రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, June 7, 2023

1342 : స్పెషల్ ఆర్టికల్


 

టీటీల్లో సినిమాల్ని ముందుగానే విడుదల చేయడాన్ని నిరసిస్తూ జూన్ 7 -8 తేదీల్లో కేరళ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లని మూసివేస్తున్నట్లు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK)  ప్రకటించింది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ‘2018’, పచ్చువుమ్ అద్భుత విళక్కుం సినిమాల నిర్మాతలు ఓటీటీల్లో  గడువుకంటే ముందే ప్రీమియర్ చేయడానికి అంగీకరించడంతో, ఎగ్జిబిటర్ల సంఘం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
        ‘2018’, పచ్చువుమ్ అద్భుత విక్కుమ్ సినిమాలు థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయనీ, అందుకని ఓటీటీల్లో ముందస్తుగా విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ, జూన్ 7- 8 తేదీల్లో సినిమా హాళ్ళను పూర్తిగా మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన తర్వాత, నిర్ణీత వ్యవధి గడిచాక మాత్రమే ఓటీటీ విడుదలకి అనుమతించేట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరింది.
       
ఓటీటీలో
సినిమాల్ని ముందుగానే విడుదల చేయడం వల్ల థియేటర్ల యజమానులు సినిమా హాళ్ళని నడపడానికి ఇబ్బంది పడుతున్నారనీ, ఓటీటీలకి సమాంతరంగా సినిమా హాళ్ళని నడపలేమనీ, దీనికి ఒక పరిష్కారం కనుగొనాలనీ, పైన పేర్కొన్న రెండు సినిమాలు థియేటర్లలో మంచి వసూళ్ళతో ఆడుతూ వుండగానే, ఓటీటీ విడుదల తేదీల్ని ప్రకటించడంతో ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసింది ఎగ్జిబిటర్ల సంఘం.

నిర్మాతలు ఇంకొన్ని రోజులు వేచి వుంటే ‘2018’ కేరళలో రూ. 200 కోట్లు వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా నిలిచిపోయేదనీ, ఇప్పటికే 25 రోజుల్లో రాష్ట్రంలో వసూళ్ళు రూ. 160 కోట్లు దాటాయనీ, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 60 కోట్ల వినోద పన్ను సమకూరిందనీ ఎగ్జిబిటర్ల సంఘం వెల్లడించింది. విడుదలైన మొదటి 10 రోజుల్లో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి మలయాళ సినిమాగా నిలిచిందనీ పేర్కొంది.
       
నిజానికి ఓటీటీల్లో విడుదలలకి సంబంధించి నిర్మాతలతో ఎగ్జిబిటర్ల సంఘం గతంలో ఒక ఒప్పందం కుదుర్చుకుంది కూడా. సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన 42 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీల్లో
విడుదల చేయాలనేది ఆ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ‘2018’, పచువుమ్ అత్బుత విక్కుమ్ నిర్మాతలు పరిగణనలోకి తీసుకోలేదు.
        
గతంలో చలనచిత్రాలు థియేటర్లలో విడుదలైన 32 రోజుల తర్వాత ఓటీటీల్లో విడుదల చేయాలని ఒక నిబంధన వుండేది.  అయితే ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదని తేలడంతో పునః పరిశీలించాల్సి వచ్చింది. సవరించిన వ్యవధి 42 రోజులుగా నిర్ణయించారు. ఇకముందు ఎవరైనా నిర్మాత ఈ నిబంధనని ఉల్లంఘిస్తే ఆ నిర్మాత సినిమాల్ని బహిష్కరిస్తామని సంఘం హెచ్చరించింది.

తమ డిమాండ్ల
ని పరిష్కరించాలని 20 రోజుల అల్టిమేటం జారీ చేశామని సంఘం తెలిపింది. 20 రోజుల్లోగా తమ డిమాండ్లని నెరవేర్చకపోతే  సినిమా హాళ్ళని పూర్తిగా మూసివేసి నిరవధిక సమ్మెకు దిగుతామని మరో హెచ్చరిక జారీ చేసింది. అయితే సినిమాల్ని డైరెక్ట్-టు-ఓటీటీ విడుదల చేసుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది.            

నిబంధనల ఉల్లంఘన
వినోదపు పన్నుని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం పై కూడా సంఘం స్పందించింది. ఇటీవలి వరకు ఈ సమస్య గురించి ప్రభుత్వానికి తెలియదనీ, ప్రభుత్వం ఇప్పుడు సమస్యని గుర్తించిందని భావిస్తున్నామనీ, ఇప్పటికే సంబంధిత మంత్రితో చర్చలు జరిపామనీ, సంబంధిత డేటాతో బాటు, ఇతర నివేదికల్ని మంత్రికి సమర్పించామనీ, ఈ విషయాన్ని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారనీ సంఘం తెలిపింది.

చెత్త సినిమాలకి  నో!

ఓటీటీ విడుదలలతో సమస్య ఇలా వుండగా, కేరళలో థియేటర్లు ఎదుర్కొంటున్న భయంకర సంక్షోభం గురించి వార్తలు గత రెండు నెలలుగా వెలువడుతూనే వున్నాయి. మలయాళం సినిమాల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల కారణంగా రాష్ట్రంలోని సినిమా హాళ్ళని  కాపాడేందుకు ఎగ్జిబిటర్ల సంఘం గత నెలలోనే అనేక చర్యల్ని వెల్లడించింది. వాటిలో ప్రధానమైనది చెత్త సినిమాల బహిష్కారం.
        
ఎగ్జిబిటర్లని తీవ్రంగా దెబ్బ తీస్తున్న సమస్య  చెత్త సినిమాలు. కేరళలో 1015 సినిమా హాళ్ళున్నాయి. నాణ్యత లేని సినిమాలకి ప్రేక్షకుల్లేక షోలు ఆపేయాల్సిన పరిస్థితి. దీంతో ఇలాటి సినిమాల్ని ప్రదర్శించకుండా వుండాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఎగ్జిబిటర్ల తిరస్కరణకి గురైన సినిమాలని నిర్మాతలు థియేటర్లలో ప్రదర్శించాలని కోరుకున్నట్లయితే, థియేటర్ యజమానులకి  స్క్రీనింగ్ ఫీజు చెల్లించేలా నిబంధన విధించేందుకు సిద్ధమయ్యారు.
       
గత నెల
జనరల్ బాడీ మీటింగులో, కొన్ని సినిమాలకు కనీస స్క్రీనింగ్ ఛార్జీని విధించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇలాటి సినిమాలకి థియేటర్లలో చాలా తక్కువ మంది ప్రేక్షకులుంటారు. కొన్నిసార్లు కేవలం ముగ్గురు లేదా ఐదుగురు మాత్రమే వుంటారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు, విద్యుత్ ఛార్జీలు కూడా భరించడం కష్టమవుతోంది. ఈ సమస్యని పరిష్కరించడానికి, నాణ్యత లేనివిగా భావించే సినిమాల నిర్మాతల నుంచి  స్క్రీనింగ్ ఫీజులు వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించే నిర్మాతల సినిమాల్ని ప్రదర్శించ కూడదని నిర్ణయం తీసుకున్నారు. విధానం సింగిల్ స్క్రీన్ థియేటర్లకి మాత్రమే వర్తిస్తుంది, మల్టీప్లెక్సులకి కాదు.
       
మలయాళంలో అవసరానికి మించిన సినిమాలు ఉత్పత్తి చేస్తున్నారు. నెలకు పాతిక సినిమాలు విడుదల చేసి ప్రేక్షకుల నెత్తిన వేస్తున్నారు. ఇవన్నీ చెత్త సినిమాలు. ప్రేక్షకులు వీటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకప్పుడు గుణాత్మక సినిమాలకి పేర్గాంచిన మాలీవుడ్ ఇప్పుడు దేశంలోనే చావకబారు సినిమా పరిశ్రమ మారిపోయింది. ఇంకా చాలా వెనక్కిపోతే
, 1970-80 లలో మలయాళ సినిమాలంటే సర్టిఫికేట్ సెక్స్ సినిమాలనే పేరుండేది. సీమా నుంచీ షకీలా వరకూ హీరోయిన్లు శృంగార పాత్రలతో ప్రేక్షకుల్ని రెచ్చగొట్టే వాళ్ళు. ఇవి తెలుగు డబ్బింగులుగా తెలుగునాట కూడా దాడి చేశాయి. దీనికి ఆద్యుడు దర్శకుడు ఐవీ శశి. 100 సినిమాలు తీసిన శశి బూతు సినిమాలే ఎక్కువ తీశాడు. ఆ నిమిషం, అనుభవం, ఆలింగనం, అంగీకారం...అంటూ ఆ చవకబారు సినిమాలే ఇప్పుడు సోకాల్డ్ వాస్తవిక సినిమాలుగా పునరావృతమవుతున్నాయి.
       
వాస్తవికత అనే పైత్యం ముదిరి ఈ వందల కొద్దీ చెత్త సినిమాలతో నిర్మాతలు
, పంపిణీ దార్లు, థియేటర్ల యజమానులు తప్ప- దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లూ అపార ఉపాధి అవకాశాలు పొందుతూ చెట్టపట్టా లేసుకు తిరుగుతున్నారు. ఇది విచిత్ర పరిస్థితి. ఇలా మాలీవుడ్ లో హమాలీలు ఎక్కువైపోయారు. మాలీవుడ్ లో
సామర్థ్యానికి మించి మొత్తం ఈ ఏడాది 250 నుంచీ 300 వరకూ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. 

ఇలాటి
సినిమాలకి ఫైనాన్స్ చేయడాన్ని నిలిపివేయాలని, లేదా డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేయడం మానుకోవాలనీ, లేదా నటీనటులు ఇలాటి సినిమాల్లో నటించవద్దనీ ఎగ్జిబిటర్ల సంఘం డిమాండ్ చేసే హక్కులేదు. అయితే ఈ సినిమాల్ని ప్రదర్శించడానికి నిరాకరించే హక్కు మాత్రం వుంది.
        
సినిమాల నాణ్యతని అంచనా వేయడానికి ఎగ్జిబిటర్ల సంఘం పూనుకోవచ్చు. సినిమాల సంభావ్య విజయాన్ని అంచనా వేయడానికి, నాణ్యతని అంచనా వేయడానికీ  ఎగ్జిబిటర్లుగా తమకి నైపుణ్యాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ మూల్యాంకన ప్రక్రియలో పరిగణించే నిపుణులుగా సినిమా దర్శకులు, నటీనటులు, నిర్మాణ సంస్థలు,  పంపిణీదారులూ వుండొచ్చు.
       
ఎగ్జిబిటర్ల సంఘం ఇంకో ఆక్షేపణ ఏమిటంటే
, ఈ రోజుల్లో చాలా మలయాళ సినిమాలు ఓటీటీల్ని లక్ష్యంగా చేసుకునే ఏకైక ఉద్దేశ్యంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలే థియేటర్లకి నష్టం కలిగిస్తున్నాయి. ఈ సినిమాల్ని చూడడానికి థియేటర్ కొచ్చిన ప్రేక్షకులు తాము మోసపోయామని గ్రహిస్తున్నారు. దీంతో మళ్ళీ థియేటర్లకి రావడానికి సందేహిస్తున్నారు. అందుకని థియేటర్లని రక్షించడానికి ఏకైక మార్గం థియేటర్లని దృష్టిలో వుంచుకుని థియేటర్ సినిమాల్ని నిర్మాతలు నిర్మించడమే.  ఇది హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యని పెంచుతుంది. ఇలా రూపొందించిన సినిమాలే తమకి అవసరమని ఎగ్జిబిటర్ల సంఘం విన్నవించుకుంటోంది.
—సికిందర్

 

Tuesday, June 6, 2023

1341 : స్పెషల్ ఆర్టికల్


 

కొత్త జేమ్స్ బాండ్ కోసం మళ్ళీ  వేట మొదలైంది. సగటున ప్రతి పదేళ్ళ కోసారి కొత్త జేమ్స్ బాండ్ కోసం వేట ఆనవాయితీగా వస్తోంది. 1962 లో వెండి తెర మీద తొలి జేమ్స్ బాండ్ 007 అవతరణ తర్వాత 2021 వరకూ 60 ఏళ్ళలో ఆరుగురు జేమ్స్ బాండ్ పాత్రధారులు వంతుల వారీగా ప్రపంచ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 007 స్పై సిరీస్ కి ఏడవ పాత్రధారి ఎవరవుతారనేది ఏడాది కాలం గా సస్పెన్స్ గా మారింది.

        రవ జేమ్స్ బాండ్ 007 గా డేనియల్ క్రేయిగ్ 5 బాండ్ సినిమాల్లో నటించి రిటైరయ్యాడు. ఇతను 1992 లో ది పవర్ ఆఫ్ ఒన్ తో సినీరంగ ప్రవేశం చేసి, మరో 22 సినిమాలు నటించిన తర్వాత, 2006 లో కాసినో రాయల్ తో జేమ్స్ బాండ్ అయ్యాడు. కాసినో రాయల్ తర్వాత క్వాంటమ్ సొలేస్ (2008), స్కై ఫాల్ (2012), స్పెక్టర్ (2015), నో టైమ్ టు డై (2021) లతో 15 ఏళ్ళ సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు. చిన్న తుపాకులతో అనుభవంతో పాటు, రేస్ డ్రైవింగ్, ఫ్రీ-రన్నింగ్, కార్డ్ ప్లేయింగ్ లలో ప్రత్యేక స్కిల్స్ తో 2006 లో జేమ్స్ బాండ్ పాత్రకి ఎంపికయ్యాడు.

జేమ్స్ బాండ్ పాత్రకి ఎంపిక కావాలంటే నటనానుభవం మాత్రమే వుంటే చాలదు. దాంతో బాటు జేమ్స్ బాండ్ గూఢచార పాత్రకి అవసరమైన ప్రత్యేక స్కిల్స్ కొన్ని కలిగి వుండాల్సిందే. మొట్టమొదటి జేమ్స్ బాండ్ గా థామస్ సీన్ కానరీ 1962 -1983 ల మద్య 6 బాండ్ సినిమాల్లో నటించాడు. చిన్న తుపాకులు పేల్చడం, గాంబ్లింగ్, రేస్-డైవింగ్, లైట్-ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్- బెల్ట్ వంటి ప్రత్యేక స్కిల్స్ ఇతడి సొంతం.

ఆరోన్ టేలర్-జాన్సన్ 
    రెండవ జేమ్స్ బాండ్ గా జార్జ్ లాజెన్‌బీ వచ్చాడు. 1969 లో సీన్ కానరీ వుండగానే ఒక సినిమాలో నటించాడు. చిన్న తుపాకులు పేల్చడం, స్కీయింగ్, బాబ్-స్లెడ్డింగ్, డ్రైవింగ్, గుర్రపు స్వారీ, గాంబ్లింగ్, డ్రింకింగ్, స్మోకింగ్ మొదలైన వాటిలో స్పెషల్ స్కిల్సు ఇతడి ఆస్తి.
       
మూడవ బాండ్
రోజర్ మూర్. ఇతను చాలా ఫన్నీగా ఎంటర్ టైన్ చేస్తాడు. కామెడీ పాలెక్కువ. 1972-1985 మధ్య ఏడు బాండ్ సినిమాలు నటించి ఎక్కువ పాపులరయ్యాడు. చిన్న తుపాకులు పేల్చడంలో,  బాంబులు-  పేలుడు పదార్థాలు పేల్చడంలో, పెద్ద వాహనాలు నడపడంలో, స్నోబోర్డింగ్ తో,  స్కీయింగ్ తో , జలాంతర్గాములతో, వైన్- షాంపేన్- సిగార్లు వంటివి తాగడంలో ప్రత్యేక స్కిల్స్ గడించాడు.
       
నాల్గో జేమ్స్ బాండ్ టి
మోతీ డాల్టన్. 1986-1994 మధ్య రెండు బాండ్ సినిమాల్లో నటించాడు.  చిన్న తుపాకులు, పెద్ద విమానాలు, డైవింగ్, గాంబ్లింగ్,  స్నిపింగ్, స్మోకింగులతో స్పెషల్ స్కిల్స్.
       
ఐదో బాండ్
పియర్స్ బ్రాస్నన్. 1994-2005 మధ్య 4 బాండ్ సినిమాలు నటించాడు. ప్రత్యేక స్కిల్స్ : చిన్న తుపాకులు, జెట్ పైలటింగ్, బేస్-జంపింగ్, స్కీయింగ్, మోటార్‌సైక్లింగ్, లైట్-ఎయిర్‌క్రాఫ్ట్, వైస్, సిగార్లు.
       
ఆరవ బాండ్ గా ఇప్పుడు డేనియల్ క్రేయిగ్ రిటైరయ్యాడు.
బ్రిటిష్ నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన సూపర్ స్పై జేమ్స్ బాండ్ పాత్ర సాహసకృత్యాలు చేయని దేశం లేదు. 1983 లో రోజర్ మూర్ నటించిన ఆక్టోపస్సీ లో ఇండియా వచ్చి ఉదయపూర్ లో హంగామా చేసిపోయాడు.
       
1962 నుంచీ ఈ 60 ఏళ్ళ కాలంలో 25 జేమ్స్ బాండ్ 007 సినిమాలు నిర్మించిన ఆల్బర్ట్ బ్రకోలీ
, ఆయన మరణానంతరం కుమార్తె బర్బరా బ్రకోలీ,
26వ బాండ్ సినిమాని 2024 లోపు ప్రారంభించే అవకాశంలేదు. విడుదల 2025-26 లలో వుండొచ్చు. ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. బాండ్ 26 గా వర్కింగ్ టైటిల్ పెట్టారు. దర్శకుడుగా మాత్రం డెనిస్ విలెన్యూ అనే కెనడియన్ -ఫ్రెంచి దర్శకుడు ఎంపికయ్యాడు. ఇతను హాలీవుడ్ లో 11 సినిమాలకి దర్శకత్వం వహించాడు-  బ్లేడ్ రన్నర్ 2049 సహా.

హెన్రీ కావిల్
    మరి కొత్త జేమ్స్ బాండ్ ఎవరు? కొత్త జేమ్స్ బాండ్ ముప్ఫైలలో వున్న యువకుడై వుండాలని నిర్ణయించారు. దీని ప్రకారం 2022 చివర్లో కొత్త జేమ్స్ బాండ్ గా ఆరోన్ టేలర్-జాన్సన్ ఉద్భవించాడని హాలీవుడ్ నుంచి సమాచారం వచ్చింది. ఇతను రహస్య ఆడిషన్‌లో పాల్గొన్నాడనీ, బాండ్ నిర్మాతల్ని ఆకట్టుకున్నాడనీ సమాచార సారాంశం. 32 ఏళ్ళ ఆరోన్ 22 సినిమాల్లో నటించాడు. వీటిలో చివరిది బుల్లెట్ ట్రైన్’.
        
అయితే ఆరోన్ ఫైనల్ కాలేదు. కొత్త జేమ్స్ బాండ్ లిస్టులో ఇంకా పది నుంచి 25 మంది వరకూ హీరోల పేర్లున్నాయి. వీరిలో నల్ల జాతీయుడు ఇద్రిస్ ఎల్బా కూడా వున్నాడు. ఇతను తప్పుకున్నాడు. నిర్మాతల ఇంకో నియమం ఏమిటంటే, ఎంపిక చేసిన నటుడు జేమ్స్ బాండ్ గా పది పన్నెండేళ్ళ పాటు సర్వీసు ఇవ్వగల స్టామినాతో వుండాలి.  
       
రెజ్-జీన్ పేజీ
పరిశీలనలో వున్న ఇంకో పేరు. ఇతను మూడవ బాండ్ రోజర్ మూర్ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా వున్నట్టు చెప్పాడు. టామ్ హార్డీ వినిపిస్తున్న ఇంకో పేరు. ఇతను మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’, ఇన్‌సెప్షన్’, ది డార్క్ నైట్ రైజెస్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించాడు.  
        
క్రేయిగ్ శకం ముగియడంతో, 007 నిర్మాతలు ఫ్రాంచైజీని కొంచెం ముందుకు -అంటే నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలని కోరుకునే అవకాశం వుంది. దీనికి కూడా అర్హతలున్న హీరో కావాలి. హెన్రీ కావిల్ ఇంకో పేరు. అలాగే ఐడాన్ టర్నర్, రాబర్ట్ ప్యాటిన్సన్, రిచర్డ్ మాడెన్, గాబ్రియేల్ బస్సో, సిలియన్ మర్ఫీ, సామ్ హ్యూగన్, జాక్ లోడెన్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ నార్టన్, జోనాథన్ బెయిలీ, హెన్రీ గోల్డింగ్జామీ బెల్, జాన్ బోయెగా, విల్ పౌల్టర్, డాన్ స్టీవెన్స్, డేనియల్ కలుయుయా, క్లైవ్ స్టాండెన్, డ్వేన్ జాన్సన్టామ్ హాప్పర్, చివెటెల్ ఎజియోఫోర్...ఇలా లిస్టు పెద్దదే. ఇందులో ఇంకో పేరు చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. దేవ్ పటేల్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ నటుడు. స్లమ్ డాగ్ మిలియనీర్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం.

గాబ్రియేల్ బస్సో
    బాండ్ నిర్మాతలు ఒకే మూసలో ఆలోచిస్తున్నట్టున్నారు. ఎంతసేపూ పాశ్చాత్య హీరోలనే జేమ్స్ బాండ్ గా ఎంపిక చేసుకుంటున్నారు. గ్లోబల్ సినిమాలంటే ఇప్పుడు ఒక్క హాలీవుడ్ సినిమాలు మాత్రమే కాదు. ఆస్కార్ లో అవార్డులు తీసుకున్న టాలీవుడ్ కూడా గ్లోబల్ సినిమాగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతోంది- ఆర్ ఆర్ ఆర్ ద్వారా. అందుకని జేమ్స్ బాండ్ గా టాలీవుడ్ హీరో కూడా ఏమాత్రం తీసిపోడు. దేవ్ పటేల్ సరే, ప్రభాస్ వైపు కూడా బాండ్ నిర్మాతలు చూస్తే బావుంటుంది.

—సికిందర్ 

 

 

Monday, June 5, 2023

1340 : స్పెషల్ ఆర్టికల్

        ప్రసిద్ధ  బాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్, స్వర్గీయ కిషోర్ కుమార్ బయోపిక్ టాపిక్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎనిమిదేళ్ళుగా ఈ బయోపిక్ విషయం తేలడం లేదు. అయినా బాలీవుడ్ హీరోలు నేనే కిషోర్ కుమార్ పాత్ర పోషిస్తున్నానంటే, కాదు నేను పోషిస్తున్నానని పోటీలు పడి ప్రకటించుకుంటున్నారు. అసలు బయోపిక్ కి మేం  అనుమతి ఇవ్వాలిగా అని కిషోర్ కుమార్ కుటుంబం చురక వేస్తోంది. దర్శకుడు పట్టువదలని విక్రమార్కుడిలా వున్నాడు. మీరంతా కాదు, మేమే కిషోర్ కుమార్ బయోపిక్ నిర్మిస్తాం, స్క్రిప్టు వర్క్ జరుగుతోందని  కిషోర్ కుమార్ కుటుంబం ప్రకటిస్తోంది. ఇలా కౌంటర్లు వేసుకుంటూ పాయింటుకి రాలేకపోతున్నారు అటు ఇటూ సెలెబ్రిటీలు.

        టీవల బయోపిక్ లో కిషోర్ కుమార్ పాత్రని రణవీర్ సింగ్  స్థానంలో రణబీర్ కపూర్ పోషించ వచ్చని వచ్చిన వార్తల నేపథ్యంలో, అసలు బయోపిక్ హక్కులు ఎవరికీ ఇవ్వడం జరగలేదని కిషోర్ కుమార్ కుమారుడు, గాయకుడు అమిత్ కుమార్ స్పష్టం చేశాడు. దీంతో బయోపిక్ సన్నాహాల్లో వున్న దర్శకుడు అనురాగ్ బసు ఇరుకున పడ్డాడు. ళ్ళీ ళ్ళీ  హక్కుల కోసం కిషోర్ కుమార్ కుటుంబాన్ని సంప్రదించినా ఫలితం లేకపోయింది.

కిషోర్ కుమార్ కుటుంబం, ముఖ్యంగా ఆయన కుమారుడు అమిత్ కుమార్, బయోపిక్ హక్కుల్ని ఇంకా ఎవరికీ ఇవ్వడానికి సిద్ధంగా లేడనేది నిర్వివాదాంశం. అనురాగ్ బసు ఈ బయోపిక్ కోసం ఎనిమిదేళ్ళుగా ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య ఈ బయోపిక్ ని రణవీర్ సింగ్ తో తీయవచ్చని వచ్చిన వార్తలకి భిన్నంగా రణబీర్ కపూర్ తోనే నిర్మిస్తారని ధృవీకరణ వచ్చింది. స్వయంగా రణబీర్ కపూర్ కూడా ప్రకటించాడు. ఎనిమిదేళ్ళుగా దర్శకుడు అనురాగ్ బసుతో తను ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నట్టు స్పష్టం చేశాడు.       

అయితే అనురాగ్ బసు- రణబీర్ కపూర్‌లు ఈ బయోపిక్ తీయలేరనీ, వారికి కాపీరైట్ లేదనీ, కాపీరైట్ కోసం అమిత్ కుమార్ తోబాటు, కిషోర్ కుమార్ భార్య లీనా చందా వర్కార్ ని అనేక మార్లు ప్రయత్నించారనీ, కిషోర్ కుమార్ కుటుంబం నుంచి వివరణ వెలువడింది.

మరోవైపు స్క్రిప్టు మీద పనిచేస్తున్నామనీ చెప్పిన అమిత్ కుమార్, దర్శకత్వం తానే వహించబోతున్నట్టు సంకేతాలిచ్చాడు. అయితే ఎవరు నటిస్తారనేది చెప్పలేదు. తను నటించే అవకాశం మాత్రం వుండదని చెప్పొచ్చు. కిషోర్ కుమార్ బయోపిక్ తీయాలంటే కేవలం వృత్తి గత జీవితం తీస్తే సరిపోదు. ఆలాతీస్తే అమిత్ కుమార్ నటించవచ్చు. నాల్గు పెళ్ళిళ్ళు చేసుకున్నకిషోర్ కుమార్ భార్యలతో కుటుంబ జీవితం కూడా చూపించాలి కాబట్టి కుమారుడైన అమిత్ కుమార్ నటిస్తే బావుండదు.
        
కొంత కాలం క్రితం అనురాగ్ బసు దర్శకత్వంలో గాయకుడు అద్నాన్ సమీ నటించవచ్చని మీడియాలో రాశారు. భారత పౌరసత్వం తీసుకున్న పాకిస్తానీ గాయకుడు అద్నాన్ సమి స్వయంగా సంగీతకారుడు, స్వరకర్త, నటుడు కూడా అయినందు వల్ల ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాడని మీడియా వర్గాలు వెల్లడించాయి.  అద్నాన్ సమీ గతంలో కిషోర్ కుమార్ పాడిన కొన్ని క్లాసిక్ హిట్స్ ని ఒక ప్రముఖ రియాలిటీ షోలో పునఃసృష్టించాడు కూడా. ఈ షో పెద్ద హిట్టయ్యింది.
        
తర్వాత అద్నాన్ సమీ పేరు వెనక్కి వెళ్ళిపోయి అమీర్ ఖాన్ తెరపై కొచ్చాడు. ఇవన్నీ గమనిస్తూ వున్న నటుడు నసీరుద్దీన్ షా, అసలెవరు కిషోర్ కుమార్ బయోపిక్ తీసినా, ఆర్డీ బర్మన్ బయోపిక్ తీసినా చెడగొడతారనీ, వాటి జోలికి పోవద్దనీ హితవు చెప్పాడు.
        
అయితే బాలీవుడ్ వర్గాల్లో ఈ అంశం ఆసక్తి రేపడంలేదు. కేవలం అమిత్ కుమార్- అనురాగ్ బసు శిబిరాల మధ్యే ముసుగులో గుద్దులాటగా ఇది సాగుతోంది. ఇందులో ఎవరిది పైచేయి అవుతుందనేదే ఇప్పుడు ఆసక్తి పుట్టిస్తున్న ప్రశ్న. అసలు కిషోర్ కుమార్ చాలా సంకీర్ణ వ్యక్తిత్వమున్న కళాకారుడు. లోభిలా కన్పిస్తాడు, అంతలోనే దానాలు చేసి ఆశ్చర్య పరుస్తాడు. చాలా హాస్యప్రియుడు. స్టూడియోలో పాట పాడే ముందు అసిస్టెంట్ వైపు చూసి కాఫీ అందిందా?” అంటాడు. అంటే డబ్బు ముట్టిందా అని అర్ధం. కాఫీ అందిందని అసిస్టెంట్ సైగ చేస్తే పాట పాడతాడు, లేకపోతే లేదు. 
        
ఒక కొత్త దర్శకుడు వస్తే 18 వేలు ఇస్తే పాడతానని ఖచ్చితంగా చెప్పేశాడు. అప్పట్లో 18 వేలు చాలా ఎక్కువ. ఆ కొత్త దర్శకుడు నిర్మాతని ఎలాగో ఒప్పించుకుని పాడించుకున్నాడు. పాట పూర్తయ్యాక, కిషోర్ ఆ 18 వేలు కొత్త దర్శకుడికి ఇచ్చేసి- “ఇది నిర్మాతకి తిరిగి ఇవ్వకు. దాచుకో. సినిమాల్ని నమ్ముకోకు అన్నాడు. ఆ కొత్త దర్శకుడు కిషోర్ ఇంటి అవతల ఆ 18 వేలతో గుడిసె కొనుక్కుని తర్వాత రిచ్ అయ్యాడు.
        
కిషోర్ కుమార్ ఎప్పుడేం చేస్తాడో ఎవరూ పసిగట్టలేరు. అర్ధరాత్రి లేచి తలగడ కింద నోట్లు లెక్కబెట్టుకుంటాడు. ఒక ప్రముఖ నిర్మాత మీద కోపంతో ఆయనకి పాటలు పాడడం ఇష్టం లేక, ఆయన ఇంటికి రాకుండా గేటు ముందు కుక్కల్ని కట్టేశాడు. ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ షూటింగులో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ముంబయిలో మూడు గంటలు కారు తోలుకుంటూ వెళ్ళి పోతూనే వున్నాడు. షూటింగ్ సిబ్బంది వెంటాడి ఎలాగో  పట్టుకుంటే “మీరు కట్ చెప్పలేదుగా?” అన్నాడు.
        
ఇలాటి కామెడీలు చాలా వున్నాయి. కానీ పాటలు పాడడం కామెడీ కాదు. చాలా సీరియస్. పాట పాడాడంటే అదొక అద్భుతమే. దాన్ని కాలం చెరిపి వెయ్య లేదు. కిషోర్ కుమార్ (అభాస్ కుమార్ గంగూలీ, 1929 - 1987)  హిందీతో బాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, భోజ్ పురి, అస్సామీ, ఒడియా సహా అనేక ఇతర భారతీయ భాషల్లో వేలకొద్దీ పాటలు పాడారు. తను గాయకుడే గాక, నిర్మాత, నటుడు, రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. ఆయన నాల్గు సార్లు వివాహమాడేడు- రూమా గుహా థాకుర్తా (1950-58), మధుబాల (1960-60), యోగితా బాలి (1976-78), లీనా చందా వర్కార్ (1980-87).
        
"ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకుల్నీ మరచిపోవడానికి నా సినిమాలు చూస్తారు. నా పాటలు వింటారు. ప్రతి మనిషికీ బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనను అభిమానించే ప్రజల్ని ఎల్లపుడూ నవ్వించాలి. ఆహ్లాదం కల్పించాలి. ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతే గానీ మన బాధ వారికి పంచకూడదు." ఇదీ కిషోర్ నమ్మిన, ఆచరించి చూపిన ఫిలాసఫీ.
        
"తోటలో నుంచి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏమయింది? ఎన్నో మొగ్గలు పూవులై విరుస్తాయి. వికసిస్తాయి. పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి." అని సెలవిచ్చాడు.

—సికిందర్

 

Sunday, June 4, 2023

1339 : రివ్యూ!


రచన- దర్శకత్వం : రూపక్ రోనాల్డ్సన్ 
తారాగణం : తిరువీర్, పావనీ కరణం, బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, మురళీధర్ గౌడ్, పద్మ, వసంత తదితరులు
సంగీతం : యశ్వంత్ నాగ్, ఛాయాగ్రహణం : వాసు పెండమ్
సమర్పణ : రానా దగ్గుబాటి (సురేష్ ప్రొడక్షన్స్)
నిర్మాత : సిద్ధార్థ్ రాళ్లపల్లి  

విడుదల : జూన్ 2, 2023
***

రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. ఇటీవలి హార్రర్ మసూద హీరో తిరువీర్ ఇందులో కథానాయకుడు. తెలంగాణ నేపథ్యపు సినిమా. ఈ మధ్య తెలంగాణ నేపథ్యపు సినిమాలు బాగానే వస్తున్నాయి. అయితే వీటిని హిట్టయిన జాతిరత్నాలు టైపులోనే తీస్తున్నారు. ఒక తెలంగాణ టౌను లేదా పల్లె, అక్కడ నల్గురు కుర్రాళ్ళు, వాళ్ళ కామెడీలు, అవే కథలూ వగైరా. ఇలాటి సినిమాలు తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాలుగా విపరీతంగా వచ్చేసి ఆ అధ్యాయం ముగిసిపోయింది. ముగిసి పోయిన మెయిన్ స్ట్రీమ్ అధ్యాయాన్ని తెలంగాణ సినిమా ఎత్తుకుంది. మొన్న విడుదలైన మేమ్ ఫేమస్ కూడా ఈ కోవకి చెందిందే. ఇప్పుడు పరేషాన్ దీని సరసన చేరింది. ఇలాటి సినిమాల్ని నిర్మాతల సొమ్ములు, ప్రేక్షకుల సమయం వృధా చేయాడానికే తీస్తున్నారేమో తెలీదు. పారేషాన్ కి ఇంతకి మించి వేరే ఆశయమున్నట్టు కనపడదు. ఇంతకీ ఈ పరేషానేమిటో తెలుసుకుందాం...

కథ

మంచిర్యాలలో ఐజాక్ (తిరువీర్) ఐటీఐ ఫెయిలై ఫ్రెండ్స్ తో తాగి ఆవారాగా తిరుగు తూంటాడు. ఇతడి తండ్రి సమర్పణ్ (మురళీధర్ గౌడ్) సింగరేణి ఉద్యోగి. ఈ తండ్రి ఆవారాగా తిరుగుతున్న కొడుక్కి తన ఉద్యోగం ఇప్పిద్దామని ఆఫీసర్ తో రెండు లక్షలకి మాట్లాడుకుంటాడు. ఆ డబ్బులు భార్య బంగారం అమ్మి కొడుకు చేతికిచ్చి, ఆఫీసర్ కి ఇమ్మంటాడు. ఇంతలో ఫ్రెండ్స్ కి ఏవో అవసరాలొచ్చి ఆ డబ్బు వాళ్ళ కిచ్చేస్తాడు కొడుకు ఐజాక్. ఇతడితో ప్రేమలో వున్న శిరీష (పావనీ కరణం) గర్భవతవుతుంది. టౌన్లో పరీక్షలు చేయిద్దామంటే ఐజాక్ దగ్గర డబ్బులుండవు. ఫ్రెండ్స్ ని అడిగితే ఇవ్వరు. ఇంతలో కొడుకు డబ్బు పాడు చేశాడని తండ్రికి తెలుస్తుంది. ఇప్పుడేం జరిగిందనేది మిగతా కథ.

ఎలావుంది కథ

పైన చెప్పుకున్నట్టు ఈ తెలంగాణ సినిమా కూడా ముగిసి పోయిన తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమాల అధ్యాయాన్నే తిరిగి ప్రేక్షకులకి వడ్డించింది. అయితే తెలంగాణ యాసతో, తెలంగాణ పాత్రలతో, తెలంగాణ కల్చర్ తో తీసే ఇలాటి సినిమాలు కామెడీ ప్రధానంగా వుంటున్నాయి. ఈ సినిమాలో ఫస్టాఫ్ తర్వాత కామెడీ కూడా లేదు. కథలో విషయం లేక కామెడీ పుట్టలేదు. ఫస్టాఫ్ అంతా దాదాపు పాత్రల్ని పరిచయం చేయడానికే సరిపోయింది. ఈ పరిచయాల వరకే కామెడీ చేష్టలు సరిపోయాయి. తీరా కథలోకి ప్రవేశించాక- తండ్రి ఇచ్చిన డబ్బు తిరిగి హీరో ఫ్రెండ్స్ నుంచి వసూలు చేసుకునే కథే కావడంతో- సినిమాగా నిలబడడానికి కాన్ఫ్లిక్ట్ సరిపోక- కాన్ఫ్లిక్ట్ సరిపోక పోయేసరికి దాని తాలూకు కామెడీ లేక, సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాలతో దారితప్పి భారంగా పరిణమించింది.

కథ లేనప్పుడు వున్న కథని కాంప్లికేట్ చేయాలన్నది హాలీవుడ్ పాటించే రూలు. పోను పోనూ కామెడీ కథని కామెడీతో పరమ సంక్లిష్టంగా మార్చేస్తూ, చివర్లో  చిక్కు ముడి విప్పుతారు. ఈ సంక్లిష్టతకి, చిక్కుముడి సస్పెన్సుకి ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కామెడీని ఎంజాయ్ చేస్తారు. హేపీ భాగ్ జాయేగీ అని హిందీలో కథలేని కామెడీ సినిమాని ఇలాగే తీసి హిట్ చేశారు.

ఉన్న కాన్ఫ్లిక్ట్ కూడా కథా సౌలభ్యం కోసం వుందే తప్ప కథలోంచి పుట్టలేదు. తాగి ఆవారాగా తిరిగే కొడుకుతో గొడవ పడే తండ్రి, అతడి చేతికే రెండు లక్షలిచ్చి ఆఫీసర్ కిచ్చి రమ్మనడమేమిటి?

కామెడీ అంటే జోకులు పేల్చడమే అన్నట్టుంది. యూత్ కోసం తీసిన ఈ సినిమాలోని జోకులకి యూత్ కైనా నవ్వొచ్చే పరిస్థితి లేదు. సెకండాఫ్ లో మాత్రం రెండు చోట్ల పిచ్చి జోకులు నవ్విస్తాయి. పోతే దసరా లో లాగా ఈ సినిమాలో కూడా తాగుడు సీన్లు అదుపు తప్పాయి. సమస్య వచ్చినా, సంతోషమేసినా, డబ్బు లేకపోయినా తాగుడే. హీరో దగ్గర డబ్బు తీసుకున్న ఫ్రెండ్స్ ఆ రెండు లక్షలు తాగుడుకే పెట్టేసే కథ ఇది.

హీరోయిన్ తో ప్రేమ కథ కూడా కుదర్లేదు. హీరోతో ఒకసారి పడుకోగానే వెంటనే గర్భం వచ్చేసిందని కంగారు పడే సిల్లీ హీరోయిన్ పాత్ర. ఇది నమ్మి టెస్టుల కోసం డబ్బులేక పాట్లు పడే హీరో పాత్ర. లాజిక్ లేని కథ, లాజిక్ లేని పాత్రలు, సిల్లీ జోకులతో కామెడీ – ప్రేక్షకులకి చాలా పరేషాన్!

నటనలు- సాంకేతికాలు

మసూద లో తిరువీర్ కీ, పరేషాన్ లో తిరువీర్ కీ పోలిక లేదు. ఇలాటి సినిమాలో నటించి తనకున్న ఫాలోయింగ్ ని దెబ్బ తీసుకోవడమే. తనని చూసి ఓపెనింగ్ కి వచ్చిన యువ ప్రేక్షకులు అసహనంతో ఈ సినిమా చూస్తున్న దృశ్యాలు థియేటర్లో కన్పిస్తాయి. దమ్ములేని సినిమాలో మసూద లోలాంటి దమ్మున్న యాక్టింగ్ కి అవకాశం లేకుండా పోయింది. గెటప్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మాత్రమే అతడ్ని చూసేలా చేస్తాయి.

హీరోయిన్లు పావనీ కరణం, సాయి ప్రసన్నల పాత్రలు, నటనలు జీరో అయినా వాళ్ళని తగినంత గ్లామరస్ గా చూపించడానికైనా ప్రొడక్షన్ విలువలు సరిపోలేదు. కెమెరా వర్క్, సంగీతం విఫలమయ్యాయి.

2019 లో సంపూర్ణేష్ బాబు నటించిన కామెడీ కొబ్బరిమట్ట కి దర్శకుడుగా పనిచేసిన దర్శకుడు రూపక్ రోనాల్డ్సన్ తన ఈ మలి ప్రయత్నంతో ఎలాటి జాగ్రత్తలూ తీసుకోక పోవడం విచారకరం. లేకపోతే ముగిసిపోయిన ఇలాటి మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమా అధ్యాయాన్ని రీసైక్లింగ్ చేస్తే తెలంగాణ సినిమా అయిపోతుందని నమ్మే దర్శకుల్లో తనూ ఒకడు కావాలనుకోవడాన్నే నిజమైన కామెడీగా తీసుకుని ఎంజాయ్ చేయాలేమో.  
—సికిందర్