రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

789 : సందేహాలు - సమాధానాలు




Q : ఒక టెక్నికల్ క్వశ్చన్. ఎండ్ సస్పెన్స్ తో కథలు ఫ్లాపే అవుతాయంటారా? సరైన విధానంలో చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం లేదంటారా? జానర్ వచ్చేసి క్రైం  డ్రామా అయినప్పుడు అందులో వుండే సస్పెన్స్ ఎలిమెంట్ ని  ఏం చేయాలి?
డి ఎస్ ఎం, దర్శకుడు 

      
 A : ఎండ్ సస్పెన్స్ గురించి ఎన్నో సార్లు ఈ బ్లాగులోనే చెప్పుకుంటూ వచ్చాం. ఎండ్ సస్పెన్స్  కథతో వున్న సినిమాలు తప్పకుండా ఫ్లాపే అవుతూ వచ్చాయి. ఇటీవలే  బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ తో బాటు, ‘సాక్ష్యం’ ఫ్లాపయ్యాయి. రాజ్ తరుణ్ ‘లవర్’ ఫ్లాప్ అయింది.  నాగచైతన్య ‘సవ్య సాచి’ తో బాటు, గతంలో ‘సాహసమే ఊపిరిగా’ ఫ్లాపయింది.  విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ ఫ్లాపయింది. వెనక్కి పోతూంటే ఇలా పెద్ద లిస్టుంది. ఇవన్నీ ఎండ్ సస్పెన్స్ అంటే ఏమిటో తెలిసే చేయడం లేదు. కేవలం సస్పెన్స్ అనుకుని చేస్తున్నారు. సస్పెన్స్ లో ఎండ్ సస్పెన్స్, సీన్ టు సీన్ సస్పెన్స్, అనే రెండు రకాలుంటాయని తెలిస్తే ఇలా చేయరు. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకునే అవకాశం లేదు. పదుల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్న తమకి  ఎలా తీయాలో తెలీదా అన్న ధోరణిలో నడిచిపోతూంటుంది. కానీ స్క్రీన్  రైటింగ్ అనేది చాలా మిస్టరీ. ఎక్కడేముందో, ఎందుకుందో, ఇంకెన్నున్నాయో నిత్యం వెతుక్కుంటూ వుంటే తప్ప ఓ పట్టాన అర్ధంగాని మిస్టరీ. ఎన్ని కోట్లతో చైర్లో కూర్చున్నామన్నది కాదు ప్రశ్న, ఈ మిస్టరీ ఆటలో టేబుల్ మీద మ్యాటరెంతున్నది పాయింటు. 

         
సరైన విధానంలో చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం లేదా అంటే వుంది. జానర్ క్రైం డ్రామా అయితే ఎలాటి క్రైం డ్రామా? మిస్టరీయా, లేక సస్పెన్స్ థ్రిల్లరా? మిస్టరీ అయితే,       ఉదాహరణకి ఒక హత్య జరిగిందనుకుందాం. అప్పుడా హత్య కథా ప్రారంభంలోనే జరిగిపోతుంది. ఆ తర్వాత కథంతా హంతకుణ్ణి కనుగొనే దర్యాప్తుతో సాగుతుంది. రకరకాల అనుమానితుల్ని చూపిస్తూంటారు. చివర్లో వాళ్ళలో ఒకర్ని ఆధారాలతో హంతకుడిగా పట్టుకుంటారు.  చివరివరకూ హంతకుడెవరనేది సీక్రెట్ గా వుంటుంది కాబట్టి ఇది మిస్టరీ. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒక్క ఆట వరకే – అంటే మార్నింగ్ షో వరకే వుంటుంది. హంతకుడెవరో  టాక్ బయటి కెళ్ళి పోయాక మ్యాట్నీ షో నుంచీ ప్రేక్షకులు ఇక వూపిరి బిగబట్టి చూసేందుకు  సస్పెన్స్ ఏమీ వుండదు. ఇదే ఎండ్ సస్పెన్స్. చిట్ట చివర్లో రివీలయ్యే మిస్టరీతో వుండేదే ఎండ్ సస్పెన్స్ కథనం. మార్నింగ్ షోలో రట్టయ్యాక మిగతా షోలు రక్తి కట్టే మాటే లేదు.  

click here

          ఇదే
 సస్పెన్స్ థ్రిల్లరైతే కథని బట్టి రెండుంటాయి :  హత్యకి కుట్ర జరుగుతోందని హీరోకో పోలీసులకో సమాచారం అందుతుంది. కుట్రదారుల్ని ప్రేక్షకులకి అప్పుడే చూపించేస్తారు. హీరోకి లేదా పోలీసులకి కథాక్రమంలో తెలుస్తుంది. హత్యని ఆపేందుకు  ఇటు పక్షం, హత్య చేసేందుకు అటు పక్షం ఆడే ఓపెన్ గేమ్ గా కథనం వుంటుంది. అందుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్. ఇది ప్రేక్షకులకి అంతా తెలిసి, ఎవరు గెలుస్తారనే సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, సీను సీను కీ ఉత్కంఠ రేపుతుంది కాబట్టి సీన్ టు సీన్ సస్పన్స్ కథనం. దీనికి  మార్నింగ్ షోయే కాకుండా ఎన్ని షోలకైనా షెల్ఫ్ లైఫ్ వుంటుంది. ఛానెల్స్ లో కూడా రిపీట్ రన్ వుంటుంది.

          రెండో పద్దతి : హత్య జరిగింది. హంతకుడెవరో ప్రేక్షకులకి చూపించేసి హీరోకి చూపించలేదు. హీరో హంతకుడి అన్వేషణలో పడతాడు. సగం కథ దగ్గర అతడికి తెలిసిపోతుంది. మిగతా సగం కథ వాణ్ని పట్టుకోవడానికి యాక్షన్ మొదలెడతాడు. ఇది కూడా ఎండ్ సస్పెన్స్ బారిన పడని సీన్ టు సీన్ సస్పన్స్ కథనమే.

          ఇవన్నీ అలా వుంచి, మిస్టరీ కథ మిస్టరీలా అన్పించకుండా, ఎండ్ సస్పెన్స్ ఎండ్ కథనం ఎండ్ సస్పెన్స్ కథనంలా దొరికిపోకుండా – ప్రేక్షకుల్నీ ఏమార్చే గారడీ ఒకటుంది.         ఉదాహరణకి ఒక ఇంటరెస్టింగ్ కథ నడుస్తూంటుంది. అది రోమాన్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, కామెడీ కావొచ్చు - ప్లాట్ పాయింట్స్ అన్నీ ఈ కథతోనే వుంటాయి. వెళ్లి వెళ్లి ఈ కథ చివర్లో కొత్త ద్వారాలు తెరుస్తుంది. అక్కడ ఇంకో దృశ్యం కన్పిస్తుంది. ఆ దృశ్యంలో అసలు కథ వుంటుంది. అది అప్పుడు రివీలవుతుంది. అక్కడున్న తెలిసిన క్యారెక్టరే  అప్పుడు దొరికిపోతుంది. అప్పటికి గానీ ప్రేక్షకులు వూహించలేరు – మనమింత సేపూ చూస్తూ వచ్చిన రోమాన్స్, ఫ్యామిలీ, కామెడీ ఏదైతే అది - అసలు కథ కాదా... అసలు కథ వేరే ఇదా....ఈ అసలు కథని రివీల్ చేయడానికే  ప్లానింగ్ తో క్యారెక్టర్లు నడిపిన డ్రామానా... ఈ అసలు కథలో దొరికిపోయిన ఈ క్యారెక్టర్ పూర్వం ఇంత పనిచేశాడా... ఇలా థ్రిల్లవుతారు. 

          ఈ టెక్నిక్ పేరేమిటో గానీ, జేమ్స్ బానెట్ మంచి కథల్లో హిడెన్ సీక్రెట్ వుంటుందని అంటాడు. అలా ఈ టెక్నిక్ కి ‘హిడెన్ సీక్రెట్’ టెక్నిక్ అని పేరు పెట్టు కోవచ్చు.
Truth, however bitter, can be accepted, and woven into a design for living―అని  క్రైం రచయిత్రి ఆగథా క్రిస్టీ అంటుంది. నిజాన్ని దాటిపెట్టి అనిజ కథని నడపడమే ఈ టెక్నిక్. అనిజ కథని ఎంజాయ్ చేసే బిజీలో పడిపోయిన ప్రేక్షకులు నిజ కథ తెలుసుకుని – ఇది మిస్టరీ జానర్, ఎండ్ సస్పెన్స్ కథ అని చప్పరించేయడానికి వీలే కాదు. ఎండ్ సస్పెన్స్ కి ఈ విరుగుడుగా 1958 లో బ్రిటన్ నుంచి To Chase a Crooked Shadow’ వచ్చింది. దీనాధారంగా 1981 లో హిందీలో  ‘ధువాఁ’ వచ్చింది. బెంగాలీ, తమిళ, మలయాళంలలో కూడా వచ్చాయి. ఎండ్ సస్పెన్స్ సినిమాతో మీకెలాగూ అనుభవమైంది కాబట్టి, ఈ ఐదు సినిమాలతో పోల్చుకుంటే తేడా తెలిసిపోతుంది. పక్కనున్న ఇమేజి దగ్గర  క్లిక్ చేసి  ఆర్టికల్ ని కూడా చూడొచ్చు. 

          ఇకపోతే ఎండ్ సస్పెన్స్ కి ఎప్పుడో 90  ఏళ్ల క్రితం అగథా క్రిస్టీ ఇచ్చిన పాత్ బ్రేకింగ్ ట్విస్టు కోసం ఈ  లింకు ని క్లిక్ చేయండి. మీరు క్రైం జానర్ ని ఇష్టపడతారు కాబట్టి వీలయినంత అప్డేట్ అవుతూ వుంటే సక్సెస్ ఎటూ పోదు.

          Q : ఇంటెన్స్ యాక్షన్ మూవీకీ, సీరియస్ యాక్షన్ మూవీకీ తేడా ఏమిటి? ఇంటెన్స్ క్యారక్టర్ అంటే ఎలా వుండాలో డిఫైన్ చేయగలరా? వీలయితే ఎగ్జాంపుల్స్ తో సమాధానం బ్లాగులో ఇచ్చినా ఫర్వాలేదు. కొంచెం డిటైల్డ్ గా చెప్పండి. 
అశోక్ పి, సహకార దర్శకుడు 

            A : ఇంటెన్స్ కీ, సీరియస్ కీ మాటల్లోనే తేడా తెలిసిపోతోంది. ఇంటెన్స్ అంటే తీవ్రమైనది, సీరియస్ అంటే గంభీరమైనది. మళ్ళీ ఇలా తెలుగులో చెప్పుకుంటే తప్ప తేడా అర్ధం గాదు, స్పష్టత వుండదు. మొదటిది యాక్షన్ తో తీవ్రంగా వుంటుంది, రెండోది విషయంతో గంభీరంగా వుంటుంది. మొదటిది ఖైదీఅనుకుంటే, రెండోది శివఅనుకోవచ్చు. మొదటిది ఉరుకులుబెడుతుంది, రెండోది ఆలోచింపజేస్తుంది. ఆలోచింప జేస్తూ సాగే సీరియస్  (గంభీర) యాక్షన్ మూవీస్ గా ఇంకా నాయకుడు, రోజా, అంకుశం, భారత్ బంద్, సర్ఫరోష్, సత్య, గాడ్ ఫాదర్, జాస్, మ్యాడ్ మాక్స్ -2 లాంటివి చెప్పుకోవచ్చు. 

         
ఉరుకులుబెడుతూ థ్రిల్ చేసే ఇంటెన్స్ (తీవ్ర స్వభావంగల) యాక్షన్ మూవీస్ గా  క్రిమినల్, ఒరు ఖైదీయన్ డైరీ, కంపెనీ, రైడర్స్ ఆఫ్ ది  లాస్ట్ ఆర్క్, టర్మినేటర్, డై హార్డ్, జేమ్స్ బాండ్ సినిమాలు  మొదలైనవి చెప్పుకోవచ్చు. 

         
ఐతే రెండు తరహాల సినిమాలు తెలుగులో రావడం ఎప్పుడో మానేశాయి. స్టార్లే  కామెడీ చేయడమనే ఒక ట్రెండ్ గత దశాబ్దంన్నర కాలంగా వేళ్ళూనుకోవడం వల్ల సీరియస్ యాక్షన్, ఇంటెన్స్ యాక్షన్ లనేవి ఇకలేవు. యాక్షన్ ఎంటర్ టైనర్లు, లేకపోతే యాక్షన్ కామెడీలు అనే ఫటాఫట్ సినిమాలే చూడ్డానికి దొరుకుతున్నాయి. 

      ఆ మధ్య వచ్చిన  గరుడవేగ,  వివేకం లాంటివి  సీరియస్ యాక్షన్ లు గానే కన్పిస్తాయి. కానీ అందుకు తగ్గ విషయ గాంభీర్యం లేక గందరగోళంగా అన్పిస్తాయి. సింగం త్రీ లాంటి ఇంటెన్స్ యాక్షన్ తీసినా,  దాన్ని స్టార్ పాత్రకి  కి మించిన టెక్నికల్ హంగులతో నరాల మీద సమ్మెట పోట్లుగా తయారు చేస్తున్నారు. లేదా స్పైడర్ లాంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తీసినా, హీరోకి ఇంటెన్సిటీ వుండక, విలన్ కుండేలా చేస్తున్నారు. 

         
పూర్వపు సృజనాత్మకతకీ, ఇప్పటికీ ఇదీ తేడా. పూర్వపు సృజనాత్మకతకి జానర్ మర్యాదలు తెలుసు. ఇప్పడు జానర్లే కొన్ని తెలుసు, ఆ కొన్నిటి మర్యాదలు తెలీవు. అంతా కిచిడీ కుకింగే. అందువల్ల పూర్వంలాగా సీరియస్, ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ తీయలేకపోతున్నారు. రెండోది, ప్రయత్నం చేసే వాళ్ళు కూడా తక్కువ ఎంటర్ టైనర్ల హోరులో. 

         
ఇక ఇంటెన్స్ క్యారెక్టర్ గురించి. ఒక మానసికావస్థతో వుండే పాత్ర రాయాలన్నా ముందు సైకాలజీ తెలుసుకోవాలి. లేకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్డర్ (ఓసిడి)పాత్రంటూ ప్రచారం చేసి, ఒట్టి పరిసరాల పట్ల ఎలర్జీగల పాత్రని చూపించినట్టు వుంటుంది (మహానుభావుడు). ఇంటెన్స్ (తీవ్రస్వభావంగల) క్యారెక్టర్ ని సైకాలజీ ఇలా వివరిస్తుంది : మనసులో ఏదీ దాచుకోకుండా పైకి చెప్పేసే, ఏదైనా పొందాలనుకుంటే దాని గురించి తీవ్రంగా తపించే, అవసరం లేదనుకుంటే అస్సలు పట్టించుకోకుండా  వుండే, వాదోపవాదాల్లో గెల్చి తీరాలన్న పట్టుదలతో  వుండే, మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడే,  ఇతరులతో సంబంధాల్లో నిజాయితీగా వుండే, గొప్పలు చెప్పుకునే వాళ్ళని దూరంగా పెట్టే, ఇంటలెక్చువల్ గా వుండాలని ప్రయత్నించే, వివిధ రంగాల గురించి అవగాహనతో మాట్లాడే, కళ్ళలోకి సూటిగా చూస్తూ సంభాషించే, ఒకరితో ఎక్కువ సేపు గడిపి అదే మరోరోజు చప్పున వదిలించుకుని వెళ్ళిపోయే, ప్రేమల విషయానికొస్తే పాత క్లాసిక్స్ లా వుండాలని ఆశపడే, పుస్తకాల్లో సినిమాల్లో ఏదైనా ఇష్టపడిన పాత్ర ట్రాజడీగా ముగిస్తే, రోజులతరబడి దాని గురించే  బాధపడే లక్షణాలుంటే, అది ఇంటెన్సివ్ క్యారెక్టర్ అవుతుందనొచ్చు. 

         
ఇలా పాజిటివ్ గా కన్పిస్తున్న ఇంటెన్సివ్ స్వభావాన్ని హీరోకీ విలన్ కీ ఎవరి కైనా వాడుకోవచ్చు. కాకపోతే విలన్ నెగెటివ్ గోల్ కోసం చేస్తాడు. పైన చెప్పుకున్న స్వాభావిక లక్షణాలు జత చేసి, సన్నివేశాలు సృష్టించి  యాక్షన్ పాత్రలు రాస్తే సజీవంగా అన్పిస్తాయి. కథాక్రమంలో కామెడీ వుండాలనీ, మసాలా వుండాలని ప్రయత్నిస్తే పాత్ర స్వభావం మారిపోతుంది. ఇందుకు ఇటీవలి ఉదాహరణ సప్తగిరి ఎల్ ఎల్ బి. దీని మాతృకైన హిందీ జాలీ ఎల్ ఎల్ బి పాత్ర విషయం పట్ల నిబద్ధతతో వుండే ఇంటెన్సివ్ పాత్ర. తెలుగులో దీన్ని పిచ్చ కామెడీ మాస్ యాక్షన్ హీరోగా, డాన్సర్ గా, లవర్ గా తయారు చేశారు. విషయం వదిలేసి విన్యాసాలు చేశారు.

         
ఇంటెన్సివ్ పాత్రలు యాక్టివ్ పాత్రలు. అంటే కథని అవే సృష్టించి అవే నడుపుతాయి. వాటిని కథకుడు సృష్టించి నడిపే కథల్లో  పావులుగా వాడుకోరాదు. అప్పుడవి పాసివ్ గా మారిపోయి తేలిపోతాయి. పాసివ్ గా వుండడం ఇంటెన్సివ్ స్వభావానికి విరుద్ధం. 

సికిందర్
(వచ్చేవారం మరికొన్ని)


16, ఫిబ్రవరి 2019, శనివారం

788 : రివ్యూ



దర్శకత్వం : జోయా అఖ్తర్
తారాగణం : రణవీర్ సింగ్, ఆలియాభట్, కల్కి కొష్లిన్, సిద్ధాంత్ చతుర్వేది, విజయ్ రాజ్, విజయ్ వర్మ, అమృతా సుభాష్ తదితరులు
రచన : జాయా అఖ్తర్ రీమా కాగ్టీ, మాటలు : విజయ్ మౌర్య, సంగీతం : 21 మంది, ఛాయాగ్రహణం : జే ఓజా
బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్స్, టైగర్ బేబీ ప్రొడక్షన్స్
నిర్మాతలు : రీతేష్ శిధ్వానీ, జాయా అఖ్తర్, ఫర్హాన్ అఖ్తర్
విడుదల : ఫిబ్రవరి 14, 2019

***
        బిగ్ కమర్షియల్స్ స్టార్ రణవీర్ సింగ్ రూటు మార్చి రియలిస్టిక్ గల్లీబోయ్ గా స్లమ్స్ లో కొచ్చేశాడు. ర్యాప్ కల్చర్ మ్యూజిక్ ని తీసుకుని బయోగ్రఫీ కాని బయోగ్రఫీ చేశాడు. దర్శకురాలు జోయా అఖ్తర్ ఒక బిగ్ స్టార్ ని గల్లీ స్థాయి స్లమ్ డాగ్ గా తయారుచేసి, ఈ మ్యూజికల్ తో ఒక విభిన్న కమర్షియల్ ప్రయోగం చేసింది.  జాజ్ మ్యూజిక్ తో ఆస్కార్ విజేత ‘చికాగో’ లాంటి సంగీత రూపకం భారతదేశంలో సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకి జవాబు వెతుక్కుంటున్న పరిస్థితుల్లో జవాబిచ్చేసింది. ఒక మ్యూజికల్ రియలిస్టిక్ సినిమా అవుతుందా? ఎందుకవుతుంది?...ఇది తెలుసుకుందాం...

కథ
        మురాద్ (రణవీర్ సింగ్) డిగ్రీ చదువుతూ ముంబాయి ధారవీ స్లమ్స్ లో వుంటాడు. డ్రైవరైన కోపిష్టి తండ్రి షేక్ (విజయ్ రాజ్), సవతిని భరిస్తున్న తల్లి రజియా (అమృతా సుభాష్) అతడితో వుంటారు. అక్కడి దుర్భర పేద వాతావరణానికి నలిగిపోతూంటాడు. ఈ దౌర్బల్యాన్ని తనకొచ్చిన కవిత్వంలో వెల్లడించుకుంటూ, ర్యాప్ మ్యూజిక్ పట్ల ఆసక్తి పెంచుకుంటాడు. ఇది గమనించిన తండ్రి చదువుకుని ఉద్యోగం చేయకపోతే చంపేస్తానంటాడు. మరోవైపు మెడిసిన్ చదువుతున్న సఫీనా (ఆలియాభట్) తో ప్రేమలో వుంటాడు. నెమ్మదినెమ్మదిగా ధారవీలో ర్యాప్ బ్యాండ్ ప్రోగ్రాములకి అటెండ్ అవుతూ తను రాసిన పాటల్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. శ్రీకాంత్ అనే (సిద్ధాంత్ చతుర్వేది) ర్యాపర్, రాసి పాడాలని ఎంకరేజి చేస్తాడు. ఇక్కడ్నుంచి ర్యాప్ మ్యూజిక్ అనేది చాలా పెద్ద ప్రపంచమనీ, ఈ ప్రపంచంలో తన పాటలతో మెరవాలనీ స్ట్రగుల్ ప్రారంభిస్తాడు. ఈ స్ట్రగుల్ కి ఇంట్లో అనేక కష్టాలు తోడవుతాయి. ఇంటి కష్టాలె దుర్కొంటూ, ర్యాప్ మ్యూజిక్ తో సక్సెస్ ఫుల్ కళాకారుడెలా అయ్యాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       ర్యాప్ మ్యూజిక్ ని వెండి తెరకి పరిచయం చేసే కథ. ఇది ముంబాయిలోని స్లమ్స్ లో పెరిగిన ఇద్దరు మొదటి ఇండియన్ ర్యాపర్లు - డివైన్ అలియాస్ వివియన్ ఫెర్నాండెజ్, నాజీ అలియాస్ నావేద్ షేక్ ల నిజ కథకి ఆధారం. ఓ విధంగా చెప్పకుండా చెప్పిన బయోపిక్ అనొచ్చు. కాబట్టి దీనికి సినిమా కథా లక్షణాలు వుండవు. ఈ బయోపిక్ గాథగా వుంటుంది. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే, దీన్ని పూర్తిగా గల్లీ మాస్ వాతావరణంలో స్లమ్ డాగ్స్ విజయంగా చూపించడం. వాళ్ళలో కూడా కళలు వుంటాయనీ, వాటిని స్లమ్స్ లో భూస్థాపితం కానియ్యరనీ చెప్పడం. నిజానికి ర్యాప్ మ్యూజిక్ అధోజగత్ సహోదరుల నిరసన కళ. అందుకని దీన్ని రియలిస్టిక్ గానే చూపించాలి. 

        1970 లలో కూల్ హెర్క్ అనే నల్లజాతీయుడు జమైకాలో ర్యాప్ ని సృష్టించాడు. ర్యాప్ అంటే ర్యాపిడ్ పోయెట్రీ. సాహిత్యం, అందులోని పదాలూ అంత స్పీడుగా వుంటాయి. ఈ పాటలన్నీ నిరసన గీతాలు. పేద జీవితాల్లో  ఎదురయ్యే అన్ని సామాజికార్ధిక రాజకీయ సమస్యలపై పదునైన బాణాలుగా వుంటాయి. లవ్ సాంగ్స్ మాత్రం అస్సలుండవు.

        భారతీయ సినిమాల్లో పాటతో కథ చెప్పాలంటే ఓ మాంటేజ్ సాంగ్ వేసి ఓ సన్నివేశం వరకే చెప్పగల్గే వీలుంది. మొత్తం సినిమా కథంతా పాటలతో చెప్పే అవకాశం లేదు. 2002 లో ఆస్కార్ అవార్డు పొందిన ‘చికాగో’ లో పాటల ద్వారానే కథంతా జాజ్ మ్యూజిక్ తో చెప్పినట్టు, మనకిలాటి అవకాశం లేదు. ర్యాప్ సంగీతంతోనే నేటివిటీ కలుస్తుంది. గల్లీబోయ్ కథంతా ర్యాప్ మ్యూజికల్ గా చెప్పక పోయినా, అడుగడుగునా కథానుగతమైన పాత్ర మానసిక సంఘర్షణాత్మక యానాన్ని ర్యాప్ తో చూపించారు. ఈ పాటలు మొత్తం 18 వుంటాయి. ఇవన్నీ 21 మంది ర్యాపర్లు రాసి బాణీలు కట్టినవే. ర్యాప్ మ్యూజిక్ పీడితుల సృష్టి, వాళ్ళ సాహిత్యం. దీన్ని సంపన్న యూత్ ప్రోగ్రాంగా చూపించడం కుదరదు. చూపిస్తే వాళ్ళ నేపధ్యానికి నవ్వుల పాలవుతుంది.


ఎవరెలా చేశారు 
      రణవీర్ సింగ్ రెగ్యులర్ హీరోయిజాన్ని పక్కన బెట్టి వాస్తవ జీవిత చిత్రణ చేసే అధోజగత్ సహోదరుడి పాత్రలో ముడుచుకు పోయాడు. మాఫియా సినిమాల్లోనూ  స్లమ్ పాత్రలుంటాయి. ‘కంపెనీ’ లో వివేక్ ఒబెరాయ్, అంతరా మాలి వేసింది స్లమ్ పాత్రలే. అవి సినిమాటిక్ గా వుంటే, రణవీర్ పాత్ర పూర్తి రియలిస్టిక్ గా వుంటుంది. హీరోయిజం కనబడదు. హీరోయిజం వుంటే ఇంట్లో పరిస్థితులతో తలబడ్డానికే. పాత్రకి నాల్గు వైపులా సమస్యలుంటాయి : ఇంత పేదరికంతో ర్యాప్ లో ఎలా రాణించాలన్న ప్రశ్న, ప్రేయసితో ప్రేమ, ఇంట్లో తండ్రి నుంచి తీవ్ర వ్యతిరేకత, సవతి తల్లితో తల్లికున్న సమస్య. ఈ విషాదాన్నంతటినీ మౌనంగా మోస్తూ పాటల్లో చెండాడే రెబెల్ ర్యాపర్ గా రణవీర్ గుర్తుండిపోయే నటన ప్రదర్శిస్తాడు.

        హీరోయిన్ ఆలియాభట్ ఎటువంటి నాన్సెన్స్ నీ సహించని ముక్కుసూటి అమ్మా యి పాత్రలో కత్తిలా వుంటుంది. విసుర్లతో ఆమెకి రాసిన పాత్రోచిత సంభాషణలు చాలా చోట్ల నవ్విస్తాయి. నట జీవితమంతా పట్టుమని పది నిమిషాలుండని పాత్రలేస్తూ వచ్చిన విజయ్ రాజ్, తండ్రి పాత్రలో పూర్తి నిడివి పాత్ర దక్కించుకున్నాడు. వెనుకబాటు తనంతో కొందరు ముస్లిముల మూర్ఖత్వమెలా వుంటుందో అది నటించాడు. కొడుకు చేతిలో దాదాపూ దెబ్బలు తినేంత పరిస్థితి తెచ్చుకుని, రెండో పెళ్ళాంని వుంచుకుని, కొడుకు సహా మొదటి పెళ్ళాన్ని వెళ్ళ గొట్టేసే మూర్ఖుడి పాత్రలో రోత పుట్టించే సహజత్వంతో వుంటాడు. బహుభార్యాత్వం చూపించిన దర్శకురాలు, ఇక ఇతడి చేత ట్రిపుల్ తలాక్ కూడా అన్పిస్తుందేమో నని మనకి అన్పించక మానదు. ఆ పనిచేయలేదు. 

       ఇంకో ముఖ్యపాత్రలో ర్యాప్ ప్రపంచానికి రణవీర్ ని పరిచయంచేసే శ్రీకాంత్ అలియాస్ ఎంసీ షేర్ గా సిద్ధాంత్ చతుర్వేది ఒక ముద్రవేస్తాడు. కల్కి కొష్లిన్ అమెరికా నుంచి వచ్చే మ్యూజిక్ స్టూడెంట్ పాత్రలో కన్పిస్తుంది. 

        ర్యాప్ పాటలు ఉత్తేజాన్ని నింపుతూ వుంటాయి. ముఖ్యంగా వాటిలోని గల్లీ భాష ఒక కొత్త సంగీత ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. బడుగుల భాష, బడుగుల జీవితాలు, బడుగుల విజయం. పవర్ఫుల్ మ్యూజిక్ తో. మొత్తం రియలిస్టిక్ ఛాయగ్రహణమంతా స్లమ్స్ లొకేషన్స్ లోనే. హిందీ స్టార్ సినిమాలు రియలిస్టిక్ జానర్ ని స్వాగతించి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే దీని నిడివి రెండున్నర గంటలు ఎక్కువే.

చివరికేమిటి 
        జోయా అఖ్తర్ అన్నివిధాలా ధైర్యం చేసిన ప్రయోగమిది. మూస ఫార్ములాలు కాదని ప్రయోగాల కోసమే ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. హీరో సింగర్ గా ఎదిగే కథలతో చాలా ఫార్ములా సినిమాలు వచ్చేశాయి. గల్లీబోయ్ కథ కూడా కొత్తదేం కాదు.ఓ స్లమ్ డాగ్ సెలబ్రిటీ అయ్యే కాలక్షేప సినిమాల కోవలోనే ఇదీ నడుస్తుంది. మధ్యలో అలియాభట్ వుండగా, రణవీర్ కి కొష్లిన్ తో సంబంధం అనే ట్రయాంగులర్ ప్రేమ గొడవలు కూడా రొటీనే. ఇంట్లో తండ్రి వ్యతిరేకతా రొటీనే. స్నేహితులతో సరదా కారు దొంగతనాలు కూడా రొటీనే. రొటీన్ కానిదేమిటంటే, విలన్ లేకపోవడం. హీరో సింగర్ అవుతున్నాడంటే, అవకుండా పోటీ సింగర్ కుట్రలు, ఫైట్లు, మ్యూజిక్ ఇండస్ట్రీ ఇన్వాల్వ్ మెంటు, చివరికి కాంపిటేషన్, ఈ కాంపిటేషనలో హీరో నెగ్గడం...ఈ బాపతు ముక్క లేదు. ఇక్కడే ఇది రియలిస్టిక్ అయింది.

        ర్యాప్ ప్రయాణంలో హీరోకి పెద్దగా అడ్డంకులేమీ వుండవు. ఎందుకుండవంటే, ఇదంతా ఎలాటి బిజినెస్ ఆసక్తులు లేకుండా, స్లమ్ బాయ్స్ సంఘటితంగా, ఒకర్నొకరు సహకరించుకుంటూ, తమ అధోజగత్ ప్రపంచపు ప్రశస్తిని చాటే ప్రయత్నం చేస్తున్నారు గనుక. ఉమ్మడి ప్రయోజనం గనుక. 

        హీరోకి అడ్డంకులన్నీ సహకారం లేని ఇంటి దగ్గర్నుంచే. తండ్రి వెళ్ళ గొట్టేస్తే తల్లిని తీసుకుపోయి ఆమెని పోషించుకునే పరిస్థితుల నుంచే. బయట పని అడుక్కోవాల్సి వస్తుంది, ర్యాప్ ని పక్కన బెట్టి. ఈ పరిస్థితులతో విలనీని  అతనెదుర్కోవాలి. ఒకోసారి పేదరికం నుంచి కళే విముక్తి కల్గిస్తుంది. చుట్టూ ఎన్ని ఉదాహరణలు కన్పిస్తున్నా, ఇదింకా నమ్మని కుటుంబాల్లో నలిగిపోయే ఔత్సాహిక యువ కళాకారులెందరో. చాలావరకూ మొగ్గలోనే రాలిపోయే పువ్వులు. గల్లీబోయ్ నిగ్గదీసి విరబూశాడు...

సికిందర్
Watched at : Prasads, Hyd
7.15 pm, 15.2.19

telugurajyam.com