రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 17, 2015

నాటి సినిమా!



ఎందరో దేవదాసులు- ఒక్కరే అక్కినేని నాగేశ్వర రావు. ఒక పురాతన
నవలా పాత్ర తరానికి నాల్గేసి సార్లు భిన్న రూపాల్లో వెండి తెరల కెక్కెతూ,
జన హృదయాల్ని దోచుకోవడం ఒక్క ‘దేవదాసు’ విషయంలోనే జరిగింది.
ఆ భిన్నరూపాలన్నీ ఒక్క అక్కినేనికే ఉపగ్రహాలయ్యాయని
ప్రపంచమే ఆయనకి  మోకరిల్లింది..


          క్కినేని నాటికి శరత్ బాబు జీవించి వుంటే, తన దేవదాసుకి అక్కినేని అభివ్యక్తికి సంభ్రమాశ్చర్యాలకి లోనై  నవలని పదేపదే తిరగరాసుకుందుకు విఫలయత్నాలు చేసి వుండేవాడేమో. పాత్రని సృష్టించిన తనకే అందని ఉన్నత శిఖరాలకి చేర్చిన అక్కినేని  అభినయ కౌశలానికి అస్త్ర సన్యాసం కూడా చేసి వుండే వాడేమో. నటన వచ్చేసి ఇలా సాహిత్యాన్ని శాసిస్తే ఆ నటనకే ఎనలేని గౌరవం. ఇందుకే దేవదాసు పాత్ర పోషణ మీద గుత్తాధి పత్యాన్నంతా ఒక్క మహానటుడు అక్కినేనికే కట్ట బెట్టేసి, జేజేలు పలుకుతోంది క్లాస్ మాస్ ప్రేక్షక లోకమంతా ఒక్కటై.

          ఒక నడిచే నరకం దేవదాసు. కొన్ని నగ్న సత్యాల్ని తెలుసుకోవాలంటే ఇలా జీవితాన్ని కాల్చుకోవాలేమో. నాటి మూకీల నుంచీ నేటి డీటీఎస్ ల దాకా, నాటి రేకుల టూరింగ్ టాకీసుల నుంచీ  నేటి ఏసీ మల్టీప్లెక్సుల దాకా, అన్ని పరిణామ దశల్లోనూ క్రమం తప్పకుండా వివిధ భాషల రీమేక్స్ ల రూపం లో ఉంటూ, ప్రచండ దేవదాసు వేస్తున్న దండోరా ఒక్కటే- పారాహుషార్ అంటూ ఒక్కో తరంలో ప్రేమించే హృదయాలకీ తస్మాత్ జాగ్రత్త చెబుతూ వస్తున్న దొక్కటే-  అది ఇప్పటి తరాని కొచ్చి - భగ్న ప్రేమంటే యాసిడ్ దాడి కాదురా బేవకూఫ్- నీ మందు సీసా! తను కాదన్నదని  పొడవడం కాదురా- నువ్వు చావడం! నరకమంతా నువ్వనుభవించడం- నీ స్వయంకృతం కదా!- అంటూ. 
ఇలా ముందింకెన్నో తరాలకీ కాలాన్ని బట్టి దండోరా వేస్తూనే ఉంటాడు దేవదాసు-  ది పాషనేట్ లవర్.

         
        జగమే మాయ బ్రతుకే మాయా - అన్నాడు...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - అని కూడా అన్నాడు దేవదాసు- ఇలా తెలుగు అక్కినేని దేవదాసు ఆధునిక యోగి వేమన అనడానికి ఇక సందేహించ నక్కర్లేదు. లేకపోతే తెలుగులో దీనికి సాటి రాగల తత్త్వాలు ఇంకే రీమేక్ లో పాడుకున్నాడు గనుక దేవదాసు. వేమన వైరాగ్యం వేరు- అతను  వ్యవస్థ బాధితుడు కాదు. దేవదాసుది వ్యవస్థ తెచ్చి నెత్తినేసిన వైరాగ్యం. తన ప్రేమకి సాంఘిక కట్టుబాట్లు అడ్డు గోడలైనప్పుడు, వాటిని ఎదుర్కోలేని బాధితు డతను. 1900 నాటి సాంఘిక వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. కుల మత ప్రాంతీయ తత్వాలు, ధనిక పేద వర్గ విభేదాలూ ఇవన్నీ ఈ ప్రపంచమున్నంత కాలమూ ఎక్కడికీ పోవు. వీటిని ఆసరాగా చేసుకుని ఏదో ఒక రూపంలో ఆనర్ కిల్లింగ్స్ అంటూ ఒక తంతు యదేచ్ఛగా జరిగిపోతూ వుంటుంది. ఓ జంటని వెలివేయడం కూడా ఒకరకమైన ఆనర్ కిల్లింగే. అంతస్తుల తేడాలు చూపించి దేవదాసు తండ్రి చేసిందీ ఇలాటి ఆనర్ కిల్లింగే. కాకపోతే పెళ్ళే  చేసుకోకుండా చాలా అన్యాయంగా ఆ ఆనర్ కిల్లింగ్ కి బలయ్యాడు దేవదాసు. అమానుషమైనది. గుండెల్ని పిండేసే పెను విషాదమిది. ఇంత విషాదాన్ని భరించినందుకే అన్నికాలాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని వర్గాల్లో అంత ఆరాధ్యుడయ్యాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సైతం రీమేక్స్ జరుపుకుని నివాళు లందుకున్నాడు.


        ఇలా ఒక విషాద గాథ చరిత్రయ్యింది. తెలుగులో కళా ఖండమయ్యింది. 1953 లో వినోదా సంస్థ నిర్మించింది. దేవదాసు తండ్రి హోదా కారణంగా ప్రేమించిన పార్వతికి దూరమై తాగుడు మరిగాడు. ముసలి జమీందారుని కట్టుకున్న పార్వతి వాడి గంపెడు సంతానంతో సతమత మవుతూ వుంది. దేవదాసు విషాదాన్ని తెలుసుకున్న పట్నపు చంద్రముఖి వేశ్యావృత్తి మానేసి అతడి సేవలో తరించింది. చెడ తాగుడు దేవదాసు ఆరోగ్యాన్ని తినేసి, పార్వతికిచ్చిన మాట ప్రకారం ఆఖరి ఘడియల్లో ఆమె వూరికి చేరుకున్నాడు. దిక్కు లేని శవంగా అతనక్కడ పడుంటే, చూద్దామని రివ్వుమని  పరిగెత్తుకొచ్చిన పార్వతి- ధడాలున మూసుకున్న జమీందారీ తలుపులు తగిలి పడిపోయింది. దేవదాసు కట్టె  చితిమంటలకి ఆహుతైపోయింది.


          చావెదురైనా మూఢాచారాలు మనిషి పట్ల ఎలాటి దయనూ  చూపనే చూపవని చెప్పే ఈ కథలో, దేవదాసు తండ్రిగా ఎస్వీ రంగారావు, మిత్రుడు భగవాన్ గా పేకేటి శివరాం కన్పిస్తారు. పార్వతిగా సావిత్రి, ఆమె తండ్రిగా దొరస్వామి, భర్తగా సీఎస్ఆర్ ఆంజనేయులూ కన్పిస్తారు. చంద్రముఖిగా లలిత నటించింది. మరణమో రామచంద్రా అంటూ ప్రవాహంలో కొట్టుకు పోవడమే తప్ప, ఒక్క  చిన్న గడ్డి పోచ పట్టుకోవాలన్న సంఘర్షణ జోలికే వెళ్ళని పాత్ర ప్రయాణంలో, అక్కినేని జీవం- ప్రాణం -లాంటి అశాశ్వత అంశాలు కాదు- శాశ్వతంగా నిలిచిపోయే ఆత్మనే పట్టి పోశారు. 


          సాత్వికాభినయానికి పెద్ద పీట వేశారు. అన్ని అభినయాల్లోనూ సాత్వికాభినయం ఉత్కృష్టమైనదని అంటారు. అదే సమయంలో కష్టసాధ్యమైనదని కూడా అంటారు. నటుడి మొహంలో హావభావాలే పలక్క పోతే ఏ మేకప్ మ్యానూ, ఇంకే ఛాయాగ్రాహకుడూ ఏమీ చేయలేరు. హావభావాల తో సాత్వికాభినయాన్ని వర్కౌట్ చేయాలంటే ముందు నటుడు మానసికంగా నిర్మలంగా వుండాలి. మామూలుగానే ఇది కష్టం. కరుణ రసంతో మరీ కష్టం. ముందుగా శుష్కించి పోయిన మొహం ఎఫెక్టు రాబట్టేందుకు, అక్కినేని ఏ డైటింగూ చేసి ఫిజిక్ ని చెడగొట్టుకోలేదు, అమెరికాలో ఏ లిపో సక్షన్ సర్జరీనో  చేయించుకుని, బక్కచిక్కి గ్లామర్ తగ్గిపోయి  రాలేదు. కేవంలం ఎన్నో నిద్రలేని రాత్రులు మాత్రమే గడిపి ఆ ఫలితాలు సాధించారు.  ‘జగమే మాయ’ పాట ఎఫెక్టు కోసం ఘంటసాల ఏకంగా 41 రోజులు ఉపవాసాలుండి నీరసించారు. అలాంటి ఘంటసాల విషాద గాత్ర విన్యాసానికి అతికిపోవాలంటే అక్కినేని ఎంత అతలాకుతలమైపోయి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ ఘంటసాల గాత్ర విన్యాసమూ, అక్కినేని భావప్రకటన సామర్ధ్యమూ చరిత్ర పుటల్లో నిల్చి పోయిన  విశేషాలు. తాగబోతుగా పలికించిన బాధతో కూడిన ప్రతి ఒక్క భావమూ ఆ నిర్మల స్థిరచిత్తంలోంచి  పెల్లుబికినవే. నటుల ప్రతిభకి సాత్వికాభినయమే గీటు రాయైతే, దేవదాసు పాత్రభినయంతో అక్కినేని నూటికి నూరు పాళ్ళూ మించిపోయి తానే ఒక గీటురాయి అయ్యారు. సాత్వికాభినయానికి పర్యాయ పదమయ్యారు. అందుకని దేవదాసూ అక్కినేనీ - ఒకే ఆత్మ రెండు శరీరాలు!


       దేవదాసు పాత్రలో జాలువారే కరుణరసం విజువల్. పైకి కన్పించిపోతుంది. సావిత్రి నటించిన పార్వతి పాత్రది సబ్ టెక్స్టు- అంటే ప్రేక్షకుల ఊహకి వదిలేసిన అమూర్త అంతర్మధనం. మౌన విలాపం. ముఖ కవళికలతోనే ప్రతిభావంతంగా దీన్ని పోషించారామె.
          ఇదే, ఇలాటి పరస్పర వైరుధ్యాలే కథకి వెన్నెముక అనదగిన ఈ సినిమా కథనానికి బలాన్ని చేకూర్చి పెట్టాయి. పైన చెప్పుకున్న దేవదాసు, పార్వతిల విజువల్ - నాన్ విజువల్ రస పోషణలతో బాటు; దేవదాసు, భగవాన్ పాత్రల పరస్పర విరుద్ధ దృక్పథాలు, దేవదాసుకి సేవకురాలిగా మిగిలిపోవాలన్న పార్వతి కోరిక తీరకుండా, ఆ భాగ్యానికి చంద్రముఖి నోచుకునే యాంటీ ప్లే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైనమిక్స్. 

          పోతే, నిండు చంద్రుడికి మచ్చే తప్పనట్టు, నిఖిల ప్రేమాస్పదుడు దేవదాసూ కొన్ని నఖక్షతాల్ని మోస్తున్నాడు. దేవదాసు పిరికివాడని ముందే చెప్పేస్తే సరిపోయేది. బాల్యంలో ఏమాత్రం తండ్రి భయం లేని, చదువంటే కూడా ఏమీ పట్టని ఆకతాయిగా, చదువు చెప్పే పంతుల్ని ఏడ్పించే ఘటంగా, సాంప్రదాయాల వ్యతిరేకిగా చూపించుకొస్తూ, తీరా పార్వతిని చేపట్టాల్సి వచ్చేసరికి ఉత్త పిరికివాడిలా చిత్రించారు. అలాటి అతడి బాల్యపు ధిక్కార పార్టు అదే పళానా యవ్వనపు చాప్టర్లోకి బదలాయింపు కాకపోవడం వల్లే ఇలా జరిగింది. అసలు పాత్ర చిత్రణల్లో పార్వతీ దేవదాసుల బాల్యమే ఘోరంగా విఫలమయిందని ఎంవీ రమణారెడ్డి తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. 



         ఇదలా ఉంచితే, ఆపదలో ఉన్న పార్వతి అర్ధరాత్రి పూట దేవదాసుని ఆశ్రయించి పెళ్ళడిగితే, దేవదాసు కంగారు పడిపోవడం, ఇంట్లో అడిగి చెప్తాననడం, ఇంకేవేవో పిరికి చేష్టలకి పోవడం, సరీగ్గా కథకి ఉద్దేశించిన పిరికి పాత్రనే తయారు చేశాయా- బాల్యం సంగతి పక్కన పెడితే?
          

           13 వ శతాబ్దపు సూఫీ మహాకవి, మేధావి జలాలుద్దీన్ రూమీ అన్నట్టు- ‘ప్రేమని పొందడం నీ కర్తవ్యం కాకూడదు, కేవలం ఆ ప్రేమకి వ్యతిరేకంగా నీకై నీవు కల్పించుకున్న మానసిక నిషేధాల్ని తెలుసుకోగలగడమే నీ కర్తవ్యం  కాగలగాలి- అన్నది దేవదాసుకి సరిగ్గానే సరిపోతుంది. ఇదొక్కటి చాలు తను పలాయనం చిత్తగించడానికి బహానాగా. అతడి మానసిక నిషేధం తండ్రే అయినప్పుడు ఈ ఒక్క స్పష్టతతో, ఆ ఒక్క కారణంతో వుంటే చాలు. తండ్రి నడిగి చెప్తానని చెప్పేసి- ఆ తండ్రితో చివాట్లు తిని, మళ్ళీ పార్వతికి కనపడకుండా పారిపోతే సరిపోతుంది. సమయం మించిపోయినప్పుడే పార్వతి కోసం తిరిగి వచ్చి, ఆమె పరాధీన అయిపోయిందని తెలుసుకుంటే చాలు. 


       ఇలా కాకుండా ఆలోచిస్తాననడం, ఎటూ తేల్చుకోలేక ఇంట్లో అడిగి చెప్తాననడం, తండ్రి నడిగి భంగపడి అప్పుడు పారిపోవడం, తననిక మర్చిపొమ్మని పార్వతికి లేఖ రాయడం, మిత్రుడు భగవాన్ కోప్పడితే మళ్ళీ పార్వతి కోసం రావడం, అప్పటికి సమయం మించిపోవడం...ఇదంతా పాత్రని మరీ పలచన చేసే డొంక తిరుగుడే అయింది. 

          ఎక్కడైతే కథనంలో లోపాలతో దొరికిపోతామని అన్పిస్తుందో- అక్కడే తెలివిగా ఏదో గిమ్మిక్కు చేసైనా తప్పించుకో గల్గాలి. ఇక్కడ ఇది జరగలేదు. నవల రాయడం ఒక్కోసారి ఎలా వుంటుందంటే-  దృశ్యాల్లో ఆ రాస్తున్న వాక్యాల్ని  విజువలైజ్ చేసి చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళకపోతే, దృశ్యాలు అసహజంగా తయారయ్యే ప్రమాదముంది. సినిమా దర్శకులు రచయిత చెప్తున్నదంతా విజువలైజ్ చేసుకుంటూ వింటూంటారు. విజువల్ గా సీను బావుండకపోతే వినడం ఆపేస్తారు. శరత్ బాబు ఈ సీన్ని ఇలాగే రాసేసి వుంటారు. దీన్నే కళ్ళకద్దుకుని పదేపదే రీమేక్ చేస్తూపోయారు. దేవదాసు కమర్షియల్ పాత్ర రూపంలో వున్న ఆర్టు సినిమా
( పాసివ్ )  పాత్ర మాత్రమే. ఇందులో తప్పు లేదు, ఇది ట్రాజడీ కాబట్టి. అయినంత మాత్రాన పాసివ్ పాత్ర నడకలో కూడా కథకుడు జోక్యం చేసుకోకూడదు. 



వేదాంతం రాఘవయ్య 
       పాత్రకి ఇలాటి నఖ క్షతాలతో వేదాంతం రాఘవయ్య  ( 1919-71) దర్శకత్వం సాగుతుంది. అయితే కూచిపూడి నర్తకుడూ, డాన్స్ మాస్టారూ కూడా అయిన రాఘవయ్య దర్శకత్వ ప్రతిభకి ఒక్క పార్వతిని దేవదాసు కొట్టే దృశ్యం చాలు. పార్వతి అన్న ఓ మాటకి దేవదాసు చిరుకోపంతో, అసంకల్పితంగా చిన్న కట్టె పుల్లతో చటుక్కున కొట్టేస్తాడు. అంతసేపూ చేతిలో కన్పించని ఆ కట్టెపుల్ల అకస్మాత్తుగా ఫ్రేము లోకొచ్చి, అంతపనీ చేసి పోతుంది- ప్రేక్షకుల మీద దీని షాక్ వేల్యూ అమోఘం!

          2002 సెప్టెంబర్ లో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నిర్వహించిన ‘దేవదాసు’ చలన చిత్రోత్సవంలో, 1935 నుంచీ  2002 దాకా వివిధ భాషల్లో తీసిన ‘దేవదాసు’ మొత్తం 12 రీమేకుల్ని ప్రదర్శించారు. వీటిలో ప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ హిందీలో దిలీప్ కుమార్ తో తీసిన ‘దేవదాసు’ లో,  పైన చెప్పుకున్న సీను వచ్చేసరికి- దిలీప్ కుమార్ ఇంతలావు కర్రుచ్చుకుని, ఫటేల్మని తనివితీరా వైజయంతీమాల మాడు పగలగొట్టేసి, టపటపా రెండుసార్లు దాంతో తొడమీద కొట్టుకుని, వీరోచితంగా రెండు ముక్కలుగా విరిచేసి అవతల పారేస్తాడు.  నవ్వొచ్చే ఓవర్ డ్రామా! ప్రేమిస్తున్నాడా, ప్రేమించిందని  ఇరగదీస్తున్నాడా? శరత్ బాబు ఏమైపోవాలో!



బి ఎస్ రంగా 
         2002 లో మరో సుప్రసిద్ధ దర్శకుడు శక్తి సామంతా తీసిన బెంగాలీ ‘దేవదాసు’లో ప్రసేన్ జిత్ సేన్, అర్పితాపల్ ని కొట్టాలా వద్దా అని ముందూ వెనకలాడుతూ, ఎలాగో స్టామినా కూడదీసుకుని, కర్రెట్టి ఘోరంగా చావబాదేసి-  హమ్మయ్యా ఓపనై పోయింది అన్నట్టు చూస్తాడు. రేపు పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇదేనేమో! శరత్ కి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు. 

          ఇదంతా చాలా న్యూసెన్స్ రాఘవయ్య ప్రతిభ ముందు. 


          అలాగే తెలుగు ‘దేవదాసు’ లో తెలుగుదనం లేదనే వాళ్ళు ఇంకోటి తెలుసుకోవాలి. కేదార్ శర్మ డైలాగులు రాసిన, సైగల్ నటించిన- ‘దేవదాసు’
( 1936)  సినిమా సాంతం ఉర్దూ భాషలో ఏ మొఘలే ఆజమో  చూస్తున్నట్టు వుంటుంది. ఆఖరికి దేవదాసు పార్వతికి రాసే లేఖ కూడా ఉర్దూలోనే వుంటుంది.



సి ఆర్ సుబ్బరామన్ 
       తెరవెనుక రాఘవయ్యతో బాటు వున్న సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ గురించి ఇంకా చెప్పేదేముంది. ఆయనిచ్చి పోయిన పాటల బొచ్చె, లోకంలో ప్రేమ బిచ్చగాళ్ళు వున్నంత కాలమూ వుంటుంది. ఇంతకంటే ఆయన వేసే భిక్ష ఇంకేం కావాలి? అలాగే బీఎస్ రంగా ఛాయాగ్రహణం. ఇక మాటలు, పాటలు రాసిన సముద్రాల రాఘవాచార్య సరేసరి. 

          మరోసారి రూమీని ఉటంకించుకుంటే
- ‘ధాతువుగా నశించి మొక్కనై పుట్టా, మొక్కనై గిట్టి జంతువై జనించా, జంతువుగా చాలించి మనిషినై అవతరించా. నాకెందుకూ మరణమంటే భయం? మరణం తో నేనేమీ నిమ్నస్థాయికి చేరుకోవడం లేదే?’



          ఎస్, మరణాన్ని కోరి నిమ్నుడవలేదు దేవదాసు, అమరుడయ్యాడు.
          అక్కినేని అతడికి దేవుడి పటాన్నిచ్చారు.



సికిందర్
(ఆగస్టు 2009, సాక్షి -‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)

         
         
         
         
         


          

Tuesday, September 15, 2015

సాంకేతికం- పబ్లిసిటీ

సినిమా పబ్లిసిటీలో కీలక ఘట్టం లోగో విడుదల. తమ అభిమాన హీరో కొత్త సినిమా లోగో ఏ విధంగా వుంటుందో నన్న ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తూంటారు ఫ్యాన్స్. విడుదలైన లోగోని చూసి చర్చోప చర్చలు కూడా జరుపు కుంటారు. టైటిల్ ఆదిరిందా ఎగిరి గంతెయ్యడమే. సినిమా హిట్ అని అప్పుడే ప్రచారంకూడా చేసుకుంటారు. టైటిల్ డిజైన్ డల్ గా ఉందా- ఈసురోమని నీరసపడి పోవడమే.
       పబ్లిసిటీ ఆర్టిస్టు పని ముందుగా లోగోని హిట్ చేయాలన్న తీవ్ర కసరత్తుతో ప్రారంభమవుతుందని చెప్పారు సుప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే. దీనికోసం నిద్రాహారాలు మాని కృషి చేస్తామన్నారు. ఇదేదో కంప్యూటర్ లోంచి ఊడిపడే ఇన్ స్టెంట్ అద్భుతం కాదన్నారు. సాఫ్ట్ వేర్స్ లో వుండే పరిమిత ఫాంట్స్ టైటిల్ డిజైనింగ్ కి పనికొచ్చేవి కావనీ,  బ్రష్ పట్టుకుని స్వ హస్తాలతో చిత్రించాల్సిందే ననీ అన్నారు.  బ్రష్  పట్టుకోవడం తెలీని ఫోటో షాప్ పబ్లిసిటీ ఆర్టిస్టులు కూడా వుంటారనీ, వాళ్ళు బయట లోగోలు వేయించుకో వచ్చునేమోగానీ, ఫోటో షాప్ తో వాటికి  న్యాయం చేయడం కష్టమే అవుతుందన్నారు. ఎందుకంటే, ఫోటో షాప్ లో నటీనటుల అప్పీయరెన్సుల్ని  మెరుగులు దిద్దాలన్నా, ఆర్టిస్టుకి ఆత్మ తెలియాలి. అది బ్రష్ తో బొమ్మలేసిన అనుభవంతోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇదీ ధని అనుభవ సారం ( 1997-98 ప్రాంతాల హైదరాబాద్ శాంతి శిఖర అపార్ట్ మెంట్స్  గ్రౌండ్ ఫ్లోర్ లో కేవలం బ్రష్, స్ప్రే గన్ ఈ రెండే పట్టుకుని పోస్టర్స్ డిజైన్ చేస్తూ కన్పించేవారు ధని- చాలా ఫ్రెండ్లీ మనిషి). 


            ఇప్పుడు రంగంలో వున్న చాలా కొద్ది మంది పబ్లిసిటీ ఆర్టిస్టుల్లో ధని ఏలే ఒకరు. ఈయన అన్న- గ్రేట్ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే గురించి తెలీని వాళ్ళు లేరు. ఇంటర్ చదువుతున్నప్పుడే ధని పాకెట్ మనీ కోసం దుకాణాలకి సైన్ బోర్డులు రాసే పని చేపట్టారు. నల్లగొండ జిల్లా కదిరేని గూడెం నుంచి హైదరాబాద్ వచ్చి ‘తారా యాడ్స్’ లో కొన్నాళ్ళు పనిచేసి, ‘సితార’ సినిమా వార పత్రికలో లే అవుట్ ఆర్టిస్టుగా చేరారు. అప్పుడే సినిమాలకి పోస్టర్స్ వేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఉద్యోగం కూడా వదిలేసి సొంత స్టూడియో పెట్టుకున్నారు. చిన్న చిన్న సినిమాలతో చాలా స్ట్రగుల్ చేసి, ఆఖరికి పూరీ జగన్నాథ్ తీస్తున్న, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘బద్రి’ తో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకున్నారు. అక్కడ్నించీ ఇక జైత్ర యాత్రే. ‘బుజ్జి గాడు మేడ్ ఇన్ చెన్నై’ వరకూ పూరీ సినిమాలన్నిటికీ పబ్లిసిటీ సమకూరుస్తూ  వస్తున్నారు. అందరు అగ్ర హీరోల, దర్శకుల సినిమాలకి కూడా సేవలందించారు. ఇప్పటి దాకా 150 సినిమాలకి పబ్లిసిటీ డిజైనింగ్ చేశారు. వీటిలో ‘పోకిరి’, ‘ఖలేజా’, ‘సింహ’, ‘గగనం’, ఈ నాలుగు సినిమాల లోగోలు,  వీటి పబ్లిసిటీ డిజైన్లూ  తనకి బాగా పేరు తెచ్చాయన్నారు.
          ‘ పబ్లిసిటీ ఆర్టిస్టు పని సినిమా విడుదలకి మెటీరియల్ రూపొందించడంతోనే అయిపోలేదు..ఆ తర్వాత కూడా కొత్త కొత్త పోస్టర్స్ తో సినిమాని ప్రమోట్ చేస్తూ రెండవ వారం, మూడవ వారం, అర్ధ శత దినోత్సవం, శత దినోత్సవం...ఇలా కొనసాగైతూనే ఉంటుంది’ అన్నారు.


          ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి చెబుతూ, తొలితరం ప్రసిద్ధ కళాకారుడైన ఈశ్వర్ తో తనకి పరిచయముందన్నారు. ఆ రోజుల్లో బ్లాక్ మేకింగ్ ఉండేదనీ, ఫోటోలని కత్తిరించి, అతికించి, జెరాక్స్ తీసి, ఇండియన్ ఇంకుతో టైటిల్స్ వేసి, పోస్టర్లు రూపొందించేవారనీ, తర్వాత కలర్ పోస్టర్స్ వచ్చాక, బ్రష్ తో బ్యాక్ గ్రౌండ్ వేసేవారనీ వివరించారు. ఇక బ్రష్ తర్వాత స్ప్రే గన్ వచ్చింది. దీని తర్వాత సాఫ్ట్ వేర్లూ, ఫోటో షాపూ వచ్చినట్టు చెప్పారు.
          ఇలా డిజిటలీకరణ చెందాక బాగా ఖర్చు తగ్గిందన్నారు ధని. పైగా చిటికెలో కలర్ కరెక్షన్స్ చేయడంగానీ, ఆప్షన్స్ చూపించడం గానీ సాధ్యమవుతోందన్నారు. పోతే, ఒక సినిమాకి పబ్లిసిటీకి దేన్ని రిఫరెన్స్ పాయింటుగా తీసుకుంటారన్న ప్రశ్నకి, ఆ సినిమా కాన్సెప్ట్ ని తీసుకుంటామని చెప్పారు. కాన్సెప్ట్ ని దృషిలో పెట్టుకునే లోగో రూపకల్పనా, పోస్టర్స్ డిజైనింగూ చేస్తామన్నారు. బాలీవుడ్ లో అయితే సినిమా రషెస్ చూపించి పూర్తి అవగాహన కల్పిస్తారనీ, ఇక్కడా పధ్ధతి లేదనీ అన్నారు. ఇంకా బాలీవుడ్ లో సినిమా సినిమా స్టిల్స్ తో సంబంధం లేకుండా ఫోటో షూట్స్  చేసి పబ్లిసిటీకి వాడుకుంటున్నారన్నారు.  ఈ పధ్ధతి తెలుగులో ‘సొంతం’ అనే సినిమాతో ప్రారంభమైన సంగతి  గుర్తు చేస్తే, అసలలా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫోటో షూట్స్ చేసి పబ్లిసిటీకి వాడుకోవడం ప్రేక్షకుల్ని తప్పు దోవ పట్టించడమే నన్నారు.

        ఇంటర్నెట్ నుంచి విదేశీ సినిమాల పోస్టర్ డిజైన్స్ ని కాపీ కొట్టే ధోరణి గురించి చెబుతూ, దానివల్ల చౌకబారు డిజైన్లు మాత్రమే తయారవుతాయన్నారు. ఇంటర్నెట్ ని విరివిగా ఉపయోగించుకునే వాళ్లకి ఈ కాపీ వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయన్నారు.
          రికార్డు స్థాయిలో ఏడు సార్లు భరతముని ఉత్తమ పబ్లిసిటీ ఆర్టిస్టు అవార్డులని అందుకున్న ధని ఏలే, తాజాసినిమా ‘బ్రమ్మిగాడి లవ్ స్టోరీ’ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో బోయపాటి శీను తీస్తున్న ‘దమ్ము’, విజయేంద్ర ప్రసాద్  దర్శకత్వం వహిస్తున్న ‘రాజన్న’, రవితేజ నటిస్తున్న ‘నిప్పు’  శ్రీకాంత్ నటిస్తున్న ఇంకో సినిమా, మొదలైన వాటికి పబ్లిసిటీ సమకూరుస్తూ బిజీగా వున్నారు తను.
సికిందర్
( జులై 2011, ఆంధ్రజ్యోతి-‘సినిమా టెక్’ శీర్షిక)

            

Monday, September 14, 2015

మళ్ళీ మిడిల్ మటాషే !

రచన- దర్శకత్వం : తేజ
తారాగణం : దిలీప్, దక్ష, చస్వ, సీమా, ఎం.వి.ఎస్. హరనాథ రావు, అభిరాం తదితరులు
సంగీతం : కళ్యాణ్ కోడూరి, ఛాయాగ్రహణం : దీపక్ భగవంత్
బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్,  నిర్మాత: కె. ఎల్. దామోదర ప్రసాద్
విడుదల : 11 సెప్టెంబర్, 2015
***

       ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ ఇంకా తన పాత ఫార్ములానే  రీసైక్లింగ్ చేస్తూ ఆ రింగులోంచి బయటికి రావడం లేదు. గతంలో ఎప్పుడో తను తీసిన ‘జయం’ (2003),  ‘నువ్వు నేను’ ( 2001) అనే రెండు హిట్సే  ఆయన సినిమాలు  తీయడానికి ముడిసరుకు అవుతున్నాయి. ప్రేమకథలు ఎదిగి వచ్చాయి. ప్రేమ కథల దర్శకుడు మాత్రం ఎదగడం లేదు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత, పన్నెండేళ్ళ నాటి తన పాత ‘జయం’ ని రీసైక్లింగ్ చేసి, 4 G స్పీడుకి అప్ డేట్ అవుతున్న నేటి యువ ప్రేక్షకులకి మళ్ళీ వడ్డించే దుస్సాహసం చేశారు. దీంతో తనకీ తన ప్రేమ కథల లక్ష్యిత ప్రేక్షకులకీ జనరేషన్ గ్యాప్ ఎంతుందో తెలిసిపోతోంది. అలాంటప్పుడు కాలం చెల్లిన  తాజా ప్రేమకథ ‘హోరాహోరీ’ ని తీసుకుని బాక్సాఫీసుతో ఎంత బాహాబాహీకి దిగితే మాత్రం ఏం లాభం.

          కరకాల వినోదమాధ్యమాలు బహుముఖాలుగా విస్తరించాయి. వినోదించడానికి సినిమా అనేది చిట్ట చివరి ఆప్షన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఇది చాలా ఆందోళనకర పరిణామం. ఆ మాధ్యమాలన్నిటినీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకి కదిలిరావాలంటే ఆ మాధ్యమాలకి మించిన వినోదం ఏదో సినిమాల్లో వుండి తీరాలి. ఇది గమనించకుండా కేవలం బ్రాండ్ నేములు, గతకాలపు గ్రాఫులూ చూసుకుని సినిమాలు చుట్టేస్తే ఫలితాలు చాలా బాధాకరంగా వుంటాయి.  

          బ్రాండ్ నేములూ, గత కాలపు గ్రాఫులూ రీసైక్లింగ్స్ తో నిలబడతాయా? 24x7 వర్తమాన కాలంతో కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నప్పుడే నిలబడతాయోమో ఆలోచించ కూడదా? దర్శకుడు తేజ దీన్నే అందుకోలేక పోతున్నారు.

          ‘హోరాహోరీ’ తో అసలు ఒక సినిమాకి ఉండాల్సిన కనీస లక్షణాలని కూడా మర్చిపోయారు. చాలా విచారకరం. ఒక విజయవంతమైన దర్శకుడి పట్ల ప్రేక్షకులకి క్రేజ్ ఎలా ఏర్పడుతుందో, అలా ఔత్సాహిక-వర్ధమాన దర్శకులకీ ఒకలాంటి  భక్తి భావం ఏర్పడుతుంది. తననుంచి సక్సెస్ మంత్రా నేర్చుకోవాలను కుంటారు, తన క్రాఫ్ట్ తో ఎడ్యుకేట్ అవాలనుకుంటారు. తన బాట అనుసరించాలనుకుంటారు. అలా మార్గదర్శకంగా ఉండాల్సిన దర్శకుడు, తిరోగమించి గతకాలపు విజయాల్లో తలదాచుకుంటే వాళ్ళని చాలా నష్టపర్చిన వాడవుతాడు. రంగంలో ఉండాలనుకున్నప్పుడు రింగుల్లో వుండిపోకుండా - స్పీడ్ బోటులో దూసుకెళ్ళాల్సిందే !


                                                     ***
ఎవరి కథ?
       బసవ ( చస్వా) అనే వాడు ఓ కాంట్రాక్ట్ కిల్లర్. ఓ హత్య కేసులో ఎసిపి ( అభిరాం) కి లంచమిచ్చి సేఫ్ అవుతాడు. ఎసిపికి ఆ డబ్బు చెల్లెలు మైథిలి ( దక్ష) పెళ్ళికి అవసరం. ఇతనూ ఇతడి సీఐ తండ్రీ ( డీఎస్ రావు)  లంచగొండులు. మైథిలి పెళ్ళికి వచ్చిన బసవ మైథిలి మీద మనసు పడి పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకుని చంపించేస్తాడు. పెళ్లి చేసుకుంటానని మైథిలి వెంట పడతాడు. ఎసిపి వేరే సంబంధం చూస్తే, ఆ కాబోయే పెళ్లి కొడుకునీ చంపేస్తాడు. దీంతో మతి స్థిమితం కోల్పోతుంది మైథిలి. 

          స్థలమార్పు కోసం ఆమెని కర్ణాటక లోని ఆగుంబే కి పంపిస్తారు. ఎవరితోనూ మాటాడకుండా పిచ్చిదానిలా శూన్యంలోకి చూస్తూండే మైథిలి పెళ్లి గురించి వినపడ్డా, పెళ్లి దృశ్యం కనపడ్డా హిస్టీరికల్ గా మారిపోతుంది. వెంటనే ఒక మాత్ర వేసి కంట్రోల్ చేయాలి.

           ఊళ్లోనే ఒక నెట్ సెంటర్ నడుపుకునే స్కంధ( దిలీప్) అనే కుర్రాడుంటాడు. ఇతడికి నానమ్మ (సీమా), ఆంటీ ( రోహిణి) వుంటారు. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఒకరు చేస్తున్న వ్యాపారం మరొకరు చేయకూడదన్న కట్టుబాటు వుంటుంది. నెట్ సెంటర్ పెట్టి స్కంధ దీన్ని ఉల్లంఘించాడని పక్క గ్రామం వాళ్ళు గొడవ కొస్తారు. అప్పుడు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏ  నెట్  సెంటర్ స్పీడ్ టైపింగ్ లో గెలుస్తుందో, ఆ నెట్ సెంటర్ నడుపుకోవాలని. ఈ పోటీ లు మొదలవుతాయి. ఈ లోగా స్కంధ కి మైథిలి పరిచయమవుతుంది. అతడి కారణంగానే మాటా డ్డం మొదలెడుతుంది. టైపింగ్ లో ఆమె నేర్పు చూసి పోటీల్లో పాల్గొనమని ఒప్పిస్తాడు. ఈ పోటీలు కొన్ని తడవలుగా జరుగుతాయి. ఈ క్రమంలో ఆమెతో ప్రేమలో పడ్డ స్కంధ కి సమస్య లొస్తాయి. 

          అప్పుడు బసవ ఆ ఊళ్లోనే ఒక కాంట్రాక్టు కిల్లింగ్ ని ఒప్పుకుని వస్తాడు. ఇక్కడ స్కంధ సమస్య తెలుసుకుంటాడు. స్కంధ తో బసవకి పూర్వ పరిచయముంటుంది. తను ప్రేమించిన అమాయి పెద్దలు ఒప్పుకోవడంలేదని స్కంధ చెప్పేసరికి రంగంలోకి దిగుతాడు బసవ. ఇలా స్కంధ ప్రేమించిన అమ్మాయే తను ప్రేమిస్తున్నఅమ్మాయని తెలీని బసవ, బసవ ప్రేమిస్తున్న  ఆమ్మాయినే తను ప్రేమించాడని తెలీని స్కంధ ల మధ్య ఆట మొదలవుతుంది. ఇదెప్పుడు బయటపడి ఏం జరిగిందనేది మిగతా కథ.


          కథ ఇలా చెప్పుకుంటూ పోతే కథానాయకుడెవరో తెలుసిపోతోంది గానీ, సినిమా చూస్తే మాత్రం ఇదెవరి కథగా తేలుతుందో చెప్పుకుంటే అంత బావుండదు.. కమర్షియల్ సినిమా ప్రాథమిక లక్షణం కన్పించదు.

ఎవరెలా చేశారు.
       కొత్త హీరో హీరోయిన్లు దిలీప్, దక్షల పాత్రలూ వాళ్ళ నటనలూ ఆకట్టుకునే ప్రసక్తి లేదు.  దక్ష ది ఫోటోజెనిక్ ఫేసు కాదు, వాయిసూ హీరోయిన్ కుండాల్సిన వాయిస్ కాదు.  ఎప్పుడూ బోలెడు మంది ఆర్టిస్టులతో నిండిపోయే సీన్లలో దిలీప్ కన్పించకుండానే పోతాడు. బ్యాడ్ ప్రెజెంటేషన్ బారిన పడి అతడేమిటో, అతడిలో విషయమేమిటో కూడా సరీగ్గా రిజిస్టర్ చేసుకోలేకపోతాడు. ఈ ఇద్దరూ యూత్ అప్పీల్ కి సరిపోక, పాత్రలూ పండక అనామకంగా మిగిలిపోతారు.  

          ఏసీపీ గా వేసిన అభిరాం మరో మైనస్. ఏసీపీ లెవెలే కన్పించదు. విలన్ గా వేసిన చస్వా- విలన్ల పక్కన వుండే అనుచరుడిలా ఉంటాడు. పాత్రకి సరిపోయే స్థాయి లేకపోగా, చిల్లర కామెడీ చేస్తాడు. 

          తేజ లోని  విజువల్, క్రియేటివ్ సెన్సుల్ని  దిగువస్థాయికి తీసికెళ్ళిన ఈ సినిమాలో బావున్నదల్లా రెండే- కళ్యాణ్  కోడూరి సంగీతం, దీపక్ భగవంత్ కెమెరాపనితనం మాత్రమే. పాటలకి పెద్దాడ మూర్తి రాసిన గీతాలు బావున్నాయి. జునైద్ ఎడిటింగ్ మళ్ళీ కొన్ని తప్పుల్ని సవరించ లేకపోయింది. ఈ సినిమా ముప్పాతిక కథ కర్ణాటకలోని అధిక వర్ష పాతముండే - అస్తమానం వర్షం పడుతూనే  వుండే గ్రామం ఆగుంబే లో జరుగుతుంది. అయితే తేజ తీసినప్పుడు కిటికీ లోంచి చూపిస్తే వర్షం పడుతూంటుంది, అదే కెమెరాని ఇటు పాన్ చేసి తలుపు అవతలకి చూపిస్తే,  బయట చక్కటి ఎండ కాస్తూంటుంది.  హీరోయిన్ తో ఎసిపి మాట్లాడుతూంటే వర్షం పడుతూంటుంది, అదే హీరోయిన్ వున్న వైపు చుక్క వర్షం పడని ఎర్రటి ఎండ వుంటుంది.  కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ చాలా వున్నాయి.  

          సినిమా ఓపెనింగే తేజ అలసత్వాన్ని పట్టిస్తుంది. సిటీ నడి సెంటర్లో గొడ్డలితో నరికి భార్యా భర్తల్ని విలన్ చంపుతోంటే, చంపి చాలా నింపాదిగా అన్నీ సర్దుకుని వెళ్లిపోతూంటే, జనమంతా  చుట్టూ చేరి అదేదో గారడీ ప్రదర్శన అన్నట్టుగా చూస్తూంటారు- అది గారడీ ప్రదర్శనా? అతనలా మర్డర్లు చేస్తూంటే చుట్టు  పక్కల ఎవరూ లేకుండా భయంతోనైనా పారిపోవాలి, లేదా తెగించి వాణ్ణి  పట్టుకుని పోలీసులకైనా అప్పగించాలి- ఇదేమీ చేయకుండా, గిరి గీసుకుని చుట్టూ నిలబడి తమాషా చూస్తూంటారు. ఎవరూ ఒక్క ఫోటో- ఒక్క వీడియో కూడా తీసి అప్ లోడ్ చేయరా ఈ కాలంలో? 

స్క్రీన్ ప్లే సంగతులు

   ఇది మరో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అని చెప్పడానికి చాలా...బాధేస్తోంది. సినిమా నిడివి రెండు గంటలా నలభై నిమిషాలు(!) వుంటే, ఒక్క బిగినింగ్ విభాగమే రెండుంపావు గంటలు   తినేస్తుంది! అప్పుడు మాత్రమే సినిమాకి వెన్నెముక అనదగిన, సినిమాలో యాభై శాతం నిడివి ఉండాల్సిన, మిడిల్ ప్రారంభమవుతుంది!

              మిడిల్ తో బాటు ఎండ్ కూడా మిగిలిన అరగంట వ్యవధిలోనే ఇరుక్కుంటాయి. స్క్రీన్ ప్లే ఇలా ఉన్నాక, సినిమాని ఎంత ప్రమోట్ చేసుకుంటే ఏం లాభం. అమ్మాల్సిన సరుకు సినిమానా, స్క్రీన్ ప్లేనా? అమాయక ప్రేక్షకుల మీద ఎలాటి స్క్రీన్ ప్లేలు పడేస్తున్నారో సరిచూసుకుని ప్రమోట్ చేసుకోవాలా, వద్దా? నీ స్క్రీన్ ప్లే లో థర్డ్ యాక్ట్ బాగాలేదయ్యా, నీ స్క్రీన్ ప్లే లో ఫస్ట్ యాక్ట్ ప్లాట్ పాయింట్ ఏమిటి? - అని హాలీవుడ్ నిర్మాతలు ప్రొఫెషనల్ గా అడిగే లాంటి కల్చర్ రానంతవరకూ తెలుగు సినిమాలకి మోక్షం లేదు. తొంభై శాతం ఫ్లాపుల రికార్డు కొనసాగుతూనే వుంటుంది

          స్ట్రక్చర్ స్పృహ వుండని ఇలాటి కథా కథనాలకి పాల్పడే కంటే, అసలు స్ట్రక్చరే వుండని గాథలుతయారు చేసుకోవడానికి సిద్ధపడితే మంచిదేమో.

          ఆర్ట్ సినిమాలు తీయని టాలీవుడ్ మీద విధి ఇలా పగ తీర్చుకుంటోందేమో ఒకవేళ. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్లతో తీస్తున్నవి కూడా స్ట్రక్చర్ పరంగా ఆర్ట్ సినిమాలేనని తెలీకనే తీసేయడం  విధి చేయు వింతేనేమో. కానీ ఆత్రేయ రాసినట్టు, ఇక్కడ ఇది మతిలేని చేష్ఠమాత్రం కాదు-తను చేయాల్సిన పని కరెక్టుగానే చేసుకుపోతోంది విధి. ఎమర్సన్ అన్నట్టు విధి ఎప్పుడూ గ్రేట్ లెవెలర్- హెచ్చు తగ్గుల్ని సమానం చేసేస్తుంది.  

           స్ట్రక్చరూ వుండని పాసివ్ పాత్రల గాథలేఆర్ట్ సినిమాలు. రాసుకుంటున్న కథలకి స్ట్రక్చర్ ఉండక, వున్నా హీరో పాత్ర పాసివ్ గా మారిపోయి- అట్టహాసంగా తీస్తున్నవినిజానికి బిగ్ బడ్జెట్ల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలే.

***
   అందుకని తమ వల్ల కాదని తేలిపోయిన కథలకి బదులు,  అసలే స్ట్రక్చరూ వుండని, సులభంగా తయారు చేసుకోగల  ‘గాథలు’ రాసుకుంటే గొడవే వుండదేమో.   ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా కుమార్తె, సోఫియా కపోలా దర్శకత్వం వహించి ఆస్కార్ అవార్డు కూడా పొందిన ‘సమ్ వేర్’ (2010) అనే సినిమాకి ఏ స్ట్రక్చరూ వుండదు. కారణం అది ‘గాథ’ కాబట్టి. గాథ (tale) కీ,  కథ(story) కీ తేడా గురించి గతంలో కొన్ని సార్లు చెప్పుకున్నాం. కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది, గాథ స్టేట్ మెంట్ ని మాత్రమే ఇస్తుంది. కథలో పాత్ర యాక్టివ్ గా వుంటుంది, గాథలో పాసివ్ గా వుంటుంది. కథ కమర్షియల్ సినిమాకి పనికొస్తుంది, గాథ పనికి రాదు. అయినా శ్రమలేకుండా పని జరిగిపోయే గాథలే రాసుకోవాలనుకుంటే, పైన ఉదాహరించిన ‘సమ్ వేర్’ ని పరిశీలించుకోవచ్చు. అనంతరం అవార్డులకి పంపుకోవచ్చు. అసలు స్క్రీన్ ప్లేల  పరంగా ఫ్లాపయిన సినిమాలన్నిటినీ అవార్డులకి పంపుకోవచ్చు. వాటికి అక్కడే తప్ప, ప్రేక్షకుల మధ్య స్థానం లేదు.  

          దర్శకుడు తేజ చాలా విచిత్రంగా స్ట్రక్చర్ ని భంగపర్చడమే గాక, హీరో (కథానాయకుడు) కి కొత్త నిర్వచనమిచ్చారు. విచిత్రంగా అని అనడమెందుకంటే- తను తీసిన సూపర్ హిట్స్ ‘జయం’, ‘నువ్వునేను’ ల  బలమైన స్ట్రక్చర్స్ ని తనే మర్చిపోయినందుకు.

          ఈ రెండూ అరగంటలో బిగినింగ్ ని ముగించుకుని, చక్కగా మిడిల్లో పడతాయి. సార్వజనీన త్రీ యాక్ట్  స్ట్రక్చర్ కి లోబడి వుంటాయి. 

          అలాటిది ‘హోరాహోరీ’ తో - పైన చెప్పుకున్నట్టు, నేటి యువ ప్రేక్షకులతో ఆయన కనెక్ట్ కాలేకపోవడమే కాదు, ఏకంగా స్ట్రక్చర్ తోనే కనెక్షన్ కోల్పోయారు. ఇది డబుల్ ట్రబుల్. మూడో ట్రబుల్ - తన సినిమాకి హీరో ఎవరో కూడా మర్చిపోవడం!


***
     People have forgotten how to tell a story. Stories don't have a middle or an end any more. They usually have a beginning that never stops beginning- Steven Spielberg …ఇలా పదేపదే ప్రస్తావించుకోవాల్సి వస్తోంది!

   beginning that never stops beginning...!  అంటే ఏమిటో ఒకసారి శివాజీ గణేశన్ బాగా వివరించారు. పడవేసుకుని పోతున్నవాడు తెడ్డు వేసుకుంటూ పోతూనే ఉంటాడు...పోతూనే ఉంటాడు..సినిమా ఎండ్ దాకా అలా పోతూనే ఉంటాడు- అదే ఆర్ట్ సినిమా-అని! ఇంతకంటే అవమానకరమైన ఎత్తిపొడుపు వుండదు కమర్షియల్ సినిమాకి!


          తేజ సినిమాలో కూడా ప్రారంభమైన బిగినింగ్ పోతూనే వుంటుంది..పోతూనే వుంటుంది..ఆయన తెడ్డు వేసుకుని బిగినింగ్ తో పోతూనే వుంటారు..అలా వెళ్లి పోతూనే వుంటారు..హైలెస్సా అనుకుంటూ బలప్రయోగం చేసి లాగుతూనే వుంటారు.. లాగుతూనే వుంటారు..క్లయిమాక్స్ దాకా లాక్కెళ్ళి, అప్పుడు హమ్మయ్యా అని పూర్తి సంతృప్తి చెంది, బిగినింగ్ ని  భద్రంగా వదిలేస్తారు. ఇంత కష్ట పడి సినిమా సాంతం బిగినింగే రాసుకుంటే ఇది స్క్రీన్ ప్లే కాదనడం పాపం.


***
ఉండాల్సిన స్ట్రక్చర్..  
హోరా హోరీ’ లో ఉన్న స్ట్రక్చర్..

       పై రెండు చిత్ర పటాలని చూస్తే ఎలా ఉండాల్సిన స్ట్రక్చర్ ‘హోరా హరీ’ లో ఎలా అయిపోయిందో తెలుస్తుంది. ‘హోరాహోరీ’ స్ట్రక్చర్ లో బిగినింగ్ చేసిన ర్యాగింగ్ దెబ్బకి, మిడిల్-ఎండ్ లు బిక్కుబుక్కుమంటూ చివరి క్లాస్ రూమ్ లో ఎలా ఇరుక్కుని కూర్చున్నాయో తెలుస్తుంది. ప్రభుత్వం కన్నుగప్పి స్క్రీన్ ప్లేల్లో కూడా ఇలా చేస్తున్న ర్యాగింగ్ ని ఎక్స్ పోజ్ చేయాల్సిందే!

          ముందు బిగినింగ్ విభాగం ఎలా వుందో చూద్దాం..

          బిగినింగ్ లో అరగంట దాకా హీరోయిన్ వ్యవహారమే. హీరోయిన్ పెళ్లి చెడగొట్టి బెదిరించే  విలన్ ప్రయత్నాలే. దాంతో ఆమె పిచ్చిదై పోవడం, వాతావరణ మార్పు కోసం వేరే వూరికి తరలించడమూ-   అక్కడా ఫిట్స్ వస్తూ పేషంట్ గానే ఉండడమూ- పూర్తిగా హీరోయిన్ తో ఉండాల్సిన యూత్ అప్పీల్ నీ, గ్లామర్ కోషెంట్ నీ నీరుగార్చేసింది. 

          ఆమెకి రెండేసి ధమాకా లెందుకుండాలి? ఒకటుంటే సరిపోతుంది. చంపుతానని విలన్ చేస్తున్న బెదిరింపులే ఆమెకి ఎక్కువ. మళ్ళీ పిచ్చిదవడం క్యారక్టరైజేషన్ ప్రాబ్లం. ఆమెకి ప్రాణభయం ఉన్నందుకే వేరే వూరు తరలించినట్టు చూపడంలో వున్న థ్రిల్, సస్పెన్స్, ఆమెతో వుండే యూత్ అప్పీల్ వగైరా - డబుల్ ధమాకా గా మతిస్థిమితం కూడా తప్పినట్టు చూపడంలో వుండదు. దీనివల్ల కథకి ఒనగూడే ప్రయోజనం లేకపోగా, వినోద కాలక్షేపాన్నీ, రోమాంటిక్ ఫీల్ నీ  సినిమా ప్రారంభంలోనే  ఈ అరగంట సేపూ హరించి వేసినట్టయింది. 

          మతిస్థిమితం కూడా తప్పడం ఎప్పుడు అవసరమంటే, వాణ్ణి భరించీ భరించీ, ఇక భరించలేక పిచ్చెక్కి - ఒరేయ్ ఇక నువ్వు బతకవురా, రారా, రా - అని ఎదురుతిరిగి ఒక్క వేటు వేసినప్పుడు, ఆ మతి స్థిమితం కూడా తప్పడం కథకి అవసరమవుతుంది. ఒన్ క్యారక్టర్- ఒన్ సిట్యుయేషన్- ఒన్ క్యారక్టరిస్టిక్- అంతే!  డబుల్ ధమాకాతో కథ దవాఖానాకే. 

          ఈ అరగంట తర్వాత ప్రవేశించే హీరో, నెట్ సెంటర్ పోటీల కోసం స్పీడ్ టైపింగ్ కి హీరోయిన్ ని ఒప్పించాక,  నడిపిన కథనమంతా ఇప్పటి సినిమాలకి పని కొచ్చేది కాదు. చాలా నీరస పడి పోతుంది నడుస్తున్న కథనమంతా.  ‘జయం’, ‘నువ్వునేను’ తీసిన కాలంలో యువత ఇంకా నెటిజన్లు కారు, సరీగ్గా సెల్ వాడకం దార్లు కూడా కాదు. అప్పుడు టీనేజర్లని అమాయకులుగా, ఓ చిన్న ప్రపంచంలో జీవించే లేత పిండాలుగా చూపిస్తే సరిపోయింది. ఇప్పుడు సరిపోతుందా? రూరల్ యూత్ అయినా కనెక్ట్ అవుతారా?

          అసలు నెట్ సెంటర్ కి వచ్చే అమ్మాయిలూ అబ్బాయిలు టైపింగ్ నేర్చుకోవడానికి రావడ మేమిటో అర్ధంగాదు. ఇక హీరో ప్రేమని వ్యక్తం చేశాడు, హీరోయిన్ లాగి కొట్టింది- హీరో వెళ్లి రైలు పట్టాల మీద పడుకున్నాడు.

          ఈ పడుకోవడం కూడా యితరులు చూసేట్టు చూసుకుని మరీ డ్రమెటిగ్గా పడుకున్నాడు. ఎదురుగానే ఇల్లుంది. అంటే ఏంటి అతడి  ఉద్దేశం-  చావు నటిద్దామనా? ఆ ఇంట్లో ఎవరో చూసి కాపాడితే హీరోయిన్ కరిగిపోతుందనా? అసలది రైలొచ్చే టైమేనా? ఇది కామెడీ సినిమా అయితే ఇలా బాగానే వుంటుంది, కానీ ఒక  సీరియస్ పరిస్థితిని ఇలా కామెడీగా చూడాల్సి వస్తోంది. ఇంతలో  ఓ చిన్న కుర్రాడు ఆ ఇంట్లోంచి రివ్వున రానే వచ్చాడు, వచ్చేసి సీను చూసేసి, హీరోయిన్ కి చెప్పేందుకు తుర్రుమన్నాడు. హీరో చచ్చాడు! - ‘ఒరే ముందు మీ ఇంట్లో చెప్పి కాపాడరా, రైలొచ్చేస్తుంది- ఆ హీరోయిన్ కి తర్వాత చెప్పేడ్చినా  నా ఎక్స్ పెరిమెంట్ సక్సెస్ అవుతుంది’ - అని అరవాలి హీరో. కుర్రాడు కూడా, తానలా హీరోయిన్ దగ్గరికి తుర్రుమంటే, ఇలా సర్రుమని ట్రైనొచ్చి హీరో మీదికి ఎక్కేస్తే? - అని ఆలోచించలేదు వాడి తెలివికి! 

          ఇదంతా ఇంటర్వెల్ ఘట్టం. ఆ సమయంలో విలన్ వచ్చి కాపాడి కోప్పడతాడు. పక్క కెళ్ళి ఒకణ్ణి మర్డర్ చేస్తాడు. అట్నుంచి హీరోయిన్ వస్తూంటుంది. హీరోని కలుసుకుంటుంది. ‘చస్తావా? చచ్చిపోతావా?’ అని ఎడాపెడా లెంపకాయలు కొట్టి- ‘నన్ను చేసుకుంటే నీకు ప్రమాదమనే అప్పుడు రిజెక్ట్ చేసి కొట్టాను’ - అని సంజాయిషీ చెప్పుకుంటుంది. 

          ఇది చాలా కీలకమైన సన్నివేశం! ఇక్కడే హీరోయిన్ సమస్య బయటపడి, ఆ సమస్యతో హీరో సంఘర్షణ మొదలయ్యే- బిగినింగ్ ముగిసి చక్కగా మిడిల్ ప్రారంభమయ్యే ఘట్టం! కానీ ఇదేం  జరగదు..

          ఆమె అలా అనగానే  హీరో ఎలర్ట్ అవ్వాలి నిజానికి. తను ఈమెని చేసుకుంటే తనకే ప్రమాదమని ఎందుకన్నది అనైనా మానవ సహజ కుతూహలంతో అడగాలి. అసలామె సమస్యే మిటో, ఆందోళన దేనికో అప్పుడైనా అడిగి తెలుసుకోవాలి. అదేమీ చెయ్యడు. అటు పక్క మర్డర్ చేసిన విలన్ రక్తం తుడుచుకుంటూ ఉంటాడు. వీళ్ళు చూడరు, వీళ్ళని వాడూ చూడడు. ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతూంటే ఇంటర్వెల్. ఇంతసేపూ అటు వెనకాల పట్టాల మీదే ట్రైనే వెళ్ళదు.
 
          నిజంగానే ఇక్కడ బిగినింగ్ ముగిసి కథ సెటప్ అయిందా? ఇక్కడ్నించీ మిడిల్ సాగడానికి సమస్య ఏర్పాటయ్యిందా? 

          ఎవరికి  సమస్య ఏర్పడాలి? కథానాయకుడికి ఏర్పడాలి. కథానాయకుడు హీరోనే అనుకుంటున్నాం. ఇతను చూస్తే ఇంతవరకూ హీరో లక్షణాలేవీ కనబరచలేదు. హీరోయిన్ కాదన్నదని పట్టాల మీద పడుకున్నాడు. పరిస్థితి తీవ్రత గురించి హీరోయిన్ హింట్ ఇచ్చినా పట్టించుకోలేదు. మరి ఇతడి గోల్ ఏమిటి? కనుక గోల్ లేదు కాబట్టి ఇతను ఈ కథకి కథానాయకుడు కాదు. ఎంత పాసివ్ హీరో క్యారక్టర్లయినా కథానాయకులు గానే వుంటాయి సినిమాల్లో. అలా పాసివ్ హీరోగా వున్న ఇతను కూడా కథానాయకుడు కానట్టు పాత్ర చిత్రణ, కథనం నడిచాయి. ఒక సినిమాలో హీరో కాక పోతే ఇంకెవరు కథా నాయకులవుతారు? అలాంటి సినిమాలుంటాయా? 

          హీరోయిన్ సంగతి చూస్తే, ఈమె విలన్ భయంతో బాటు- అటు హీరోని ప్రేమించడానికీ అన్న భయంతో బిక్కుబుక్కు మనే పాత్ర. ఈమెకి ఈ సమస్యలున్నాయి గానీ -పరిష్కరించుకునే తెగువ ( గోల్) లేదు. కనుక ఈమే కథానాయకురాలు కాదు.

          ఇక మిగిలింది విలన్. ఇతనే మన గ్రేట్ హీరో! సినిమా మొదలెట్టింది లగాయతూ హీరోయిన్ కోసం పడి చచ్చిపోతూ- మర్డర్లు చేసేస్తూ- ఆమెని వెతుక్కుంటూ-పిచ్చోడిలా తిరుగుతున్నాడు. ఇతడికి తిరుగులేని గోల్ వుంది- ఈ బిగినింగ్ లోనే కాదు- మిడిల్- ఎండ్ దాకా అన్నిటా ఈ గోల్ కోసం రగిలిపోతూంటాడు. కాబట్టి ఈ కథకి కథానాయకుడు ఇతనే అని తేలుతోంది.

          ఈ సినిమాకి విలనే కథానాయకుడు!
          ఈ కథ విలన్ దే!
          గోల్ వున్న క్యారక్టర్ విలనే! 
          ఇంత స్క్రీన్ ప్లే బ్లండర్ తో ఒక సినిమా ఎలా తీస్తారో విచిత్రం.


***
      యినంత మాత్రాన ఈ ఇంటర్వెల్ తో బిగినింగ్ విభాగం ముగిసి మిడిల్ ప్రారంభమయి నట్టు కాదు. కథ కూడా ప్రారంభ మయినట్టు కాదు. ఇంటర్వెల్ సీన్ చాలా మిస్ లీడింగ్ సీన్. ఇక్కడ సమస్య ఏర్పాటయి నట్టే కన్పిస్తుంది కానీ ఏర్పాటు కాలేదు- ఏర్పాటయితే ఏదో ఒక పాత్ర ఎఫెక్ట్ అవ్వాలి. ఈ మైదాన ప్రాంతంలో  విలన్ - హీరోయిన్ ఎదురెదురు పడలేదు. విలన్ పొదల అవతలే ఉన్నాడని హీరోయిన్ కి తెలీదు, హీరోయినూ హీరో పొదలవతల ఉన్నారనీ విలన్ కూడా చూసుకోలేదు. హీరోయిన్ ఈ ఊళ్లోనే ఉంటోందని కూడా అప్పటికి తెలీదు. విలన్ అవతల ఉన్నాడని హీరోకి తెలిసినా- ఆ విలన్ కి,  హీరోయిన్ తో వున్న ప్రాబ్లం అసలే తెలుసు కోదల్చుకోలేదు హీరో.

          విలన్ చూసి వుంటే వెంటనే సమస్య ఏర్పాటయ్యేది-ఆ సమస్య విలన్ దే అయి దాన్ని సాధించే  క్రమంలో ఇక్కడ బిగినింగ్ ముగిసి- ఇంటర్వెల్ తర్వాత నుంచైనా మిడిల్ ప్రారంభమయ్యేది- మూడు పాత్రల మధ్య ఇంటరెస్టింగ్ ప్లేతో.

          ఇలా లేదు సెటప్. కేవలం విలన్ ఊళ్ళోకి వచ్చాడు కాబట్టి, పరోక్షంగా సమస్య క్రియేట్ అయ్యిందని ఆడియెన్స్ ఫీలవ్వాలి తప్ప, ప్రత్యక్షంగా పాత్రల మధ్య ఇంకా ఏమీ లేదు. కనుక  ఇక్కడింకా ఇంటర్వెల్ దగ్గర గంటన్నర గడిచినా, ఇంకా బిగినింగ్ ముగియలేదు, సమస్య- సంఘర్షణ ఏర్పాటుతో కథ ప్రారంభమూ  కాలేదు.


***
లాజోస్ ఎగ్రి 
     కథలన్నీ సంఘర్షణా యుతమైనవే. సంఘర్షణ లేక పాత్ర లేదు, పాత్రలేక చర్యల్లేవు, చర్యల్లేక  కథలేదు, కథ లేక స్క్రీన్ ప్లేనూ లేదు- సిడ్ ఫీల్డ్. 
          అంటే సంఘర్షణ మొదలవనిది కథ మొదలవనట్టే. సంఘర్షణ బిగినింగ్ లో మొదలవదు. బిగినింగ్ ముగిసేచోట సంఘర్షణ మొదలవుతుంది. అక్కడ అప్పుడు స్క్రీన్ ప్లే మిడిల్ లో పడి కథ మొదలవుతుంది. కాబట్టి ‘హోరాహోరీ’ లో పైన చెప్పుకున్నట్టు, ఇంటర్వెల్ దగ్గర కూడా సంఘర్షణ పుట్ట లేదంటే, బిగినింగ్ ఇంకా ముగిసిపోనట్టే. అంటే సెకండాఫ్ లో కూడా బిగినింగ్ అలా కొనసాగుతూనే ఉంటుందన్న మాట!  సంఘర్షణ ఎప్పుడు పుడుతుందో తెలీదు, కథ ఎప్పుడు ప్రారంభ మవుతుందో తెలీదు. ఈ నడుస్తున్నదంతా అవధులు దాటిన ఉపోద్ఘాతమే! ఉపోద్ఘాతం కథ వుతుందా?

          చాలా విచారించాల్సిన విషయమేమిటంటే, ఇప్పటికీ చాలా మంది స్క్రీన్ ప్లే ప్రారంభం నుంచీ చూపించేదంతా కథే అనుకుంటున్నారు! అందుకే ఇలాటి స్క్రీన్ ప్లేలు! సంఘర్షణ
పుట్టనంత సేపూ కథే కాదు- ఈ సంఘర్షణ గురించి- లాజోస్ ఎగ్రి  (1888 – 1967)  రాసిన ‘ది ఆర్ట్ ఆఫ్ డ్రమెటిక్ రైటింగ్’ అన్న ప్రసిద్ధ గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు  : ఏమీ కోరుకోని వ్యక్తినుంచి, తనకేం కావాలో తెలీని వ్యక్తి  నుంచీ సంఘర్షణని ఆశించలేం...కథలో నిర్ణయం తీసుకోలేని పాత్రలు స్తబ్దుగా ఉండిపోయే సంఘర్షణని సృష్టిస్తాయి. సంఘర్షణ పుట్టే పరిస్థితులు ఏర్పడినా పాత్రలు ఉపేక్షిస్తాయి...ఏ డైలాగూ, అదెంత బలంగా ఉన్నప్పటికీ, అది సంఘర్షణకి కారణం కానంత వరకూ కథ కూడా పుట్టదు. ఒక్క సంఘర్షణ మాత్రమే మరిన్ని సంఘర్షణలని పుట్టించ గల్గుతుంది. తొలి సంఘర్షణాత్మక పరిస్థితి- పాత్రకి తన లక్ష్యాన్ని(గోల్ ని) తను సాధించుకోవాలన్న స్పృహ కలగనంతవరకూ ఏర్పడదు..

          సరీగ్గా ఇది  ‘హోరాహోరీ’ ఇంటర్వెల్ సీనుకి వర్తిస్తుంది.  పైన వివరించుకున్నట్టు, హీరో ఏం కోరుకుంటున్నాడో తెలీదు. హీరోయిన్ ని గెల్చుకోవాలనుకుంటున్నాడా, చచ్చిపోవా లనుకుంటున్నాడా తెలీదు. ఇంటర్వెల్ తర్వాత ఆమె పెద్దలు తన్నారు, తంతే వెళ్లి విలన్ కే  చెప్పుకున్నాడు. కాబట్టి ఇతన్నుంచీ సంఘర్షణ ని ఆశించలేం. ఇతను నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టే ఇంటర్వెల్ దగ్గర పుట్టాల్సిన సంఘర్షణని పుట్టనివ్వకుండా  స్తబ్దుగా ఉండిపోయేట్టు చేశాడు.  హీరోయిన్ తో ప్రేమకి సంబంధించి ఇద్దరి మధ్యా  అసలు విషయం బయటపడే ఒక్క డైలాగూ - నోరి జారి కూడా ఇతనూ విలనూ చెప్పకపోవడం వల్ల సంఘర్షణ పుట్టలేదు. హీరో కి లక్ష్యమే లేదు కాబట్టి ఎంతసేపటికీ తొలి సంఘర్షణాత్మక పరిస్థితిని పుట్టించ లేకపోయాడు వదిలేద్దాం. హీరోయిన్ కోసం అంతగా అల్లాడుతున్న బలమైన లక్ష్యమున్న  విలన్ కూడా సంఘర్షణ పుట్టే పరిస్థితే వున్నా, దర్శకుడు చెప్పినట్టు విని, దాన్ని ఉపేక్షించడం వల్ల సంఘర్షణ నీరు గారిపోయింది. కథ పెండింగులో పడిపోయింది. విఫలమైపోయింది.


***
         సెకండాఫ్ లో బిగినింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ డ్రామా ఏమిటంటే, అసలు విషయం తెలీని హీరో-విలన్ లు జిగ్రీ దోస్తులై పోవడం..హీరో ప్రేమ కోసం విలన్ ప్లాన్లు చెప్పడం, చెప్పిన ప్లాన్లు మళ్ళీ ఆపుకోడం- (అమలైతే  విలన్ కి అసలు విషయం అప్పుడే తెలిసిపోతుందని దర్శకుడి భయం). ఆఖరికి కాలేజీ దగ్గర హీరోయిన్ని విలన్ చూసి అసలు విషయం చెప్పినప్పుడు హీరో లోలోన కుమిలిపోవడం, విలన్ ఇచ్చిన ఉంగరాన్ని అతడి తరపున హీరో తనే హీరోయిన్ కి తొడిగించడం, గోడచాటున కూర్చుని వెక్కి వెక్కి ఏడవడం, ఆ ఉంగరం హీరో ప్రేమ కానుక అనుకున్న హీరోయిన్ అన్న వచ్చేస్తున్నాడని, దాన్ని తీసేయడానికి ఇంటిల్లిపాది తో కలిసీ  విఫలయత్నం చేయడం...

          ఇలాసాగుతూ సాగుతూ ఈ బిగినింగ్ విభాగం ఇంకో ముప్పావుగంటా గడిచి- అప్పుడు అసలు విషయం విలన్ కి తెలిసి హీరోతో సంఘర్షణ పుడుతుంది. మిడిల్ ప్రారంభమై కథ మొదలవుటుంది. ఈ కథ పావుగంట మాత్రమే  నడిచి మిడిల్ అంతలోనే ముగిసిపోయి, కయిమాక్స్ తో ఎండ్ ప్రారంభమవుతుంది.

          ఇలా రెండు గంటలా నలభయి నిమిషాల సినిమాలో కథకి ఇచ్చిన సమయం ఎంత అంటే, కేవలం చిట్ట చివర పావుగంట! మిడిల్ మటాష్ తో మిగతాదంతా నస! ప్రేక్షకులు డబ్బులు చెల్లించేది స్క్రీన్ ప్లేలో యాభై శాతం కథ ( మిడిల్) కోసం!  ఇలా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే తో సినిమా ఎలా సక్సెస్ అవుతుందనుకోవాలి?  ‘కిక్- 2’  సక్సెస్ అయిందా? 

          చివరగా, ఈ కథ పాయింటు 2013 లో విడుదలైన ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబాయి దొబారా’ పాయింటూ ఒకటే. ఇందులో మాఫియాగా అక్షయ్ కుమార్, బస్తీ కుర్రాడు ఇమ్రాన్ ఖాన్ ని చేరదీసి, అనుచరుడుగా నియమించుకుంటాడు. ఇద్దరూ కలిసి సోనాక్షి సిన్హా తో ప్రేమలో పడతారు...


-సికిందర్