రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, March 4, 2019

794 : రివ్యూ



కథ, దర్శకత్వం : ఇంద్ర కుమార్
తారాగణం : అజయ్ దేవణ్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అర్షద్ వార్సీ, రీతేష్ దేశ్ ముఖ్, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా, జానీ లివర్, అలీ తదితరులు
రచన : వేద్ ప్రకాష్, పరితోష్ పెయింటర్, బంటీ రాథోడ్, గౌరవ్ – రోషిన్, ఛాయాగ్రహణం : కికో నకహారా
***
          1990 లో ‘దిల్’ తో దర్శకుడైన ఇంద్రకుమార్ ఇంకా సినిమాలు తీస్తూ కొత్త తరం ప్రేక్షకుల్ని ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో 2007 లో ‘ఢమాల్’,  2013 లో ‘గ్రాండ్ మస్తీ’ అనే కామెడీలు తీసి సక్సెస్ అయ్యాడు. ఈ రెండు సక్సెస్ లు పట్టుకుని వాటి సీక్వెల్స్ తీస్తూ పోయాడు. యాక్షన్ కామెడీ ‘ఢమాల్’ కి సీక్వెల్ గా ‘డబుల్ ఢమాల్’ తీసి తిరిగి ఇప్పుడు మరో సీక్వెల్ గా ‘టోటల్ ఢమాల్’ తీశాడు. ఈ మూడు ఢమాల్స్ హిట్టవడం ఒక సంచలనం. ప్రస్తుత ఢమాల్ మూడు రోజుల్లోనే వందకోట్లు రాబట్టి, వారం తిరిగే సరికల్లా ఇంకో వంద కోట్లతో పెద్ద హిట్ కొట్టింది. ఇంత అర్ధం పర్ధం లేని పాత తరహా మైండ్ లెస్ కామెడీకి ఇంత సక్సెస్ ఏమిటబ్బా అని తలలు పట్టుకుంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. ఇంద్ర కుమార్ తీరిగ్గా కూర్చుని ఇంటర్వ్యూ లిస్తున్నాడు. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మైండ్ లెస్ కామెడీలో ఏముంది?  ఇది తెలుసుకోవడానికి ఈ పిచ్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్దాం... 

కథ 
     గుడ్డూ (అజయ్ దేవగణ్), జానీ (సంజయ్ మిశ్రా) ఇద్దరూ తోడు దొంగలు. పోలీస్ కమీషనర్ మల్లిక్ (బొమన్ ఇరానీ) రద్దయిన నోట్ల దందా చేస్తూంటే యాభై కోట్లు కొత్త నోట్లు కొట్టేసి పారిపోతారు. డ్రైవర్ పింటూ (మనోజ్ పహ్వా) వీళ్ళని దెబ్బ కొట్టి ఆ డబ్బుతో తను పారిపోతాడు. 

          అవినాష్ (అనిల్ కపూర్), బిందూ (మాధురీ దీక్షిత్) లు విడాకుల కేసులో కోర్టులో వుంటారు. కీచులాడుకుని విడాకులు పొందుతారు. విడాకులు మంజూరు చేసి కొడుకు ఎవరి దగ్గర వుండాలో  అతన్నడిగి తేల్చుకోవాలని తీర్పు ఇస్తాడు జడ్జి. కీచులాడుకుంటూనే కొడుకు దగ్గరికి బయల్దేరతారు ఇద్దరూ. 

          లల్లన్ (రీతేష్ దేశ్ ముఖ్), ఝింగుర్ (పితోబాష్ త్రిపాఠీ) లు ఫైర్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు. పైన బిల్డింగ్ తగులబడుతూంటే కింద వల పట్టుకుని ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వాళ్ళు ముందు దూకాలని కండిషన్ పెడతారు. లక్ష ఇచ్చిన వాడు దూకగానే ఆఫీసర్లు వచ్చి పట్టుకోబోతారు. ఇద్దరూ పరారవుతారు. 

          ఆదిత్య (అర్షద్ వార్సీ), మానవ్ (జావేద్ జాఫ్రీ) అన్నదమ్ములు. ఒక పురాతన వస్తుశాలలో ఉద్యోగాలున్నాయంటే వస్తారు. ఓనర్ పన్లోకి తీసుకుని, గ్యాలరీ క్లీన్ చేయమంటే మొత్తం పగులగొట్టి క్లీన్ చేశామంటారు. ఓనర్ పట్టుకోవడానికి వెంటబడితే అతడి ఆటోమేటిక్ కారెక్కి పారిపోతారు. 

          డబ్బు కొట్టేసిన పింటూ విమానమెక్కి,  విమానం నడుపుతున్నవాడు ఎవరో మెంటల్ కావడంతో విమానం కూలి కిందపడతాడు. కొడుకు దగ్గరికి ప్రయాణిస్తున్న అవినాష్ - బిందూలు ఇది చూసి ఆగుతారు. తమ పరిస్థితుల వల్ల పరారవుతున్న లల్లన్ – ఝింగుర్, ఆదిత్య – మానవ్ లు కూడా ఇక్కడికే వచ్చి ఆగుతారు. కొన ప్రాణాలతో వాళ్లకి డబ్బు రహస్యం చెప్పేస్తాడు పింటూ. ఇంతలో గుడ్డూ, జానీలు కూడా వచ్చి వినేస్తారు. పోలీస్ కమిషనర్ మల్లిక్ కూడా వచ్చి వినేస్తాడు. పింటూ చచ్చిపోతాడు. జనక్ పూర్ జూలో దాచి పెట్టిన ఆ యాభై  కోట్లు అందరూ కలిసి పంచుకోవడం దగ్గర వాటాలు కుదరక  పోటీ పెట్టుకుంటారు. పోటీలో ఎవరు ముందు జూకెళ్తే వాళ్ళదే డబ్బు. 

          ఈ పోటీలు ఎలా పడ్డారు? ఏమేం కష్టాలు అనుభవించారు? జూకి ఎవరు ముందు చేరుకున్నారు? లేక అందరూ ఒకేసారి వెళ్లి పడ్డారా? జూలో ఎదురైన ఇంకో పరిస్థితేమిటి? చిన్నప్ప స్వామి (మహేష్ మంజ్రేకర్) తన గ్యాంగుతో జంతువుల మీద ఏం కుట్ర చేశాడు? ఈ మిగతా కథ తెలియాలంటే వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ 
       మైండ్ లెస్ కామెడీ జానర్. హిందీలో స్టార్ ఎట్రాక్షన్ వుంటే మైండ్ లెస్ కామెడీలు హిట్టవుతున్నాయి. ‘గోల్ మాల్’ సిరీస్ కూడా ఇలాగే హిట్టయ్యాయి. 2007 లో ‘ఢమాల్’ తీసినప్పుడది 1963 నాటి ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కి కాపీ. తెలుగులో ‘కిష్కింధ కాండ’ గా తీశారు. ‘ఢమాల్’ కథని పొడిగిస్తూ 2011 లో ‘డబుల్ ఢమాల్’ తీశారు. ఇప్పుడు తీసిన ‘టోటల్ ఢమాల్’ ని ‘ఇట్సే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్’ కే ఇంకో వెర్షన్ గా సీక్వెల్ చేశారు. కాబట్టి రిపీటయిన కథే కథనం మార్చిన సీన్లతో కన్పిస్తుంది. ఐతే ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్ గా కూడా పనిచేస్తోంది చివర్లో జూలో జంతువులతో కామెడీలతో కలుపుకుని. 

 ఎవరెలా చేశారు 
     అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్, రీతేష్ దేశ్ ముఖ్ లాంటి స్టార్లు సిగ్గుపడకుండా అర్ధం పర్ధంలేని  పిచ్చి కామెడీలన్నీ చేశారు. సిట్యుయేషన్స్ మైండ్ లెస్ గానే వుంటాయి, ఆ సిట్యుయేషన్స్ లో పేలే డైలాగులే నవ్విస్తూంటాయి... ‘వాళ్లకి తెలీదేమో నన్ను మించిన కుక్క లేదని’, ‘డబ్బు లాగే దాకా వదలను’, ‘డబ్బు లాగేక ఎందుకు వదులుతావ్ డబ్బు?’, ‘ఇది నీ రోప్ (తాడు) అనుకో - ఇదే నీ లాస్ట్ హోప్’, ‘స్ట్రగుల్ చేయడానికి రాలేదు - సెటిల్ అవడానికి వచ్చాం’, ‘నీకు అవినాశ్ అని పేరెవరు పెట్టారు -నువ్వు సత్తెనాశ్ వి’, ‘మేకల్ని బలిస్తారు - పులుల్ని కాదు’, ‘ఇది నీకు టార్చర్ - నాకు వామప్ అనుకో’,  ‘హైదరాబాదీలంటే బిర్యానీతోనే ఐడెంటిఫై కారు -  ఖుర్బానీలతో  (ప్రాణత్యాగాలతో) కూడా ఐడెంటిఫై అవుతారు’, ‘మూన్నాళ్ళ జీవితం ఇవ్వాళ్ళ మూడో నాడు’, ‘పరిస్థితి ఎమర్జెన్సీ గా వుంది - వాతావరణం భయానకంగా వుంది - ఈ ఛాన్సు లక్కు మార్చుకోవడానికుంది’, ‘ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు- మన చేత తన్నులు తిన్నవాళ్ళు -  వాళ్ళ చేతిలో తన్నులు తిన్న వాళ్ళం’, ‘ప్రపంచంలో గుండె బలం లేనోళ్ళు  మన దేశంలో తండ్రులే’, ‘మిడిల్ క్లాస్ వాణ్ని ప్రావిడెంట్ ఫండ్  డబ్బులడగడం వాడి కిడ్నీ అడగడం లాంటిదే’, ‘సాధారణ వడ్డీ -  చక్రవడ్డీ ఎలా లెక్కిస్తారు?....ఇలా అంతుండదు.  

          అరవ మాయగాడుగా అలీ, విమానాలు అద్దెకిచ్చే వాడుగా జానీ లివర్ కన్పించి గోల కామెడీ చేస్తారు. సోనాక్షీ సిన్హా ఒక ఐటెం సాంగ్ లో కన్పిస్తుంది. జూ ఓనర్ గా ఈషా గుప్తా వుంటుంది. ఈమె సెక్యురిటీ గార్డుగా క్రిస్టల్ ది మంకీ అనే చింపాంజీ వుంటుంది.  

          ప్రొడక్షన్ విలువలు, మేకింగ్ రిచ్ గా వున్నాయి. ఉత్తరా ఖండ్ కొండ ప్రాంతాల ఔట్ డోర్ లొకేషన్స్ అద్భుతంగా వున్నాయి. రెండు గంటల సేపూ ఔట్ డోర్ అడ్వెంచర్ గానే సాగుతుంది సినిమా. పాటలు పెద్ద గొప్పగా లేవుగానీ, ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం, వీఎఫ్ఎక్స్ ఉన్నతంగా వున్నాయి. కామెడీగా వుండే యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో వేగం థ్రిల్ చేస్తుంది. 

చివరికేమిటి 
      ఇప్పుడు కూడా పాత ఇంద్రకుమార్ కొత్త దర్శకులకి తీసిపోని విధంగా మేకింగ్ చేయడం ఒక గొప్ప విషయం. ఎక్కడా చీప్ లుక్, లూజ్ మేకింగ్ రానివ్వలేదు. కామెడీలో పంచ్ ని ఏ షాట్స్ పెట్టి తీయాలో అలా తీసి కెమెరాతో కూడా నవ్వించాడు. ఔట్ డోర్ లొకేషన్స్ లో హీమాన్ క్యారెక్టర్లతో వెస్టర్న్ ఫీల్ తీసుకొచ్చాడు. కామెడీకి లాజిక్ అవసరం లేదు. కానీ ఆ కామెడీ పుట్టడానికి కారణమైన బేస్ లాజికల్ గా వుండి తీరాలి. పోలీస్ కమీషనర్  దగ్గర యాభై కోట్లు కొట్టేయడం లాజికల్ బేసే. దీన్నాధారంగా చేసుకుని ఎంత పిచ్చి కామెడీ అయినా చేసుకోవచ్చు. అందుకని విమానాలు అద్దె కిచ్చే సీను, హెలీ కాప్టర్ కి గాలి చక్రం లేకపోతే  ఫ్యాను తగిలించి ఎగరేసే సీను లాంటివెన్నో చెల్లిపోయాయి. ఊబిలో కూరుకు పోతున్న వాణ్ణి  తాడు అనుకుని పాముని విసితే, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబ్రాకే (వాడి బరువుకి పాము మధ్యకి తెగిపోదా అనే ప్రశ్న అనవసరం) సీను, జూ నైట్ సీన్ క్లయిమాక్స్ లో ఏనుగు, దాని పిల్ల, చింపాంజీ, దాని పిల్ల, సింహం, దాని పిల్లలతో ప్రమాదంలో పడి - మదర్ సెంటి మెంట్లు రెచ్చగొట్టి బయటపడే కామెడీ సీన్లూ....ఇలా ప్రతీ చోటా పిచ్చి పిచ్చి కామెడీలు చేయిస్తూ పోయాడు స్టార్లతో.  సిట్యుయేషన్స్ సిల్లీనే, వాటికి పేల్చుకునే డైలాగులే పిచ్చ కామెడీ. 

          ఇంకోటేమిటంటే, అందరు నటుల్నీ కలిపి ఎక్కడా గుంపు కామెడీ చేయలేదు. డబ్బు కోసం అందరూ పోటీ పడి ఒకే గుంపుగా వెళ్లి వుంటే, ఆ గుంపు సీన్లు కాసేపటికి బోరు కొట్టి విషయం అయిపోయేది. ముందుగా ఎలా ఇద్దరిద్దరు కలిసి పారిపోయి వచ్చారో, డబ్బు రహస్యం తెలిశాక అలాగే  ఇద్దరిద్దరు చొప్పున విడివిడిగా ప్రయాణాలు సాగిస్తారు. అప్పుడు అనిల్ కపూర్ - మాధురీ దీక్షిత్, అజయ్ దేవగణ్ - సంజయ్ మిశ్రా, రీతేష్ దేశ్ ముఖ్ - పితోబాష్ త్రిపాఠీ, అర్షద్ వార్సీ - జావేద్ జాఫ్రీ, బోమన్ ఇరానీ - విజయ్ పాట్కర్ ఐదు జంటలూ విడివిడి ప్రయాణాలు చేస్తూ, ఐదు ఎపిసోడ్లుగా ఏ జంటకా జంట విడివిడి కామెడీలు చేసుకుంటూ పోతారు. జూతో సహా ఇలా విడివిడి కష్టాల కామెడీలు చూపించడం వల్ల మొనాటనీకీ, బోరుకీ వీల్లేకుండా బయటపడిందీ రెండు గంటల మైండ్ లెస్ కామెడీ. కథని  ఈ విధంగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంతో వ్యాపారాత్మకంగా చెల్లుబాటైందీ మల్టీ స్టారర్ ఎంటర్ టైనర్.

సికిందర్
Watched at Inox Gvk One, B. hills
At 7.30 pm, Feb 25, 2019


Monday, February 25, 2019

793 : రివ్యూ



రచన - దర్శకత్వం : ఆదిత్యా ధార్
తారాగణం
: విక్కీ కౌశల్, యామీ గౌతం, మోహిత్ రైనా, పరేష్ రావల్ తదితరులు
సంగీతం : శాశ్వత్ సచ్ దేవ్, ఛాయాగ్రహణం : మితేష్ మీర్చందానీ
కూర్పు : శివకుమార్, పణిక్కర్, కళ : నీనద్ జెరో, యాక్షన్ : స్టీఫాన్ రిచర్
బ్యానర్ :  ఆర్ ఎస్ విపి మూవీస్
నిర్మాత :  రోనీ స్క్రూ వాలా
***
          ర్జికల్ స్ట్రయిక్ మీద తొలి సినిమా ‘యూరీ - ది సర్జికల్ స్ట్రయిక్’ కి మైలేజీ పెరిగింది. పుల్వామా దాడితో తిరిగి వసూళ్లు పుంజుకుని హౌస్ ఫూల్స్ తో నడుస్తోంది. తెలుగు డబ్బింగ్ కూడా చేసి వుంటే ఇంకా బావుండేది. అయితే ఈ మూవీ జరిగింది జరిగినట్టు చూపించడం వరకే చేసిందా, సర్జికల్ స్ట్రయిక్ జరిపినప్పటికీ మార్పు లేని పరిస్థితిని ఎత్తి చూపిందా, పరిస్థితిలో మార్పు లేకపోతే  ఇంకేం చేయాలో సూచించిందా అన్న ప్రశ్నలు పక్కన బెట్టి – ఒక సినిమాగా ఇది ఎంతవరకూ కాన్సెప్ట్ కి న్యాయం చేయగల్గిందో చూద్దాం. చెప్పినంత జోష్ నిజంగా వుందా, లేక హోష్ లేని జోష్ తో మైమరిపించారా ఒకసారి పరిశీలిద్దాం...

కథ 
     మణిపూర్ లో నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - కె (ఎన్ ఎస్ సి ఎన్ - కె) తీవ్రవాదులు భారత సైన్యం కాన్వాయ్ మీద దాడి జరిపి సైనికుల్ని చంపేస్తారు. దీంతో పారా ఎస్ ఎఫ్ మేజర్ విహాన్ (విక్కీ కౌశల్) తన దళంతో పక్క దేశం మయన్మార్ లోకి జొరబడి, ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల్ని నాయకుడితో సహా చంపేసి వస్తాడు. ఇక రిటైర్మెంటు తీసుకుని ఢిల్లీలో అల్జైమర్స్ తో బాధపడుతున్న తల్లి (స్వరూప్ సంపత్) దగ్గర వుండాలని కోరుకుంటాడు. ప్రధాని (రజిత్ కపూర్) ఇలా కాదని, దేశానికి నీ సేవలు అవసరమని, ఢిల్లీలోనే రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు. ఆక్కడ ఆఫీసు పని చూసుకుంటూ తల్లితో వుంటాడు. నర్సుగా జాస్మిన్ అల్మీడా (యామీ గౌతమ్) వస్తుంది. విహాన్ కి  సోదరి, మేనకోడలు, సైన్యంలోనే వున్న బావ వుంటారు. 

          ఇలా వుండగా, కాశ్మీర్లోని యూరీ లో, బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ మీద టెర్రరిస్టులు దాడి జరిపి నిద్రలో వున్న19 మంది సైనికుల్ని చంపేస్తారు. ఈ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతో పాక్ కి బుద్ధిచెప్పాలని రక్షణ శాఖ నిర్ణయించుకుంటుంది. ప్రధాని (రజిత్ కపూర్),  హోంమంత్రి (నవతేజ్
హుండాల్), రక్షణ మంత్రి  రవీంద్ర అగ్నిహోత్రి (యోగేష్ సోమన్),, ఆర్మీ చీఫ్ జనరల్ అర్జున్ సింగ్ రజావత్ (శిశిర్ శర్మ), జాతీయ భద్రతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ (పరేష్ రావల్) లు సమావేశమై పాక్ మీద సర్జిల్ స్ట్రయిక్ జరపాలని నిర్ణయం తీసుకుంటారు. దీని బాధ్యత మేజర్ విహాన్ కి అప్పగిస్తారు. టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన సైనికులు ఎక్కువ మంది బీహార్, డోగ్రా రెజిమెంట్లకి చెందిన వారు. ఈ రెజిమెంట్ల నుంచే దళాన్ని ఎంపిక చేసుకున్న మేజర్ విహాన్, సరిహద్దుదాటి పాక్ టెర్రరిస్టుల స్థావరాలని ఎలా తుదముట్టించి వచ్చాడన్నది  మిగతా కథ.

ఎలా వుంది కథ
     సెప్టెంబర్ 29, 2016 న భారత ప్రభుత్వం యూరీకి ప్రతీకారంగా పాక్ మీద చర్య తీసుకునే వరకూ, సర్జికల్  స్ట్రయిక్ అన్న పదం ఎవరికీ తెలీదు. అలాటివి జరుగుతాయని కూడా తెలీదు. 2008 -11 మధ్య మూడు సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగినప్పుడు ఆర్మీ కోరికమీద అప్పటి ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ       సారి ప్రభుత్వం బయట పెట్టి ప్రచారం చేసుకోవడంతో, సర్జికల్ స్ట్రయిక్ అనే ఆర్మీ వ్యూహ మొకటుందని అందరికీ తెలిసిపోయింది. దీంతో ఈ సినిమా తీయడానికి అవకాశమేర్పడింది. ఇంతవరకూ బాలీవుడ్ కూడా వూహించి వుండదు, యుద్ధ కథల్లో ఇలాటి కథ కూడా ఒకటుంటుందని. 

          దీన్ని ఫార్ములాకి దూరంగా రియలిస్టిక్ గా తీశారు. అయితే వాస్తవంగా జరిగిందానికి కల్పనని జోడించారు. సినిమాటిక్ గా ఈ కల్పనని జోడిస్తున్నప్పుడు అసంపూర్ణ కథనం చేశారు. దీంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక, “how’s the josh?” అని మేజర్ అడిగినప్పుడు “high sir!” అని దళం బదులిస్తే, మనకి అంత జోష్ ఏమీ అన్పించదు. జోష్ నిచ్చే  ముఖ్యమైన పాత్ర ఒకటి మిస్ కావడం వల్ల. ఐతే ఈ కథలో జోష్ ని నింపడానికి దేశభక్తి నినాదాల జోలికి పోలేదు.

ఎవరెలా చేశారు 
      ‘మన్మర్జియా’ క్రేజీ బాయ్ ఫ్రెండ్ విక్కీ కౌశల్ మేజర్ విహాన్ పాత్రలో పకడ్బందీగా నటించాడు. కుటుంబ జీవితం, వృత్తి జీవితం - ఈ రెండు పార్శ్వాలకి భావస్పోరక నటనలతో వేరియేషన్స్ చూపాడు. పూర్తి కాన్ఫిడెన్స్ తో కొత్త దర్శకుడు దృశ్యాల్ని చిత్రీకరించే తీరు, వాటికి తోడ్పడ్డ విజువల్, సౌండ్, యాక్షన్  ఎఫెక్ట్స్, మేకప్, కాస్ట్యూమ్స్, కళా దర్శకత్వం  వగైరా హంగులన్నీ విక్కీ కౌశల్ పాత్ర ప్రెజెంటేషన్ని ఉన్నతంగా చేశాయి. పాత్ర ప్రెజెంటేషన్ ప్రేక్షకుల్ని ఆలోచనాత్మక మూడ్ లోకి నెట్టేసిందంటే ఆ పాత్రచిత్రణ విజయం సాధించినట్టే. కాకపోతే ఈ పాత్రకి ప్రతినాయక పాత్ర లేదు, సినిమాటిక్ గా ఇదే పెద్ద లోపం.        

          ఇతర పాత్రల్లో యామీ గౌతమ్, పరేష్ రావల్ ల పాత్రలకి ఎక్కువ ఫుటేజీ ఇచ్చారు. యామీ గౌతమ్ నర్సు రూపంలో వున్న ఇంటలిజెన్స్ ఏజెంట్ పల్లవీ శర్మగా, ఆ తర్వాత సర్జికల్ ఆపరేషన్ కో ఆర్డినేటర్ గా కన్పిస్తుంది.  జాతీయ భద్రాతా సలహాదారు గోవింద్ భరద్వాజ్ గా పరేష్ రావల్, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి నమూనా పాత్ర. సెల్ ఫోన్లు విరగ్గొట్టే తిక్క వుంటుంది. 

          ప్రధాని మోడీ గెటప్ లో,
హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ గెటప్ లో, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరికర్ గెటప్ లో నటులు ఫర్వాలేదు గానీ, అటు వైపు పాక్ యంత్రాంగాన్ని కామెడీగా చూపించారు. ఐఎస్సై చీఫ్ నైతే మరీ జోకర్ లా చూపించారు. విలన్స్ ని తక్కువ చేసి చూపిస్తే సినిమాలో హీరోయిజానికి జోష్ ఏముంటుంది. వాళ్ళెంత కర్కశులో చూపిస్తేనే ప్రేక్షకులకైనా కచ్చి రేగుతుంది. సోషల్ మీడియాలో వాళ్ళని ఎంతైనా ఆడుకుని తృప్తి పడొచ్చు, సినిమాలో పచ్చిగా చూపించకపోతే కచ్చి లేదు. 

          45 కోట్ల బడ్జెట్ కి మేకింగ్ పరంగా అద్భుతమనే చెప్పొచ్చు. కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్, ఎడిటింగ్, డైలాగ్ ఎడిటింగ్ వగైరా సాంకేతికాలు ఉన్నతస్థాయిలో వున్నాయి. లొకేషన్స్, భవనాలు, వాహనాలు, ఆయుధాలు కథకి తగ్గ సహజత్వంతో వున్నాయి. యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతంగా వున్నాయి. లొకేషన్స్ ని సెర్బియాలో చీట్ చేశారు. టెక్నికల్ గా వండర్ గా వున్న ఈ వార్ మూవీ, కళా పరంగా అంత బలంగా లేదు.  

చివరికేమిటి 
     ఫస్టాఫ్ ఎన్ ఎస్ సి ఎన్ - కె తీవ్రవాదుల దాడి, మయన్మార్ లో మేజర్ విహాన్ ప్రతి దాడులతో ప్రారంభమవుతుంది. ఇది 2015 లో జరిగిన నిజ సంఘటనే. సర్జికల్ స్ట్రయికే. కానీ అప్పట్లో దీన్ని వెలుగులోకి తేలేదు ప్రభుత్వం. అయితే  2016 లో పాక్ మీద సర్జికల్ దాడికి ప్రభుత్వానికి ఇదే స్ఫూర్తి నిచ్చింది వాస్తవానికి. కానీ సినిమాలో ఇంకేవేవో ఆప్షన్స్ మాట్లాడుకుంటారు ప్రభుత్వ పెద్దలు. చివరికి సర్జికల్ దాడినే నిర్ణయిస్తారు. అనవసర డ్రామా. ఈ నిర్ణయించినప్పుడు, పాక్ కి తెలియకుండా రహస్యంగా జరపాలనుకుంటారు. దాడి తర్వాత పాక్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వుంటుందనీ, చెప్పుకుంటే తాము టెర్రరిస్టుల్ని పోషిస్తున్నట్టు చెప్పుకోవడమే అవుతుందనీ సంతృప్తి పడతారు. కానీ అటు పాక్ లో క్షేత్ర స్థాయి పరిస్థితిని గమనంలోకి తీసుకోవాలనుకోరు. 

           వాస్తవంలోనైతే  ప్రభుత్వం ఈ దాడికి అనుమతించే ముందు యూరీ ఘటన నేపధ్యంలో సరిహద్దులో పాక్ ఎంత అప్రమత్తంగా వుంటుంది, టెర్రరిస్టు క్యాంపులు లేకుండా ఎంత జాగ్రత్తపడుతుందీ వగైరా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంది. అప్పుడే జాగ్రత్తగా ప్లాను చేసి మెరుపు దాడి జరిపింది. సినిమాలో ఆషామాషీగా వుంది. శాటిలైట్ ఛాయాచిత్రాలతో లాంచింగ్ ప్యాడ్స్ (టెర్రరిస్టుల క్యాంపులు) ఉనికినీ, నాల్గు డ్రోన్స్ తో అక్కడి దృశ్యాలనీ సేకరించి ప్లానింగ్ చేసేస్తారు. బలాబలాల సమీకరణ లేదు. అవతలి బలమెంతో ప్రేక్షకులకి చూపించాలనుకోరు. ఏకపక్ష ఆపరేషన్ తో ఏం మజా వస్తుంది. 

          అవతలి పక్షం ఒక సీను చూపిస్తారు  - ఐఎస్సై, మిలిటరీ,  ప్రధాని - ఇండియాని తేలికగా తీసుకుంటారు. వాళ్ళేం చేస్తారు, నాల్రోజులు క్రికెట్ ని, ఫిలిం స్టార్స్ ని బ్యాన్ చేసి ఆ తర్వాత మర్చిపోతారని నవ్వుకుంటారు. నిజమా? అవతల మైండ్ సెట్స్ ఏమిటో రీసెర్చి చేశారా? లేక ఇలా మన మైండ్ సెట్ ని బయట పెట్టుకున్నారా? సెన్సార్ లో వుండాల్సిన సీను కాదిది. చాలా యుద్ధ, టెర్రర్ సినిమాల్లో ఇదే పరిస్థితి - సొంత బలహీనతలనే బయటపెట్టుకోవడం. 

          సర్జికల్ దాడి గురించి వార్తల్లో వచ్చింది వచ్చినట్టు చూపిస్తే సినిమా ఎలా అవుతుంది. అవతలి పక్షాన్ని కామెడీ చేసి ఏకపక్ష - వన్ వే కథనం చేస్తే డాక్యుమెంటరీయే అవుతుంది. యూరీ ఘటనకి తన మీద సర్జికల్ దాడి జరిపించుకున్న పాక్ నిజంగా ఏమీ చేస్తూ కూర్చోలేదా? అవతల వాళ్ళేం చేస్తూ కూడా విఫలమయ్యారో రీసెర్చి చేసి వుంటే, ఈ కథ ఓ కథగా బలాన్ని సంతరించుకునేది. 

          బిన్ లాడెన్ ని చంపిన కథతో తీసిన ‘జీరో డార్క్ థర్టీ’ - మీడియా కూడా చేయని రీసెర్చి చేసి ఆ రాత్రి బిన్ లాడెన్ వైపు కూడా ఏం జరుగుతోందో చూపించారు. పైగా మీడియాకి  తెలీని సీఐఎ గూఢచారిణి కూడా కీలక పాత్ర పోషించిందని రీసెర్చి లో తెలుసుకుని, ఆ పాత్రని కూడా  సృష్టించారు. కథగా రక్తి కట్టించడానికి ఏం తగ్గిందో తెల్సుకుని దాన్ని పొందు పర్చాల్సిందే. ఈ సినిమాలో అవతలి పక్షపు ఈ విలనీయే  మొత్తం తగ్గిపోయింది.

    పాకిస్తాన్ వాళ్ళేదో కనుక్కుని అడ్డుకున్నట్టు ఒక సీను చూపిస్తారు. నిజానికి ఇటు వైపు ఇండియన్ దళం హెలికాప్టర్స్ లో వెళ్లి దాడి చేయడానికి సిద్ధమవుతూ వుంటారు. దాని కనుగుణంగా హెలీకాప్టర్స్ కి పాక్ రంగులు వేసేస్తారు. ఈ ఛాయా చిత్రాలు పాక్ మిలిటరీకి అంది అప్రమత్తమై పోతారు. దీంతో ఇండియన్ ప్లాను కుప్పకూల్తుంది. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే లో ప్లాట్ పాయింట్ టూ కి ఒక విషమ ఘట్టం అవసరమే. కానీ ఇది కాన్సెప్ట్ నే దెబ్బతీసింది. 

          వాస్తవంలో ఇండియా కాప్టర్ స్ట్రయిక్ ని ప్లాన్ చేయలేదు. వాస్తవాధీన రేఖ దగ్గర దళాల్ని ఏర్ డ్రాప్ చేసి  కాలి నడకన పంపించడాన్నే ప్లాన్ చేసి, తుచ తప్పకుండా అమలు చేశారు. హెలీకాప్టర్స్ తో క్రాస్ చేస్తే దొరికిపోయి యుద్ధానికే దారి తీస్తుంది. గుట్టు రట్టు కానివ్వలేదు. కాలినడకన జొరబడి నైట్ విజన్ రెయిడ్ నే ప్లాన్ చేసి షాకిచ్చారు. వాళ్లకి తెలిసేలోగా చంపి వచ్చేశారు. వాళ్ళు తెల్లారి తెలుసుకుని లబోదిబో మన్నారు. సర్జికల్ స్ట్రయిక్ అంటే, దొడ్డి దారిన ఇంట్లోకి వెళ్లి, నిద్రపోతున్న వాణ్ని లేపి, లెంపకాయ కొట్టి పారిపోయి రావడమే. ఇంట్లో వున్న వాడికి ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో అర్ధంగాక పోవడమే. 

          సినిమాలో అల్లరి చేసుకుంటూ వెళ్తారు. టెర్రరిస్టుల క్యాంపుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా గట్టిగా బూట్ల చప్పుడుతో పరిగెడుతూ, చప్పుడయ్యేలా గేట్లూ తలుపులూ తీసుకుంటూ, సామాన్లు పడేసుకుంటూ వెళ్తారు.  టెర్రరిస్టులు నిద్ర లేవరా? ఈ కాన్సెప్ట్ ఉద్దేశమే సైలెంట్ ఆపరేషన్ కదా? బయల్దేరుతున్నప్పుడు మేజర్ విహానే అంటాడు -  మనం stealthy గా (దొంగ చాటుగా) silent గా వెళ్ళాలని. ఇది ముందుగా  కాప్టర్ దాడి ప్లాన్ చేసినప్పుడు అంటాడు. కాప్టర్ తో stealthy గా, silent గా ఎలా వెళ్తారు. ఆ ప్లాన్ ఫెయిలయ్యింది. ఇప్పుడైనా కాలి నడకన అలా వెళ్ళాలిగా?

          చాలా పాత జేమ్స్ కోబర్న్ నటించిన ‘స్కై రైడర్స్’  (1976) వుంది. ఏథెన్స్ లో ఒక టెర్రర్ గ్రూపు కొండ మీద గృహంలో బందీలుగా పట్టుకున్న ఒకావిణ్ణి, ఆవిడ పిల్లల్నీ విడిపించడానికి జేమ్స్ కోబర్న్ తన దళంతో చేసే సైలెంట్ ఆపరేషన్ ఇది. ఆ గృహంలోకి వెళ్లేందుకు ఆలోచిస్తున్నప్పుడు, ఆకాశంలో ఎగురుతున్న డేగల్ని చూసి ఐడియా వస్తుంది. ఇక అలా డేగల్లా ఎగిరే హేంగ్ గ్లయిడర్స్  తయారు చేసుకుని, సైలెంట్ గా ఎగురుతూ వెళ్లి ఆ కొండ మీద గృహం మీద వాలతారు. అక్కడ్నించీ ఏమాత్రం చడీ చప్పుడు చెయ్యని అత్యంత సునిశిత సైలెంట్ ఆపరేషనే. ఎక్కడ ఏ శబ్దమవుతుందోనని గుండెలుగ్గ బట్టుకుని చూడాల్సిన ఆందోళనకర డ్రామా...

          రాజశేఖర్ మలయాళ రీమేక్ ‘మగాడు’ (1990) లో కిడ్నాప్ డ్రామా కూడా ఇలాంటిదే. నీటుగా సాగే టెక్నికల్ ఆపరేషన్. సూపర్ హిట్టయింది. 

          ‘యూరీ’ లో నీ ఇంట్లో జొరబడి నిన్ను చంపి వస్తామంటూ అల్లరి చేసుకుంటూ వెళ్తే ఎలా. పైగా చంపాకా, అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్ని బ్లాస్ట్ చేస్తారు. దానివల్ల ఏం లాభం. అప్పటికే తమ ముఖాలు రికార్డయి పోయి వుంటాయిగా. అది సాక్ష్య మిచ్చేసినట్టేగా. ఆ వీడియోలు పట్టుకుని పాక్ నానా గొడవ చేస్తే? సర్జికల్ ఆపరేషన్ కాన్సెప్ట్ కీ, చూపిస్తున్నదానికీ పొంతనే  లేదు. 

          హెలికాప్టర్స్ కి రంగులేసి వెళ్ళాలనుకునే ప్లానే తప్పయితే, పాక్ కి తెలిసిపోయినట్టు ప్లాట్ పాయింట్ టూ ట్విస్ట్ ఇవ్వడం ఇంకా తప్పు. పాక్ కి తెలిసిపోయాక ఇంకా సర్జికల్ స్ట్రయిక్ ఏమిటి. అలాగే ముందుకెళ్తే ఇక ఎస్కలేషనే. యుద్ధమే. కానీ అలాగే వెళ్తారు. ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ ఆపెయ్యమంటే, మేజర్ విహాన్ కాలినడకనే సరిహద్దు దాటి పూర్తి చేసి వస్తామంటాడు. ఇలా హీరోయిజాన్ని పెంచామనుకున్నారు. వాస్తవంలో కేంద్ర ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసింది కాలినడకన రహస్యంగా దాటాలనే. ప్రభుత్వం ఎప్పుడూ కరెక్టే. సినిమాలే ఇలా వుంటున్నాయి. ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి చూపించినట్టు మళ్ళీ అక్కడికే వచ్చింది కథ. అయితే ఇప్పుడు పాక్ కి తెలిసిపోయిన నేపధ్యంలో తెగించి కాలి నడకన వెళ్తున్నారు. పాక్ అప్రమత్తమైనట్టు చూపించి ఎలా వెళ్తారు. రంగులేసిన హెలీకాప్టర్స్ ఫోటోలు చూసి పాకీయులు అప్రమత్తమైన ఆ ఒక్క సీను చూపించి  వదిలేశారు. తర్వాత వాళ్ళు ఎక్కడికి పోయారో ఏమో, ఇటు కాలినడకన దూరిపోయారు! 

      మూడు స్థావరాల మీద ఏక పక్ష యాక్షన్ తో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. చివరికి దొరుకుతాడు యూరీ దాడిని ప్లాన్ చేసిన ఇద్రిస్ ఖాన్ ( అబ్రార్ జహూర్). ఇతన్నీ చంపి కక్ష తీర్చుకుంటాడు. ఇక్కడే అసలు పాయింటు వుంది. ఈ పాయింటు ఇంత సేపూ మరుగున పడి కథలో జోష్ ని చంపేసింది. యూరీ దాడికి టెర్రరిస్టు నాయకుండు ఇద్రిస్ ఖాన్ కారకుడైనప్పుడు,  యూరీ దాడికి ముందే అతణ్ణి విలన్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రేక్షకులకి కచ్చి పుట్టించాలి. ఇరవై మంది సైనికుల్ని చంపిన వాణ్ని అప్పుడే చూపించి ప్రేక్షకులతో హాహాకారాలు రేపకుండా, దాచివుంచి, ఎండ్ సస్పెన్స్ కథనం చేసి, చివరికి పట్టుకుని వీడే ఇద్రిస్ అంటే, అప్పటికి భావావేశాలేముంటాయి ప్రేక్షకులకి. 

          రెండోది యూరీ దాడిలో విహాన్ బావ కూడా చనిపోతాడు. దీంతోనే విహాన్ ఈ ఆపరేషన్ చేపట్టాడన్న అర్ధంలో చూపించారు. బావ చనిపోకపోతే చేపట్టే వాడు కాదా? వ్యక్తిగత నష్టం జరిగితేనే సైనికుడు దేశం కోసం పోరాడతాడా? మాఫియా కథలూ సైన్యం కథలూ ఒకటేనా? ఇంతకీ ఇద్రిస్ ని చంపింది  బావ చావుకి ప్రతీకారంగానా,  అమరులైన తోటి సైనికుల ఆత్మ శాంతికా? వ్యక్తిగతమా, దేశ హితమా?

          ఇలా తనకు తానే చిక్కుముళ్ళేసుకున్నాడు దర్శకుడు. ఇక క్లయిమాక్స్ లో పాక్ పోలీసులకి తెలిసిపోయి వెంటపడతారు. పాక్ సైన్యం కూడా హెలీకాప్టర్ తో ఛేజ్. దీన్ని అడ్డుకోవడానికి నియంత్రణ రేఖ దాటి వచ్చేసి ఫైరింగ్ జరుపుతుంది ఇండియన్ కాప్టర్! అంతా గందరగోళపు గజిబిజి కథనం. మరి ఇండియన్ కాప్టర్ పాక్ కాప్టర్ ని కూల్చెయ్యను కూడా కూల్చెయ్యదు. వెనక్కి వచ్చేస్తుంది. అంత ఫైరింగ్ లోనూ చిన్న దెబ్బ తగలకుండా వచ్చేస్తారు విహాన్ దళం. ఇంత రచ్చ అయినా కిమ్మనకుండా వుంటుంది పాక్. సర్జికల్ స్ట్రయిక్ అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ తో మెరుపు దాడి చేసి రావడమా, రచ్చ చేసుకోవడమా? యుద్ధ వ్యూహనికే వ్యతిరేకమైన యాక్షన్ సీన్లతో నమ్మిస్తే సరిపోతుందా? మూడొందల కోట్లు వసూలు చేసిందంటే, సైన్యం గురించి ఏం చూపించి వసూలు చేశారో తెలుసుకోవడానికే ఈ రివ్యూ. 

          బిన్ లాడెన్ ని చంపుతున్నప్పుడు, కమాండో రాబర్ట్ ఓ నీల్ హెల్మెట్ కెమెరా ద్వారా ప్రసారమవుతున్న విజువల్స్ ని, వైట్ హౌస్ సిట్యుయేషన్ రూంలో కూర్చుని, ప్రెసిడెంట్ ఒబామా ప్రభృతులు ప్రత్యక్షంగా చూశారు. సర్జికల్ ఆపరేషన్ ని కూడా కమాండోల హెల్మెట్ కెమెరాల ద్వారా, డ్రోన్ ద్వారా, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పరికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ లు ప్రత్యక్షంగా చూశారు. 

          సినిమాలో హోం మంత్రి, రక్షణ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారూ ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, ఉద్రిక్తంగా చేతులు నలుపుకుంటూ గడుపుతూంటారు. 

          ఇలా 
హోష్ లేని జోష్ సోషల్ మీడియా జనరేషన్ కి జబర్దస్త్  జోషేమో !!

సికిందర్
Watched at PVR, Errum manzil
6.30 pm, Feb 24, 2019
  telugurajyam.com       
         







Saturday, February 23, 2019

792 : సందేహాలు - సమాధానాలు


  

Q : నేను కొత్తగా దర్శకత్వం చేపట్టాను. ఐతే డైలాగ్ వెర్షన్ నల్గురితో రాయిస్తున్నాను. రాయించవచ్చా? 

కెఎల్ ఆర్, కొత్త దర్శకుడు
A : రాయించ వచ్చు. ఒక్కరే రాసుకున్నా, పది మందితో రాయించుకున్నా సినిమాలు సక్సెస్ అయ్యేది ఆ 10 శాతమే. కాకపోతే పది మందికి పని దొరికినట్టవుతుంది. సామ్యవాదం అమలవుతుంది. 
Q : ఒక ప్రొడ్యూసర్ నేను చెప్పిన కథ కాదని తను చెప్పిన కథే తీయాలంటారు. ఆ కథ బాగాలేదు. తప్పుకుందామంటే ఎంతో స్ట్రగుల్ చేస్తే వచ్చిన అవకాశం ఇది. ఒప్పుకుందామంటే ఆ కథతో మనస్కరించడం లేదు.  
పి ఎస్, కొత్త దర్శకుడు
A : ఎప్పుడూ వుండే సమస్యే. అయినా మీ కథ బావుందని ఏమిటి నమ్మకం. పది శాతమే హిట్టవుతున్న సినిమాల్లో అదొకటి కాగలదా? ఎలాగూ 90 శాతం స్క్రిప్టులు ఫ్లాపయ్యేవే, కథలు కాదు. కథలతో చేస్తున్న స్క్రిప్టులు ఫ్లాపవుతున్నాయి. కాబట్టి వచ్చిన అవకాశం వదులుకోకుండా ప్రొడ్యూసర్ కథ చేసేయడమే. బాగా లేని కథల్ని బాగు చేసే మార్గాలుంటాయి. మళ్ళీ ఇంకో అవకాశం కోసం స్ట్రగుల్ చేసేకన్నా, ప్రొడ్యూసర్ కథనే బాగు చేయడానికి స్ట్రగుల్ చేస్తే అదొక ఆనందం. చేతిలో డబ్బులు ఆడతాయి. జీవితం హేపీగా వుంటుంది.
Q : అక్టోబర్ 8, 2018 స్క్రీన్ ప్లే సంగతులులో  దొంగరాముడు’ గురించి వివరిస్తూ ముగింపులో మీరిలా రాశారు :ఇలా దొంగరాముడి స్క్రీన్ ప్లే  ఏకంగా చిన్ననాటి కథతోనే బిగినింగ్ విభాగంగా మొదలయ్యింది. ఇది విషాదంగా ముగిసి, ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడిపోయింది ఒక గోల్ తో. ఇక పెద్దవాడుగా ఎంటరయ్యే దొంగరాముడికి, కథ నడపడానికి ఆల్రెడీ ఏర్పాటైన చిన్ననాటి గోలే అంది వచ్చింది. కనుక, అతడి ఎంట్రీతో ఇక మిడిల్ విభాగం ప్రారంభమైపోతుందన్న మాట! ఎంత సమయం ఆదా, ఎంత బడ్జెట్ ఆదా! అసలు హీరో ఎంట్రీతో ఏకంగా మిడిల్ విభాగం ప్రారంభమైపోయే సినిమా ఇంకేదైనా వుందా? ఇకముందు వుండడానికి ఇదేమైనా  స్ఫూర్తి అవుతుందా?
       ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ వివరించడం కష్టం. అవసరమైతే మీకు ఫోన్లో వివరిస్తాను. అయితే ఒక సందేహం. ఇలా చేయాలంటే తప్పని సరిగా చిన్నప్పటి కథ వుండాలి కదా? కథల్ని చిన్నప్పట్నుంచీ మొదలు పెట్టడాన్ని మీరు వ్యతిరేకిస్తారు కదా? చిన్నప్పటి కథతో కాకుండా ఇంకో స్కీము ఏదైనా వుందంటారా?
కేఎన్నార్, దర్శకుడు 
A : పైన దొంగరాముడు స్క్రీన్ ప్లే సంగతులు స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగపు క్రియేటివిటీ. ఆ కాలంలో చిన్నప్పటి నుంచీ కథ చెప్పడం వుండేది కాబట్టి దానికీ కొత్త క్రియేటివిటీ. ఈ రోజుల్లో  ఏ క్రియేటివిటీ లేకుండా ఒకే మూసలో చిన్నప్పటి కథలు చూపిస్తున్నారు. ఏమిటా చిన్నప్పటి కథలంటే, చిన్నప్పటి కథల పేరుతో చిన్నప్పుడు హీరో పాత్ర చిత్రణే. హీరో పాత్ర చిత్రణ చేయడానికి చిన్నప్పట్నుంచీ చూపించుకురావాలా? హీరో తెలివైన వాడని చెప్పడానికి ఎలా తెలివైన వాడయ్యాడో చిన్నప్పట్నుంచీ చూపించుకొస్తే తప్ప అర్దమవని ప్రేక్షకులున్నారా? హీరో ఎలా తెలివైన వాడయ్యాడో ఎక్కడా ఎవరికీ అవసరం లేని ప్రశ్న. అతనొక తెలివైన వాడు, అంతే. ఒక్క మాటతో, ఒక్క చర్యతో చెప్పేస్తే  సరిపోతుంది. చిన్నప్పటి కథల పేరుతో అరగంట నిడివికి అయ్యే బడ్జెట్ ని తగలేసే దురాచారం తప్పుతుంది.  పైగా శుభమా అంటూ సినిమా ప్రారంభించి పావు గంటో, అరగంటో ఎవరో చైల్డ్ ఆర్టిస్టుల చేష్టలు చూస్తూ కూర్చునే యువ ప్రేక్షకుల్లేరు. వాళ్ళకి వెంటనే తమ అభిమాన స్టార్ తెర మీదికి రావాలి. ఇలా మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ లేని చిన్నప్పటి కథలెందుకు?


        కాబట్టి చిన్ననాటి కథల పేరుతో పాత్ర చిత్రణలు  చూపించే బదులు ‘దొంగరాముడు’ లోలాగా కథే చెప్పేస్తే, ఆ బిగినింగ్ విభాగపు కథానానికే ప్లాట్ పాయింట్ వన్ కూడా ఏర్పరిస్తే, ఇంకాతర్వాత మిడిల్ లో హీరో ఎంట్రీ తర్వాత గోల్ కోసం ఇంకా బిగినింగ్ చూపించే వృధా తప్పుతుంది. చిన్ననాటి కథకి ఏర్పర్చిన గోలే హీరో గోల్ అయిపోతుంది. అయితే ఈ గోల్ చిన్నప్పుడు సైంటిస్టు అవ్వాలని గోల్ ఏర్పడిందనో, క్రికెటర్ అవ్వాలని గోల్ ఏర్పడిందనో కలల రూపంలో కాకుండా, ‘దొంగరాముడు’ లో లాగా జీవితం ప్రశ్నార్ధకమైన గోల్ గా వుండాలి. 
         అయితే క్రియేటివిటీ దొరికింది కదాని ఇదే వరసలో సినిమాలు తీస్తూపోతే లాభం లేదు. ఒకటి రెండు సినిమాలతోనే  ఈ వెరైటీ, నావెల్టీ అంతా పోతుంది. మళ్ళీ ఇంకో మూసగా తయారవుతుంది. అప్పుడు చిన్నప్పటి కథకి ప్రత్యాన్మాయం ఆలోచించడమే. హీరో గతంలో ఎక్కడో చిన్ననాటి సుదూర జీవితం దాకా ఎందుకు పోవాలి? సమీప జీవితాన్నే తీసుకోవచ్చు. అంటే పదిహేడు దాటిన టీనేజిని కూడా తీసుకోవచ్చు. అప్పుడు జరిగిన కథగా చూపించవచ్చు. ఇప్పుడూ వేరే టీనేజి ఆర్టిస్టుతో అదే సమస్య వుంటుంది – చైల్డ్ ఆర్టిస్టులతో యువ ప్రేక్షకులకి వుండే ఎవర్షన్ సమస్య. అందుకని ‘ఫ్యాన్’ లో షారుఖ్ ఖాన్ ని త్రీడీ స్కాన్ తో ఇరవై ఏళ్ల కుర్రాడిగా చూపించి సంచలనం సృష్టించినట్టు, తెలుగు స్టార్ తో ఈ వెరైటీ ప్రయోగం చేయొచ్చు. స్టార్ టీనేజిలో ఎలా వుండే వాడో చూపించేకన్నా క్రేజీ మార్కెట్ యాస్పెక్ట్ ఏముంటుంది. యువప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే టీనేజీ జీవితం చూపించడం కన్నా క్రియేటివ్ యాస్పెక్ట్  ఏముంటుంది.

 సికిందర్ 

Friday, February 22, 2019

791 : శ్రద్ధాంజలి!

 ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేరు!


       తీవ్ర అస్వస్థతకు గురై హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలుగు దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందారు.కొంతకాలం క్రితం పక్షవాతంతో బాధపడ్డ ఆయన కొంతకాలానికి కోలుకొని ఇతరుల సహాయంతో నడవడం మొదలుపెట్టారు. అయితే గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
తెలుగు తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్బుతంగా తీర్చిదిద్దిన దర్శకులలో కోడి రామకృష్ణ ఒకరు. తన గురువు దాసరిలా ఫ్యామిలీ సినిమాలకే ఆయన ఓటు వేసేవారు. విభిన్నమైన క్యారక్టరైజేషన్స్ తో ఆయన సినిమాలు అందరినీ అలరించేవి.
‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా ఆయన పరిచయం జరిగింది. మధ్యతరగతి జీవితాలను .. అందులోని ఒడిదుడుకులను కథా వస్తువుగా ఎంచుకుని, ఆయన ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను సైతం తనదైన శైలిలో తెరకెక్కించి మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. ‘అమ్మోరు’ .. ‘అరుంధతి’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ కోడి రామకృష్ణ సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు.
తెలుగురాజ్యం.కాం
    అంకుశం’ నిరంకుశంగా ఫార్ములా మీద ఖడ్గ మెత్తితే ఏమవుతుంది? ‘భారత్ బంద్’ అవుతుంది!
          ‘ఈ సృష్టిలో ఏదైనా మనం సృష్టించామా? ఆకు మనది కాదు, పోక మనది కాదు, సున్నం మనది కాదు... ఈ మూడూ కలిపికట్టి నోరు పండించడమే మన పని!’ అని  కాస్టూమ్స్ కృష్ణ విసిరే  డైలాగుని  –
          ‘పాట మనది కాదు, ఫైటు మనది కాదు, ఆట మనది కాదు...ఈ మూడూ కలిపికొట్టి తెలుగు సినిమాని బాగా మట్టి కరిపించవచ్చు!’  గా మార్చుకుంటే  డైనమిక్ కొటేషన్ అవుతుంది.

        
స్టామినా అనేది టాలీవుడ్ ప్రింట్ మీడియాకి చాలా ఇష్టమైన పదం. తెలుగు సినిమా దాని వైఖరి మార్చుకుంటే నిజమైన ‘స్టామినా’ ఏమిటో  బయటపడుతుందేమో. వాపు ‘స్టామినా’ అన్పించుకోదు. విటమిన్ బిళ్ళలు పౌష్టికాహారం లోపం తలెత్తాక అవసరపడే సప్లిమెంట్స్. బిళ్ళలతో బలుపు రాదు. తెలుగు సినిమాల సాంప్రదాయ కథా కథనాల పౌష్టికాహారాన్ని వదిలేసుకుని, బిల్డప్పుడు, డాన్సులు, మాస్ ఫైట్లు, టెక్నికల్ హంగులూ, తాటాకు బ్యాంగులూ వగైరా ఫార్ములా విటమిన్లు వాడినంత కాలం, తెలుగు సినిమా  బాక్సాఫీసు బలిమికి బలుసాకు లేదు.

        మొదట కోడి రామకృష్ణ అనే హైడ్రామా హాలికుడు తీసిన అంకుశమే అన్ని ఫార్ములా నమ్మకాల్నీ బద్దలు కొట్టింది. పచ్చి కథే తప్ప ఇంకే కృత్రిమ హంగుల్నీ ఖాతరు చేయని ఒక బలమైన, ఆరోగ్యవంతమైన అచ్చ తెలుగు సినిమాగా బాక్సాఫీసుని బద్దలు కొట్టాక, తిరిగి దాని కొనసాగింపుగా అన్నట్టు, ‘భారత్ బంద్’ మరో అడుగు ముందు కేసిన  డేరింగ్ కమర్షియల్ ప్రయోగాత్మకం అయింది. 

            
డైలాగ్ నంబర్ టూ- పార్టీని బట్టి సున్నం రాస్తే, అదే సర్దుకుంటుంది’  అంటూ, మూస ఫార్ములా ప్రేమికులైన  ప్రేక్షకులకి ‘భారత్ బంద్’ ఓ మాంచి విరుగుడు డోసే ఇచ్చింది. ఈ సినిమా తీసి కోడి రామకృష్ణ  ‘ఆకులో సున్నం ఎక్కువ రాశానంటా డేమిటీ...మన చేతిలో తేడా రాదే?’  అన్న డైలాగ్ నంబర్ త్రీ ప్రకారం, ఈ ప్రయోగాత్మక సృష్టితో తనే డైలమాలో పడిన పరిస్థితీ లేదు.

        ఆకు లాంటి సినిమాలో సున్నం లాంటి కథ ..ఎంతో కథ.. రాసి రాసి, కథలోంచి కథానికలు, సన్నివేశాల్లోంచి సన్నివేశాలు, డైలాగుల్లోంచి సన్నివేశాలు, చర్యల్లోంచి ప్రతి చర్యలూ... ఒకే  టెంపో, స్పీడ్, థ్రిల్... ఎన్నెన్నో పాత్రలు, వాటన్నిటి మీదా అతిసూక్ష్మ దృష్టితో వాటి వాటి ప్రణాళికా బద్ధమైన ఆశయ సిద్ధికి ప్రయాణాలూ, అవి పడిపోకుండా, డీలా పడిపోకుండా, అనుక్షణం వేడిని పుట్టించడం, సినిమా ‘స్టామినా’ సంగతి ని మరువకూడదని , దాని అతి ముఖ్యమైన కథాంగమైన టైం అండ్ టెన్షన్ థియరీని  పక్కాగా అమలుపర్చడం!

        నేటి ఒక సినీ – టీవీ రచయిత అంటాడు : ప్రకృతిలో వుండే ఎలిమెంట్సే, వాటి నిష్పత్తుల్లో కథల్లోనూ  వుంటాయని. మరైతే  ప్రకృతిలో ఆ పంచభూతాలనే ఎలిమెంట్స్  కల్లోలం కూడా సృష్టిస్తాయి కదా అంటే, ఆ కల్లోలం సర్దుబాటు కోసమే నంటాడు. దట్సిట్! కాబట్టి ఇక్కడ కల్లోలం గురించే! భూమ్మీద డెబ్బై  శాతంగా చలనశీలంగా వున్న జలమే, సినిమాల్లో కన్పించే కథనమైతే, దీంతో ఏం చేస్తున్నామన్నదే బర్నింగ్ టాపిక్ అవ్వాలి! దీంతో కోడి రామకృష్ణ సృష్టించే కల్లోలం, తదనంతరం చేసే సర్దుబాటూ, చిట్ట చివరికి చేకూర్చే యథా పూర్వ స్థితీ, అతడి అందెవేసిన సృజనాత్మక కళావ్యక్తికి  నిదర్శనాలవుతాయి! ఎక్కడా ఈ ప్రకృతి విలయంలో ఆటవిడుపుగానైనా ఓ ఈల పాట సత్కాలక్షేపమే వుండదు. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఏదీ అన్న వాడు నవ్వులపాలవుతాడు. పంచదారలో కూడా తీపిని వెతకడమేనా! ఈ కోడి క్రియేషన్ లో ఎలాటి ప్రేమాయణాలు, డ్యూయెట్లు, స్టెప్పులూ, విలన్లతో వ్యాంప్ డాన్సులూ, ఇంకే కామెడీ ట్రాకులూ, ప్రేక్షకజనం చీప్ టేస్టుని సంతృప్తపర్చే  ద్వంద్వార్ధాల డైలాగులూ కనపడవు. ఇలా వున్నాక ఇదొక  ‘ప్రయోగాత్మక కమర్షియల్’ కాకపోతే ఇంకేమిటి? దీని ఫలితాలు బ్రహ్మరధం పట్టి అందించారు ప్రేక్షకులే!

        తెర వెనుక పనిచేసుకునే ప్రొడక్షన్ సిబ్బంది విలక్షణ నటనలతో ఆర్టిస్టులుగా తెర మీద మెరవడం 1990 లో ఒకసారి, 1991 లో మరింకో సారీ సంచలనాత్మకంగా జరిగాయి. ఆ ఇద్దరు పుణ్యజీవులు నిర్మాత ఎ. పుండరీ కాక్షయ్య, కాస్ట్యూమ్స్ కృష్ణ.  నీ జీవితం మీద నా కసహ్యమేస్తోంది!’ అంటూ మర్డర్లు చేసి పారేసే పచ్చి రాజకీయ విలన్ గా ‘కర్తవ్యం’ లో పుండరీ కాక్షయ్య టెర్రిబుల్ గా వూపేస్తే, ‘ఆకు- పోక- సున్నం’ ఛలోక్తులతో కాస్ట్యూమ్స్ కృష్ణ  ‘భారత్ బంద్’ లో కరుడు గట్టిన క్రిమినల్ గా ఇంకా టెర్రిఫిక్ గా వూపేశాడు. అప్పటికింకా తెలుగు ఫీల్డులో విలన్స్ కి కరువు లేని కాలం. ‘భారత్ బంద్’ కి కాస్ట్యూమ్స్  కృష్ణ వన్నె తరగని ఎస్సెట్ అయ్యాడు. 

     ఈ మెగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కోడి రామకృష్ణ సమకాలీన రాజకీయ వ్యవస్థని బరిబత్తెలుగా చూపించేశాడు!
     రాజకీయ సినిమా అన్నాక, అది సమకాలీన పరిస్థితుల్ని ఎత్తి చూపాలంటాడీయన. అంతే గాకుండా, ‘భవిష్యవాణి’  విన్పించాలనీ ( ఈ ‘భవిష్యవాణి’ ఏంటో అర్ధంజేసుకోలేక, కథల్ని మరింత  పై స్థాయికి తీసికెళ్ళగల బంగారు అవకాశాల్ని చేజార్చుకునే  వాళ్ళే ఎక్కువ మంది వున్నారు ఫీల్డులో),  మరికొన్నేళ్ళ తర్వాత చూసిన ప్రేక్షకులకి అప్పటి పరిస్థితులకి అద్దం పట్టి అబ్బురపర్చేదిగా వుండాలనీ విశ్లేషిస్తాడు కోడి. ఈ లక్షణాలన్నీ ‘భారత్ బంద్’ లో  పుష్కలంగా ఉన్నాయి. అసమ్మతి- వెన్నుపోటు రాజకీయాలు 1983-84 ల కాలం నుంచీ  బాగా పాపులర్ అయ్యాకే, సినిమాల్లో కథల్లో అవి చొరబడ్డం మొదలెట్టాయి. వీటిలో ఒకటి 1989లో కోడిరామకృష్ణే తీసిన ‘అంకుశం’ లో  ఓ నీతిగల సీఎం తో ఈ సమస్యని చర్చకి పెడితే, 1991 కి వచ్చేసరికి,  ‘భారత్ బంద్’ లో ఒక నీతిలేని సీఎంతో రచ్చ చేశాడు రామకృష్ణ! నిత్య చలనశీలమైన కథ ఎప్పుడూ అవుట్ డేటెడ్ గా వుండ కూడదు, పాత్రలూ మారిపోతాయి కాలంతో బాటు. కోడి రామకృష్ణలా ఇది గ్రహించకపోతే  అన్ టచబుల్ బాస్టర్డ్స్అన్పించు కుంటాయి సినిమాలు...


           సామాజిక న్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, సమాజంలో బడుగు వర్గాలకి చెందిన వ్యక్తులు రాజకీయ పార్టీలకి లంపెన్ శక్తులుగా ఉన్నంత కాలం, ఎలాటి సామాజిక న్యాయమూ సాధ్యం కాదనేది గమనించాలి. వాళ్ళొక వేళ పాలకుల స్థానాన్ని అధిష్టించినా, తిరిగి ఆ ఎలీట్ వర్గాలకే  జీ హుజూర్ తొత్తులుగా ఉండిపోతారు. ఈ పరిస్థితి కళ్ళకి కట్టినట్టు ‘భారత్ బంద్’  లో పోరంబోకు మంత్రి వర్గం దృశ్యాల్లో గమనించవచ్చు.  ఈ కుప్పతొట్టి మంత్రి వర్గానికి నాయకుడు సీఎం పదవిని ఎంజాయ్ చేస్తున్న – తన పూర్వపు వృత్తి ద్వారా సంక్రమింప
జేసుకున్న, కొబ్బరిబోండాలు నరికే కత్తిని వెంట బెట్టుకు తిరిగే – కిరాయి కిల్లర్ కాస్ట్యూమ్స్ కృష్ణ! 

        ఇతను తనని పెంచి పోషించిన పెద్దాయన్నే పడదోసి సీఎం  అయిపోయాడు. నిత్యం తన బాగోగుల గురించే ఆలోచిస్తూ వాటి సాధన కోసం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు.  ఆ నిర్ణయాల్ని తక్షణం అమలు చేసేస్తాడు. చాలాటక్కరి. గుంటనక్క. ఎవరికీ చిక్కడు, ఇంకెవరికీ దొరకడు. తన సీఎం గిరీకి ఎసరు రాకూడదని, ఏకంగా ఒక  ‘పావురాయి పేట’ సంఘటన (వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న  హెలికాప్టర్ కూలింది ‘పావురాయి గుట్ట’ లో కదూ) సృష్టించడమే కాదు, ఇంకాఇంకా ఎదిగిపోయి దేశ ప్రధాని కూడా అయిపోవాలన్న దుగ్ధతో  దేశంలో మరో జలియావాలా బాగ్ ఉదంతాన్నీ రీ - క్రియేట్ చేయగలడు. నోర్మూసుకుని యావద్భారత్ ‘బంద్’ పాటించేలా చేయగల  శక్తి సంపన్నుడూ కాగలడు. ఎంత నిజాయితీ అంటే ఇతడికి, చచ్చినా దొంగ నిరాహార దీక్ష మాత్రం చెయ్యడు. ఆకలితో చచ్చే అచ్చమైన నిరాహార దీక్షే చేస్తాడు తన సొంత లాభం కోసం కాబట్టి, ప్రజల కోసం కానే  కాదు కాబట్టి. తన సొంత లాభం కోసమే బజారుకుక్కలా వీధిన పడి పచ్చి కోడిగుడ్లు విసిరేయించి, పార్టీ కూడా పెట్టించేస్తాడు నార్త్ ఇండియన్ సేటు  బాబూ మోహన్ చేత. ఇక మిగతా చిల్లర పనులు చూసుకోవడానికి బామ్మర్ది ( అశోక్ కుమార్ ) ఎలాగూ వుండనే వున్నాడు.

   ఈ అరచాకాల్ని ఎదుర్కోవడానికి ఎస్సై గా హీరో వినోద్ కుమార్ తీవ్ర పోరాటం చేస్తూంటే, అతడి భార్య పాత్రలో అర్చన లెక్చరర్ గా విద్యార్ధి బృందంతో ఇంకో వైపు నుంచి నరుక్కొస్తూంటుంది.  ఈ బృందానికి నాయకుడుగా మరో హీరో రఘు ( రెహ్మాన్ అని అసలు పేరు) వుంటాడు. ఇలా బలాబలాల సమీకరణ.

        ఇక ఆట మొదలు. ఊపిరి సలపనివ్వని ఈ ఏకబిగిన సాగే రాజకీయపు ఆటలో అడుగడుగునా పవర్ఫుల్ సన్నివేశాలతో మాటల తూటాలు పేల్చుతూ. పైన చెప్పుకున్న మూడు సంఘటనలే గాక, ఇంకా ప్రారంభంలో గిరిజనుడితో బూటకపు రాజకీయం, న్యాయ విచారణ జరిపే జడ్జి సఫా, రేషన్ కార్డుల బాగోతం, కొనవూపిరితో వున్న రఘుకి బతికుండగానే పోస్ట్ మార్టం చేసేసే  కుతంత్రం, అతణ్ణి కాపాడుకునేందుకు తను అరెస్టై పోయే అర్చన, ఆమె గర్భావతని తెలిసినప్పటి మెలోడ్రామా, సీఎం మీద  విద్యార్థి బృందపు అడ్డంగా విఫలమయ్యే ‘డే ఆఫ్ ది  జాకాల్’ టైపు హత్యా యత్న ఘట్టం, సీఎం కుప్పతొట్టి మంత్రివర్గం మెక్కిందరక్క   బట్టలు చింపేసుకుంటూ కొట్టుకునే ‘ముత్యాల ముగ్గు’ ఫేం ది గ్రేట్ క్లయిమాక్స్ సీను టైపు సన్నివేశం,  దేశమంతటా ఉద్విగ్న భరిత – హింసాత్మక ‘భారత్ బంద్’ దృశ్యాలు, చిట్ట చివరికి...ఆ నీచ సీఎం మీద... గంగి గోవుకి కూడా...ఏవగింపు కలిగి....

     చెప్పుకుంటే పోతే క్షణక్షణం రగిలించే సంభ్రమాశ్చర్యకర దృశ్యాలే... ఇదంతా చూస్తూంటే ఒకటి అర్ధమవుతుంది...టైమింగ్ అనేది కేవలం కామెడీ ఒక్కదానికే వాడే మాట కాదనీ, కథనానికి కూడా వాడాల్సిన మాటేననీ...టైమింగ్ స్పృహ తో చేసిన కథనం ఆకాశాన్నంటుతుందనీ...

        మంచి స్క్రిప్టు రాస్తున్నప్పుడే సినిమా జయాపజయాల సంగతి  తెలిసిపోతుందని, కోడి రామకృష్ణ ఇంకో కొటేషన్. అలాంటప్పుడు ఇది కన్నడ, తమిళ, హిందీ భాషల్లో తీస్తే అక్కడా హిట్టే.

        ఈ సక్సెస్ ఫుల్ ప్రయోగాత్మకానికి నిర్మాతగా అల్లూరి సుభాష్ వుంటే, కోడి రామకృష్ణ సోదరుడు కోడి లక్ష్మణ్ ఛాయాగ్రాహకుడిగా, విజయ్ శేఖర్ కొత్త సంగీత దర్శకుడిగా, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాటలూ- పాటల రచయితగా వున్నారు. చాలా పవర్ఫుల్ గా మాటలు పేలిన ఈ హైడ్రామా ప్రధానమైన రాజకీయ సినిమాకి, దర్శకుడే గాక కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే రచయిత కూడా.

         నేటి ఆసక్తి వున్న రచయితలూ దర్శకులూ బలమైన కథా, పాత్రల సృష్టీ, వాటి నిర్వహణా  ఎలాఎలా జరుగుతాయో బేసిక్స్ తెలుసుకోవాలంటే ‘భారత్ బంద్’  ని ఒక గైడ్ గా లైబ్రరీలో దాచుకోవాల్సిందే.

డైలాగ్ డిస్క్ 
కాస్ట్యూమ్స్ కృష్ణ : *‘రాజకీయ నాయకుల మచ్చను తుడిచి వెయ్యడానికి, తప్పుడు నినాదాలుగా మార్చడానికీ, రాజకీయ సముద్రాన్ని నాలాంటి వాడు చిలికితే పుట్టిన కల్పవృక్షమేరా ఈ భారత్ బంద్!’ 
*ఈ గుడ్డు మీద నీ పేరు రాసి ఆడి మొహాన కొట్టి నేను సీఎం నయ్యా!’
*‘ఉత్తరాలిస్తూ వూరంతటికీ తెలుసుకదాని పోస్ట్ మాన్ ఎలక్షన్లో నిలబడితే గెలుస్తాడా ఏమిటి?’
*ఎవరికీ తృప్తి కల్గించని వాడు ముఖ్యమంత్రేమిటి...ముష్టి మనిషిగా కూడా పనికిరాడు’
వినోద్ కుమార్ :
*హిట్లర్ లా హీనం గా చావకుండా కనీసం ఒక ఖైదీగా బతుకుతావ్’
రఘు :
*ఒక రాజకీయ నాయకుడి కనుసైగతో రంగు మారిపోయే చట్టం మాకెందుకు?’
బాబూ మోహన్ :   *ఏమిటండీ ఈ రాజీనామా బాగోతం? మీరు నిజంగా రాజీనామా చేయదల్చుకుంటే గవర్నర్ కివ్వాల. మీ పార్టీ ప్రెసిడెంటు కివ్వడం గొడవలు రెచ్చ గొట్టడానికేగా? అవతల ఛస్తున్నారండీ జనం!’


-సికిందర్
(సాక్షి –ఫిబ్రవరి 2010)