో ఫ్లాపు తీయడానికి నిర్మాత లెప్పుడూ సిద్ధంగానే వుండడం అతడి అదృష్టం కూడా, ప్రేక్షకుల దురదృష్టం
కూడా.
‘కట్టీ బట్టీ’ టైటిల్ ని చూసి ఇదేదో మాంచి రోమాంటిక్ కామెడీ అయ్యుంటుందని డబ్బు ఖర్చుపెట్టుకుంటే మాత్రం కోరి కఠిన శిక్ష విధించుకోవడమే. రెబెల్ పాత్రలతో మాంచి ఊపు మీదున్న కంగనా రణౌత్ ఇప్పుడింకేదో టెర్రిఫిక్ పాత్ర నటించి ఆశ్చర్యపరుస్తుందని అనుకుంటే కూడా ఫ్లాపులో కాలేసినట్టే.
స్వయంగా అగ్ర నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ సినిమా స్క్రిప్టు రఫ్ స్టేజిలో ఉన్నప్పుడే సూపర్ హిట్టని తెలిసిపోయిందనీ, టాలెంటెడ్ రచయిత అన్శుల్ సింఘాల్ సంవత్సరం పాటూ స్క్రిప్టు మీద పనిచేశాడనీ, దర్శకుడు నిఖిల్ అద్వానీ తోడ్పడ్డారనీ సగర్వంగా ప్రకటించారు. మరి రెండో రోజే ప్రేక్షకులెందుకు ముఖం చాటేశారో కూడా చెప్పాల్సి వుంటుంది. ఇంకా మొదటి సినిమా రాస్తూ అప్పుడే సింఘాల్ టాలెంటెడ్ రచయిత ఎలా అయిపోయాడో కూడా అర్ధం గాదు- యువరచయితగా ఇంత కాలం చెల్లిన ప్రేమకథ ఇచ్చాక!
అమీర్ ఖాన్ కూడా స్క్రిప్టులో కొన్ని మంచి సూచనలు చేశారనీ, ప్రివ్యూ చూశాక కన్నీరు కూడా కార్చారనీ ఇంకో పబ్లిసిటీ. ఇమ్రాన్ ఖాన్ తో బెడ్ రూమ్ సీన్ ని యూనిట్ సభ్యులెవర్నీ అనుమతించకుండా, తను షూట్ చూశానని కంగనా రణౌత్ అంటే, కాదు నేనే చేశానని ఇమ్రాన్ అనడం, స్క్రిప్టు చర్చల్లో తను కూడా మంచి ఇన్ పుట్స్ ఇచ్చినందుకు రచయిత్రిగా తన పేరు కూడా వేయాలని కంగనా పట్టుబట్టినట్టూ- ఇలా ప్రతి ఒక్కరూ స్క్రిప్టు మీద పడిపోయి దాన్నో కళా ఖండంగా మార్చేశామన్నట్టు కితాబులిచ్చుకున్నారు. అసలు రచయిత దగ్గర్నుంచీ కంగనా వరకూ వీళ్ళందరికీ స్క్రిప్టు పట్ల వున్న అవగానేమిటన్న ప్రశ్న వేధించడం మొదలెడుతుంది సినిమా చూస్తూంటే. ప్రేక్షకులకి ఇంతదూరంగా ఎక్కడో 1990 లలో వుండిపోయి ఈ ఘనకార్యం చేశారా అన్పిస్తుంది. కట్టీ బట్టీ ( అంటే కటీఫ్) అని సినిమాకి టైటిల్ గా పెట్టినట్టు అన్పించదు- ప్రేక్షకులకి గుడ్ బై కొట్టేసేందుకే పెట్టినట్టుంది..
రొటీన్ గా ఇది మరో పెళ్లి చేసుకోకుండా
సహజీవనం చేసే జంట కథ. మాధవ్ కబ్రా అలియాస్ మ్యాడీ ( ఇమ్రాన్ ) బీరు అనుకుని
ఫినాయిల్ తాగేసి హాస్పిటల్లో పడతాడు. ఫ్రెండ్స్ కాపాడతారు. మ్యాడీ మానసిక స్థితి
బావుండదు. ఏదో పోగొట్టుకున్న వాడిలా బతుకుతూంటాడు- అతను ఆర్కిటెక్చర్ స్టూడెంట్. అదే కాలేజీలో పాయల్
(కంగనా) ని తొలిచూపులోనే ప్రేమించాడు. ఆమెకి ప్రేమా దోమా నచ్చవు. కరెక్టు
కుర్రాడు దొరికితే సహజీవనం తో టైం పాస్ చేద్దామనుకుంటోంది. పెళ్లి
చేసుకోవాలనుకుంటున్న మ్యాడీ ఇందుకు రాజీపడి ఆమెతో సహజీవనం చేస్తాడు. కొంతకాలానికి
ఇద్దరి మధ్యా తేడా లొస్తాయి. కోపతాపాలూ అసహనం పెరుగుతాయి. ఆమె పెడుతున్న
ఖర్చుని అతను ప్రశ్నించడంతో, ఆమె మాటాడ్డం
మానేస్తుంది. ఇదింకా టెన్షన్ ని పెంచుతుంది. ఓసారి గోవా వెళ్ళా లనుకుంటున్నప్పుడు,
గొడవపెట్టుకుని ఏర్ పోర్టు దారిలో వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత కోపం తగ్గి
ఆమె కోసం చూస్తే ఎక్కడా వుండదు. సెల్ కూడా స్విచాఫ్ చేసి వుంటుంది. పిచ్చెక్కిపోయినట్టు
ఆమెని అంతటా వెతకడం ప్రారంభిస్తాడు.
ఆమె మంచిది కాదని ముందు నించీ చెప్తూంటే విననందుకు మందలిస్తారు అతడి చెల్లెలి తో సహా ఫ్రెండ్స్ అందరూ. ఇది ఇప్పుడూ నమ్మడు. ఏమూలో ఆమెలో తనమీద ప్రేమే ఉంటుందని ఆమె జ్ఞాపకాల్లో దిగాలుగా గడిపేస్తూంటాడు. అప్పుడామె ఢిల్లీ లో ఎవర్నో పెళ్లి చేసుకుంటోందని తెలిసి అక్కడికి పరిగెడతాడు. అక్కడ ఆమె గురించి ఒక కఠోర వాస్తవం తెలుసుకుంటాడు....
ఇదీ విషయం. ఇందులో ఇమ్రాన్ - కంగనా
లిద్దరివీ హుషారు కల్గించని బోరు కొట్టే పాత్రలు. విడిపోయాక సరే, కలిసున్నపుడైనా రోమాంటిక్
గా సరదాగా ఉండని విడిపోయే పాత్రలివి. విడిపోయాక మరీ డల్ అయిపోతాయి. పాత్రల్లో పెప్ లేదు, దానికి
తగ్గట్టే నటనల్లో కిక్ లేదు ఈ
మల్టీప్లెక్స్ ప్రేక్షకులకి ఉద్దేశించిన ప్రేమ కథలో. సినిమా మొదటి షాట్
దగ్గర్నుంచీ ఒపికని పరీక్షించే నడకే. క్లయిమాక్స్
మరీ పాతకాలపు వ్యవహారం. ఇద్దరికీ ఈ సినిమా రాంగ్ సెలెక్షనే.
సినిమాలో క్రియేటివిటీ అనేది ఎక్కడైనా
వుందంటే అది తుషార్ కపూర్ ఛాయా గ్రహణంలో, శంకర్- ఎహెసాన్- లాయ్ సంగీతంలో, అమిత్
రే- సుబ్రతా చక్రవర్తిల కళా దర్శకత్వంలో మాత్రమే. స్క్రిప్టులో కాదు. ఇలాటి అవుట్
డేటెడ్ స్క్రిప్టుతో ఈ కళాకారుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. శాస్త్ర
సాంకేతిక ఆవిష్కరణ లందుకుని భారతీయ సినిమాల్లో అన్ని విభాగాలూ ఉన్నతంగా ఎదుగుతున్నాయి-
ఒక్క రచనా విభాగానికే శాస్త్రమూ లేదు, సాంకేతికమూ లేదు. ఇంత బోరు కొట్టే రచనలో
పాటలు వచ్చినప్పుడే హుషారెక్కుతుంది, పాత పూర్తవగానే షరామామూలు బోరు. అంతర్జాతీయ
స్థాయిలో వున్న ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం కూడా ఇంత అథమంగా వున్న స్క్రిప్టుని ఎలా ఉద్ధరించగలవో
అర్ధంగాదు.
స్క్రిప్టుతో ఎక్కడ ఇబ్బంది వచ్చిందంటే, సహజీవనం అనే ఈ కాలపు అంశాన్ని, ఎప్పుడో ‘90 ల నాటి క్యాన్సర్ కథతో సింగారించడంతో వచ్చింది..పైగా మూడొంతుల కథనీ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతో చెప్పడం ఒకటి. మళ్ళీ ఈ సీన్లన్నీ చప్పగా సాగడం!
హీరోయిన్ ఢిల్లీలో పెళ్లి చేసుకుంటోందని అక్కడికి పరుగెత్తిన హీరో, తీరా పెళ్లి కూతురు ఆమె కాదని తెలుసుకుంటాడు. అక్కడే హీరోయిన్ ని చూస్తాడు గానీ, అంతలోనే ఆమె కన్పించదు. హీరోని వారిస్తూ అక్కడికే వచ్చిన చెల్లెలు, హీరోయిన్ గురించి అప్పుడు రహస్యం బయటపెడుతుంది- ఆమెకి క్యాన్సర్ చివరి దశలో వుందనీ, అందుకే ఆ చిన్న తగాదాని అవకాశంగా తీసుకుని అతన్నలా వదిలేసి వెళ్లి పోయిందనీ. ఈ సంగతి అతడి ఫ్రెండ్స్ కి కూడా తెలుసనీ అంటుంది.
క్యాన్సర్ బదులు ఇంకేదో కారణం చూపించివుంటే, ఇంత మిస్టరీ వెల్లడయ్యే ముగింపూ, ఇంతవరకూ ఆమె మంచిది కాదంటూ హీరో దారి మళ్లిస్తూ వచ్చిన చుట్టూ పాత్రలకి సస్పెన్సూ, ఈ సినిమాకి మంచి సెల్లింగ్ పాయింటు అయ్యేవి. ఇలాకాక నత్త నడకతో సహనాన్ని పరీక్షించడమే గాక, తీరా క్లయిమాక్స్ లో క్యాన్సర్ అనడంతో సినిమా గంగలో కలిసిపోయింది. సహజీవనం అనే సమకాలీన కాన్సెప్ట్ కి కాలం చెల్లిన క్యాన్సర్ పాత మూస సింగారమైపోయింది.
నత్త నడక అంటే ఈ సినిమాలో హీరో దగ్గర వుండే తాబేలు గుర్తుకొస్తుంది. ఈ తాబేలుని ఆమెకి గిఫ్ట్ గా ఇవ్వడానికి అల్లారు ముద్దుగా పెంచుతూంటాడు. ఈ తాబేలు- ఆ తాబేటి నడకలాగే వుంటుంది సినిమా నడక కూడా! కథ నడపడంలో తాము చేస్తున్న తప్పు అన్ కాన్షస్ గా ఇలా బయట పెట్టుకున్నట్టుంది. ఇది రచయిత బాడీ లాంగ్వేజ్ కావొచ్చు. నేను మొద్దు రచయితని మొర్రో అని ఈ శరీర -లేదా కలం భాషతో వెల్లడిస్తున్నట్టున్నాడు. పైగా ఈ తాబేలుకి మిల్కా అని పేరు పెట్టడం! మిల్కా సింగ్ పేరు పెడుతున్నప్పుడైనా కథ అలాటి పరుగుల రాజు వేగంతో ఉందా అనికూడా చూసుకోలేదు.
హీరో హీరోయిన్లు సహజీవనం చేశారు,
విడిపోయారు. ఆమె కోసమే తపిస్తున్నాడు. అతడి
చెల్లెలు, ఇతర మిత్రులూ పదేపదే ఆమె మంచిది కాదని కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఢిల్లీ
వెళ్ళిపోయాడు. హీరోయిన్ పెళ్ళనుకుని వేరే పెళ్ళిలో గొడవలేపి అల్లరయ్యాడు. ఆ
పెళ్ళిలో హీరోయిన్ని చూశాకా అర్ధమయ్యింది- అప్పుడు అక్కడికి వచ్చేసిన చెల్లెలు-
ముందు నించీ ఇందుకే చెబుతున్నాం మేమంతా- అని క్యాసర్ సంగతి చెప్పింది.
ఇదొక మంచి ట్విస్టు చుట్టూ పాత్రలకి. చెల్లెలూ ఇతర ఫ్రెండ్సూ అప్పుడు ఈ నిజంతో ముందుకు రావడం, అప్పటివరకూ అదొక సస్పెన్సే అన్పించని సస్పెన్స్ ని విప్పుతున్నట్టు వుండడమే గాక-అంతకాలం కన్పించకుండా పోయిన హీరోయిన్ తీరా అలా ఎదురుపడ్డం కూడా మిస్టరీనే వెల్లడిస్తోందీ కథలో. సస్పెన్సు, మిస్టరీ ఈ రెండూ కోణాలూ ప్రేక్షకులకి చివరి వరకూ తెలియకుండానే ప్రవహించాయి. ఇది మరుగుపర్చిన ఎండ్ సస్పెన్స్ కథనం. మామూలుగా ఎండ్ సస్పెన్స్ తో ఫ్లాపయ్యే సినిమా కథలకి- ఇలాటి టచప్ తో నిలబెట్ట వచ్చని ఇక్కడ తేలుతోంది. ఆ మిస్టరీ క్యాన్సర్ అవడమే మొత్తం వ్రతాన్నీ చెడగొట్టింది!
ఈ సస్పెన్స్- మిస్టరీ లని దృష్టిలో పెట్టుకునే సీదా సాదా స్క్రీన్ ప్లే చేసుకోకుండా దాన్ని మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులేసి గజిబిజి చేశారు. సినిమాకి సెల్లింగ్ పాయింట్ క్లయిమాక్స్ లో వూడిపడే సస్పెన్స్- మిస్టరీల ఎలిమెంట్స్ అయినప్పుడు- ఆ క్లయిమాక్స్ వరకూ స్ట్రెయిట్ నేరేషన్ లో కథ నడపకుండా-పదేపదే వచ్చే మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ తో నడిపి సహన పరీక్ష పెట్టారు. అంత మంచి సెల్లింగ్ పాయిట్ వచ్చేటప్పటికి దాన్ని ఆస్వాదించే ఓపికలేక ఆ కథనం తో నీరసించి పోయుంటాం. ఒక ఎలిమెంట్ అదున్న రూపంలోనే సెల్లింగ్ పాయింట్ అయినప్పుడు, ఇంకేవో టెక్నిక్కులతో ఆ ఫీల్ గల్లంతయ్యేట్టు చేసుకుంటే ఎలా?
ఈ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులు 36 సార్లు వుంటాయోమో! వీటిలో విషయంకూడా ఏ మాత్రం ఆసక్తికరం గా వుండదు. క్లయిమాక్స్ మొదలయ్యేవరకూ ఫ్లాష్ బ్యాక్సే వస్తూండడంతో స్ట్రక్చర్ కూడా చెదిరి పోయింది. హీరో గతంలో కాలేజీలో ప్రేమించడం మొదలుకొని, సహజీవనం, విడిపోవడం వరకూ ఈ ఎం ఎఫ్ ( మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్) లు క్లైమాక్స్ దాకా వస్తూనే వుంటాయి. ఇలా ఒక ఫ్లాష్ బ్యాక్ బిట్, ఒక నడుస్తున్న కథ బిట్ ల మధ్య బిగినింగ్- మిడిల్ విభాగాలు గల్లంతై పోయి- కథని పట్టుకోవడం రచయితని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. నడుస్తున్న కథలో పాత్ర ఆసక్తి పుట్టించక పోతే, దాని ఫ్లాష్ బ్యాకే వేయకూదదన్న మూలసూత్రం మాయం. అసలే కొత్త రచయిత, కొబ్బరికాయ దొరికినట్టు టెక్నిక్ టమారాలు!
స్ట్రెయిట్ నేరేషన్ ( బిగినింగ్
- మిడిల్- ఎండ్ వరుసలో) కథ చప్పగా ఉంటుందని ఎలా అనగలం? మొదట్నించీ రాం గోపాల్
వర్మ ఎందుకు ఫ్లాష్ బ్యాకులతో ఒక్క సినిమా కూడా తీయలేదు? ఫ్లాష్ బ్యాకు వేయడమనేది
వీవీఐపీల ‘బుగ్గ కారు’ హోదాగా ఫీలైపోతే ఎలా?
ఫ్లాష్ బ్యాకే లేకుండా ‘కట్టీ బట్టీ’ క్లయిమాక్స్ ఎఫెక్ట్ తీసుకురాలేమా? 2007 లో ప్రదీప్ సర్కార్ తీసిన ‘లగా చున్రీమే దాగ్’ (చున్నీ మైలపడింది) లో, ఏ ఫ్లాష్ బ్యాక్ ఉందని క్లయిమాక్స్ అంతలా అలజడి రేపుతుంది? కథా వస్తువు పాత మూసే కావొచ్చు- కథనం? స్ట్రెయిట్ నేరేషన్- లేదా లీనియర్ నేరేషన్ లో- ఎంత ఊహించని ముగింపుకి దారి తీస్తుందది?
ఈ కథ మిడిల్లో సమస్యతో సతమతమవుతున్న రాణీ ముఖర్జీ, ఇక చెల్లెలు కొంకణా సేన్ శర్మ పెళ్లి చేయడానికి బయల్దేరుతుంది. సరేలే, ఎ. కోదండ రామిరెడ్డి అప్పట్లో తీసిన ‘సంధ్య’ లో లాగా చెల్లెలి పెళ్లి చేసేసి త్యాగమయిగా మిగిలిపోతుంది కాబోలనుకుంటాం. ఇంతలో ఎక్కడ్నించో ప్రేక్షకులు మర్చిపోయిన అభిషేక్ బచ్చన్ వూడిపడతాడు!
ఇతను ఫస్టాఫ్ లో రాణీ ముఖర్జీ ప్రేమకోసం రెండుసార్లు విఫలయత్నాలు చేసి వెళ్ళిపోయుంటాడు. ఈ పాత్ర ఇక ముగిసి పోయినట్టేనన్న అభిప్రాయం కల్గేలా చిత్రీకరిస్తాడు దర్శకుడు. కానీ మిడిల్లో అనూహ్యంగా అతన్నే రప్పించడంతో, క్లయిమాక్స్ ఊహించని మలుపుతో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
చెల్లెలి పెళ్లి చేయడానికే బయల్దేరిన రాణీ, తను కూడా ఇక పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం అనూహ్యంగా ఏర్పడుతుంది. కథలో అంతవరకూ లేని ఈ మిస్టరీ, ఈ సస్పెన్స్ ఫీల్ క్లయిమాక్స్ లో ఒక్కసారిగా ఉత్పన్నం కావడం లీనియర్ నేరేషన్ వల్ల సాధ్యమయ్యిందే. దీన్ని ఏ మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులూ వేసి చెడగొట్టలేదు. ఫ్లాష్ బ్యాక్ వేశారంటేనే నడుస్తున్న ప్రధాన కథ కి బ్రేకు పడి. ఎప్పుడో జరిగిన పూర్వ కథ ముందుకు తేవడం. ఇలా ఓ 36 సార్లు పదేపదే జరిగితే అన్ని సార్లూ ప్రధాన కథకి బ్రేకులు పడినట్టే. ఏది ఫ్లాష్ బ్యాక్, ఏది కాదు వెతుక్కుంటూ సినిమా చూడాల్సిన మానసిక శ్రమ ప్రేక్షకులకి ఎందుకుండాలి?
ఈ సినిమా మొత్తం మీద తన చెల్లెలి పాత్రతో,
నటనతో ఆకట్టుకునేది ఒక్క మిథిలా పల్కర్ మాత్రమే!
-సికిందర్