రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, August 29, 2015

40 కోట్ల కథ!

కిక్-2 రివ్యూ తరువాయి భాగం
          ‘కిక్-2’ కీ,  ‘జోకర్’ కీ  ఈ పోలికలు కాకతాళీయమనైతే అన్పించవు. రెండిటికీ మాతృక హాలీవుడ్ లో నైతే లేదు. శిరీష్ కుందర్ విఫలమైన ఒరిజినల్ అయిడియానే ‘జోకర్’. ఈ విఫలమైన ఐడియా ‘కిక్-2’ కి బ్యాక్ డ్రాప్ గా దర్శనమివ్వడమే విచిత్రం.     
          ‘కిక్- 2’ ఫస్టాఫంతా బాధితులుగా వున్న బీహార్ గ్రామస్తులు, హీరోని అక్కడికి  రప్పించుకునే ప్రయత్నాలతో గడిపాక- ఇక హీరోయిన్ కోసం హీరో వచ్చేస్తున్నాడని ఇంటర్వెల్ ఘట్టం లో తెలిశాక- అతడికి విషయం చెప్పకుండా విలన్ తో ఎలా లాడాయి పెట్టాలో మాట్లాడుకునే ప్లానుతో ఇంటర్వెల్ పడుతుంది.

          పై పేరాలో విషయం మిడిల్ విభాగం బిజినెస్సే.  ఫస్టాఫ్ లో హీరో ఇక్కడ ల్యాండ్ పని ముగించుకుని యూఎస్ కి తిరుగు ప్రయాణ మవుతున్నప్పుడు, హీరోయిన్ మీద ప్రేమని గుర్తించి వెనుదిరగడంతో-  బిగినింగ్ ముగిసిపోయి మిడిల్లో పడినట్టే కథ.  ఈ క్రమంలో ఇక్కడ్నించీ ఇంటర్వెల్ సీనులో  గ్రామస్తులు ప్లాన్ మాటాడుకోవడం వరకూ అదంతా మిడిల్ బిజినెస్ అయిన సమస్యతో సంఘర్షణ లో భాగమే- ఆ ఇంటర్వెల్ ఘట్టంలో పసలేకపోయినా.

          ఇలా ఫస్టాఫ్ అంతా స్ట్రక్చర్ లోనే  ఉంటూ సాఫీగా సాగాక- ఇంటర్వెల్ తర్వాత నుంచీ మొదలవుతుంది పరమ గందరగోళం.  ఇంటర్వెల్ కి ముందు మొదలైన మిడిల్ ఇంటర్వెల్ తర్వాత కంటిన్యూ కాదు (చిత్ర పటం  చూడండి).  మళ్ళీ బిగినింగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ్నించీ సరీగ్గా 45 నిమిషాల వరకూ గ్రామస్తులు రకరకాల వేషాలు కట్టి  హీరోకి విషయం బయట పడకుండా- ‘జోకర్ స్టయిల్లో చేసే మ్యాడ్ కామెడీ తో నిండిపోతుంది.  సమస్య చెప్పకుండా హీరోకి విలన్ తో లడాయి పెట్టడానికి రెండు మూడు ఎత్తుగడలు వేస్తారు, విఫలమయ్యే ఆ ఎత్తుగడలూ బలహీనమే.  ఈ కామెడీతో గ్రామస్తులే యాక్టివ్ గా వుంటారు, విషయం  తెలీని హీరో పాసివ్ గా మారిపోతాడు.



          ఫస్టాఫంతా ఆవులిస్తే పేగులు లెక్కెట్టి మనుషులతో ఆడుకునే హీరో కాస్తా, ఇప్పుడు నోట్లో వేలు పెట్టినా కొరకని అమాయకుడిలా మనుషుల చేతుల్లో ఆటబొమ్మై పోతాడు.

          ఈ 45 నిమిషాల కథా ఎందుకు ఆడియెన్స్ కి  బోరు కొట్టిందంటే, మిడిల్లో పడ్డాక అంతవరకూ నడిచే కథనం మిడిల్ విభాగం స్ట్రక్చర్ కాకపోవడం వల్ల. కథనం యూ టర్న్ తీసుకుని బిగినింగ్ కి వెళ్ళడం వల్ల. మిడిల్ విభాగం స్ట్రక్చర్ లో, సమస్య తెలుసుకున్న హీరో దాంతో సంఘర్షిస్తూ ఉంటాడు నిజానికి . కాబట్టి సినిమా సెకండాఫ్ లో ఈ మేరా స్ట్రక్చర్లో వున్నది మిడిల్ విభాగం బిజినెస్ కాదు- పక్కా బిగినింగ్ బిజినెస్సే!!

          ఎలాగంటే,  స్ట్రక్చర్ ప్రకారం బిగినింగ్ బిజినెస్ లో అప్పుడప్పుడే హీరో యాక్టివేట్ కాడు.  అదింకా కథా పరిచయ విభాగమే కాబట్టి, ఇతర పాత్రల కామెడీతోనో,  తన సరదాలతోనో గడుపుతూ- ఆ బిగినింగ్ ముగింపులో సమస్యలో పడ్డాక మాత్రమే దాంతో  సంఘర్షిస్తూ మిడిల్ ని ప్రారంభిస్తాడు కాబట్టి. ఈ స్వభావమే ఇక్కడి కథనంలో జొరబడింది.

          బిగినింగ్ విభాగంలో హీరో పాసివ్ గా ఉండొచ్చు కథని బట్టి. కానీ సమస్యలో పడ్డాక మిడిల్లో యాక్టివ్ కాకపోతే అది ఆర్ట్ సినిమా అవుతుంది.

          ఇలా ఫస్టాఫ్ లోనే  మిడిల్ లో పడ్డ కథ,  సెకండాఫ్ ప్రారంభం కాగానే మళ్ళీ ఇంకో  45 నిమిషాలూ బిగినింగ్ బిజినెస్ తోనే  సాగడంతో - రెండు బిగినింగ్ ల మధ్య ఇరుక్కున్న మిడిల్ తో ఇది శాండ్ విచ్  స్క్రీన్ ప్లే కూడా అయ్యింది.

          ఏ రైటర్ కైనా, డైరెక్టర్ కైనా, ప్రొడ్యూసర్ కైనా బిగ్ స్టార్ అంటే తమని కాపాడేవాడు. ఫాలో ది లక్కీ మాన్ అని బిగ్ స్టార్స్ వెంట ఎందుకు పడతారు? అలాంటిది ఆ స్టార్ పాత్ర స్క్రిప్టులో కుదేలు అవుతోంటే కూడా చూసుకోకపోతే అప్పుడది ఫాలో ది లక్కీ స్టార్ కాదు, కిల్ ది లక్కీ స్టార్ అయిపోతుంది.

***
‘కిక్- 2’  స్క్రీన్ ప్లే తీరు ! 

          ఈ 45 నిమిషాల నేపధ్య వాతావరణాన్ని అలాగే వుంచి, దీనికి మిడిల్ స్వభావాన్ని ఆపాదిస్తూ శాండ్ విచ్ అవకుండా కాపాడుకోవచ్చు. కానీ అలా జరగలేదు. గ్రామస్తులు హీరోకి తెలీకుండా విలన్ తో లడాయి పెట్టించాలని చేసే అన్ని ప్రయత్నాలూ విఫలమవడమనే బిగినింగ్ బిజినెస్ స్వభావం నుంచి మిడిల్ బిజినెస్ కి మరల్చాలంటే, వాళ్ళు చేసే ఆ ఒక్క ప్రయత్నంతోనే సక్సెస్ అయిపోవాలి. ‘షోలే’ లో హీరోలని గ్రామానికి తీసుకొచ్చిన ఠాకూర్ ఆ ఒక్కరాత్రే వాళ్ళకి తెలీకుండా వాళ్ళ మీదికి వస్తాదుల్ని ఎగదోసి, వాళ్ళ శక్తి సామర్ధ్యాలని పరీక్షిస్తాడు. అంతేగానీ కామెడీగా ఉంటుందని అదేపనిగా ఆ పరీక్షలు పెడుతూ కూర్చోడు.

          హీరోని గ్రామానికి రప్పించడానికి అంత మాస్టర్ ప్లాన్ వేసి సక్సెస్ అయిన వాళ్ళు. విలన్ తో లడాయి పెట్టడం లో తుస్సు మనడమేమిటి? మొదటి ప్రయత్నం లోనే సక్సెస్ అయి వుంటే, అది వాళ్ళ ఎత్తుగడేనని వెంటనే హీరో తెలుసుకుంటే, అతనలా యాక్టివ్ పాత్రగానే మిడిల్ ని నడిపేవాడు. ఎప్పుడైతే పాత్రని వదిలేసి కథని పట్టుకుని ప్రయాణిస్తారో అప్పుడా కథకీ ఓ దిక్కూ దిశా వుండదు, పాత్రకీ చీమూ నెత్తురూ వుండవు.

***
          అయితే  ఈ 45 నిమిషాల సమస్య కి గోల్ పరంగా హీరో పాత్రకున్న అడ్డంకిని మాత్రం తొలగించలేం. ఏం చేసినా హీరో గోల్ కృతకంగానే వుంటుంది. హీరోయిన్ గోల్ తనకి ఎమోషన్ వున్న గోల్ గా హీరో మార్చుకోవడం సాధ్యం కాదు. ఈ కథలో హీరోయిన్ హీరో భార్య కూడా కాదు, పోనీ ఆమె చనిపోను కూడా లేదు. ‘ఊసరవెల్లి’ లో ఎలాగైతే హీరోయిన్ గోల్ ని తన గోల్ అనుకుని సెకెండ్ హేండ్ పోరాటం ఎలా చేహాడో-  అదే జరగక తప్పదిక్కడ.

          ‘ఊసరవెల్లి’  విదేశీ సినిమా ‘వెంజెన్స్’కి కాపీ అని తెలిసిందే. అందులో గోల్ హీరోదే. అతడి కుటుంబాన్నీ విలన్స్ హతమార్చారు. కాబట్టి వాళ్ళని చంపాలన్న అతడి గోల్ కి అన్ని ఎమోషన్సూ వున్నాయి. ఈ హీరో పాత్రని ‘ఊసరవెల్లి’ లో హీరోయిన్ పాత్రగా మార్చేసి హీరో ని ఆమె కిరాయి మనిషిగా మార్చేశారు. అలాగే  ‘జోకర్’ లో తండ్రి రోగాన పడ్డాడనుకుని ఆ వూరొచ్చిన హీరో - అది నాటకమని తెలుసుకుని, అతడి అసలు గొడవ పట్టించుకుని- తన స్వగ్రామం ఉనికిని ప్రపంచానికి తెలియజేసే గోల్ తో, అమెరికాలో చేస్తున్న పరిశోధనని ఇక్కడే చేస్తాడు. ఇలా ఇక్కడ సమస్యతో హీరో గోల్  కి సంబంధం నేరుగా వుంది.

          ‘కిక్ -2’ లో దీన్ని తెచ్చి, ‘ఊసరవెల్లి’ లో లాగే - హీరోయిన్ గోల్ గా మార్చేసి హీరోని పోరాడామన్నారు. ఇలా ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్- రవితేజా ఇద్దరూ ఒకే దర్శకుడి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినట్టయ్యింది. అంత పెద్ద స్టార్లేమిటి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడమేమిటీ అంటే - అదే మరి సురేంద్ర రెడ్డి గిమ్మిక్కు!

          ఇలా సెకెండావ్ కి విలువలేకుండా పోయాక, బడ్జెట్ లో సగం వృధా అయినట్టే. బడెట్లో సగమే వసూళ్లు వచ్చాయని రిపోర్టులు వస్తూండడం ఇందుకే.

సికిందర్