రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, December 15, 2014

కెమెరా!

అదొక యజ్ఞమే!
ఛాయాగ్రాహకుడు సి. రాం ప్రసాద్
రోసారి కెమెరామాన్ అదృశ్య దృశ్యాల దార్శనికు డవుతున్నాడు. పౌరాణిక, జానపద సినిమాల్ని ఇప్పటి  ప్రేక్షకులు మిస్సవ్వచ్చు గాక, ఆ కాలంలో అవి ప్రవేశపెట్టిన ‘ట్రిక్ ఫోటోగ్రఫీ’ అనే మాయాజాలం నుంచి మాత్రం ఇప్పటి కెమెరామాన్ తప్పించుకోలేక పోతున్నాడు. ఏదైతే మనలో అంతర్భాగంగా ఉంటుందో, అది వెన్నాడుతూంటుంది. దృశ్య రూపాలు మారినంత మాత్రాన శాస్త్రం అంతరించిపోయిందని కాదు. శాస్త్రం శాశ్వతం. దానాధారం జేసుకుని ఒకప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ వుండొచ్చు, ఇంకోప్పుడు రూపం మార్చుకుని సీజీ గ్రాఫిక్స్ ఉండొచ్చు!
    రాత్రి వేళ రైలు ప్రయాణిస్తూ వుంటుంది. పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ చంద్రుడికి మబ్బులు అడ్దొస్తూ వుంటాయి. వాటి నీడ కింద పడుతూంటుంది. రైలు కదులుతూంటే, ఆ నీడ తన వాలు చూసుకుంటూ, మబ్బు తొలగ్గానే తనూ తప్పుకుంటూ ఉంటుంది..ఈ వెన్నెల దోబూచులాటలో నాయకా నాయికలు రైలు చివర ‘ఎల్’ షేపు ట్రాలీ మీద యుగళ గీత మొకటి పాడుకుంటూ మైమరచి పోతూంటారు. ఇదంతా చూస్తూ మనమూ మనసు పారేసుకోకుండా ఉండం.
   నిజంగా జరిగిందేమిటంటే, అక్కడ అంత పొడవు రాయలసీమ వెళ్ళే రైలే లేదు. చుట్టూ ఎలాటి పరిసరాలూ లేవు. పైన చంద్రుడూ వెన్నెలా మబ్బులసలే లేవు. ఓ ట్రాలీ, దానిమీద హీరో హీరోయిన్లు, మబ్బు తాలూకు ఓ నీడా - ఇవే మాత్రమే వున్నాయి!
    ఇవి- ఈ మూడూ మాత్రమే నిజం, మిగతావన్నీ అబద్ధం! ఈ అబద్దాల్ని గ్రాఫిక్స్ ఆర్టిస్టు నిజాలుగా భ్రమింపజేసి దృశ్యాన్ని రక్తి కట్టించాడన్న మాట!
   ఓస్ ఇంతేనా, ఆ మూడూ తప్ప మిగతాదంతా గ్రాఫిక్సేనా! మరైతే కెమెరామాన్ చేసిందేమిటి, ఇక అతడికి సినిమాలతో పనేమిటి- అన్న సందేశాలూ రావచ్చు. అతణ్ణి ఆత్మరక్షణ లోనూ పడెయ్య వచ్చు. అయితే దీనికి తిరుగులేని సమాధానముంది సుప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ దగ్గర. అనేక సూపర్ హిట్ చిత్రాల అగ్రస్థాయి ఛాయాగ్రాహకుడైన ఈయన, పైన వివరించిన సందర్భంలో, రామోజీ ఫిలిం సిటీలో సెట్లో ఓ యజ్ఞమే చేసి కృత్రిమ నీడని అంత సహజంగా సృష్టించారు.  తన లైటింగ్ పరిజ్ఞానంతో అలాటి కృత్రిమ నీడని సృష్టిస్తూ, ట్రాలీ మీద హీరో హీరో హీరోయిన్లైన సునీల్- సలోనీల నృత్య విన్యాసాలని కెమెరాలో పొదివి పట్టుకుంటూ, అక్కడలేని విశేషాల్ని క్యాలిక్యుటివ్ గా ఊహిస్తూ, ఉన్న నిజాలతో వాటిని సమన్వయం చేసుకుంటూ, ఎనిమిది రోజుల పాటూ శ్రమిస్తే గానీ, ‘మర్యాదరామన్న’ లో ఆ డ్యూయెట్ కి ఆతర్వాత జోడించాల్సిన అంతటి గ్రాఫిక్స్ ఇన్పుట్ రాలేదు!
    “గ్రాఫిక్స్ అనేది ఒక సపోర్టింగ్ ఆర్టు” –అన్నారాయన, “అయితే దృశ్యంలో గ్రాఫిక్స్ హైలైట్ కానప్పుడే ఆ దృశ్యానికి రాణింపు వస్తుంది. ఈ సినిమా చివర్లో  వంతెన సీను గ్రాఫిక్స్ సృష్టి అంటే నేనే నమ్మలేకపోయా. అదీ నిజమైన గ్రాఫిక్స్ అంటే. ప్రేక్షకులు తాము చూస్తున్నది నకిలీ అని ఇట్టే కనుక్కో గలుగుతున్నారు. అయినా వాళ్ళ ఎంజాయ్ మెంటుకి అదేమీ అడ్డు రావడం లేదు., బాగా ఎంజాయ్ చేస్తున్నారు..” అని వివరించారు.
    ఇప్పుడిప్పుడే రవితేజ నటిస్తున్న ‘మిరపకాయ్’ షూటింగు జర్మనీలో ముగించుకొచ్చిన రాం ప్రసాద్,  ఈ హాస్యకథా  చిత్రానికి దానికుండే  ఫీల్ తోనే చిత్రీకరణ జరిపామన్నారు. ప్రత్యేకంగా ఎలాటి హై-ఎండ్ టెక్నాలజీనీ వాడలేదన్నారు. తెలుగు సినిమాలు స్టైలిష్ గా ఎందుకు ఉండడడం లేదని అడిగితే-  బాలీవుడ్ సినిమాల టార్గెట్ ప్రేక్షకులు వేరన్నారు. మన సినిమాలకి పారితోషికాలకి పోను మేకింగ్ కి మిగిలేది బొటాబొటీ అనీ, కాబట్టి ‘విత్తం కొద్దీ వైభవ’ మనీ కొటేషన్ చెప్పారు.
   మరి ఎవరైనా దర్శకులు హాలీవుడ్ షాట్స్ ని చూపించి, వాటిని కాపీ కొట్టమంటే కొట్టారా లేదా ఫ్రాంక్ గా చెప్పమంటే – కాపీకోసం కాదుగానీ, ఫీల్ కోసం రిఫరెన్స్ కోసం వాటిని చూపిస్తారనీ, తమ భావాల్ని తెలియజేసేందుకు టూల్స్ గా వాటి నుపయోగిస్తారనీ చెప్పుకొచ్చారు. 
    ‘అతనొక్కడే’ కి  నంది అవార్డు నందుకున్న రాం ప్రసాద్  1984 నుంచే రంగంలో వున్నారు. అప్పట్లో మద్రాసులో డిఎఫ్ టి చేస్తూ,  ప్రసిద్ధ కెమెరామాన్ వీఎస్సార్ స్వామికి సహాయకుడిగా చేరారు. 1993 లో పద్మాలయా వారి ఒక సినిమాకి ఛాయాగ్రాహకులయ్యారు. అప్పటినుంచీ ఇప్పటి దాకా 60 సినిమాలు పూర్తి చేశారు. 90శాతం దర్శకుల తొలి సినిమాలకి తనే  ఛాయాగ్రాహకుడు.
    లైటింగ్ కి అతివృష్టి అశోక్ మెహతా అయితే, అనావృష్టి సంతోష్ శివన్.  ఈ ఇద్దరూ రాం ప్రసాద్ అభిమాన సినిమాటోగ్రాఫర్లే. ఇంకా నాటి మార్కస్ బార్ట్లే, రెహ్మాన్, వీకే మూర్తీ లాంటి ప్రసిద్ధ ఛాయాగ్రహకులు నేడు లేకపోవడం బాధాకరమని అంటూ,  భగవంతుడు ఇప్పుడు తమలాంటి కెమెరా మెన్లకి ఇంత టెక్నాలజీతో ఎక్విప్ మెంట్ నిస్తున్నందుకు సంతోషంగా వుండన్నారాయన. 
    సరే, మరి మీ హాబీ లేమిటి? – అని ప్రశ్న వేయడమే తడవుగా లోపలి నుంచీ ఒక హెలికాప్టర్ ని ఎత్తుకొచ్చారు. దాన్ని ఎగరేయడం తన హాబీయని చెప్పారు గర్వంగా. ప్యూర్ మెటల్ తో తళ తళా మెరిసిపోతూ, గూఢచార గ్యాడ్జెట్ లా వుందది. ఖరీదు మూడు లక్షల రూపాయలట. మూడేళ్ళుగా ప్రాక్టీసు చేస్తున్నారట. ఏం ప్రాక్టీసు? ఎప్పటికైనా దీనికి మినియేచర్ కెమెరా అమర్చి ఏరియల్ షాట్స్ తీయాలని! ఏం ఐ -2, హారీ పోటర్ -7 లాంటి హాలీవుడ్ సినిమాల్లో ఇలాటి షాట్సే తీశారని వివరించారు.
   ఇంకా డీటెయిల్స్? ప్రస్తుతానికింతే! ఇంకో ఇంటర్వ్యూ వరకూ సస్పెన్స్- అంటూ దాన్ని పాపాయిలా ఆప్యాయంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు. అన్నట్టు హీరో కృష్ణ మేకప్ మాన్ మాధవరావు పెద్ద కుమారుడే రాం ప్రసాద్.
సికిందర్
(నవంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)