రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, June 27, 2015

ఒరిజినాలిటీ ఏది?

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : వీఐ ఆనంద్
తారాగణం :
 సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, సీరత్‌ కపూర్‌, తనికెళ్ళ భరణి, సుప్రీత్‌, ప్రవీణ్‌
మాటలు : అబ్బూరి రవి, ఛాయాగ్రహణం : ఛోటా కె.నాయుడు
  సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌
బ్యానర్‌: ఎన్‌.వి.ఆర్‌. సినిమా   సమర్పణ:
 ఠాగూర్‌ మధు  నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌
విడుదల :
 26.జూన్ 2015
*



When an actor comes to me and
wants to discuss his character,
I say, ‘It’s in the script.’
If he says, ‘But what’s my
motivation?,’ I say, ‘Your salary.’
-Alfred Hitchcock




మధ్య తెలుగు సినిమాలు  రొటీన్ నుంచి బయట పడుతున్న ఆరోగ్యకర- పోనీ - ఆసక్తికర పరిణామాలు సంభవిస్తున్నాయి. మే- జూన్ రెండు మాసాల్లోనే  మూడు సినిమాలు రొటీన్ ని బద్దలు కొడుతూ విచ్చేశాయి. ‘దొంగాట’, ‘అసుర తర్వాత ఇప్పుడుటైగర్’   తెగువని ప్రదర్శించాయి. అయితే  రొటీన్ కి భిన్నంగా ఆటవిడుపుగా వస్తున్న సినిమాలు క్రైం థ్రిల్లర్- యాక్షన్ సినిమాలే కావడం గమనార్హంకామెడీ, ప్రేమలు, రాజకీయం వంటి ఇతర జానర్స్ లో కొత్తదనాన్ని ప్రదర్శించే సినిమాలు కూడా వస్తే, చిన్న బడ్జెట్ సినిమాలకి ఎంతో కొంత సొమ్మూ పరువూ శాటిలైట్ హక్కులు కూడా దక్కుతాయి!
          చిన్న బడ్జెట్ సినిమాలతో సరిపెట్టుకునే దర్శకులు, నిర్మాతలు దొరక్క అవస్థలు పడుతున్నారు. నిర్మాతలు ఎందుకు దొరకడం లేదంటే, ఈ సినిమాలకి శాటిలైట్ హక్కులు రద్దయ్యాయి కాబట్టి.  తీసిన చిన్న బడ్జెట్ సినిమా ఏంతో కొంత ఆడితేనే శాటిలైట్ హక్కులకి అర్హమౌతున్నాయి కాబట్టి.  ఎలాగూ ఈ దర్శకులు పట్టుకు వేలాడే మూస ప్రేమ సినిమాలకి, అందునా ముక్కూ మొహం తెలీని, కనీసం చూడ్డానికి బావుండని వింతవింత కొత్త ఫేసులతో  తీసే సినిమాలకి,  మూడ్రోజులు ఆడే భాగ్యం కాదుకదా, అసలు విడుదలకి నోచుకునే అదృష్టమే చాలావరకూ దక్కడం లేదు.  అయినా పరిస్థితుల్ని బట్టి పంథా మార్చుకుందామన్న ఆలోచన ఎవరికీ లేదు.  ఆ తీసేదేదో వెరైటీ సినిమాలైనా తీస్తే  ఏంతో  కొంత మంచి పేరైనా తెచ్చుకుని, శాటిలైట్ హక్కులతో బాక్సాఫీసు నష్టాల్ని పూరించుకునే అవకాశం వుంటుంది. కానీ మనవాళ్ళకి చిన్న బడ్జెట్ సినిమా అంటే ఎంత సేపూ ఎవరో ఎప్పుడో ఆ కాలానికి తగ్గట్టు బాట వేసిన పాత మూస సినిమాలే ఇంకా! పాత మూసని ఇంకా స్టార్లు నిలబెట్టగలరేమో గానీ, చిన్నాచితకా హీరోలు నిలబెట్ట లేరు.

          2000 తర్వాత  హాలీవుడ్ లో రోమాంటిక్ కామెడీలు విసుగెత్తించేసే సరికి యాక్షన్  సినిమాలని ఉత్పత్తి చేయసాగారు. అప్పట్నుంచీ ఏడాదికేడాది పదేసి చొప్పున యాక్షన్ సినిమాలే  హిట్టవసాగాయి. మన తెలుగులో కూడా 2000 లో  ‘నువ్వేకావాలి’ అనే ఒక ప్రేమ- స్నేహాల సినిమా సూపర్ హిట్టవడంతో, ఇక ప్రేమ- స్నేహాల సినిమాలే వెల్లువెత్తి విసుగుపుట్టించాయి. ఆ ట్రెండ్ రెండేళ్ళ పాటు కొనసాగి- సాగి అంతరించిపోయింది. ఇప్పటి ట్రెండ్ ఇంకెప్పుడు ముగిసిపోతుందో తెలీదు- అయితే కాస్త తేడాగా తీస్తున్న ‘దొంగాట’, ‘అసుర’, ‘టైగర్’ లాంటి క్రైం- యాక్షన్ సినిమాలని ఇంకాస్త బలంగా, అర్ధవంతంగా  తీసినప్పుడు వీటి సక్సెస్ రేంజి  బాగా పెరిగే అవకాశం వుంది.  వీటికి ఇలా సక్సెస్ రేంజి బాగా పెరిగినప్పుడు ప్రేమ సినిమాల సృష్టికర్తలు వాటిని వదిలి పారేసి,  వీటి వైపు తరలి వచ్చి- తెలుగు మార్కెట్ ని కొత్త పుంతలు తొక్కించే దృశ్యాలు కన్పిస్తాయి. 

          ‘టైగర్’ సక్సెస్ రేంజి ఓ స్థాయిలోనే  ఆగిపోవడానికి కారణాలున్నాయి- అవేమిటో తెలుసుకునే ముందు ఇందులో విషయమేమిటో ఓసారి చూద్దాం..

ప్రాణమిత్రులూ ఔర్ గౌరవ్ రక్షా హేతువ్ హత్యాయేఁ !
       పరువు హత్యలూ పరువు హత్యలూ అంటున్నారు ఆనర్ కిల్లింగ్స్ ని పట్టుకుని. పరువుని ఎవరైనా హత్య చేస్తారా? ఎంత సిల్లీ! కుటుంబ గౌరవ ప్రతిష్టల కోసం కుటుంబ సభ్యుల్నే హతమార్చడం ఆనర్ కిల్లింగ్. హిందీ పత్రికల్లో లో దీనికి చక్కటి పదబంధాన్ని వాడుతున్నారు- గౌరవ్ రక్షా హేతువ్ హత్యాయేఁ..అని. ఈ జాడ్యం ఉత్తరాది నాల్గు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఏనాటి నుంచో వుంది. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చాలా తక్కువ. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళే కులాంతర, మతాంతర వివాహాల విషయంలో పరమ కర్కోటకులనే అర్ధం వచ్చేట్టు చిత్రీకరణలు చేయడం భావ్యం కాదు. ఇతర దేశాల్లో కూడా ఈ దురాచారానికి ఏటా ఇరవై వేల మంది బలి అవుతున్నారని కూడా చెప్పాలి. 

          ప్రస్తుత సినిమాలో కథేమిటంటే, వారణాసిలో విష్ణు ( రాహుల్ రవీంద్రన్) ని దుండగులు వేటాడ్డంతో అతను ప్రమాదం పాలవుతాడు. రోడ్డు మీద ప్రాణాపాయ స్థిలో పడి వున్నఅతణ్ణి ఎవరూ కాపాడక పోతే ఒక సహృదయుడు కల్పించుకుని ఆస్పత్రికి తీసికెళ్ళి చికిత్స చేయిస్తూంటాడు.  ఈలోగా ఇంకా స్పృహలోనే వున్న విష్ణు స్వగతంలో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమౌతుంది.

          ఈ ఫ్లాష్ బ్యాక్ లో టైగర్ - విష్ణులు చిన్నప్పుడు రాజమండ్రిలో ఓ అనాధాశ్రమంలో పెరుగుతారు. విష్ణు అమాయకుడు కావడంతో, అతడి బాగు కోరుకునే టైగర్ అతణ్ణి మానసికంగా  నియంత్రిస్తూంటాడు. ఇలా వుండగా పిల్లలేని ఓ జంట విష్ణు ని దత్తత తీసుకోవడానికి వస్తే మంచి భవిష్యత్తు నాశించి విష్ణు టైగర్ మాట వినకుండా వెళ్ళిపోతాడు. అయినా టైగర్ కోపం పెంచుకోకుండా అతడితో టచ్ లో ఉంటాడు.
          విష్ణు ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో జాబ్ లో చేరతాడు. అక్కడే వారణాసికి చెందిన గంగ (సీరత్ కపూర్) జాబ్ లో చేరుతుంది. వీళ్ళిద్దరికీ ఇంతకి  ముందు వైజాగ్ లో జరిగిన ఓ కాలేజీ ఈవెంట్ లో పరిచయం, ప్రేమా వుంటాయి. ఇదిప్పుడు కంటిన్యూ అవుతూంటే, టైగర్ వచ్చి అడ్డు పడతాడు. ఈ అమ్మాయిని ప్రేమించ వద్దంటాడు. ప్రేమంటే కుటుంబాలని కలుపుకునేదే గానీ, విడిపోయి ఒంటరి వాళ్ళు కావడం కాదంటూ కారణాలు చెప్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య తేడాలొచ్చి విడిపోతారు. అటు ఈ ప్రేమ విషయం పసిగట్టిన గంగ తండ్రి దుండగుల్ని పంపి ఇద్దర్నీ వారణాసికి రప్పిస్తాడు. కుటుంబ పరువు మంటగలుపుతున్న వీళ్ళిద్దర్నీ చంపెయ్యమని ఆదేశిస్తాడు. ఈ చంపబోయే క్రమంలోనే- గంగని ఓ చోట దాచి పెట్టి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తున్న విష్ణు మీద దాడి చేస్తారు. ఇలా ఇతనిప్పుడు కొనప్రాణాలతో ఆస్పత్రిలో వున్నాడన్నమాట. 
          ఇక తనని కాపాడేందుకు టైగర్ రావాలని అతడి ఫోన్ నంబర్ ఇస్తాడు విష్ణు. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న టైగర్ వారణాసి బయల్దేరి వెళ్తాడు. అక్కడ ఆనర్ కిల్లింగ్ పేరిట తెగబడ్డ ముఠాని ఎలా ఎదుర్కొని, ఆ తండ్రికి బుద్ధి చెప్పి,  ప్రేమికులిద్దర్నీ టైగర్ ఎలా కలిపాడన్నది ఇక్కడ్నించీ సాగే సెకండాఫ్ కథ. 
ఎవరెలా చేశారు
       ముందుగా ఈ టైటిల్ రోల్ పోషించిన సందీప్ కిషన్ ని అభినదించాలి. హీరోయిన్ లేకుండా- అదీ అరగంట గడించింతర్వాత గానీ తను ఎంట్రీ ఇవ్వకపోవడం డేరింగ్ ప్రయత్నమే. దీనికి ప్రేక్షకులనుంచి అభ్యంతరాల్లేవు. బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంటర్వెల్లో బయటికొచ్చి తిట్టుకుంటున్న దృశ్యాల్లేవు. ప్రేక్షకులు  ఎదుగుతున్నారనే దానికి ఇదే నిదర్శనం. ఇలా నటుణ్ణి బట్టి కథ కాకుండా, కథని బట్టే నటుడన్న సరయిన విధానం ఈ సినిమాలో కన్పిస్తుంది. ఐతే ఇలాటి తేడాలతో తమిళ దర్శకులు వచ్చినప్పుడే మన హీరోలు ఎర్ర తివాచీలు పరుస్తున్నారని ( మరో ఉదాహరణ ‘దొంగాట’), తెలుగు దర్శకులు అప్రోచ్ అయితే తెలివి హీనులుగా చూస్తున్నారనీ విమర్శ వుంది. దీనికేం సమాధానం చెప్తారు? తమిళ దర్శకులే వచ్చి ప్రేక్షక దేవుళ్ళకి తేడా గల సినిమాలివ్వాలా, తెలుగు దర్శకులు అందుకు అంటరాని వాళ్ళా? 
          పోతే, సందీప్ కిషన్ పోషించిన ఈ తరహా పాత్ర మంచిదే గానీ, ఫస్టాఫ్ లో ఒక విధంగా, సెకండాఫ్ లో ఇంకో విధంగా మంచిది కాదు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. 
రాహుల్ రవీంద్రన్ అమాయకుడి సాఫ్ట్ రోల్ లో ఫస్టాఫ్ వరకూ వినోదపర్చి, అక్కడ్నించీ చిట్ట చివరిదాకా కోమాలో లేకుండా కోమాలో వున్నవాడిలా అచేతనంగా ఆస్పత్రిలో పడి ఉండిపోయాడు- ‘దోచేయ్’ లో రావురమేష్ లాంటి నటుడు వృధాగా జైల్లో పడి  వున్నట్టు ! సహాయ పాత్రల్ని ఆస్పత్రిలోనో జైల్లోనో పడేసి, ముఖ్యపాత్రల చేత బయట హడావిడి చేయించడం డబ్బులొచ్చే కమర్షియల్ సినిమా క్యాలికులేషన్. దీనికి భిన్నంగా ఇక్కడ కూడా తేడాగల చిత్రీకరణ అన్పించుకోవాలనుకోవడం అవివేకం. సందీప్ కిషన్ మొదటి అరగంట త్యాగం చేశాడు కాబట్టి, రాహుల్ రవీంద్రన్ ఇలా రెస్టు తీసుకుని కాంపెన్సేట్ చేయాలా?
          ఇక హీరోయిన్ సీరత్ కపూర్ ఈ సినిమాకి  బాగా మైనస్. మొదటి సినిమా ‘రన్ రాజా రన్’ లోనే  ఎంత బరువుతో వుందో, అందుకే మాత్రం తగ్గకుండా, అదే బరువుతో, పైగా హెవీ మేకప్ తో ఇబ్బంది కల్గించే విధంగా వుంది. ఈమెని గ్లామరస్ గా చూపించడం నంబర్ వన్ ఛాయాగ్రాహకుడు ఛోటా కె నాయుడు వల్ల కూడా కాలేదు.  సెకండాఫ్ లో ఈమె కూడా మళ్ళీ క్లయిమాక్స్ లో గానీ కన్పించే వరకూ ఎక్కడో దాక్కుని వుంటుంది! 
      సినిమాకి ఎసెట్ ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం. వారణాసి ఓపెనింగ్ సీనులో గంగా నది నేపధ్యంలో ఎగిరే పక్షుల రెక్కల చప్పుళ్ళూ, కూతలతో కల్పించిన  వాతావరణం ఓ క్లాసిక్ క్రియేషన్. ( ఇలాటి క్రియేషన్ ని మళ్ళీ  ‘నాయకుడు’ లో ఓ పాటలో గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర దృశ్యంలో మణిరత్నం చేతులమీదుగా చూస్తాం). దీనికి డీటీఎస్ మిక్సింగ్ చేసిన దేవీకృష్ణ కడియాల చాలాకాలం తర్వాత తన వృత్తిలో సంతృప్తి చెంది వుంటారు. అలాగే వర్షంలో, యాక్షన్ లో రెండు మూడు సార్లు వచ్చే గోదావరీ, దాని మీద బ్రిడ్జి దృశ్యాల చిత్రీకరణలు కూడా క్లాసిక్ ఎగ్జాంపుల్స్. ఇలా దృశ్యాల్ని సస్టేయిన్ చేసి, కాసేపు ఆడియెన్స్ ఇన్వాల్వ్ అయ్యే, మనసారా ఆస్వాదించే అనుభావాన్నివ్వడం దర్శకుడి బాధ్యత. ఈ బాధ్యత లోపించడం వల్లే సెకండాఫ్ దెబ్బతింది క్రాఫ్ట్ పరంగా.
          సెకండాఫ్ లో పాటల్లేక పోవడాన్ని కూడా ప్రేక్షకులు అంగీకరించారు. ఫస్టాఫ్ లో పాటలకి తమన్ సంగీతం కాస్త ఫర్వాలేదు. అయితే నేపధ్య సంగీతం విషయానికొచ్చేసరికి- ఓ సామాజిక దురాచారాన్ని చెబుతున్న ఈ కథ,  ఓ థీమ్ మ్యూజిక్ ని డిమాండ్ చేస్తోంది. ఈ థీమ్ మ్యూజిక్ ని సందర్భాన్ని బట్టి అక్కడక్కడా ఇస్తూపోయి - దేనికి ఈ మ్యూజిక్ వస్తోందబ్బా అన్న సస్పెన్స్ క్రియేట్ చేయడం ద్వారా ఆడియెన్స్ కి యాంకర్ వేసి-  క్లయిమాక్స్ లో కథ పాయింటు కొచ్చేసరికి- ఆ థీమ్ మ్యూజిక్ రహస్యాన్ని విప్పుతూ సన్నివేశ పరంగా దాన్ని ఉధృతం చేసి- హోరెత్తించి వుంటే- ఆ బీభత్స రసం ప్రేక్షక హృదయాల్ని పిండేసి దండాలు పెట్టేసేవాళ్ళు దండిగా!
సినిమా అంటే లక్ష్మి మాత్రమే కాదు, కాస్త సరస్వతి కూడా!!
          తేడా లేకుండా చిన్న సినిమాలన్నిట్లో టేకింగ్ గానీ, క్రాఫ్ట్ గానీ రోకలి బండలో వేసి దంచినట్టు ఒకే రొడ్డ కొట్టుడుతో ఒకేలా ఉంటున్నాయి- ఇదే ప్రాబ్లం!

        ఆనర్ కిల్లింగ్స్ సమస్యతో హిందీలో రెండు సినిమాలు గత మార్చిలోనే వచ్చాయి. ఒకటి లండన్ నేపధ్యంలో ఇండియా పాకిస్తాన్ అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ కథగా ‘ఆనర్ కిల్లింగ్’ అనేది, రెండోది హర్యానా నేపధ్యంలో ‘ఎన్ హెచ్- 10’ అనేది. బాలీవుడ్ ఎందుకో ఆనర్ కిల్లింగ్స్ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు తెలుగులో ఇదే  ఉత్తరాది సమస్యని తీసుకుని అక్కడి పాత్రలతో ‘టైగర్’ తీసినప్పుడు రొటీన్ గా జరిగేదే జరిగిపోయింది. పాయింటు పరంగా సినిమా డిఫరెంటే గానీ, మిగతా కథా కథనాల విషయంలో కాదు. పైన చెప్పుకున్నట్టు ఏ యాక్షన్ సినిమానైనా ఎలా రొడ్డ కొట్టుడుగా తీసేస్తున్నారో అలాగే తీసేశాడు దర్శకుడు. 

          ఒరిజినాలిటీని, దానికి తగ్గ టేకింగ్ ని , క్రాఫ్ట్ ని, స్టయిల్ నీ డిమాండ్ చేస్తున్న ఇలాటి డిఫరెంట్ సబ్జెక్టు ని  కేవలం ఎడతెరిపిలేని ఫక్తు యాక్షన్ మూవీగా మార్చేసి అన్యాయమే చేశాడు దర్శకుడు. తన క్రియేటివిటీని కేవలం ఫస్టాఫ్ లో మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వరకే పరిమితం చేసుకున్నాడు. సెకండాఫ్ కొచ్చేసరికి మొత్తం హీరో కొప్పజెప్పేసి తను పూర్తిగా విశ్రమించాడు. ఇక హీరో తనకి తోచినట్టూ రామగోపాల్ వర్మ అప్పట్లో తీసిన హిందీ ఫ్లాప్ ‘జేమ్స్’ లాగా ఫైట్ల మీద ఫైట్లూ  చేసుకుంటూ ఫ్లాట్ గా వెళ్ళిపోయాడు. వెరసి సెకండాఫ్ కథ జీవం కోల్పోయింది.
          ఈ స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ వుంది. కానీ కథని హీరో నడపలేదు, హీరో నే కథ నడిపింది. ఇదే ప్రాబ్లం. దీనివల్ల స్ట్రక్చర్ వుండీ, స్ట్రక్చర్ లోపల సెకండ్ యాక్ట్ ( మిడిల్) బిజినెస్ కుంటుబడింది. కథని హీరో నడిపి వుంటే, ఈ బిజినెస్ బలంగా వుండేది. కథే హీరోని నడపడం వల్ల సెకండాఫ్ లో యాక్షన్ లోకొచ్చిన హీరో – గ్యాంగ్ తో తల పడుతున్నప్పుడు రియాక్టివ్ గా ప్రవర్తించాడు. ఆస్పత్రి మీద దాడులు చేస్తున్న గ్యాంగ్ ని ఎదుర్కొంటూ ఉండిపోవడమే అతడి పనైపోయింది. ఇది పాసివ్ క్యారక్టర్ లక్షణమే. అసలు ఎవరు తన మిత్రుడికి అపాయం తలపెడుతున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తితో  హీరో యుద్ధానికి పూనుకుని వుంటే అది యాక్టివ్ క్యారక్టర్ అయ్యేది. 
      ఇలాగాక, సూత్రధారి ఎవరో తెలుసుకోకుండా, యుద్ధరంగంలో పొంచివుండి, గ్యాంగ్ దాడులు చేస్తున్నప్పుడు మాత్రమే  ఎదురు దాడులు చేసే వాడు పాసివ్ లేదా రియాక్టివ్ క్యారక్టరే అవుతాడు. ఇలా కొంత సేపు కథ నడిచాక, ఒకణ్ణి పట్టుకుని విలన్ ఎవరని అడగడం తో సరైన దారిలో పడతాడు హీరో. ఈ ఒడిదుడుకుల క్యారక్టరైజేషన్ వల్ల మిడిల్ దాని బలాన్ని కోల్పోయింది. రెండోది – ఇలా కష్టపడి డిఫరెంట్ మూవీ  తీస్తున్నప్పుడు మళ్ళీ అభద్రతా భావానికి లోనైనట్టు ఆస్పత్రిలో ఎపిసోడ్లలో గ్యాంగ్ అందర్నీ కమెడియన్లని పెట్టేసి అర్జెంటుగా మాస్ కామెడీ ని సృష్టించాడు. దీంతో సీరియస్ నెస్ నశించి,  మిడిల్ ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయింది. గ్యాంగ్ మీద ఇంజెక్షన్లు ప్రయోగించి లాజిక్ లేని కామెడీ కి కూడా పాల్పడడం హీరో అమెచ్యూరిష్ చేష్ట!
          ఫస్టాఫ్ కథ స్నేహాలూ ప్రేమలూ ఎడబాట్లతో గడిచినట్టు ఉపోద్ఘాతం అంతా  చెప్పాక, సెకండాఫ్  లో పాయింటు కొచ్చి దర్శకుడు ఏం ఎత్తుకోవాలి? ఆనర్ కిల్లింగ్స్ గురించి ఎత్తుకోవాలి. ఆనర్ కిల్లింగ్స్ గురించి తెలీని రాజమండ్రి కుర్రాడు వారణాసి వెళ్తున్నాడు స్నేహితుణ్ణి కాపాడుకునేందుకు. ప్రేక్షకులు ఇతన్ని ఫాలో అవుతారు. ఎందుకు ఫాలో అవుతారు? ఉత్తరాదిలో ఆనర్ కిల్లింగ్స్ గురించి తెలుసుకునేందుకు. కాబట్టి ఇక్కడ హీరో ప్రేక్షకుల ప్రతినిధే. ( ఏ కథల్లోనైనా కథానాయక పాత్ర ప్రేక్షకుల/ పాఠకుల ప్రతినిధే). తనద్వారా ప్రేక్షకులు సమాచారం తెలుసుకోవాలని హీరోని పట్టుకుని ఫాలో అవుతూంటారు. దీన్నే కనెక్ట్ అవడం అంటారు. 

       ఒక ప్రాంతం నుంచి హీరో ప్రమాదకరమైన ఇంకో ప్రాంతానికి సమస్యని  ఛేదించడానికి వెళ్తున్నాడంటే  అది సబ్ కాన్షస్ జర్నీయే. హీరో రాజమండ్రీలో ఉన్నంతవరకూ తన అల్లర్లతో స్నేహాలతో అదొక ఆర్డినరీ వరల్డ్. అంటే తనకు తెలిసిన తన కాన్షస్ మైండ్. తను ఇగో అనుకుంటే,  ఆ ఇగో తనకు తెలిసిన కాన్షస్ మైండ్ లోంచీ, ఇంకా అట్టడుగున తనకి తెలీని సబ్ కాన్షస్ మైండ్ అనే నిగూఢ ప్రపంచంలోకి వెళ్లి- ఆ ప్రపంచాన్ని ( సబ్ కాన్షస్ మైండ్ ని )  మధించడమే కథల్లో జరిగాల్సిన అసలు పని. ఇది తెలీక చాలా మంది చేయరు. చేసినప్పుడు మాత్రమే  ప్రేక్షకులైనా, పాఠకులైనా కథకి బలంగా అతుక్కుపోతారు. ఈ రహాస్యం హాలీవుడ్ దర్శకులకీ రచయిలకీ బాగా తెలుసు. వాళ్ళ సినిమాల్ని చూస్తే  ఇది ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ సినిమా అంటే లక్ష్మితో బాటు సరస్వతి కూడా కాబట్టి.  
         రాజమండ్రి కుర్రాడు వారణాసి వెళ్ళినప్పుడు అసలేం జరిగిందో, అక్కడి పరిస్థితు లేమిటో  ముందు తెలుసుకోవాలి. మిత్రుణ్ణి కాపాడిన సహృదయుడే అతడికి అంతా చెప్పుకు రావొచ్చు ఆనర్ కిల్లింగ్స్ గురించి. దీంతో కథలో కొంత టెన్షన్ పెరగవచ్చు. హీరో దీని లోతుపాతులు తెలుసుకోవడానికి పోలీసుల్ని సంప్రదించవచ్చు. ఆ పోలీసుల సహాయ నిరాకరణ కూడా రుచి చూడొచ్చు. ఇక్కడ టెన్షన్ మరో మెట్టు పెరగవచ్చు. ఆనర్ కిల్లింగ్స్ కి ఎంతమంది బలవుతున్నారో లైబ్రరీ కెళ్ళి మొత్తం వ్యవహారమంతా తెలుసుకోవచ్చు. ఇక్కడ టెన్షన్ తీవ్రత ఇంకా పెరగొచ్చు. ఈ శిక్ష లేస్తున్న ఖాప్ పంచాయితీల గురించి తెలుసుకోవడానికి గ్రామాలకి వెళ్ళినప్పుడు టెన్షన్ పతాక స్థాయికి చేరి తన మీద  దాడులు జరగొచ్చు. పోలీసులకి చెప్పుకోబోతే ఖాప్ పంచాయితీలకి పోలీసులుకూడా ఎలా భయపడతారో తెలిసి వచ్చి- ఈ పర రాష్ట్రం లో తను ఒంటరి అన్న ఫీలింగ్ తో, ప్రేక్షకులకి ఒకవిధమైన భయాందోళనలు సృష్టించ వచ్చు. 
          సస్పెన్స్ బ్రహ్మ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అంటాడు- బ్యాంగ్ ఇవ్వడం లో టెర్రర్ లేదు, ఏదో బ్యాంగ్  ఇవ్వబోతున్నారనే పరిస్థితుల్ని సృష్టిస్తున్నప్పుడు మాత్రమే టెర్రర్ ఫీల్ క్రియేట్ అయి ఊపిరి బిగబట్టి ప్రేక్షకులు చూస్తూంటారని!  అంటే బ్యాంగ్ కి కూడా నాందీ ప్రస్తావన ఉంటుందన్నమాట!

          క్రాఫ్ట్ అంటే ఇదే. కథనం అంటే కూడా – స్క్రీన్ ప్లే కి ట్రీట్ మెంట్ అంటే కూడా ఇదే- రొడ్డ కొట్టుడు యాక్షన్ కథనమూ కాదు, క్రాఫ్టూ కాదు. సినిమా టేకింగ్ అంటే ఛానెల్ కి న్యూస్ కవరేజీ లాంటిది కాదు. 

          దృశ్యాల్ని సస్టేయిన్ చేసి, కాసేపు ఆడియెన్స్ ఇన్వాల్వ్ అయ్యే, మనసారా ఆస్వాదించే అనుభావాన్నివ్వడం దర్శకుడి బాధ్యత!
          అలా హీరో సెల్ఫిష్ గా తన స్నేహితుణ్ణి కాపాడుకోవడానికి వచ్చిన వాడల్లా- సమస్య విస్తృతిని చూసి, విశాలహృదయుడై ( క్యారక్టర్ గ్రాఫ్ లేదా ఆర్క్ పెరిగి)  ఇంకొంతమంది బాధితులకి కూడా విముక్తి కల్గించే హీరోయిజంతో పోరాటం మొదలెట్టొచ్చు. 
      కానీ ఈ సినిమా సెకండాఫ్ లో ఏం జరిగిందంటే, ఆస్పత్రి మీద దాడికొచ్చిన గ్యాంగ్ ఎగిరి వెళ్లి రోడ్డు మీద పడుతూంటారు. ఆస్పత్రిలో హీరో ఒపెనవుతాడు! ఈ మూసఫార్ములా టేకింగ్ తో మొత్తం కథకున్న ఒరిజినాలిటీ, హీరో పాత్ర చిత్రణా అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యాయి.
          ఇలా దాడులు  –ఎదురుదాడులు  స్కీముతో క్లయిమాక్స్ కొచ్చాక – మళ్ళీ రొటీన్ ఫార్ములా సినిమా స్టయిల్లో టపటపమని ఆనర్ కిల్లింగ్స్ గురించి నాల్గు పేపర్ కటింగ్స్, ఇంకో నాల్గు క్లిప్పింగ్స్ వేసిపారేసి, హీరోకి సమస్య గురించి అప్పుడు చెప్పి పారేసి -విలన్ దగ్గరికి పంపించేశారు.  అక్కడ మనం క్యాచ్ చేయడానికి కూడా కష్ట మైపోయే స్పీడ్ డైలాగులతో మెసేజీలు కొట్టించేసి ఓ పనైం దన్పించారు!
          తమిళ సూపర్ డైరెక్టర్ మురుగదాస్ అసిస్టెంట్ గా తెలుగుతో అరంగేట్రం చేస్తున్న ఈ కొత్త దర్శకుడు తాను అప్పుడే మురుగ దాస్ అయిపోలేదు. మురుగ దాస్ తీసినట్టు బిగ్ స్టార్స్  తో బిగ్ యాక్షన్ ఫార్ములాలు తీసేందుకు,  ఆ టేకింగ్ ని చూపెట్టేందుకూ ఇంకా టైముంది. తానొక  సామాజిక సమస్యతో, జీవితాలకి దగ్గరగా వుండే స్మాల్ ఫార్మాట్ లో- ఒక ఫోటో ఫ్రేం కథ నెత్తుకుని సినిమా తీస్తున్నప్పుడు, మురుగ దాస్ లా ఫీలైపోకూడదు! ఈ కథ-  దీని మీడియం బడ్జెట్ సినిమా – ఇవన్నీ కొత్తదర్శకుడిగా తననుంచి డిమాండ్ చేస్తున్న ఓ ఒరిజినాలిటీని, ఓ క్రాఫ్ట్ ని , ఓ స్టయిల్ నీ గౌరవించడం ముందు చాలా అవసరం. 
          స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాల కథలు మారినంత మాత్రాన లాభం లేదు- వీటిని తీసే విధానంలోకి  భారీ బడ్జెట్ సినిమాల హంగామా, రొడ్డు కొట్టుడుల దురాక్రమణనని నిరోధించి, సునిశితత్వాన్ని కాపాడుకున్నప్పుడే వీటి సక్సెస్ రేంజి పెరిగేది!



సికిందర్.









స్క్రీన్ ప్లే సంగతులు..

సిడ్ ఫీల్డ్ 

సిడ్ ఫీల్డ్ ..సినిమా రంగంలో ఈ పేరు వినని దర్శకులు / రచయితలూ వుండరు. పాండిత్య భాషలో గ్రంథాల్లో గుంభనంగా వుండి పోయిన స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని సులభ భాషలో ఔత్సాహికులకి కరతలామలకం చేసిన స్క్రీన్ ప్లే పండిట్ సిడ్ ఫీల్డ్.. నేడు స్క్రిప్ట్ రచనలో విప్లవాత్మక మార్పులు ఎలా చోటు చేసుకుంటున్నాయో ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు. చదవండి.. 

         ప్రపంచవ్యాప్తంగా నేను నిర్వహిస్తున్న స్క్రీన్ ప్లే కోర్సుల్లో, వర్క్ షాపుల్లో భాగంగా వేలకొద్దీ  స్క్రీప్లే లని చదివి వుంటాను. కచ్చితంగా ఎన్ని వేలు అన్నది చెప్పలేను, లెక్క వేయడం ఏనాడో మానేశాను. కానీ నేనే దేశంలో, ఏ నగరంలో పర్యటించినా అంతటా నాకొకే ప్రశ్న ఎదురవుతూంటుంది. పదేపదే ఈ ప్రశ్నే వేస్తూంటారు : సర్వసాధారణంగా స్క్రిప్టు రచయితల్లో  మీరు గమనించిన కామన్ లోపం ఏమిటనేది ఆ ప్రశ్న. కామన్ గా వుండే లోపాలు అనేకం వున్నాయి. హీరో పాత్రకి లక్ష్యం లేకపోవడం దగ్గర్నుంచీ, సెకండ్ యాక్ట్ లో స్ట్రక్చర్ పరమైన బలహీనతలు, బలమైన ముగింపులూ లేకపోవడం వరకూ అనేకం ఉంటున్నాయి. అయితే ఒక్క లోపం మాత్రం ప్రాంతాల కతీతంగా  కొట్టొచ్చినట్టూ  ఉంటోంది. అదేమిటంటే ఏ దేశంలోనైనా చాలా మంది రచయితలు కథని డైలాగుల ద్వారా నడిపించేస్తున్నారు. పాత్రల ఆలోచనల్ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ నీ డైలాగులతోనే వివరించేస్తున్నారు.

          నిజమే, కొన్ని కథల్ని బట్టి ఈ విధానం తప్పక పోవచ్చు.
500 డేస్ ఆఫ్ సమ్మర్’  లాంటి రోమాంటిక్ కామెడీల్లో ఎంత నాన్ లీనియర్ గా కథ ఉన్నప్పటికీ యాక్షన్ ని చూపించడం, దృశ్యాలు ముందుకు కదలడం- డైలాగుల ద్వారానే జరగవచ్చు. ఈ సినిమాలో ప్రేమికుల మధ్య వున్న రిలేషన్ షిప్ కిచ్చిన డెప్త్ ప్రేక్షకుల్ని కట్టి పడేసే ఎమోషనల్ త్రెడ్ లా వుంటుంది. 

          నేడు స్టయిల్ పరంగా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నవలా రచయితలు ఉపయోగించే క్రియేటివ్ టూల్స్ ని సినిమాల్లో వాడుకోవడం పెరిగిపోతోంది. పాయింటాఫ్ వ్యూ, మెమరీ, వాయిసోవర్ నేరేషన్, ఫ్లాష్ బ్యాక్స్ వగైరా క్రియేటివ్ టూల్స్ నవలా రంగం నుంచి దిగుమతి అయిపోతున్నాయి. దీంతో సమకాలీన స్క్రీన్ ప్లేల రూపు రేఖలే మారిపోతున్నాయి.

          ఇదే అంశం ఈ మధ్య నేనొక మిత్రుణ్ణి అనుకోకుండా ఓ కేఫెలో కలుసుకున్నప్పుడు చర్చ కొచ్చింది. చాలా కాలం తర్వాత కలుసుకోవడం వల్ల యోగ క్షేమాలు మాటాడుకున్నాం. తను టీవీ షోస్ కి రాస్తున్నట్టు చెప్పాడు. నేను నా వృత్తిలో భాగంగా గత రెండేళ్లుగా నాన్ స్టాప్ గా దేశాలు పట్టుకు తిరుగుతున్నా నన్నాను. ఐతే దేశ దేశాల్లో స్క్రీన్ ప్లే రైటింగ్ లో తేడాలేమైనా గమనించావా అని అడిగాడతను. ఇవ్వాళ్ళ అంతర్జాతీయంగా స్క్రీన్ ప్లే సాంప్రదాయ రచన నుంచి చాలాదూరం ప్రయాణించి వికాసం పొందు తోందని చెప్పాను. నేను సందర్శించిన ఏ దేశ నగరంలో నైనా – బ్రెజిల్, కైరో, మాడ్రిడ్, మనీలా, మెక్సికో సిటీ, ముంబాయి, సింగపూర్, వియన్నా.. ఎక్కడైనా, భాష ఏదైనా - స్క్రీన్ ప్లేలని బొమ్మల ద్వారానే చెప్తున్నారని వివరించాను.  విజువల్ గా స్క్రీన్ ప్లేలు చాలా పరిణామం చెందుతున్నాయనీ, వాటి రూపం, నిర్వహణ, ఖండికలుగా వేర్పడి వుంటున్నాయనీ చెబుతూ,  ఈ క్రమంలో ముంబాయిలో  ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ అనే హిందీ సినిమాకి స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పని చేసిన అనుభవం గురించి కూడా చెప్పాను. ఈ ఇండియన్ ఫిలిం స్క్రిప్ట్ ని నా శిష్యుడే రాశాడు. ఈ కథ మన హృదయాల్లో మానవతని తడుముతుంది. దీంతో ఇది భాషలకి, దేశీయతలకీ, సంస్కృతులకీ అతీతంగా సార్వజనీనంగా ఉండిపోయింది. ఈ కథ ఫ్లాష్ బ్యాక్స్ తో, మెమరీస్ తో జీవితంలోకి హీరో ప్రయాణం లాగా వుంటుంది. అయితే ఇందులో హీరో పాత్ర ఇంకా బాగా వ్యక్త మవడానికి వాయిసోవర్ నేరేషన్ ని ప్రవేశ పెట్టమని సలహా నిచ్చాను. ఇందువల్ల ఎక్కువ వివరణలు ఇచ్చే అవస్థ తప్పుతుంది. కాకపోతే వాయిసోవర్ నేరేషన్ ప్రవేశ పెట్టడం వల్ల,  చాలా వరకూ స్టోరీ లైన్ ని రీ స్ట్రక్చర్ చేయాల్సి వచ్చింది - ముఖ్యంగా బిగినింగ్ లో.  ఐతే దీని ఇంపాక్ట్ మొత్తం సినిమా మీద ఛా బాగా పనిచేసింది! 

          నేను వాయిసోవర్ నేరేషన్ ని ఎందుకు సిఫార్సు చేశానంటే, స్క్రీన్ రైటింగ్ లో ఒక సింపుల్ రూలుంది : యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేయాలి, లేదా క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చెయ్యాలని.  ‘500సమ్మర్ డేస్’, ‘షాషాంక్ రెడెంప్షన్’, ‘జూనో’  వంటి సినిమాల్లో యాక్షన్ ని క్యారక్టర్ డ్రైవ్ చేస్తుంది. ‘లిటిల్ మిస్ సన్ షైన్’ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ది లుక్ అవుట్’  లలో క్యారక్టర్ ని యాక్షన్ డ్రైవ్ చేయడాన్ని గమనించ వచ్చు. 

          నా దృష్టి కొచ్చినంత వరకూ స్క్రీన్ ప్లే రచన ఇప్పుడు చాలా వికాసం పొందింది. ఇది ఒకరకంగా విప్లవం కూడా! ఒకసారి ‘ఎటోన్మెంట్’  లో చూడండి, ‘వాంటేజ్ పాయింట్’, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్’ లలో చూడండి..ఈ విప్లవకర ధోరణిని మీరు బాగా గమనిస్తారు. ఇప్పుడు రిలీజవుతున్న దాదాపు ప్రతీ సినిమాలో వాయిసోవర్లు, సబ్ టైటిల్సు, ఫ్లాష్ ప్రెజెంట్ లు, ఇంటర్వ్యూలు, ఇంకా ఇతర మల్టీ మీడియా ప్రెజెంటేషన్ ఎలిమెంట్లూ అనేకం ఉంటున్నాయి...

(ఇంకా వుంది)

         
          





Friday, June 26, 2015

రైటర్స్ కార్నర్



బాలీవుడ్ రచయిత్రి దేవికా భగత్ 



దేవికా భగత్...బాలీవుడ్ లో అతికొద్ది మంది రచయిత్రుల్లో ప్రత్యేకతలు గల రచయిత్రి.  రాసే కథలు, స్క్రీన్ ప్లేలూ, సంభాషణలూ ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ పోలికే వుండదు. 2003 లో  సినిమా రంగ ప్రవేశం చేసి ‘డ్రీమింగ్ లాసా’ అనే  టిబెట్ సినిమాకీ,  హాలీవుడ్ హిట్ ‘బోర్న్ సుప్రమసీ’ కీ  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007 లో ఆమె జీవితం మలుపు తిరిగింది.   అభయ్ డియోల్ నటించిన ‘మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్’  అనే  విజయవంతమైన మర్డర్ మిస్టరీకి కథ- స్క్రీన్ ప్లే- సంభాషణలూ సమకూర్చి రచయిత్రిగా మారారు. అటు తర్వాత రణబీర్ కపూర్ నటించిన  ‘బచ్ నా యే హసీనో’, షారుఖ్ ఖాన్ నటించిన  ‘జబ్ తక్ హై జాన్’ లకి స్క్రీన్ ప్లే రచయిత్రిగానూ,  సోనమ్ కపూర్ నటించిన ‘ఐషా’, రణవీర్ సింగ్ నటించిన ‘లేడీస్ వర్సెస్ రాకీ బహల్’,  జాన్ అబ్రహాం నటించిన ‘ఐ- మీ- ఔర్ మై’ లకు స్క్రీన్ ప్లే- సంభాషణల రచయిత్రిగానూ, తాజాగా 2014 లో అభయ్ డియోల్ నటించిన ‘ఒన్ బై టూ’ తో దర్శకురాలిగానూ మారిన ఈ ముప్ఫై ఆరేళ్ళ సక్సెస్ ఫుల్ లేడీ,  స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ కోర్సుల్లో న్యూయార్క్ యూనివర్సిటీ పట్టభద్రురాలు. ‘ఉమెన్స్ వెబ్ డాట్ ఇన్’  కి ఈమె ఇచ్చిన ఇంటర్వూ పాఠం ఈ కింద చూద్దాం..

˜హిందీ సినిమాలకి మీరు స్క్రీన్ ప్లే రచయిత్రిగా ఎలామారారు?


         నేను న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ లలో డిగ్రీ తీసుకున్నాక ఇండియా తిరిగొచ్చాను. నా ఆలోచన ఏమిటంటే నా సొంత కథనల్ని ప్రమోట్ చేసుకోవాలన్నా, భవిష్యత్తులో డైరెక్టర్ గా మారాలాన్నా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే ఆ ద్వారాలు తెర్చుకుంటాయని! కానీ రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సరికి సృజనాత్మకంగా నేను కోల్పోతున్నదేమిటో తెలిసి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేస్తున్నదంతా షూటింగు స్పాట్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో రైటింగ్ తో సంబంధం లేని పనే. కానీ తప్పదు. అప్పుడు ఇంకో సినిమాకి అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక స్క్రిప్టు రాసుకున్నాను. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పెద్ద దర్శకుడు ఇంతియాజ్ అలీ ని కలుసుకోగలిగాను! ఆయన నా పట్ల ఆసక్తి కనబర్చి నేను రాసిన స్క్రిప్టు చదివారు. అది ట్రాష్ అని నాకూ తెలుసు. కానీ నాలో స్క్రీన్ ప్లే రైటర్ అయ్యే టాలెంట్ వుందని ఆయన పసిగట్టారు. తన తర్వాతి సినిమాకి నాకు వర్క్ ఆఫర్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా షూటింగ్ దశకే వెళ్ళలేదు. అయితే రైటింగ్ లో ఆ కొంత అనుభవమే  నాకు బోలెడు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆతర్వాత దర్శకుడు నవదీప్ సింగ్ ని కలుసుకున్నాను. ఇక ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ రూపు దాల్చడం మొదలయ్యింది..దీంతో నా అదృష్టం ఎలా మలుపు తిరిగిందో మీకు తెలిసిందే! 

    మీరు రాసే సినిమాలు డిఫరెంట్ జానర్స్ తో ఉంటున్నాయి. మీ రచనల మీద దేని ప్రభావం ఎక్కువ వుందంటారు?
        నావరకూ జానర్ అనేది నేను కావాలని కోరుకునేది కాదు. ముందు కథా, ఆ కథలో పాత్రలూ మాత్రమే నాకు ముఖ్యం, అవే నాకు ఏ తరహా సినిమా అవుతుందో దారి చూపుతాయి. నేనిష్ట పడేది ఎక్కువగా క్యారక్టర్స్ కథలే. నన్ను నా క్యారక్టర్సూ, వాటి కథా ప్రపంచమూ నడిపించాలని కోరుకుంటాను. నా కథల్ని మెయిన్ స్ట్రీం అనో, ఆఫ్ బీట్ అనో వర్గీకరించడం కూడా నా కిష్ట ముండదు. అయితే ప్రాజెక్టు కయ్యే బడ్జెట్టు స్క్రీన్ ప్లే లో ఏది ఉండాలో ఏది కూడదో నిర్ణయిస్తుంది కాబట్టి ఈ దృష్ట్యా స్క్రిప్టులు రాయక తప్పదు. 
˜   స్క్రీన్ రైటింగ్ ప్రాసెస్ లో అతి కష్టమైనది క్రియేటివ్ కంట్రోల్ ని కాపాడుకోవడం. కొన్నిసార్లు ఆ కంట్రోల్ ని వదులుకోవాల్సి వస్తుంది కూడా ఒక  రైటర్ గా. అలాటి మీకు అస్సలు ఇష్టంలేని మార్పుచేర్పులు స్క్రిప్టుల్లో చేయాల్సిన అగత్యం ఎప్పుడైనా ఎదురయ్యిందంటారా?
         
స్క్రిప్టు రైటరు దర్శకుల లేదా నిర్మాతల విజన్ ని సాకారం చేయాల్సి వుంటుంది. కథ నాదైనా వాళ్ళదైనా అది వర్కౌట్ అయ్యేలా చూస్తాను.  స్క్రిప్ట్ రైటర్ గా నాకు సొంత క్రియేటివ్ ఆలోచనల లుండొచ్చు, కానీ ఇక్కడ నేను మాత్రమే కాకుండా అవతల ఇంకా దర్శకుల, నిర్మాతల, అగోచరంగా వుండే ప్రేక్షక సమూహపు అభిలాషలూ వుంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయక తప్పదు. నిజమే, అప్పుడప్పుడు  స్క్రిప్టు మీటింగ్స్ లో క్రియేటివ్ పోరాటాలు జరుగుతాయి. కానీ స్క్రిప్టులో ఏదైనా మార్చాల్సి వస్తే నేనెప్పుడూ బ్యాడ్ ఫీలింగ్స్ పెట్టుకోను. బ్యాడ్ ఫీలింగ్స్ నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ సినిమా నుంచే తప్పుకుంటాను. స్క్రిప్ట్ రైటింగ్ అనేది నిరంతర పరిణామ ప్రక్రియ. ఇందులో మడిగట్టుకుని ఏదీ వుండదు. 
   క్యారక్టర్ కథలిష్టమన్నారు. మీరు రాస్తున్నప్పుడు ఉద్భవించే క్యారక్టర్లు ఎంతవరకు తెరమీదికి వచ్చేసరికి జీవం పోసుకుంటున్నాయంటారు?
           నేనెప్పుడూ ఫలానా యాక్టర్ అని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాయలేదు. అది క్యారక్టర్లని ఓ చట్రంలో బిగించేస్తుంది. నేనొకసారి ఓ సినిమాకి స్క్రిప్టు రాస్తున్నప్పుడు ఆ నిర్మాత చాలా సార్లు హీరో జాన్ అబ్రహాం అంటూ చెప్పసాగారు. ఆయన చెప్పినప్పుడల్లా సీన్లు రాస్తున్నప్పుడు జాన్ అబ్రహాం ని షర్టు లేకుండా ఊహించుకుంటూ చాలా ఇబ్బంది పడేదాన్ని!
          అంతిమంగా నా ఊహాలోకంలోని పాత్రల్ని వెండితెరమీద ఏ ఏ తారలు నటిస్తున్నారనేది నాకెప్పుడూ ముఖ్యం కాదు. ఆ పాత్రలకి వాళ్ళెలా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నదే ప్రధానం. కాగితాల మీద క్యారక్టర్లకి ప్రాణముండదు. ఆయా  తారలూ దర్శకుడూ కలిసి తెరమీద ప్రాణ ప్రతిష్ట చేయాల్సి వుంటుంది. తారల ఎంపిక సమయంలో నిర్మాతలు, దర్శకులు నా సూచనలు అడుగుతారు. అయితే అంతిమ నిర్ణయం వాళ్ళదే. రిహార్సల్స్ సమయంలో ఒక్కోసారి ఆ నటుడు లేదా నటికి సరిపోయేలా పాత్రల్లో మార్పులు చేయాల్సి వుంటుంది కూడా! 
˜   
ఏదైనా ఉదాహరణ చెప్తారా? 
      ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’  సినిమా విషయంలో జరిగింది...ఆ కథలో హీరో పాత్ర సత్యవీర్ నలభై ఐదేళ్ళ నడివయసు వ్యక్తి నిజానికి. కానీ ఆ పాత్రకి అభయ్ డియోల్ ని అనుకున్నాక వయస్సుని ముప్ఫై కి తగ్గిస్తూ పాత్రలో మార్పులు చేయాల్సి వచ్చింది- పాత్ర జీవితంతో సహా. అది మంచికే జరిగిందనుకుంటాను. ముప్ఫై యేళ్ళ హీరోకి ఈ కథ డిమాండ్ చేసే ఇన్వెస్టిగేషన్ కోణం పట్ల జిజ్ఞాస, కుశాగ్రబుద్ధీ ఎక్కువ వుంటాయి కదా?


మీరు చూడాలనుకుంటే ఎలాటి సినిమాలు ఇష్టపడతారు?
          ఫిలిం స్కూల్ కోర్సు చేస్తున్నప్పుడు వరల్డ్ సినిమా మాకు పరిచయం చేశారు. నా వరకూ మాత్రం హాంకాంగ్ దర్శకుడు వాంగ్ కార్ వాయ్, హాలీవుడ్ దర్శకులు కోయెన్ బ్రదర్స్ సినిమాల్ని ఇష్టంగా చూస్తాను. ఇంకా పాల్ థామస్, ఆండర్సన్, అలెగ్జాండర్ పైన్, వేస్ ఆండర్సన్, జేసన్ రీట్మన్, కెమెరాన్ క్రోవ్.. సినిమాలూ ఇష్టమే. ఈ పేర్ల వరస చూస్తూంటే  వీళ్ళు నా కెందుకిష్టమో మీకర్ధమయ్యే వుంటుంది- వీళ్ళందరివీ క్యారక్టర్ డ్రైవెన్ సినిమాలే! 
   
˜   మీరు బాగా ఇష్టపడి రాయాలని కోరుకుంటున్న కథ- కానీ దాన్ని ఇండియాలో తీయడం అసాధ్యంలే అన్పించిన కథ ఏదైనా ఉందా?
             ఉంది! ముగ్గురు నిర్మాతల దగ్గర ప్రయత్నించాను కూడా. ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళ దృష్టిలో అది చాలా డార్క్ మూవీ అవుతుంది. ఓ ఐదేళ్ళల్లో సాధ్యం  కావచ్చను కుంటున్నాను...

˜   హిందీ సినిమాలు పూర్తిగా నగరీ కరణ చెందాయని విమర్శలున్నాయి. పాత బాలీవుడ్ సినిమాల్లాగా అవి బి సెంటర్ ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోతున్నాయి..ఇది నిజమేనా? మీరే ప్రేక్షకుల కోసం రాయాలని కోరుకుంటారు?

         
మొత్తం పరిశ్రమ గురించి నేను కామెంట్ చేయలేను గానీ, నా వరకూ చెప్పగలను. నేను ఫలానా ప్రేక్షకులని మనసులో పెట్టుకుని రాయలేను. నాకు తెలిసింది, నాకు అనుభవమయ్యింది మాత్రమే రాయగలను. నాకు తెలీని ప్రపంచాల గురించి నేనేమీ రాయలేను. అది బూటకంగా వుంటుంది కూడా. ఇక హిందీ సినిమాలు నగరీకరణ చెందడం గురించి.. ‘మనోరమ -సిక్స్ ఫీట్ అండర్’ పల్లెటూళ్ళో జరిగే పల్లెటూరి కథే కదా? కాకపోతే సహజంగా తీశాం. బీ సెంటర్ ప్రేక్షకులకి వాళ్ళ సహజ కథలే వాళ్లకి నచ్చకపోతే ఏం చేస్తాం. నేనేం స్ఫూర్తి పొందానో అది రాయకుండా, వాళ్లకి కావాల్సిందేదో రాస్తూ పోతే చాలా గందరగోళంలో పడిపోతాను!

అమృతా రాజన్