Q : ఒక టెక్నికల్ క్వశ్చన్.
ఎండ్ సస్పెన్స్ తో కథలు ఫ్లాపే అవుతాయంటారా? సరైన విధానంలో చేస్తే సక్సెస్ అయ్యే
అవకాశం లేదంటారా? జానర్ వచ్చేసి క్రైం డ్రామా అయినప్పుడు అందులో వుండే సస్పెన్స్ ఎలిమెంట్
ని ఏం చేయాలి?
―డి ఎస్ ఎం, దర్శకుడు
―డి ఎస్ ఎం, దర్శకుడు
A : ఎండ్ సస్పెన్స్ గురించి ఎన్నో సార్లు ఈ బ్లాగులోనే చెప్పుకుంటూ వచ్చాం. ఎండ్ సస్పెన్స్ కథతో వున్న సినిమాలు తప్పకుండా ఫ్లాపే అవుతూ వచ్చాయి. ఇటీవలే బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ తో బాటు, ‘సాక్ష్యం’ ఫ్లాపయ్యాయి. రాజ్ తరుణ్ ‘లవర్’ ఫ్లాప్ అయింది. నాగచైతన్య ‘సవ్య సాచి’ తో బాటు, గతంలో ‘సాహసమే ఊపిరిగా’ ఫ్లాపయింది. విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ ఫ్లాపయింది. వెనక్కి పోతూంటే ఇలా పెద్ద లిస్టుంది. ఇవన్నీ ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో తెలిసే చేయడం లేదు. కేవలం సస్పెన్స్ అనుకుని చేస్తున్నారు. సస్పెన్స్ లో ఎండ్ సస్పెన్స్, సీన్ టు సీన్ సస్పెన్స్, అనే రెండు రకాలుంటాయని తెలిస్తే ఇలా చేయరు. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకునే అవకాశం లేదు. పదుల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్న తమకి ఎలా తీయాలో తెలీదా అన్న ధోరణిలో నడిచిపోతూంటుంది. కానీ స్క్రీన్ రైటింగ్ అనేది చాలా మిస్టరీ. ఎక్కడేముందో, ఎందుకుందో, ఇంకెన్నున్నాయో నిత్యం వెతుక్కుంటూ వుంటే తప్ప ఓ పట్టాన అర్ధంగాని మిస్టరీ. ఎన్ని కోట్లతో చైర్లో కూర్చున్నామన్నది కాదు ప్రశ్న, ఈ మిస్టరీ ఆటలో టేబుల్ మీద మ్యాటరెంతున్నది పాయింటు.
సరైన విధానంలో చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం లేదా అంటే వుంది. జానర్ క్రైం డ్రామా అయితే ఎలాటి క్రైం డ్రామా? మిస్టరీయా, లేక సస్పెన్స్ థ్రిల్లరా? మిస్టరీ అయితే, ఉదాహరణకి ఒక హత్య జరిగిందనుకుందాం. అప్పుడా హత్య కథా ప్రారంభంలోనే జరిగిపోతుంది. ఆ తర్వాత కథంతా హంతకుణ్ణి కనుగొనే దర్యాప్తుతో సాగుతుంది. రకరకాల అనుమానితుల్ని చూపిస్తూంటారు. చివర్లో వాళ్ళలో ఒకర్ని ఆధారాలతో హంతకుడిగా పట్టుకుంటారు. చివరివరకూ హంతకుడెవరనేది సీక్రెట్ గా వుంటుంది కాబట్టి ఇది మిస్టరీ. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒక్క ఆట వరకే – అంటే మార్నింగ్ షో వరకే వుంటుంది. హంతకుడెవరో టాక్ బయటి కెళ్ళి పోయాక మ్యాట్నీ షో నుంచీ ప్రేక్షకులు ఇక వూపిరి బిగబట్టి చూసేందుకు సస్పెన్స్ ఏమీ వుండదు. ఇదే ఎండ్ సస్పెన్స్. చిట్ట చివర్లో రివీలయ్యే మిస్టరీతో వుండేదే ఎండ్ సస్పెన్స్ కథనం. మార్నింగ్ షోలో రట్టయ్యాక మిగతా షోలు రక్తి కట్టే మాటే లేదు.
click here |
ఇదే సస్పెన్స్ థ్రిల్లరైతే కథని బట్టి రెండుంటాయి : హత్యకి కుట్ర జరుగుతోందని హీరోకో పోలీసులకో సమాచారం అందుతుంది. కుట్రదారుల్ని ప్రేక్షకులకి అప్పుడే చూపించేస్తారు. హీరోకి లేదా పోలీసులకి కథాక్రమంలో తెలుస్తుంది. ఆ హత్యని ఆపేందుకు ఇటు పక్షం, హత్య చేసేందుకు అటు పక్షం ఆడే ఓపెన్ గేమ్ గా కథనం వుంటుంది. అందుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ఇది ప్రేక్షకులకి అంతా తెలిసి, ఎవరు గెలుస్తారనే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, సీను సీను కీ ఉత్కంఠ రేపుతుంది కాబట్టి సీన్ టు సీన్ సస్పన్స్ కథనం. దీనికి మార్నింగ్ షోయే కాకుండా ఎన్ని షోలకైనా షెల్ఫ్ లైఫ్ వుంటుంది. ఛానెల్స్ లో కూడా రిపీట్ రన్ వుంటుంది.
రెండో పద్దతి : హత్య జరిగింది. హంతకుడెవరో ప్రేక్షకులకి చూపించేసి హీరోకి చూపించలేదు. హీరో హంతకుడి అన్వేషణలో పడతాడు. సగం కథ దగ్గర అతడికి తెలిసిపోతుంది. మిగతా సగం కథ వాణ్ని పట్టుకోవడానికి యాక్షన్ మొదలెడతాడు. ఇది కూడా ఎండ్ సస్పెన్స్ బారిన పడని సీన్ టు సీన్ సస్పన్స్ కథనమే.
ఇవన్నీ అలా వుంచి, మిస్టరీ కథ మిస్టరీలా అన్పించకుండా, ఎండ్ సస్పెన్స్ ఎండ్ కథనం ఎండ్ సస్పెన్స్ కథనంలా దొరికిపోకుండా – ప్రేక్షకుల్నీ ఏమార్చే గారడీ ఒకటుంది. ఉదాహరణకి ఒక ఇంటరెస్టింగ్ కథ నడుస్తూంటుంది. అది రోమాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కామెడీ కావొచ్చు - ప్లాట్ పాయింట్స్ అన్నీ ఈ కథతోనే వుంటాయి. వెళ్లి వెళ్లి ఈ కథ చివర్లో కొత్త ద్వారాలు తెరుస్తుంది. అక్కడ ఇంకో దృశ్యం కన్పిస్తుంది. ఆ దృశ్యంలో అసలు కథ వుంటుంది. అది అప్పుడు రివీలవుతుంది. అక్కడున్న తెలిసిన క్యారెక్టరే అప్పుడు దొరికిపోతుంది. అప్పటికి గానీ ప్రేక్షకులు వూహించలేరు – మనమింత సేపూ చూస్తూ వచ్చిన రోమాన్స్, ఫ్యామిలీ, కామెడీ ఏదైతే అది - అసలు కథ కాదా... అసలు కథ వేరే ఇదా....ఈ అసలు కథని రివీల్ చేయడానికే ప్లానింగ్ తో క్యారెక్టర్లు నడిపిన డ్రామానా... ఈ అసలు కథలో దొరికిపోయిన ఈ క్యారెక్టర్ పూర్వం ఇంత పనిచేశాడా... ఇలా థ్రిల్లవుతారు.
ఈ టెక్నిక్ పేరేమిటో గానీ, జేమ్స్ బానెట్ మంచి కథల్లో హిడెన్ సీక్రెట్ వుంటుందని అంటాడు. అలా ఈ టెక్నిక్ కి ‘హిడెన్ సీక్రెట్’ టెక్నిక్ అని పేరు పెట్టు కోవచ్చు. Truth, however bitter, can be accepted, and woven into a design for living―అని క్రైం రచయిత్రి ఆగథా క్రిస్టీ అంటుంది. నిజాన్ని దాటిపెట్టి అనిజ కథని నడపడమే ఈ టెక్నిక్. అనిజ కథని ఎంజాయ్ చేసే బిజీలో పడిపోయిన ప్రేక్షకులు నిజ కథ తెలుసుకుని – ఇది మిస్టరీ జానర్, ఎండ్ సస్పెన్స్ కథ అని చప్పరించేయడానికి వీలే కాదు. ఎండ్ సస్పెన్స్ కి ఈ విరుగుడుగా 1958 లో బ్రిటన్ నుంచి ‘To Chase a Crooked Shadow’ వచ్చింది. దీనాధారంగా 1981 లో హిందీలో ‘ధువాఁ’ వచ్చింది. బెంగాలీ, తమిళ, మలయాళంలలో కూడా వచ్చాయి. ఎండ్ సస్పెన్స్ సినిమాతో మీకెలాగూ అనుభవమైంది కాబట్టి, ఈ ఐదు సినిమాలతో పోల్చుకుంటే తేడా తెలిసిపోతుంది. పక్కనున్న ఇమేజి దగ్గర క్లిక్ చేసి ఆర్టికల్ ని కూడా చూడొచ్చు.
ఇకపోతే ఎండ్ సస్పెన్స్ కి ఎప్పుడో 90 ఏళ్ల క్రితం అగథా క్రిస్టీ ఇచ్చిన పాత్ బ్రేకింగ్ ట్విస్టు కోసం ఈ లింకు ని క్లిక్ చేయండి. మీరు క్రైం జానర్ ని ఇష్టపడతారు కాబట్టి వీలయినంత అప్డేట్ అవుతూ వుంటే సక్సెస్ ఎటూ పోదు.
Q : ఇంటెన్స్ యాక్షన్ మూవీకీ, సీరియస్ యాక్షన్ మూవీకీ తేడా ఏమిటి? ఇంటెన్స్ క్యారక్టర్ అంటే ఎలా వుండాలో డిఫైన్ చేయగలరా? వీలయితే ఎగ్జాంపుల్స్ తో సమాధానం బ్లాగులో ఇచ్చినా ఫర్వాలేదు. కొంచెం డిటైల్డ్ గా చెప్పండి.
―అశోక్ పి, సహకార దర్శకుడు
―అశోక్ పి, సహకార దర్శకుడు
A : ఇంటెన్స్ కీ, సీరియస్ కీ
మాటల్లోనే తేడా
తెలిసిపోతోంది. ఇంటెన్స్ అంటే తీవ్రమైనది, సీరియస్ అంటే గంభీరమైనది. మళ్ళీ
ఇలా తెలుగులో చెప్పుకుంటే తప్ప
తేడా అర్ధం
గాదు, స్పష్టత వుండదు. మొదటిది యాక్షన్ తో
తీవ్రంగా వుంటుంది, రెండోది విషయంతో గంభీరంగా వుంటుంది. మొదటిది ‘ఖైదీ’ అనుకుంటే, రెండోది ‘శివ’ అనుకోవచ్చు. మొదటిది ఉరుకులుబెడుతుంది, రెండోది ఆలోచింపజేస్తుంది. ఆలోచింప జేస్తూ సాగే
సీరియస్
(గంభీర) యాక్షన్ మూవీస్
గా ఇంకా
నాయకుడు, రోజా, అంకుశం, భారత్ బంద్, సర్ఫరోష్, సత్య, గాడ్ ఫాదర్, జాస్, మ్యాడ్
మాక్స్ -2 లాంటివి చెప్పుకోవచ్చు.
ఉరుకులుబెడుతూ థ్రిల్ చేసే ఇంటెన్స్ (తీవ్ర స్వభావంగల) యాక్షన్ మూవీస్ గా క్రిమినల్, ఒరు ఖైదీయన్ డైరీ, కంపెనీ, రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, టర్మినేటర్, డై హార్డ్, జేమ్స్ బాండ్ సినిమాలు మొదలైనవి చెప్పుకోవచ్చు.
ఐతే ఈ రెండు తరహాల సినిమాలు తెలుగులో రావడం ఎప్పుడో మానేశాయి. స్టార్లే కామెడీ చేయడమనే ఒక ట్రెండ్ గత దశాబ్దంన్నర కాలంగా వేళ్ళూనుకోవడం వల్ల సీరియస్ యాక్షన్, ఇంటెన్స్ యాక్షన్ లనేవి ఇకలేవు. యాక్షన్ ఎంటర్ టైనర్లు, లేకపోతే యాక్షన్ కామెడీలు అనే ఫటాఫట్ సినిమాలే చూడ్డానికి దొరుకుతున్నాయి.
ఆ
మధ్య వచ్చిన గరుడవేగ, వివేకం లాంటివి సీరియస్ యాక్షన్ లు
గానే కన్పిస్తాయి. కానీ
అందుకు తగ్గ
విషయ గాంభీర్యం లేక గందరగోళంగా అన్పిస్తాయి. సింగం
త్రీ లాంటి
ఇంటెన్స్ యాక్షన్ తీసినా, దాన్ని ఆ
స్టార్ పాత్రకి కి
మించిన టెక్నికల్ హంగులతో నరాల
మీద సమ్మెట
పోట్లుగా తయారు
చేస్తున్నారు. లేదా
స్పైడర్ లాంటి
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తీసినా, హీరోకి
ఆ ఇంటెన్సిటీ వుండక, విలన్ కుండేలా చేస్తున్నారు.
పూర్వపు సృజనాత్మకతకీ, ఇప్పటికీ ఇదీ తేడా. పూర్వపు సృజనాత్మకతకి జానర్ మర్యాదలు తెలుసు. ఇప్పడు జానర్లే కొన్ని తెలుసు, ఆ కొన్నిటి మర్యాదలు తెలీవు. అంతా కిచిడీ కుకింగే. అందువల్ల పూర్వంలాగా సీరియస్, ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ తీయలేకపోతున్నారు. రెండోది, ఈ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా తక్కువ – ఎంటర్ టైనర్ల హోరులో.
ఇక ఇంటెన్స్ క్యారెక్టర్ గురించి. ఒక మానసికావస్థతో వుండే ఏ పాత్ర రాయాలన్నా ముందు సైకాలజీ తెలుసుకోవాలి. లేకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్డర్ (ఓసిడి)పాత్రంటూ ప్రచారం చేసి, ఒట్టి పరిసరాల పట్ల ఎలర్జీగల పాత్రని చూపించినట్టు వుంటుంది (మహానుభావుడు). ఇంటెన్స్ (తీవ్రస్వభావంగల) క్యారెక్టర్ ని సైకాలజీ ఇలా వివరిస్తుంది : మనసులో ఏదీ దాచుకోకుండా పైకి చెప్పేసే, ఏదైనా పొందాలనుకుంటే దాని గురించి తీవ్రంగా తపించే, అవసరం లేదనుకుంటే అస్సలు పట్టించుకోకుండా వుండే, వాదోపవాదాల్లో గెల్చి తీరాలన్న పట్టుదలతో వుండే, మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడే, ఇతరులతో సంబంధాల్లో నిజాయితీగా వుండే, గొప్పలు చెప్పుకునే వాళ్ళని దూరంగా పెట్టే, ఇంటలెక్చువల్ గా వుండాలని ప్రయత్నించే, వివిధ రంగాల గురించి అవగాహనతో మాట్లాడే, కళ్ళలోకి సూటిగా చూస్తూ సంభాషించే, ఒకరితో ఎక్కువ సేపు గడిపి అదే మరోరోజు చప్పున వదిలించుకుని వెళ్ళిపోయే, ప్రేమల విషయానికొస్తే పాత క్లాసిక్స్ లా వుండాలని ఆశపడే, పుస్తకాల్లో సినిమాల్లో ఏదైనా ఇష్టపడిన పాత్ర ట్రాజడీగా ముగిస్తే, రోజులతరబడి దాని గురించే బాధపడే లక్షణాలుంటే, అది ఇంటెన్సివ్ క్యారెక్టర్ అవుతుందనొచ్చు.
ఇలా పాజిటివ్ గా కన్పిస్తున్న ఇంటెన్సివ్ స్వభావాన్ని హీరోకీ విలన్ కీ ఎవరి కైనా వాడుకోవచ్చు. కాకపోతే విలన్ నెగెటివ్ గోల్ కోసం చేస్తాడు. పైన చెప్పుకున్న స్వాభావిక లక్షణాలు జత చేసి, సన్నివేశాలు సృష్టించి యాక్షన్ పాత్రలు రాస్తే సజీవంగా అన్పిస్తాయి. ఈ కథాక్రమంలో కామెడీ వుండాలనీ, మసాలా వుండాలని ప్రయత్నిస్తే పాత్ర స్వభావం మారిపోతుంది. ఇందుకు ఇటీవలి ఉదాహరణ సప్తగిరి ఎల్ ఎల్ బి. దీని మాతృకైన హిందీ జాలీ ఎల్ ఎల్ బి పాత్ర విషయం పట్ల నిబద్ధతతో వుండే ఇంటెన్సివ్ పాత్ర. తెలుగులో దీన్ని పిచ్చ కామెడీ మాస్ యాక్షన్ హీరోగా, డాన్సర్ గా, లవర్ గా తయారు చేశారు. విషయం వదిలేసి విన్యాసాలు చేశారు.
ఇంటెన్సివ్ పాత్రలు యాక్టివ్ పాత్రలు. అంటే కథని అవే సృష్టించి అవే నడుపుతాయి. వాటిని కథకుడు సృష్టించి నడిపే కథల్లో పావులుగా వాడుకోరాదు. అప్పుడవి పాసివ్ గా మారిపోయి తేలిపోతాయి. పాసివ్ గా వుండడం ఇంటెన్సివ్ స్వభావానికి విరుద్ధం.
―సికిందర్
(వచ్చేవారం మరికొన్ని)