రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, మార్చి 2024, సోమవారం

1412 : రివ్యూ


 రచన- దర్శకత్వం : విద్యాధర్ కె

తారాగణం : విశ్వక్ సేన్, చాందినీ చౌదరి, అభినయ, హారిక, భయానంద్ రెడ్డి, మహ్మద్ సమద్ తదితరులు
సంగీతం : స్వీకార్ ఆగస్తీ, నరేష్ కుమారన్; ఛాయాగ్రహణం : విశ్వనాథ రెడ్డి, రాంపీ
నిర్మాత : కార్తీక్ శబరీష్ , శ్వేత ఏం.
విడుదల : మార్చి 8, 2024
***

        దాదాపు అయిదేళ్ళుగా నిర్మాణంలో నవున్న గామి ఈ రోజు విడుదలైంది.  రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు నటిస్తూ వచ్చిన హీరో విశ్వక్ సేన్ గామి తో తన మీద తను ఒక ప్రయోగం చేసుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ పాత్ర కాకుండా, రెగ్యులర్ కమర్షియల్ కథ కూడా కాకుండా, హాలీవుడ్ నుంచి వచ్చే సర్వైవల్ డ్రామా లాంటిది చేశాడు. దీనికి విద్యాధర్ కొత్త దర్శకుడు. కొత్త దర్శకుడు మూసకి పోకుండా వైవిధ్యాన్ని ప్రయత్నించడమన్నది ఒక అభినందించ దగ్గ విషయం. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల కిచ్చిన ప్రత్యేక అనుభవమేమిటో చూద్దాం...

కథ

హరిద్వార్ లో శంకర్ (విశ్వక్ సేన్) ఓ అఘోరా. అఘోరాలతో కలిసి వుంటాడు. తనెవరు, ఎక్కడ్నించి వచ్చాడు గుర్తు లేవు. అతనొక వింత వ్యాధితో బాధపడుతూంటాడు. తనని ఎవరైనా ముట్టుకుంటే శరీర రంగు నీలి రంగులోకి మారి పోతుంది. స్పృహతప్పి పడిపోతాడు. దీంతో ఇతడి వల్ల ఇబ్బంది పడుతున్నామని తోటి అఘోరాలు వెలివేస్తారు. ఇక తన వ్యాధికి చికిత్స వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. అక్కడొక సాధువు నివారణోపాయం చెప్తాడు. మాలీ పత్రాలు అనే పువ్వు వుంటుందని, అది 36 ఏళ్ళ కోసారి హిమాలయాల్లో కాస్తుందనీ, ఇప్పుడు 36 వ సంవత్సరం ప్రవేశించిందనీ, 15 రోజుల్లో వెళ్ళి దాన్ని సాధించుకోమనీ చెప్తాడు.
       
హిమాలయాలకి బయల్దేరిన శంకర్ కి జాహ్నవి (చాందినీ చౌదరి) తోడవుతుంది. ఈమె మెడికల్ రిసెర్చర్. శంకర్ కి ఓ ఇద్దరి గురించిన ఆలోచనలు వేధిస్తూంటాయి : ఉమ (హారిక)
, సీటీ 333 (మఃహ్మద్ సమద్). వీళ్లెవరో అర్ధంగాదు. అలాగే ప్రయాణం సాగిస్తాడు. ఈ మానసిక సంఘర్షణతో కూడిన ప్రయాణంలో అతను మాలీ పత్రాలు సంపాదించగలిగాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

సర్వైవల్ డ్రామా. జీవన్మరణ పోరాటం చేస్తూ సాగించే ప్రయాణపు కథ. ఇందులో ప్రకృతి వైపరీత్యాలుండొచ్చు, క్రూర మృగాలతో ప్రమాదాలుండొచ్చు. ఇవన్నీ ఎదుర్కొని  ప్రాణాలతో బయటపడే హ్యూమన్ స్పిరిట్ కథ. విశ్వక్ సేన్ నటించడానికి బాగా అవకాశమున్న కథ. పూర్తిగా అవుట్ డోర్ అడ్వెంచర్. హిమాలయాల్లో సాహసకృత్యాలు. శంకర్ కి తనెవరో తెలీదు. దీనికి సమాంతరంగా రెండు ఉప కథలు వస్తూంటాయి ఫ్లాష్ బ్యాకులుగా. గ్రామంలో ఉమ అనే అమ్మాయిని సర్పంచ్ దేవదాసిగా మార్చేందుకు ప్రయత్నిస్తూంటే ఆమె ఎలా తప్పించుకుందన్న ఉప కథ ఒకటి, ఇంకోచోట సీటీ 333 అనే నెంబరు గల  యువకుడు తన మీద చేస్తున్న అక్రమ వైద్య ప్రయోగాల నుంచి ఎలా తప్పించుకున్నాడనే ఉప కథ. ఈ రెండూ సమాంతరంగా సాగుతూ వచ్చి చివర్లో శంకర్ కథతో కలుస్తాయి. అప్పుడు శంకర్ ఎవరో తెలుస్తుంది.
       
అయితే ఈ ఉప కథల్లో బలం లేదు పాత్రలకి తగిన స్ట్రగుల్ లేకపోవడం వల్ల. పైగా ఇవి శంకర్ దృక్కోణంలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వస్తూండడంతో కంటిన్యూటీ సరిగ్గా లేక కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇక శంకర్ కథ ఆసక్తికరంగా సాగేబదులు ఓపికని పరీక్షిస్తూ నిదానంగా సాగుతూంటుంది. శంకర్ స్ట్రగుల్
, అపాయాలతో పోరాటాలు మాత్రం  బావుంటాయి.
       
ఫస్టాఫ్ కథని పరిచయం చేస్తూ కాస్త వేగంగానే సాగినా
, ఇంటర్వెల్ సీను అకస్మాత్తుగా వచ్చేస్తుంది లీడ్ లేకుండా. ఆ తర్వాత సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. జాహ్నవి తనెందుకు ఈ ప్రయాణం చేయాల్సివచ్చిందో చెప్పడం, అతడి సమస్య తెలుసుకుని చలించడమూ వగైరా వుంటాయి. ఇక ఇద్దరి ప్రయాణం హిమాలయాల్లో ప్రమాదాలతో కూడి వుంటుంది సింహంతో పోరాటం సహా. ఈ రెండు పాత్రల అనుభవాలు, ఆవేదనలు, ఆక్రందనలు సినిమాని గంభీర ముద్రలోకి తీసికెళ్ళి పోతాయి. అభిరుచి గల ప్రేక్షకులకిదొక మంచి అవకాశమేగానీ సాధారణ ప్రేక్షకులకి కాదు. మమ్ముట్టికి ‘భ్రమయుగం’ ఎలాగో,  విశ్వక్ సేన్ కి ‘గామి’ అలాగ.

నటనలు- సాంకేతికాలు

నిస్సందేహంగా విశ్వక్ సేన్ కిది మంచి పాత్ర. అఘోరా పాత్రని స్టడీ చేసి నటించినట్టున్నాడు. తనలోని నటుడ్ని బయటికి తీసుకొచ్చాడు. అతడి ఫ్యాన్స్ జీర్ణించుకున్నా జీర్ణించుకోక పోయినా డోంట్ కేర్ అన్నట్టు పాత్రలోకి దూరిపోయి నటించాడు/జీవించాడు. అందులోనే సర్వస్వం ధారబోశాడు. డైలాగులు అతి తక్కువ. హావభావాలే ఎక్కువ. ముఖం కూడా పూర్తిగా, సరిగ్గా కనిపించదు. కమర్షియల్ హీరోలు ఇలా కనిపించడానికి ఒప్పుకోరు. మొహం నిండా బాగా లైటు పడాలి, బోలెడు డైలాగులు చెప్పాలి. అప్పుడే బొమ్మ పడాలి.
       
మెడికల్ రిసెర్చర్ పాత్రలో చాందినీ చౌదరికి నటించడానికి కీలక సన్నివేశాలు లేకపోయినా హీరోతో పాటు స్ట్రగుల్ బాగా నటించింది. అలాగే  ఉపకథల్లో ఉమగా హారిక
, సీటీ 333గా మహ్మద్ సమద్, ఉమ తల్లిగా అభినయ ఫర్వాలేదు.
       
సాంకేతికంగా- ఛాయాగ్రహణపరంగా ఎగుడుదిగుడుగా వుంది. ఐదేళ్ళు నిర్మాణంలో వుండడం వల్లనేమో ఏకత్వం కరువైంది. హిమాలయా దృశ్యాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. శివరాత్రికి విడుదలైన ఈ సినిమా శివుడి ప్రస్తావనలతో
, శివుడి మీద ఓ పాటతో భక్తుల్ని భక్తి సాగరంలో ముంచెత్తుతాయి.
       
గత రెండు వారాలుగా టపా కట్టేస్తున్న సినిమాల్లా కాకుండా
, ఈ సినిమా ఆడినా ఆడక పోయినా విషయమున్న చలన చిత్రంగా మాత్రం గుర్తుండి పోతుంది.
—సికిందర్

       




5, మార్చి 2024, మంగళవారం

1411 : రివ్యూ


 

రచన- దర్శకత్వం : పురుషోత్తం రాజ్
తారాగణం : శివ కందుకూరి, రాశీ సింగ్, దేవీ ప్రసాద్, ర్శిణీ సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, ఛాయాగ్రహణం : గౌతమ్. జి
నిర్మాతలు: స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడింబి
విడుదల : మార్చి 1, 2024
***
        రో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి చూసీ చూడగానే’, గమనం అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు. వీటితో గుర్తింపేమీ రాలేదు. ఇక టైటిల్ రోల్ పోషిస్తేనే గుర్తింపుకి అవకాశం వుండగలదని భూతద్దం భాస్కర్ నారాయణ లో నటించినట్టుంది.  ఇది డిటెక్టివ్ పాత్ర. దీని కథకి ప్రయోగాత్మకంగా పురాణ కథతో లింకు పెట్టారు. అదేమిటో చూద్దాం.

కథ

ఆంధ్ర -కర్ణాటక సరిహద్దులోని అడవుల్లో కర్ణాటక వైపు కొన్నేళ్ళుగా స్త్రీల శవాలు బయటపడుతూంటాయి. అవి తలలు తెగి, మొండెమ్మీద దిష్టి బొమ్మలు అమర్చి వుంటాయి. ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని తెలిసిపోతున్నా ఆ సీరియల్ కిల్లరెవరో దొరకడు. తలలు దొరక్కపోవడంతో శవాలెవరివో గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఆంధ్రావైపు గ్రామంలో చిన్నతనం నుంచీ డిటెక్టివ్ అవ్వాలన్న కోరికతో భాస్కర్ నారాయణ పెరుగుతాడు. గ్రామంలోనే డిటెక్టివ్ ఏజెన్సీ పెడతాడు. లుంగీ కట్టుకుని వుంటాడు. ఇతడి తెలివి తేటలకి మెచ్చి పోలీసులు హత్య కేసుల్లో సైతం ఇతడి సాయం తీసుకుంటూ వుంటారు. ఇలా వుండగా, ఈసారి ఆంధ్రా గ్రామం వైపు అడవిలో దిష్టి బొమ్మ అమర్చిన మరో స్త్రీ శవం బయటపడుతుంది. ఇక డిటెక్టివ్ భాస్కర్ ఈ కేసుని పరిశోధించడానికి రంగంలోకి దిగుతాడు.
       
ఈ శవాలు అసలెవరివి
? అజ్ఞాతంగా వుంటున్న సీరియల్ కిల్లరెవరు? ఎందుకీ రకంగా హత్యలు చేస్తున్నాడు? వీణ్ణీ పట్టుకోవడమెలా? పరిశోధన మొదలెట్టిన డిటెక్టివ్ భాస్కర్ తెలుసుకున్న కొత్త సంగతులేమిటి? అసాధ్యుడుగా వున్న సీరియల్ కిల్లర్ని చివరికి పట్టుకోగలిగాడా లేదా? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ మధ్య కాంతారా హిట్టయినప్పట్నుంచీ డివైన్ జానర్ సినిమాలు ఒక ట్రెండ్ గా వస్తున్నాయి. కార్తికేయ 2’, విరూపాక్ష’, హిడింబ’, మా వూరి పొలిమేర’, మంగళవారం హనుమాన్’, ఊరి పేరు భైరవకోన లాంటివి. ఈ వరుసలో భూతద్దం భాస్కర్ నారాయణ చేరింది. అయితే ఒక డిటెక్టివ్ కథకి డివైన్ జానర్ ని కల్పించడం ఇదే తొలిసారి. అదీ పురాణంతో కలిపి. పురాణంలో మహిషాసురుడి కథకి, కథలో జరుగుతున్న హత్యలతో ముడిపెట్టి డిటెక్టివ్ జానర్ లో కొత్త ప్రయోగం చేశారు. దీంతో ఈ సినిమా ఉత్కంఠభరితంగా తయారయ్యింది.
       
అయితే విషయం కొత్తగా వున్నా చెప్పడం అంత కొత్తగా లేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. భాస్కర్ డిటెక్టివ్ అవడానికి చిన్నప్పటి సన్నివే శాలు
, పెద్దయ్యాక కుటుంబ సభ్యులతో సీన్లు, అతను గాయపడితే వాళ్ళ ఏడ్పులతో డ్రామా, జర్నలిస్టుతో అతడి ప్రేమ, ఇలా డిటెక్టివ్ జానర్ మర్యాదలకి పాత మూస సీన్లు అడ్డుపడుతూ కథ థ్రిల్లింగ్ గా సాగదు. యాక్షన్ తో గాకుండా డైలాగులతో కథ నడపడం ఎక్కువవడంతో ఫస్టాఫ్ నత్త నడక నడుస్తున్నట్టు వుంటుంది.
       
సెకండాఫ్ లోనే డిటెక్టివ్ కథ ప్రొఫెషనల్ గా సాగుతుంది. జరుగుతున్న హత్యలకి క్లూస్ సంపాదించడం
, అవి సీరియల్ కిల్లర్ కి దారితీయించే క్రమంలో ఒకొక్కటే ఇతర పాత్రలు సీరియల్ కిల్లర్ అన్నట్టుగా రివీలవడం, ఈ క్రమంలో ఈ వరస హత్యలకి పురాణంతో సంబంధముందని ఆధారాలు దొరకడంతో కథ మిస్టీరియస్ గా కొత్త మలుపు తిరుగడం... ఇలా సాగుతున్నాక, హంతకుడు శవాలకి తగిలిస్తున్న దిష్టిబొమ్మలు నిజానికి మహిషాసురుడి దిష్టి బొమ్మలని తెలియడంతో ఉత్కంఠ పెరుగుతుంది. ఇక దీంతో హంతకుడికేం సంబంధమనే ప్రశ్నతో చిట్టచివర్లో హంతకుడ్ని పట్టుకుంటే - అతను మొత్తం రివీల్ చేస్తాడు. అయితే పురాణకథని వాడుకోవడం బాగానే వున్నా, ముగింపు మూఢనమ్మకంగా ముగుస్తుంది. డిటెక్టివ్ క్యారక్టర్ ఆ హంతకుడి ఆలోచనలు మూఢనమ్మకమని ఖండించి వుంటే సరైన సందేశం వెళ్ళేది.

నటనలు –సాంకేతికాలు

దృష్టి లోపంతో చిన్నప్పుడే కళ్ళద్దాలు వచ్చిన హీరోకి ఆ అద్ధాలతో కలిపి భూతద్దం  భాస్కర్ నారాయణ పేరొచ్చింది. డిటెక్టివ్ కి అలంకారం భూతద్దమే కాబట్టి టైటిల్ కూడా ఇలా జస్టిఫై అయింది. గ్రామంలో ఈ డిటెక్టివ్ పాత్ర హాస్య పాత్రే అయినా హీరో శివ కందుకూరి నవ్వించే ప్రయత్నం చేయడు. ఆ పని అసిస్టెంట్ చేస్తాడు. మరొకటేమిటంటే,  డిటెక్టివ్ పాత్ర లుంగీ కట్టుకుని తిరగగడం. ఈ పాత్రకి యాక్షన్ తో కూడిన ఫన్నీ సీన్స్ వుండుంటే ఫస్టాఫ్ స్పీడుగా సాగేది. డిటెక్టివ్ కథంటే అద్భుత రసంతో చెప్పాల్సిన కథ అనీ జానర్ మర్యాద మర్చిపోతే ఎలా?
        
సెకండాఫ్ లో శివ కందుకూరి యాక్షన్ లో కొచ్చి పాత్రని పాక్షికంగా నిలబెడతాడు. ఎలాగంటే డిటెక్టివ్ గా అతడికి ఏ ప్రత్యేకతలుండవు. ఇలాటి పరిస్థితుల్లో ఒక సాధారణ యూత్ ఎలా ప్రవర్తిస్తాడో ఆ లెవెల్లో వుంటాడు. డిటెక్టివ్ అయినందుకు ఇంట్లో వ్యతిరేకతతో బాటు, చిన్నప్పుడు అన్న చావు ఆత్మహత్యకాదనీ, అది హత్య  అనీ నిరూపించలేకపోయిన అసమర్ధత, అతడి పర్సనాలిటీలో పట్టుదలని, అసాధారణ స్కిల్స్ నీ కల్పించి వుండాలి. అప్పుడే క్యారక్టర్ పోషించడానికి, అందులో రాణించ డానికీ వీలుంటుంది.
       
జర్నలిస్టు పాత్రలో రాశీ సింగ్ ది చిన్న పాత్ర. పోలీసు అధికారిగా దేవీ ప్రసాద్ ది క్లయిమాక్స్ ని మలుపు తిప్పే పెద్ద పాత్ర. ఈ పాత్రని సమర్ధవంతంగా పోషించాడు. షఫీ, శివ కుమార్, సురభి సంతోష్ తదితరులు సహాయ పాత్రల్లో కనిపిస్తారు.
        
శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం, గౌతమ్ జి ఛాయాగ్రహణం మరీ గొప్పగా ఏం లేవు. పరిమిత బడ్జెట్ కి తగ్గట్టున్నాయి. కొన్ని అవసరం లేని షాట్స్ బడ్జెట్ పెరగడానికే పనికొచ్చాయి. ఒక విషయం అడగడానికి హీరో బృందం ఇన్స్ పెక్టర్ ఇంటి దాకా రావడం, అడిగి వెళ్ళి పోవడం అనవసరం లేని సీను. ఫోన్లో అడిగితే సరిపోయేది. ఇక సెకండాఫ్ లో కాస్త కథ, మలుపులు తగ్గిస్తే సినిమా భారంగా వుండేది కాదు. ఈ థ్రిల్లర్ కి రెండు గంటల నిడివి చాలు. 
        
మొత్తానికి ఈ కొత్త ప్రయోగపు డిటెక్టివ్  సినిమా సెకండాఫే కథ అన్నట్టు  గాకుండా ఫస్టాఫ్ లో కూడా కాస్త బిగి వున్న కథతో -యూత్ అప్పీల్ తో ప్రొఫెషనల్ గా నడిపివుంటే ఎక్కువ రోజులు ఆడే అవకాశముంటుంది. డిటెక్టివ్ కథలో డిటెక్టివ్ కి కుటుంబ పాత్రలు, సెంటిమెంట్లు, డ్రామాలు ఫీల్ ని చెడగొడతాయి. డిటెక్టివ్ లకి, గూఢచారులకి కుటుంబాలు, కుటుంబ సమస్యలూ వుండవు. ప్రపంచ సమస్యలే  ఈ పాత్రల సమస్యలు!

—సికిందర్

1410 : రివ్యూ

 

రచన- దర్శకత్వం : రాంగోపాల్ వర్మ
తారాగణం :   అజ్మల్ అమీర్, వాసు ఇంటూరి, కోట జయరాం, మానస రాధాకృష్ణన్, ధనుంజయ్ ప్రభునే, సురభి పార్వతి, తదితరులు  
సంగీతం: బాలాజీ, ఛాయాగ్రహణం : సజీష్ రాజేంద్రన్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
విడుదల : మార్చి 2, 2024
***
        రాంగోపాల్ వర్మ రాజకీయ సినిమాల పరంపర కొనసాగుతోంది. వీటిని సినిమాలనేకంటే డాక్యుమెంటరీలనడం సబబు. రాజకీయ రంగంలో జరిగిన సంఘటనలని పేర్లు మార్చి నటులతో కలిపి చూపిస్తే, కొన్ని సెటైర్లువేస్తే సినిమా అయిపోతోంది. ఈ కోవలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ని తీసుకున్నాడు. ఇటీవల యాత్ర 2 పేరుతో జగన్మోహన్ రెడ్డి బయోపిక్ వచ్చింది. అది విఫలమైంది. ఇప్పుడు వ్యూహం పేరుతో మరొకటి. ఇదెలా వుందో చూద్దాం...

కథ

14 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం వీరశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సంఘటనకి వెలుగు దేశం అధ్యకుడు ఇంద్రబాబు నాయుడు ఆనందిస్తాడు. జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడ ప్రయోజనం పొందాలో ఆలోచనలు చేస్తూంటాడు. అధికార భారత్ పార్టీకి చెందిన 150 మంది నాయకులు తదుపరి సీఎం గా వీఎస్సార్ కుమారుడు మదన్ మోహన్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తూ సంతకాలు చేస్తారు. దీంతో భారత్ పార్టీ అధ్యక్షురాలు మేడమ్ ఆగ్రహించి  కాశయ్యని సీఎంగా చేస్తుంది. దీంతో అసంతృప్తి చెందిన మదన్, భార్య మాలతి (మానస రాధాకృష్ణన్) ప్రోత్సాహంతో తండ్రి మృతికి తట్టుకోలేక చనిపోయిన మృతుల కుటుంబాల్ని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతాడు. దీని మీద మేడమ్ మళ్ళీ అగ్రహిస్తుంది. మదన్ ఆగకుండా వేరేగా వీఎస్సార్ సీపీ పార్టీ పెడతాడు. ఇక మేడమ్ అవినీతి కేసులు మోపి జైల్లో వేస్తుంది.          

ఇలావుండగా సినిమా స్టార్ కిరణ్ జీవి ప్రారంభించిన మన రాజ్యం పార్టీని భారత్ పార్టీలో విలీనం చేస్తే తమ్ముడు శ్రవణ్ కళ్యాణ్ అడ్డం తిరుగుతాడు. ఇప్పుడు జైల్లో వున్న మదన్ ఏం చేశాడు? తండ్రి ఆశయాల్ని నెరవేర్చాలని తపిస్తున్న తనకి ఎదురవుతున్న అవాంతరాల్ని ఎలా దాటాడు? ఏ వ్యూహం రచించాడు? దీన్ని అడ్డుకుంటూ ఇంద్రబాబు నాయుడు పన్నిన ప్రతి వ్యూహాలేమిటి? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

2009 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి దగ్గర నుంచి, 2019 లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకూ జరిగిన కొన్ని సంఘటనలని ఏకరువు పెట్టే కథ ఇది. పూర్తిగా జగన్ పక్షం వహిస్తూ ప్రత్యర్ధుల్ని జోకర్లుగా చూపించే ఎన్నికల ప్రచార సినిమా అనొచ్చు. యాత్ర 2 కథాకాలం కూడా ఇదే కాబట్టి అందులో చూపించిన సంఘటనలే ఇందులో వుంటాయి. ఓదార్పు యాత్రతో ప్రారంభమయ్యే జగన్ రాజకీయ ప్రయాణం పాద యాత్రతో ఎన్నికల్లో గెలిచి సీఎం అవడం వరకూ. అయితే యాత్ర 2 లో జగన్ పాత్రని తన లక్ష్యం కోసం సంఘర్షించే కథానాయక పాత్రగా సినిమాటిక్ గా చూపిస్తే, వ్యూహంలో అదేమీ లేకుండా ప్రత్యర్ధుల్ని జోకర్లుగా మార్చి, సెటైర్లు వేయడానికే చూపించడంతో, బలహీన సినిమాగా మారింది. ప్రత్యర్ధుల్ని బలంగా చూపిస్తేనే కదా కథానాయకుడికి సంఘర్షణ వుంటుంది. ఈ సంఘర్షణ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనల్ని పేర్చుకుంటూ పోవడంతో కథలా కాకుండా డాక్యుమెంటరీలా తయారయ్యింది.
       
వై ఎస్ బగన్
, భారతి, విజయలక్ష్మి, షర్మిల, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, లోకేష్, కన్నా లక్ష్మీనారాయణ, కె. రోశయ్య, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ పాత్రలన్నీ పేర్లు మార్చి వుంటాయి. ఐతే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన వుండవు. ఇలాటి కీలక పరిణామాల్ని దాటవేస్తూ జంప్ చేస్తూంటుంది డాక్యుమెంటరీ. చంద్రబాబు సీఎం అయితే వేర్పడిన ఆంధ్రప్రదేశ్ సీఎం అని తెలియదు.
        
ఇక వై ఎస్ మదన్, వీఎస్సార్ సీపీ పార్టీ అని చెప్తూనే దృశ్యాల్లో జగన్ పేర, వైఎస్సార్ సీపీ పార్టీ పేర జెండాలు కనిపిస్తూంటాయి. ఒక పాట కూడా జగన్ ని కీర్తిస్తూ వుంటుంది. పాత్ర చూస్తే మదన్, పాటలు బ్యానర్లు చూస్తే జగన్. పాటలు బ్యానర్లు సరే, మరి ఈ మదన్ ఎవరు? – అని అడిగితే ఎన్నికల ప్రచార సినిమా కేం చెబుతారో తెలీదు.ఒక పద్ధతి లేకుండా రాంగోపాల్ వర్మ తీసిన తన పద్ధతి సినిమా వ్యూహం’.

నటనలు –సాంకేతికాలు

దాదాపు నటులందరూ అచ్చం నిజజీవిత పాత్రలకి తగ్గట్టే వుండేలా వెతికి పట్టుకోవడం వర్మ సాధించిన గొప్పదనం. జగన్ లాంటి అజ్మల్ అమీర్, చంద్రబాబులాంటి ధనంజయ్ ప్రభునే, భారతి లాంటి మానస రాధాకృష్ణన్...ఇలా అందరూ పోలికలు కుదిరి, అనుకరణలు కుదిరి దృశ్యాల్ని ఆసక్తికరంగా మారుస్తారు. లోకేష్ నటుడెవరో కనిపించడు. తిండిపోతుగా తింటున్న చేతులు మాత్రమే కనిపిస్తూంటాయి. తిండి గురించి చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తూంటాయి.
       
ఇంద్రబాబు నాయుడుని తోటి నాయకులే మెత్తగా దెప్పి పొడవడం
, ముఖ్యంగా అవసరానికి ఎవరి కాళ్ళయినా పట్టుకునే దిగజారుడు మనిషిగా చెప్పడం వుంటాయి.  ఇంద్రబాబు శ్రవణ్ కళ్యాణ్ ని అవసరానికి వాడుకుని, ఎన్నికల్లో ఓడించి మూలన కూర్చోబెట్టడం, రెండు లక్షల పుస్తకాలు చదివాననే చేగువేరా అరాధకుడు శ్రవణ్ కళ్యాణ్  పరమ జోకర్ లా బిహేవ్ చేయడం, అన్న కిరణ్ జీవి కూడా తెలివి తక్కువ రాజాకీయాలు మాట్లాడడంగా ఈ పాత్రలుంటాయి.
       
ఇన్నేసి పాత్రలున్నా సినిమా పేలవంగా వుంటుంది డాక్యుమెంటరీలా తీశారు కాబట్టి. ఇదే సినిమా కోడిరామకృష్ణ గనుక తీసి వుంటే ఒక ఊపు వూపేది. రాజకీయ సినిమాలు తీయడంలో ఆయన సిద్ధహస్తుడు. బ్యాక్ గ్రౌండ్ రాజకీయ పాటలు కూడా వాటి దారిన అవి వచ్చి పోతూంటాయి- సన్నివేశాల్లో బలం వుండదు కాబట్టి. ఓదార్పు యాత్ర
, పాద యాత్ర,  మదన్ అరెస్టప్పుడు అడ్డుకునే కార్యకర్తల క్రౌడ్ దృశ్యాలు మాత్రం హెవీగా వుంటాయి.
       
ఇంతకీ మదన్ రాజకీయ భావజాలమేమిటి
? మేనిఫెస్టో చూసి, ఇందులో సంక్షేమ పథకాలే కనిపిస్తున్నాయి, అభివృద్ధి గురించి ఏది?- అంటుంది మాలతి. భవనాలూ రోడ్లతో మెరిసి పోయే అభివృద్ధికన్నా, సంక్షేమ పథకాలతో ప్రజల అభివృద్ధికి పాటుపడడమే నిజమైన అభివృద్ది- అంటాడు మదన్.
       
అయితే ఇది బలమైన ఎన్నికల ప్రచార సినిమా అవ్వాలంటే మొదట్నుంచీ సింగిల్ ఎజెండాతో మదన్ తన ఐడియాలజీ కోసం సంఘర్షించే బలమైన పాత్రగా చూపించుకు రావాలే తప్ప
, చివర్లో సంక్షేమం- అభివృద్ధి గురించి ఓ మాట అనేస్తే సరిపోదు సినిమాకి.
—సికిందర్

 
         



1409 : రివ్యూ

 

రచన –దర్శకత్వం : శక్తి ప్రతాప్ సింగ్
తారాగణం : వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్, సంపత్ రాజ్ షతాఫ్ ఫిగర్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం తదితరులు
సంగీతం : విక్కీ జె మేయర్, ఛాయాగ్రహణం : హరి కె వేదాంతం
నిర్మాణం : సోనీ పిక్చర్స్, సందీప్ ఎం.
విడుదల ; మార్చి 1, 2024
***
        రుణ్ తేజ్ నటించిన ఘని’, గాండీవధారి అర్జున అనే  గత రెండు సినిమాలూ ఫ్లాపయిన తర్వాత, ఇంకో యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలంటైన్ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు. దీనికి శక్తి ప్రతాప్ సింగ్ అనే కొత్త దర్శకుడు. తెలుగులో వైమానిక దళ కథతో తొలి సినిమాగా తీసిన దీనికి ఫుల్వామా దాడి- ప్రతీకార దాడుల ఉదంతం ఆధారం. జనవరి 25నే ఇదే ఉదంతం మీద హిందీలో ఫైటర్ వచ్చింది. ఇలా ఒకే కథతో వెంటవెంటనే రెండు సినిమాలు రావడంతో ఏది బెటర్ అన్న ప్రశ్న వస్తుంది. అదేమిటో చూద్దాం...

కథ

వింగ్ కమాండర్ అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్), భార్య రాడార్ అహనా గిల్ (మానుషీ చిల్లర్) ఆపరేషన్ వజ్ర పేరుతో టెస్ట్ ప్రాజెక్ట్ చేపడతారు. 20 మీటర్ల తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్స్ కి చిక్కకుండా పైలట్స్ ప్రాణాలు కాపాడుకోవచ్చనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే ఈ టెస్టులో స్నేహితుడు (కబీర్) నవదీప్ చనిపోవడంతో అహనా అర్జున్ తో విభేదించి దూరంగా వుంటుంది. ఫ్రెండ్ మృతికి కారకుడైనందుకు అర్జున్ బాధలో వుండగా, ఫుల్వామాలో సైనికుల మీద ఉగ్రవాద దాడి జరిగి 40 మంది సైనికులు చనిపోతారు. దీంతో ఫ్రెండ్ మృతికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం అర్జున్ కి లభిస్తుంది. ఫుల్వామా దాడికి ప్రతీకారంగా వైమానిక దళం పాక్ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రతీకార దాడిలో పాల్గొన్న అర్జున్ ఎలా విజయం సాధించాదనేది మిగతా కథ.

ఎలావుంది కథ

2019 ఫుల్వామా ఘటనకి ముందు 2016 లో యురీలో సైనిక స్థావరం మీద జరిగిన ఉగ్రవాద దాడి ఆధారంగా యురీ - ది సర్జికల్ స్ట్రైక్  అనే సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ - యామీ గౌతమ్ నటించారు. ఇది 2019 జనవరి 11 న విడుదలైంది. వెంటనే ఫిబ్రవరి 14 న ఫుల్వామా దాడి జరిగింది. దీంతో ఈ సినిమాకి విపరీత ఆదరణ లభించింది. 44 కోట్ల బడ్జెట్ కి 342 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఈ మూవీ బలమైన కథతో, బలమైన చిత్రీకరణతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇందులో “హౌ ఈజ్ ది జోష్?” “హై సర్!” అన్న డైలాగు బాగా వైరల్ అయింది.
         

దీని తర్వాత 2024 జనవరి 25 న ఫుల్వామా దాడి మీద హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ విడుదలైంది. ఇందులో బలమైన కథా కథనాలు లేక యావరేజీగా ఆడింది. ఇప్పుడు మళ్ళీ ఫుల్వామా మీద ఆపరేషన్ వాలంటైన్ వచ్చింది. ఇది కూడా బలమైన కథా కథనాల లోటుని ప్రదర్శించింది. కారణం, ఫుల్వామా కథకి ముందు ఏర్ ఫోర్సు జరిపే ఆపరేషన్ వజ్ర అనే టెస్టు, ఫుల్వామా కథ తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ జరిపే ఆపరేషన్ నెహ్రూ పేర దాడి... ఇలా ఫుల్వమాకి ముందు ఒక కల్పిత కథ, తర్వాత ఇంకో కల్పిత కథ అతికించడంతో మధ్యలో ఫుల్వామా కథ బలి అయింది. ప్రేక్షకులు ఏ కథ ఫీలవ్వాలో అర్ధం కాని పదార్ధంగా తయారైంది. పూర్తి నిడివి ఫుల్వామా మీద వుండాల్సిన కథ లేకపోవడంతో భావోద్వేగాలు, డ్రామా, సంఘర్షణ అనే బాక్సాఫీసు ఎలిమెంట్లు  అదృశ్యమైపోయాయి. కేవలం యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడాలంతే.
          
ఫస్టాఫ్ ఆపరేషన్ వజ్ర టెస్టు తో, వరుణ్ తేజ్ -మానుషీ చిల్లర్ ఫ్లాష్ బ్యాక్స్ తో, ఇంకా బోలెడు ఏర్ ఫోర్స్ హడావిడితో సాగుతుంది. ఇదంతా ఏమిటో అర్ధం గాకుండానే ఇంటర్వెల్ ముందువరకూ సాగుతుంది. అప్పుడు ఫుల్వామా  మీద దాడి జరగడంతో అసలు కథలో కొస్తుంది. ఈ దాడికి ప్రతీకారంగా ఏర్ ఫోర్స్ బాలకోట్ స్ట్రైక్ ప్లాన్ చేయడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
        
సెకండాఫ్ లో బాలకోట్ ఉగ్ర స్థావరాల మీద విజయవంతమైన దాడితో ఆ ఆపరేషన్ ముగుస్తుంది. దీంతో కథ అయిపోయినట్టే. కానీ దీనికి ప్రతీకారంగా మళ్ళీ పాక్ ఎదురుదాడి అనే కల్పిత కథతో పొడిగించారు. మళ్ళీ దీన్ని ఏర్ ఫోర్స్ తీపికొట్టిన విధానంతో ముగించారు.     
       
ఇలా కథ మూడు ముక్కలుగా వుండడంతో సినిమాని నిలబెట్టే భావోద్వేగాలు అనే ముఖ్యమైన ఎలిమెంట్ మిస్సయ్యింది. దీంతో విషయపరంగా
, పాత్రల పరంగా డొల్లగా, యాక్షన్ పరంగా జోరుగా తయారయ్యింది. ఇలా ఆపరేషన్ వాలంటైన్’, ఫైటర్ రెండూ ఒకటే అయ్యాయి.

నటనలు – సాంకేతికాలు

 కంచె అనే వార్ మూవీ తర్వాత వరుణ్ తేజ్ మరో సారి యుద్ధ వీరుడి పాత్రలో పర్ఫెక్ట్ గా కనిపిస్తాడు. ఇలాటి పాత్రలు అతడికి కొట్టిన పిండే అన్నట్టు వుంది. కాకపోతే కంచె లోలాంటి బలమైన పాత్రచిత్రణ కొరవడింది మూడు ముక్కల కథ వల్ల. ఇంకోటేమిటంటే హీరోయిన్ మానుషీ చిల్లర్ తో కెమిస్ట్రీ, సంఘర్షణ, ఫీల్ వంటివి ఏవీ లేకపోవడం. ఫ్రెండ్ మృతికి బాధ కూడా బలంగా లేకపోవడం. కేవలం లుక్స్ కి, యాక్షన్ కి ఒక మోడల్ గా కనిపించడం వరకూ చేశాడు వరుణ్ తేజ్. క్లయిమాక్స్ లో కాస్త దేశభక్తి ఎలిమెంట్ పోషించాడు.

        మానుషీ చిల్లర్ డిటో. ఈమెతో బాటు ఇతర పాత్రధారులకీ సరైన పాత్రచిత్రణలు లేవు. ఫస్టాఫ్ లో తీసుకున్న సమయమంతా పాత్రచిత్రణల్ని స్థాపించడానికి తీసుకున్నా బావుండేది. ఫైటర్ లో ఈ ప్రయత్నమే చేశారు- ఇంటర్వెల్ కి ముందు ఫుల్వామా దాడి జరిగే వరకూ. ఆ తర్వాత ఆ పాత్రచిత్రణలు ఎటు పోయాయనేది వేరే సంగతి.

        మిక్కీ జె మేయర్ సంగీతం ఓ మాదిరిగా వుంది. నిజానికి ఫుల్వామా లాంటి విషాద సంఘటన చుట్టూ కథకి  వెంటాడే సంగీతం వుండాలి. కానీ ఫుల్వామా కథ మధ్యలో ఓ ముక్క కాబట్టి సినిమా సాంతం ఒక వెంటాడే సంగీతానికి స్కోప్ లేకుండా పోయింది.

        హరి కె వేదాంతం కెమెరా వర్క్ మాత్రం ఉన్నతంగా వుంది. అలాగే ఏరియల్ యాక్షన్ దృశ్యాల విజువల్ ఎఫెక్ట్స్ బడ్జెట్ కి తగ్గట్టు వున్నాయి. ఈ విషయంలో ఫైటర్ బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే గగనతలంలో జెట్ ఫైటర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఉత్కంఠ భరితంగా వుంది. ఈ సినిమాలో కథా కథనాల కన్నా, పాత్రచిత్రణల కన్నా యాక్షన్ దృశ్యాలే హైలైట్.

        ఇలాటి హై కాన్సెప్ట్ సినిమాలకి ముఖ్యంగా కావాల్సింది భారతీయాత్మ. షోలే’, గదర్ వంటి యాక్షన్ సినిమాల్లో భారతీయాత్మని దండిగా సమకూర్చి పెట్టడం వల్లే మళ్ళీ మళ్ళీ విరగబడి చూశారు ప్రేక్షకులు. యుద్ధ సినిమాలో ఇదింకా చాలా ముఖ్యం. జేపీ దత్తా బోర్డర్ పెద్ద ఉదాహరణ. ఇలాటి సినిమాలు చూసి, తెలుసుకుని తీస్తే ఆపరేషన్ వాలంటైన్ లాంటివి రిపీట్ ఆడియెన్స్ తో నాలుగు రోజులు ఎక్కువ ఆడుతాయి.
—సికిందర్

1408 : రివ్యూ

 

రచన –దర్శకత్వం : టి.జి. కీర్తి కుమార్
తారాగణం : వెన్నెల కిషోర్, సంయుక్తా  విశ్వనాథన్, మురళీ శర్మ, సత్యా, తాగుబోతు రమేష్ తదితరులు
సంగీతం : సైమన్ కె కింగ్, ఛాయాగ్రహణం : రిచర్డ్ కెవిన్ ఎ
నిర్మాత: అదితీ సోని
విడుదల  : మార్చి 1, 2024
***
        పాపులర్ కమెడియన్  వెన్నెల కిషోర్ గతంలో హీరోగా చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాక కమెడియన్ గానే కొనసాగాడు. 100 కి పైగా సినిమాల్లో నటించాడు. మళ్ళీ తిరిగి ఇంకోసారి హీరోగా ప్రయత్నిస్తూ చారి 111 లో నటించాడు. గూఢచారి పాత్రని కామెడీగా పోషించి నవ్వించాలని ఉద్దేశం. దీనికి కావలసిన సరంజామా దర్శకుడు కీర్తి కుమార్ సమకూర్చాడు. మరి వెన్నెల కిషోర్ సినిమా మొత్తాన్నీ తన భుజాన మోస్తూ నినిలబెట్టాడా అన్నది ప్రశ్న. ఈ గూఢచారి సినిమాలో అసలేముంది? ఉన్న విషయమైనా సక్రమంగా వుందా? కామెడీ పేరుతో కామెడీ కూడా చేయలేక వెన్నెల కిషోర్ చతికిలబడిన దృశ్యం కనిస్తుంది ఇందులో. ఎందుకంటే ఈ కథే ఓ పిచ్చి కథ.

కథలో రిటైర్డ్ మేజర్ ప్రసాద రావు (మురళీ శర్మ) సీఏం కోరికపై రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్స్ టీంని నడిపిస్తూంటాడు. దేశ భద్రత కోసం ఈ టీం సీక్రెట్‌గా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆత్మాహుతి దాడి జరుగుతుంది. ఈ దాడి జరిపిన మృతుడి వొంటి పై బాంబు అమర్చినట్టు వుండదు.  బాంబు లేకుండా ఎలా దాడి చేశాడు? ఈ మిస్టరీని ఛేదించడానికి కేసుని సీఎం, ప్రసాదరావుకి అప్పజెప్తాడు. ప్రసాదరావు ఏజెంట్ చారి 111 (వెన్నెల కిషోర్) ని రంగంలోకి దింపుతాడు. ఏజెంట్ చారి ఏ కేసు కూడా సీరియస్ గా తీసుకోడు. పిల్లకాయ చేష్టతలతో పిచ్చి పిచ్చిగా పరిశోధిస్తాడు.

ఈ పరిశోధనలో కెమికల్ పిల్ ని కడుపులో దాచి పేల్చుకున్నట్టు తేలుతుంది. ఏమిటా కెమికల్ పిల్? ఎవరు తయారు చేస్తున్నారు, వాళ్ళని చారి ఎలా పట్టుకున్నాడ న్నది మిగతా కథ.

ఈ కథ పిల్లకాయ చేష్టగానే వుంటుంది. కామెడీ పేరుతో అర్ధం పర్ధం లేని సీన్లతో నింపేశారు. ఫస్టాఫ్ కథ  కథ లేకుండానే వెన్నెల కిషోర్, అతడి టీం తెలివితక్కువ కామెడీ సీన్లతో ఓపికని పరీక్షిస్తూ సాగుతుంది. లాజిక్ లేని సిల్లీ కామెడీలతో నవ్వించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఈ కామెడీ ఇటు ఆబ్సర్డ్ కామెడీ కాకుండా, అటు మైండ్ లెస్ కామెడీ కూడా గాకుండా పోయింది. ఈ అర్ధం పర్ధం  లేని కామెడీ ఎక్కువగా డైలాగ్-ఓరియెంటెడ్ గానే వుంటుంది. ఈ డైలాగులకి కూడా నవ్వురాదు.

వెన్నెల కిషోర్ దర్యాప్తు మానవ ప్రేగులలో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనాల్ని పేలుడు పదార్థాలుగా మార్చే  శాస్త్రవేత్త నేతృత్వంలోని బృందానికి దారి తీస్తుంది. మేజర్ ప్రసాద రావుకి  ఫ్లాష్ బ్యాక్ ఒకటి వుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో కాశ్మీరీ ఆవిడ పాత్ర అనుమానాస్పదంగా వుంటుంది. ఇలా సరైన లింకులు లేకుండా ఏవేవో మలుపులు తిరుగుతూ పోతూంటుంది కథ.కిషోర్ చేపట్టే కేసులో  ఏజెంట్లుగా సంయుక్తా విశ్వనాథన్, తాగుబోతు రమేష్ కనిపిస్తారు.  ఇంకో కమెడియన్ సత్య క్యూ అనే ఇంకో పిచ్చి పాత్ర పోషించాడు

విచిత్రమేమిటంటే, ఫస్టాఫ్ పిచ్చికామెడీ చేసి, సెకండాఫ్ యమ సీరియస్ గా నడిపించడం. ఇక్కడ కూడా లాజిక్ లేకపోవడంతో సినిమా పూర్తిగా బెడిసికొట్టింది. సెకండ్ హాఫ్ కూడా సిల్లీ కామెడీతోనే నడిపివుంటే సరిపోయేది.
        
విషయం పేలవంగా వుండడంతో వెన్నెల కిషోర్ ఎంత కామెడీ చేసినా సినిమాని మోయలేక పోయాడు. హీరోగా ఇది మూడో వైఫల్యం. మళ్ళీ ఇలాటి ప్రయత్నాలు చేయకుండా వుంటే బావుంటుంది.

—సికిందర్