రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, April 23, 2022

1161 : టిప్స్


 

        అంతిమంగా  తెరమీద సినిమా ఎలా కన్పిస్తుందో నిర్ణయించేది డైలాగ్ వెర్షనే అయినప్పుడు డైలాగ్ వెర్షన్ని తీసుకుని ఇదివరకు దర్శకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు.  నిశ్శబ్ద వాతావరణం లో, మౌన ముద్రలో కెళ్ళి పోయి- మనసు తెర మీద డైలాగ్ వెర్షన్ని రన్ చేసుకుంటూ, దీన్ని శైలీ శిల్పాలతో తెరకెక్కించాలో మనసులో ముద్రించుకుని- శబ్ద ఫలితాలు  సహా తీవ్రమైన  పేపర్ వర్క్ చేసుకుని, సర్వసన్నద్ధులై సెట్స్ కి వెళ్ళేందుకు వచ్చేవాళ్ళని వినికిడి. ఇదేదో బావుంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ధ్యానించడమంటే సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకోవడమే.  ఒకసారి సబ్ కాన్షస్ మైండ్ లో ముద్రించుకున్నాక ఆ సబ్ కాన్షస్ మైండ్ అద్భుతాలు చేయిస్తుంది.

తే ఒకసారి అజ్ఞాతంలోకంటూ వెళ్ళిపోయాక  బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోకూడదు. సోషల్ మీడియా జోలికి అసలు పోకూడదు. 24x7 తామేం చేస్తున్నారో  ఫేస్ బుక్ లో ప్రపంచానికి చెప్పుకుంటే గానీ కడుపు చల్లబడని చాంచల్యానికి పోకూడదు. మనసు మీద అదుపు లేని వాడు సగటు మనిషే - వాడు మేకర్, క్రియేటర్, ప్రొప్రయిటర్ కాలేడు.  మనమైతే  డైలాగ్  వెర్షన్ పూర్తి చేసుకున్నాక ఈ నియమాలు పాటించాలని చెప్పుకుంటున్నాం గానీ, హాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అయితే అసలెప్పుడూ ప్రపంచంతోనే  సంబంధాలు పెట్టుకోడు. ఫోన్ వుండదు, టీవీ వుండదు, కంప్యూటర్ వుండదు, ఈ మెయిల్ వుండదు, సోషల్ మీడియా వుండదు- ఏమీ వుండవు. ఆదిమ కాలంలో మునిలా ఎక్కడో మారు మూల కూర్చుని సినిమాల సృష్టి గావిస్తాడు. సబ్ కాన్షస్ మైండ్ తో అతడి చెలిమి అలాటిది. మునుల తపస్సు కూడా సబ్ కాన్షస్ మైండ్ తోనే. సృష్టి రహస్యమంతా సబ్ కాన్షస్ మైండ్ లోనే వుంది... 

2. స్క్రీన్  ప్లే కి చక్కగా  మూడంకాలు (త్రీ యాక్ట్స్) పెట్టుకుని, బిగినింగ్- మిడిల్ - ఎండ్ అనే మూడంకాలకి రెండు  ప్లాట్ పాయింట్స్ తో రెండు మూలస్థంభాలు పెట్టుకుని, వాటి మధ్య వాటికి దారి తీయించే  ఉత్సుకతని రేపే కథనాన్ని మాత్రమే చేసుకుంటేఆస్వాదించడానికి  సినిమా ఎంత హాయిగా వుంటుందో తెలిపే ఉదాహరణ ఇదే- కొరియన్ మూవీ మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టర్'

3. వేరే సినిమాల్ని భక్తిభావంతో పరమ పవిత్రంగా కాపీ కొట్టేటప్పుడు, లేదా నీతీ నిజాయితీలతో చట్టబద్ధంగా రుసుము చెల్లించి రీమేక్ చేసేప్పుడు, వాటిని కూలంకషంగా విశ్లేషించుకుని, కథా నిర్మాణం, పాత్రచిత్రణలు, వాటి దృశ్యీకరణల వెనకున్న ఉద్దేశాల్నీ, వ్యూహాల్నీ, అనుసరించిన విధానాల్నీ మదింపు చేసి, వీలయితే అందులోంచి కొంత నేర్చుకుని, మొత్తం సబ్జెక్టునీ ఓన్చేసుకుని ముందుకెళ్తే బాక్సాఫీసు బకాసుర ప్రమాదాలు కచ్ఛితంగా తప్పుతాయి.

4. బయట ప్రపంచం చూస్తే యమ స్పీడందుకుని జోరుగా ముందుకు దూసుకు పోతూంటే, తలుపులు మూసిన చీకటి థియేటర్లో మాత్రం సినిమాలు ఇంకా తీరుబడిగా, పాత  కళా ప్రదర్శన చేస్తూ, కృష్ణా రామా అనుకుంటూ కూర్చోలేవు. జీవించే కళే మారిపోయాక కళా ప్రదర్శనేమిటి? అందుకని 1990 నుంచీ ఇవాళ్టి దాకా హాలీవుడ్ కి కొత్త బైబిల్ సిడ్ ఫీల్డ్ పారడైం మాత్రమే. స్పీడు ఈ పారడైం లక్షణం.

        5. హై కాన్సెప్ట్ కథల పాయింటు ఒకవేళ ఇలాజరిగితే?’ (what if?) అన్న ప్రశ్నతో వుంటుంది. ప్రశ్నే కథకి ఐడియా నిస్తుంది. గ్రహాంతర వాసులు భూమ్మీదికి దండ యాత్ర కొస్తే? (‘ఇండిపెండెన్స్ డేఐడియా). డైనోసారస్ లని మళ్ళీ పుట్టిస్తే? (‘జురాసిక్ పార్క్ఐడియా). సముద్ర గర్భంలో రాజు సప్త సముద్రాల్ని జయించాలనుకుంటే? (‘ఆక్వామాన్ఐడియా). ఇలా చాలా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎప్పుడైనా ఇలా ట్రై చేసిన పాపాన పోయారా?

6. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రేక్షకులకైనా సింపుల్ గా అర్థమై పోతాయి హై కాన్సెప్ట్ కథలు. ఒక వేళ ఇలా జరిగితే? - అన్న ప్రశ్నే సాధించాల్సిన సమస్య వీటిలోని ప్రధాన  పాత్రకి. ఈ ప్రశ్నని ఎదుర్కోవడమే యాక్షన్ ఓరియెంటెడ్ గా వుండే కథ. ప్రశ్నని ఎదుర్కోవడం గోల్,   ప్రశ్నని నిర్వీర్యం చేయడం గోల్ సాధన. సింపుల్  గా అర్ధమైపోతాయి ఈ కథలు మూడు ప్లాట్ పాయింట్ల పారడైంతో. ఇలా ప్రశ్నని పట్టుకుని కథ తక్కువ, తక్కువ కథతో ఎక్కువ యాక్షన్ - ఇదే హై కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల యూఎస్పీ (యూనిక్ సెల్లింగ్ పాయింట్) అన్నమాట.

7. అద్భుత కొరియన్ రోమాంటిక్ డ్రామా ది క్లాసిక్ లో టైటిల్స్ లోనే గుప్తంగా కథ చెప్పడం వుంటుంది సింబాలిక్ గా. ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టే వుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతిఆ తర్వాత ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివరమహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు...

8. పై చిత్రణ ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు -  దేని అస్తమయాన్నిఅక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే. ఇలా ఈ ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. ఒక అస్తమయంతో ఒక  సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరంఒక ద్వంద్వం ... ఇలాటి భావుకతని  తెలుగు సినిమాల్లో కూడా సాధిస్తే బావుంటుందేమో? 

9. ప్రేమ సినిమాలెన్ని తీసినా వాటికి ఎప్పటికప్పుడు వయసుకొచ్చిన యువ  ప్రేక్షకులు నున్నగా తిన్నగా తయారై వుంటూనే వుంటారు. అయినా తీస్తున్న ప్రేమ సినిమాలు ఫ్లాపవుతున్నాయంటే లేత కుర్రాళ్ళకి కూడా పట్టని ఓల్డ్ సరుకుగా అనిపిస్తున్నాయన్న మాట. సినిమాలు చూసే వయసు కొచ్చిన నేటి లేత కుర్రాళ్ళ ప్రపంచంలోకి మేకర్లు వెళ్ళి నేటివైన ప్రేమ సినిమాల్ని ఆవిష్కరిస్తే తప్ప అద్భుతాలూ జరగవు.

10.
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అనే జానరనేది ప్రేమల గురించి కానే కాదు, అవి నేర్చుకోవడం గురించి మాత్రమే. ప్రేమ సినిమాల్ని కాస్త స్టయిలిష్ గా తీస్తే ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ అంటూ రివ్యూ రైటర్లు కూడా రాసి పారేస్తున్నారు. ఇలా వుంటే ఓ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీని తెలుగులో ఎప్పటికి చూడగలం.
11. అప్పుడప్పుడే బయటి ప్రపంచంలో అడుగుపెట్టే 13-19 ఏజి గ్రూపుది టాలెంట్స్ వికసించే వయసు. అవి ఉక్కిరిబిక్కిరి చేస్తూంటాయి. వాటితో ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలి, జీవితంలో ఏదో సాధించాలన్న తపనతో కూడిన సంఘర్షణ. ఈ సంక్షుభిత ప్రయాణంలో జీవితంలో తెలియనివెన్నో తెలుసుకోవాలని ప్రయత్నించడం, నేర్చుకోవడం వంటివి చేసి, 19 కల్లా పరిపక్వ వ్యక్తిగా/వ్యక్తురాలిగా ఎదగడం. ఇలా కమింగ్ ఆఫ్ ఏజి మూవీస్ టీనేజర్లు నేర్చుకోవడం - ఎదగడం అనే పాయింటు చుట్టూ వుంటాయి. హాలీవుడ్  లో ఏడాదికి 36 క్రమం తప్పకుండా తీస్తూంటారు. తెలుగులో అర్ధం లేని  హై స్కూలు ప్రేమలే  తీస్తారు. ఆ ఏజిలో వికసించే టాలెంట్స్ ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, స్వభావ విరుద్ధంగా ప్రేమలు కాదు. ఒకసారి మనమీ వయసులో ఏం చేసేవాళ్ళమో గుర్తుచేసుకుంటే తెలుస్తుంది. 

12. తెలుగులో 13-19 ఏజి గ్రూపు టీనేజి ప్రేక్షకులు తమ నిజ జీవితాలు కనిపించని, వాటికి దారి చూపని కథలతో, తమకి సంబంధం లేని  అవే రోమాంటిక్ కామెడీలూ డ్రామాలతో వస్తున్న సినిమాలకి కనెక్ట్ కాలేక, తమ మనసెరిగి సినిమాలు తీసే యంగ్ మేకర్లు లేని లోటుకి - ఒక అసంతృప్త ప్రేక్షక సమూహాలుగా మిగిలిపోతున్నారు. ఈ సెగ్మెంట్ లో ఖాళీగా వున్న మార్కెట్ ని సొమ్ము చేసుకునే స్పృహ ఏ మేకర్లకీ వుండడం లేదు. అవే రోమాంటిక్ కామెడీలు తీస్తూ డ్రై మార్కెట్లో ఒకటే కుమ్మడం, ఫ్లాపవడం. ఈ కుమ్మడంలో చూద్దామన్నా ట్వెంటీ ప్లస్ వాళ్ళకి కూడా పనికొచ్చే రియలిస్టిక్ సరుకు కనిపించదు.

        సరే, ఇక  నెక్స్ట్ స్క్రీన్ ప్లే టిప్స్ విత్ ఫైనాపిల్ జ్యూస్ తో మళ్ళీ కలుద్దాం!

—సికిందర్

Friday, April 22, 2022

1160: మూవీ టెక్నిక్ -2


(‘ఓపెనింగ్ సీనే టీజర్’ తరువాయి భాగం)

        సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ వెనుక గల సైకాలజీని సినిమా స్క్రీన్ ప్లే కి ఎలా అన్వయించుకోవచ్చో   తెలిపే ప్రసిద్ధ ‘ది న్యూయార్కర్’ మ్యాగజైన్ ఆర్టికల్ ప్రకారం ఆ పరిశోధనాంశాల్లోకి మళ్ళీ వెళితే- సోషల్ మీడియాలో కంటెంట్ వైరల్ అవడానికి కారణమయ్యే నెటిజనుల మనస్తత్వ విశ్లేషణలో తేలిన అంశాలు- 1. ఇంటరెస్ట్, 2. ఆరిస్టాటిల్ సూత్రాలు, 3. ఎమోషనల్ అప్పీల్, 4. క్వాలిటీ...ఈ నాల్గూ ఏమిటో వివరంగా చూద్దాం : ఇంటరెస్ట్ విషయానికొస్తే- ఏదైనా ఆసక్తికరంగా అన్పిస్తేనే నెటిజనులు షేర్ చేస్తారు. కంటెంట్ ఎంత సంచలనాత్మకంగా అన్పిస్తే అంత శరవేగంగా క్షణాల్లో  షేర్ అయి వైరల్ అయిపోతుంది. ఆసక్తి రేపని కంటెంట్ షేర్స్ అంతంత మాత్రంగా వుంటాయి.

          రిస్టాటిల్ సూత్రాలు : ఒక కంటెంట్ ఆసక్తి ఎందుకు కల్గిస్తుంది? గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ (క్రీపూ 384 - 322) మూడు కారణాలు వివరిస్తాడు. ఇథాస్ (ethos), పేథాస్ (pathos), లేగాస్ (logos) ఈ మూడూ కారణమౌతాయి.  ఇథాస్ నైతికతలకి సంబంధించింది; పేథాస్ ఎమోషనల్ అప్పీల్ కి సంబంధించింది; లేగాస్ లాజిక్ కి సంబంధించింది. నైతికత, ఎమోషనల్ అప్పీల్, లాజిక్ ఈ మూడు మానసిక కారణాలూ  కంటెంట్ పట్ల ఆసక్తి కలగడానికి బీజాలు వేస్తున్నాయి. అలాగే ఈ మూడింట్లో ఏ ఒకటి లోపించినా సినిమాలు ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం లేదని ఈ ఆర్టికల్ వివరిస్తోంది. విశ్వసనీయత, ప్రేక్షకులతో అనుబంధం, హేతుబద్ధత ఈ మూడూ మంచి కథకి పునాది రాళ్ళ వంటివి. 

        ఎమోషనల్ అప్పీల్ : ‘ది న్యూయార్కర్’ ఆర్టికల్  ఎమోషనల్ అప్పీల్ కి ఇలా భాష్యం చెప్తోంది- పాజిటివిటీ, ప్రేరేపణ ఈ రెండూ నెటిజనుల షేరింగ్ బిహేవియర్ ని ప్రభావితం చేస్తున్నాయి.  విషయం లేని సినిమాలు కూడా సక్సెస్ అవుతూంటాయి. కానీ ఎక్కువ మంది హీరో పాత్ర ప్రయాణంలో ఎమోషనల్ అప్పీల్ కి కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ అప్పీల్ వాళ్ళ దృష్టినీ, హృదయాలనీ కట్టి పడేస్తుంది. ఎమోషనల్ గా ప్రేక్షకులకి ఏమీ ఇవ్వని హీరో పాత్ర,  ప్రేక్షకుల్లో తన పట్ల పాజిటివిటీనీ, ప్రేరణనీ కల్గించుకోదు. దీంతో  ప్రేక్షకులు తమ ఎమోషనల్ ఇన్వెస్ట్ మెంట్  పే-ఆఫ్ కాకుండా వేస్ట్ అయ్యిందే అని వెలితిగా ఫీలవుతారు.

          క్వాలిటీ : విజువల్ గా, వెర్బల్ గా క్వాలిటీ లేని కంటెంట్ షేర్ కాదు. అలాగే సినిమాలూ క్వాలిటీ కథ లేకపోతే సక్సెస్ కావు ( మనదగ్గర సక్సెస్ అయిపోతాయి!). క్వాలిటీ కథకున్న మన్నిక కలకాలం దాన్ని గుర్తుంచుకునేలా చేస్తుంది...

       ఇప్పుడు టీజర్ విషయానికొద్దాం. మన సినిమాల్లో ప్రారంభ దృశ్యాలు, లేదా ఓపెనింగ్ బ్యాంగులు ఏ సరళిలో వుంటున్నాయి? ఈ ప్రారంభ దృశ్యాలు గానీ, ఓపెనింగ్ బ్యాంగులు గానీ  పైన చెప్పుకున్న వైరల్ కంటెంట్ లా, వైరల్ కంటెంట్ సైకాలజీని పుణికిపుచ్చుకుని  వుంటున్నాయా? ప్రారంభ దృశ్యాలు, ఓపెనింగ్ బ్యాంగులు అనే భాష కంటే ఇప్పుడు కాలీన స్పృహతో టీజర్ అంటే ఎక్కువ సూటిగా మనసులో నాటుకుని, ఆ దిశగా సృష్టించుకునేందుకు ప్రేరణ అవుతుంది. సినిమాలకి ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ లా గంగవెర్రులెత్తిస్తే ఆ సినిమా ఏ స్థాయిలో వుంటుందో గత వ్యాసంలో వివరించుకున్న ‘డిస్కో డాన్సర్’ దృష్టాంతమే చాలు- ఆనాడు అప్పటికే వైరల్ అయిన ఆ సూపర్ హిట్ సాంగ్ తో ఓపెనింగ్ పిచ్చిగా పిచ్చిగా వైరల్ కంటెంటే! ఆ టీజర్ ఎక్కుపెట్టిన బాణంలా ప్రేక్షకుల హృదయాంతరాళ్ళల్లో సూటిగా నాటుకుపోయి లాక్కెళ్ళింది. సినిమా రాళ్ళూరప్పల పాలు కాలేదు.


          బయట చేసేపనే సినిమాలోనూ చేసుకుంటే మంచిదని  ‘ది న్యూ యార్కర్’ వ్యాసం తేల్చి చెబుతున్న సారాంశం. బయటంతా  సోషల్ మీడియాలో కంటెంట్ ని వైరల్ బాట పట్టించడానికి ఏ సైకాలజీ మనకి పనికొస్తోందో అదే  సైకాలజీని సినిమాల్లోనూ ఉపయోగిస్తూ కథలు చేసుకోవాలిగా? కథ చెప్పే టెక్నిక్ ని సినిమాలు సోషల్ బిహేవియర్ లోంచి  కూడా నేర్చుకోవాలిక. ఇంకా కాలం చెల్లిపోయిన పాత నడకలు నడవకుండా, కొత్త నడకల్ని ఎవరికి వాళ్ళు కనిపెట్టి ఆశ్చర్య పరుస్తూండాలి. తెలుగు సినిమాల ఓపెనింగ్ బ్యాంగులు వ్యాపార దృక్పథంతో వుండడం లేదని గత వ్యాసంలో చెప్పుకుందిందుకే. కాలంతో సంబంధం లేకుండా కేవలం క్రియేటివ్ ప్రదర్శనలతో అవి వెలవెలబోతున్నాయి. కాలం అంటే ఇప్పటి మార్కెట్. క్రియేటివిటీ అన్న పదం ఎప్పుడూ అపార్ధాలకి లోనవుతూ వుంది. కమర్షియాలిటీ  పూత  లేని క్రియేటివిటీ ఒక క్రియేటివిటీయే అన్పించుకోదు  కమర్షియల్ సినిమాలకి సంబంధించి. కమర్షియాలిటీ పూతని మార్కెట్టే నిర్ణయిస్తుంది. మార్కెట్ నుంచే కమర్షియల్ విలువల్ని తీసుకోవాలి. ఈ మార్కెట్ యాస్పెక్ట్ లో మిళితమై వుండే కమర్షియాలిటీని కాలమే అందిస్తూ వుంటుంది ఎప్పటికప్పుడు- ఇప్పుడు చెప్పుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ క్రేజ్ కి లాగే- ఈ క్రేజ్ వెనకాలున్న సైకాలజీకి లాగే. 
                                                                ***

       ‘డిస్కో డాన్సర్’ టీజర్ ఒక్కటే  జిందా తిలిస్మాత్ కాదు. అన్ని సినిమాలకీ అదే వర్తించదు.  ఆ టీజర్ నేరుగా కథ చెప్పేస్తోంది. అంటే థీమాటిక్ టీజర్ అన్నమాట అది. అన్ని సినిమాలకీ ఇదే పెట్టుకుంటే వికటిస్తుంది. అన్ని కథలకీ ఇదే కుదరదు కూడా. కథని బట్టి, జానర్ ని బట్టి వేర్వేరు  టీజర్లు వుంటాయి. అవేమిటో చూద్దాం –ఈ సందర్భంగా హాలీవుడ్ ఓపెనింగ్ సీన్లు ఎలా వుంటున్నాయా అని ఇప్పటి ఎవేర్ నెస్ తో టీజర్స్ గా పరిశీలిస్తే – సంభ్రమాశ్చర్యాలకి లోనవక తప్పదు. వాళ్ళు టీజర్లు ఎప్పట్నించో ప్రయోగిస్తున్నారు!  కాకపోతే వాటిని టీజర్స్ అనలేదు. ఓపెనింగ్ ఇమేజ్ అన్నారు. ప్రేక్షకుల సంగతి దేవుడెరుగు, ముందు స్క్రీన్ ప్లే ప్రారంభంలో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ని కట్టిపడెయ్యాల్సిన అగత్యముంది- అందుకని మొదటి పేజీలోనే ఆ సబ్జెక్టు ఇమేజిని ప్రతిష్టించడం మొదలెట్టారు. పదీ పదిహేను పేజీల్లోగా స్క్రిప్టుతో ఎగ్జిక్యూటివ్ ని ఆకట్టుకోవాలనే ఎత్తుగడకి దీటుగా- అంతవరకూ కూడా వెయిట్ చేయకుండా మొదటి పేజీలో థీమాటిక్ ఇమేజితో థ్రిల్ కల్గించడం మొదలెట్టారు.
                                    
           ఈ ఓపెనింగ్ ఇమేజిలు ఎలా వుంటున్నాయో చూద్దాం. ఓపెనింగ్ ఇమేజిని  1975 లోనే దర్శకుడు స్టీవెన్  స్పీల్ బెర్గ్ తన క్లాసిక్ మూవీ ‘జాస్’ తో  ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు. కాకపోతే అది సరిగ్గా కుదర్లేదు. క్లుప్తత కరువయ్యింది. టైటిల్స్ పడుతున్నప్పుడే ఇమేజి స్టార్ట్ అయిపోతుంది- సముద్ర గర్భంలో జలచరాల్ని చూపిస్తూ- బ్లూ టింట్ లో-  అండర్ వాటర్ షూట్ తో. టైటిల్స్  పూర్తవగానే విజువల్స్ సముద్ర గర్భంలోంచి బీచి పైకి మారుతాయి. చూస్తే అది రాత్రిసమయం. ఆ సమయంలో బీచిలో ఒక గ్రూపు పార్టీ చేసుకుంటూ వుంటారు. నిశిరాత్రి సముద్రపుటొడ్డున పార్టీ జరుగుతున్న వాతావరణమంతా  ఒక మిస్టీరియస్ ఫీలింగునిస్తుంది- ఏదో జరగబోతుందన్నట్టుగా... సరే, ఆఖరికి ఉన్నట్టుండి సముద్రంలోంచి సొరచేప దూసుకొచ్చి దాడిచేసి ఒకమ్మాయిని లాక్కెళ్ళి పోతుంది...ఇదంతా ఎక్కువ సేపు సీనుగా సాగుతుంది. కానీ టైటిల్స్ తో ముందు సముద్ర గర్భం చూపిస్తూ, అక్కడ్నించి కెమెరా సముద్రపుటొడ్డుకి పొజిషన్ తీసుకోవడమనే విజువల్ కంటిన్యూటీ ముంచుకురానున్న ఉపద్రవాన్ని సూచిస్తోంది. అది సముద్ర గర్భం లోంచే ముంచు కొచ్చింది సొర చేప రూపంలో. ఇలా ఈ  ఓపెనింగ్ ఇమేజి ఇప్పుడు సోషల్ మీడియాలో షేరయ్యే బాపతు వైరల్ కంటెంట్ నే  పోలివుంది- అదే సైకలాజికల్ కనెక్ట్ తో. ‘డిస్కో డాన్స’ ది  అరటి పండు వొల్చి చేతిలో పెట్టినట్టు కథ విప్పేస్తున్న ‘థీమాటిక్ టీజర్’ అయితే, ఈ ‘జాస్’ లో మనం చూసేది నర్మగర్భంగా, సంకేత భాషలో కథనం చేస్తున్న ‘ప్లాట్ టీజర్’ అనవచ్చు. 

     ఇలాటిదే మరొకటి : 2000 లో  క్రిస్టఫర్ నోలాన్ తీసిన  ‘మెమెంటో’ లో చూస్తే,  ‘జాస్’ లో లాగే టైటిల్స్ తో ఇమేజి మొదలవుతూ,  ఒక పోలరాయిడ్ ఫోటోలో మనిషి మృతదేహం క్రమంగా ఫేడ్ అవుటయ్యే స్టాటిక్ షాట్ పడుతూంటుంది. ఆ ఫోటో ప్రింట్ పూర్తిగా తెల్లగా మారిపోయి- టైటిల్స్ పూర్తయి- కెమెరా పట్టుకున్న క్యారక్టర్ ఫిలిం ప్లేట్ ని లోడ్ చేస్తూ ఓపెనవుతాడు...ఈ మొత్తం దృశ్యం రివర్స్ లో జతుగుతున్నట్టు మనకి అర్ధమై ఎన్నో ప్రశ్నల్ని  రేకెత్తిస్తుంది ముందు ముందు  చూడబోయే కథ పట్ల...  దీన్ని మురుగదాస్ తమిళ హిందీ భాషల్లో ‘గజినీ’ గా తీశాడు. తెలుగులో ఇదే పేరుతో డబ్ అయ్యింది. మురుగ దాస్ మేకింగ్ లో ఈ ఓపెనింగ్ ఇమేజి వుండదు. ఏముందంటే- బ్లూ టింట్ లో మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ ప్రారంభమవుతాయి. టైటిల్స్ పూర్తయ్యాక షార్ట్ టర్మ్ మెమరీ లాస్ మీద పాత్రలు చర్చిస్తాయి. ఇలా ‘జాస్’ లో, ‘మెమెంటో’లో వున్నలాంటి  టైటిల్స్ నుంచి సీన్లోకి వచ్చే విజువల్ కంటిన్యూటీ ఇక్కడ లేదు. సీను ద్వారాలు తెరచుకుని టైటిల్స్ కంటెంట్ సీన్లోకి ప్రవహించలేదు. ‘జాస్’ లో టైటిల్స్ కంటెంట్ లోంచి సొర చేప సీన్లోకి వచ్చి దాడి చేసినట్టో, ‘మెమెంటో’లో టైటిల్స్ కంటెంట్ లోని పోలరాయిడ్ ఫోటో గ్రాఫ్ పూర్వపు ఫిలిం స్థితికి మారుతూ సీన్లోకి జొరబడినట్టో మురగదాస్ క్రియేషన్ లేదు. టైటిల్స్ కంటెంట్ లోని మనిషి మెదడు అంతర్భాగ చిత్రణ కట్ అయిపోయి – డిటాచ్డ్ గా వేరే సీనులో పాత్రలు షార్ట్  టర్మ్ మెమరీ లాస్ గురించి చర్చించడం  మొదలవుతుంది. ఇది ఓపెనింగ్ బ్యాంగ్ కాకపోగా, వైరల్ కంటెంట్ లాంటి టీజర్ కూడా కాలేకపోయింది. క్రిస్టఫర్ నోలాన్ మర్డర్ అనే తీవ్రాసక్తి కల్గించే ఓపెనింగ్ ఇమేజితో కథకి కనెక్ట్ చేస్తూ ప్రారంభిస్తే, మురుగదాస్ టైటిల్స్ కంటెంట్ తో, చర్చతో, ఇంకా ఉపోద్ఘాతం చెప్పే దగ్గరే ఉండిపోయాడు. ఇది థీమాటిక్ టీజర్ కాలేదు సరికదా, ప్లాట్ టీజర్ కూడా కాలేకపోయింది. ఇందుకే మన సినిమాల్లో ఓపెనింగ్ సీన్లు, బ్యాంగులు అర్ధం లేకుండా వుంటున్నాయని చెప్పేది. 

          డేవిడ్ ఫ్లించర్ తీసిన ‘ఫైట్ క్లబ్’ (1999) కూడా మురగ దాస్ చేసిన పొరపాటుని  ఎత్తి చూపిస్తుంది. ఇందులో ఎలా వుంటుందంటే, మనిషి మెదడు అంతర్భాగ కదలికలతో టైటిల్స్ పడుతూ పడుతూ బ్లాస్ట్ అయి,  పాత్ర క్లోజప్ తో సీను మొదలవుతుంది అతడికి ముచ్చెమట్లు పట్టేస్తూ! అతను సెకండ్ హీరో ఎడ్ నార్టన్. అతడి  మెదడులో భయాందోళనలే నన్నమాట ఆ మెదడు అంతర్భాగపు కదలికలు. అవి ముఖం మీదికి చెమట రూపంలో తేలాయన్న మాట!  మెదడు లోంచి ముఖం పైకి ఈ విజువల్ కంటిన్యూటీ, టైటిల్స్ కంటెంట్ లోంచి సీన్లోకి భయాందోళనలు ప్రవహించి కలిసిపోవడమూ - ఇదీ అసలైన ఓపెనింగ్ బ్యాంగ్ అన్నా, ఓపెనింగ్ ఇమేజి అన్నా- లేదా టీజర్ అన్నా. దీంతో అయిపోలేదు- ఎందుకతడికి భయాందోళనలతో చెమట్లు పట్టేస్తున్నాయి? ఎందుకంటే,  అతడి నోట్లో పిస్తోలు కుక్కి నించున్నాడొకడు! తను చావబోతున్నాడు! ఇదీ కదా వైరల్ కంటెంట్ వున్న టీజర్ అంటే! ఇది కూడా ప్లాట్ టీజరే. 

          దేనికీ కారణం కాని  సీను ఒక సీనే కాదు అన్నట్టు - ఇదీ మురగదాస్ టైటిల్స్ కంటెంట్ వ్యవహారం. క్రిస్టఫర్ నోలాన్ అలా ఎందుకు తీశాడో అతను  ఆలోచించలేదు. దాదాపు అన్ని సినిమాల్లో ఇలా ఉత్సుకత రేపని బలహీన ప్రారంభాలే వుంటున్నాయి.  హాలీవుడ్డీయులు  తీసే ఏ సీనుకైనా అర్ధం లేకుండా వుండదు. వాళ్ళు చేతిలో పెన్నూ కెమెరా వున్నాయి కదాని పవిత్రమైన స్క్రీన్ స్పేస్ నీ, స్క్రీన్ టైమునీ దుర్వినియోగం చెయ్యరు. కవిత్వంలో వుండే సంక్షిప్తతని తెర మీద సాధించడానికి ప్రయత్నిస్తారు. జాస్ అయినా, మెమెంటో అయినా, ఫైట్ క్లబ్ అయినా ఆ ప్రారంభాలు తెర మీద పోయెట్రీలే. టీవీల్లో  టీజర్స్ చూసి ఆ ఉత్సాహంతో సినిమా కెళ్తే గజినీ లోలాగా  సముచితం కాని విధంగా, చప్పగా వుంటున్నాయి మన ప్రారంభాలు. ప్రారంభమే ఒక టీజరవ్వాలి. దాన్నందుకుని తారాజువ్వల్లా ఆడియెన్స్ ఆ సినిమా కథా ప్రపంచంలోకి దూసుకెళ్ళి పోవాలి. దీన్నెవరు కాదంటారు?
                                         ***
           ప్లాట్ టీజర్ తర్వాత  కామెడీ టీజర్ ఎలా వుంటుందో చూద్దాం.  ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే కామెడీ ఓపెనింగ్ సీను జానర్ తో సంబంధం లేని కాల్ మనీ వ్యవహారం లాంటి కామవికార విషయంతో, ఆ తర్వాత అతి కిరాతకమైన చైన్ స్నాచింగ్స్ సీనుతో రసభంగం కల్గిస్తూ రచయిత మానసిక స్థితిని బయట పెడుతూ వుంటుంది. దీని తమిళ ఒరిజినల్ ‘తిరుడాన్  పోలీస్’ లో నేరుగా హీరో అతడి ఫ్రెండ్ (ఇద్దరూ పోలీసు అధికారుల కొడుకులే) ఏదో తేడా వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తి,  అక్కడా కొట్టుకుని గలాభా సృష్టించి, మళ్ళీ బయటికి పారిపోతూ కొట్టుకుని... ఇలా ఓపెనింగ్ సీను తోనే కామెడీ జానర్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రీమేక్ ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ లో ఈ హాస్యరసం గల్లంతై  జానర్- టీజర్ రెండూ కూడా  కాకుండా పోయాయి. 

          కనీసం ఒకటి చేసి వుండాల్సింది- ఏమిటంటే, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ ని  లాజిక్ లేని ఒక మైండ్ లెస్ కామెడీ గా మార్చేసినప్పుడు (మత్తు ఇంజెక్షన్ లిచ్చి మనుషుల చేతులు నరుక్కుని వెళ్ళిపోవడం) ఆ మైండ్ లెస్ కామెడీకి  ప్రారంభం నుంచే ప్రేక్షకుల్ని మానసికంగా సిద్ధం చేసి వుండాల్సింది. అలాటి ఒక మైండ్ లెస్ కామెడీ సీనుతోనే  సినిమా ప్రారంభించి వుంటే- తామెలాటి  సినిమా చూడబోతున్నారో ప్రేక్షకులకి ముందే అర్ధమైపోయి సర్దుకునే అవకాశం వుండేది.  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ అనే సూపర్ హిట్ రోమాంటిక్ కామెడీ వుంది. ఇది మైండ్ లెస్ కామెడీయే. ప్రేక్షకులు తిట్టుకోకుండా ఇది మైండ్ లెస్ కామెడీయేరా  బాబూ, క్షమించండి  మమ్మల్నీ – అన్నట్టు  ముందే జంట దర్శకులు పీటర్ ఫరెల్లీ- బాబీ ఫరెల్లీలు ఒక తలాతోకా లేని కామెడీ సీనుతో ప్రారంభోత్సవం  చేస్తారు. హై స్కూలు పిట్ట గోడ మీద తీరి కూర్చుని ఒకడు ఏదో పాడుతూ, ఇంకొకడు వాయిస్తూ బుర్రకథ చెబుతున్నట్టు ప్రారంభమవుతుంది ఓపెనింగ్ సీను. హిందీలో రోహిత్ శెట్టి తీసిన హిట్టయిన ‘గోల్ మాల్’ మైండ్ లెస్ కామెడీ సిరీస్ సినిమాల ప్రారంభాలు కూడా ఇలాగే వుంటాయి మైండ్ లెస్ గా. సమస్య ఎక్కడ వచ్చిందంటే, కామెడీ ఏదైనా ఒకటే అనే తప్పుడు అవగాహన వల్ల. లాజిక్ వుండని మైండ్ లెస్ కామెడీలు  వేరనీ,  దీన్ని అందరు ప్రేక్షకులూ భరించలేరనీ, అందుకే ముందే  ఈ విషయం స్పష్టం చేస్తూ అలాటి మైండ్ లెస్ కామెడీ సీను టీజర్ గా వేయాలనీ గ్రహించకపోవడం. గ్రహించివుంటే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’  ఓపెనింగ్ అలా అర్ధం లేకుండా వుండేది కాదు. ఆ తర్వాత టోన్ (స్వరం) మారిపోయిన ఆ కామెడీ కూడా మైండ్ లెస్ కామెడీ అవతారమెత్తి అందుకు ముందే సిద్ధంగా లేని ప్రేక్షకుల్ని హడలెత్తించేది కాదు. అనుక్షణం ప్రేక్షకుల మనసెరిగి సినిమానే కాదు, సీన్లు కూడా తీయాలనేది ఇందుకే. ఒక స్క్రీన్ ప్లే ట్యూటర్ అన్నట్టు- స్క్రీన్ ప్లే రచన ఎంత ప్రమాదకరమైన వ్యవహారమంటే, అప్రమత్తంగా వుండకపోతే ఏ క్షణంలో నైనా  ప్రేక్షకుల్ని కోల్పోవచ్చు! 

          కామెడీ టీజర్ గా శుభ్రంగా ‘తిరుడాన్ పోలీస్’ లో లాంటిది, మైండ్ లెస్ కామెడీకి .  ‘దేర్ ఈజ్ సంథింగ్ ఎబౌట్ మేరీ’ లో లాంటిదీ  వేసుకుంటే సరిపోతుంది.

-సికిందర్