రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, December 11, 2016

సాంకేతికం

     కాస్ట్యూమ్స్...నటీనటుల కొక అలంకారం, గుర్తింపు. దీన్నే ఆహార్యమన్నారు. పౌరాణిక సినిమాలతో మొదలై ప్రస్తుతం ఫాంటసీల దాకా వచ్చాయి కాస్ట్యూమ్స్ అనేవి.  మధ్యమధ్యలో చారిత్రక, భక్తి, జానపద, సాంఘీక, కౌబాయ్, క్రైం, లవ్ మొదలైన సినిమా పాత్రలకీ ఆయా శైలుల్లో శోభ తెచ్చాయి. ఆహార్యాన్ని అభినయమని కూడా అన్నారు. చతుర్విధాభినయాల్లో అదొకటి. లేకపోతే  నటుడు గొంతెత్తి ఎన్ని పద్యాలు పాడినా, అతడి చేతిలో గద, తల మీద ఓ కిరీటం, కాళ్ళకి కిర్రు చెప్పులూ, ఒంటి మీద పట్టు వస్త్రాలూ మెరవకపోతే ఆ పాత్ర దుర్యో ధనుడని ఎవరూ  అనుకోరు. ఒకడు సిటీ మొత్తాన్నీ అతలాకుతలం చేసేస్తానని ఎన్ని రంకెలేసినా- ఓ చింకి పాత జీన్సు, మాసిన డెనిమ్ షర్టు, మురికి పట్టిన బూట్లు, చేత డొక్కు పిస్తోలూ లేకపోతే,  వాడొక  మాఫియా క్యారక్టర్ అని ఎవరూ నమ్మరు. తగిన డ్రెస్సు లేకపోతే  ఎవరే పాత్ర నటిస్తున్నారో అస్సలు అంతుపట్టదు.

         
డ్రెస్సులే ప్రేక్షకుల్లో చాలా ఫ్యాషనయ్యాయి. మరీ కలర్ సినిమాల్లో ఎన్టీఆర్ వేసుకునే చెమ్కీ కోటు నెవరూ వేసుకోలేదు గానీ, రాజేష్ ఖన్నా పాపులర్ చేసిన చెప్పులేసుకుని మాత్రం బాగా తిరిగారు ఆలిండియా జనం. వాణిశ్రీ చీరకట్టు సరే, అది చూసి బొడ్డు కింద చీర కట్టుకుని తిరిగారు ఆడవాళ్ళు పూర్తి స్వేచ్ఛతో. అయితే ఇప్పుడీ పరిస్థితి తారుమరైందని అంటారు ప్రముఖ కాస్ట్యూమర్ జనకముని. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త రెడీమేడ్ దుస్తులే స్టార్స్ కిప్పుడు అలంకారాలవుతున్నాయని ఆయనంటారు. స్టార్లు మార్కెట్ కి ఫ్యాషన్లు ఇస్తున్న కాలం పోయి, స్టార్లే మార్కెట్ నుంచి ఫ్యాషన్లు తీసుకుంటున్న ట్రెండ్  నడుస్తోందని అంటారు జనకముని.

          ‘కుదిరితే కప్పు కాఫీ’ కాస్ట్యూమ్స్ చీఫ్ గా ప్రమోటైన జనకముని, మార్కెట్లో  వచ్చే కొత్త డిజైన్లు ప్రజల చేతుల్లో పడకముందే స్టార్లు చేజిక్కించుకుంటున్నారని చెప్పారు. “సరికొత్త ఫారిన్ డిజైన్లు మొదట ముంబాయి కొస్తాయి. తర్వాత బెంగళూరు కొస్తాయి. ఆ తర్వాతే హైదరాబాద్ కొస్తాయి. ఈలోగానే స్టార్లు తెప్పించుకుని సినిమాల్లో వాడేస్తూంటారు” అన్నారు. 

           కాస్ట్యూమర్లు మిషన్ మీద కుడుతూ వున్న కాలంలో వీటిని ఫ్యాషన్ అన్నారు. రెడీ మెడ్ గా మార్కెట్లో కోనేసుకుంటున్న ఈ కొత్త మిలీనియంలో స్టయిల్ స్టేట్ మెంట్ అన్న కొత్త పదం వాడకంలోకి తెచ్చారు. ఈ స్టయిల్ స్టేట్ మెంట్ లో యాటిట్యూడ్ ప్రధానంగా వ్యక్త మవుతూంటుంది. హీరో హీరోయిన్లు ఇప్పుడు పోషిస్తున్నవి డిజైనర్ పాత్రలు. ‘రగడ’ లో అనూష్కా, ‘బిల్లా’ లో ప్రభాస్ ఇందుకు సరపోతారు. అయితే జనకముని అభిప్రాయంలో ఈ ట్రెండ్ కాస్ట్యూమర్లకి అంతగా  మేలు చేయడం లేదు. 

          ఆయన ప్రకారం కాస్ట్యూమ్స్ చీఫ్స్ , వాళ్ళ కింద ఫస్ట్ అసిస్టెంట్స్, అసిస్టెంట్లు, ఇస్త్రీ వాళ్ళు, డ్రెస్ మాన్లూ మొత్తం కలిపి 445 మంది వరకూ ఇప్పుడు ఫీల్డులో వున్నారు. వీరంతా రెడీమేడ్ దుస్తులకి అలవాటు పడ్డ హీరో హీరోయిన్లని మినహాయించి, మిగతా  ప్యాడింగ్ ఆర్టిస్టుల దుస్తులకే పరిమిత మవాల్సి వస్తోంది.

           “పవన్ కళ్యాణ్ కి నేను పర్సనల్ కాస్ట్యూమర్ గా ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషీ’ సినిమాల వరకూ పనిచేశాను.  ఆయన ఫారిన్ నుంచి బుక్స్  తెప్పించి ఆ డిజైన్లు కుట్టమనే వారు. ‘బద్రి’ లో మేడిన్ ఆంధ్రా సాంగ్ కి నేను తయారు చేసిన కాస్ట్యూమ్ బాగా హిట్టయ్యాయి. ‘ఖుషీ’ తర్వాత ఆయన ఏడాది దాకా సినిమా చెయ్యనని నాకు యాభై  వేలిచ్చి పంపారు. ఆ డబ్బుతో టైలరింగ్ షాపు పెట్టుకుని బిజీ అయ్యాను. ఎవరైనా పిలిస్తే కంపెనీ కాస్ట్యూమర్ గా వెళ్లి పని చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు జనకముని. 

      హీరో హీరోయిన్లకి ప్రత్యేకంగా కాస్ట్యూమర్లు లేకపోతే, వాళ్ళతో కలుపుకుని మొత్తం ఆర్టిస్టు లందరికీ డ్రెస్సులు సమకూర్చే అతన్ని కంపెనీ కాస్ట్యూమర్  అంటారనీ, హీరో హీరోయిన్లకి పర్సనల్  కాస్ట్యూమర్లుంటే అప్పుడు మిగతా ఆర్టిస్టుల డ్రెస్సుల సంగతి చూసేదీ కంపెనీ కాస్ట్యూమరేనని  వివరించారు. అయితే మనీష్ మల్హోత్రా, రోహిత్ బల్, నీతా లుల్లా ల్లాంటి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగంలోకి రావడాన్ని మీరెలా  చూస్తారని అడిగినప్పుడు- తెలుగులో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. పదిహేనేళ్ళ క్రితం మాత్రం తమిళ కాస్ట్యూమర్లతో  పోటీ వుండే దన్నారు. ముప్ఫై  ఏళ్ల క్రితం వరకూ కాస్ట్యూమర్లకి విలువ వుండేదనీ, ఆ తర్వాత నుంచీ సన్నగిల్లిందనీ బాధ పడ్డారు. అప్పట్లో  కాస్ట్యూమర్ ని  కూడా కూర్చో బెట్టుకుని నిర్మాత, దర్శకుడు, రచయిత, మేకప్ మాన్, కళా దర్శకుడూ కథ గురించీ, పాత్రల గురించీ చర్చించి, దుస్తులు నిర్ణయించేవారన్నారు. ఏ దృశ్యానికి ఏ దుస్తులు నప్పుతాయో కాస్ట్యూమర్ చెప్పే వాడనీ, పాటల  విషయంలో కూడా కాస్ట్యూమర్ ని సంప్రదించే వారనీ,  షూటింగ్ కి పది పదిహేను రోజుల ముందే అందరి దుస్తులూ సిద్ధం చేసుకుని పెట్టుకునే వాళ్ళమనీ చెబుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు  జనకముని.

          విశాఖ పట్నం దగ్గర, చిట్టివలసకి చెందిన ఈయన 1995 లో సినిమా రంగానికొ చ్చారు. ‘కామ్రేడ్’ కి అసిస్టెంట్ గా చేసి, ‘గోకులంలో సీత’ నుంచి ‘తొలిప్రేమ’ వరకూ పవన్ కళ్యాణ్ కి పర్సనల్ అసిస్టెంట్ గా చేసి, ‘బద్రి’ తో పర్సనల్ కాస్ట్యూమర్ అయ్యానరు. మొత్తం కలిపి 18  సినిమాలు చేశారు. 

          వీటిలో చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘ప్రయాణం’ కి తనకో వింత అనుభవం ఎదురయిందిట. ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరిగింది. అది మంచు మనోజ్- పాయల్ ల మధ్య ఓ మూడు గంటల సేపు మాత్రం జరిగే కథతో కూడిన సినిమా. అంటే ఆ ఇద్దరూ సినిమా యావత్తూ అదే డ్రెస్ లో వుండాలన్న మాట. ఆ షూటింగ్ జరిగిన 45 రోజూలూ ఆ ఇద్దరి రెండు జతల దుస్తుల్నీ కాపాడుకోవడం కత్తి మీద సామే అయింది జనకమునికి. అవి మాసిపోతే వాషింగ్ చేయవచ్చుగానీ, లైటింగ్ తీవ్రతకి రంగులు వెలసిపోతే మాత్రం అంతే సంగతులు. దర్శకుడు చంద్రశేఖర్ సెలెక్టు చేసుకున్న ఆ డ్రెస్సులు ఎలాంటివంటే మార్కెట్లో ఎక్కడా వాటికి మారు జతల్లేవు. అంటే ‘బేబీస్ డే అవుట్’  లో ఒక చంటి పిల్లాడు షూటింగ్ లో అలసిపోతే,  వాడి కవలని పెట్టి తీసే లాంటి అదృష్టం ఇక్కడ జనకమునికి లేదన్నమాట.

          ఇలాటి వింత అనుభవాలతో భోజ్ పురి, బెంగాలీ సినిమాలకి కూడా పనిచేశారు. తెలుగు కాస్ట్యూమర్స్ యూనియన్ కి 2005-09 మధ్య ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు జనకముని.


-సికిందర్
(2011 మార్చి ఆంధ్రజ్యోతి ‘సినిమాటెక్’ శీర్షిక) 

Friday, December 9, 2016

రివ్యూ!

స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సురేంద్ర  రెడ్డి
తారాగణం : రాం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి. పోసాని కృష్ణ మురళి తదితరులు
కథ : మోహన్ రాజా ( ‘తని ఒరువన్’ తమిళ కథ) మాటలు : వేమా రెడ్డి,  సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : పీఎస్ వినోద్
బ్యానర్ : గీతా ఆర్ట్స్
నిర్మాతలు : అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్
 
విడుదల: 9 డిసెంబర్,2016
***
       గోవిందుడు అందరి వాడేలే,  బ్రూస్ లీ లవంటి రెండు వరస పరాజయాలతో సందిగ్ధంలో పడ్డ రాం చరణ్ తమిళ రీమేక్ ‘తని ఒరువన్’ ని ఆశ్రయించాడు. ఈ మధ్య పరాజయాల్లో వున్న కొందరు స్టార్స్ ని రీమేకులే కాపాడినట్టు, రాం చరణ్ ని కూడా ఇదే కాపాడాలి. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కిక్ -2 పరాజయం నుంచి ఈ రిమేక్ తో రింగులోకి రావాలని ప్రయత్నించాడు. గీతా ఆర్ట్స్ హంగూ ఆర్భాటాలని కూడా కలుపుకుని మొత్తానికి ‘ధృవ’  విడుదలయ్యింది. ఇదెలా వుందో ఈ కింద చూద్దాం.
కథ 
        ధృవ (రాం చరణ్)  ఒక ఐపీఎస్ ఆఫీసర్. తోటి యువ ఐపీఎస్ లతో ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. ఐపీఎస్ ట్రైనీగా వున్నప్పుడు నగరంలో జరుగుతున్న కొన్ని నేరాల్ని గమనిస్తూంటాడు. ఈ చిన్న చిన్న నేరాల వెనుక కొన్ని పెద్ద నేరాలని దాచే కుట్ర సాగుతోందని పసిగడతాడు. ఈ పెద్ద నేరాలు చేసే ఘరానా వ్యక్తులు పదిహేను మంది వున్నారని తెలుసుకుంటాడు. వీళ్ళల్లో ఎవర్ని పట్టుకుంటే వీళ్ళ కింద పనిచేస్తున్న వంద నేరగాళ్ళు క్లోజ్ అవుతారో వాళ్ళని కనిపెట్టాలనుకున్నప్పుడు, ఓ ముగ్గురు ఘరానా పెద్ద మనుషుల వెనుక  సిద్ధార్థ్ ( అరవింద్ స్వామి) అనే సైంటిస్టు వున్నాడని అర్ధమవుతుంది. ఇతన్ని టార్గెట్ చేస్తాడు. ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న చవక ధరల జెనెరిక్ మందుల్ని అడ్డుకుని మెడికల్ మాఫియా ని కొనసాగించుకోవాలని సిద్ధార్థ్ చూస్తూంటాడు. దీనికి ధృవ  బీటలు కొట్టడం మొదలెడతాడు. ఇది గమనించిన సిద్ధార్థ్ ఒక కాల్పుల సంఘటనలో గాయపడ్డ ధృవ  శరీరంలోకి  మైక్రో చిప్ ని పెట్టించి అతడి కదలికల్ని, మాటల్నీ గ్రహిస్తూంటాడు. ధృవకి ఆప్తులైన వాళ్ళని టార్గెట్ చేసి ధృవని  బలహీన పర్చాలని చూస్తూంటాడు. ఈ పోరాటంలో చివరికి ఎవరిది, ఎలా పైచేయి అయ్యిందన్నదే మిగతా కథ.
ఎలావుంది కథ 
       ఒరిజినల్ కి ట్రూ కాపీ, అక్కడక్కడ చాలా స్వల్ప మార్పులు తప్పితే. ఇదొక మైండ్ గేమ్ తో కూడిన కథ అన్నారు. ఈ మైండ్ గేమ్ లో, మొత్తం కథా కథనాల్లో,  ఒరిజినల్లో వున్న సవాలక్ష తప్పులే దొర్లాయి. ఈ తప్పులతోనే తమిళంలో ఇలాగే హిట్టయింది కాబట్టి, ఆ సెంటిమెంటు పెట్టుకుని అలాగే తీసేశారు. ప్రేక్షకులందరూ తమ జీవితాల్లో అనుభవంలోకి రాని మైండ్ గేమ్స్ నీ, ఇతర ఇంటలెక్చువల్ అంశాలనీ తెలుసుకోగలిగే ఎక్స్ పర్ట్స్ కాలేరు కాబట్టి,  పైపైన యాక్షన్ చూసేసి ఇదే  చాలనుకోవచ్చు.  అయితే జయం రవితో తమిళ ప్రేక్షకులు వేరు, రాం చరణ్ తో తెలుగు ప్రేక్షకులు వేరు. జయం రవి,  రాం చరణ్ అంత పెద్ద స్టార్ కాదు. తమిళంలో  ఒక  స్టార్ డమ్, దాంతో వుండే అంచనాలూ వంటి ఏ బాదరబందీ లేకుండా ఒక న్యూవేవ్ థ్రిల్లర్ లాగా వచ్చి విజయం సాధించింది. తెలుగులో స్టార్ డమ్, దాంతో అంచనాలూ రెండూ వుంటాయి కాబట్టి,  అలాటి కమర్షియల్ మసాలాలూ లేని ఈ కథ ని ఒక సీరియస్ యాక్షన్ గా సిద్ధపడి చూడాల్సి వుంటుంది.
ఎవరెలా చేశారు 
        రాం చరణ్ చేయడానికి ఈ సినిమాలో ఒక సూపర్ ఎమోషన్ అంటూ, బాధ అంటూ లేదు. యాక్షన్ హీరోగా మాత్రమే చేసుకుంటూ పోతూ కన్పిస్తాడు. క్యారక్టర్ కి ఔటర్ యాక్షనే తప్ప, తన లాంటి స్టార్ తో  ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే ఇన్నర్ యాక్షన్ లోపించడంతో ప్రేక్షకుల్ని అంతగా  సమ్మోహితుల్ని చేసే నటన కనపడదు. తనతో వుండే కామెడీ, అల్లరి. అలాటి పాటలూ వుండవు. క్లయిమాక్స్ కూడా ఏమాత్రం యాక్షన్ లేకుండానే ముగిసిపోవడం ఒక మైనస్సే. పైన చెప్పుకున్నట్టు జయం రవి స్థాయికి కి సరిపోయిన పాత్ర రాం చరణ్ కి చాల్లేదని కచ్చితంగా చెప్పాలి.
     ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తమిళం ఒరిజినల్లో  నయన తారకి లాగే పెద్దగా పాత్రలేదు. ప్రేమ కోసం వెంటపడే, పాటలు పాడే అవసరాలకి పనికొచ్చే గ్లామర్ బొమ్మ పాత్రగా వుండిపోతుంది. విలన్  గా వేసిన అరవింద్ స్వామి తమిళంతో తను వేసిన పాత్రకి డిటోనే. తమిళం చూడని ప్రేక్షకులకి కొత్తగా అన్పిస్తాడు. 
       టెక్నికల్ గా సినిమాతో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమిటంటే, హిప్ హాప్ తమిళ అనే కొత్తగా వస్తున్న సంగీత దర్శకుడి గందరగోళం గోల! ఎక్కడా ఒక్క నిమిషం కూడా తెరిపి నివ్వకుండా, చెవిపోటు వచ్చే  హారిబుల్ నేపధ్య సంగీతాన్ని వాయించేశాడు. అసలే కథా కథనాలు, సన్నివేశాలూ ప్రేక్షకులు బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తూ చూడాల్సిన హైటెక్ –కొన్ని చోట్ల సైంటిఫిక్ మైండ్ గేమ్  అయితే, అలాటి ఏకాగ్రతకి అవకాశమే ఇవ్వకుండా  ఇష్టమొచ్చిన శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ థ్రిల్ ని చంపేశాడు. కనీసం ఏ కీలక డైలాగు దగ్గర తన హోరు ఆపితే ఆ డైలాగు ఎఫెక్టివ్ గా వుంటుందో కూడా తెలీనట్టు తలనొప్పి పుట్టించి వదిలాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి ఎందుకు అంగీకరించినట్టో తెలీదు. ఇక పాటలు ఘోరం. ఒక్క ఎస్ వినోద్ కెమెరా వర్క్ మాత్రం ఫర్వాలేదు. కానీ ఎంత స్టయిలిష్ చిత్రీకరణ వుండీ ఏం లాభం సంగీత దర్శకుడు అలావుంటే? 
చివరికేమిటి 
      ఒక స్టార్ సినిమాతో బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అలవాటైన మసాలాలేవీ ఇందులో కన్పించవు. ఈ సినిమాని ఆ ప్రేక్షకులు ఒక మెట్టు పైకెదిగి రాం చరణ్ చేసిన ఒక డిఫరెంట్ ప్రయత్నంగా తీసుకుని చూడాలి. అయితే విషయం గ్రహించడానికి కష్టపడాల్సిన ఈ హైటెక్-సైంటిఫిక్  మైండ్ గేమ్స్ కంటెంట్ ని దెబ్బకొట్టే,  హిప్ హాప్ తమిళ సంకట సంకర సంకీర్ణ  సంగీతాన్ని గట్టిగా  కాచుకోవాల్సి వుంటుంది. ఎప్పుడు ఉండుండి ఏ విచిత్రమైన ట్యూన్లు వాయిస్తాడో తెలీదు. దాంతో ఈ ట్యూనేమిట్రా దేవుడా అని దృష్టి సీన్ల మీంచి చెదిరి ఆ ట్యూన్ల మీదికి పోతుంది. అతి పెద్ద విలన్ ఈ సినిమాకి హిప్పు హాప్పుల సంగీత దర్శకుడే. జీవితంలో కొట్టాల్సిన సంగీత పరికరాలన్నీ తెచ్చి కొట్టి పారేశాడు. ఇతణ్ణి ఒక్క సీనులోనైనా ఆ పరికరాలతో చూపించి వుంటే బావుండేది.
    
-సికిందర్
http://www.cinemabazaar.in

Thursday, December 8, 2016

రివ్యూ!


స్క్రీన్ ప్లే దర్శకత్వం : సుజోయ్ ఘోష్
తారాగణం : విద్యాబాలన్,అర్జున్ రాంపాల్, నైషా సింగ్, టునీషా శర్మ, అంబా సన్యాల్, మానినీ చద్దా, ఖరజ్ ముఖర్జీ, జుగల్ హన్స్ రాజ్ తదితరులు
కథ : సుజోయ్ ఘోష్, సురేష్ నాయర్, మాటలు : రీతేష్ షా
సంగీతం : క్లింటన్ సెరెజో, చాయాగ్రహణం : తపన్ బోస్
బ్యానర్ : బౌండ్ స్క్రిప్ట్ మోషన్ పిక్చర్స్, పెన్ ఇండియా లిమిటెడ్
నిర్మాతలు : సుజోయ్ ఘోష్, జయంతీలాల్ గడా
విడుదల :  2డిసెంబర్ 2016
***
          2012 కహానీకి సీక్వెల్ గా చెప్పుకుంటూ విడుదలైన కహానీ -2’ నిజానికి కొనసాగింపు కథేమీ కాదు, పాత్రలూ వేరు. కథ, పాత్రలు వేరైనప్పుడు సీక్వెల్ అనలేం. అయితే  దర్శకుడు సుజయ్ ఘోష్ దీనికింకో విధంగా చెప్పాడు- ‘కహానీఅనేదాన్ని  ఒక ప్రత్యేక  జానర్ కి పర్యాయపదంగా తీసుకోవాలని. స్త్రీని శక్తివంతంగా చూపించే జానర్ ని  కహానీఅనాలని. కాబట్టి  ఇకనుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని కహానీ సినిమాలుఅనాలేమో. కానీ కహానీల్నిక్రైం ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ సుజయ్- విద్యా బాలన్ ద్వయం తప్ప ఇంకెవరూ తీయలేరనేంత  గట్టి ముద్ర వేసి వదుల్తున్నారు- మొదటి కహానీఎంత పవర్ ఫుల్లో, ఇప్పుడు రెండో కహానీ’  అంతకంటే పవర్ఫుల్ ! మధ్యలో వచ్చిన అనిరుథ్ రాయ్ చౌధురి- తాప్సీల పింక్లాంటివి అరుదుగా వస్తాయి. శక్తివంతమైన స్త్రీని చూపించడ మంటే ఇక్కడ ఏ ఉద్యమనాయకురాల్నో చూపించడం కాదు- నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని హీరోయిన్  పాత్ర చుట్టూ సస్పెన్స్  థ్రిల్లర్స్ గా చేసి చూపించడం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్ని నేటి యూత్ ఫ్రెండ్లీ సినిమాలుగా మార్చి వినోదపర్చడం...సొమ్ము చేసుకోవడం... 

         
దివరకు చెప్పుకున్నట్టు బాలీవుడ్ లో బస చేసిన బెంగాలీ దర్శకులు విలక్షణమైన సినిమాలు తీస్తున్నారు. ఇటీవలే పింక్తర్వాత ఇప్పుడు కహానీ -2 అంతటి కళ్ళు తిప్పుకోనివ్వని పకడ్బందీ థ్రిల్లర్. సినిమా చూస్తూ రివ్యూ రైటర్ మెమోలో ఏదైనా పాయింటు ఫీడ్ చేసుకోవాలన్నా ఏకాగ్రత దెబ్బతినేసేంత బిగిసడలని కథాకథనాల క్రియేటివ్ ప్రాసెస్ ఇది. ఒక విద్యాబాలన్ కోమాలో కెళ్ళిపోయి, ఇంకో విద్యాబాలన్  హేండాఫ్ క్యారక్టర్లా యాక్షన్లో కొచ్చి  కుతకుతలాడే కసినంతా తీర్చుకునే విలాసవంతమైన క్వాలిటీ మూవీ...

కథ 
      విద్యా సిన్హా (విద్యా బాలన్) ఒక ఉద్యోగం చేసుకుంటూ పధ్నాల్గేళ్ళ  కూతురు మిన్నీ (టునీషా శర్మ) ని పోషించుకుంటూ వుంటుంది. కాళ్ళు పడిపోయిన కూతురు చక్రాల కుర్చీకీ, మంచానికీ బందీ అయిపోయి వుంటుంది. ఉంటున్నది కలకత్తా దగ్గరలో చందాపూర్ అనే చిన్న టౌన్లో. కూతురికి వైద్యం అమెరికాలో సాధ్యపడుతుందని డాక్టర్ అంటే  అమెరికా తీసికెళ్ళే ప్రయత్నాల్లో వుంటుంది. ఇంతలో కూతుర్ని కిడ్నాప్ చేశామని కాల్ వస్తుంది. విద్యాసిన్హా ఆదరాబాదరా పరిగెడుతూ యాక్సిడెంట్ పాలయ్యి కోమాలో కెళ్ళిపోతుంది. సబిన్స్ పెక్టర్ ఇందర్జిత్ సింగ్ (అర్జున్ రాంపాల్) రంగంలో కొస్తాడు. కోమాలో వున్న విద్యా సిన్హాని చూడగానే షాకవుతాడు. డాక్టర్ ఆమె ఐడీ చూపించి, ఈమె విద్యా సిన్హే అంటాడు. కాదు ఈమె కలింపాంగ్ లో వుండాల్సిన దుర్గా రాణీ  సింగ్ అని ఇందర్జిత్  సింగ్ ఆమె ఇంటికెళ్ళిపోయి  సోదా చేస్తాడు. ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతూంటే దిమ్మదిరిగిపోతుంది...

      తర్వాత పైఅధికారి ఇందర్జిత్ కి ఒక హేండ్ బిల్ అందించిఈ వాంటెడ్ కిల్లర్ ని పట్టుకోవాలని ఆదేశిస్తాడు. ఆ ఫోటో చూస్తే దుర్గా రాణీ సింగ్ దే. కలింపాంగ్ లో ఎనిమిదేళ్ళ క్రితం ఒక మర్డర్ చేసి, ఇంకో కిడ్నాప్ చేసి పారిపోయిన దుర్గా రాణీ సింగ్ ని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుందంటాడు పై అధికారి. ఒకవైపు కోమాలో వున్న విద్యాసిన్హా, ఇంకో వైపు చేతిలో దుర్గా రాణీ సింగ్ గురించిన డైరీ...ఇందర్జిత్ కి బుర్ర వేడెక్కిపోతుంది.

        అసలు విద్యా సిన్హాగా పేరు మార్చుకున్న దుర్గా రాణీ సింగ్ ఎవరు? ఆమె ఎందుకు ఎవర్ని మర్డర్ చేసి, ఎవర్ని కిడ్నాప్ చేసింది? ఇప్పుడు కిడ్నాపైన కూతురు ఎక్కడుంది? ఎవరు ఎందుకు కూతుర్ని కిడ్నాప్ చేశారు? కోమాలో వున్న విద్యా సిన్హా కి మాత్రమే  తెలిసిన ఈ కూతురి కిడ్నాప్ గురించి ఇందర్జిత్ సింగ్ ఎప్పుడు తెలుసుకున్నాడు? విద్యాసిన్హా కోమాలోంచి మేల్కొంటుందా లేదా? ఈలోగా ఇందర్జిత్ సింగ్ పై అధికారినుంచి విషయాలు దాస్తూ ఏం పాట్లు పడ్డాడు? అసలెందుకు విషయాలు దాస్తున్నాడుపెళ్ళయిన ఇతడికి దుర్గా రాణీ సింగ్ తో వున్న సంబంధమేమిటి? ఈ సంబంధం బయటపడితే పీక్కునే దేంటి?....ఇన్ని చిక్కు ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. అదేమిటో తెరపైనే చూడాలి.

ఎలావుంది కథ 
      ఈ పైకి కన్పిస్తున్నదంతా కథ కాదు. ఇదంతా ఇంకో కథకి కథ. 2014 లో ఆలియా భట్- రణదీప్ హుడా లతో ఇంతియాజ్ అలీ తీసిన హైవేలో చివర బయట పడే కథే, ‘కహానీ -2’  లో మందు
పాతరలా మధ్యలో పేల్తుంది. కాకపోతే హైవేలో అది హీరోయిన్ ఆలియా భట్ పాత్ర అనుభవమైతే, ‘కహానీ -2’ లో బాల పాత్ర మిన్నీ వ్యధ. ఎక్కడో ఓ చోట, ఇళ్ళల్లో  చిన్న పిల్లలతో  పాల్పడుతున్న చైల్డ్ ఎబ్యూజ్ అనేది ఎవ్విరీ డే న్యూజ్ లాగా మారిపోయిన ప్రస్తుత కాలంలో, అందులోంచి తనకేమీ కాని ఆరేళ్ళ ఓ పిల్లని కాపాడేందుకు ఓ సాధారణ స్కూలు ఉద్యోగిని తెగించి ఏమేం చేసిందన్నది, ఈ క్రమంలో ఏమేం కోల్పోయిందన్నదీ అసలు కథ. నిత్యజీవితంలో సమస్యల్ని ఇంకా ప్రేక్షకుల్ని ఏడ్పిస్తే డబ్బులొస్తాయనే రొడ్డకొట్టుడు ఏడ్పు కథగా కాకుండా, సస్పెన్స్ థ్రిల్లర్ గా చేసి చూపిస్తూఓ సరికొత్త వీక్షణానుభవాన్నిచ్చే వుమన్ ఎంపవర్ మెంట్ కథ.

ఎవరెలా చేశారు
     విద్యాబాలన్ గురించి ఇంకా చెప్పుకోవాల్సిందేముటుంది. సరైన పాత్ర ఇస్తే దాని దుంపతెంచుతుంది. మేకప్ కూడా అవసరం లేకుండా నటించి పారేస్తుంది. గ్లామర్ కోసం పాత్ర లబోదిబోమన్నా చెప్పినట్టు పడుండమంటుంది. ఫ్రీ స్టయిల్ నటన ఆమెది. రెండు పాత్రలతోనూ  సస్పెన్స్ థ్రిల్లర్ ని హై వోల్టేజ్ డ్రామాలాగా మార్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పాత్ర ( దుర్గా రాణీ సింగ్)కి వ్యతిరేకంగా సంపన్నుల కుటుంబం, స్కూలు యాజమాన్యం, లేడీ కానిస్టేబుల్ చేసే అన్యాయాలకి తనదైన వ్యూహరచనా సామర్ధ్యంతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. మళ్ళీ ప్రస్తుత  విద్యాసిన్హా పాత్రలో వాంటెడ్ కిల్లర్ గా చందా నగర్ నుంచీ కలకత్తా దాకా పోలీసుల్ని కిందామీదా చేసేస్తుంది. మిన్నీని అమెరికా తీసికెళ్ళే తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు- ఆపితే అయిపోయారన్నట్టే ఒక్కొక్కళ్ళూ. ఆమెని కిల్లర్ గా భావించుకునే మనుషులేగానీ, ఆమె తల్లికాని తల్లి  మనసుని కూడా ఎవరూ పట్టించుకోని విషాదం పాత్రచుట్టూ వుంటుంది. స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారో లేదో గానీ, ఒక స్కూలు క్లర్క్ గా, పెళ్ళికాని దుర్గా రాణి ఎందుకు ఒక స్కూలు బాలిక కోసం సింగిల్ మదర్ గా జీవితాన్ని డిసైడ్ చేసుకుందన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి ఆమె కథే సమాధానం. విద్యాబాలన్ వి ఈ రెండూ ఆదర్శ పాత్రలు

    సబిన్స్ పెక్టర్ గా అర్జున్ రాం పాల్ ది కూడా చాలాసహజ  పాత్ర
కాస్త ఏమీ పట్టని తత్త్వంతను వస్తూంటే కానిస్టేబుల్ కూర్చుని వున్నా పెద్దగా పట్టించు
కోడు
ఎంక్వైరీ కెళ్ళినప్పుడు పేపరు చదువుకుంటున్న  ఒకడ్ని అడ్రసు అడిగితే,  వాడు పేపరు పేపరు చదువుకోవడమే తప్ప తనని పట్టించుకోకపోయినా-  ఏం చేస్తాం..అనుకుంటూ వెళ్ళిపోయే రకం  అర్జున్ రాం పాల్ సబిన్స్ పెక్టర్ పాత్ర.  కోపమనేదే వుండదుఇదే బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో కహానీ’ లో కూడా పోలీసు పాత్రలు ఇలాటి  డిఫరెంట్ ఫీల్ నే ఇస్తాయిఅర్జున్ రాం పాల్ లాగే  పై అధికారి పాత్రలో ఖరజ్ ముఖర్జీ ఆసక్తికర పాత్ర పోషించాడు.

        మిన్నీగా ఆరేళ్ళ బాలికగా నైషా ఖన్నా నటిస్తేపధ్నాల్గేళ్ళ బాలికగా టునీషా శర్మ నటించిందిఇద్దరూ లైంగికంగా తనకేం జరుగుతోందో తెలీని పసితనపు  మిన్నీ అంతరంగాన్ని సున్నితంగా ఆవిష్కరించారుమిన్నీ నానమ్మ పాత్రలో అంబా సన్యాల్ ది టెర్రిఫిక్ నటనఆమె కొడుకు పాత్రలో జుగల్ హన్స్ రాజ్లేడీ కానిస్టేబుల్ పాత్రలో మానినీ  చద్దా మరో రెండు నెగెటివ్ పాత్రలు పోషించారు.  

      నటనలకినటింప జేయడాలకీ ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ లా వుంటుంది దర్శకుడి ప్రతిభక్లింటన్ సెరేజో సంగీతం లోని మూడు బ్యాక్ గ్రౌండ్ పాటల్లో లమ్హోకే రస్ గుల్లే’ ( రసగుల్లా ల్లాంటి క్షణాలుపాట టాప్తపన్ బసు ఛాయాగ్రహణం రియల్ లోకేషన్స్ లోముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్ లో ఓ కళాత్మక చిత్రణసబ్ కాన్షస్ గా ప్రేక్షకుల్ని సన్నివేశాల్లో సంలీనం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వెలిగే వర్ణ కాంతులతో ఒక అద్భుత ప్రయోగం చేశారురోడ్ల మీద పసుపు పచ్చ కాంతి ప్రసరింపజేయడం కూడా అందులో ఒకటి. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో వివిధ రూపకాలంకారాల్ని వాడినట్టు ఇక్కడ వర్ణకాంతుల్ని ఉపయోగించారుసినిమాకి ఛాయాగ్రహణంతో కూడా చాలా పనుంటుందని ఇక్కడ నిరూపించారుకథ కాన్షస్ లెవెల్లో ప్రేక్షకులకి అందితేఇలాటి ఛాయాగ్రహణం లోతుగా సబ్ కాన్షస్ లెవెల్ కి తీసికెళ్తుందిఒక హిప్నాటిక్ లోకాన్ని సృష్టిస్తుందిబెంగాల్లోని చందా నగర్కలింపాంగ్కలకత్తా లొకేషన్స్  కాసేపు ఈ హిందీ సినిమాని కొత్త లోకాలకి తీసికెళ్తాయి.

చివరికేమిటి 
       మొదలెట్టింది లగాయత్తూ  ముగిసేదాకా ఒక్క క్షణం కూడా కళ్ళు తిప్పుకోనివ్వని సస్పెన్స్ థ్రిల్లర్ గా దీన్ని రెండు మూడు సార్లు చూడొచ్చు. ప్రతి సీనూ, ప్రతీ షాటూ క్షణం క్షణం కథని ముందుకు పరిగెత్తించేవే తప్ప ఎక్కడా కథని ఆపి కాలక్షేపం కోసం లేవు. చాలా పూర్వం అగర్, ఔర్ కౌన్ లలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని గుర్తుకు తెచ్చేలా వుండే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పటి కాలానికి హై టెన్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. మొదటి పదినిమిషాల్లోపు పాత్రకి యాక్సిడెంట్ అయ్యే ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసిమళ్ళీ చివర పదిహేను  నిమిషాల  ముందు పాత్ర కోమాలోంచి లేవడంతో ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి- మధ్యలో అంతా  గత/ వర్తమాన కాలపు యాక్షన్స్ తో సంక్షుభితంగా వుంటుంది మిడిల్. నడుస్తున్న కథకి ఎలా స్పష్టమైన బిగినింగ్-మిడిల్-ఎండ్ లుంటాయో, అలా  గడిచిపోయిన కథకీ వుంటాయి. డైరీపేజీల్లోంచి వంతులవారీగా వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ తో ఈ గడిచినపోయిన కథ వుంటే, ప్రస్తుత కాలంలో కేసుతో పోలీసుల సంఘర్షణగా  వుంటుంది

        పకడ్బందీ రచన, పకడ్బందీ నటనలు ఎందుకు సాధ్యం కావు మనసుంటే- ఏదో నడిచిపోతుందని స్టార్ వేల్యూ మీద ఆధారడిపోయి చుట్టేస్తే అదొక సినిమా అన్పించుకుంటుందా? ప్రేక్షకులు దొంగ నోట్లు ఇవ్వడంలేదు దొంగ సినిమాలు చూపించడానికి- దొంగ సినిమాల మధ్య అప్పుడప్పుడు ఇలాటి దొర సినిమాలు వస్తున్నా, తేడా పసిగట్టలేని ప్రేక్షకులు వుంటున్నందువల్లే బరితెగించి దొంగ సినిమాలు వస్తూంటాయి.... ‘కహానీ -2’ దొరసాని సినిమా!


-సికిందర్
http://www.cinemabazaar.in











Saturday, December 3, 2016

రివ్యూ!





రచన - దర్శకత్వం : వైశాఖ్
తారాగ‌ణం: మోహ‌న్‌లాల్‌, క‌మ‌లినీ ముఖ‌ర్జీ, జ‌గ‌ప‌తిబాబు, లాల్‌, విను మోహ‌న్ బాల త‌దితరులు
క‌థః ఉద‌య్ కృష్ణ‌, సంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయా గ్రహ‌ణం: షాజీ కుమార్‌
బ్యానర్ :
 శ్రీ స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్
నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి
విడుదల : డిసెంబర్ 2, 2016
***


      మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ మధ్య తెలుగు ప్రేక్షకుల  మధ్యకి వరసగా వచ్చేస్తున్నాడు. మనమంతా, జనతా గ్యారేజ్ ల వంటి డైరెక్టు తెలుగు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్లో గుర్తిపు సంపాదించుకున్న మోహన్ లాల్, ఇప్పుడు  మూడో ప్రయత్నంగా మలయాళ డబ్బింగ్ ‘మన్యం పులి’ (పులి మురుగన్) తో విచ్చేశాడు. మలయాళం లో ఇది నూట పాతిక కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. భారీ సెట్టింగులు, లొకేషన్లు, కాస్ట్యూమ్స్, తారాగణం, గ్లామర్ మొదలైన రెగ్యులర్ కమర్షియల్ హంగులేవీ లేకుండానే పాతిక కోట్ల బడ్జెట్ తో తీసి, నూట పాతిక కోట్లు సంపాదించుకోవడం రికార్డే. అదీ కేరళ లాంటి చిన్న మార్కెట్ లో. ఏమైనా సినిమా తీయడంలో ఈ కొత్త బేసిక్స్ ని ఆహ్వానించాల్సిందే. అయితే ఇది ప్రేక్షకుల బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ని సొమ్ముచేసుకోవడం అవుతుందేమో ఆలోచించాలి...

 కథ       అది పులియూర్ అనే మన్యం ప్రాంతం. అక్కడ  పులులు మనుషుల్ని చంపి తింటూంటాయి. పదేళ్ళ కుమార్ అలియాస్ కుమారస్వామి తండ్రిని కూడా పులి తినేస్తుంది. అంతకి ముందే తల్లి చనిపోతుంది. చిన్నపిల్లాడుగా వున్న  తమ్ముడు మణి తో మిగులుతాడు. తండ్రిని చంపిన పులిని చంపడం కోసం తర్ఫీదు  పొందుతాడు. ఆ పులిని వలపన్ని చంపేస్తాడు. పెద్దయ్యాకా మన్యంలోనే స్థిరపడి లారీ డ్రైవర్ గా బ్రతుకుతూంటాడు. మరోవైపు మనుషులని చంపుతున్న పులుల్ని చంపుతూంటాడు. దీంతో చట్టం దృష్టిలో పడతాడు. ఫారెస్ట్  రేంజర్ (కిషోర్) కుమార్ ని పట్టుకోవాలని ప్రయత్నిస్తూంటాడు. కుమార్ ప్రేమిస్తున్న మన్యం పిల్ల మైనా (కమలినీ ముఖర్జీ) మీద కన్నేస్తాడు. అతన్నుంచి తప్పించుకున్న ఆమెని  కుమార్ పెళ్లి చేసుకుంటాడు. కూతురు పుడుతుంది, అయినా రేం జర్ ఆమెని వదిలిపెట్టడుతాడు. రేంజర్ ని చిత్తుగా తంతాడు కుమార్. రేంజర్  ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోతాడు. కుమార్ తమ్ముడి స్నేహితులు ఆయుర్వేద పరిశోధనలకోసం మన్యం వస్తారు. ఆ గంజాయి మొక్కల్ని లారీ కెక్కించుకుని కుమార్ ని రమ్మంటారు. ఆయుర్వేద కంపెనీలో తమ్ముడికి జాబ్ ఇప్పిస్తామని తీసుకుపోతారు. అక్కడ డాడీ గిరిజ (జగపతి బాబు) అనే కంపెనీ ఓనర్ దగ్గర బస చేస్తారు.  కట్ చేస్తే, ఆ డాడీ కుమార్ ని చంపడం కోసం తిరుగుతూంటాడు. ఎందుకు? కుమార్ వల్ల ఇతడికేం నష్టం జరిగింది? ఏమిటా కథ?...అన్నది తెర మీద చూడాలి.

ఎలావుంది కథ  
       చాలా అతుకుల బొంతలా వుంది. మొదటి అరగంట చూసి నిద్రపోయి, చివరి అరగంట చూస్తే చాలు- ఎందుకంటే ఇవి యాక్షన్ సీన్సు గనుక. యాక్షన్ సీన్స్ తప్ప ఈ సినిమాలో కథని భరించడం కష్టం. మృగం (పులి) మానవ  మృగం (జగపతిబాబు పాత్ర) అనే కాంట్రాస్ట్ పెట్టి వీటితో హీరో తలపడే కథ పూర్తిగా ఉద్దేశం అంతుచిక్కని అతుకులబొంత కథ. పులి- పులి వేట అనగానే ఎవరికైనా జిమ్ కార్బెట్ (1875-1955) గుర్తుకొస్తాడు. ఆనాడు బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ హంటర్ అయిన ఇతను నరమాంస భక్షక పులుల్ని సంహరించేవాడు ప్రభుత్వ  ఆదేశాలతో. మనిషిరక్తం రుచి మరిగిన పులులు  సమీప గ్రామాల్లోకి వచ్చి దాడి చేసేవి. వీటిని పట్టుకుని షూట్ చేసేందుకు జిమ్ కార్బెట్ అడవుల్లో చేసే ప్రాణాంతక సాహసాలు గగుర్పాటు కల్గించే విధంగా వుంటాయి. మన్యంపులి కథలో పులులు గ్రామాల మీద దాడి చేయవు. అడవుల్లో ఉంటున్న వాళ్ళ  మీదే  పడుతూంటాయి. ఒక సీనులో ఒక పాత్ర ఓ పాముని పట్టుకుని సురక్షితంగా వదిలిపెడుతూ- ఇది వున్న చోటుకి మనం రావడం తప్పంటాడు. అందుకని దాన్ని చంపకుండా పక్కకి తీసికెళ్ళి వదిలేస్తాడు. మరి ఇది పులులకీ వర్తించదా? పులులుండే చోట మనుషులు ఎందుకుండాలి? అవి చంపుతున్నాయని వాటినెందుకు చంపడం? రెండోది, బాల్యంలో హీరో తండ్రిని చంపిన పులి అదే అని ఎలా గుర్తు పట్టి చంపాడు? జిమ్ కార్బెట్ గ్రామం మీద దాడి చేసిన పులి అడుగుజాడల్ని పరిశోధించి, వాటి ఆధారంగా అడవుల్లో సదరు పులిని అన్వేషించే వాడు. దానికోసం మంచె కట్టుకుని దాని మీద రేయింబవళ్ళు గడిపేవాడు. జిమ్ కార్బెట్ ఒక లెజెండ్. పులులతో తన అనుభవాల గురించి ఆయన రాసిన పుస్తకం చదివితే పులుల గురుంచి అంతా తెలిసిపోతుంది- వాటి స్వభావం, జీవనం, జిత్తులు సమస్తం. జిమ్ కార్బెట్ పేర ఉత్తరాఖండ్ లో నేషనల్ పార్క్ ఏర్పాటయ్యింది. 

        మన మన్యం హీరో అసలే అంతరించిపోతున్న పులి జాతిని అలా చంపుతూంటే మనకే కోపం వస్తుంది. దాన్ని హీరోయిజంగా తీసుకుని ఎలా ఎంజాయ్ చేయగలం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పులి దాని స్వభావం కొద్దీ తండ్రిని చంపిందని జీవితాంతం పులుల మీద ద్వేషం పెంచుకునే మానసికంగా ఎదగని, ఓ మానసిక పీడితుడి కథని ఓ హీరో మీద చూడ్డం  విజ్ఞులకి కష్టమే. ఈ కథ పర్యావరణానికే గాక, చట్టాలకీ వ్యతిరేకమని భావించాల్సి వుంటుంది. 

ఎవరెలా చేశారు
       
డ్డలుంగీ కట్టుకుని మాస్ పాత్ర నటించిన సూపర్ స్టార్ మోహన్ లాల్ అసలీ పాత్రద్వారా ఏం చెప్పాలనుకున్నాడో అర్ధంగాదు. పులుల్ని చంపే యాక్షన్ సీన్స్ కోసం మాత్రమే తనని చూడాలనుకున్నట్టు తయారయ్యిందే తప్ప మరొకటి కాదు. తన కుటుంబం పట్ల, స్నేహితులపట్లా  కనబర్చే మానవీయ కోణం ఏ దశలోనూ పులుల పట్ల ప్రదర్శించని -క్యారక్టర్ గ్రోత్, క్యారక్టర్ ఆర్క్ లేని, కథలో ఒక గోల్ లేని, దిశాదిక్కూ లేని పాత్రగా మిగిలిపోయాడు. ఒక చోట కమలినీ ముఖర్జీ పాత్రచేత తన్నించుకోవడం, ఇంకోచోట జగపతి బాబు పాత్ర కాళ్ళు పట్టుకోవడం లాంటి భేషజాలు లేని వ్యక్తిత్వాన్ని ఒక స్టార్ గా ప్రదర్శించినా- కాస్త మనసున్న ప్రేక్షకుల కోసం, ఇదే వినయాన్ని  కనీసం చివర్లోనైనా  పులులతో కూడా చాటుకోవాల్సింది. 

        కమలినీ ముఖర్జీది ఉత్తుత్తి రుసరుస లాడే పాత్ర కామెడీ కోసం. జగపతిబాబు పాత్ర ఇచ్చే బిల్డప్పులు ఓపెనింగ్ లో, ఇంటర్వెల్ లో ఎందుకోసమా అని చూస్తే చివర తేలేది సరుకులేని మ్యాటరే. 

        తెలుగులో మంచి సంగీతం ఇస్తున్న గోపీ సుందర్ ‘మన్యం పులి’ లో షాకింగ్ గా తలనొప్పి మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా చాలా పూర్ గా వుంది- దీన్ని కవర్ చేయడానికి హోరెత్తించే సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ రుద్దారు. డబ్బింగ్ కూడా నీటుగా లేదు- బి గ్రేడ్ సినిమాల్లో లాగా ప్రతీ డైలాగూ అరిచి (లౌడ్) మాట్లాడ్డమే. షాజీ కుమారన్ కెమెరా వర్క్, పీటర్ హెయిన్స్ యాక్షన్ కోరియోగ్రఫీ, సీజీ వర్క్, ఇవే సినిమాలో కాస్త నయమన్పించే అంశాలు.

        దర్శకుడు వైశాఖ్ దర్శకత్వంలో, రచనలో పూర్తిగా విఫలమయ్యాడు- విఫలమయ్యాడు అనేకంటే చవకబారు పనితం కనబర్చాడనండం న్యాయం. చాలా పాత కాలం ‘బి’ గ్రేడ్ సినిమా చూస్తున్నట్టు వుంటుంది. సీన్లు, కామెడీ, కథ అల్లిక మొదలైనవి చవకబారుగా వున్నాయి. ఎక్కడా కథనంలో టెన్షన్ అనేదే వుండదు. సీన్లు చప్పగా వచ్చిపోతూంటాయి. స్క్రీన్ ప్లే అనే మాటే ఇక్కడ వర్తించదు. కేవలం పేటర్ హెయిన్స్ యాక్షన్ ప్లే గురించే చెప్పుకోవాలి. ఇదంతా మాస్ కి వర్కౌట్ అయిపోతుంది. మలయాళం లో కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయోమో గానీ, తెలుగులో వీటిని తీసిపడేస్తే చీకాకు తప్పుతుంది.  

చివరికేమిటి
        రోజుల్లో పులుల్ని చంపడం నేరంగా కాదు, హీరోయిజంగా చూపించారు. ఇదే ఈ సినిమా ఇస్తున్న మెసేజ్. ఇందుకే హిట్టయింది. ఇక ఈసారి ఇంకో అడుగు ముందుకేసి వీరప్పన్ ఏనుగుల్ని ఎలా చంపాడో ఆ కథతో కూడా తీస్తే బాగా హిట్టవుతుంది. డిస్కవరీ ఛానెల్లో అమాయక జంతువుల్ని వెంటాడి చంపే పులుల్ని  షూట్ చేసి చంపినట్టు కూడా చూపిస్తే ఛానెల్ టీఆర్పీ బాగా పెరిగిపోతుంది...

-సికిందర్
http://www.cinemabazaar.in