రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, May 6, 2021

1037 : రివ్యూ

ఒన్ (మలయాళం)
దర్శకత్వం: సంతోష్ విశ్వనాథ్
తారాగణం :  మమ్ముట్టి, మాథ్యీవ్ థామస్, గాయత్రీ అరుణ్, సలీం కుమార్, మురళీ గోపి, జోజు జార్జ్ తదితరులు
రచన : బాబీ - సంజయ్, సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : వైదీ సోమసుందరం
బ్యానర్ : ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్
నిర్మాత : ఆర్ శ్రీ లక్ష్మి
విడుదల మార్చి 26, 2021
***

       దేశంలో  అనేక సమస్యలుంటాయి. సినిమాల్లో   సమస్యలకి సినిమాటిక్ గా పరిష్కారాలు చూపించడం దగ్గరే ఆగి పోతే సరిపోతుందా? సమస్యల పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించే కొత్త ఆలోచనకి తెర తీయకూడదా? కళ్ళ ముందున్న సమస్యని కాక, దాంతో రేపటి కలని చూడగల్గినప్పుడు సినిమాల్ని కొత్త రూపంలో అందించే అవకాశం లభిస్తుంది. లేదంటే ఇలాగే సమస్యల్ని పరిష్కరించే అదే టెంప్లెట్ తో, ప్రయోజనం లేని అవే సోకాల్డ్ కథలతో, రొటీన్ సినిమాలు తీసుకుంటూ అనుద్పాదకంగా గడపాల్సిందే.

          లయాళంలో మమ్ముట్టి నటించిన ఒన్ కోవకే చెందేలా తీశాడు దర్శకుడు సంతోష్ విశ్వనాథ్. తెలుగులో నాంది లో సెక్షన్ 211 చట్టం గురించిన కథని ఎలా చెప్పాల్సిన కథ చెప్పకుండా తీశారో, అలా ఒన్ లో రైట్ టూ రీకాల్ చట్టంతో చేశాడు దర్శకుడు. ప్రజలు తామెన్నుకున్న ప్రజా ప్రతినిధి పనితీరు నచ్చకపోతే, వెనక్కి పిలిచే 'రైట్ టు రీకాల్'‌ చట్టం ఇంకా పార్లమెంటులో ఆమోదం పొందకుండానే వుంది. పొందదు కూడా. దీని మీద మమ్ముట్టితో రాజకీయ డ్రామాగా తీశారు. ఇదిలా వుంది...

        సనల్ (మాథ్యీవ్ థామస్) ఒక స్టూడెంట్. ఇతడి అక్క సీనా (గాయత్రీ అరుణ్) పార్కింగ్ లాట్ లో వర్కర్. వీళ్ళ తండ్రి దాసప్పన్ (సలీం కుమార్) హోటల్లో వెయిటర్. ఇతను ఒక రోజు అనారోగ్యం పాలైతే ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఆస్పత్రికి సనల్ వెళ్తే అప్పుడే ముఖ్యమంతి కడక్కల్ చంద్రన్ (మమ్ముట్టి) ఆరోగ్య పరీక్షల కోసం రావడంతో, పోలీసులు సనల్ ని పక్కకు తోసేస్తారు. కొడతారు.

       రమ్య (ఇషానీ కృష్ణ) తోటి స్టూడెంట్. ఈమె ఈ సంఘటన గురించి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టమని చెప్తుంది. ఫేక్ ఎక్కౌంట్ సృష్టించి సీఎం కి వ్యతిరేకంగా పోస్టు పెడతాడు సనల్. ఆస్పత్రికి సీఎం రాకపోకల వల్ల తను దౌర్జన్యానికి గురయ్యానని సీఎం ని విమర్శిస్తూ రాస్తాడు. ఇది వైరల్ అవుతుంది. దీంతో ప్రతిపక్ష నాయకుడు జయనందన్ (మురళీ గోపీ) పౌరులకి ఇబ్బంది కల్గించిన సీఎం చర్యకి వ్యతిరేకంగా ఆందోళనకి దిగుతాడు. పోలీసులు సనల్ ని పట్టుకుని సీఎం చంద్రన్ ముందు హాజరు పరుస్తారు. సీఎం సనల్ కి సారీ చెప్తాడు. తనకి ఇలాటి యూతే కావాలని చెప్పి, ఒక టాస్క్ అప్పజెప్తాడు. అన్ని నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల గురించి ప్రజలేమనుకుంటున్నారో సర్వే చేసి, రిపోర్టు అందించమంటాడు. తన ధ్యేయం రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడమని వెల్లడిస్తాడు...

***
        ఇదీ విషయం. రైట్ టు రీకాల్ చట్టాన్ని పాస్ చేయించడం లక్ష్యం. చివరికి పార్లమెంటులో పాస్ అయినట్టు చూపించారు. అసెంబ్లీలో కాలేదని ముగించారు. దీంతో రాజీనామా చేసిన సీఎం చంద్రన్ మళ్ళీ ఎన్నికలు గెలిచి వస్తాడు. ఈ చట్టానికి ప్రజా మద్దతుందని నిరూపిస్తూ. ఇలా ఈ కథ రైట్ టు రీకాల్ ఐడియాతో చెప్పాల్సిన కథగా  కాకుండా పోయింది. రైట్ టు రీకాల్ చట్టం ఆపరేటివ్ పార్టు చూపించక పోవవడంతో, కథగా చెలామణిలోకి రాకుండా వుండి పోయింది. చట్టమెలా మూబడిందో, కథ కూడా అలా మూలబడింది. చట్టం మూలబడ్డ విషయం ఎలాగూ తెలిసిందే, అది మళ్ళీ చూపించడమెందుకు. దర్శకుడు పత్రికలో ఓ ఉత్తరం రాసి గుర్తు చేస్తే పోయే దానికి ఇంత సినిమా తీయాల్సిన అవసరం కన్పించదు.



        చట్టం పాస్ అయినట్టో కానట్టో చూపించడం ఆసక్తికర కథవుతుందా? పాస్ అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి. ఉల్లి పెసరట్టు వేస్తానన్నాడు, వేశాడు. అయితే ఏంటి. తినిపించి దాని రుచి చూపించాలి గాని. రుచి చూపించకుండా ఉల్లి పెసరట్టు వేస్తే ఎవరిక్కావాలి, వేయకపోతే ఎవరిక్కావాలి. చట్టం పాసయ్యే ఆసక్తి లేని  కథ ఎవరిక్కావాలి. ఒకవేళ పాసైతే ఆ చట్టం ఎలా అమలయ్యేదో, ఎలాటి పరిణామా లుంటాయో ఆ ఆసక్తికర కథ కావాలి గాని (The big reason so many writers fail here is that they don’t know how to develop the idea, how to dig out the gold that’s buried within it. They don’t realize that the great value of a premise is that it allows you to explore the full story, and the many forms it might take, before you actually write it John Truby). నాంది లో 211 చట్టం తో ఇలాగే చెప్పాల్సిన కథ చెప్పేలేదు. రైట్ టు రీకాల్ చట్టంతో ఒన్ లోనూ చెప్పాల్సిన కథ చెప్పలేదు. ఇదీ సృజనాత్మకంగా ఇంకా కొనసాగుతున్న సినిమా కథల పరిస్థితి. తీసుకున్న ఐడియా లో అవసరమున్న కథని గుర్తించలేని దుస్థితి. ఇలాటి ఐడియాలతో కథలనేవి పరిష్కారాలా ననంతర ప్రపంచాన్ని చూపించడంలో వుంటాయని గుర్తించక పోతే, జస్ట్ లైక్ ముందు కాలాన్ని చూపించే సైన్స్ ఫిక్షన్ కథల్లాగా వుండకపోతే, ఇక ఇంతే.


***

        తమిళ మండేలా ని ప్రజా నాయకులు అవసరం లేని ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించుకునే ఆదర్శ ఆలోచనతో తీశాడు ఆ దర్శకుడు. ఒన్ ని ఇలాటి ఆదర్శంతో తీయవచ్చు. ఇందుకు ఐడియాని రీసెర్చి చేయాలి. రైట్ టు రీకాల్ చట్టం పాసై అమల్లోకి వస్తే ఎలాటి పరిణామాలుంటాయో వివరిస్తూ ఇప్సితా మిశ్రా రాసిన ఆర్టికల్లో ఒక సినిమా తీయడానికి పనికొచ్చే పాయింట్లున్నాయి. ఈ పాయింట్లు తీసుకుని చాలా హిలేరియస్ పొలిటికల్ ఎంటర్ టైనర్ తీయవచ్చు మండేలా లాగా. కథ ఇక్కడుంది. కేవలం చట్టాన్ని పాస్ చేయించడమనే లక్ష్యంలో లేదు.


        రైట్ టు రీకాల్ ని ఉత్తరాది నాల్గైదు రాష్ట్రాల్లో పంచాయితీ స్థాయిలో చట్టం చేసి అమలు చేస్తున్నారు కూడా. పంచాయితీ స్థాయిలో సర్పంచులుంటారు కాబట్టి ఎదుర్కొలేరు. అదే ఎమ్మెల్యేలకి, ఎంపీలకీ వర్తించే మౌలిక చట్టాన్ని పాస్ చేయగలరా?  చేయలేరు. ఓటర్ల చేతిలో నోటా అనే లోటా ఒకటి తప్ప, రైట్ టు రీకాల్ కొరడా పెట్టలేరు.


        మరి స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన లింకన్ కథ చట్టాన్ని పాస్ చేయించడం గురించే కదా అనొచ్చు. అది అమెరికా పదహారవ అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ బయోపిక్. ఆయన జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం, 13 వ రాజ్యాంగ సవరణ గురించిన రాజకీయ డ్రామాగా తీశాడు. బానిసత్వాన్ని నిషేధించే ఈ రాజ్యాంగ సవరణ గురించిన హైడ్రామా ఒక చరిత్ర. కథకి ఈ పరిస్థితుల చిత్రణ అవసరం. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాక ఎలా అమలయ్యిందో తెలిసిన చరిత్రే. అది చూపించనవసరం లేదు. కానీ రైట్ టు రీకాల్ చట్టం పాస్ కాలేదు, అమలే కాలేదు. అమలైతే ఎలా వుంటుందన్న ప్రేక్షకాసక్తితో చెప్పాల్సిన కథే అసలు కథవుతుంది ఐడియాకి.


***

        రైట్ టూ రీకాల్ కథ చెప్పడానికి కూడా అంత కథ లేదు. మొదటి అరగంట స్టూడెంట్ సనల్ తోనే గడిచిపోతుంది. సీఎం కి వ్యతిరేకంగా అతను పెట్టిన పోస్టుకి సంబంధించిన పరిణామాలు ఈ అరగంటని మింగేస్తాయి. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం, అరెస్ట్ కాకుండా అతను లాయర్ని ఆశ్రయించడం, అతడి కుటుంబ సభ్యుల్ని పోలీసులు వేధించడం, అతను వూరు విడిచి పారిపోయే ప్రయత్నం చేయడం, ప్రతిపక్ష నాయకుడి హంగామా వగైరా మొదటి అరగంట సాగుతుంది. ఆస్పత్రిలో వున్న తన తండ్రి కోసం పోతే, సీఎం వచ్చాడని అడ్డుకుని పోలీసులు కొట్టారని పోస్టు పెడితే, అదెలా నేరమవుతుందో చెప్పక పోవడంతో ఈ ఎపిసోడ్ నమ్మశక్యంగా వుండదు.

      కాకతాళీయంగా గత వారమే సుప్రీం కోర్టు పోలీసుల్ని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరత నెదుర్కొంటున్న ప్రజలు ఆందోళనతో సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్టు చేయరాదని. ఈ సినిమాలో సనల్ ని అరెస్ట్ చేసే హంగామా లాజికల్ గా లేకపోగా, సీఎం పాత్ర ఔచిత్యాన్ని కూడా దెబ్బతీసింది. తన మీద పోస్టు పెట్టిన సనల్ నిజానికి తన లక్ష్యానికి కావాల్సిన యూత్ అన్పించినప్పుడు, అతన్ని ప్రశాంతంగా పిలిపించుకోవచ్చు. ఇంత టెర్రర్ దేనికి? మిస్ లీడింగ్ గా ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలన్న చిలిపి ఆలోచన కాకపోతే? ఈ సీఎం ప్రజలకి టెర్రర్ కూడా కాదు, ఫ్రెండ్లీ లీడర్.

***

        ఇలా సీఎం తన లక్ష్యం కోసం సనల్ ని రప్పించుకోవడం ప్లాట్ పాయిట్ వన్ అయింది. ఇక్కడ తన లక్ష్యం అయిన రైట్ టు రీకాల్ చట్టం కోసం, ఎమ్మెల్యేల గురించి ప్రజల అభిప్రాయాలు సేకరించమని, సనల్ కి సర్వే అప్పజెప్తాడు సీఎం. ఇది పాత్రల స్వభావానికి వ్యతిరేకంగా వుంది. సీఎం గా తన మీద వ్యతిరేకంగా పోస్టు పెట్టిన వాడికే ఈ సర్వే పని ఎలా అప్పజెప్తాడు. అప్పుడు, సార్, నేనిచ్చే సర్వేలో రీకాల్ చేయాల్సిన మొదటి నాయకుడు మీరే అవుతారు అని సనల్ అనెయ్యవచ్చు ఆస్పత్రి సంఘటన దృష్ట్యా. అనకుండా ఎలా వుంటాడు. కథ కోసం అన్లేదులా వుంది. ఇలా ఇద్దరి మధ్యా ఒప్పందంతో ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధరహితంగా వుంది. ఆస్పత్రి సీనులో సీఎం కాక వేరే నాయకుడు వుండుంటే ఈ ప్లాట్ పాయింట్ వన్ అర్ధవంతంగా వుండేదేమో.


***


       ఇలా ఏర్పాటైన ఈ రైట్ టు రీకాల్ లక్ష్యంతో తర్వాతి  కథ ఇంకెప్పుడో వుంటుంది. ఈ లోగా సంబంధం లేని ఎపిసోడ్లు 8 మొదలవుతాయి. ప్రతిపక్షం సమ్మె, సనల్ అక్క సీనా దొంగతనం కేసులో ఇరుక్కుంటే సీఎం విడిపించడం, ఫ్లై ఓవర్ కూలిపోతే సీఎం వెళ్ళి చర్య తీసుకోవడం. వేరే ఒక అవినీతి కేసులో ఒక మంత్రిని అరెస్టు చేయించడం, కాలేజీకి వెళ్ళే మార్గంలో ఒక కంపెనీ ముందు కార్మికులు ఆందోళన చేస్తూ రోడ్డు బ్లాక్ చేస్తే, సీఎం కాన్వాయ్ వదిలి ఆటో ఎక్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళి సామాన్య బార్బర్ గా (మండేలా కూడా బార్బరే) రాజకీయాల్లో తను ఎదిగిన విధం గురించి విద్యార్థుల ముందు ప్రసంగించడం, వంట వాడికి తన తండ్రి గొప్పదనం గురించి వినరించడం... ఇలా కథతో సంబంధం లేని 8 ఎపిసోడ్లు పాయింటు వదిలేసి సినిమాని ఎటో తీసికెళ్ళి పోతాయి. ఇంకా సినిమాల్లో ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బాపతు డాక్యుమెంటరీ కథనాలు తప్పవేమో.


        ఈ ఎపిసోడ్లని గమనిస్తే ఘోరమైన పాత్ర చిత్రణ బయటపడుతుంది. ఒక వైపు రైట్ టు రీకాల్ కి సర్వే అప్పజెప్పిన సీఎం, మరో వైపు ఈ ఎపిసోడ్లతో తను నీతిగల నాయకుణ్ణని ఇమేజి బిల్డప్ చేసుకుంటున్న అర్ధం కన్పిస్తోంది- సర్వేలో ప్రజలు తనకి వ్యతిరేకంగా చెప్పకూడదన్న భావంతో అన్నట్టు. రచన చేస్తున్నప్పుడు ఈ పొరపాటు తెలుసుకోకుండా ఇంత ఘోరమైన పాత్ర చిత్రణకి ఈ ఎపిసోడ్లతో తెరతీశారు దర్శకుడూ రచయితల జంట. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయాలనుకుంటారేమో – మలయాళ తప్పిదం తెలుగులో దిగుమతి ఐపోగలదు!


***
        ఈ ఎపిసోడ్ల వల్ల సనల్ కథలో కనిపించకుండా పోతాడు. మొదటి అరగంట అంతా కీలక పాత్రగా స్పేస్ తీసుకున్న వాడు అప్రధాన పాత్రాయి పోతాడు. ఎక్కడా సీఎం అప్పజెప్పిన సర్వే చేస్తున్నట్టు కూడా కనపడడు. ఎపిసోడ్లు పూర్తయ్యాక వచ్చి ఏకంగా సర్వే సబ్మిట్ చేసేస్తాడు. ఇది సెకండాఫ్ లో. సర్వే కథ, ఇలా రైట్ టు రీకాల్ కొనసాగింపు కథ చెప్పలేకే అన్నట్టు వేరే ఎపిసోడ్లతో కాలక్షేపం చేశారు. ఇక ఇప్పుడు సెకండాఫ్ లో మర్చిపోయిన ప్రధాన కథ మొదలవుతుంది. సీఎం ఒక ఎంపీతో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్ వేయించడం, అది ఇట్టే పాసవడం, పాసైన చట్టాన్ని అసెంబ్లీలో ఓటింగ్ కి పెట్టడం, ఓడిపోవడం మొదలైనవి.

      ప్రధాన కథ రైట్ టు రీకాల్ కి సంబంధించి పూర్తి స్థాయి కథ లేకపోవడం, సంఘటనలు లేక థ్రిల్, సస్పెన్స్ వంటివి లోపించడం, డైలాగులతోనే సీన్లు నడవడం, మొదలైన బలహీనతలతో రెండున్నర గంటల పాటూ చాంతాడులా సాగుతుంది.

***

        మమ్ముట్టి వైట్ డ్రెస్ లో సీఎం హూందాతనంతో బాగానే నటించాడు. కానీ ఆ హూందాతనం మాటున తప్పుడు పాత్రచిత్రణ ఇబ్బందిగా వుంటుంది చూడడానికి. సీఎం అంటే అతి భక్తి అమాయక టీనేజీ స్టూడెంట్ గా సనల్ పాత్రకి మాథ్యీవ్ థామస్ సరిపోయాడు. ప్రతిపక్ష నాయకుడుగా మురళీ గోపి మమ్ముట్టి కి దీటుగానే కన్పిస్తాడు. అయితే పూర్తి నిడివి పాత్ర కాదు. ఇక తక్కువ కంపించినా ఎక్కువ ప్రభావం చూపే నటి సనల్ అక్క పాత్రలో గాయత్రీ అరుణ్. ఈమెని తెలుగులోకి ఎవరైనా తీసుకోవచ్చు.గోపీ సుందర్ సంగీతంలో మమ్ముట్టి మీద ఒక పాట వుంటుంది. వైదీ సోమసుందరం ఛాయాగ్రహణం, ఇతర ప్రొడక్షన్ విలువలు ఉన్నతంగా వున్నాయి.


సికిందర్

 

 

 

Sunday, April 25, 2021

1036 : రివ్యూ

కలతిల్ సంతిప్పమ్ (తమిళం)
రచన -దర్శకత్వం : ఎన్. రాజశేఖర్
తారాగణం : జీవా, కలతిల్ సంతిప్పమ్ (తమిళం)
జీవా, అరుళ్ నిధి, మంజిమా మోహన్, , ప్రియా భవానీ శంకర్, శ్రీరంజని, రేణుక, ఇళవరసు, శరవణన్, రోబో శంకర్, రాధా రవి తదితరులు
సంగీతం : యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం : అభినందన్ రామానుజం
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిలిమ్స్
నిర్మాత : ఆర్ బి చౌదరి
విడుదల : ఫిబ్రవరి 5, 2021;  జీ 5 విడుదల : ఏప్రెల్ 23, 2021
***

      జీవా, మంజిమా మోహన్, అరుళ్ నిధిలు నటించిన కలతిల్ సంతిప్పమ్ (ఆట స్థలంలో కలుసుకుందాం) లాక్ డౌన్ ఎత్తేసిన నేపధ్యంలో ఫిబ్రవరిలో విడుదలైనా, ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో విఫలమైంది. ప్రధానంగా కుటుంబ ప్రేక్షకులకి ఉద్దేశించినట్టున్న ఈ లైటర్ వీన్ కమర్షియల్, అప్పటికింకా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకి తిరిగి రాకపోవడం కారణంగా కావచ్చు- 10 కోట్ల బడ్జెట్ కి ఓవర్సీస్ తో కలుపుకుని 2.66 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాపయ్యింది. జనవరి నుంచి మార్చి 31 వరకూ విడుదలైన 10 తమిళ సినిమాల్లో రెండు హిట్టై, మూడు యావరేజీలై, 5 ఫ్లాపయ్యాయి.

        లతిల్ సంతిప్పమ్ దర్శకుడు ఎన్ రాజశేఖర్ కొత్తవాడు. అయినా కొత్తదనంలేని పూర్వకాలపు కథ ప్రయత్నించాడు. ఇద్దరు ప్రముఖ హీరోల మధ్య స్నేహం ఆధారంగా రొటీన్ ప్రేమ కథ చూపించాడు. దీన్ని కుటుంబ ప్రేక్షకుల కన్నట్టు లైటర్ వీన్ గా, హాస్యాయుతంగా చెప్పాడు. అయితే విడుదల చేసిన సమయం లెక్క తప్పినట్టుంది. ఆ   లెక్క సరి చేసుకోవడం కోసం నిన్న జీ 5 లో విడుదల చేసినట్టుంది. దీని వివరాల్లోకి వెళ్దాం...  

కథ

     అశోక్ (జీవా), ఆనంద్ (ఎం. కరుణానిధి మనవడు అరుళ్ రవి) మిత్రులు. ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూంటారు. అశోక్ నిదానస్తుడు, ఆనంద్ ఆవేశపరుడు. అశోక్ గొడవల్ని ఎవాయిడ్ చేస్తాడు. అశోక్ ని ఎవరేమన్నా ఆనంద్ తోలు తీస్తాడు. ఆనంద్ పోరాటానికి దిగితే, అశోక్ చల్లగా తప్పించుకుని, ఆనంద్ గురించి బ్యాడ్ గా మాట్లాడే అలవాటుంటుంది. ఒకసారి అశోక్ చేసిన పనికి అశోక్ మీదికి ఒక గ్యాంగ్ వస్తే, ఆనంద్ ఆ గ్యాంగ్ తో తలపడతాడు. అశోక్ తప్పించుకుని టీస్టాల్ దగ్గర కూర్చుని ఫైటింగ్ చూస్తూ - వాడంతే, వాడొక రౌడీ వెధవ అంటూ అలవాటు చొప్పున చెత్త వాగుడు వాగుతాడు ఆనంద్ గురించి.

        వీళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటారు పేరెంట్స్. అశోక్ కి పెళ్ళీ గిళ్ళీ పడదు. కేర్ ఫ్రీగా వుండాలనుకుంటాడు. ఆనంద్ కి మామ కూతుర్ని చేసుకోమని తల్లి పోరుతూంటుంది. ముందుగా అశోక్ కి పెళ్ళి చూపులు ఏర్పాటవుతాయి. పెళ్ళి చూపుల్లో భయంకరంగా వున్న ఆ అమ్మాయిని చూసి మొహమాట పడుతూంటే, నువ్వే నాకు నచ్చలేదంటుందా అమ్మాయి. అక్కడ్నించి సేఫ్ గా బయటపడతాడు.

          ఇక ఆనంద్ కి మేనమామ కూతురు కావ్య (మంజిమా మోహన్) తో పెళ్ళి చూపులేర్పాటవుతాయి. అక్కడికొచ్చిన బంధువు అశోక్ ని గుర్తు పడతాడు. అప్పుడారోజు ఆనంద్ గ్యాంగ్ తో తలపడుతున్నప్పుడు, ఆనంద్ గురించి అశోక్ వాగిన చెత్త వాగుడంతా ఈ బంధువు విన్నాడు. దీంతో ఆనంద్ క్యారక్టర్ గురించి కావ్య తండ్రిని హెచ్చరిస్తాడు. అది నిజం కాదనీ, కామెడీ కోసం అలా అన్నాననీ అశోక్ ఎంత మొత్తుకున్నా నమ్మరు. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది.

        ఇలా ఆనంద్ పెళ్ళి సంబంధం చెడగొట్టిన అశోక్ ఇరకాటంలో పడతాడు. ఇప్పుడేం చేశాడు? ఆనంద్ ఏం చేశాడు? ఇద్దరూ కొట్టుకున్నారా? ఈ ఇద్దరి మద్య కావ్య ఏం చేసింది? ఆమెని ఎందుకు కిడ్నాప్ చేశాడు అశోక్? మధ్యలో కొత్తగా దిగిన సోఫియా ఎవరు? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది?... ఇదీ మిగతా కథ. 
 
ఎలావుంది కథ

         షోలే లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పెళ్ళి సంబంధం మాట్లాడడానికి హేమమాలిని పెద్దమ్మ దగ్గరికెళ్ళి, ధర్మేంద్ర గుణగణాల గొప్పదనం గురించి సుందర వ్యంగ్యంగా సంభాషించే కామెడీ సీనుతో పోలిక కన్పిస్తుంది. జీవా ఫ్రెండ్ గురించి అవాకులు చవాకులు పేలే కామెడీ ఇదే. దీనికి పెళ్ళి చూపులు జోడించి పెళ్లి సంబంధం చెడగొడితే, కలతిల్ సంతిప్పమ్ కథ అయింది.  
  
         ఇది పూర్వకాలపు కథ. ప్రేమ స్నేహాల అదే ఫార్ములా కథ. అయితే స్నేహంలో గానీ, ప్రేమలో గానీ ఎమోషన్లు, ఓవర్ గా సెంటిమెంట్లు, ఘర్షణలు, విడిపోవడాలు వంటి టెంప్లెట్స్ లేని, మూస ఫార్ములా కథనం లేని, మాస్ ఎలిమెంట్స్ లేని,  ఫ్రెష్ గా అన్పించే, మూడు కుటుంబాల మధ్య సాగే లైటర్ వీన్ హాస్య ప్రధాన కథగా ఇది కన్పిస్తుంది. అయితే ఇందులో కబడ్డీకీ, కబడ్డీతో టైటిల్ కీ జస్టిఫికేషన్ లేదు.

నటనలు - సాంకేతికాలు

        ఇందులో ఎవరిది హీరో పాత్రో చెప్పడం కష్టం. జీవా యాక్షన్ సీన్స్ అరుళ్ కి అప్పగించి తప్పుకున్నాడు. గొడవలంటే తప్పించుకునే కామెడీ క్యారక్టర్ కాబట్టి ఇలా వుంది. అరుళ్ ది సీరియస్ గా వుండే పాత్ర. ఈ రెండు పాత్రల మధ్య బ్రొమాన్స్ కూడా లైటర్ వీన్ గానే వుంటుంది. ఇద్దరూ కలిసి కన్పించే సీన్లు తక్కువే. అయినా ఈ బ్రోమాన్స్ లో బాండింగ్ బలంగా వుంటుంది. జీవా తండ్రిని అరుళ్ నాన్నా అని పిలిస్తే, అరుళ్ తండ్రిని జీవా కూడా నాన్నా అని పిలిచే ఫ్యామిలీ బాండింగ్ కూడా వుంటుంది. కుటుంబాలకి పరస్పరం సాయం చేసుకోవడం తెలియకుండా చేసుకున్నా, తెలిశాక ఎవరికీ ఎవరూ రుణపడి వుండే టెంప్లెట్ వుండదు. ఒక సహజ ప్రక్రియగా వాళ్ళ మధ్య వ్యవహారాలు సాగిపోతూంటాయి. ఇవన్నీ ఇద్దరి పాత్రలకీ, నటనలకీ తాజాదననాన్ని తెచ్చాయి.

        జీవా గొడవలకి దూరంగా వుండే డిఫెన్సివ్ క్యారక్టర్ అయినట్టుగా, అలాగే అరుళ్ గొడవల్ని ఎదుర్కొనే అఫెన్సివ్ క్యారక్టర్ అయినట్టుగా, రోమాన్స్ లో కూడా అలాగే వుంటారు. మంజిమతో జీవా డిఫెన్సివ్ గా వుంటే, ప్రియా భవానీ శంకర్ తో అరుళ్  అఫెన్సివ్ గా వుంటాడు. అయితే హీరోయిన్లిద్దరి పాత్రలు ఫార్ములా హీరోయిన్ పాత్రలు. మంజిమ సొంతంగా ఆలోచించే పాత్రగా కాసేపు కన్పించి, తర్వాత అలా కన్పించదు.

        హీరోలిద్దరి ఫ్రెండ్స్ గా రోబోశంకర్, బాల శరవణన్ లు ప్రతీ సీనులో - అది సీరియస్ గా వున్నా సరే, ఏదో కామెడీతో తేలిక బర్చేస్తూంటారు. ఇంకో ఇలాటి పాత్ర ఫైనాన్స్ కంపెనీ ఓనర్ పాత్ర. ఇతను రాధా రవి. పేరెంట్స్ పాత్రల్లో ఇళవరసు, నాదోడిగళ్ గోపాల్, ఆడుకాలం నరేన్,  వేలా రామ్మూర్తి, శ్రీ విద్యా శంకర్, శ్రీరంజని, రేణుక... వీళ్ళంతా ఫ్యామిలీ సెగ్మెంట్ లో ఒక హోమ్లీ ఫీల్ తీసుకొస్తారు.

        యువన్ శంకర్ రాజా సంగీతంలో పాటలూ లైటర్ వీన్ గానే వున్నాయి. అభినందన్ రామానుజం కెమెరా వర్క్ కూడా లైటర్ వీనే. టౌను లొకేషన్స్, నేపథ్య వాతావరణం మొదలైనవి కూడా లైటర్ వీన్ గానే లైటర్ వీన్ కథతో పాటు కలిసి నడిచాయి. 

సంక్షిప్త స్క్రీన్ ప్లే సంగతులు

       కొత్త దర్శకులకి సర్వ సాధారణంగా ఓ సమస్య వుంటుంది. చేసుకున్న కథ ఒకవేళ బాగా చేసుకున్నా, వాళ్ళ మీద నమ్మకం లేక మార్పు చేర్పులు జరిగి పోతాయి. హిట్టయిందా ఫర్వాలేదు, పోయిందా కొత్త దర్శకులే పోతారు. కొత్త దర్శకులూ, వాళ్ళ కథల్ని మార్చేసే  హస్తాలూ తెలియని ఒక దశలో వుంటే చాలా ప్రమాదం. చేస్తున్నది కథ కాదనీ, గాథ అనీ తెలియని దశ. చేస్తున్నది కథ కాదనీ, గాథ అనీ పక్కాగా తెలిసి చేయడం వేరు. అప్పుడు కనీసం గాథ ఎలా చేయాలో తెలుసుకుని చేయవచ్చు. గాథ అని వేరే ఒకటుంటుందని తెలియక పోతే చాలా ప్రమాదంలో పడిపోతారు. చేస్తున్న కథలో కథాంగాలు మిస్సయి, అది గాథై పోతూ ఎక్కడికో... తీసికెళ్ళి పోతారు.

        అయితే గాథ కి కూడా కొన్ని అర్హతలుంటాయి. పక్కాగా కథే అనుకుంటూ చేస్తున్న కథలోంచి 5 ప్రధాన కథాంగాలు - ప్రధాన పాత్ర, యాక్టివ్ పాత్రలు, ప్రత్యర్ధి పాత్ర, ప్రధాన సమస్య, గోల్ అన్నవి లేకుండా కథ చేసుకుని-  ఇదే నా తిరుగులేని కథ అనుకుంటే గాథ కూడా వూరుకోదు. గాథకైనా ప్రధాన పాత్ర వుండాల్సిందే. కాకపోతే పాసివ్ గా వుండొచ్చు. అలాగే గోల్ లేకపోయినా ఓ ప్రధాన సమస్య చుట్టూ సంఘర్షణ వుండాల్సిందే. ప్రధాన సమస్యని ఆపేసి ఇంకో సమస్యని ఎత్తుకుని, దాన్ని కూడా ఆపేసి ఇంకో...ఇలా చేస్తూ పోతే అది గాథ కూడా అవదు. ఆపి ఆపి ఒక్కో సమస్య చెప్పుకుంటూ పోయే స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బాపతు  డాక్యుమెంటరీ అవుతుంది. ప్రత్యర్ధి పాత్ర లేనప్పుడు, గాథలో ప్రధాన సమస్య సృష్టించిన పరిస్థితులతో  సంఘర్షణ వుంటుంది. వేరే విడివిడి చిన్న చిన్న సమస్యలతో కాదు.

        కొత్త దర్శకుడి ఈ కథలో ఇవన్నీ జరిగాయి. ఒకటే యూఎస్పీ పెట్టుకున్నట్టుంది -కుటుంబ ప్రేక్షకుల కోసమని అన్నీ లైటర్ వీన్ గా వుండాలని. మంచిదే. కానీ దీనికి అడ్డొచ్చిన కథాంగాల్ని ఎత్తేసి ఏమీ లేకుండా చేస్తేనే వస్తుంది సమస్య.  

        30 నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వస్తుంది. జీవా వల్ల ఆనంద్ పెళ్ళి చెడే సీనుతో ప్లాట్ పాయింట్ వన్. దీంతో తనవల్ల జరిగిన తప్పుని  సరిదిద్దాడానికి జీవా మంజిమని ఆనంద్ తో కలిపే ప్రయత్నాలు చేస్తాడు. ఈలోగా ఆమె తండ్రి ఆమెకి వేరే పెళ్ళి పెట్టేస్తాడు. జీవా ఆమెని కిడ్నాప్ చేసి ఆనంద్ దగ్గరికి తీసికెళ్లి పెళ్ళి చేసుకోమంటాడు. ఆనంద్ చేసుకోనంటాడు. ఇలా చేసి మేనమామ పరువు తీయలేనంటాడు. మంజిమకి వొళ్ళు మండి తనని ఇంటిదగ్గర దింపెయ్యమంటుంది. ఇలా ఈ ఇంటర్వెల్ సీను ఏమీ తేలకుండానే, అర్ధాంతరంగా ఇంటర్వెల్ పడుతుంది.

        సీను మధ్యలో ఆపి ఇంటర్వెల్ వేయాలంటే అక్కడేదో సస్పెన్స్ వుండాలి. లేకుండా ఇలా కరెంటు పోయినట్టు సీనాపి ఇంటర్వెల్ వేసేస్తే అర్ధమేమిటో అర్ధంగాదు. ప్లాట్ పాయింట్ వన్ నుంచీ ఈ ఇంటర్వెల్ వరకూ ప్రధాన పాత్రగా జీవా కనిపిస్తూ, ఓ సమస్యా, గోల్ బాగానే వుంటాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇవన్నీ మాయమైపోతాయి.       

         ఇంటర్వెల్ దగ్గర కట్ అయిన సీను తిరిగి ప్రారంభమవగానే, మంజిమ తండ్రి మనుషులతో వచ్చి, జీవాని కొట్టి ఆమెని తీసికెళ్ళి పోతాడు. ఇక జీవా మంజిమతో ఆనంద్ పెళ్ళి జరిపించే సమస్య జోలికి పోడు. ఈ కథ అక్కడితో ఆగిపోతుంది. ప్లాట్ పాయింట్ వన్ తో ఏర్పడిన  సమస్య, గోల్, యాక్టివ్ క్యారక్టర్ ఇవన్నీ అదృశ్యమై పోతాయి. ప్రత్యర్ధి పాత్రగా కన్పించిన మంజిమ తండ్రి మంజిమని తీసికెళ్ళి పోయి ప్రత్యర్ధి పాత్రని చాలించుకుంటాడు. ఆ కథే అదృశ్యమైపోయి, ఆనంద్ కి ప్రియా భవానీ శంకర్ తో వేరే ప్రేమ కథ ప్రారంభం! ప్రధాన పాత్రగా కన్పించిన జీవా సహా ఆనంద్ పాసివ్ పాత్ర అయిపోవడం. ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ తండ్రితో ఇంకో సమస్య. ఈ సమస్య తేల్చడానికి జీవా ఆనంద్ లు ఏమీ చేయకుండానే, మంజిమ తండ్రి మళ్ళీ ఆమెకి పెళ్ళి పెట్టేసి ఇంకో సమస్య... ఇంతలో ఇంకేదో పని కల్పించుకుని కబడ్డీ పోటీలతో క్లయిమాక్స్.          

    వాటికవే సంఘటనలు జరుగుతూ, సమస్యలు వాటికవే పరిష్కారమయ్యే కథనమంతా లైటర్ వీన్ కథనమనుకుంటే, మొదట దెబ్బ తినేది పాత్ర చిత్రణలే. కథ కవసరమైన కథాంగాలనే లేకుండా చేస్తే, అదెలాటి లైటర్ వీన్ అవుతుందో ఇలా చూస్తాం. ఇలా మొదటిసారి చూస్తున్నాం...

సికిందర్

 

Wednesday, April 21, 2021

 

Tuesday, March 17, 2020

920 : జానర్ మర్యాద

(ఇది మొదటి భాగం. మిగిలిన భాగాల కోసం కింద ఇచ్చిన లింకుని క్లిక్ చేసి, స్క్రోల్ డౌన్ చేయండి)

        జానర్ మర్యాదల గురించి కొనసాగింపు వ్యాసంగా మొదట ప్రస్తుత ట్రెండ్ మీద దృష్టి పెడితే, మొత్తానికి ఇటీవల రోమాంటిక్ కామెడీ (?) ల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల (?) హవా నడుస్తోంది. వీటి జానర్ మర్యాదలు తెలియజేయాలని కొందరు రాస్తున్నారు. ఒక సహకార దర్శకుడు డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్ (?) జానర్ ఎనాలిసిస్ రాయాలని కోరారు. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అని అనెయ్యడం అనాలోచితంగా జరిగిపోయి వుండొచ్చు. జానర్ సంబంధ సాంకేతిక పదాలు ఇష్టానుసారం వాడేస్తే ఇక జానర్ మర్యాదలు ఎంత చెప్పినా అర్ధంగావు. ప్రేమ కథలన్నిటినీ కలిపి రోమాంటిక్ కామెడీలని ఒకే పదం వాడెయ్యడం, నేర కథలన్నిటినీ సస్పెన్స్ థ్రిల్లర్స్ అనుకోవడం చేస్తే ఇక జానర్ మర్యాదల గురించి చెప్పుకోవడం అసాధ్యమైపోతుంది. ఒక జానర్ లో ఎన్నో సబ్ జానర్లు వుంటాయి. నిజంగా జానర్ మర్యాదల్ని అమలుచేసి, ఒక వైవిధ్యాన్నిచాటుకోవాలనుంటే, ముందు తెలుసుకుని మాట్లాడాల్సింది ఏ సబ్ జానర్ కింద చేస్తున్న కథ వస్తుందన్నదే. ఇది ఐడియా దశలోనే నిర్ణయమవాలి. ఐడియా దగ్గరే కట్టుబడక పోతే ఇక కథతో ఏ కట్టుబాట్లూ వుండవు. ఏ జానర్ మర్యాదలూ వుండవు. లవ్ జానర్లో రోమాంటిక్ కామెడీలు మాత్రమే వుండవు. రోమాంటిక్ డ్రామాలుంటాయి, రోమాంటిక్ సస్పెన్సులుంటాయి. అడల్ట్ రోమాన్సులుంటాయి, ఎరోటిక్ రోమాన్సులుంటాయి. ఇలా అనేక సబ్ జానర్లుగా వర్గీకరణ చెంది వుంటుంది లవ్ జానర్. ఇది తెలుసుకోక రోమాంటిక్ కామెడీ లంటూ తీస్తూ వచ్చిన సినిమాలు దాదాపూ అన్నీ ఒకే మూసలో రోమాంటిక్ డ్రామాలే. ఇలా వుంటే ఇక జానర్ మర్యాదల గురించి తెలుసుకుని ప్రయోజనమేముంటుంది.   

        
లాగే నేర కథలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కావు. నేర కథలు ప్రధానంగా క్రైం జానర్. దీనికింద సబ్ జానర్స్ గా మిస్టరీ, క్రైం థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, ఎరోటిక్ థ్రిల్లర్, లీగల్ థ్రిల్లర్, మెడికల్ థ్రిల్లర్, మిలిటరీ థ్రిల్లర్... ఇలా ఎన్నో వుంటాయి. దేని జానర్ మర్యాద దానిదే. సస్పెన్స్ థ్రిల్లర్ అనే సబ్ జానర్ కూడా లేదు. కారణం, సస్పెన్స్ నేది అన్ని జానర్ల కథల్లోనూ వుండేదే. ఇది కథలకి సస్పెన్స్ ని కల్పించే టూల్ తప్ప, టైపు కాదు. జానర్ కాదు. పైన చెప్పుకున్న క్రైం సబ్ జానర్ లో కథలు ఒక నేరం చుట్టూ వుంటాయి. ఈ కథలు స్టార్స్ తో తీసినప్పుడు హాలీవుడ్ సినిమాల్లోలాగా వాటివైన జానర్ మర్యాదలతో వుండక పోవచ్చు. అన్ని మసాలాలూ కలిపేసి వుండొచ్చు. స్టార్స్ కుండే ఇమేజి అలా డిమాండ్ చేస్తుంది కాబట్టి. వీటికి జానర్ మర్యాదల గురించి కంగారుపడ నవసరం లేదు. 



   స్టారేతర సినిమాలకి మనసుంటే మర్యాదలు, బంధుత్వాలు కలుపుకోవచ్చు. మనసే లేకపోతే  కొత్త హీరోల, చిన్న హీరోల క్రైం జానర్ ని కూడా స్టార్స్ సినిమాల్లాగా సర్వ కళా సమ్మేళనం చేసుకోవచ్చు. తీసేది కోటి రూపాయల క్రైం జానరైనా, పదుల కోట్ల స్టార్ సినిమాల్లా వుండాలని కలలుగంటే, స్టార్ సినిమాలకి చీప్ నకళ్ళు తయారవుతాయి తప్ప, జానర్ స్పెసిఫిక్ సినిమాలు రావు. అదే టిక్కెట్ కి వైభవోపేతంగా స్టార్ సినిమాలు లభిస్తోంటే, చీప్ నకళ్ళతో ఆడియెన్స్ కేంపని? ఇదీ పాయింటు. 

డిటెక్టివ్- పోలీస్ డిటెక్టివ్ 
        కాబట్టి క్రైం జానర్ తో చీప్ నకళ్ళే కావాలో, ఒరిజినాలిటీ కావాలో ఎవరికి వారే నిర్ణయించుకుని బరిలోకి దిగాలి. ముందుగా ఐడియాతో ఈ స్పష్టత కొస్తే దానికి తగ్గ వ్యాపారం తెలుస్తుంది. వ్యాపార రేంజి తెలుస్తుంది. ఈ రేంజి చాలనుకుంటే అదే రేంజిలో తీసుకోవచ్చు. గొడవుండదు. దానికి తగ్గ ఫలితం ముందే తెలుస్తుంది కాబట్టి సమస్య వుండదు. ముందుగా క్రైం జానర్లో పైన అడిగిన ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ చూద్దాం. ‘డిటెక్టివ్ క్రైం థ్రిల్లర్’ అనడం జానర్ ని పిలవడంలో అస్పష్టతే అయినా, ఇందులో ప్రధానంగా ‘డిటెక్టివ్’ అనే పదం వుంది. అంటే నేర కథ. నేర కథల్లో డిటెక్టివ్ అంటే నేర పరిశోధన, దర్యాప్తు వగైరా. అంటే మిస్టరీ సబ్ జానర్. నేరాల్ని శోధించే నేర కథలు మిస్టరీ సబ్ జానర్ కింది కొస్తాయి. మిస్టరీ అంటే రహస్యంతో ముడిపడి వున్నది. అంటే ఒక నేరం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు అనే రహస్యం డిటెక్టివ్ తెలుసుకునే కథనంతో కూడిన కథావస్తువు.

        దీని జానర్ మర్యాదలేమిటో చూద్దాం: డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యుడు షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త అర్ధర్ కానన్ డాయల్ కాదు. ఎడ్గార్ అలెన్ పో. 1841 లో ఈయన రాసిన ‘మర్డర్స్ ఇన్ ది రూ మార్గ్’ చరిత్రలో మొదటి డిటెక్టివ్ కథ. ఈయన సృష్టించిన ఆగస్ట్ పైన్ మొదటి డిటెక్టివ్. ఈ ప్రసిద్ధ డిటెక్టివ్ కథా క్రమంలో ‘పో’ కల్పించిన ఎనిమిది దశల్ని తీసుకుని, షెర్లాక్ హోమ్స్ పాత్రని సృష్టించి, ‘ఏ స్టడీ ఇన్ స్కార్లెట్’ అని మొదటి డిటెక్టివ్ కథ 1887 లో రాశాడు డాయల్. డాయల్ తో సరిసమానమైన అగథా క్రిస్టీ కూడా ఆగస్ట్ పైన్ తోనే స్ఫూర్తి పొంది, హెర్క్యూల్ పైరట్ పాత్రని సృష్టిస్తూ, ‘ది మిస్టీరియస్ ఎఫైర్ ఇన్ స్టైల్స్’  అనే తన తొలి  డిటెక్టివ్ కథ 1920 లో రాసింది. 

        ‘పో’ రాసిన కథని హోమ్స్ పరిశీలించి ఫాలో అయిన ఎనిమిది  కథన దశలేమిటో చూద్దాం. ఈ దశలే ఆయన రాసిన చిన్న కథలతో బాటు నవలల్లో వుంటాయి. నవలల ఆధారంగా తీసిన సినిమాల్లోనూ వుంటాయి. 1. ముందుగా అనుచరుడు డాక్టర్ వాట్సన్ తో షెర్లాక్ హోమ్స్ పూర్వపు కేసులు చర్చిస్తూ కథా ప్రారంభం, 2. కొత్త క్లయంట్ వచ్చి సమస్య చెప్పుకోవడం, హోమ్స్  ఆ కేసు స్వీకరించడం, 3. క్లయంట్ ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు మొదలెట్టడం, ఒక కీలక ఆధారం దొరకడం, ఇది అంత ప్రధానం కాదన్నట్టుగా పాఠకులకి అన్పించేలా చేయడం, 4. వాట్సన్ ఆ ఆధారంతో పొరపాటు విశ్లేషణ చేయడం, 5. ప్రభుత్వ డిటెక్టివ్ ఇంకో ఫాల్స్ క్లూ ఇవ్వడం, ప్రభుత్వ డిటెక్టివ్ కాకపోతే దినపత్రికో, క్లయంటో, లేక కేసులో బాధితుడు లేదా బాధితురాలో, ఇంకో సాక్షియో ఆ ఫాల్స్ క్లూ నివ్వడం, 6. తర్జనభర్జనలతో కేసు అంతు చిక్కక వాట్సన్ అయోమయంలో పడ్డం, హోమ్స్ క్లూస్ అన్నిటినీ కలిపి ఊహాగానం చేస్తూ, నిర్ణయం చెప్పకపోవడం, 7. అనూహ్యంగా హోమ్స్ కేసుని బద్దలు కొట్టి దోషిని పట్టుకోవడం, 8. తను కనుగొన్న వాస్తవాలన్నిటినీ కలిపి హేతుబద్ధ వివరణ నిస్తూ ముగించడం. 


      ఏ  షెర్లాక్ హోమ్స్ కథైనా నవలైనా ఈ ఎనిమిది దశలతో టెంప్లెట్ గా వుంటుంది. కొమ్మూరి సాంబశివరావు రాసిన తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా ఇదే టెంప్లెట్ లో వుంటాయి. అగథా క్రిస్టీ ‘పో’ నే ఫాలో అయినా కొంత తేడా చూపిస్తూ ముందడుగేసింది. 1. ఒక హత్య జరుగుతుంది, హెర్క్యూల్ పైరట్ ప్రవేశిస్తాడు, 2. తన చుట్టూ కొందరు అనుమా నితులుంటారు, ప్రశ్నించడం మొదలెడతాడు, 3. ఒకరొకరుగా అనుమానితుల్ని ప్రశ్నిస్తూంటే ఆసక్తికర విషయాలు బయటపడుతూంటాయి, 4. ఎనాలిసిస్ చేసుకోవడం మొదలెడతాడు, 5. అనుమానితుల్లో కొందరి ప్రవర్తన, చర్యలు దృష్టి నాకర్షిస్తాయి, 6. ఇక ఫలానా అనుమానితుడు లేదా అనుమానితురాలు దోషి అని పట్టేసుకుంటాడు, 7. ఆ దోషి ఒక్కరే కావచ్చు, లేదా అనుమానితులందరూ దోషులు కావచ్చు, అసలు హత్య జరిగిందో లేదో కూడా తేలక పోవచ్చు, దోషిని పట్టుకోబోతే హత్యకి గురైన వ్యక్తే సజీవంగా దొరకవచ్చు!

        కానన్ డాయల్  క్లూస్ తో కేసుల్ని పరిష్కరిస్తే, అగథా క్రిస్టీ అనుమానితులతో ఆట చూపిస్తూ సర్ప్రైజ్ ముగింపుల్నిస్తుంది. ఈ తేడా గమనించాలి ఈ జానర్లో. డిటెక్టివ్ సాహిత్యానికి ‘పో’ సహా వీరిద్దరూ స్థిరీ కరించిన ఓవరాల్ జానర్ మర్యాద - రహస్యాన్ని దర్యాప్తు చేసేదే, ఛేదించేదే. ఇందువల్ల  నేర కథల్లో (క్రైం జానర్లో) ఇవి మిస్టరీ సబ్ జానర్లవుతున్నాయి. ఇందులో చివరి వరకూ దోషి ఎవరో తేలదు. దోషిని పట్టుకున్నాక అతడి మీద నేర నిరూపణ చేస్తూ డిటెక్టివ్ అనే వాడు మొత్తం మొదట్నుంచీ కేసు పూర్వాపరాలు పారాయణం చేస్తూ, దోషికాపాదించి తీర్పు చెప్తాడు. అంటే ఏది ఎందుకు జరిగిందో, ఎవరు ఎలా చేశారో చివరి వరకూ కథ పట్టుబడని ప్రక్రియ అన్నమాట. కాన్ఫ్లిక్ట్ తెలిస్తేనే కదా కథేమిటో తెలిసేది. కాన్ఫ్లిక్ట్ ని చివరికి వరకూ తోసేసి డిటెక్టివ్ విప్పి చెప్పినప్పుడు,  ఆ సస్పెన్స్ కథని ఎండ్ సస్పెన్స్ కథ అంటారు. అప్పారావు సుబ్బారావు దగ్గరి కొచ్చి, వచ్చిన పని చెప్పకుండా రెండు గంటలు సోది చెప్పి, చల్లగా ఫిఫ్టీ అప్పడగడాని కొచ్చానని అసలు విషయం చెప్తే, ఈడ్చి కొట్టాలన్పిస్తుంది సుబ్బారావ్ కి. ఈ విషయం ముందే చెప్పొచ్చుగా? 



        ఇలా ఎండ్ సస్పెన్స్ కూడా సుబ్బారావ్ సిండ్రోమే. కథేమిటో ముందే కాన్ఫ్లిక్ట్ చూపించకుండా, మూసి పెట్టిన కథ తాలూకు ఏవేవో కథనాలు చూపిస్తే ఎలా అర్ధమయ్యేది. స్క్రీన్ మీద రియల్ టైం స్టోరీ ప్రత్యక్షంగా నడవాలి. ఎండ్ సస్పెన్స్  అప్పటి నవలల్లో కాబట్టి సరిపోయింది. సినిమాల్లో సరిపోవడం లేదని హాలీవుడ్ ఆలస్యంగా గ్రహించింది. చదవడం వేరు, సినిమాగా చూడ్డం వేరు. పైగా సుమారు 1980 ల తర్వాత డిటెక్టివ్ సాహిత్యానికి కాలం చెల్లింది తెలుగు సహా. తరం మారిన నవ పాఠకులకి, నవీన ప్రేక్షకులకి చివరివరకూ కథ తెలియని వాదోపవాదాలేమిటో, ఆ క్లూక్లూ కూడబలుక్కుని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా సాగే, పడక్కుర్చీ మేధావి డిటెక్టివ్ కథలేమిటో నచ్చలేదు. యాక్షన్ తక్కువ, లెక్చర్ లెక్కువ. దీని బదులుగా యాక్షన్ తో కాన్ఫ్లిక్ట్ ఓరియెంటెడ్ గా కథ తెలిసిపోయి, సీన్ టు సీన్ సస్పెన్స్ నే కోరుకున్నారు. దీంతో పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలు కేవలం కాల్పనిక సాహిత్యంలో కన్పించేవే. విదేశాల్లో ప్రైవేట్ డిటెక్టివులు సమాజంలో తెలిసిన వ్యక్తులే అయినా, కాల్పనిక కథల్లో అంత పాపులర్ డిటెక్టివులు నిజ జీవితంలో ఎవరూ లేరు. ఇంకా నిజ జీవితంలో మెలిటా నార్వుడ్, వర్జీనియా హాల్, సిడ్నీ రీల్లీ మొదలైన పాపులర్ గూఢచారులున్నారు. ప్రైవేట్ డిటెక్టివులకి దర్యాప్తుల్లో పోలీస్ డిటెక్టివులకున్నంత యాక్సెస్ వుండదు. క్రైం సీన్లోకి కూడా వెళ్ళలేరు. పోలీస్ డిటెక్టివులకి ఫోరెన్సిక్  సైన్స్ కూడా అందుబాటులో వుంటుంది. డిటెక్టివ్ కథలకంటే  పోలీస్ డిటెక్టివ్ కథలు నేటి పాఠకులకి, ప్రేక్షకులకి వాస్తవికంగా అన్పించి వెంటనే కనెక్ట్ అవుతారు కూడా. 

మిస్టరీ కావాలా, థ్రిల్లర్ కావాలా?
        బ్రిటన్నుంచి రచయిత్రి రూత్ రెండెల్  ‘చీఫ్ ఇన్స్ పెక్టర్ రెగ్ వెక్స్ ఫర్డ్’ అనే పోలీస్ డిటెక్టివ్ పాత్రని సృష్టించి బాగా పాపులర్ చేసింది. ఆమెకెప్పుడూ అవార్డులే. 25 అవార్డులు పొందింది. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రతో 24 నవలలు రాసింది. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్ళు వుంటారు. ఒక కూతురితో సమస్యలే వుంటాయి. ఈ ఫ్యామిలీ సబ్ ప్లాట్ ప్రతీ నవల్లో క్యారీ అవుతూంటుంది.  పోలీస్ డిటెక్టివ్ ని ఫ్యామిలీ మ్యాన్ గా చిత్రించవచ్చు. మామూలు డిటెక్టివ్ కి ఫ్యామిలీ, పెళ్ళాం  పిల్లలూ, పిల్లీ మేకా అంటే కుదరదు. జానర్ మర్యాద కాదు. అతను ఎవర్ గ్రీన్ బ్యాచిలర్ గా తిరుగుతూ వుండాల్సిందే, ఇలాగే స్పై పాత్ర కూడా. తెలుగులో వచ్చిన ఏ డిటెక్టివ్ పాత్రకి కూడా ఫ్యామిలీ వుండదు. రూత్ రెండల్ రాసిన ‘ఎండ్ ఇన్ టియర్స్’ (2005) నవల్లో ఒక యాక్సిడెంట్ కేసు కథ, ఫ్యామిలీ ఉపకథ ఉత్తమంగా వుంటాయి. 

        డిటెక్టివ్ నవలలు పోయి పోలీస్ డిటెక్టివ్ నవలలు రాజ్యమేలుతున్నాయి ఇప్పటికీ కూడా. ఎడ్ మెక్ బెయిన్ ‘87 వ ఏరియా పోలీస్ స్టేషన్’ అని క్రియేట్ చేసి అందులో పోలీస్ డిటెక్టివ్ పాత్రలతో ఎన్నో నవలలు రాశాడు. స్టీవ్ కరెల్లా, అలివర్ వీక్స్, మేయర్ మేయర్ వంటి పోలీస్ డిటెక్టివ్ పాత్రలు పాఠకుల అభిమాన పాత్రలయ్యాయి. స్టీవ్ కరెల్లా చెవిటి మూగని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. సినిమాల విషయానికొస్తే ‘ఎల్ ఏ కాన్ఫిడెన్షియల్’, ‘హీట్’, ‘ఇన్ ది హీట్ ఆఫ్ ది నైట్’, ‘ది ఫ్రెంచ్ కనెక్షన్’, ‘డర్టీహేరీ’ సిరీస్, ‘బేవర్లీ హిల్స్ కాప్’ సిరీస్ వంటివెన్నో వచ్చాయి, వస్తున్నాయి. 


     ప్రైవేట్ డిటెక్టివ్ నవలలకీ పోలీస్ డిటెక్టివ్ సినిమాలకీ తేడా ఏమిటంటే, పోలీస్ డిటెక్టివ్ సినిమాలు ఎండ్ సస్పెన్స్ కథల్ని తీసి పక్కన పెట్టాయి, సీన్ టు సీన్ సస్పెన్స్ ని కనిపెట్టాయి. అంటే మిస్టరీ సబ్ జానర్ నుంచి విడిపోయి, క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి తెర తీశాయి. అంటే పోలీస్ డిటెక్టివ్ కథలు, సినిమాలు క్రైం థ్రిల్లర్సే తప్ప మిస్టరీలు కావన్న మాట.  మాస్ మార్కెట్ అయిన సినిమాల మీద గౌరవముంటే పనికొచ్చే ఈ తేడా గుర్తించాలి. ఈ తేడాతో ఈ క్రైం థ్రిల్లర్ అనే సబ్ జానర్ కి ఎండ్ సస్పెన్స్ కాకుండా, సీన్ టుసీన్ సస్పెన్స్ అనే కథన ప్రక్రియని చేపట్టారు. ఇదెలా వుంటుంది? ఎవరు చంపారో ప్రేక్షకులకి చూపించేస్తారు. పోలీస్ డిటెక్టివులకి తెలియకుండా దర్యాప్తు ప్రారంభిస్తారు. ప్లాట్ పాయింట్ వన్ లేదా ఇంటర్వెల్ కొచ్చేసరికల్లా ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ పోలీసులకి హంతకుడెవరో రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ణి పట్టుకోవడానికి యాక్షన్ ప్రారంభిస్తారు. వాడెలా దొరుకుతాడనేది సీను సీనుకీ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ, రియల్ టైంలో లైవ్ కథనం చేస్తారు. ఇందువల్లే ఇది చప్పటి ఎండ్ సస్పెన్స్ కథనం కాకుండా, వేడి పుట్టిస్తూ వుండే  సీన్ టు సీన్ సస్పెన్స్ అయింది. 

        అంటే, మిస్టరీలు కాకుండా వచ్చే అన్ని ఇతర సినిమాల్లో లాగే, ప్లాట్ పాయింట్ వన్ దగ్గరో, ఇంటర్వెల్లోనో కాన్ఫ్లిక్ట్ చూపించేసి కథేమిటో తేలిసేలా చేసేస్తారు. హీరోకి గోల్ ని ఏర్పాటు చేసి, గోల్ కోసం మిడిల్ సంఘర్షణ ప్రారంభిస్తారు. దీనివల్ల మిస్టరీలు తప్ప అన్ని జానర్ల సినిమాల్లో వుండే - కథేమిటో అర్ధమై, ఈ కథెలా ముగుస్తుందన్న ఇన్వాల్వ్ మెంట్ ని క్రియేట్ చేస్తారు. మిస్టరీ లొక్కటే అన్ని జానర్లు, సబ్ జానర్లూ కాదని సినిమాలకి నష్టాన్ని తెచ్చే ఎండ్ సస్పెన్స్ అనే ప్రింట్ మీడియా వ్యాపకంతో వుంటున్నాయి. 

        స్థూలంగా ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ తేడా ఏమిటంటే, ప్రైవేట్ డిటెక్టివ్ కథలు నేరాన్ని పరిశోధించడం గురించి, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుణ్ణి పట్టుకోవడం గురించి. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ నేరస్థుడెవరో (విలన్) తెలియని ఎండ్ సస్పెన్స్ పాసివ్ కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి వాణ్ణి పట్టుకునే యాక్టివ్ - యాక్షన్ కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చివరి వరకూ విలనే లేని, ‘నాకో విలన్ కావాలీ’ అని విలన్ ని వెతుక్కుంటున్నట్టు సాగే ఏకపక్ష కథలు, పోలీస్ డిటెక్టివ్ కథలు విలన్ తెరపైకొచ్చి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లేకి తెరతీసే ద్వైపాక్షిక కథలు. సినిమాలకి ఏది బావుంటుంది? ప్రైవేట్ డిటెక్టివ్ కథలు చిట్ట చివరికి డిటెక్టివ్ నేరస్థుణ్ణి కనుగొని, వాడిపై నేరాభియోగం చేసే కేసు పూర్వపరాల పారాయణంతో వుంటాయి, పోలీస్ డిటెక్టివ్ కథలు కేసు పూర్వాపరాలు ప్రేక్షకులకి తెలిసిపోయిన నేపథ్యంలో పారాయణం, ప్రసంగం, పచ్చి పులుసూ లేని పోలీస్ బ్యాంగ్ తో వుంటాయి. మాస్ మార్కెట్ అయిన సినిమాలకి ఏది బావుంటుంది? 

        చిట్టచివరికి సస్పెన్స్ విప్పి మొత్తం కథంతా ఎనాలిస్ చేస్తూ (రివ్యూ రైటర్ రివ్యూ రాసినట్టు), ముందు జరిగిన దృశ్యాల తాలూకు మాంటేజెస్, కట్ షాట్స్ వేస్తూ, ప్రేక్షకులకి గుర్తు చేస్తూ - చూశారా నా టాలెంట్ - అని దర్శకుడు థ్రిల్లానందం పొందవచ్చు, ప్రేక్షకులకది నిద్రానందాం. ఇంతసేపూ విలనెవరో దాచింది గాక, వాడి గురించి కతలు. 


షెర్లాక్ తాతతో సినిమాలు? 
        తెలుగుకి వద్దాం. తెలుగులో డిటెక్టివ్ సాహిత్యం 1980 లలోనే అంతరించి పోయింది. మధు బాబు యాక్షన్ ఓరియెంటెడ్ అడ్వెంచరస్ షాడో వచ్చేశాడు. కాబట్టి ఇప్పటి తరానికి డిటెక్టివులు తెలియరు. పైగా ఆ డిటెక్టివులు మనకి సాంఘిక మూలాలు లేని, సమాజంలో కన్పించని, కేవలం అప్పట్లో నవలల్లో కన్పించిన కాల్పనిక పాత్రలే. ఇప్పటి మేకర్లు షెర్లాక్ హోమ్స్ కి ఉత్తేజితులై తెలుగులోకి దింపేస్తున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్ కథలకీ, పోలీస్ డిటెక్టివ్ కథలకీ సినిమాల కొచ్చేసరికి తేడా లెలా వుంటాయో పైన తెలుసుకున్నాం. హాలీవుడ్ లో ప్రైవేట్ డిటెక్టివ్ సినిమాలొస్తున్నాయి కదా అంటే, వస్తున్నాయి. 2007 లో తీసిన ‘జోడియాక్’ కథని 1960-70 లలో స్థాపించి చూపెట్టారు. అందులో కార్టూనిస్టు అవసరార్ధం డిటెక్టివ్ అవతార మెత్తుతాడు. ఈ పరిశీలనలన్నిటి దృష్ట్యా, తెలుగు సినిమాలకి ఇంకా ప్రైవేట్ డిటెక్టివులే అవసరమో, లేక పోలీస్ డిటెక్టివులు కావాలో ఎవరికివారే నిర్ణయించుకోవాలి.

        తెలుగు సినిమాల్లో పోలీస్ అనగానే ఇంకా అదే మూసలో ఎస్సై పాత్రనే చూపిస్తున్నారు. ఏ కథకైనా ఎస్సైనే. మామూలు పోలీస్ స్టేషన్నుంచి పోలీస్ శాఖలో ఇంకో  విభాగమైన క్రైం బ్రాంచ్ ని తెరపైకి తేవడం లేదు. ఆనాటి డిటెక్టివ్ నవలల్లో డిటెక్టివ్ కి సాయంగా పోలీస్ డిటెక్టివ్ పాత్ర వుండేది. కొమ్మూరి నవలల్లో డిటెక్టివ్ యుగంధర్ పాత్రకి పోలీస్ డిటెక్టివ్ పాత్ర - డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు పాత్ర. సినిమాల్లోకి మాత్రం ఈ సాంఘిక మూలలున్న, ప్రేక్షకులు గుర్తించగల్గే, పోలీస్ డిటెక్టివ్ పాత్రలు దిగిరాలేదు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ అనే పాత్ర సినిమాల్లో ఎక్కడా చూడం. ప్రభుత్వ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లని వదిలేసి, ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్ లంటూ తాతల కాలం నాటి షెర్లాక్ హోమ్స్ ని కాపీ కొడుతూ కృతకంగా తీస్తారట.

        ఈ వ్యాసంలో క్రైం జానర్లో సబ్ జానరైన మిస్టరీ (డిటెక్టివ్) తో, క్రైం జానర్లోనే ఇంకో సబ్ జానరైన క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) తోనూ వున్న లాభ నష్టాలు తెలుసుకున్నాం. వచ్చే వ్యాసంలో మిస్టరీని వదిలేసి, క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్ని విపులంగా చూద్దాం.

సికిందర్